అమంగళమప్రతిహతంబయ్యెడిన్..

గమనిక: ఈ కథ చదివేప్పుడు కథాగమనానికి అడ్డుపడుతూ చిప్పగుర్తులలో (Brackets) ఏవేవో అదనపు విషయాలు చెప్పవలసి వచ్చింది. వాటిని ఒగ్గేయచ్చు, లేదా కలిపి చదువుకోవచ్చు, లేదా వాటినే చదువుకోవచ్చు. అదంతా పాఠకుల ఇచ్ఛ. – రచయిత

*********************************************************
Year – 2131
Month – November.

లేదా శకసంవత్సరం 2043. ఖరనామ సంవత్సరం,కార్తీకమాసం.
*********************************************************

హరీష్ ఒక – “ఆఫ్టర్ మారీడ్ లైఫ్” కౌన్సిలరు. ఇదేదో మునిసిపల్ కౌన్సిలర్ లాంటిది కాదు. కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే అనేక అధునాతన ఉద్యోగాలలో ఇదొకటి. దీనికి కావలసిన క్వాలిఫికేషన్., ఏదో ఒక మాస్టర్స్ డిగ్రీ, నగరంలో ఖరీదైన కోచింగు సెంటర్లో తీసుకున్న కోచింగు. కోచింగు అంటే చీప్ గా లెక్కించరాదు. ఒక కోటి రూపాయల ముడుపు చెల్లించుకుని ఒరగబెట్టిన ఒక ప్రొఫెషనల్ విద్య. విడాకులు తీసుకుందామన్న జంటలకు రకరకాల దారులు చూపడం, కుదరకపోతే  విడాకులు ఇప్పించడం, ఆ తర్వాత లీగల్ వ్యవహారాలు అన్నీ చూసి సర్దుబాటు చేసెయ్యడం వృత్తిలో భాగాలు.

హరీష్, వినయ్ ఇద్దరూ వయసు తేడా ఉన్నప్పటికీ చిన్నసైజు స్నేహితులు. జీవితం అంతా ఆన్లైన్ మీద నడుస్తూంటూంది కాబట్టి – స్నేహితులనే పదానికి అర్థం కుంచించుకుపోయింది. కానీ వాళ్ళిద్దరూ ఒకే కోచింగు సెంటర్లో వేరు వేరు కోర్సులకు డబ్బు తగలెట్టారు కాబట్టి ఆ పదం వాడవచ్చు.

తెలుగునాట ’నా ప్రేమే నీ దౌర్భాగ్యం’ – క్లుప్తంగా NPND – అనే తెలుగు సినిమా పరమ భీభత్సంగా హిట్టయి, ’పది’ రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. సినిమా రాకముందే డీవీడీ కూడా వచ్చేసింది. ఆ సినిమా మిత్రులిద్దరికీ నచ్చింది. అంతే !కనెక్ట్ అయిపోయారు. ప్రియురాళ్ళ పేర్లు ఒకేలా ఉండడం అన్న కాన్సెప్టుతో ఆ సినిమా రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది.సినిమా నచ్చడంతో తెలుగు సినిమా అభిమానులైన వినయ్, హరీష్ తమ జీవితానికి ఆ కాన్సెప్టును అన్వయించుకున్నారు.ఇద్దరూ డేటిమొనీ (డేటింగ్ + మేట్రిమొనీ)లో  ’సరిత’ అనబడే పేరు గల అమ్మాయిలనే  ఇద్దరూ వెతికి పట్టుకుని కొన్ని నెలలు ’అర్థం’ చేసుకుని పెళ్ళి చేసుకున్నారు.

