బానిసత్వం నాటి నుంచీ నేటి వరకూ

తెలుగు బ్లాగుల్లో చరసాల గారి అంతరంగానిదో విశిష్ట స్థానం. పొద్దు లో తెలుగుబ్లాగులను సమీక్షించే ఉద్దేశంతో ప్రారంభించిన బ్లాగు శీర్షిక శ్రీకారం చుట్టుకున్నది అంతరంగంతోనే!! మాటల్లో సూటిదనానికి, నిశితమైన విశ్లేషణకు చిరునామా అంతరంగం. అంతరంగం బ్లాగరి చరసాల ప్రసాద్ గారి అంతరంగావిష్కరణ బానిసత్వం గురించి:

—————

అసలీ బానిస పదం భాష పుట్టినప్పుడే పుట్టినట్లుంది. బానిసత్వం మనిషికి వూహ తెలిసినప్పటి నుండి వుంది. బలవంతుడు బలహీనుణ్ణి చెరపట్టడం అనాది నుండీ వుంది.
మన ఇతిహాసాల్లో, పురాణాల్లో చెలికత్తెల వ్యవహారం వుంది. దాస దాసీల గురించి వుంది. కూతురికి పెళ్ళి చేసినప్పుడు తనతో పాటు తన చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపడం వుంది. వజ్రవైఢూర్యాలతో పాటు దాసదాసీలను కానుకగా ఇవ్వడం వుంది. ఈ బానిసల జీవితమంతా యజమానుల సేవలోనే గడిచిపోతుంది. వారికంటూ స్వంత జీవితముండేది కాదు. పిల్లలను కనే హక్కు, పెళ్ళి చేసుకునే హక్కు లేదు.

రోమన్ సామ్రాజ్యంలో

యుద్ధాలలో బందీలుగా చిక్కిన వారిని చాలా మట్టుకు చంపేసేవాళ్ళు. పౌరులను కూడా చంపడమో, బందీలుగా పట్టుకోవడమో చేసేవాళ్ళు. ఇలా బందీలుగా దొరికిన వాళ్ళు బానిసలుగా అమ్ముడయ్యేవారు. బలవంతులు, పరాక్రమ వంతులను గ్లాడియేటర్స్ గా మార్చేవారు. ఈ గ్లాడియేటర్ క్రీడను మన కోళ్ళ పందేలతో పోల్చవచ్చు. పందెం కోడిని పెంచినట్లే వీళ్ళకు మంచి తిండి పెట్టి, ఒక్కోసారి వాళ్ళకు బానిస స్త్రీలను కూడా సరఫరా చేసేవారు. కోళ్ళ ఫారం లాగా ఇలాంటి గ్లాడియేటర్లని పెంచే సముదాయాలు వుండేవి, వీరికి యుద్ధ మెళకువలు నేర్పి ప్రతిరోజూ అభ్యాసం చేయించేవారు. ఒక్కోసారి ఇటువంటి అభ్యాసాలలో కూడా కొందరు చనిపోయేవారు. యుద్ధాలలో వీరమరణం చెందడం గౌరవప్రదంగా భావించినట్లే ఈ గ్లాడియేటర్ పోరాటాలలో మరణించడం గౌరవప్రదమైనదని వాళ్ళకు నూరిపోసేవారు. ఒకే యజమాని దగ్గర గ్లాడియేటర్లు స్నేహితులుగా మెలిగిన వారైనా యుద్ధంలో వీరోచితంగా పోరాడి చనిపోయేవాళ్ళు.

మగ వాళ్ళ పరిస్థితే అలా వుంటే ఇక ఆడ బానిసల సంగతి చెప్పక్కర లేదు. ఇంటి పనుల దగ్గరనుండీ వంటి పనుల వరకూ వారిని వుపయోగించుకొనే వారు.

