ఇప్పుడైనా..

పుడుతూనే

ఉగ్గుపాలతో పాటు విషం తాగి విశ్రమించిన జీవితాలివి

మెలికలు తిరిగుతూ కూడా బాధే సౌఖ్యమనే దౌర్భాగ్యం మనది

నిలువునా వ్యాపించిన సాంప్రదాయం మత్తులో

భయం మందు తాగి తూలుతున్న అస్థిపంజరాలు మనవి

గిడసబారి మరుగుజ్జులైన ఆత్మలు ఆవహించిన శరీరాలు మనవి

మన వాస్తవాలు భూతద్దంలో చూపే శిలాజాలైన  భావాలు

అవాస్తవాలకు అలంకారాలద్ది భ్రమే నిజమనే సంస్కృతికి నిలువుటద్దాలు

పదాల సొగసుల్లో పదియుగాల అనుభవాలు పండిస్తూ

నిజానికి సమాధులు తవ్వే తత్వం

 

నేను మాత్రం …నేను మాత్రం

ఎక్కిన విషం విదిలించేసుకుని కళ్ళువిప్పిన నూతన తేజస్సును

ఆధునికత నెన్నుదుటన ప్రజ్వలించే సూర్యబింబాన్ని

వ్యక్తిత్వం పీల్చుకుంటూ, గాయపరచే ముళ్ళపొదలను నరుక్కుంటూ

స్రవిస్తున్న రక్తాశ్రువులతో కొత్తదారులు వేసుకుంటూ

ప్రేమ పూల తివాసీ పరచే నూతన శకాన్ని నేను

++

నాకంతా తెలుసని అనుకుంటాను

భౌతిక శాస్త్రం  ఔపోసనపట్టినా, గెలాక్సీలు , గ్రహాలు ,దూరలూ తీరాలూ ఓ పక్కన

మనను మనం మభ్య పెట్టుకునే వాస్తుశాస్త్రాలు, జాతకాలు రుద్రాభిషేకాలూ మరోపక్క

ఎటు చూస్తే అటు మొగ్గే మేధస్సు

విశ్వం అణువణువునా అదేం చిత్రమో

సస్య శ్యామలం సహృదయ భావనే

అదే  లేకపోతే

ఋతువులు పరిభ్రమణ ఏదిశకో

అడవులు  మేఘాల వెంటబడి

బ్రతిమాలో బామాలో బెదిరించో  వర్షించమంటాయా

కొమ్మ కొమ్మ రోజంతా వేడికి మాడి మాడి

గరళాన్ని తాగి అమృతాన్ని ఆవిష్కరిస్తూ

దినుసులకు ఊపిరి పోస్తుందా

విశ్వసమాజం అణువణువూ పరోపకారాన్నలదుకుంటుందా?

ఇప్పుడైనా ఒక్కసారి కళ్ళువిప్పి

చెక్కని సూత్రాలు జీవితాన చెక్కుకోలేక పోతే

ఏముంటుంది విషం తలకెక్కిన తరువాత

చచ్చుబడిన మానవ జాతి కాక

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

5 Responses to ఇప్పుడైనా..

  1. నేటి ఆధునికుల (?) మనస్తత్వానికి వర్తించే మాటే చెప్పారు. ‘ఎటు చూస్తే అటు మొగ్గే మేధస్సు..’ అని! అభినందనలు!

  2. నేనే says:

    చాలా బావుంది, మీ అగ్రహ ప్రకటన.. ఎంతమందిని కదిలిస్తుందో? మరెంతమందిని దహిస్తుందో చూడాలి.

  3. జాన్ హైడ్ కనుమూరి says:

    హ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్ …..

    బాగుంది
    బాగుంది….
    ———-
    ఎక్కిన విషం విదిలించేసుకుని కళ్ళువిప్పిన నూతన తేజస్సును

    ఆధునికత నెన్నుదుటన ప్రజ్వలించే సూర్యబింబాన్ని

    వ్యక్తిత్వం పీల్చుకుంటూ, గాయపరచే ముళ్ళపొదలను నరుక్కుంటూ

    స్రవిస్తున్న రక్తాశ్రువులతో కొత్తదారులు వేసుకుంటూ

    ప్రేమ పూల తివాసీ పరచే నూతన శకాన్ని నేను
    ————-
    ఏదీ నిశ్చలంగా వుండదు
    మార్చవచ్చు
    మార్చగలం
    మార్చగలను

    అభినందనలు

  4. suresh says:

    అమ్మా మీ ఆగ్రహం సంస్కృతీ సాంప్రదాయాల మీదా?

    ద్వితీయార్ధం బాగుంది. బహుశా నాకదే అర్ధమైందేమో, నేనిప్పుడిప్పుడే కవిత్వాన్నికి అలవాటు పడుతున్నను. మీరు కాస్త ఓపిక వహించి మొదటి భాగానికీ రెండవ భాగానికి గల సామ్యమేమిటో వర్ణించగలిగితే క్రుతజ్ఞ్నున్ని

    సురేష్

  5. rosaiah says:

    Good

Comments are closed.