సత్యసాయి కొవ్వలి (http://satyasodhana.blogspot.com/) ప్రముఖ బ్లాగరి. చక్కటి భాష, భావ ప్రకటనా శక్తి కొవ్వలి సొత్తు. హాస్యాన్ని రాయగల కొద్ది మంది బ్లాగరులలో సత్యసాయి గారొకరు. బ్లాగు రాసే వారు బ్లాగరి అయితే, శ్రేష్ఠమైన బ్లాగరులను బ్లాగ్వరులు అని ప్రయోగించారీ వ్యాసంలో! బ్లాగ్భీష్ములు అనేది మరో కొత్త ప్రయోగం. పొద్దుపై అభిమానంతో ఈ బ్లాగ్వరుడు ప్రత్యేకించి రాసి ఇచ్చిన వ్యాసం ఇది. చిత్తగించండి!
కొవ్వలి దక్షిణ కొరియాలో వ్యవసాయ శాఖలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు.
—————————————————————————
అసలు నేనెందుకు ‘బ్లాగు’తున్నాను?
బ్లాగోత్సాహము బ్లాగర్కి బ్లాగును
ప్రచురించినపుడు పుట్టదు జనులా బ్లాగును
కనుగొని చదవగ/పొగడగ బ్లాగోత్సాహము
నాడె బ్లాగర్కి కదరా సుమతీ!
ఇది బ్లాగర్లందరికీ అనుభవమై ఉంటుంది. ఎవరైన మన బ్లాగు చూసి బాగుంది అని వ్యాఖ్య వ్రాస్తే ఎవరెస్టెక్కినట్లుంటుంది. అది ఒక మత్తులాంటిది, కళాకారులకి చప్పట్లలాగా. అసలు బ్లాగులు వ్రాయడం ఫక్తు చదువరుల వ్యాఖ్యలకోసం కాకపోయినా, బ్లాగు వ్రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి వచ్చే వ్యాఖ్యలూ, ప్రోత్సాహాల ప్రభావం బ్లాగర్లపై చాలా ఉంటుంది. ఇప్పుడు ‘పొద్దు’ ప్రత్యేకంగా మంచి బ్లాగులని పరిచయం చేయడం, ఆయా నెలల్లో వచ్చే ఉత్తమ బ్లాగులని సమీక్షించడం బ్లాగర్లకి ప్రోత్సాహకరంగా ఉండడంతో పాటు, తమ తమ బ్లాగుల్లోని వస్తువు, శిల్పం, వాసి మెరుగ్గా ఉంచడానికి తాపత్రయపడేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
అసలు నేనెందుకు బ్లాగుతున్నాను అని ప్రశ్నించుకొంటే, చాలా పేజీల సమాధానం వస్తుంది. చాలామంది బ్లాగర్లు ఈ ప్రశ్నకి సమాధానం తమ మొదటి బ్లాగులో వ్రాసుకొనే ఉంటారు. ఈ వ్యాసంలో నేనెందుకు బ్లాగుతున్నానో చెప్పడంతో పాటు, మిగిలిన బ్లాగర్లు ఎందుకు బ్లాగుతున్నారో (వారి బ్లాగులో వ్రాసిన దాన్ని బట్టి) చెప్పడానికి ప్రయత్నిస్తాను. వేరేవారు ఎందుకు బ్లాగుతున్నారో నేను చెప్పడమన్నది ఒకరకంగా దుస్సాహసమే. ఎందుకంటే ఎవరు ఎందుకు వ్రాస్తున్నారో వారి వారి మనసులకు తెలిసినట్లుగా మనకి తెలియదుగా. కాని ఈ పరిశీలనవల్ల స్థూలంగా బ్లాగర్లు ఎందుకు బ్లాగులు వ్రాస్తున్నారో తెలిసే అవకాశం మనకి కలుగుతుంది అని ఆశ.
మొదట: తెలుగు బ్లాగ్వరులు ఎందుకు బ్లాగుతున్నారు?