గ్రీసులో…

గ్రీకు నాగరికతలో బానిసలు ప్రధాన పాత్ర వహించారు. ఇళ్ళల్లో, గనుల్లో, పొలాల్లో, ఓడల్లో మామూలు పనుల నుండీ అతి ప్రమాదకరమైన పనులన్నీ చేసేవారు.

ఇంచుమించు గ్రీకు జనాభా అంతమంది బానిసలు కూడా వుండేవారట. ఎంతమంది బానిసలను కలిగివుంటే అంత గొప్పవారుగా పరిగణించబడేవారు. యుద్ధాల్లో బందీలుగా చిక్కిన వారిని, ఓడిపోయిన పౌరులనీ బానిసలుగా అమ్మేవారు. ఒక్కోసారి అక్రమ సంబంధాల వల్ల పుట్టిన పిల్లలని ఏ తోవపక్కనో పడేస్తే గుర్తించిన వారు ఆ పిల్లలని బానిసలుగా పెంచుకొనేవారు. అప్పుతీర్చలేనప్పుడు, కష్టకాలంలో ధనం అవసరమైనప్పుడూ తమ స్వంత పిల్లలనే బానిసలుగా అమ్మేయడమూ కద్దు.

ఈజిప్టు లో

ఇక్కడ కూడా చరిత్రకు అందని రోజులనుండీ బానిసత్వం వుంది. బానిసలతోనే పిరమిడ్లు నిర్మించి వుంటారని కూడా నమ్ముతున్నారు. పెద్ద పెద్ద ప్రభుత్వ వుద్యోగులూ, పూజారులూ ఎక్కువ మంది బానిసలను వుంచుకొనేవారు. యుద్ధాలలో గెలిచి తెచ్చిన యుద్ధఖైదీలను రాజు వివిధ వుద్యోగులకూ, దేవాలయాలకూ అప్పగించేవాడు. వ్యాపార లావాదేవీల్లో బానిసల మారకమూ వుండేది. బానిసలకూ యజమానులకూ మధ్య సత్సంబంధాలు వున్న సందర్భాల్లో యజమానులు బానిసలని పెళ్ళి చేసుకొని బానిసత్వం నుండి విముక్తి కలిగించడము వుండేది. యజమాని చనిపోయిన సందర్భాల్లో మిగిలిన ఆస్తిలానే బానిసలనూ వారసులు పంచుకొనేవారు. పంచుకోలేని సందర్భాల్లో నెలలో పనిరోజులని పంచుకొనేవారు. ఉదాహరణకు ఒక బానిసను ఇద్దరు పంచుకోవలసి వచ్చినపుడు పదిరోజులు ఒకరిదగ్గరా, ఇంకో పది రోజులు ఇంకొకరి దగ్గరా పనిచేయాలి.

బానిసలు పూర్తిగా యజమాని ఆస్తిగా పరిగణించబడ్డా యజమానులకీ వారిపట్ల చూపవలసిన బాధ్యతలు వుండేవి. బానిసల పిల్లలను పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత యజమానిదే. పిల్లలతో కష్టమైన పనులు చేయంచకూడదు. ఇంకా కోర్టుల్లో బానిసలను మిగతా పౌరుల్లా చూడకపోయినా వారి సాక్ష్యానికీ విలువ ఇచ్చేవారు.