ఆ తర్వాత జంటలకు ఆన్ లైన్లో పెళ్ళి జరిగింది. డేటిమొనీ.కాం లో అదివరకే రిజిస్టర్ చేసి ఉన్నారు కాబట్టి, శాస్త్రోక్తంగా ఆన్లైన్ లోనే తమ తమ ఫోటో లను పంపి కాశీయాత్ర, మాంగల్యధారణ, సప్తపది, నాగవల్లి ఇత్యాది వివాహసంబంధ శుభకార్యాలను ’శాస్త్రోక్తంగా’ ఘనంగా నిర్వహించుకున్నారు.ఆ వెబ్ సైటులో రిజిస్టరు చేసుకుంటే చాలు. వధూవరుల తరపున ఆ సంస్థవాళ్ళు అన్ని కార్యక్రమాలను తలనెప్పుల్లేకుండా ఏనిమేషన్ ప్రక్రియ ద్వారా చేసేస్తారు. ఆ తర్వాత ఆ కంటెంటును ఎవరికి షేర్ చేయాలో వారి పేరు కంప్యూటరుకు చెబితే చాలు. వారికి చేరుతుంది. వధూవరులకు చల్లవలసిన అక్షతలు కూడా ఆ సంస్థ కలెక్ట్ చేసుకుని వధూవరులిద్దరికీ పార్సెల్ చేస్తుంది.అలాగే ఆహూతుల గిఫ్ట్ లు కూడా డోర్ డెలివరీ చేయబడతాయి. ఆ తర్వాత సోడెక్సో భోజన పత్రాలు ఆహూతులకు పంపి వారికి ఇష్టమొచ్చిన హోటల్లో పెళ్ళిభోజనం చేసెయ్యమని చెప్పేశారు. ఇలా పెళ్ళి ఘనంగా జరిగింది.

అలా జరిగిన పెళ్ళి విజయవంతంగా నాలుగు నెలలు కొనసాగింది. పెళ్ళయిన నాల్గవ నెలలో ఓ రోజు అశుభసూచకంగా హరీష్ ఎడమకన్ను అదిరింది. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య పొద్దస్తమానం బతకడం వల్ల రేడియేషన్, దాని వల్ల కళ్ళు అదరడం పాత జబ్బే. అయితే ఆ రోజు కొంచెం  ఎక్కువగా అదిరింది – బుల్ డోజర్ కంకరరోడ్డు మీద వెళ్ళినట్టు. బోనస్ గా ఎడమభుజమూ అదిరింది. తన భార్య తనకోసం ఆర్డర్ చేసిన భోజనం పార్సెల్ విప్పి చూశాడు. అంతే! అందులో ’గోంగూర’ ఉన్నది! అదొక భయంకరమైన అనుభవం. హరీష్ కు గోంగూర అంటే చిన్నప్పట్నుంచీ అలర్జీ. గోంగూరను తినటం కాదు, చూస్తేనే అతనికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పెళ్ళికి ముందు చాటింగులో చాలా ఇంపార్టెంటు విషయాలు మాట్లాడుకున్నప్పటికీ, ఈ విషయం ఎంచేతనో సరితకు చెప్పడం మర్చిపోయాడు. నిజానికి హరీష్ ఫేస్ బుక్ ప్రొఫైల్ లో ఈ విషయం ఉన్నది. అయితే సరిత సరిగ్గా ఆ విషయం గమనించకపోవడంతో కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్ వచ్చి పడింది. పెళ్ళి తర్వాత ఇద్దరికీ ’ప్రొఫెషనల్’ పనులు ఉండటం వల్ల కలుసుకుని మాట్లాడుకోవడం కుదరలేదు.

భవిష్యత్తు వివాహాలు, విడాకులు

ఆ రోజు రాత్రి ఒంటిగంట. సరిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాబట్టి రాత్రిపూట ఆఫీసులో పని సర్వసాధారణం.

హరీష్ మైన్యూట్ పీసీని సెల్ ఫోన్ మోడ్ లో తెరిచి ’మైన్యూట్ మెసేజ్’ చేస్తూ సరితతో చాట్ చేయసాగాడు. వారి సంభాషణ ఇలా సాగింది.

(మైన్యూట్ మెసేజ్ అంటే తను అనుకున్న పదం మొదటిఅక్షరం మాత్రమే టైపిస్తాడు. కంప్యూటర్ అతను కీబోర్డును ఎంత బలంతో నొక్కాడన్న దాన్ని బట్టి అతని మానసిక స్థితిని అంచనా వేసి అతను నొక్కిన లెటర్ కు అనుగుణమైన పదాన్ని సూచిస్తుంది.దాన్ని యూజర్ ఓకే  చేస్తాడు.అలాగేకీబోర్డు, కెమెరా  కలిపి చిహ్నాన్ని నిర్ణయిస్తాయి.అది మెసేజ్ కు జోడించబడుతుంది. ఇక్కడ కథ నడవడం కోసం కొంత కంప్యూటరు, కొంత మామూలు భాష కలగలిపిన సంకరభాషలో చెప్పుకుందాం)

“ఈ రోజు నువ్వు పంపిన భోజనంలో గోంగూర ఉంది. ఇదెలా జరిగింది?”  (చివర్న వేలి తాకిడిని బట్టి అసహనపు గుర్తు జోడించింది కంప్యూటరు)

