అనాదిగా అతీంద్రియ శక్తులపై మానవుడు పెట్టుకున్న వివిధ నమ్మకాల గురించి డా. కొడవటిగంట రోహిణీప్రసాద్ చర్చించిన వ్యాసం ఇది.
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
అతీంద్రియ శక్తుల గురించిన భావనల్లో ప్రతివారికీ భౌతిక శరీరంతోబాటుగా, దానికి భిన్నమైన ఒక ఆత్మ వంటిది ఉంటుందన్న నమ్మకం ప్రధానమైనది. శరీరం భౌతికంగా నశించిపోయిన తరవాత కూడా ఆత్మకు అస్తిత్వం ఉంటుందని చాలామంది నమ్ముతారు. మానవచరిత్రను పరిశీలిస్తే ఇటువంటి నమ్మకాలు ఆటవికదశలోనే రూపొందినట్టు తెలుస్తుంది. నిద్రలో కలలు కంటున్నప్పుడు ఆత్మ శరీరం నుంచి వేరయి, లోకమంతా కలయదిరుగుతున్నట్టు అనిపిస్తుంది. చావుకూ, నిద్రకూ పోలికలున్నట్టు ఆదిమానవులు భావించారంటే విడ్డూరం లేదు. “దీర్ఘనిద్ర” తరవాతకూడా ఆత్మ స్వేచ్ఛగా తిరుగుతూనే ఉండాలి. దానికి చావు ఉండదు.
నిరూపణ అవసరంలేని ఇలాంటి “నిరపాయకరమైన” నమ్మకాలు ఎవరినీ బాధించవు సరికదా, కొంత ఊరటను కూడా ఇస్తాయి. అభ్యంతరమేదీ లేకపోవడంతో ఆనాటి ప్రజలు తమ శరీరాల్లో నశించలేనిదేదో ఉందనీ, అది భౌతిక శరీరంతో సంబంధంలేని పదార్థమనీ నమ్మసాగారు. ఈ ఆత్మ అనేది శరీరాన్ని శాసించి, నియంత్రించగలదు. నిద్రలోనూ, మెలకువగా ఉన్నప్పుడూ కూడా అద్భుతాలు సాధించగలదు. మన తెలివితేటలకూ, జ్ఞానానికీ అదే కారణం. అందుచేతనే కాటికి కాళ్ళు చాచుకున్న వృద్ధులు కూడా వివేకంతో మాట్లాడతారు. మరికొద్ది రోజుల్లోనే వారు చనిపోతారన్నమాటే గాని, మరి వారి అనుభవమూ, జ్ఞానసంపదా “ఎక్కడికి పోతాయి”? ఎక్కడికీ పోవు. వారి తరవాత కూడా ఆత్మ రూపంలో కొనసాగుతాయి. వడిలి, జబ్బులతోనూ, వయస్సుతోనూ కృశించి, శిథిలమైపోయిన వారి శరీరాలు మిగలవు కాని ఆత్మ సంగతి వేరు. దానికి వయస్సుతోనూ, చావుతోనూ నిమిత్తంలేదు.
మనుషులు ఒకచోటినుంచి మరొకచోటికి వలసపోవడం ఆదిమానవులకు తెలుసు కనక ఎన్నో ఏళ్ళుగా “అలవాటుపడ్డ” శరీరాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం ఆత్మకు కూడా ఏదో ఒకనాడు కలుగుతుందనేది వారికి సహజంగానే అనిపించి ఉంటుంది. అదొక మహాప్రస్థానం. బాల్యం, యవ్వనం, వార్థక్యం వగైరాలలాగే జీవితంలో అది మరొకదశ. ఎటొచ్చీ అది “ఇహలోకానికి” సంబంధించినది కాదు. ముసలితనంలో పోనుపోను ఆప్యాయతలూ, అనురాగాలూ తగ్గుతాయి. జీవితంలో రకరకాల అనుభవాలు పొందినవారికి ఇలా తమవారికి దూరమవడం తెలిసిన విషయమే. ఈనాటికీ మత బోధకులూ, ప్రవచనాలు చేసేవారూ ఇదేరకం ఇమేజరీ ఉపయోగించి ఆధ్యాత్మిక భావాలను ప్రచారం చేస్తారు. వారికి మరణానంతర అనుభవమేదీ లేకపోయినా “అన్ని బంధనాలూ తెంచుకున్న” ఆత్మను గురించి నమ్మబలుకుతూ వారు నెలల తరబడి ఉపన్యాసాలిస్తారు. వినేవాడెవడూ “నీకిదంతా ఎలా తెలుసు నాయనా” అని అడిగిన పాపాన పోడు.
