శివాజ్ఞ …

నమ్మకద్రోహంజగ్గడు ఆయింటిపైపే దృష్టి సారించివుంచి పది నిముషాలపైనే అయింది. ఆయింటి చుట్టూరావున్న ఖాళీ జాగాలో రకరకాల పూలమొక్కలు ఒక క్రమంలో ఉన్నాయి. ప్రహరీగోడకు దగ్గరగా వీధి గేటుకి ఇరుప్రక్కలా రెండు కొబ్బరిచెట్లు, పెరటివైపున్న దానిమ్మ చెట్లు, కరివేపాకుచెట్టు దూరంనుంచే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయింటి ఆవరణంతా నీటుగావుంది. ఆ స్థలాన్నంతా ఆయింట్లోని ముసలాళ్లిద్దరూ జగ్గడిచేత శుభ్రంచేయించినరోజే వచ్చింది జగ్గడికో దురాలోచన. అది ఎలాగైనా ఈరోజు అమలుపరచాలనే స్థిర నిశ్చయానికొచ్చాడు. అందుకే గత రెండు రోజుల్నుంచి నిఘా వేసి ఆనుపానులు చూసుకున్నాడు. సరైన సమయమేదో తెలుసుకున్నాడు.

సరిగ్గా అప్పుడే ఆయింట్లోని హాల్లో గడియారంలోంచి బయటకొచ్చిన చిలకబొమ్మ ఆరుసార్లు అరిచి మళ్ళీ లోపలికి దూరింది. డైనింగ్‍టేబుల్‍ దగ్గర నిలబడి పరాంకుశం గారు బ్రెడ్‍ముక్కకి వెన్న రాశారు. షెల్ఫ్‍లోంచి భద్రంగా దాచివుంచిన కాగితంపొట్లం తీశారు. ఆపొట్లంలోని పొడిని బ్రెడ్‍ముక్క మీద జల్లారు. మరో బ్రెడ్‍ముక్క తియ్యబోతూ ఏదో గుర్తొచ్చి ఆగిపోయారు. వంటింట్లోవున్న భార్యనుద్దేశ్యించి, ‘శాంతా! చిల్లరలేక బేకరీవాడికి నిన్నటి బ్రెడ్‍కి బాకీ ఉండిపోయింది. షాపు తెరిచాడేమో చూసి వాడి బాకీ కూడ తీర్చేసి వస్తాను. అప్పుడు మనం బ్రెడ్ తిందాం.’ అని ఆమెకసలు వినిపించిందోలేదో కూడ పట్టించుకోకుండా అడుగు బయటకు వేశారు. డైనింగ్ టేబుల్ మీద బ్రెడ్‍ముక్క అలాగే పడి ఉంది. టేబుల్‍ పైన ఫ్యాన్‍ తిరుగుతూనే ఉంది. బేకరీనుంచి తిరిగొచ్చేలోగా ఏ అవాంతరం ముంచుకొస్తుందో ఊహించలేకపోయారతను.

పరాంకుశంగారు చేతికర్ర ఊపుకుంటూ ఇంట్లోంచి బయటపడి పది నిముషాలు కావస్తోంది. లోపల శాంతమ్మగారొక్కరే ఉంటారని తెలుసు. అయినా జగ్గడు తను అనుకున్న పనిచెయ్యటానికి ఇంకా సరైన అదనుకోసం వేచివున్నాడు.

అప్పుడే పాలబ్బాయి బైక్ ఆయింటి ముందుకొచ్చి ఆగింది. పాలబ్బాయి రెండు పాలప్యాకెట్లు క్రేట్‍లోంచి తీసి పట్టుకుని గేట్లోంచి లోపలకి నడిచాడు.

ఆ యింటి మెయిన్‍డోర్ తీసేవుంది. కాని గ్రిల్ తలుపు వేసివుంది. పాలబ్బాయి, అలవాటు ప్రకారం ఇంట్లోకి చూశాడు. అప్పుడతడికి తెలీదు – ఆ మర్నాడు అతడలా మళ్లీ చూడలేడని!

హాల్లో ఎవరూ కనబడకపోయేసరికి కాలింగ్‍బెల్ నొక్కాడు. ‘శాంతమ్మగారూ!’ అని కేక వేశాడు.

ఆసమయానికి మరిగిన నీళ్ళు ఫిల్టర్‍లో పోయబోతున్నావిడ కాస్తా ఆ గిన్నెనక్కడే వదిలి గబుక్కున వంటింట్లోంచి హాల్లోకి వచ్చింది.

