పెరిగిపోతున్న జనాభా భారాన్ని మోస్తున్న భరతమాతలా, రాజకీయ రైలు మరో ఎలక్షను స్టేషనులోకి నెమ్మదిగా వచ్చి ఆగింది. పెళ్ళిళ్ళ సీజనులో జనరలు కంపార్టుమెంటులా, ఆంధ్ర దేశపు బోగీ, పదవీవ్యామోహపరులతో క్రిక్కిరిసి ఉంది.
చెన్నైలో రజనీకాంత్ కొత్త సినిమా విడుదల సందర్భంలోలా, రంగురంగుల నాయకుల పోస్టరులు, కరపత్రాలు, మైకుల శబ్దాలతో స్టేషనంతా గందరగోళంగా ఉంది. మీకిష్టమైన (అభి)రుచులలో, వేడి వాడి కబుర్లు దైవ"సాక్షి"గా, "ఈనాడు" మీకందించి మీలో "జ్యోతి", "ప్రభలు" వెలిగిస్తామని రకరకాల పేపరు కుర్రాళ్ళు అరుస్తూ బోగీ చుట్టూ కలియ దిరుగుతున్నారు.