నవనందనవాసంతము 2

నవనందనవాసంతంలో ఎదురయ్యిన సమస్యలను ఎవరెవరు ఎలా పరిష్కరించారో చూద్దాం.

సమస్య: కాలము జేసినన్ గలుగు సౌభాగ్యంబశేషమ్ముగా

 

లంక గిరిధర్

శ్రీ లింటన్ నిలువంగనీక కడుదారిద్ర్యంబు వెన్నాడి భే
తాలున్ విక్రముడెంతజేసిన నిజస్థానంబు మార్పంగ లే
జాలండట్లు తిరంబునైన తుద కా ఛాయల్ ద్యుతిప్రాప్త ధూ
పాలై  కాలము జేసినన్ గలుగు సౌభాగ్యంబశేషమ్ముగా

 

వసంత్ కిశోర్

సతీ అనసూయ సుమతితో :

పతిగా నీకొక మూర్ఖ మానవుడు , పా – పాత్ముండు ప్రాప్తించినన్
సతిగా నీదెశ చూడ కుండినను, వే – శ్యాలోలు డైనన్సరే
గతినే మార్చగ నీవు జేయు పలు , సౌ – కర్యంబులన్ గూల్చినన్
పతితో కాలము జేసినన్ గలుగు సౌ – భాగ్యం బశేషమ్ముగా !

 

దువ్వూరి సుబ్బారావు

నీతిందప్పని సత్యజీవనమునన్ నిశ్చింతగా సాగుచున్
భీతింజెందక కష్టనష్టములలో విశ్వేశునే నమ్ముచున్
భూతాత్మా! పరమాత్మ! నీలగళ! శంభో! యంచు నిత్యార్చనల్
ప్రాత:కాలము జేసినన్ గలుగు సౌభాగ్యం బశేషమ్ముగా !

 

నచకి

సభలో పట్టము గట్టునేమొ త్వరలో సంప్రీతిఁ నందాఖ్యుకున్

అభిశంసించిన సంగతుల్ మఱచునో, ఆ వైశ్యుడో,  వేశ్యయో

ప్రభువో కాలము జేసినన్ గలుగు సౌభాగ్యంబశేషమ్ముగా

విభవంబంతయు సొంతమౌను గద యా వేశ్యాసమ్మోహమ్ము వీ

డి భవిష్యత్తున రాజ్యమేమిటను మాటే రాజు యోచించినన్

ఈ పద్యమునకు మూలము: “ఉత్తున్గభుజ నాశోవా దేశకాలగతోపివా వేశ్యా వణిగ్వి నాశోవా నన్దో రాజా భవిష్యతి” అన్న సంస్కృతపద్యం.

ఉత్తుంగభుజుడన్న రాజు ఒక వేశ్య (రాజనర్తకి?) మోజులో పడి తన పట్టపురాణిని అలక్ష్యం చేయటమే కాక గర్భిణియైన ఆమెను తన రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. ఆమె తన అనుంగు చెలికత్తెతో రాజ్యము బయటనున్న ఒక అడవిలో కాలం వెళ్ళదీస్తూ ఉంటుంది. రాణిగారికి పెళ్ళికి ముందు నుంచీ కూడా ఆమెకి పుట్టినింట బట్టలమ్మిన వ్యాపారి ఒకరు ఆమె మీది గౌరవంతో “రుణరూపేణా” ఆమెకు, ఆమె చెలికత్తెకు, ఆమెకు అడవిలో ఉండగా పుట్టిన కొడుకు నందుడికి తగిన సరుకులు, బట్టలు తెచ్చి యిస్తూ ఉంటాడు. అప్పులు పెఱిగిపోతున్నాయి, రాజుగారేమో మాఱరు, నా కొడుకు భవిష్యత్తు తలచుకుంటే బాధగా ఉందని రాణి బాధపడినప్పుడు చెలికత్తె చెప్పే పద్యమది. “ఉత్తుంగభుజుడు మరణించవచ్చు, దేశకాల పరిస్థితులు మాఱవచ్చు, ఆ వేశ్య కానీ యీ వర్తకుడు కానీ మరణించవచ్చు, నందుడు రాజూ కావచ్చు” అని, ఏది జఱిగినా రాణి కష్టాలు తీఱినట్టేనని. “నందో రాజా భవిష్యతి” అన్నది కూడా “ఏమో, ఏం జఱగనుందో!” అన్న అర్థంలో వాడటం మీకు తెలిసే ఉంటుంది.

