యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు. పొద్దు పొడుపు ఆయన రచనతోటే జరగడం మాకు గర్వకారణం. అడిగినదే తడవుగా తెలుగు నుడికారంపై చిన్న పరిశోధనలాంటిది చేసి ఈ వ్యాసం రాసిచ్చిన రామనాథరెడ్డి గారికి కృతజ్ఞతలతో ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం. ఆస్వాదించండి.
——————–
‘తిక్కన పద్యమొక్కటి చక్కగ చదివిన చాలు
తెలుగుజాతి నుడికారము తెలిసికొన్న యటౌను’ -దాశరథిగారి ఒకానొక పద్యం నుండి.
‘శంరకంబాడి సుందరాచారి గారు రవీంద్రుని గీతాంజలిని అనువదించారు. మూలం లోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది.’ -తెలుగు వికీపీడియా.
‘పత్రికల్లో కృతకమైన పదాలు వాడుతున్నారు. టి.వి లలో దారుణమైన సంకర భాష వచ్చేసింది. తెలుగు నుడికారం తగ్గిపోయింది. ఆర్థం తెలియకుండానే పద ప్రయోగాలు చేసేస్తున్నారు.’ -డాక్టర్ కాచినేని రామారావుగారు, ఈమాట డాట్ కాం నుండి.
పల్లెటూళ్ళలోనూ సినిమాతనం, సినిమానుడికారం, సినిమాతెలుగు…’ -ఒక పెద్దాయన గమనించిన విషయం.
‘క్రింద వరసలొ కూర్చున్న మా శాస్త్రి అయ్యా అప్పారావు గారూ కాస్త ఆ గొవర్థనం కిందకి దించండి అని అరిచాదు. జనం ముసిముసి నవ్వులు చిందించారు ‘హై! హాయ్!!’ ల మధ్య ఆ అచ్చ తెలుగు నుడికారం విని ఎన్నాళ్ళయిందో!’ -ప్రొఫెసర్ అశోక్‌గారి బ్లాగు నుండి.
‘శబ్దం, అర్థం, అభివ్యక్తి, నుడికారం, వాక్య నిర్మాణం అనేవి అనువాదాల తులనాత్మక విశ్లేషణలో ప్రధాన రంగాలుగా తేలాయి. Half corved poetry in stone (The black pagoda)అనే దాన్ని ‘సగం చెక్కిన శిల్పమ్ము పగిది నాదు పద్యమియ్యది’ (1996-పలుకు చిలుక) అని అనువదించాను. poetry in stone అనే నుడికారం అనువాదకుడికి అందలేదని సమీక్షకుడు తెలియజేసాడు. ఇది సమీక్షకుడి బాధ్యత. కృతజ్ఞతలతో స్వీకరించాను.’ -ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు.
ఇలా ‘నుడికారము’ అనే మాట మనకు అప్పుడప్పుడూ వినబడుతూ ఉంటుంది. ‘తెలుగు నుడికారపు సొగసు’ను గురించి రాయమని పొద్దు సంపాదకులు నన్ను కోరినపుడు, ‘నాకంత సీనుందా’ అనుకొన్నాను తెలుగు సినీనుడికారంలో. నుడికారంమంటే ఏమిటో నాకు బొత్తిగా తెలియదా అంటే మనసొప్పుకోలేదు. కొంత తెలుసు. తెలియకపోవడమేమిటి, ఆంధ్రదేశపు పల్లెటూళ్లలో పెరిగినోళ్లందరికీ ఆ నుడికారం సహజంగా అబ్బుతుంది. ఇలా అనుకొన్నాక ‘నాకు తెలిసిన నుడికారం ఏమిటి? మావూళ్లో ఎవ్వరూ నుడికారాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడుకోఁగా వినలేదే!’ అని ప్రశ్నించుకొని బ్రౌణ్యములో వెతికితే ‘వాచకము, మాట, రచనము, మాటచమత్కారము’ అనే అర్థాలు కనిపించాయి. నుడువు అంటే చెప్పు(ము) అని అర్థం. నుడి అంటే మాట. సుమతీ శతక కారుడు బద్దెన ఏమన్నాడో చూడండి –
శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులుఁ బుట్ట నుడివెద సుమతీ!
