సుధాకర్ – ఒక ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఆయన రాసే తెలుగు బ్లాగు శోధన 2005వ సంవత్సరానికి భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దు కోసం సుధాకర్ రాసి ఇచ్చిన సమీక్ష ఇది.
దర్గా మిట్ట కతలు…రచయతకు రాయాలనే కొంటెతనం తప్ప, పేరు గురించి పెద్దగా ఆసక్తి లేదనిపిస్తుంది కదా? కానీ పుస్తకం చదువుతూ పోతే అది మాములు మిట్ట కాదని, ఒక సజీవ జీవసౌందర్యావిష్కరణకు పుట్టినిల్లు అని తెలుస్తుంది . ఈ కతల గురించి మాట్లాడే ముందు, కతలవీరుడి గురించి తెలుసుకుందాం. మొహమ్మద్ కదీరు బాబు (ఈ పేరు వెనక ఒక కత ఉంది) తన గురించి ఈ కతల పుస్తకంలో పెద్దగా రాయలేదు, అతని కతల కత తప్పితే . అది అతని నిరాడంబరత అని గట్టిగా చెప్పొచ్చు. కదీరు బాబు ప్రస్తుతం ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. తన జీవితంలోని చిన్నతనపు తీపి, చేదు అనుభవాలను తీపిగానే మనకి రెండు పుస్తకాలలో అందించారు(ఇంకొకటి పోలేరమ్మ బండ కతలు ).
మన కళ్ళకు చప్పగా అనిపించే దైనందిత జీవితాన్ని చిట్టి కదీరు తన జిజ్గాసతో పరిశీలించి వడపోసి, హాస్యాన్ని రంగరించి తేనెగా మన నోట్లో పోస్తాడు . ఇలాంటి పరిశీలన నాకు మక్సీమ్ గోర్కీ “నా బాల్యం” లో కనిపించింది . అయితే ఈ పుస్తకం మిమ్మల్ని అస్సలు ఆనందపు ఆర్ణవం నుంచి బయటకు రానివ్వదు. సుఖమైనా నవ్వే, బాధలోనూ నవ్వే…
ఈ కధలలో ప్రేమ తప్ప ఇంకేమి తెలియని అమ్మ, బోళా నాన్న, ఎల్లెలెరగని స్నేహం, మనింటి మనుషుల్లాంటి పక్కింటోల్లు ఒకటేమిటి అన్ని రకాల అద్భుత,ఆదర్శమైన తెలుగు జీవిత మధురిమలు మనల్ని ముంచెత్తుతాయి . పరవశుల్ని చేస్తాయి. ఈ కతలకు ముందు మాట రాసిన ముళ్ళపూడి రమణగారి పదాలలో…
“వేదంలా ప్రవహించే తెలుగు జీవనదిలో ముస్లిం జీవన స్రవంతి ఇంతకాలం అంతర్వాహినిగా – కనపడకుండా ప్రవహిస్తూ వుండాలి. ఖదీర్ బాబు– దర్గా మిట్ట కతలలో భగీరధుడిలా ఆ నదిని మన ముందుకు మళ్ళించాడు . ఈ నది నీటిలో ప్రతి బిందువు ఒక ఆణిముత్యం. మంచుని ఎగజిమ్మే అగ్ని పర్వతం. ఇందులో నాన్నలూ , అమ్మలూ అవ్వలూ తాతలూ అందరూ భూలోక దేవతలు. సుఖసంతోషాలలాగే కష్టాలనూ కన్నీళ్ళను కూడా నగలుగా వేసుకుని హుషారుగా తిరుగుతారు . పాలు పూలు పాపాలు, తాపాలు అన్నీ ఒక్కటే….మచ్చుకి నాలుక్కతలను మెచ్చుకుంటే మిగతా ఇరవయ్యి …కోప్పడవు; నవ్వుతాయి…అంచేత………..”
ఈ కతలన్ని నెల్లూరు యాసలో కొనసాగుతాయి. అవి ఒక యాసలో ఉన్నయని కూడా చదివే వాడికి తెలియదు . అదే మరి గమ్మత్తు. ఈ కతలన్నీ ఆనంద జీవితాల గురించే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చాపకింద నీరులా చిన్న స్థాయి మధ్యతరగతి జీవితాల హాస్య భరిత బాధలను రచయత ఆవిష్కరించారు . దీనికి అతడు పెద్దగా కష్టపడలేదు. ఉన్నది ఉన్నట్టుగా రాసి పడేసాడు. భేషజం లేదు , భయం అంతకన్నా లేదు.