నిద్ర అనేది ఏమిటో, నిద్రలోనూ, మెలకువగా ఉన్నప్పుడూ మన మెదడు ఎలా పనిచేస్తుందో, ఆలోచనలకూ, ఊహలకూ, భావాలకూ, కలలకూ ఎటువంటి సంబంధం ఉంటుందో ఈనాటికీ చాలా మందికి తెలియదు కనక ఇవన్నీ కలగలిసిపోయి ఆత్మ, ప్రేతాత్మ వగైరాల గురించిన అమాయకమైన అపోహలు అందరిలోనూ కనబడతాయి. బాహ్యప్రపంచంతో ఏమాత్రమూ సంబంధం లేనట్టు అనిపించే కలల ప్రపంచం మనలో “మరేదో” లోకంలో భ్రమిస్తున్న భావనను కలిగిస్తుంది. మన దేవుళ్ళందరూ సామాన్యంగా మనకు కలల్లోనే “సాక్షాత్కరిస్తూ” ఉంటారు. పరలోకాన్ని దాదాపు కళ్ళారా చూస్తున్నట్టే మన కనిపిస్తుంది. ఇది శ్రుతిమించి రాగాన పడ్డప్పుడు నిజంగా కనబడుతున్నదంతా మాయ అనీ, కలల ప్రపంచమే నిజమైనదనీ ప్రతిపాదనలు మొదలవుతాయి.
ఆదిమయుగంలో మనుషులు ఇంతగా అనుకోలేదు కాని ప్రేతాలనూ, భూతాలనూ నమ్మారు. వీటికి ఉనికి అంటూ ఉండదు. విచ్చలవిడిగా సంచరిస్తూ బతికున్నవారిని ఇబ్బందిపెడతాయి. వీటికి “శాంతులు” చేయించటానికి పెద్ద తతంగం అవసరమయింది. తరవాతి కాలంలో మతాలకు దారితీసిన పూజలకూ, తంతులకూ అదే మూలకారణం. ఈ ప్రేతాత్మలను “ప్రార్థిస్తే” కొంత ఉపయోగం ఉంటుందని భావించేవారు. గణాచారులూ, పూజారులూ, కులపెద్దలూ నాయకత్వం వహించి ఆటవికులకు “దారి” చూపిన ఆ కాలంలో మతమన్నా, గారడీ అన్నా, చేతబడి అన్నా, సైన్స్ అన్నా అంతా ఒక్కటిగానే ఉండేది. ఇందులో వ్యక్తిపరమైన స్వార్థంకన్నా తమ తెగకు మొత్తంగా మంచి జరగాలనే కోరికే ఎక్కువగా ఉండేది.

తమ పరిసరాలమీదా, వాతావరణంమీదా ఆధారపడి, వాటి “అనుగ్రహానికి” లోబడి జీవిస్తున్న ఆనాటి ప్రజలకు వానలూ, వరదలూ, వాటంతటవే తగలబడే అడవులూ ఒక్కొక్కప్పుడు ప్రాణాంతకంగా ఉండేవి. అందుచేత “మేజిక్” వంటి తాంత్రిక శక్తులద్వారా “గారడీ” చేసి, ప్రకృతితో సంబంధం నెరిపి, దాన్ని లోబరుచుకునేందుకు ఆదిమానవ సముదాయాలు ప్రయత్నించాయి. ఈ తంతులన్నీ రోజువారీ జీవితాలకి పనికొస్తాయనే వారు భావించారు. ఇందులో అప్పటికి “ఆధ్యాత్మికత” ఏమీ ఉండేదికాదు. చేసిన కర్మకాండకు ఫలితం ఉంటుందని నమ్మి అందరూ పాల్గొనేవారు. సామూహికంగా అందరూ “గట్టిగా” కలిసి కోరుకుంటే ఏదైనా జరుగుతుందని నమ్మేవారు. వానలు పడక క్షామం వచ్చినప్పుడు అమెరికాలోని ఆటవికులు “వానాట” ఆడేవారు. తామంతా కుండపోతగా కురుస్తున్న వర్షంలో తడిసి ముద్దవుతున్నట్టు తలమీద కప్పుకుని పరిగెత్తి ప్రకృతిని “ఫూల్” చేసేవారు. అంత మంది నమ్మకంగా వానొచ్చినట్టు పరిగెత్తుతూ ఉంటే నిజంగానే వర్షం పడకపోతుందా అని వారి ఉద్దేశమేమో. అలాగే తమకు తెలిసిన జంతువుల రూపాల్లోనూ, మనుషుల రూపాల్లోనూ బొమ్మలు చేసి వాటికి పూజలు చేసేవారు. తమకు కావలసినవి జరిగేదాకా వాటిని ప్రార్థించి, అవసరమైతే తిట్టి, కొట్టి, బతిమాలి ఎలాగో అలా అవస్థలు పడుతూ ఉండేవారు.