“చాలా బిజీగా ఉంటూ కూడా నీకోసం మీల్స్ ఆర్డర్ పంపాను. గోంగూర ఉండటం పెద్ద నేరమేం కాదే!”(స్పేస్ బార్ పై వేలు కొన్ని మైక్రోసెకన్లు ఎక్కువగా కదలాడ్డం వల్ల అయోమయం, నిర్లక్ష్యం సింబలొకటి తగిలించబడింది)

“నాకు దాన్ని చూస్తే అలర్జీ అని నా ప్రొఫైల్లో స్పష్టంగా రాశాను.” (స్థిరత్వాన్ని సూచించే సింబలు-చూపుడు వేలు ఊనిక ఎక్కువ)

కీబోర్డు, వెబ్ క్యామ్ ’చట్టం’లా తమపని తాము చేసుకుపోతున్నాయి.

“గమనించలేదు. మర్చిపొండి, ఇప్పుడేమయిందని” (నిర్లక్ష్యం, ఆశ్చర్యం – తల ఎగురవేయడాన్ని కెమెరా కన్ను చూసేసింది)

“హౌ కెన్ ఐ? ఐ కాన్ట్” (విస్మయం! అనంగీకారం!కెమెరా కన్ను పరిధి దాటి ఊగిన తల )

“వాట్ టు డూ నౌ?” (అసహనం – చేతులు తెరుచుకోవడం గమనించిన కెమెరా)

“మనిద్దరికీ చెల్లుబాటు కాదు. ఇద్దరి అభిరుచుల్లో తేడా ఉన్నా, పెళ్ళయిన తర్వాత వర్కవుట్ చేద్దామని అన్నావు. ఇప్పుడు నా ప్రొఫైలే చూడలేదంటున్నావు.” (కోపం, విభ్రాంతి – కళ్ళు డీకోడ్ చేసి కనుక్కున్న కెమెరా, వేళ్ళు బలం రుచి చూసిన కీబోర్డు!)

“షిట్! ఆర్యూ క్రేజీ?” (నిర్లక్ష్యం, కోపం, బాధ వగైరా పక్క బొత్తాముకు పాకిన కీబోర్డు నొక్కుడు)

అంతే! హరీష్ అరికాలిమంట నెత్తికెక్కింది. ఆంగ్లభాషలో అతనికి నచ్చని ఏకైక పదం అది. ఇదివరకు సరితతో ఆ విషయం చెప్పాడు. ఆమె తన ప్రొఫైల్ చూడడం మొదటి తప్పయితే షిట్ అనడం అంతకన్నా పెద్ద తప్పు.

“మనకూ మనకూ వర్కవుట్ అవదు. లెట్స్ డిపార్ట్. ఇట్స్ బెటర్” – (సింబల్ లేదు. కారణం కీబోర్డు బొత్తాము తెగింది! కెమెరా క్రాష్ అయింది)

“ఓకే. ఏజ్ యూ విష్” – అని చెప్పి సరిత చాట్ బంద్ చేసింది.

హరీష్ కంప్యూటర్ లో నీలితెరలు క్రమ్మడంతో అది చూడలేకపోయాడు.

– ఆ తర్వాత హరీష్ ,సరిత  – వీరి జీవితంలోనూ నీలినీడలు కమ్ముకుని  విడాకులు మంజూరయాయి. రీజన్ – “కమ్యూనికేషన్ గేప్” అని చెప్పారు.

**********************************************************

రెండవ విడాకుల కథ:

వినయ్, సరిత పెళ్ళికి ముందు ఆన్లైన్ లోనే ఫోటోలు చూసుకోవడం, వాయిస్ చాటులు చేయడం, వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ల ద్వారా పక్కపక్కన కూర్చున్న ’అనుభూతి’ చెందడం వంటివి చేశారు. ఇలా మూడు నెలలు ఆన్లైన్ ద్వారా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే పెళ్ళి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. రోజస్తమానం పని చేస్తున్నప్పటికీ, పెళ్ళయిన తర్వాత కనీసం నెలకు ఒక్కరోజయినా కలిసి ఉండాలని తీర్మానించుకున్నారు. అయితే (భార్యల దృష్టిలో) చాలామంది మగవాళ్ళలాగే వినయ్ ప్లానింగు లేని మనిషి కావడంతో, పెళ్ళయి నాలుగు నెలలయినా ఒక రోజయినా కలిసి గడపడం ప్లాన్ చేయలేకపోయాడు.