 

ఫణి   

పదరా నాయక! సేవజేయ ప్రజకున్ స్వార్థమ్మునే వీడుమా!

మదిలో దేశము జాతినిల్పి సమతా మార్గమ్ములో పాలనన్

పదవీకాలము జేసినన్ గలుగు సౌబాగ్యంబశేషమ్ముగా

పది కాలమ్ములు నీదు నామమిలలో భద్రమ్ముగా నిల్చులే!

 

సమస్య: అర్జునునికి వణుకు పుట్టె నశనిపాత భీతిచే

 

లంక గిరిధర్

ద్రోణనిర్మితవ్యూహము త్రుంపనేగె

బాలు డొక్కడను పిడుగుపాటు వార్త

కర్జునునికి వణుకు పుట్టె నశనిపాత

భీతిచే నచలములు మున్ బెడకినట్లు

 

వసంత్ కిశోర్

నిర్జనముగ జేయు ననిని – నిర్విరామ దీక్షతో

నిర్జరు డగు  బావ మదిని – నిలిచి యుండ తోడుగా

నర్జునునికి ! వణుకు పుట్టె – నశని పాత భీతిచే

గర్జనలను విన్న ద్వార – క న్వసించు వారికే !

 

వసంత్ కిశోర్

శకుని కర్ణున్ని పొగుడుతూ ధుర్యోధనునితో చెబుతున్న మాయ మాటలు !

భీకరముగ కర్ణు డనిని – సూకములను

భీషనముగ కొట్టి నపుడు – భీతి జెంది

యర్జునునికి వణుకు పుట్టె ! – నశని పాత

భీతిచే భీము డయ్యని – భీరువయ్యె !

 

గోలి హనుమఛ్ఛాస్త్రి  

నిర్జరపతి  సుతుని  యమ్ము నిజము  వజ్ర ఘాతమే

నిర్జనముగ నరికి వేయు నిపుడ టంచు భీతిలెన్

అర్జునునికి –  వణుకు పుట్టె నశనిపాత భీతిచే

దుర్జనులగు యరులు జూడ తొణుకు చుండెగా మదిన్.

 

గన్నవరపు మూర్తి

ఊర్జితమగు గోప మూని యుర్వి యదుర నార్చుచున్

‘నిర్జనపతిఁ  జేతు నవని నిశ్చయమ్ము పరశువున్ ‘

గర్జన లిడి  భీతి గొల్ప ఘనుడు రాము డుగ్రతన్

అర్జునునికి వణుకు పుట్టె నశనిపాత భీతిచే !

 

ఆదిత్య   

స్ఫూర్జగర్జనలకు తానె స్ఫూర్తి నిచ్చు ఆర్భటిన్

ధూర్జటివలె భీష్ముపైకి దూకె కృష్ణ మేఘమే

స్వార్జిత చిరకీర్తి ఫలము  వరదపాలగునని లో

నర్జునినికి వణుకు పుట్టె అశనిపాత భీతిచే

 

ఫణి  

దుర్జయుడగు భార్గవుడదె తునిమి సాగె కుత్తుకల్

మార్జనమును జేసెననిని మరుగు రక్త ధారచే

దుర్జనుండనంచు నన్ను త్రుంచునంచు కార్తవీ

ర్యార్జునునికి వణకుపుట్టె నశనిపాత భీతిచే!