కతల గురించి కబుర్లు ఆపి, కొన్ని చమక్కుల్లాంటి కతల కలకండ ముక్కల్ని చూద్దాం …
01. అలీఫ్, బే, తే మా నాయనమ్మకి గోరి కడితే : “ఈ ఐవోరు బెత్తం పట్టుకుంటే వొదలడంట సామీ. ఈ సంగత్తెలిసే మా అన్న ఆరులో ఉర్దూకు బదులు తెలుగు తీసుకున్నాడంట ‘ అని యింకాస్త దడిపించినాడు యూసఫ్ గాడు. ఆ దెబ్బకి ఇంకిప్పటికిప్పుడు ప్లానెయ్యక తప్పదని అర్దమైపోయింది అందరికి. ‘ ఠఠఠ్ఠాయ్…ఐడియా‘ అన్నాడు గౌస్ జాన్ కొడుకు సందాని. ఏందిరా …ఏందిరా అని అడిగినాము అందరం. ‘జాఫర్ ఐవోరు, విజ్డమ్ టుటోరియల్స్ ‘ అన్నాడు చిటికేస్తా….అందరం సప్పంగా సల్లబడిపోయినాం. ఏడ్ఛినావులే.. ఆ పర్వేట్ లో బాగా చెప్పరని కదా సామీ మనం చేరనిది. అదీ కాక ఆడ పది రూపాయలు నాయినా ఫీజు” అన్నాడు యూసఫ్ . ‘ఫీజు ఎక్కువైతే ఏమిరా? కొట్టకుండా చెప్తారంట…మద్యలో ఎగనూకినా ఏమీ అనరంట ‘ అన్నాడు సందాని.
02. మా ఇస్కూలు యానివర్సరీకి దుమ్ము లేపేసినా : “ఏమిరా కరీం కొడకా ! కిలాసు లా?” అన్నాడు నన్ను చూసి . ‘వుంది కానీ నేను యాక్షన్ చేస్తాను సర్‘ అన్నాను రొంత బయంగా… ” ఏమి యాక్షనురా?” అన్నాడాయన మీసాల నిండుగా నవ్వతా… “గబ్బర్ సింగు సార్ చేసేదా ?” అని ఆయనెక్కడ ఒద్దంటాడోనని ఎమ్మటే బీకరంగా గొంతు పెట్టి ‘కితినే ఆద్మీ థే” అంటా మొదలు పెట్టినాను .
03. వంజరాలు మాగలు కండసుదుములు : కూర సంగతికొస్తే మా నాయనదంతా ‘హైతో ఖానా – నైతీ సోనా‘ స్టయిలు (ఉంటే తినటం, లాకుంటే పొణుకోవటం). ఏ రోజయినా మా నాయిన యాబై రూపాయలు సంపాదించుకుని వచ్చినాడా …యింకయ్యి నీసు డబ్బులకిందే లెక్క. పొద్దునొక నీసు కూరకి, సాయింత్రమొక నీసు కూరకీ ఆ డబ్బుల్లోని అణా పైసాని కూడా జమెయ్యాల్సిందే . “
04. నేను నేలలో …అమ్మ బెంచీలో : “ఆమెని కదిలిస్తే కుర్ర పిల్లప్పటి కతలన్ని యిట్టాగే చెప్పద్దని మా అమ్మ కదిలించదు . ఎప్పటిలానే గమ్మున దుప్పటి చుట్టుకుని రెడీ అయుపోయింది సినిమాకి. జైబూన్ అపా వచ్చినాక “ రే….రిష్కా తేబో గబాల్న‘ అనింది నా తట్టు చూస్తా… ‘తేనుగా ‘ అన్నాను తల అడ్డంగా వూపుతూ….’ఏందిరో చెప్తా వుంటే..పో రిష్కా పిలచక రాబో ‘ అనింది జైబూన్ అపా కూడా…’తెస్తే – నన్ను – కూడా – పిలచక పోవాలి – సినిమాకి‘ అన్నాను దీర్గాలు పెట్టి సాగ తీస్తా …’సినిమాకా ? ఖాజాపీరు కోడలికి కాన్పయ్యింది నాయినా, చూసి రావడానికి పోతన్నాం ..ఆడకి పిలకాయలు రాకూడదు‘ అనింది మా అమ్మ. నువు యాడికి పోతున్నావో – నాకు తెలుసులేమ్మా‘ అని చిటికేసి ‘మరేదగా నన్ను సినిమాకి పిలచకపోతే రిష్కా తేను అని బెదిరించేసాను . దెబ్బకి మా అమ్మ దారికొచ్చేసింది. ‘సరే పా నా కొడకా. ఇంటర్ బెల్లులో పులి బంగరాలు అడిగినావో అప్పుడు చెప్తా నీ పని ‘ అని పళ్ళు పట పట మని కొరికింది మా అమ్మ.”
ఇలా రాసుకుంటూ పోతే అన్ని కతలకు రాయవలసి వస్తుంది. అందువలన ఇక ఆపుదాం. ఇవన్నీ చదివాక, మనందరం ఒక్క సారి మన బాల్యం వైపు చూసుకోవటం ఖాయం. ఛస్ చాలా మిస్సయిపోయామనుకోవటమో , అరెరె ఈళ్ళందరూ అచ్చం మన సిన్నప్పటి యదవల్లానే వున్నారే అని నవ్వుకోవటమో గ్యారంటీ సామీ….
–సుధాకర్ (http://sodhana.blogspot.com)
24 Responses to దర్గా మిట్ట కతలు