19 వ శతాబ్దంలో కట్టిన సూయెజ్ కాలువ తవ్వకానికి కూడా అర్థ బానిసలని వుపయోగించుకున్నారు. అదెలా అంటే అప్పుడున్న ఈజిప్టు ప్రభుత్వం సూయెజ్ కాలువ నిర్మాణానికి కావలిసిన కార్మికులను సరఫరా చేస్తానని సూయెజ్ కాలువ కంపెనీతో ఒప్పందం చేసుకొంది. ఒక్కో గ్రామంలో యాభైమందిని కలిపి ఒక గుంపుగా తయారు చేస్తుంది. ఏ గుంపు ఏ నెలలో సూయెజ్ కాలువ కొరకు (ఉచితంగా) పనిచేయాలో నిర్దేశిస్తుంది. ఆ పనిచేసిన వారందరికీ ఆహారం తప్ప మరేమీ భృతి ఇవ్వడం వుండదు. నిర్దేశించిన సమయం తర్వాత ఇంకో గుంపు వచ్చి ఈ గుంపు స్థానంలో పని చేస్తుంది. ఇలా కొన్ని లక్షల మంది పది పన్నెండేళ్ళపాటు పని చేస్తే సూయెజ్ కాలువ తయారయ్యింది. ఒక అంచనా ప్రకారం కనీసం లక్ష మంది ఈ కాలువ పనిలో మరణించి వుంటారు.

అమెరికాలో…

బానిసత్వం ప్రపంచం నలుమూలలా వున్నా ఒక్క అమెరికాలో వున్న బానిసత్వమే అందరినీ ఆకర్షించింది. బహుశా అమెరికాలో బానిసత్వం పూర్తిగా వ్యాపారాత్మకంగా నడవడం వల్లనేమో! లేక చట్టబద్ధమైన బానిసత్వం అప్పటికే ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలైన యూరోపియన్ దేశాలలో నిషేధించబడటం వల్లనేమో!

అమెరికాను కనుగొన్న తర్వాత అక్కడి పొలాల్లో మొరటు పనులు చేయలేక మొదట స్థానిక రెడ్ ఇండియన్స్‌ను బానిసలుగా వాడకోవడం మొదలేట్టారు. అయితే వీరు లొంగి వుండకపోవడం వల్లా, భౌగోళిక పరిసరాలు వారికి కొట్టిన పిండి గనుక తప్పించుకుపోవడం కూడా ఎక్కువగా వుండేది. అప్పుడు ఆఫ్రికా నీగ్రోల మీద వీరి కన్ను పడింది. అప్పటికే నౌకలమీద దూర దేశాలు వెళ్ళడం సాధ్యమయివుండటం వల్ల నల్లవారిని పట్టుకొని అమెరికాలో అమ్ముకొనే దళారులు ఎక్కువయ్యారు. యూరోప్ నుండి వచ్చిన తెల్లవారికి అమెరికా దక్షిణ ప్రాంతపు వేడికి తట్టుకోవడం, తట్టుకొని పొలాల్లో పని చేయడం దుర్భరం అయ్యింది. ఇలాంటి చోట్ల నల్లవారు బాగా పని చేసేవారు.

రేవు పట్టణాల్లో బానిసల సంతలుండేవి. ఇక్కడ బానిసలని కట్టేసో లేక గుపులుగానో వుంచేవారు. అక్కడికి వచ్చిన బేర గాళ్ళు వాళ్ళ పళ్ళు చూసి, మచ్చలు చూసి, చిన్న చిన్న పరీక్షలు పెట్టి ఎంత ధర వెచ్చించవచ్చునో ఒక నిర్ణయానికి వచ్చేవారు. ఆ తర్వాత జరిగే వేలం పాటలో వారిని వేలం పాడి కొనుక్కొనేవారు. ఇలా కొనుక్కున్న బానిసలను దూర ప్రాంతానికి తరలించాలంటే మధ్యమధ్యలో బస చేయాల్సి వస్తుంది కదా, అందుకని వూరూరికీ బానిసల కారాగారాలు వుండేవి. కొద్దిపాటి రుసుము చెల్లించి బానిసలను ఇక్కడ వుంచి మరుసటి రోజు తీసుకపోవచ్చును.

బానిసను పూర్తిగా యజమాని ఆస్తిగా పరిగణించారు. బానిసని కొట్టేటప్పుడు పొరపాటున మరణించినా లేదా కావాలని చంపినా చట్టం యజమానిని దండించదు. యజమానికి సౌలభ్యంగా ఎన్నో బానిస చట్టాలు వచ్చాయి. ఏ బానిసైనా యజమానిని వదిలి పారిపోతే, ఆ బానిసని పట్టుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయం చేస్తుంది.