సకల జనులు ‘ఔరా’ అనేలా నోరూరగా చవులు (రుచులు) పుట్టేలా చెబుతానన్నాడు. అన్నంతపనీ చేసి చూపాడు. ఇక్కడ ఔరా అనడం నుడికారపు సొగసు. దీనర్థం వివరించ నక్కరలేకుండానే మనందరికీ తెలుసు. ఈ శతకం నిండా మాటల చమత్కారాలెన్నో చూడవచ్చు మనం. మచ్చుకు ఈ పద్యం చూడండి:
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ
నుడికారమనేది పద్యాలకు, కావ్యాలకూ, గ్రంథాలకూ, కవులకూ, పండితులకే పరిమితంకాదు. నుడికారపు ముడిసరుకు సామాన్యమానవుడు మాట్లాడే భాషే. పైన నేనుదహరించినది ఛందస్సూ యతి ప్రాసలతో అందంగా అమరిన పద్యమే కావచ్చు, కానీ అందులో వాడబడిన మాటలు అది రాయబడిన కాలంనాటి జన సామాన్యం రోజూ మాట్లాడేవే. ‘ఈ నా కొడుక్కు మిడిమేలం జాస్తి’, ‘యాల కొడకా అంత మిడిమేలం నీకు’ లాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా తొందరపాటుతో అనాలోచితంగా ప్రవర్తించినా, ఎవరికైనా త్వరగా కోపం వచ్చినా, ఎవరైనా క్షణికావేశాన్ని దాచలేక వ్యక్తపరచి తప్పుచేశాడనిపించుకొన్నా వాణ్ణి ఈ పద్ధతి మార్చుకోమనే పెద్దల బుజ్జగింపు మాటలు ఇవి. పద్యంలో ‘మిడిమేలం’ అనేది ఆ దొరయొక్క విశేషణం. అట్లాంటి వాడి కొలువున పనిచేసి అగచాట్లుపడే బదులు ‘మడిదున్నుక బ్రతుకవచ్చు’ అన్నాడు – అదీ ఎలాగంటే – మాంచి వడిగల ఎద్దులను కాడి గట్టి. వడి అంటే వేగము, హుషారు. కాడి అంటే ఎద్దులను జంటగా కూర్చి నడపడానికి వాటి మెడమీద వేసే కొయ్య. మామూలుగా కాడి అంటేనే జత ఎద్దులు అనే అర్ధం వాడకలో ఉంది. కాడిగట్టు అంటే ఎద్దులను జతగా కూర్చి సిద్దం చెయ్యమని అర్థం. వడిగల ఎద్దులతో మడిదున్నుతుంటే ‘ఇంకొంతసేపు పనిచేద్దాం అనిపిస్తుంది అంటారు. అది అనుభవైకవేద్యం.
మడి దున్నుకు బ్రతకవచ్చని ఎందుకన్నాడు? కువైట్‌కో సౌదీకో పొమ్మనొచ్చు. లేదూ – డిగ్రీ పాసయి ఏదైనా కాల్‌సెంటర్లో చేరమని చెప్పొచ్చు. అలా ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అలా చెబితే తెలుగు నుడికారం దెబ్బతింటుందని కాదు, బద్దెనకాలం నాటికి సేద్యమే గౌరవప్రదమైన మరియు ప్రధానమైన వృత్తి కనుక, వడిగలిగిన కాడెద్దులంటే చెప్పుకోదగిన ఆస్తి కనుక. దీన్నిబట్టి మనకేమర్థమౌతుంది? నుడికారం జన జీవనంలో నుండి, వారి మాటల్లోనుండి వస్తుంది. సమాజపు జీవనవిధానం, అక్కడి వాతావరణ పరిస్థితులు, జనబాహుళ్యంచేత ఆమోదింపబడిన పద్ధతులు ఆచారాలు, ఆటపాటలు ఇవీ వారి మాటల్లో కనబడతాయి వినబడతాయి. ఒక భాషయొక్క నుడికారమనేది ఆ జాతికి సంబంధించినది. అందుకే ‘తెలుగుజాతి’ నుడికారమన్నాడు దాశరథి (వ్యాసం ప్రారంభం చూడండి). వారి మాటలలో దొర్లే చమత్కారాన్నే మనం ‘నుడికారం’ అంటాం. నుడికారమనేది ముందు ప్రజల నాలుకల నుండి ఉద్భవించి, ఆ తరువాతనే కావ్యాలలోకి చేరింది. కాబట్టి నుడికారమనేది పండితులకంటే ముందు పామరుడి సొత్తు. మాటల్లోని చమత్కారం అర్థంకావాలంటే ఆ మాటలు పుట్టిన సమాజంలో పుట్టి పెరగాల్సి వుంటుంది. ఆ సంస్కృతిని ఒంటబట్టించుకోవలసి వుంటుంది.