వీధివైపు చూసి, ‘వస్తున్నానుండరా! రోజూ ఇంతే! ఒంటికాలిమీద నిలబడతావు. క్షణం ఆలస్యం చేశానంటే చాలు పారిపోతావు. మళ్ళీ అందరికి ఇచ్చుకుని రిటర్నులో కాని రావు. ఈలోగా అతను వచ్చేశారంటే; కాఫీ కాఫీ అని నా దుంప తెంచుతారు …’ అని వగరుస్తూ వచ్చి పాలప్యాకెట్లకోసం గ్రిల్‍లోంచే చెయ్యి బయటకు పెట్టింది.

ప్యాకెట్లందిస్తూ పాలబ్బాయి, ఆమెతో, ‘మీకొక్కరికేనమ్మా ఇలా ప్యాకెట్లు చేతికందిచడం. మిగిలినవాళ్లిళ్ళల్లో అయితే బెల్‍కొట్టడం ప్యాకెట్లు గుమ్మంలో పడేయడం. అంతే! అలా అయినా రెండు గంటలపైనే పడుతోంది అందరిళ్లల్లో ఇచ్చుకునేసరికి.’ అని వెనుదిరగబోయాడు.

శాంతమ్మగారు పాలబ్బాయి మాటలు వినిపించుకున్నట్టేలేదు. ‘ఒక్క క్షణం ఆగు! నువ్వొస్తే ఇమ్మనమని, అతను నీకివ్వాల్సిన డబ్బులు లెక్కకట్టి ఉంచారు. తీసుకెళుదువుగాని.’ అని హాల్లోకి నడిచారు.

అప్పటికే వాడు విసుగ్గా ‘ఇంకా రేపటికి కదమ్మా నెల పూర్తయేది. ఎల్లుండివ్వచ్చు కదా! ఇప్పుడెందుకంత తొందరా?’ అన్నాడు. అన్నాడే కాని అక్కడే నిలబడ్డాడు.

ఈలోగానే ఆవిడ డబ్బులతో తిరిగొచ్చి గ్రిల్‍లోంచే అందిస్తూ, ఏదో అశరీరవాణి ఆమెచేత పలికించినట్టు –

‘రేపెవడు చూడొచ్చార్రా! ఇవ్వాళ తీసుకెళిపోమన్నారు. తీసుకెళిపో!’ అని చెప్పి ఇంట్లోకి దోవ తీశారు.

డైనింగ్ టేబుల్ మీద బ్రెడ్‍ముక్క అలాగే పడి ఉంది. టేబుల్‍ పైన ఫ్యాన్‍ తిరుగుతూనే ఉంది.

పాలబ్బాయి సంతోషంగా డబ్బులందుకుని, పరుగులాంటి నడకతో తన బైకువైపు సాగిపోయాడు.

పాలబ్బాయి బైకు కదలగానే జగ్గడు ఇదే అదనని తలచి శాంతమ్మగారొక్కరేవున్న ఆయింటి వైపు పైశాచికంగా కదిలాడు.

కొంతసేపటికి పరమేశంగారు బేకరీనుంచి తిరిగొచ్చారు. అలవాటు ప్రకారం గ్రిల్‍తలుపులోంచి లోపలికి చెయ్యి పెట్టి గడియ తీద్దామంటే; వీలు లేకుండా తలుపు వేసివుంది. ‘ఇదేంటి చెప్మా, ఎప్పుడు లేనిది ఇలా తలుపేసుక్కూచుంది!’ అని ఆశ్చర్యపోతూనే కాలింగ్‍బెల్‍ నొక్కారు.

కొంత జాప్యం తరవాత మెల్లగా తలుపు తెరచుకుంది. ‘శాంతా శాంతా’ అని పిలిస్తూ అడుగు లోపలకి వేశారు. అంతే! అమాంతం అతని తలపై పిడుగు పడ్డట్టయింది. కళ్లముందు జిగేల్‍మని మెరుపులు మెరిసినట్టయి ఏం జరిగిందో తెలిసేలోపు స్పృహతప్పింది.