తెలుగు బ్లాగులు కొన్ని పరిశీలించిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్ధమయ్యాయి. చాలా మటుకు బ్లాగులు వ్రాసేవారు తమకి ఆసక్తి ఉన్న విషయాల మీద తమ అభిరుచినీ, అవగాహననీ అభివ్యక్తీకరించడం కోసం బ్లాగులు వ్రాస్తున్నారు. తమ తమ అంతరంగాల్ని ఆవిష్కరించుకొంటున్నారు. అయితే, తద్వారా వారి వారి ఆసక్తులని ఇతరులతో పంచుకోవడం ప్రథమోద్దేశ్యం మాత్రం కాదని తోస్తుంది. కాని ఇతరులు వారి బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయడం వల్ల బ్లాగర్లకి స్ఫూర్తి వస్తోందనడంలో అతిశయోక్తి లేదు. కేవలం తమ ధోరణిలో వ్రాసుకొంటూ పోవడం కాకుండా, చర్చలు జరుగుతోండడంవల్ల విషయపుష్ఠి కలుగుతోంది. అంతే కాకుండా ఒకే రకం అభిరుచులు కలవాళ్ళకి రసాస్వాదనకి తోడు దొరుకుతోంది. అంటే ఆత్మీయుల్నీ, మిత్రులనీ సంపాదించి పెడుతోందన్న మాట ఈ బ్లాగ్ప్రక్రియ. నన్నడిగితే, ఇది ముఖ్యోద్దేశ్యము కాకపోయినప్పటికిన్నీ, సజ్జన సాంగత్యం లభించడం అతి విలువైనదని చెబుతాను.
బ్లాగ్వరులు చెప్పుకొన్నా, చెప్పుకోపోయినా, వాళ్ళు ఎంచుకొన్న విషయాల్ని బట్టి వాళ్ళ బ్లాగుల ఉద్దేశ్యాన్ని చాలా సులువుగా గ్రహించచ్చు. కొన్ని బ్లాగులు రాజకీయాలకి పరిమితమైతే, ఇంకొన్ని సినిమా పాటలందిస్తున్నాయి. కొన్ని బ్లాగులు తమ తమ చిన్ననాటి, గతజీవిత మధురిమలని నెమరువేసుకొంటుంటే, మరి కొన్ని తమ వర్తమాన భావుకతని ప్రదర్శిస్తున్నాయి. కొన్ని కేవలం కవిత్వానికే పరిమితమైతే, కొన్ని వంటలకి. కొన్ని బ్లాగులైతే సాంకేతిక విషయాలను పరిచయం చేస్తున్నాయి. కొన్ని మార్గదర్శక బ్లాగులు కూడా ఉన్నాయి. వీటిలొ మిగిలిన బ్లాగర్లకీ, వికీ రచయితలకీ పనికొచ్చే సూచనలు పెట్టారు. చాల బ్లాగుల్లో హాస్యం తొంగి చూస్తోంటుంది. కొన్నిటిలో అయితే తొంగకుండానే, తిన్నగానే చూసేస్తోంది. కొన్ని బ్లాగులు మటుకు ‘షడ్రుచుల’ సమ్మేళనం. అంటే, అనేక రకాలైన ఆసక్తులు వ్యక్తమౌతున్నయి. కొంతమంది బ్లాగరులు అనేక బ్లాగులు తెరిచిపెట్టారు. పుంఖానుపుంఖలుగా వ్రాయాలన్న వారి ఆకాంక్షను అభినందించకుండా ఉండలేము. ఇక అత్యధిక బ్లాగుల్లో ఉమ్మడిగా కనిపించే విశేషం ఏమిటంటే, తెలుగు భాషమీద మమకారం, సాధికారం. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణా, అక్కడి మాండలికాల మీదైతే ముచ్చటైన బ్లాగు టపాలు కన్పిస్తాయి, తెలంగాణా వారి భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తూ. బ్లాగ్వరులు ఎంచుకొన్న బ్లాగుల పేర్లు కుడా వారి సృజనాత్మకతకి అద్దం పడుతున్నాయి.