ఇప్పుడు సరదాగా తెనాలి రామకృష్ణ సినిమాలోని ఒక సన్నివేశాన్ని చూద్దాం.
శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులం గల్గి దు
ర్భర షండత్వ బిలప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్వచ్చు నీ సాటిగా
నరసింహక్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!
భువనవిజయంలో శ్రీకృష్ణదేవరాయలవారిని శౌర్యమునుగూర్చి అల్లసాని పెద్దన చెప్పిన చెప్పిన పద్యం ఇది. పద్యం చెప్పడం పూర్తవగానే సభికులంతా భేష్ భేష్ అంటూండగా, తెనాలి రామకృష్ణుడు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటాడు. వికటకవిని కారణం అడుగుతాడు రాజు. ‘తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి రాదంటూనే, రాజకంఠీరవా! అని తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వొచ్చింది’ అంటాడు. రాజకంఠీరవమంటే సింహరాజమని అర్ధం. ఆ మాటకు పెద్దన నొచ్చుకోక నవ్వుతూ ‘మంచి పట్టేబట్టావ్ మనవఁడా! ఏదీ నువ్వొక పద్యం చెప్పు’ అంటారు. ఆ మనవడు రాయలవారి శౌర్యాన్ని వర్ణిస్తూ చెప్పిన అద్భుతమైన మత్తేభం –
కలనన్ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మం
డల భేదంబొనరించి ఏగునెడ, తన్మధ్యంబునన్, హార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుం గాంచి, లో
గలగం బారుచునేగె, నీవ యను శంకన్ కృష్ణరాయాధిపా!
ఇక్కడ మనం గమనించవలసిన మాట – ‘మంచి పట్టేబట్టావ్ మనవఁడా’. బహుశా ఆనాటి మల్లయుద్దాల నుండి వచ్చి ఉండొచ్చు ఈ ‘పట్టుబట్టడ’మనే నుడి. Good catch అనేది ఇదే సందర్భంలో ఆంగ్లేయులకు నుడి. బహుశా మల్లయుద్ధాలకన్నా బంతితో ఆడే ఆటల నుండి వారికీ నుడికారం వచ్చి ఉండొచ్చు. ఇందుకు నాకే ఆధారమూలేదు. ఇంగ్లీషువారి నుడికారం ప్రధానంగా వారికి నౌకాయానంపట్ల ఆటలపట్ల ఉన్న మక్కువతో ముడిపడిందిట. ఇది పరిశోధనా వ్వాసం కాదు. ఈ విషయం మీద నాకు కలిగిన అవగాహనకు సంక్షిప్త రూపం ఈ వ్యాసం. తప్పులుంటే మన్నించి, తెలిసిన పెద్దలెవరైనా నాకు మొట్టికాయలు వేసి నన్ను సరిదిద్దవలసిందిగా సవినయంగా అర్థిస్తున్నాను.