 

సమస్య: భార్యకు మ్రొక్కిన శుభమగు పతి  దేవునకున్

 

గోలి హనుమఛ్ఛాస్త్రి

భార్యగ మారెడు వధువే

ఆర్యా ! శ్రీ గౌరి దేవి నారాధిస్తూ

కార్య సఫలతకు శంభుని

భార్యకు మ్రొక్కిన శుభమగు పతి  దేవునకున్.

 

లంక గిరిధర్

శౌర్యము చెల్ల దని తెలిసి,

కార్యము సాధింప నట్లకాడల లాఠీ

చర్యల గయాళిని వెఱచి,

భార్యకు మ్రొక్కిన, శుభముగు పతిదేవునకున్

 

గన్నవరపు మూర్తి

ఆర్యాణి, శివులఁ గలుపగ

వీర్యమ్మున శరము లేసి విల్తుఁడు గూలన్

భార్యామణి రతి శంభుని

భార్యకు మ్రొక్కిన శుభమగు పతి దేవునకున్

 

దువ్వూరి సుబ్బారావు

భార్యకు పతియే దైవము

భార్యకు సుఖ దు:ఖములను బాసట పతియే

మర్యాద గల్గు పతిచే

భార్యకు మ్రొక్కిన శుభమగు పతి దేవునకున్

 

వసంత్ కిశోర్

కాశీ జేరిన పిమ్మట , చంద్రమతి హరిశ్చంద్రునితో :

ఆర్యా ! సద్గుణ సాంద్రా !

శౌర్యము , వీర్యము గలిగిన – సత్య వ్రతుడా !

ఆర్య, యపర్ణయు , పురహరు

భార్యకు మ్రొక్కిన శుభమగు ! – పతి దేవునకున్ !

 

శ్యాం పుల్లెల   

కార్యముకొఱకాఫీసరు

భార్యకు మ్రొక్కిన శుభమగు – పతిదేవునకున్

కార్యమును చెప్పమని కవి

వర్యుడు ఘన రామదాసు పాడగ లేదా?

 

ఫణి 

కార్యార్థి యౌచు పత్నిని

ఆర్యులకడ వీడి చనెడు అవసరమందున్

ధైర్యము వీడక శంభుని

భార్యకు మ్రొక్కిన శుభమగు పతిదేవునికిన్!

 

సమస్య: తిరుగుచు నుండు గాని యొక తీరము జేరడు జీవుడెన్నడున్

 

లంక గిరిధర్

పరపతిలేని కార్యముల భారము మూపున గానుగెద్దనన్

తిరపడ, ముందు కేగక ప్రతిక్షణ మెవ్వనికో తలొగ్గు   మో్ర

తరి పనితావు గానడు కృతార్థత, కార్యసముద్రమధ్యమున్

తిరుగుచు నుండు గాని యొక తీరము జేరడు జీవుడెన్నడున్

 

గన్నవరపు మూర్తి     

శరముల నుర్వి నాకముల జన్మము లొందుచుఁ గర్మ బంధమున్

విరతియు లేక దేహముల విశ్రుత ధర్మము లాచరించినన్

గిరిధరు భక్తి భావమున గీర్తన సేయక ముక్తి రాదు దాఁ

దిరుగుచు నుండు గాని యొక తీరముఁ జేరడు జీవు డెన్నడున్ !

 

దువ్వూరి సుబ్బారావు

పరిమితి లేదు కోర్కెలకు వాంఛలచే జనియించు మోహమున్

దరిగనరాని మోహమున తప్పదు బంధము బంధనమ్ములన్

మరల భవాబ్ధి కోర్కెలును మర్మ మెఱుంగగ లేక నంధుడై

తిరుగుచు నుండు గాని యొక తీరము జేరడు జీవుడెన్నడున్

 

వసంత్ కిశోర్

సిరిపతి జేరగోరి, యట – శ్రీపతి మూర్తిని ముందు నిల్పినన్

తిరమది లేక భావమున , – దిక్కది తూర్పును జూచు నట్లుగా

స్థిరముగ ముక్కు మూసుకొని – తీరుగ గూర్చొన , ధ్యాన మందునన్

తిరుగుచు నుండు గాని యొక – తీరము జేరడు జీవు డెన్నడున్ !