గుహల్లో నివసిస్తూ ఏ అడవిదున్ననో వేటాడి పొట్టపోసుకునే దశలో అడవిదున్న దొరకక పోవడం వారికీ, వారి తెగకూ చావుబతుకుల సమస్యగా పరిణమించేది. అలాంటి పరిస్థితుల్లో అడవిదున్న తమపై “కరుణించి” తమకు ఆహారం అయిందన్న కృతజ్ఞతాభావంతో వారు దున్నకు పూజలు చేసేవారు. చచ్చిన దున్న తోలు కప్పుకుని ఒకడు నృత్యం చేస్తే తక్కినవారు మళ్ళీ దాన్ని వేటాడినట్టు అభినయించేవారు. తామూ, తమ పశుసంపదా కలకాలం పచ్చగా ఉండాలని కోరుకునే సామాన్యమైన కోరికలు ఋగ్వేదం ప్రారంభంలో ఉన్నాయట.
ఇలా అడుగడుగునా కష్టాలుపడి బతికేరోజుల్లో వారి కళ్ళకి ప్రకృతిశక్తుల వెనక ఏదో “అదృశ్య హస్తం” కనబడేది. ప్రతి చెట్టులోనూ, సెలయేరులోనూ ఏవేవో శక్తులూ, భూతాలూ ఉండి తమ జీవితాలకు మంచినీ, చెడునీ చేస్తున్నాయని వారు భావించారు. వాటిని తమకు అనుకూలం చేసుకోవడానికి ఎంతో శ్రమపడి మంత్రతంత్రాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా చేసినప్పటికీ ప్రకృతిశక్తులు అనుకూలించనప్పుడూ, అవి తమకు అర్థంకాక, తమ చెప్పుచేతలలో లేనట్టుగా అనిపించినప్పుడూ మతపరమైన వివరణలు ఇవ్వప్రయత్నించేవారు. దేవతలకు మనుషుల మీద “కోపం” వచ్చిందని చెప్పేవారు. ఇదేమీ ఆధునికయుగంలో హాస్యాస్పదంగా అనుకోనక్కర్లేదు. ప్రకృతిని “ఏదో పవరు” నడిపిస్తుందనీ, “అహంభావాన్ని” విడనాడి “ఆ సర్వేశ్వరుడికి” తలవంచాలనీ చెప్పే ఆధునికప్రవక్తలు ఏ ఉద్దేశంతో చెప్పినప్పటికీ ఆదిమయుగం దాటి ముందుకు వచ్చినట్టుగా అనిపించరు. మనకి తెలియని విషయాలకు “అదృశ్యహస్తమే” కారణమని అనుకోవడంలో వీరంతా ఆటవికులే. జ్ఞానమూ, విజ్ఞానమూ లోపించిన ప్రతి చోటునూ మతవిశ్వాసాలు ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి.