తెలుగు నుడికారం మన వ్యావసాయిక జీవితాలనుండి పుట్టింది.’వీడు మాట్లాడితే రాళ్ల చేలో గుంటక తోలినట్టుంటుంది’ అంటాం – విరామం లేకుండా లొడలొడా మాట్లాడేవాడిని చూసి విసుగొచ్చినపుడు. ‘గుడ్డెద్దు చేలోబడినట్టు ఊరికే గడగడా బట్టీబడితే సదువులు అబ్బవు నాయినా’ – ఒక ప్రణాళికగానీ ఆలోచనగానీ లేకుండా విపరీతంగా కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులను చూసి సానుభూతితో అనే మాట ఇది. ‘ఏమి నాయినా బొత్తిగా నల్లకప్పేసినావు’ అనేవారు నేను ముక్కావారిపల్లె హాస్టలు నుండి ఇంటికొచ్చినప్పుడు. అంటే చిక్కిపోయి అనారోగ్యంగా ఉన్నానని అర్థం. ఆవులు, ఎద్దులు ఆరోగ్యంగా ఉంటే నిగారింపుతో ఉంటాయి. వాటికేమాత్రం నలతగా ఉన్నా చర్మంలో ఆ నిగారింపు పోతుంది. వెంటనే తగిన వైద్యం చేయాలన్నమాట. ఇదీ నల్లకప్పు వేయటం అనే మాటకు మూలం.’ఈ సారి రోంత ఈకేసినాడబ్బోవ్ మీవోడు’ అన్నారు నేను కొంత కండబట్టేసరికి. ఈక వెయ్యడమనే ఈ మాటకు మూలం మన పల్లెల్లో కోడిపుంజుల మీద ఉండే మోజు. బొమ్మెలుగా ఉన్న కోళ్లు బాగా తిని నిగారించే కొత్త ఈకలను సంతరించుకొని పందేనికి సిద్ధమౌతాయన్నమాట.అదీ ఈకెయ్యడమంటే. కోడిపుంజుల పోట్లాట చూసే వుంటారు. సమ ఉజ్జీలైతే ఒకదాన్నొకటి తన్నుకొని తన్నుకొని అలసిపోతాయి. ఒకో సారి చచ్చిపోతాయి కూడా. ఒకోసారి కొంతసేపు పోరాడి రెండిటిలో ఒకటి తోక ఈకలను పైకెత్తేసి అపజయాన్నంగీకరిస్తుంది. ఆ అంగీకరించడంలోకూడా కొంత డాంబికముంటుంది. ఆటల్లో ఓటమినొప్పుకోక మొండిగా ఎదురుతిరిగే వాని చేతగానితనాన్ని – ‘వాడు కొప్పు ఎత్తేసినాడు, వదిలేయండ్రా’ అని ఎగతాళి చేస్తారు పల్లెల్లో. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో!
మన రాష్ట్రప్రభుత్వానికి, ‘మార్గదర్శి’కి మధ్య నడుస్తున్న వ్యవహారం మనకందరికీ తెలిసిందే. ఆమధ్య ఒక ఆదివారం ఆంధ్రజ్యోతి ‘సరదాగా…’ శీర్షికలో రాజగోపాల్‌గారి వ్యంగ్య రచననుండి ఒక భాగం ఇక్కడ చదవండి – ‘పిచ్చివాడా! వరల్డ్ బ్యాంకైనా దివాలా తీస్తుందేమో కానీ మార్గదర్శి దివాలా దియ్యదు గాక తియ్యదు. మా చైర్మన్ రామోజీరావు గారంటే ఏమనుకున్నావు? నిప్పులాంటి నిజాయతీ ఆయనది. నాకు ఆయన మీద బోలెడంత నమ్మకం ఉంది. పైగా, ప్రతిపైసాకి నాదీ పూచీకత్తు అని చెప్పారు … వినలేదా?’
‘పైస లెవడిక్కావాలిబే … రూపాయిల సంగతి చెప్పు’ అన్నాడు యాదగిరి.
వెంకట్రావుకి ఒళ్ళు మండింది. ‘ఛప్ .. నోర్ముయ్! నీ కసలు తెలుగు నుడికారం తెలీదు. దానర్థం అదే … అయినా, అంత అవసరమైతే తన ఆస్తులన్నీ అమ్మేసైనా ఖాతాదారుల డిపాజిట్లు చెల్లిస్తానని మా చైర్మన్ గారు హామీ ఇచ్చారు … నేను నమ్ముతున్నాను. కందకి లేని దురద కత్తిపీట కెందుకన్నట్టు ఏ డిపాజిట్లూ లేని వాడివి … మధ్యలో నీకెందుకూ బెంగ?’