బానిసలని శిక్షించడానికి శిక్షా కేంద్రాలుండేవి. బానిస సరిగ్గా వినయం చూపట్లేదనో, చెప్పినంత పనిచేయలేదనో కారణాన ఈ శిక్షా కేంద్రాలకు పంపేవారు. ఇక్కడ యజమాని చెప్పిన శిక్ష కొద్దిగా రుసుము తీసుకొని అమలు జేసేవారు (కొరడా దెబ్బలు కొట్టడం లాంటివి).
అయితే బానిసత్వానికి అనుకూలంగా వున్నట్లే వ్యతిరేకంగా ఎందరో వుండేవారు. బానిసల అవసరం లేని, పారిశ్రామిక ఉత్తరాదివారు బానిసత్వాన్ని వ్యతిరేకించారు. పారిపోయిన బానిసలకు రహస్యంగా సహాయం చేసి సరిహద్దు దాటించేవారు (అప్పుడు సరిహద్దులోని కెనడాలో బానిసత్వం లేదు).

చివరికి ఈ అభిప్రాయ భేదాలు చిలికి చిలికి అంతర్యుద్ధానికి దారి తీశాయి. లింకన్ దృఢ నాయకత్వంలో జరిగిన ఈ అయిదేళ్ళ పోరాటంలో ఉత్తరాది రాష్ట్రాలు గెలిచి బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించాయి.

అయినా… పందొమ్మిదవ శతాబ్దం 60వ దశకంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఉద్యమం లేవదీసేవరకూ నల్లవాళ్ళకి ప్రత్యేక స్కూళ్ళు, ప్రత్యేక బస్సులూ, బెర్తులూ వుండేవి. కింగ్ జూనియర్ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా వుద్యమించి నల్లవారికి తెల్లవారితో సమాన హక్కులు సాధించారు.

ఇలా ప్రతిచోటా అనాదిగా బానిసత్వం వుంది. బలహీనుణ్ణి బలవంతుడు వాడుకోవడం, పెత్తనం చెలాయించడం వుంది. అందుకేనేమో శ్రీశ్రీ “ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” ఆంటారు.

ఇక మన దేశం విషయానికి వస్తే…

అలెక్జాండర్ ది గ్రేట్ తో వచ్చిన ఏరియన్ అనే పెద్దాయన “అదేం చిత్రమో గానీ ఇండియాలో బానిసనేవాడు లేడు. ఇక్కడ బానిసలే లేరు.” అని తన “ఇండికా” లో వ్రాసుకొన్నారు. బహుశా అప్పటి సామాజిక చిత్రాన్ని తన పాశ్చాత్య కళ్ళతో చూడటం వల్ల పాశ్చాత్య తరహా బానిసత్వం లేదని ఆశ్చర్యపోయేడేమో గానీ బానిసత్వం ఇండియాలో అప్పుడూ వుంది ఇప్పుడూ వుంది.