 

ఆదిత్య  

ఎరుగదు గానుగెద్దు గుడులెంతగ చుట్టిన తైల స్వాదమున్

ఎరగొను  మోక్షఘాసమును  ఎట్టులొ క్షోద్ధుడు సిద్ధమానవుం

డరిగిన ఏగుదెంచు మరలాతడు సృష్టికి యంతమున్నదో ?

తిరుగుచునుండుగాని యొక తీరము జేరడు జీవుడెన్నడున్

 

ఫణి    

మరుచును దైవమున్ మరల మాధవు జేరెడు మోక్షమార్గమున్

పరుగులు తీయు మానవుడు పైడియు పేరును కోరి మూర్ఖుడై

తిరుగలిలోని గింజవలె దిగ్గలి యందలి కప్ప బోలికన్

తిరుగుచునుండు గాని యొక తీరము జేరడు జీవుడెన్నడున్

 

సమస్య: రాష్ట్రమునేలఁగా నొక విరాధుఁడు రావలె రక్త పాయియై!

 

దువ్వూరి సుబ్బారావు

రాష్ట్రము రాజభోజ్యమను! రాష్త్రహితమ్మన స్వార్థమే యనున్!

రాష్ట్రజనుల్ పసుల్ గనగ రారవివేకులు ప్రశ్నజేయ, సౌ-

రాష్ట్రము తీరునొల్లనను రాష్ట్రపు నేతలు! చూడనింక నీ

రాష్ట్రమునేలఁగా నొక విరాధుఁడు రావలె రక్త పాయియై!

 

గన్నవరపు మూర్తి 

రాష్ట్రము నేలు దుర్మతులు లజ్జ యొకింతయు లేక హీనులై

రాష్ట్రము దోచ, తస్కరుల, రక్త పిపాసుల మట్టు పెట్టుచున్

రాష్ట్రమునేలఁగా నొక విరాధుఁడు రావలె రక్త పాయియై

రాష్ట్రముఁ బ్రోవ సత్కృప  విరాధుని ద్రుంచడె రాము డప్పుడున్ !

 

ఫణి      

ఖలులు కఠినాత్ములసురుల్

గల రాష్ట్రమునేలగానొక విరాధుడు రా

వలె రక్తపాయియై వా

రలనేరి ప్రజల మనమ్ముల ముదమెనర్పన్

 

నచకి

రాష్ట్రము నేలఁగా నొక విరాధుఁడు – రావలె రక్తపాయియై

రాష్ట్రమునందు పౌరులకు రక్షణనీయగ జామదగ్నియే –

భ్రాష్ట్రము పోల్కి నుగ్రుడయి పాలకరాజును సంహరించియున్

రాష్ట్రముఁ శాంతిసౌఖ్యముల రాజిలజేసెడి రాముడాతడే!

 

సమస్య:            జాలములో లేనిదేది జగమున లేదే      

లంక గిరిధర్      

జాలరి నరుడు చరాచర

జాలమును కబళన జేయసాగె దురాశన్

చాలదు క్షు త్తుడుగ దతడి

జాలములో లేనిదేది జగమున లేదే

 

గన్నవరపు మూర్తి 

మిగిలిన సంగతి తెలియదు, పెళ్ళి సంబంధములు మహా జోరుగా  సాగుతున్నాయిట జాలములో !

కాలము దెచ్చిన మార్పుల

వేలములన్ వేసి మరులు వేవురు వరులున్

జాలముఁ జిక్కిరి జాణలఁ

జాలములో లేని వేవి జగతిని లేవే !