బ్లాగుల్లో ఉన్న ఒక అతి విలువైన సౌకర్యమేమిటంటే, మనం ఎవరో చాలామందికి తెలియదు. మన వ్యక్తిత్వం మాత్రమే తెలుస్తుంది, మన టపాలలోని సారాన్ని బట్టి. కాబట్టి అందరం ‘కవు’లయిపోవచ్చు, ఎంచక్కా. అర్ధం కాలెదా? అదేనండి, ‘క’నిపించకుండా ‘వి’సిగించచ్చు. ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళ హావభావాలని బట్టీ, భంగిమలని బట్టీ వారెంత ఉత్సాహం చూపిస్తున్నారో మనకి తెలిసిపోతుంది. మన చర్మం మందాన్ని బట్టి మనం వాళ్ళకి ఎంత విసుగు కలిగించగలమో నిర్ధారించబడుతుంది. తీవ్రవాదులకన్నా రచయితలూ, కవులే ఎక్కువ భయభ్రాంతులు కల్గించగలరని చాలా తెలుగు సినిమాల్లో కామెడీ పాత్రలతో చెప్పించినా కూడ సూటిగానే చెప్పారు. దాంతో మనం తెలుగులో ఏదైనా మాట్లాదడం మొదలుపెట్టీపెట్టగానే జనాలకి విసుగేయచ్చు. బ్లాగడం లోని సుఖం ఇప్పుడర్ధమయ్యే ఉంటుంది. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు’ అనుకొంటూ వ్రాసుకొంటూ పోవడమే.
తదుపరి: నేనెందుకు బ్లాగుతున్నాను?
మనం చాల పనులు ఇట్టే చేసిపడేయగలం. కాని దాన్ని ఎందుకు చేసామో అడిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. బ్లాగులు వ్రాయడం కూడా అలాంటి ఒక పనే అని అనుకొంటాను. వ్రాద్దామనైతే కూర్చొన్నాను కాని తీరా వ్రాయడం మొదలెట్టాక ఎందుకు బ్లాగుతున్నాను అన్న ప్రశ్నకి సమాధానం ఏంవ్రాయాలో అంత తేలిగ్గా స్ఫురించలేదు. కాని మంత్రసానితనానికి ఒప్పుకొన్నాకా ప్రసవం చేయక తప్పదుగా. అందుకనే, ఈ ప్రశ్నని తదుపరి ప్రశ్నగా పెట్టా. స్థలాభావం వల్ల ఎక్కువ వివరంగా వ్రాయలేకపోతున్నందుకు పాఠకులు క్షమించాలి అని తప్పించుకోవచ్చని. హ హ హ. తెలివిలో తెనాలిని మించిపోలే!
ఎందుకు, ఏమిటి, ఎలా అని మూడుప్రశ్నలకి సమాధానం తెలుసుకొంటే గొప్పవాళ్ళైపోవచ్చని ఒక సినిమాలో సౌందర్య బాబూ మోహన్‌కి చెప్పి కీర్తి శేషురాలైపోయింది పాపం. నేను ఈ మూడు ప్రశ్నలకీ జవాబు చెప్పి ఈవ్యాసం చదివినవారినందరినీ గొప్పవాళ్ళని చేసేద్దామనుకొంటున్నాను. ముందుగా ‘ఎలా’ మొదలుపెట్తాను. ఇక్కడ కొరియా తెలుగు వాళ్ళు ఒక యాహూ గ్రూపు ఒకటి నడుపుతున్నారు. అందులో మన సుధాకర్‌గారి తెలుగోపకరణాల పట్టీ లంకె ఒకరు మెయిల్లో పెట్టారు. అది స్థాపించి చూస్తోంటే తెలుగు బ్లాగూ, కూడలీ కనిపించాయి. అంతకు ముందే యాహూ 360 బ్లాగును గురించి తెలుసుకోవడం, వేంటనే ఒకే ఒక్క ఆంగ్ల బ్లాగు వ్రాసేయడం జరిగిపోయాయి. అది ఏకోనారాయణ బ్లాగు. రెండోది ఇప్పటి దాకా వ్రాయలేదు. కాని తెలుగు బ్లాగులు చూసి మహా ఉత్సాహం వచ్చేసింది. కొరియాలో ఉన్న ఒక మిత్రుడు చి.కిశోర్ అప్పటికే తెలుగులో ఒక బ్లాగు మొదలుపెట్టాడు. నాకు కొద్దిగా ఓనమాలు నేర్పాడు. దాంతో బ్లాగ్స్పాట్లో నా పేరు నమోదు చేసి మొదటి బ్లాగు వ్రాసా. దానికి ముందు బ్లాగుకి బారసాల చేయాలికదా. మా పిల్లల పేర్లయితే మాఆవిడకొదిలేసా, నిర్ణయభారం తప్పించుకోవచ్చని. కాని బ్లాగుపేరు నేనే నిర్ణయించవలసి వచ్చింది. ‘సమయానికి సలహా చెప్పడానికి మాఆవిడకూడా ఊళ్ళో లేదు.’ అందుకని ఎక్కువ బుర్ర పెట్టకుండా, నాపేరు లోంచి ఒక ముక్క, నా వృత్తి ధర్మం (పరిశోధన) లోంచి ఒకముక్కా కలిపి సత్యశోధన అని నామకరణం చేసా.
