ఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. వీర వెంకట అలమేలు మంగతాయారు దీక్షితులు గారి భర్త మీకెక్కడైనా కనిపిస్తే వాళ్ళావిడకు తెలియజేయడం మాత్రం మరవకండేం?
——————–
కనబడుట లేదు

అందరికీ నమస్కారం. నాదొక విన్నపం. గత వారం రోజులనుండి మా శ్రీవారు కనబడటం లేదు. గొడవేం లేదండి. పత్రికలలో ప్రకటన చూసి వారి ‘బట్ట తలపై హృతిక్‌రోషన్‌లా జుట్టు మొలిపించుకోండి’ అని, ఇంకా అదేదో సినిమా చూసి ‘నాకూ ఆదివారం సెలవు కావాలి’ అని అన్నా అంతే. కోపంతో ధుమధుమలాడుతూ వెళ్ళిపోయారు. ఇలా అడగడం తప్పా చెప్పండి? రెండ్రోజుల్లో తిరిగొస్తారులే అని ఊరుకున్నా. ఎక్కడికెళ్ళారో ఆచూకీ తెలీటంలేదు.ఆయన పేరా? అమ్మో భర్త పేరు ఎలా చెబుతారండి? పాపం కాదూ? ఆయన ఫోటో సరియైనది లేకపోవడంవల్ల ఆయనకు సంబంధించిన వివరాలు ఇస్తున్నాను.
* ఇంట్లో ఎప్పుడూ సీరియస్‌గా ఉన్నా, బయటికెళ్తే మాత్రం అందరితో సరదాగా జోకులేస్తూ,నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు. ఎంటో మరి?
* ఎప్పుడైనా వంట బాగాలేకపోతే కోపంతో చిందులు తొక్కుతారు. బాగుంటే మాత్రం ‘బాగుంది’ అనరు. కామ్‌గా తినేసి వెళ్ళిపోతారు.
* నా పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటివి ఆయనకు గుర్తుండవు. పనిపాటాలేని నాలాంటివారే ‘సెంటిమెంటల్ ఫూల్స్’ గా ఉంటారని ఆయన అభిప్రాయం.
* స్నేహితులతో ఎన్ని గంటలైనా సరదాగా మాట్లాడగలరు, భార్యతో మాత్రం పదినిమిషాలు మాట్లాడటానికి టైం లేనంత బిజీ మనిషి.
* నీకీ చీర బావుంది, నువ్వంటే ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉన్నావు లాంటి అనవసరపు మాటలంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు.
* నేను చేసిన పలావ్ నచ్చదు కాని పక్కింటోళ్ళు ఇచ్చిన పచ్చగడ్డి పచ్చడి మాత్రం పరమాన్నంలా మిగల్చకుండా తినేస్తారు.
* కష్టపడి పది రూపాయలు సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ ఇంట్లో తిని కూర్చుని, ఇరుగు పొరుగు అమ్మలక్కలతో సొల్లు కబుర్లేసుకునేవారికి ఏం తెలుస్తుంది లాంటి డైలాగులు రోజుకొకసారైనా అంటుంటారు.
* మొత్తం మీద “తినడానికి”… “పడుకోవడానికి” మాత్రమే ఇల్లు ఉన్నది అన్నట్టు ప్రవర్తిస్తారు.
పై లక్షణాలున్న వ్యక్తి కనబడితే పట్టుకొచ్చి నాకు అప్పచెప్పండి. ప్లీజ్. మీకు రానుపోనూ ఆటో కాని బస్ చార్జీలు కాని ఇస్తాను.
ఇట్లు
వీర వెంకట అలమేలు మంగతాయారు దీక్షితులు
హైదరాబాదు
18 Responses to కనబడుట లేదు