 

 

దువ్వూరి సుబ్బారావు

గేలము సొమ్ముకు, విలువల

వేలము, పరిశీలనముల వెలదుల శీలం-

బేలా సంశయ మంత-

ర్జాలములో లేనిదేది జగమున లేదే

 

వసంత్ కిశోర్

భారతంలో లేనిదేదీ లోకంలో లేదని వ్యాస ఉవాచ :

మూలము , సత్యము , ధర్మము

కాలపు రీతు , లవినీతి – కార్యక్రమముల్

మేలగు విలువలు , భారత

జాలములో లేని దేది – జగమున లేదే !

 

ఫణి  

వేలజగమ్ములు పుట్టును

మేలగు నీ మనము నందె మేఘమువోలెన్

ఏలర సంశయమా ఘన

జాలములో లేనిదేది జగమున లేదే

సమస్య:            పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్ !

 

లంక గిరిధర్ 

పంచాస్యున్ నుతియించె నొండసురు డా భస్మాంగు సంప్రీతి సా

ధించెన్ చేతులవింతశక్తిగెలిచెన్ తీక్ష్ణాగ్ని భస్మంబుగా

వించన్ సాగె వరంబొసంగిన భవున్ వీక్షింప వైచిత్ర్యమై

పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్

 

గోలి హనుమఛ్ఛాస్త్రి  

అడవిని వదలి దారి తప్పి ఊరి లోకి వచ్చిన సింహం తో గ్రామ సింహం…

పంచ్చాస్యంబువు నీవె గాని  కనగా వాసంబు కారాటవే

పంచాస్యంబును నేనె గ్రామమున కావాసంబు నీ వీధియే

కొంచెం బైనను చోటు లేదనుచు తా కోరల్ని చూపించుచున్

పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్

 

వసంత్ కిశోర్

వరమిచ్చి వెళ్ళబోతున్న శివునితో భస్మాసురుడు :

పంచారించిన నాదు చేయి శిరమున్ – భస్మంబు నీవౌదువో ?

కించి త్తాళుము ! విశ్వనాథ ! కరమున్ – గోరంత , నీ నెత్తిపై

పంచారించి , పరీక్ష జేతు , వరమున్ – పాలాక్ష ! యంచున్నటన్

పంచారించగబోవు దుష్టు భయమున్ – పర్వెత్తె పంచాస్యుడే!

పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ – శ్వానమ్ము చిత్రమ్ముగన్ !

 

దువ్వూరి సుబ్బారావు

సంచుల్ పంచుచు సామభేదములతో జాతీయ కాంగ్రేసు చే-

యించెన్ చూడు ప్రచార మోట్ల కొఱకై నేమాయె యూపీన నా

వంచింపుల్ గ్రహియించి సజ్జనములే ప్రాంతీయమున్ మెచ్చె నౌ

పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్ !

 

వసంత్ కిశోర్

సింహా న్నోడించిన చెవుల పిల్లి సంగతిది ! అందరికీ తెలిసిందే ! :

మంచిన్బెంచగ నెంచినట్టి మృదు రో – మంబంత నిశ్చింతగాన్

వంచించన్ సమకట్టి యా మెకము; న – వ్యాజంబుగా , దానితో

చాంచల్యంబగు నీదు రాజ్యమిక , నో – చంద్రాస్య , యిద్దేశమున్

పంచారించగ జూచు చుండెనిదె,నీ – ప్రత్యర్థి యిబ్బావిలో

యంచుం జెప్పిన , బావిదూకెనది హా – హాకారమున్ జేయుచూ !

పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ – శ్వానమ్ము చిత్రమ్ముగన్ !

 

నచకి   

సంచారించు విమానమే త్రుటిని హైజాకయ్యి భద్రస్థలిన్ –

పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్

పెంచంగా దగునే విషాస్పదులిలన్? వేలార్చు సౌభాగ్యముల్

కొంచెమ్మైన దయాగుణంబుఁ గనరే కూళాత్ములే తీరునన్!