యాదగిరికి నుడికారం తెలియకపోవడానికి కారణం అతను పైసలకాలం నాటి మనిషికాకపోవడం కావచ్చు.
నేను పైన ఉదహరించిన నుడికారాల నేపథ్యాన్ని గనక వివరించి ఉండకపోయినట్లయితే, కొంతమందికి ఆ మాటల్లోని చమత్కారం అర్థమయ్యేదికాదు. ఈనాడు కంప్యూటర్లో ఈ వ్యాసం చదువుతున్నవారిలో చాలామందికి వ్యవసాయం, పశువులు, కోళ్లూ, పల్లె వాతావరణం వంటి అనుభవాలు లేకపోవడమే ఇందుకు కారణం. వారి సంస్కృతి కాస్త వేరు. వారి జీవన విధానం వేరు. రాబోయే తరాలుకూడా వ్యావసాయిక జీవనానికి దూరంగా పట్టణాల్లో సినిమాలు, టీవీలూ, ఇంగ్లీషు చదువులు, ఇతరభాషలవారి ఇరుగు పొరుగు, పోటీలు, వాటాలు అంటూ పరుగులమయమైన జీవనవిధానానికి అలవాటు పడి, ఆ వాతావరణానికి సంబంధించిన మాటలు నేర్చుకొంటూ ఉండటంతో వారి నుడికారం కూడా మారుతూ ఉంది. ముందే చెప్పుకొన్నాం కదా నుడికారం సంస్కృతి నుండి పుడుతుందని. ఈ నాడు తెలుగు నుడికారము తగ్గిపోయింది అంటే ఆశ్చర్యమేముంది? ఈనాటి మన ఆర్థిక రాజకీయ జీవనానికి ఆంగ్లం నేర్వడం తప్పనిసరి. ఈ మార్పు తప్పేమీ కాదు, తప్పేదీ కాదు. అయితే ఈమధ్య ‘అయ్యయ్యో’ అనవలసినచోట ‘oops’ అంటూంటారు కొందరు తెలుగువాళ్లు. ఇలా అనడం ఎక్కువ మందికి జుగుప్సాకరంగా అనిపిస్తే oops తెలుగులో కొత్త నుడికారం కాబోదు. ‘భాష జీవనది లాంటిది’ అన్న మాటను ఈ మధ్య చాలాచోట్ల చదివాను. కొన్ని దశాబ్దాలక్రితం బహుభార్యత్వం సంఘంలో సాధారణ విషయమైనప్పుడు ‘సవతిపోరు’ అనే మాటకు అర్థం వివరించాల్సిన పని ఉండేదికాదు. కానీ కొంతకాలానికి ‘నాకీ సవతి పోరు తప్పేలా లేదు’ అన్న మాటకు అర్థం తెలియకపోతే ఆశ్చర్యపడనక్కరలేదు.
నుడికారము ప్రాంతానికీ ప్రాంతానికీ మారుతుంది అంటారు. భాష ఒకటే అయినప్పటికీ ప్రాంతాన్ని బట్టి, ప్రజల జీవనాన్ని బట్టి నుడికారము మారుతుంది. కోస్తా తీరప్రాంతాలలో సముద్రానికి, చేపలుపట్టడానికి సంబంధించిన నుడికారం అక్కడి జాలరుల మాటల్లో వినబడుతుంది. కేరళవారి నుడికారములోనూ ఈ ప్రభావమే కనిపిస్తుందని నా మలయాళీ మిత్రుడొకరు ఉదాహరణలతో సహా వివరించారు. ‘నా బంగారు తండ్రీ!’ అని పిల్లల్ని ముద్దుచేయడం అచ్చతెలుగు నుడికారం. ఇంగ్లీషువారు ఇలాంటి మాట వాడరనుకుంటాను. అలాగే ‘ఔరా కొడుకా, అబ్బ ఏముందిది, అన్నన్నా ఎంతమాట, అమ్మా ఆశదోశ…’ ఇలాంటివెన్నో తెలుగువారి నుడులు. ఒకే మాటకు సందర్బాన్నిబట్టి అర్థాలు మారిపోవడం ఇంకో చమత్కారం. ఒక ఉదాహరణకు ‘పుట్టి’ అనే పదాన్ని చూడండి – ‘పుట్టి బుద్ధెరిగాక ఇలాంటి విచిత్రం చూడనేలేదు’, ‘వాణ్ణి నమ్మితే నీ పుట్టి మునుగుతుందంతే’, ‘పుట్టి రాగులు రెండుపుట్లు సజ్జలు’. మన పాటల్లో కనిపించే ‘నే చినదాన – వేచిన దాన’, ‘వందనాలు – వంద వందనాలు’, ‘ఈ వనమున నా జీవనమే’ లాంటి ఎన్నోమాటలగారడీలూ తెలుగుజాతి నుడికారపు సొగసులే.