ఇదంతా నమ్మకాలున్నవారిని వెక్కిరించడానికో, కించపరచడానికో రాసిన విషయంకాదు. మానవజాతి శైశవదశలో ఉన్నప్పుడు వారి బుద్ధీ, ఆలోచనలూ కూడా శైశవదశలోనే ఉండేవని కొందరు శాస్త్రవేత్తల ఉద్దేశం. కాలికి బల్ల తగిలి బాధ కలిగితే చిన్నపిల్లలు బల్ల సజీవమైనదయినట్టూ, తమను బుద్ధిపూర్వకంగా బాధించినట్టూ ఊహించుకుంటారు. పెద్దవాళ్ళు కూడా అందుకు అనుకూలంగా బల్లను తిరిగి కొట్టి దానికి ‘బుద్ధి’ చెప్పినప్పుడే పిల్లలకు ఉపశమనం కలుగుతుంది. అడవుల్లో రేగిన కార్చిచ్చులూ, కష్టాలపాలు చేసే తుఫానులూ అన్నీ ఎవరో తమను బాధించడానికే చేస్తున్న పనులనీ, తమకు ఆహారం అయిన దున్న తమను ‘కరుణించిందనీ’ భావించిన ఆదిమానవుల భావనలే మతాలకు పునాదులు అయాయి. ఈ రోజుల్లో చాలా ఉదాత్తస్థాయిలో మతబోధ చేస్తున్నామనుకుంటున్నవారి మనస్తత్వం, అవన్నీ నిజమనుకునేవారి వైఖరీ ఆనాటి ఆదిమలక్షణాలని అధిగమించలేనేదు. అసమానతలు పెచ్చుపెరిగిన సమాజ పరిస్థితుల వల్లనూ, తమ మెదళ్ళలో శారీరకంగా తలెత్తే గందరగోళంవల్లనూ అయోమయానికి గురయే కోట్లాది సామాన్యులను ప్రపంచ వ్యాప్తంగా తప్పుదారులు పట్టించే మతాలన్నీ ఇటువంటివే.
-----------------కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు(
http://rohiniprasadk.blogspot.com,
http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.
వ్యాఖ్యలు
సర్ !అతీంద్రియ శక్తులూ ఆటవిక మనస్తత్వం వ్యాసం మొదటి నుండి చివరి వరకూ చాలా ఆసక్తి కరంగా ఉంది .నిరపాయ కరమైన నమ్మకాలు అన్నారు నిజమే ....ఇప్పటి విద్యావంతులమని చెప్పుకుంటూ ఉంగరాలకూ ,రంగు రాళ్లకూ ,దొంగ బాబాలకూ వేల కు వేలు తగలేసే మూఢ నమ్మకాలంటే వారి నమ్మకాలు నిజంగా నిరపాయకరమైనవే .ఇక ఆత్మను గురించిన వారి నమ్మకం భగవద్గీతలో కృష్ణ పరమాత్మునిచే చెప్పబడినదని (ఆత్మ నాశనం లేనిదని ) ఇప్పటికీ అందరూ నమ్మే నమ్మకం .అప్పట్లో ఆటవికులు మనుషులు ,జంతువుల బొమ్మలకూ ,చెట్లకూ చేసిన పూజల ద్వారానే బహుశా నేటి మనం పూజించే దేవుళ్ళ రూపాలు ఏర్పడ్డాయేమో అనిపిస్తుంది . పూర్వం ఆటవికులు వర్షాలకోసం ....జంతుబలులూ ఇచ్చేవారని విన్నాను .అదే ఇప్పటికీ గ్రామదేవతలకు బలులిచ్చే ఆచారంగా ఉండిపోయిందని విన్నాను .అలాగే పూర్వం యజ్ఞయాగాదులలో కూడా జంతు బలి ఆచారంగా ఉండేదట .అతీంద్రియ శక్తుల కోసం ఆటవికులనుండి ,ఆధునిక మానవుని వరకూ సాగిస్తున్న (నిజమైతే ) ఈ బలుల గురించి మీరు ప్రస్తావించలేదు .మరో టపాలో ఆశిస్తున్నాము .మూఢ నమ్మకాల పట్ల చక్కని అవగాహన కలిగించే వ్యాసాన్ని పరిచయం చేశారు .ధన్యవాదాలు సర్ .
బలులనేవి మనుషులు తినడానికే. మనవాళ్ళు ఈ రోజుల్లో నాజూగ్గా పెట్టే నైవేద్యాలకు అదొక పూర్వరూపం. మనం ఏదైనా మంచి వస్తువు తినేముందు మనకు మంచి చేస్తున్న అదృశ్యశక్తులకు వాటిని సమర్పించినట్టు నటించడం ఒక ప్రాచీనసంప్రదాయం. తొలి ఆర్యులు నిర్వహించిన తంతుల్లో అగ్నిహోత్రమూ, అందులో వివిధ దేవతల పేరున బలులిచ్చి వారిని ఆవాహన చెయ్యడమూ ముఖ్యమైన అంశాలు. అయితే బలులనేవి ప్రాచీమమతాలన్నిటిలోనూ ఉండేవి. మనకన్నా పురాతనమైన సుమేరియన్, ఈజిప్ట్ నాగరికతల్లో ఇవి సామాన్యమే. బడుగు ప్రజలు సమర్పించుకున్న నైవేద్యాలను పూజారులు ఆరగించడం క్రీస్తుకు 3 వేల ఏళ్ళ క్రితమే మొదలయింది. మతాలు ఎలా మొదలయాయో, అవి ఎందుకు బలపడ్డాయో వివరించే వ్యాసాలు పాఠకులకూ, సంపాదకులకూ ఆసక్తి ఉన్నట్టయితే పంపగలను.