(మళ్ళీ భవిష్యద్దర్శనం: భార్యాభర్తల ఆఫీసులు వందలమైళ్ళ దూరంలో ఉంటాయి కాబట్టి పెళ్ళయినా ఎవరి ఆఫీసుల దగ్గర వాళ్ళు ఇళ్ళు అద్దెకు తీసుకుని ఉంటారు. వీకెండ్సు కూడా అలిసిపోయి బయటకు కదలలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి మొగుడుపెళ్ళాలు కలిసి భోజనం చేసే సందర్భం కూడా అరుదు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఇద్దరూ కలిసి ఉండడం కుదరదు. అందుకూ అనేక కారణాలు )

పెళ్ళికి ముందు తను చూసిన అమ్మాయిలో అన్నీ ఉత్తమ గుణగణాలు ఉండటం, అవే గుణగణాలు పెళ్ళయిన తర్వాత నశించటం (లేదా లేనట్టు రియలైజ్ అవడం) పురుషులకు సంబంధించిన కాలాతీతమైన ప్రకృతిధర్మం. ఈ ధర్మం తన ప్రభావాన్ని వినయ్ పై చూపించింది.ప్రస్తుతం వినయ్ ప్రకృతిధర్మాన్ని అప్రకృతిక న్యాయంతో జయించే ప్రయత్నంలో ఉన్నాడు. (చదువరులారా, ఖంగారుపడకండి. వినయ్ విడాకులకోసం ప్రయత్నిస్తున్నాడు అని చెప్పవచ్చాను)

వినయ్ కు హరీష్ పెళ్ళి పెటాకులైందని ఇదివరకే తెలుసు. దానికి కారణం కమ్యూనికేషన్ గేప్ అని కూడా విన్నాడు. తన విడాకులకు కారణం కూడా ప్రొఫెషనల్ ప్రెషర్ కాదని, కమ్యూనికేషన్ గాపేనని అతని అనుమానం. అంచేత ఆన్లైన్లో విడాకుల ప్రయత్నానికి కారణం – అలానే చూపాడు. హరీష్ మాత్రం వినయ్ సరిత ల మధ్య కమ్యూనికేషన్ గేప్ లేదని భావిస్తున్నాడు.

ఈ నేపథ్యంతో – ప్రస్తుతం

హరీష్, వినయ్ ల మధ్య కాన్ఫరెన్సు కాల్ జరుగుతూంది.

“మీరూ సరితా ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు” అడిగాడు హరీష్.

దీర్ఘంగా నిట్టూర్చాడు వినయ్. “మీరూ సరితా ఎందుకు విడిపోయారో.. అందుకే” అన్నాడు.

“కానీ విషయం మీకు ముందే తెలుసుగా” అసహనంగా అడిగాడు హరీష్. (మా జంట లాగా మీకు కమ్యూనికేషన్ గేప్ లేదు కదా అని దాని అర్థం)

“మీకూ ముందే తెలుసు.. కాదనగలరా?” సూటిగా అడిగాడు వినయ్. (“విడాకులు తీసుకోడానికి ముందు మీరు సరితకు గోంగూర గురించి చెప్పారుగా” – అని అర్థం)

“తెలుసనుకోండి. ఇగో అన్నది ఒక్క మారు వచ్చిన తర్వాత సంసారం కొనసాగిస్తే – ఆ ఇగో మల్టిప్లై అవుతుందని కేస్ స్టడీలు అనేకం చెబుతున్నాయి.ఐ థింక్ అవర్ కేస్ ఈజ్ జెన్యున్” – సమర్థించుకున్నాడు హరీష్. ఎంతైనా తన ప్రొఫెషనే అది.

“అవుననుకోండి!” – నీళ్ళు నమిలాడు వినయ్.

“పెళ్ళంటే కలుసుకుని మాట్లాడుకోవడం, అమ్మాయి సిగ్గుపడటం, అబ్బాయి పూలు తీసుకువచ్చి అమ్మాయి తలలో తురమడం గట్రా చాలా ఓల్డ్ ఫేషన్. ఇవన్నీ బూర్జువా ఆలోచనలు. మన తరం ఎంతో ముందుకు సాగింది. ఇలాంటి వాటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? అలాటి ఊహలను రానివ్వకండి. ఏదైనా సహజమైన సమస్యలుంటే మాట్లాడుకోవచ్చు” – హరీష్ అన్నాడు. (సహజం అసహజమనే అర్థం సంతరించుకుని ఆధునికత అనే అలంకరణ చేసుకున్న ది)

వినయ్ మాట్లాడలేదు. తన తరం బూజుపట్టిన భావాలను వదిలించుకుని అభివృద్ధిపథంలో దూసుకెళ్ళింది. అయినా తనకు పెళ్ళి, భార్య – వీటి మీద సెంటిమెంట్స్ రావడమేమిటి?ఇది తన వీక్ నెస్సా?

