కబుర్లు

సత్యం వద…: జర్మనీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు దొరక్కుండా వచ్చి ఇంట్లో దాక్కున్నాడొకతను. అతనెక్కడున్నాడో తెలియదని వాళ్ళావిడ బుకాయిస్తుంటే మూడేళ్ళ కూతురు కలగజేసుకుని తన తండ్రెక్కడున్నాడో చూపించి అరెస్టు చేయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమే చెప్పాలని కూతురికి బోధించిన ఆ తండ్రి అందుకు బాధపడలేదు. పైగా కూతురు తన మాటలు బాగా వంటబట్టించుకున్నందుకు సంతోషిస్తున్నానన్నాడు.

*******************

తొందరగా పడుకుని తొందరగా నిద్రలేవాలని మనవాళ్ళు ఎప్పట్నుంచో చెప్తున్నారు. మనం వింటేనా? రాత్రి పూట ఎక్కువసేపు మేలుకుంటే మెదడులోని జ్ఞాపకాల కేంద్రమైన hippocampus పనితీరు దెబ్బతింటుందని, అందువల్ల ఎక్కువగా మేలుకునే పిల్లలు చదువులో వెనుకబడుతారని ఇటీవలే ఒక పరిశోధనలో కూడా తేలింది.

*******************

కొండకు రంగేయిస్తున్న ఫెంగ్ షుయ్? నైరుతి చైనాలో Lao Shou  పర్వత సమీపాన గల గ్రామస్థులకు అధికారులు ఆ కొండకు ఆకుపచ్చ రంగులెందుకు వేయిస్తున్నారో అర్థం కాలేదు. మరే కారణమూ కనబడక ఆ ఊరి వాస్తు(ఫెంగ్ షుయ్)ను మార్చడానికేమోనని ఊహిస్తున్నారు!

*******************

ఈసారి అమెరికాలో ఉన్నవాళ్ళు మంచుతో బాగా ఇబ్బందిపడ్డారు. కానీ నేపాల్ రాజధాని ఖాట్మండులో 63 సంవత్సరాల తర్వాత కురిసిన మంచును చూసి చిన్నా పెద్దా అందరూ ఎంతగానో సంబరపడ్డారు. నడివయసు తల్లులు కూడా తమ పిల్లలతో కలిసి సరదాగా మంచులో ఆటలాడుకున్నారు.

*******************

వాతావరణంలో చోటుచేసుకునే స్వల్ప మార్పులను సైతం ఎప్పటికప్పుడు నిశితంగా పసికట్టి, భూమికి చేరవేసేందుకు వీలుగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మూడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది.

*******************

దేశంలో ప్రాథమిక విద్యా స్థాయిలో చిన్నారులకు ప్రైవేటు ట్యూషన్లు చెప్పించడం సిగ్గుచేటని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ అభిప్రాయపడ్డారు.

*******************

ధైర్యే సాహసే లక్ష్మీ: హైదరాబాదులో ఒకామె తన మెళ్ళోని గొలుసు లాగబోయిన దొంగ మొహం మీద చాచికొట్టేసరికి వాడు లబోదిబోమంటూ కారులో పారిపోబోయి, ఆమె తన చొక్కా పట్టుకుని విడవకుండా వెంటబడేసరికి దిక్కుతోచక కారుతో గోడను గుద్దేసి, చివరికి కారునొదిలేసి పారిపోయాడు.

*******************

పొమ్మనలేక… పొగబెట్టడమనే సామెత ఉంది మనకు. ఆ ఇటాలియన్ వనితకు ఆ సామెత తెలుసో లేదో మనకు తెలియదు గానీ ఆమె మాత్రం తన మొగుడు అదేపనిగా సిగరెట్లు ఊది పారేస్తూ ఉంటే తనను పొమ్మన్నట్లే భావించి మొగుణ్ణొదిలేసింది.

*******************

కొసమెరుపు: ఈమధ్య తెలుగు బ్లాగరులు ఇనుమడించిన ఉత్సాహంతో బ్లాగుతున్నారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

3 Responses to కబుర్లు

Comments are closed.