కథాకథనం – 6

కథా రచన

కథ చదవగా తెలియవచ్చే వృత్తాంతం దాని భౌతిక రూపమనీ ఆ వృత్తాంతం ద్వారా వ్యక్తమయ్యే విశేషమే అసలు కథ అనీ వెనక చెప్పుకున్నాం.

ప్రాణం, ప్రాణిలా ఉండే ఆ విశేషం, దాన్ని వ్యక్తం చేసే వృత్తాంతం కథ అయితే – ఆ విశేషం, వృత్తాంతం రెండూ వ్యక్తం అయ్యే విధంగా వాటిని చెప్పడం కథనం లేక కథ రాయడం.

కథ ఎలా రాస్తారనేది ఒకరు చెపితే తెలిసేది కాదు. ఎవరికి వారు గ్రహింపవలసేది. పద్ధతి చెప్పడానికైనా, ఒక కథకు పనికి వచ్చిన పద్ధతి ఇంకొక కథకు పనికి రావచ్చు – రాకపోవచ్చు. కాకపోతే అందుకు సంబంధించిన మెళుకువల గురించీ, రాసిన కొన్ని కథల పద్ధతుల గురించీ చెప్పుకోవచ్చు.

ఒక విషయం గురించి ఒకరు యింకొకరికి తెలియజెయ్యాలంటే నేరుగా చెప్పడం ఒక పద్ధతి. అలా కాకుండా చెప్పదలచిన దానిని వేరే మాటల ద్వారానో, చేష్టల ద్వారానో, ఇతరత్రానో ఎదుటివాళ్ళు గ్రహించేటట్టు చేయడం మరో పద్ధతి.

ఒక అన్నగారు తమ్ముడికి ఉత్తరం రాస్తూ వాళ్ళ అమ్మ మాటలుగా యిలా అంటాడు.

…చిన్నబ్బాయినీ పిల్లల్నీ చూసి ఆర్నెల్లు అయిపోయింది. వెళ్ళి కొన్నాళ్ళపాటు వాడిదగ్గర ఉందామనుకుంటున్నాను. ఒకసారి రమ్మని తమ్ముడికి రాయి – అంటోంది.

అని –

…ఆమెకు మీ మీద భ్రమ మళ్ళినట్టుంది. వీలు చేసుకుని నువ్వో అధవా మరదలో వస్తే బాగుంటుంది – అంటాడు.

దాని అర్థమేమిటీ?

అమ్మను మా వంతు ఆరు నెలలూ మేము భరించేసేము. ఇక నువ్వో నీ పెళ్ళామో వచ్చి ఆమెని తీసుకువెళ్ళండి.

సూటిగా అయితే యిలా చెప్పవలసిన తన ఉద్దేశాన్ని వేరే మాటల్లో అలా తెలియజేసేడన్నమాట. కొందరైతే అలా నేరుగా చెప్పేవారూ వుంటారు.

ఈ విధంగా ఉద్దేశాలను చెప్పడం, వేరే మాటల్లో వ్యక్తం చెయ్యడం – రెండూ లోకంలో ఉన్నాయి. వ్యక్తం చెయ్యడానికి వేరే మాటలే కాక యితర మార్గాలూ ఉన్నాయి.

ఒక అబ్బాయికి వెనకటి పరీక్షలన్నింటిలోనూ ఐదూ మూడూ నాలుగూ ఇలాంటి ర్యాంకులు వస్తూండేవనుకోడి. అబ్బాయి తండ్రి ప్రొగెస్స్ కార్డు మీద సంతకం చేసినప్పుడల్లా తెచ్చుకున్న ర్యాంకులకి మెచ్చుకుంటూనే – ‘క్లాసు ఫస్టు రావాలి. అప్పుడూ గొప్ప’ – అంటూ ఆ కొడుకుని ప్రోత్సహిస్తుంటాడు. చిస్వరికా ఫష్టు ర్యాంకు సాధించాడు కొడుకు.

ఆ కొడుకు తన విజయగర్వాన్నీ, ఆ తండ్రి తన ఆనందాన్నీ వారి వారి కుటుంబ సంబంధాలను బట్టి ఒకరికొకరు రకరకాలుగా వ్యక్తం చేసుకోవచ్చు.