చాన్నాళ్లకిందట ఆంధ్రభూమి వారపత్రికలోని భగవాన్‌గారి ఒక కార్టూను – బట్టలు సర్దేసుకుని ఇల్లువిడిచి శాశ్వతంగా వెళ్లడానికి పెట్టెతోసహా సిధ్దమైన తన భర్త కాళ్లమ్మటబడి కన్నీరుమున్నీరవుతూ ఆ అర్థాంగి అంటుంది – ‘ఛీ పాడు! పొండీ! అని సరదాగా అన్నానండీ. వా…’. నుడికారం తెలియకపోతే ఇలాగే ఉంటుందిమరి. ధర్మదాత సినిమాలో కొడుకులందరూ ముదిమిలోని తండ్రిని ఒంటరిని చేసి వెళ్లిపోయినపుడు వచ్చేపాట -‘ఎవ్వడికోసం ఎవడున్నాడు, పొండిరా పొండి’. వాళ్లెప్పుడో వెళ్లిపోయారుకదా, ఈయనేమిటి మళ్లీ ‘పొండిరా పొండి’ అంటాడు అనే ఆలోచన మనకురాదు. ఎందుకంటే ‘నన్ను విడిచి వెళ్లారు కదూ, అలాగే కానివ్వండ్రా’ అన్న ఆ పెద్దమనిషి ఆవేదన మన మనసుకు అందుతుంది కాబట్టి. ఆ నుడికారం మనకు తెలుసు.
విలాసంగా బ్రతికిన కవిసార్వభౌమ శ్రీనాధుడు చరమాంకంలో కష్టాల పాలయి రేనాడులో జొన్నకూడు తినలేక, బాధలోనే ఆనందాన్ని వెతుక్కోవలసిన పరిస్థితిలో ఆయన నోట జాలుసారిన ఈ చాటువు చూడండి –
గరళము మ్రింగితినంచును
పురహర గర్వింపబోకు. పో!పో!పో!
బిరుదిప్పుడు కానవచ్చెడి.
మెరిసెడి రేనాటి జొన్నమెతుకులు తినుమీ!
కార్టూనులోని అర్థాంగిలాగ ఇక్కడ శ్రీనాథుడు కూడా శివుని ‘పో!’ అని మూడు మార్లు అంటున్నాడు. కష్టాలలో ఉన్న తనకు సాయంరాలేదనే బాధాపూరితమైన కినుక అది. ఆ కినుకలోనే సవాలు విసురుతున్నాడు – గరళకంఠుడనే బిరుదుంది కదా నీకు, అదేమంత గొప్పసంగతికాదు, ఈ జొన్నమెకుతులు తిను నీ బిరుదు అప్పుడు కనబడుతుంది అని. పురము అంటే లోకమని అర్థం. హరుడంటే శివుడు. శివుణ్ణి త్రిపురాంతకుడంటారు. అలాగే వసుంధరా దాస్ పాడిన’షక లక బేయ్‌బి’ పాట చివరలో ‘ఏయ్ పోవయ్యా, అడియోస్, అమీగో!’. చివరివరకూ ‘ఆశ నీకు లేనే లేదా, నువ్వు మీసమున్న చెట్టుచేమవా’ అంటూ కవ్వించి, ఇక లాభంలేదని చివరగా చిన్న అలకాస్త్రం ప్రయోగించడమన్నమాట. అందుకే ‘వీడ్కోలు, చెలికాడా!’ అంటుంది స్పానిష్ భాషలో.