ఆనక ‘ఏమిటి’ వ్రాయాలన్నది సమస్య అయింది. చాల బ్లాగులు చూసాక ఏదైనా వ్రాయచ్చు, అంతగా లక్ష్మణ రేఖలు లేవని తెలిసింది. ఇంకేం. విరగబడి మొదటి బ్లాగు వ్రాసేసా. పాపం తెలుగు బ్లాగ్భీష్ములు కొంతమంది స్వాగత ప్రోత్సాహక వచనాలు పలికేరు. మనిషి మనస్తత్వం ఉంది చూసారూ, బహు ప్రమాదకారి. ఈ మధ్య మా స్టూడెంటునొకడ్ని, మరీ ఫెయిలయ్యేటట్టున్నాడని ప్రోత్సాహకంగా నీ ఎస్సైన్మెంటు బాగుంది అని అన్నా. ఆనక, నన్ను అందరిముందు క్లాసులో పొగిడారు కదా, నాకు తక్కువగ్రేడు ఎందుకు వేసారని దెబ్బలాడాడు, క్విజ్ వ్రాయకుండా, మధ్యంతర పరీక్షల్లో కేవలం ౫ శాతం మార్కులు తెచ్చుకొని మరీని. నేను కూడ ఆకుర్రాడి మాదిరే, నన్నే కదా పొగిడారని చెప్పి వారానికొకటి చొప్పున వ్రాసిన బ్లాగు వ్రాయకుండా ఏది తోస్తే అది వ్రాసుకొచ్చాను ఇప్పటిదాకా. మెచ్చుకోవట్లేదేమని దెబ్బలాడనని మాత్రం హామీ ఇస్తున్నాను.
ఎంత వెనక్కి తోసినా ‘ఎందుకు’ అన్న ప్రశ్న వస్తూనే ఉందండి బాబొయ్. ఇంక లాభం లేదు చెప్పేస్తున్నా.
ఏల బ్లాగింతును?
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల సత్యసాయి ‘బ్లాగించు’ నిటులు
మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల ‘బ్లాగుటేల’?
పరుల తనయించుటకొ? తన ‘బ్లాగు’ కొరకొ
‘బ్లాగు’యొనరింపక బ్రతుకు గడవబోకొ?
సాహిత్యాభిమానులు క్షమించాలి. ఇది కృష్ణశాస్త్రి కవితకి కొద్ది పదాల మార్పు. మూలం ఇది:
ఏల ప్రేమింతును?
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల పాడుటేల?
పరుల తనయించుటకొ? తన బాగు కొరకొ
గానమొనరింపక బ్రతుకు గడవబోకొ?