ఒక యింట్లో –

ప్రతీసారి సందిగ్ధ విషయమైన తండ్రి మెప్పు ఇప్పుడు సందిగ్ధ విషయం కాదు. కాబట్టి ఆ కొడుకు ఒక తమాషా చేయవచ్చు. గపుచుప్పుగా కార్డును తండ్రి టేబిల్ మీద అతనికి కనబడేటట్టు పెట్టేసి ఆటల కోసం బయటకు పోతాడు. కొడుకు తెచ్చుకున్న ర్యాంకుల కన్నా అతడు తన విజయగర్వాన్ని ప్రకటించిన తీరు ఆ తండ్రికి మరింత ఆనందదాయకమవుతుంది. అందుకని అప్పటికప్పుడు బజారుకు వెళ్ళి ఖరీదైన కొత్త పెన్నొకటి కొని దానితోనే కార్డు మీద సంతకం చేసి ఆ కార్డును ఆ పెన్ను క్లిప్పుకు తగిలించేసి అక్కడే ఉంచేస్తాడు.

కొడుకు తన విజయగర్వాన్ని తండ్రికి వ్యక్తం చేసినంత హుందాగానూ తండ్రి తన ఆనందాన్ని కొడుక్కి వ్యక్తం చేసేడన్నమాట.

ఇంకో యింట్లో –

తండ్రి ఆఫీసు నుంచి యింటిఒకి వచ్చేలోగా తల్లితో గూడుపుఠాణీ చేస్తాడు కొడుకు. తండ్రి యింటికి వచ్చేసరికి –

‘హాయ్ డాడీ! ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఏమిటో గెస్ చెయ్యండీ’ – అంటాడు సన్నీ.

డాడీ మమ్మీ వంక సహాయం కోసం ప్రాధేయపడుతున్నట్టు చూస్తాడు.

‘నో, మమ్మీ! నో. నువ్వు అటు తిరిగిపో. డోంట్ బి మీన్. అలా నవ్వకు. కళ్ళు మూసుకో – ‘ అందుకు తగ్గ చేష్టలతో అందుకు తగ్గ గొంతుతో అరుస్తాడు సన్నీ.

మమ్మీ – బిగపట్టిన పెదవులతో స్పష్టంగా నవ్వుతూ, పెద్దగా విచ్చి చూస్తున్న కళ్ళను సుతారంగా మూసేస్తూ, నోటి మీద వేలేసుకొని తల అదోలా కదుపుతూ ఆ చేష్టల ద్వారానే భర్తకేదో వ్యక్తం చేయబోతుంది.

అది గమనించిన కుర్రాడు ఎడంచేత వెనక్కు దాచిన కార్డును నేలమీదకు విసిరికొట్టి మారాం చేస్తాడు.

డాడీ విచార వదనం పెట్టి ఆ కార్డ్ ఎత్తి చూస్తాడు. చూడగానే మహానందాన్ని తెలియజేసే ఓ కేకపెట్టి, సన్నీని చేతుల్లోకి తీసుకుని గిరగిరా తిప్పి ముద్దు పెట్టుకుంటాడు.

ఇలా ఓ సీన్ క్రియేట్ చేసి తద్వారా ఆ కొడుకూ, తండ్రీ తమ విజయ గర్వాన్నీ, ఆనందాన్నీ హావభావ ప్రదర్శనల ద్వారా పరస్పరం వ్యక్తం చేసుకోవచ్చు.

కొందరిళ్ళల్లో పెద్దవాళ్ళూ, చిన్నవాళ్ళూ అంతా ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు. అలాంటి యింట్లో –

స్కూల్ నుంచి ఇంటికి రాగానే పుస్తకాల సంచీ అక్కడ పడేసి ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని తండ్రి దగ్గరకెళ్తాడు అబ్బాయి.

తండ్రి ఏమిటని అడగడు. ఏమిటన్నట్టు చూస్తాడు.

కార్డు తండ్రి ముందుంచుతూ క్లాస్ ఫస్ట్ వచ్చిన విషయం చెపుతాడు కొడుకు. తండ్రి తన ముఖంలో ఏ భావం కనపడనీకుండా కార్డందుకొని మార్కులు పరిశీలిస్తాడు. అదయ్యాక – ‘ఇంకా బాగా చదువు. లెక్కల్లో నూటికి తొంబయ్యే వచ్చాయి. నూరు రావాలి – ‘ అంటూ పెన్ను తీసి సంతకం  చేస్తాడు. అబ్బాయి అలాగే అన్నట్టు తలూపి కార్డు తీసుకువెళ్ళిపోతాడు.