(సెప్టెంబరు 11, 2001 నాడు అమెరికా రక్షణాలయమైన పెంటగన్ పై జఱిగిన వైమానిక దాడుల నేపథ్యం)

 

శ్యాం పుల్లెల

కుంచెన్ పట్టుకు చిత్రకారుడిలలో క్రొంగొత్త మార్గంబునన్

పంచున్ హాస్యము బాలబాలికలకున్ వ్యంగ్యంపు చిత్రాలలో

కాంచన్ గాదది వింత, బుల్లి తెరపై కార్టూను చిత్రంబులో

పంచాస్యంబును వెంటనంటి తరిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్

 

సమస్య:    వాక్స్వాతంత్ర్యము లేని దేశములనే వర్ధిల్లు సారస్వతుల్

లంక గిరిధర్     

ప్రాక్స్వేచ్ఛాదృతి మానవామరుల సంబంధస్థ పావిత్ర్యమున్

వాక్స్వోత్కర్షము పెంపునన్ సడలు దుష్ప్రారబ్ధ మార్గమ్ములన్

దృక్స్వాభావిక మంచు పాదుకొన నీదే, దైవ దూషార్థమౌ

వాక్స్వాతంత్ర్యము లేని దేశములనే వర్ధిల్లు సారస్వతుల్

తాత్పర్యము – ప్రాక్దేశ నిర్దేశిత స్వేచ్ఛ దైవ మానవ సాంబంధ పవిత్రతను మనబుద్ధి

గొప్పదని నమ్మి తూలనాడ నీయదు, దైవ దూషణ చేయగల స్వాతంత్ర్యములేని దేశములలోనే

సారస్వతులు వర్ధిల్లుచుందురు

 

దువ్వూరి సుబ్బారావు

పాక్స్వాతంత్ర్యము పొందె గాని యకటా ప్రారబ్ధమే మందు నా

పాక్స్వేచ్ఛన్ గణుతింప స్వేచ్ఛ యణువే పౌరాళికిన్   వారిదౌ

వాక్స్వాతంత్ర్యము ముప్పునంబడెగదా పల్మార్లు “సంకెళ్ళలో

వాక్స్వాతంత్ర్యము” లేని దేశములనే వర్ధిల్లు సారస్వతుల్.

 

సమస్య:     కాడు పిలిచె నిన్ను కదలవేమి?

గోలి హనుమఛ్ఛాస్త్రి

శకుంతల తో చెలి కత్తె…

‘ పిల్ల ‘ గాలి కొరకు ప్రియుడు దుష్యంతుడు

వచ్చి చేరి నాడు వనము నందు

నాన్న గారు లేరు నడుమ నడుము  చెలి

కాడు పిలిచె నిన్ను కదల వేమి?

 

గన్నవరపు మూర్తి

వరూధినితో చెలికత్తెలు ;

కల్ల గాదు నిజమె కరఁగి యా ప్రవరుండు

ప్రియముఁ గూర్చ వచ్చె రయముఁ దోడ

విధువు వెల్లివిరిసె  వినుతించి నెచ్చెలి

కాఁడు పిలిచె నిన్ను కదల వేమి ?

 

లంక గిరిధర్  

యేలిక రఘురాము కాల మకాల మృ

త్యువులు లేవని పని త్రోయు టేమి

దినకరుండు గ్రుంకె దీపాల వేళాయె

కాడు పిలిచె నిన్ను గదల వేమి

ఇవి యొకకాటికాపరితో భార్య నుడువిన పల్కులు..

 

వసంత్ కిశోర్

వీరబాహుడు హరిశ్చంద్రునితో :

కాటి కాప రీవు – నేటి నుండి యిచట

కల్లు కుండ మరియు – కర్ర గొనుము !

కాకరూక ములును – కంకము లట నుండు

కాడు పిలిచె నిన్ను – కదల వేమి?

 

దువ్వూరి సుబ్బారావు

బ్రోవ భార మేమి బ్రోచువా రింకను

నిను వినను మరెవ్వ రనుచు రామ!