మన గురించి మనం తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తి దాయకమే .ధన్యవాదాలు సర్ !
I think language has caused several problems for the mankind. Scientists use a different language to refer to the same thing the spiritual people would refer to. While Darwin said the evolution of mankind has taken the form from the fish (life in water),the turtle (life in water and land), the pig. etc and then there is monkey which derived into man. The religeous people in India say that Lord Vishnu has taken ten incarnations starting from the Fish (matsyavatara), the tortoise (kurmavatara), the boar (varahavatara), etc. on to the neanderthal avataras like vamana,Sri Rama and Sri Krishna etc. Language has not been matured enough to be able to communicate properly. Today anything we speak is being misunderstood by several people. The problem is the untruth (lies). When somebody says some event has happened, there are very less chances that we are willing to beleive him. Today each newspaper is also biased in giving the same information. When we see a vision (a dream or imagination in our language) we have coined a word imagination and began using it. The untruth has thus become part and parcel of our life. Our ancestors did not have the concept of imagination and visualization.
Whatever vision they had, they believed it is true. To understand truth, we must be closer to truth.
Darwin received the same vision as the religious seers did. Truth can only be discovered by a meditative person. To me there is no such thing as imagination. Imagination is a word coined by the modern man who believed in the concept of lies.
Even the bigbang theory has the same equivalent in religion called brahmandam.
The Advaita Vedanta proposed by Sri Adisankaracharya is also the same beleived by the modern scientists today. Until microscope was invented, we could not see micro organisms. So for us, microorganism is not truth before. When the capacity of microscope was increased due to modern science, we are able to see further smaller particles called protons, electrons and neutrons. Scientists are now clear that the world is made up of the same particle that Sri Adisankaracharya was speaking about.
Until the language matures into something, we must be meditative to understand and experience the truth as it is. How many of us know how we are breathing and how our heart is beating. Are we doing it? If we are doing it, can we stop them? If we can not stop our heart from beating, how can we say that we own our body? While scientific research must continue, care must be taken to understand the language used by our ancient religious people.
Talk to the person living in sixth century about the telephone device that is developed in future and he would not believe it.
@శ్రీకాత్ గార్లపాటి
"వేదాల్లో అన్నీ ఉన్నాయష" అని సామాన్యంగా అనుకునే విషయాన్నే మీరు మరో విధంగా చెపుతున్నారు. దశావతారాల గురించి మన వారు చెప్పింది శాస్త్రీయత అనలేం. విష్ణువు మత్స్యావతారం ఎత్తినపుడు ఇతర దేవతలే కాదు, మనుషులు కూడా ఉంటారు. అలాంటప్పుడు అది పరిణమ మెలా అవుతుంది? ఇక డార్వినేమో జీవ పణామాన్ని శాస్త్రీయంగా పరిశోధించి సిద్ధాంతీకరించాడు.
అలాగే బ్రహ్మాండం. తల ఎత్తి ఆకాశం లోకి చుస్తే అంతరాళం మొత్తం ఒక పెద్ద అండంలా కనపడుతుంది. ఆ కాలం లోని ఆలోచనా పరులెవరైనా (ఈ విషయంలో శంకరుడు) బ్రహ్మాండమని సంభోధించంలో పెద్ద వింతేమీ లేదు. బిగ్ బ్యాంగ్ థియరీని దానితో జోడించడం అంతే సైన్సు విజయాలను తక్కువ చెసే ప్రయత్నం తప్ప మరోటి కాదు.