పై యిళ్ళల్లో తండ్రీ కొడుకుల్లాగ, వీరు తమ చేష్టల ద్వారానూ నాటకీయమైన హావభావ ప్రకటనల ద్వారానూ తమ తమ విజయానందాలను పరస్పరం వ్యక్తం చేసుకోకపోయినా మాటాడేటప్పటి వారి గొంతు మార్దవాల్లోనో కళ్ళ వెలుగుల్లోనో కారుడు యిచ్చి పుచ్చుకోడాల్లోనో ఎక్కడో ఎలాగో వీరిక్కూడా ఒకరి ఆనందం ఒకరికి తెలియవస్తుంది.

ఈ విధంగా –

సూటిగా అయితే – తనకు క్లాస్ ఫస్ట్ వచ్చిందని కొడుకూ, చాలా సంతోషం అని తండ్రీ చెప్పుకోడం ద్వారా తెలియవలసే విషయాన్ని ఇతరేతర చేష్టల ద్వారా తెలియ జేయడం; లేదా సహజమైన ఒత్తి చూపులు, స్వరాలు ద్వారా తెలియజేయడం లోకంలో నిత్యం మనం చూస్తుంటాము.

కథలు పాతవీ కొత్తవీ మనం గమనిస్తే – చెప్పడంలో ఇవీ యిలాటివీ మనకి చాలా కనిపిస్తాయి.

పూర్వకాలపు కాశీ మజిలీలు, తెనాలి రామలింగం కథలు వంటి వాటికీ, నేడు పత్రికల్లో కథలుగా వచ్చేవాటికీ ప్రధానమైన తేడా గమనించండి.

అలనాటి కథలు నేరుగా చెప్పే పద్ధతిలో సాగుతాయి. నేటి కథలు సాధారణంగా వ్యక్తీకరణ పద్ధతిలో సాగుతాయి.

నాడు, నేడు అన్నది విషయానికి సంబంధించినవి కావు. చెప్పే పద్ధతికి సంబంధించినవి.

‘నేటి కథ’ సంకలనంలోంచి ఓ కథ తీసుకుందాం. ‘అసహాయత’ అనేది ఆ రచయిత రాసిన తొలికథ.

ఆ కథలో –

వీరయ్యది వనబ అనే పల్లెటూరు. బహు గిరిజన ప్రాంతపు కుగ్రామం. అతడో పేదకూలీ. అమాయకుడు. అతని కొడుకు తవిటయ్య. బుద్ధిమంతుడు. తెలివైనవాడు.

కొడుకుని పై చదువులకు పంపే శక్తిలేదు వీరయ్యకు. కులరీత్యా తన బిడ్డకున్న సదుపాయాల సంగతి అతనికి తెలియదు. వాళ్ళ ఊరి పంతులుగారు ఆ సదుపాయాల సంగతి చెప్పి కుర్రాడి పై చదువుల కోసం వాళ్ళని ప్రోత్సహిస్తాడు.

తవిటయ్యకు కాలేజీలో సీటు దొరికింది. హాస్టల్ సీటు కోసం వార్డెన్ గారి దర్శనం చేసుకుంటాడు. ఉన్న సీట్లన్నీ భర్తీ అయిపోయాయి; చేర్చుకోలేనంటాడు వారెడెను.

వీరయ్య తన గోడంతా చెప్పి బ్రతిమిలాడుతాడు. ఆఖరు సీటు ఆ ముందు రోజే నిండిపోయింది. వార్డెన్ చేయగలిగేదేమీ లేదు.

వీరయ్య ఊరివాడే వెంకయ్యగారు. బాగా భూవసతి ఉన్న రైతు.

నిన్న అతనొచ్చినట్టే వీరయ్యా అక్కడికొచ్చాడు. ఆదాయం సర్టిఫికేట్ కావాలంటే ఏంచెయ్యాలో తెలియక తెలుసుకోడానికి తన ఊరి పంతులుగారి దగ్గరికి పరుగెత్తాడు వీరయ్య. వెంకయ్యగారు సంవత్సరాదాయం మూడు వేలని రాసిచ్చి కోటాలో ఆఖరు సీటు తన కొడుక్కి దక్కించుకున్నాడు.

యోగ్యత విషయానికొస్తే వెంకయ్యగారి మీద వీరయ్యకీ, వెంకయ్యగారి కొడుకు మీద తవిటయ్యకీ న్యాయం జరగాలి. కానీ జరగదు. మొదటివారిలాగ రెండోవారు జరిపించుకోలేక పోయేరు. వార్డెన్ జరిగించలేదు.