కీర్తనలను జేసె నార్తి తోడను పాట

కాడు పిలిచె నిన్ను గదలవేమి ?

 

ఫణి   

నిండు జాబిలి యది పండు వెన్నెల రేయి

కొండమల్లె తావి గుండె నిండ

మరుశరమ్ములబోలు మాటలతో చెలి

కాడు పిలిచె నిన్ను కదలవేమి?

 

సమస్య:    పాపము లేనిచో జగము పాడయి పోవును నిశ్చయంబుగన్

దువ్వూరి సుబ్బారావు  

శ్రీపతి నందనందనుడు శ్రీ రఘుభార్గవరామ వామనుల్

చేప వరాహకూర్మనరసింహులు బుద్ధుడు కల్కిరూపులన్

పాపుల మట్టుబెట్టడె ప్రపన్నుల గావగ నెంత జాలియో

పాపము! లేనిచో జగము పాడయి పోవును నిశ్చయంబుగన్

 

సమస్య: తెలుగు ప్రాచీనభాషగాదిలను జూడ !

 

గన్నవరపు మూర్తి

నవ నవోన్మేషమై వెల్గు ననను గనుమ !

తేనె లూరెడి కవితల తీపి గొలుపు

పరిళ మించెడి ప్రత్యూష వారిజమ్ము !

తెలుగు ! ప్రాచీన భాష గాదిలను జూడ !

నన = పుష్పము

ప్రాచీన భాష హోదా వచ్చిన తరువాత యిది పాత చింతకాయ పచ్చడి కాదంటే మనకు వచ్చిన

నష్ట మేమిటి ?

 

గోలి హనుమఛ్ఛాస్త్రి

తెలుగు నచ్చిన వాడిట్లు తెలియ జేసె

‘ తెలుగు ప్రాచీన భాష గా యిలను  జూడ’

తెలుగు నచ్చని తంబిట్లు   దిద్ది నాడు

‘ తెలుగు ప్రాచీన భాష గాదిలను జూడ’

 

లంక గిరిధర్

జనని కాదని సంస్కృతంబును విదిల్చి

తమిళకన్నడమలయాళ ద్రావిడంపు

యోషలే దనకు సుహృద భాషలన్న

తెలుగు ప్రాచీనభాషగాదిలను జూడ

ఆరోపణము రాబర్టు కాల్డవెల్ సృష్టించిన ద్రావిడభాషాసమూహము మీద యన్నది

తాత్పర్యము.

 

వసంత్ కిశోర్

ఒక తమిళ పార్లమెంటు సభ్యుడు ప్రధాన మంత్రితో :

భరత దేశాన , జూడగ – భాష లందు

తమిళ భాషయె , ప్రాచీన – తమము గాన

తమిళ భాషకె , నిధులివ్వ – ధర్మ మగును !

తెలుగు ప్రాచీన భాష గా – దిలను జూడ !

 

దువ్వూరి సుబ్బారావు

తెలుగు భారతి నాల్కపై తిరుగు భాష

తెలుగు ఆంధ్రుల జిహ్వకు తీపి భాష

తెలుగు స్వాయంభువైనట్టి దివ్య భాష

తెలుగు ప్రాచీనభాషగాదిలను జూడ !

 

నచకి

యూనికోడున “అక్షర” స్థానమొంది

విశ్వవిస్తృత జాలమె విడిది గాగ

బ్లాగులోకాన రాజిల్లు భాష మనది

తెలుగు ప్రాచీనభాషగాదిలను జూడ !

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

One Response to నవనందనవాసంతము 2

  1. గన్నవరపు నరసింహ మూర్తి says:

    వాక్స్వాతంత్య్రము పూరణ లో దుష్కర ప్రాసను ( క కార,స కార వ కారములు )సుళువుగా అధిగమించిన మిత్రులు శ్రీలంక గిరిధర్ గారికి, శ్రీదువ్వూరి వెంకటనరసింహ సుబ్బారావు గారికి ప్రత్యేక అభినందనలు.

Comments are closed.