ఆరో శతాబ్దం మనిషికి ఆరొ శతాబ్దం మనిషే చెప్పగలడు. అప్పుడు టెలిఫొన్ గురించి ఎవరైనా ఊహించినా అది ఊహాజనితమె అవితుంది కాని సశాస్త్రీయం కాదు. కాబట్టి ఆ కాలం లోని వారు టెలిఫోన్ ఉందంటే నమ్మాల్సిన అవసరం లేదు. అలాగే ఈ కాలంలో నిరూపణ లేకుండా ఎవరేమి చెప్పినా భవిష్యత్తులో నిజమౌతుందెమో, నమ్మితే అపాయమేమీ లేదు కదా అని నమ్మడం సరయిన విషయం కాదు.
To understand a few things the plane of thought must be the same between us. Otherwise proving would have no meaning. I would say that the entire mathematics has come from hypothesis (concepts). It starts when we have taken into acceptance numbers exist. There was a time in this world when people did not know about 0 (zero). The mathematics of that age is different. If you take geometry, we believe that there is a division of line for shapes like rectangle, square, circle etc to occur. Suppose our house is of square shape and there is a wall preventing our neighbour's space from us. The wall however thin it might be, must occupy either completely my space, completely his space or equal space. When we are saying there is a division, why is the space involved in that? Even if the wall were having the thickness of the size of atom, it would still be occupying some space. Great efforts have been taken to find out the value of pi (see http://en.wikipedia.org/wiki/Pi ) that helps in formulae for circle shape.
"నిరూపణ లేకుండా ఎవరేమి చెప్పినా భవిష్యత్తులో నిజమౌతుందెమో, నమ్మితే అపాయమేమీ లేదు కదా అని నమ్మడం సరయిన విషయం కాదు"
నేను మీతో ఈ విషయము లో ఏకీభవిస్తున్నాను. స్వామి వివేకానందుడు కూడా ప్రతి విషయమును అనుభవపూర్వకముగా తెలిసికొన్నారు.
నా విషయములో నేను కూడా అంతే. అనుభవపూర్వకముగా భగవంతుని తెలిసికొనుట జరిగింది. నేను భగవంతుని గురించిన అనుభవపూర్వకముగా తెలిసికొననంతవరకు నేను కూడా నమ్మలేదు. స్పష్టమయిన అవగాహన నాకు వచ్చినది కాబట్టి నేను సంతోషముగా వున్నాను. స్పష్టత గురించి ప్రయత్నం చేయండి.
ఎలా నిరూపిస్తే 'సశాస్త్రీయంగా నిరూపణ' అని మీరు భావిస్తారో అలాగే నిరూపణ కోసం ప్రయత్నం చేయండి.
శ్రీకాంత్ గారూ, భగవంతుడి సంగతి వదిలేస్తే, ముందుగా అనుభవం అంటే ఏమిటో, తెలుసుకోవడం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇటువంటి సంగతుల గురించి నా వ్యాసాల్లో చర్చించాను. ఇది కాస్మిక్ యుగం. ఏ ప్రాణి గురించి ఆలోచించినా, జీవరాశి విషయంలోనైనా విశ్వం పరిణామాన్నంతటినీ దృష్టిలో ఉంచుకోనివారు ఆధునికులనిపించుకోరు. ఇది చాలా ముఖ్యవిషయం.
ఆత్మల గురించిన విషయాన్నే తీసుకుంటే అది నేను స్పష్టముగా చూచుట జరిగింది. చూడనంతవరకు నాకది అసత్యము కాదు గాని, తెలియని విషయమే. సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన చేతనే నాకది సాధ్యమయినది.
మీ రచనలు మీ అద్భుతమయిన అవగాహనా శక్తిని తెలియజేస్తున్నవి.
సత్యము అందరికిని సమానమే.
అద్వయిత సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరాచార్యులు గారు, ఎవల్యూషన్ గురించి ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్, ఇద్దరూ ఒకే విషయం గురించి ప్రస్తావించారు. ఇద్దరివి కూడా వారి వారి వ్యక్తిగత అభిప్రాయంగా భావించే వీలుంది.