అదీ ‘అసహాయత’.

నేరుగా చెప్పుకుంటే యీ విశేషాన్నీ, పై వృత్తాంతాన్నీ పై చెప్పిన క్రమంలో చెప్పుకోవాలి. ‘చందమామ’ వంటి బాలల పత్రికలో తప్ప ఇప్పటి కథలు ఇలా వాటిని చెప్పవు.

‘అసహాయత’ కథ చదివితే వ్యక్తీకరణ పద్ధతిలో ఎలా చెపుతారో, ఎలా చెప్పొచ్చో తెలుస్తుంది.

నేటి సన్నివేశ చిత్రణలో నిన్నటి సంఘటనలు ఒకటి రెండున్నాయి.

నేటి సన్నివేశంలో వర్ణనలున్నాయి. వీరయ్య, తవిటయ్య, వాడెన్ పాత్రలున్నాయి. వాటి సంభాషణలున్నాయి. హావభావాల వివరణలున్నాయి.

ప్రస్తావనకొచ్చిన నిన్నటి సంఘటనల్లో పాత్రలుగా వీరేకాక్, పంతులుగారూ, వెంకయ్యగారూ ఉన్నారు. వారి చేష్టలున్నాయి.

ఇలా యీ పాత్రలూ,వారి చేష్టలతో కూడిన సంఘటనలూ, సన్నివేశాలూ, వారి మధ్య సంభాషణలూ, పాత్రల హావభావాలూ – తదితర వర్ణనలద్వారా పై వృత్తాంతం, అందలి విశేషంతో కూడిన కథా వ్యక్తమయ్యాయి.

‘అసహాయత’ కేవలం ఒక కథ చెప్పడమే కాక ఒక జీవిత వాస్తవాన్ని మన ముందుంచే ప్రయత్నం కూడా చేస్తుంది. దాని ప్రస్తావన వేరే వ్యాసంలో వస్తుంది.

అందాకా కథ చెప్పడం గురించి మాత్రమే చెప్పుకుందాం.

* కథ చెప్పడం రెండు రకాలు. ఒకటి నేరుగా చెప్పడం. రెండవది కథా సామాగ్రిని రమ్యంగా అమర్చడం ద్వారా కథను వ్యక్త్మ చేయడం.

*వర్ణనలూ, సన్నివేశాలూ వాటిలో పాత్రలూ, వాటి మధ్య సంభాషణలూ సంఘటనలూ – వాటి హావభావాల చిత్రణలూ ఇవీ, యిలాంటివి మరికొన్నీ కలిపి కథాసామాగ్రి అవుతాయి.

*వృత్తాంతం వృత్తాంతంగా ఉంటూనే అందులో ఇమిడి ఉన్న విశేషాన్ని వ్యక్తం చేసేది కూడా అవుతుంది.

*అలాగే వృత్తాంత నిర్మాణానికి ఉపయోగపడే సామాగ్రి అందులో భాగాలుగా ఉంటూనే వృత్తాంతాన్నీ, విశేషాన్నీ కూడా వ్యక్తం చేసేవవుతాయి.

 

About కాళీపట్నం రామారావు

కారా మాస్టారుగా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు. ఈయన చేసిన రచనలు రాసిలో తక్కువైనా వాసికెక్కిన రచనలు చేసారు.

1966లో వీరు రాసిన ”యజ్ఞం” కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.

ఈయన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు. కథానిలయం తెలుగు కథకి నిలయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండేలా దాన్ని తీర్చిదిద్దుతున్నారు.

This entry was posted in వ్యాసం and tagged , , . Bookmark the permalink.

2 Responses to కథాకథనం – 6

  1. కొత్తపాళీ says:

    ఇదేంటి, సీరియల్ గా వస్తున్నదా? ఎన్నాళ్ళనించీ?

    • త్రివిక్రమ్ says:

      కొత్తపాళీ గారూ, అవునండీ. “ఎన్నాళ్ళనించీ” అంటే సంవత్సరం పైమాటే – 2010, నవంబరు 6 నించీ :-). ఈ సీరీస్ లోని పాత వ్యాసాల కోసం సైడ్ బార్లో కారా మాస్టారి పరిచయ వాక్యాల చివర్లో ఉన్న “వీరి ఇతర రచనలు” లింకు నొక్కండి. లేదా కథాకథనంలో చూడండి. ఎందువల్లనో ఈ ఒక్క వ్యాసం ఆ సీరీస్ లో చేరలేదు.

Comments are closed.