“కొంపతీసి మీలో శృంగారభావాలు వచ్చినయ్యా? అలా ఒకవేళ మనసులో ఉన్నా బయట అనకండి. భార్యతో శృంగారభావాలు ఉండవచ్చుగాక. అయితే వాటిని డిమాండు చేయటం స్త్రీ వ్యతిరేకచట్టం కిందకు వస్తుందని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనతరానికి కృత్రిమ గర్భధారణ అనే అయాచిత వరం ఉంది. భార్యమీద శృంగారభావన పెంచుకొని అనవసర కాంప్లికేషన్స్ లో ఇరుక్కోకండి” – లోగొంతుతో వివరిస్తూ వారించాడు హరీష్. (భవిష్యత్తులో దేనికైనా భార్యను అర్థించడం తప్ప, డిమాండు చేయటం నేరమవుతుంది.)

మరెలా? తనూ, సరితా ఆఫీసులకు లీవ్ పెట్టుకుందామంటే కనీసం ఐదేళ్ళ ముందే అప్లికేషన్ పెట్టాలి. అంతవరకూ వేచి చూసే ఓపిక వినయ్ కు అస్సలు లేదు.

హరీష్ వైపు చూసి సాభిప్రాయంగా తలూపాడు వినయ్. కొత్తగా సవరించిన రూల్సు ప్రకారం విడాకులు ఎప్పుడు కావలసినప్పుడు, కారణాల్లేకుండా మంజూరు చేయబడతాయి. అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టుకు కన్సల్టింగు ఛార్జెస్ ఇచ్చుకోవాలి. ఇంకొన్ని లీగల్ ఫార్మాలిటీస్. ఎలానూ హరీష్ చూసుకుంటాడు.

– కొన్ని రోజులకు విడాకులు మంజూరయాయి.

*********************************************************

పల్లెలో ఒకానొక ఓల్డ్ ఏజ్ హోం లో ఉన్న వినయ్ తాతకి ఓ రోజు ఎవరో మెసేజ్ పంపారు. మనవడు పెళ్ళి చేసుకున్నట్టు, ఆ తర్వాత కుదరకపోవడంతో విడాకులు తీసుకుంటున్నట్టు. నిజానికి అలాంటివి చెప్పడం నిషిద్దం. అయితే ఎలానో లీక్ అయింది. ముసలాయన కొట్టుమిట్టాడాడు. తనకే ఏదో అయినట్టు ఉక్కిరిబిక్కిరయ్యాడు. గతించి పుణ్యం కట్టుకున్న అర్ధాంగి గుర్తొచ్చిందేమో. ఏదో చెప్పాలనుకున్నాడు. వినేవాళ్ళు లేరు!  ఆ రోజు రాత్రి ఆయన నిదురలోనే శాశ్వతంగా నిదురపోయాడు.

*********************************************************

తర్వాత రోజు వినయ్ కు తండ్రి ద్వారా మెసేజ్ వచ్చింది. తాత గారు స్వర్గస్థులయారని. వినయ్ కాసేపు చూసి ఆ మెసేజ్ ను స్పామ్ లోకి నెట్టేశాడు.

*********************************************************

వాళ్ళిద్దరికీ మరో బంధం వచ్చేవరకూ ఈ కథ అప్రతిహతం.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

4 Responses to అమంగళమప్రతిహతంబయ్యెడిన్..

  1. nagamurali says:

    రవి, కథ బాగుంది. కానీ 2131 దాకా ఆగక్కర్లేదేమో… ఆ కథలోని ‘తాత’ మనమే కావొచ్చు.

    My vision of the future is more cynical… Closer to ‘The Stepford Wives’ (or Husbands, for that matter)…

  2. రవి says:

    అమంగళము ప్రతిహతమగుగాక! 🙂

  3. రాబోయే ఈ దశకు సిగ్గుపడాల? గర్వ పడాలా? ఎనీవే excellent presentation

  4. Naresh says:

    Chala bagundi

Comments are closed.