“నీ రూపమగోచరము, నీ స్వభావము మనోభావాని కతీతము. కాని నీ కన్న నాకు హ్రుదయానుగతమేదీ లేదు. నీ నామ మనుసృతము.కలలో విన్న గానం వలె ప్రతి నిమిషమూ నా చెవుల ధ్వనిస్తోంది. నా వేపు నడిచొచ్చే నీ మృదు పాద రజము అస్తమయ మేఘాలకి రంగు వేస్తోంది. నన్ను వెతుకుతో వచ్చే నీ అడుగుల చప్పుడు నా హృదయంలో ప్రతి నిమిషం ధ్వనిస్తోంది, నా పరమావధి నీవు.నీ వుండ బట్టి, ఈ ప్రపంచ మింత సుందరమూ, హృదయాకర్షమూ…” – చలం.
ప్రేమ కోసం అజరామరమైన ప్రేమమందిరాన్ని నిర్మించాడొక ప్రేమచక్రవర్తి…
ప్రేమ కోసం మరణాన్ని సంతోషంగా ఆహ్వానించాడొక ప్రేమపిపాసి…
ప్రేమ కోసం మరణాన్ని జయించాడొక ప్రేమసాహసి…
ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఈర్ష్య తప్పకుండా ఉంటుంది. ఈర్ష్య మనిషికి స్వభావసిద్ధంగా వచ్చిన సహజ గుణమంటాడు ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. అలా అయితే ప్రేమ కూడా అలాంటి సహజ గుణమేనా? మరైతే కొంత మందిలో కలిగే భావతీవ్రత అందరిలోనూ ఉండదేమి? ప్రేమ కూడా మన జన్యువులు నిర్దేశించే ఓ క్రియా? ఇందులో నిజమెంత? తెలుసుకుందాం రండి.
‘ఆక్సిటోసిన్’ ఈ పేరెప్పుడైనా విన్నారా? మన శరీరంలో స్రవించే హార్మోనుల్లో ఇదీ ఒకటి. ఇది మెదడులోని హైపోథలామస్ అనే భాగం నుంచి స్రవిస్తుంది. ప్రేమకు ఈ హార్మోనుకు సంబంధం ఏమిటంటారా-మనకు తెలిసి మొదటిసారి ప్రేమను ఎప్పుడు అనుభవిస్తాం? తల్లి ఒడిలో అని అందరికీ తెలుసు. అక్కడే ఉంది అసలు కిటుకంతా!
బిడ్డ తల్లిపాలు తాగుతున్నప్పుడు ఆ స్పందన చనుమొనలలోని నరాల ద్వారా మెదడుకు అంది అది ఆక్సిటోసిన్ ను రక్తంలోకి పంపి, రక్తం ద్వారా రొమ్ములోనికి చేరే ఈ హార్మోను అందులోని కండరాలను ప్రేరేపించి సంకోచింపజేసి చనుబాలను బయటకు పంపుతుంది. ఇది శరీరధర్మ శాస్త్రంలో చదివిన లాక్టేషన్ చక్రం. కానీ ఇదే హార్మోను తల్లికి, బిడ్డకు మధ్య బంధాన్ని(బాండింగ్) పటిష్టపరచడంలో సాయపడుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇదే కాక తల్లిపాలల్లో రోగనిరోధకశక్తి పెంపొందించే కొన్ని రకాల స్రావాలు ఉంటాయి అందుకే తల్లిపాలు శ్రేష్ఠమనేది.
ఇందుకు కారణం మన మెదడుపై కూడా ఈ ఆక్సిటోసిన్ చూపే ప్రభావం. మెదడులో కొన్ని చోట్ల ఈ హార్మోను గ్రాహకాలు(రిసెప్టార్స్) ఉన్నాయని పరిశోధనలు నిరూపించాయి. అంటే ఆ గ్రాహక కణాలు స్పందిస్తే ప్రేమ పుట్టుకొస్తుందని తేల్చారు. అలా అయితే ఈ హార్మోనుని మనకిష్టమైన వాళ్లకిచ్చి మన మీద ప్రేమ కలిగించుకొంటే అనే చిలిపి ఊహలు అప్పుడే కొందరికి వచ్చుంటాయి. అక్కడికే వస్తున్నా!
తొలిచూపులోనే ప్రేమలో పడడం కొందరికి అనుభవమే. మరి ఇక్కడ పని చేసే మంత్రం ఏది? యవ్వనంలో ఉన్నప్పుడు మన శరీరంలో హార్మోనులు పరవళ్లెత్తుతూంటాయి. ఏదైనా అందమైన పువ్వునో, అందమైన నవ్వునో చూసినప్పుడు మనస్సులో చిన్న సంచలనం కలుగుతుంది. అలాగే అందమైన వ్యక్తిని చూసినా మనలో కలిగే ఆ భావతీవ్రతకు సిగ్గు, బిడియం, ఆలోచన అనే కొన్ని అడ్డుకట్ట వేస్తాయి. కానీ వయస్సు తోడు కోరుకొనే యవ్వనంలో ఇదే భావసంచలనం కలిగితే అప్పుడు ఆ భావాలకు ఈ ఆక్సిటోసిన్ తోఢైతే ఆ వ్యక్తి మీద కలిగే ఆరాధనా భావం కలకాలం ఉంటుందని మనం అనుకోవచ్చు.
మరి ఈ ప్రేమలు-దోమలు కుట్టకుండా బుద్ధిగా పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకొన్న వారి సంగతేంటని అడిగేరు…దానికీ సమాధానం ఉంది. ఈ ఆక్సిటోసిన్ కామోద్దీపనం జరిగినప్పుడు కూడా ఎక్కువ పాళ్లలో రక్తంలో ఉంటుందని నిరూపణ ఉన్నది. అలా అని ఇలాగే వారి మధ్య అనుబంధం ఏర్పడుతుందని కాదు, ఇదీ ఓ కారణం అని శాస్త్రరీత్యా చెపుతున్నారు. ఇదే ఆక్సిటోసిన్ కాన్పు జరిగే సమయంలో గర్భసంచిలోని కండరాలు సంకోచింపజేసి ప్రసవం సులువుగా అయ్యేట్టు చేస్తుంది. ప్రసవవాన్ని వేగవంతం చేసేందుకు ఆసుపత్రులలో గర్భిణులకు సెలైన్ సీసాలలో ఎక్కించే సూదిమందు ఇదే!
8 Responses to ప్రేమ…కథ