సూర్యుడు తూర్పునకు వస్తున్నాడని అంతవరకు అభిప్రాయపడిన ప్రజలు భూమి గురించిన సత్యాన్ని తెలుసుకొన్నంత మాత్రము చేతనే సూర్యుడు కదలటం లేదని వారి అభిప్రాయమును మార్చుకొన్నారు.
links:
http://www.darwins-theory-of-evolution.com/
http://en.wikipedia.org/wiki/Advaita
మరొకసారి చెపుతాను. 'చూచుట, చూడకపోవడం' మొదలైనవన్నీ మనుషులకూ, ఇతర ప్రాణులకూ జీవపరిణామక్రమంలో అలవడిన శక్తులు. ఆటుపోట్లకు తట్టుకుంటూ, మనుగడ కొనసాగించడానికి పనికొచ్చే విద్యలు. నాడీమండలం ఎదిగిన ప్రాణుల్లోనూ, ఎదగని ప్రాణుల్లోనూ స్పందనలు ఒకేలా ఉండవు. ఆత్మ వగైరాలను గురించి తెలియకుండా మాట్లాడకూడదు. దేన్నీ assume చేసుకోకుండా ప్రకృతిని గురించి ఆలోచింఛగలిగినప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. ఎప్పుడో చనిపోయిన శంకరుణ్ణో, డార్విన్‌నో పట్టుకుని వేళ్ళాడవలసిన అవసరం లేదు. ఈ నాటి విజ్ఞానం ఏం చెపుతోందో ముందు గమనించండి.
ఉదాహరణలు ఎన్నైనా ఉన్నాయి. కిందికి జారడం అనేది నీచమనీ, పైకి లేవడమనేది గొప్ప అనీ అనుకుంటాం. అందుకు కారణం మనం గురుత్వాకర్షణకు లోబడి జీవించడమేనని మరిచిపోవద్దు. భారరహితస్థితిలో పెరిగిన జీవాలకు ఇటువంటి భావనలు ఉండకపోవచ్చు. పాతకాలపు విశ్వాసాలని నమ్మాలనే కాంక్ష ఎంత బలంగా ఉన్నప్పటికీ వాటిని విడిచిపెట్టాలి.
విజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతుంది. అంత మాత్రాన ప్రతీ సారీ అది ఇంతకు ముందు రుజువైన విషయాలకు వ్యతిరేక దిశను తీసుకోదు. సూర్యోదయాన్నే చూద్దాం. భూమిని రఫరెన్సు గా తీసుకుంటే సూర్యుడు తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణిచడం సత్యమే. అలాగే పాలపుంత గెలాక్సీని రిఫరెన్సుగా తీసుకుంటే భూమీ సూర్యుడూ కూడా పాలపుంత కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి. గమనిస్తే, ఇప్పటికీ కూడా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనే అందరూ భావిస్తారు తప్ప, పశ్చిమానో మరోచోటో ఉదయిస్తాడని ఎవరూ అభిప్రాయాన్ని మార్చుకో లేదు.
ఇంటర్నెట్లో పికాసా అల్బం చూసిన వారు గమనించి వుంటారు. వెనువెంటనే డవున్లోడ్ అయిన సమాచారంతో అస్పష్టమైన చిత్రం కనపడుతుంది. ఆ తర్వాత సమాచారం మరింత డవున్లోడ్ అయిన కొద్దీ చిత్రానికి మరింత స్పష్టత వస్తుంది. అలాగే విజ్ఞానం కూడా. అభివృద్ధి చెందిన కొద్దీ మరింత స్పష్టంగా మారుతుందే తప్ప పూర్తి వ్యతిరేకమైన అభిప్రాయాలకు రాదు.
అలాగే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని ప్రతి ఒక్కరు చూడగలుగుత్న్నారు. కాబట్టి అది వాస్తవం. కాని దేవుడు, ఆత్మలు కనపడ్డాయని మాత్రం కొంత మందే చెపుతున్నారు. కాబట్టి అది కేవలం వారి భ్రమ మాత్రమే. వాస్తవం కావటానికి అవకాశం లేదు.
అన్ని మతాల లోనూ దేవుడిని కనుగొనడానికి దేవుడి మీద పూర్తి విశ్వాసాన్ని కాలిగి వుండడం ఆద్యావశ్యకత గా చెప్తారు. గుడ్డిగా నమ్మిన తర్వాత కనపడ్డట్టుగా భ్రమించడంలో అశ్చర్యం లేదు. అలా ఇతరులు కూడా భ్రమించడానికి ప్రయత్నించ నవసరం లేదు.
దేవుడిని నమ్మ దలిచిన వాళ్ళు యదేఛ్ఛగా నమ్మ వచ్చు. దానికి అభ్యంతరం లేదు. కాని దేవునికి సైన్సుతో లంకె వేయాలని చూస్తేనే ఇబ్బంది.
కొత్త వ్యాఖ్య రాయండి