‘ఎందుకు ప్రేమిస్తున్నాను’ అన్న ప్రశ్నకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇచ్చిన దాని కన్న మిన్నైన సమాధానం, ‘నేనెందుకు బ్లాగుతున్నాను’ అన్న ప్రశ్నకి నేనివ్వలేను కాబట్టిన్నీ, శాస్త్రి గారు ఎందుకు ప్రేమిస్తున్నారో, సరిగ్గా అల్లాంటి కారణంగానే నేను కూడా బ్లాగిస్తున్నాను కాబట్టిన్నీ, ఆయన కవితనే కొద్ది పదాల మార్పుతో నా సమాధానంగా వ్రాసాను. మళ్ళీ ఒకసారి క్షమించమని కోరుతూ- భవదీయుడు సత్యసాయి
కొవ్వలి గారి కొరియాకబుర్లు నాకు చాలా ఇష్టం.కబుర్లు అంటూ కాలక్షేపం లా మొదలు పెట్టి చాలా విజ్ఞానాన్ని అందించారు.ఇక నెను బ్లాగు ఎలా మొదలు పెట్టాను అంటే అభిసారిక గారి బ్లాగు లింకు ఎదొ ఫారంస్ లో చూసి నేను నా కవితలకు ఒక బ్లాగు మొదలు పెట్టాను.ఇంతకుమునుపు భారత దేశం లోని నా స్నేహితులకు నా కొత్త కవితలను ఈ-మేఇల్స్ ద్వారా పంపేదానిని.అదికూడా ఆంగ్ల అక్షరాలలో రాసి పంపించాలిసి వచ్చేది.[నా కవితలను ఇష్టపడేవాళ్ళంటూ వున్నారంటే వాళ్ళు నా మిత్రులే.ఏ కొత్త కవిత రాసిన వాళ్ళకి పంపించాలిసిందే.లేకపోతే అలుగుతారు మరి.వారి ప్రోత్సాహమే నా కవితలకు ఊపిరి] బ్లాగు రాయడం వల్ల వాళ్ళు ఎప్పటికప్పుడు చదివే వీలుంటుందని నేను బ్లాగు మొదలు పెట్టాను.మరి దాట్ల గారికి,సి.బి.రావు గారికి ఎలా తెలిసిందో నా బ్లాగు గురించి వాళ్ళు కామెంట్లు రాసేవారు.తరువాత వాళ్ళ ద్వారా కూడలి గురించి,లేఖిని గురించి తెలిసింది. ఇలా బ్లాగు మొదలు పెట్టడం వల్ల ఎందరో సాహితి మిత్రులును కలుసుకోగలిగాను.నన్ను ప్రొత్సహిస్తున్న బ్లాగ్మిత్రులందరికి నా కృతజ్ఞతలు.
అసలు నాకు బ్లాగు అంటేనే ఏమీ తెలీదు. కాని నన్ను ప్రోత్సహించి ముందుకు తోసారు మన బ్లాగు మిత్రులు.అలా ఒకటి ఒకటి అంటూ వరుసగా నాలుగు విభిన్న బ్లాగులు మొదలు పెట్టి ఎంతో మంది అభిమానాన్ని పొందాను. నిజంగా ఇందులో మిత్రులు ఇచ్చే వ్యాఖ్యలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నేను బ్లాగులు ఎందుకు మొదలు పెట్టానంటే.మొదటినుండి నాకు సరదాగా ఉండటం, వంటలు, పాటలు అంటే చాల ఇష్టం. కాని ఈ సంసార సాగారంలో మునుగుతూ తేలుతూ అన్ని మర్చిపోయాను. కాని ఈ బ్లాగుల వల్ల నాలో ఉన్న ఈ తృష్ణ ఇలా తీర్చుకోగలిగాను అని అనుకుంటున్నాను.ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది..ఈ బ్లాగుల వల్ల ఎంతో మంది అభిమానులను పొందగలిగాను. కనీసం నా బ్లాగుల వల్ల కొందరికైనా కొంచమైనా ఉపయోగము కలుగుతుందని తెలుసుకుని సంతోషిస్తున్నాను.నా సరదా బ్లాగువల్ల కొందరికైనా కనీసం దరహాసం తెప్పిస్తున్నాను అని నమ్ముతున్నాను ఈ వ్యాఖ్యలను బట్టి.సత్యసాయిగారన్నట్లు బ్లాగుల వల్ల ఆ వ్యక్తి యొక్క స్వభావం అభిరుచులు చాల వరకు అవగతమవుతాయి.
తెలుగు బ్లాగరులు ఎందుకు బ్లాగుతున్నారో ఇంత చక్కగా, సంక్షిప్తముగా విశ్లేషించడంలో మీకు మీరే సాటి సత్యసాయి గారూ. బ్లాగోత్సాహము పద్యము అదిరింది. కొరియా అని నా మదిలో మెదిలినప్పుడల్లా మీరే జ్ఞప్తికి వచ్చేటట్లు చిరకాలము చెరగని ముద్ర వేశారు మీ కొరియా కబుర్లతో.
“నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే గాక నాకేటి వెరపు” అంటూ బ్లాగు రాయడాన్ని వెటకారమాడినట్లనిపించినా చివరకు కృష్ణ శాస్త్రి గారి కంటె మిన్నగా నేనివ్వగలనా అంటూ గంభీరంగా బ్లాగు ఎందుకు రాస్తున్నామొ చెప్పినందులకు కృతజ్ఞున్ని. మీరన్నట్లు ఇంతకంటె గొప్పగా చెప్పలేం.