వేదకాలంలో యాగాలలో మనిషిని బలిచ్చే సంప్రదాయం వుంది. శునశ్శేపుని వృత్తాంతం ఇందుకు వుదాహరణ. అయితే మనదేశంలో బానిస వ్యవహారం ఇతర దేశాలకు పూర్తి భిన్నంగా జరిగింది. ఇతర దేశాల్లో డబ్బు పెట్టి బానిసను కొని అతనికి స్వేచ్చని ఇచ్చేవారు. బానిసలు వున్నత పదవులూ నిర్వహించేవారు. బానిసలను బహిరంగ మార్కెట్లలో విక్రయించేవారు. అయితే ఇండియాలో ఇలాంటివి జరిగినట్లు పెద్దగా ఆధారాలు లేవు. నాకు తెలిసి ఒక సత్య హరిశ్చంద్రుడి కథలోనే “అమ్మడం” అనే ప్రసక్తి వస్తుంది. ఆ కథలో ఒక రాజే తన భార్యను అమ్మి, తనకు తాను అమ్ముడు పోవడమే వింత! ఈ కథను బట్టి అలా అమ్మడం అప్పటికే వున్నట్లు అనుకోవచ్చు. లేదంటే హరిశ్చద్రుడు అమ్ముతానంటే ప్రజలు తిరస్కరించడమో, అది అతి హేయమైన చర్యగా పరిగణించి కొనడానికెవరూ ముందుకు రాకపోవడమో జరగాలి.

పాశ్చాత్య తరహా బానిసత్వం ఇక్కడ లేక పోవడానికి, వున్నా ఎదగకపోవడానికి కారణం బహుశా వ్యవస్థీకృతమైన కుల వ్యవస్థ అయ్యుండవచ్చు.

కుల వ్యవస్థలో బానిస వ్యవస్థలోలాగే వృత్తి పనుల వాళ్ళు వున్న వాళ్ళకి వూడిగం చేస్తారు. కులాచారం, కుల ధర్మం పేరుతో ఏ కులంలో పుట్టిన వాణ్ణి ఆ కులానికి సంబంధించిన పనికి పరిమితం చేశారు. ఇదేమని ప్రశ్నించే వీలులేకుండా “కర్మ” సిద్ధాంతము పేరుతో ఎవరికి వారు లోబడి వుండేలా చేశారు.

బహిరంగంగా వేలం వేసే పద్ధతికి ఋజువులు తక్కువగా వున్నా పరిచారకులనీ, చెలికత్తెలనీ దానంగా ఇవ్వడం మాత్రం అన్ని కాలాలలోనూ వుంది. ఆడపిల్లకు పెళ్ళి చేసి ఆమెతో పాటు ఆమె చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపడం నిన్నా మొన్నటి వరకూ నడిచిన వ్యవహారమే.

ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా వుండేదేమో తెలియదు గానీ తెలంగాణాలో “ఆడబాప” ఆచారం వుండేది. (ఇప్పుడు కూడా వుందా?) పెళ్ళికూతురుతో పాటు ఓ దాసి కూడా వెళ్ళేది. ఆ అల్లుడికి పెళ్ళికూతురు మీదలాగే ఈ దాసి మీద కూడా హక్కులుండేవి. ఇంకా అధ్వాన్నమైన భాగమేమంటే ఇంటికి వచ్చిన అతిథుల కోర్కెలు కూడా ఈ ఆడబాపలు తీర్చాలి. ఈ ఆడబాపలకు పుట్టిన ఆడపిల్లలు మళ్ళీ ఆడబాపలుగా ఇంకో ఇంటికి వెళితే మగబిడ్డలు జీవిత పర్యంతమూ ఆ యింటిపనులు చేస్తూ పనివాళ్ళుగా (బానిసలుగా) వుండేవారు.

ఇప్పటికీ బాకీలు తీర్చలేక కొడుకునో, కూతురునో పనిలో పెట్టడం జరుగుతూ వుంది. ఏళ్ళకేళ్ళు పనిచేసినా వడ్డీ తీరని సందర్భాలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జీవితాంతం బానిసగా పడివుండటం తప్ప వారి జీవితాలకు వెలుగు లేదు. ఎక్కడో అక్కడ ఒకటీ అరా వార్తా పత్రికల ద్వారా తెలిస్తే తప్ప ప్రజల్లో వీటి గురించి పెద్దగా పట్టింపు లేకుండా వుంది.

-చరసాల ప్రసాద్ (http://blog.charasala.com)
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

15 Responses to బానిసత్వం నాటి నుంచీ నేటి వరకూ

Comments are closed.