ఒక్కటి మాత్రం నిజం. తెలుగు నుడికారం తగ్గిపోతోంది అనే బదులు మారుతోంది అనవచ్చేమో. తెలుగు తెలుగుగానే ఉన్నరోజులలో అచ్చతెనుగు నుడికామే ఉండేది. తెలుగు సంస్కృతభరితం అయ్యాక కూడా అది అచ్చతెనుగు నుడికారంగానే చలామణి అయింది. ఉదాహరణకు ‘రామసక్కని బంగారు బొమ్మ’. రామః అన్నది సంస్కృతపదం. ఇది స్త్రీలింగ పదమని తెలుసుకొని ఆశ్చర్యపోకండి. అయితే ఆంధ్ర, కళింగ, వంగ, మగధ లాంటి ఎన్నో దేశాలుగా వివిధ ప్రాంతీయ భాషలను కలిగి విడివడియున్న మనలను, సంస్కృతాధారమయిన ఆర్షధర్మం ఒక్కటిచేసింది అంటారు. అంటే మన ఆధ్యాత్మిక వ్యవహారాలకు సంస్కృతం తప్పనిసరి. కావున అది ప్రాంతీయభాషలలో కలగలిసిపోయింది. ఈనాడు మన అర్థిక, రాజకీయ లావాదేవీలకు ఆంగ్లము తప్పనిసరైంది. కొన్ని అచ్చతెలుగుమాటల, కొన్ని సంస్కృతం కలిసిన తెలుగుమాటల స్థానాన్ని ఇప్పుడు ఆంగ్లం ఆక్రమించింది. మంచినీళ్లడిగే బదులు డ్రింకింగ్‌వాటరడుగుతున్నాం మరి. ఈ వాక్యం చివర ‘మరి’ లేకపోతే ఆమాట కాస్త చప్పగా ఉంటుంది గమనించారా, ఇదీ నుడికారమే మరి. నుడికారం తగ్గడమో మారడమో తనంతట తానుగా జరగడంలేదు, మనమే మార్చేస్తున్నాం.
తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జి.ఎన్.రెడ్డి గారి తెలుగు పర్యాయపద నిఘంటువులో – లోకోక్తి, లోకహితోక్తి, శాస్త్రము, శ్లోకము, సౌమ్యము లతోపాటు అడుగు, ముప్పదిరెండు అనేవి కూడా పర్యాయపదాలుగా చెప్పబడ్డాయి.
తమాషాకు ఒక సంగతి చెబుతానిక్కడ. ‘సండే అయితేనేంలాభం, ఎండమండిపోతోంది’ అని బాధపడతాం మనం. ఒక తెలుగువాడు ఆదివారాన్ని సండే అంటుంటే ఆదిత్యునికి మండదామరి. రవివారాన్ని సండే అంటే మంట రాజుకోదూ! ఇంగ్లీషువాడు ‘సన్’డే అంటుంటే ‘సన్’కు సంతోషమేగా. తర్కించకండి – చెప్పానుకదా తమాషాకంటున్నానని. ఈ విషయంలో కన్నడ సోదరులనుచూసి నేర్చుకోవాలి. మనం నాజూకుగా ఆంగ్లం వాడే చోట వారు కన్నడపదాలువాడి తాము కన్నడిగులమని తమ ఉనికినిచాటడం నా రెండున్నరేళ్ల బెంగళూరు వాసంలో గమనించాను. సమ్ ఇండియన్స్ ఆర్ మోర్ బ్రిటిష్ దాన్ ద బ్రిటిష్ అన్న మాటకు గర్వించక, సంస్కృతి మూలాలను చిన్నచూపుచూసే మన ఆత్మసౌందర్యాన్ని ఆంగ్లేయులే ఎద్దేవా చేస్తున్నారని గ్రహించవద్దూ మనం!?
**** **** ****
తప్పులను సరిదిద్ది ఈ వ్యాసమును రాసే ధైర్యాన్ని నాకు ప్రసాదించిన పెద్దలు, శ్రేయోభిలాషులు శ్రీ రావూరి భరద్వాజ గారికి సవినయ వందనములు, కృతజ్ఞతలతో… -రానారె.
43 Responses to తెలుగు నుడికారము