మీ వ్యాసం చదువుతున్నంతసేపు గిలిగింతలు పెట్టిందంటే నమ్మండి. “కవి”కి అర్థం చెప్పినప్పుడూ, మీ బ్లాగు పేరు మీరే నిర్ణయించాల్సిన దురవస్థకు, మీ విధ్యార్థి దెబ్బలాట భలే నవ్వు తెప్పించాయి.
నా మట్టుకు నేనైతే స్కూలు, కేలేజీ రోజుల్లో డైరీ రాస్తూ అందులోనే కవితలు, కథలు, బాధలు రాసేవాన్ని. ఇక సంసారసాగరంలో పడ్డాక అందుకు సమయమంటూ లేకపోయింది. అదీగాక రాసినా చూసేవాళ్ళు లేరు, ప్రోత్సహించేవాళ్ళు అంతకన్నా లేనప్పుడు రాయాలనే కుతూహలం దానంతటదే సమసిపోయింది.
ఇప్పుడు మళ్ళీ ఆ సువర్ణాధ్యాయాన్ని బ్లాగులు సుసాద్యం చేశాయి. అంతకంటే గొప్పగా ఒకే అభిప్రాయాలున్న వాళ్ళని(ఒకే అభిప్రాయాలున్న వాళ్ళంతా సజ్జనులై వుండాల్సిన అవసరం లేదు. అందుకే దీన్ని సజ్జన సాంగత్యము అనలేకపోతున్నా!) భూగోళమ్మీద ఎక్కడవున్నా చేరువ చేసింది.
–ప్రసాద్
http://blog.charasala.com
ఆహా…ఏమి చమత్కృతి. అందమైన అనుకరణ పద్యం. తెలుగు బ్లాగర్ల మనోభావాలను అచ్చుగుద్దినట్టు వివరించారు.
మీ స్ఫూర్తితో నాదో అనుకరణ పద్యం…
“తెలుగుబ్లాగేలయన్న తల్లిబాస తెలుగేను
తెలుగు బ్లాగరి నేను తెలుగొకండ!
ఎల్లవారలు చదువగా ఎరుగవే బ్లాగాడి
దేశి బ్లాగులందు తెలుగు బ్లాగు లెస్స!”
– డా.ఇస్మాయిల్ పెనుకొండ
“బ్లాగోత్సాహం” అదిరింది సత్యసాయిగారూ మీ “కొరియా కబుర్ల” లాగే. మీకొచ్చిన అనుమానం లాంటిదే, అదేనండి- ఎందుకు బ్లాగలి,ఏం బ్లాగాలి -, అన్నవి నాకూ అనుభవైక్యమే. ఏం బ్లాగుతున్నానో తెలిసిందే అయినప్పటికి, ఎందుకు బ్లాగుతున్నానో నాకే అర్దం కావడం లేదు. కాకపోతే నా బ్లాగును తరచుగా దర్శించి, సంధించ మీ బోంట్ల వ్యాఖ్యలే ప్రేరణ గా ముందుకు సాగిపోవాలని ఆకాంక్ష.
బ్లాగకపోవడానికి సవాలక్ష కారణాలు చెప్పవచ్చుకాని ఎందుకు బ్లాగుతున్నామంటే చేప్పడం కష్టం. “బ్లాగటం నా నైజం” అని కృష్ణశాస్త్రిగారి పద్యాన్నుదహరించి బ్లాగరులందరీ హృదయాలు హత్తుకునేలా బహు బాగా చెప్పారు!- బ్లాగమని నన్నడగవలెనా పరవశించి నే బ్లాగనా అన్న చందాన!!
mee padyalu bhale bagunnayi.mi andari utsaham chusi chala uttejamu vachindi.
మీనుండి నేర్చుకోవలసింది చాలా చాలా వుంది గురువుగారూ. బహుశా చాలా పుస్తకాలు చదివివుండటం మూలాన్ననుకుంటాను, రాయటంలో మీకు బహుముఖ ప్రజ్ఞ వుంది. మీరు నాకొక ధృవనక్షత్రం.
Mee rachanalu amoghanga vunnaai. Inkenduku aalayam satyaanni sodhidaam randi.