తెలివివచ్చేసరికి డైనింగ్‍టేబుల్‍ దగ్గర కుర్చీకి తనని తాళ్లతో గట్టిగా కట్టిపడేస్తూ జగ్గడు కనిపించాడు. ఎదురుగా డైనింగ్‍టేబుల్‍కి అటువైపు కుర్చీకి శాంతమ్మ కట్టిపడేసి కనిపించింది. ఆమె మూతికి కూడ తన మూతికిలాగే ప్లాస్టర్‍ వేసివుంది. ఆమె కళ్లల్లో భయాందోళనల్ని మించి ఆశ్చర్యం అపనమ్మకం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘తరచు తనింటికి వచ్చి కాయకష్టం చేసుకుని నాలుగు డబ్బులు ఆనందంగా తీసుకుపోయే జగ్గడేనా ఇంత ఘాతుకం చేసింది! నేన్నమ్మను!’ అన్నట్టున్నాయి ఆమె చూపులు. ఎదురుగా డైనింగ్‍టేబుల్‍పై ఒక గుడ్డ పరచివుంది. ఆ గుడ్డపైన ఆమె ఒంటి మీద ఉండాల్సిన బంగారు వెండి నగలన్నీ కుప్పగా పోసి ఉన్నాయి. వాటితోపాటు బీరువాలో దాచివుంచిన నగలు, నగదు కూడ వేసి తన కళ్లెదురుగానే మూట కట్టాడు జగ్గడు. ఒక చేత్తో మూటపట్టుకుని అడుగు ముందుకెయ్యబోయాడు జగ్గడు.

అప్పుడు పడింది జగ్గడి దృష్టి – వెన్నరాసివుంచిన బ్రెడ్‍ముక్క మీద. నోట్లో నీళ్లూరాయి. అంతే! చటుక్కున ఆబ్రెడ్‍ముక్కని తీసుకుని ఆబగా కొరికాడు. సగం ముక్క చప్పున తిన్నాడు. ఏమైందో కాని, కళ్లు తిరిగినట్టయి దబ్బున పడ్డాడు. ఆ అదురుకి చేతిలోవున్న సగం కొరికిన బ్రెడ్‍ముక్క డైనింగ్‍టేబుల్‍పై ఎగిరి పడింది. అదే సమయానికి కరెంటు పోయింది. టేబుల్‍పైన తిరుగున్న ఫ్యాన్‍ ఆగిపోయింది.

అప్పుడు పరాంకుశం మనస్ఫూర్తిగా అనుకున్నాడు – ‘భగవాన్‍! ఎలాగైనా వీణ్ణి రక్షించు. మేము ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం కాని, హత్య చేద్దాం అనుకోలేదు. మా బంగారం పట్టుకుపోయి కరిగించేసుకున్నా ఫరవాలేదు కాని మా బ్రెడ్‍ తిని అరిగించుకోలేకపోతే కష్టం! వాడికంత పెద్ద శిక్ష వెయ్యకు భగవాన్‍! …’

పరాంకుశంకంటే ఒక మెట్టు ఉన్నతంగానే ఆలోచిస్తోంది అతడి భార్య శాంతమ్మ!

ఇద్దరూ నిస్సహాయ స్థితిలో నిస్త్రాణగా కుర్చీలకతుక్కుపోయివుండిపోయారు. అలా నీరసంతో నిద్రలోకి జారిపోయారు. ఒక్కసారిగా ఒంటికి తగిలిన ఫ్యాన్‍ గాలికి ఇద్దరికీ తెలివొచ్చింది. అప్పటికి రాత్రయిపోయింది. నేల మీద జారిపడిన జగ్గడు లేచి పారిపోయాడా లేదా అని ఉత్సుకతతో పరాంకుశం కళ్లు వెతికాయి. అతడి కళ్లకి చేతిలో మూటతో నేలకొరిగిన జగ్గడు చలనంలేకుండా కనిపించాడు.

తెల్లవారింది.

హాల్లో గడియారంలోంచి బయటకొచ్చిన చిలకబొమ్మ ఆరుసార్లు అరిచి మళ్ళీ లోపలికి దూరింది. ‘శాంతమ్మగారు! శాంతమ్మగారు!’ అన్న పాలబ్బాయి పిలుపు ఇద్దరికీ వినిపించింది. కాలింగ్‍బెల్‍ ధ్వని చెవులు చిల్లులుపడేలావుంది. కానీ ప్రతిస్పందించలేకపోయారు.

డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. పాలబ్బాయి వెనక్కి వెళిపోతున్నట్టనిపించింది. మళ్లీ రిటర్నులో వస్తాడేమో అనుకున్నారు శాంతమ్మగారు ఆశగా.

మళ్లీ పాలబ్బాయి తిరిగొచ్చేలోగా ఎలాగైనా మెయిన్‍డోర్‍ వరకు చేరితే చాలని తలచి పరాంకుశంగారు సాహసించారు. ఎక్కడలేని శక్తినీ తెచ్చుకుని కుర్చీతో సహా మెల్లమెల్లగా జరుగుతూ తలుపువైపు తోవ తీశారు.

ఆలస్యంగా వచ్చిన పాలబ్బాయి రెండోసారి కూడా కాలింగ్‍బెల్‍ నొక్కి తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు.

హాల్లో గడియారంలోంచి బయటకొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలికి దూరింది.

డైనింగ్‍టేబుల్‍ మీద సగం కొరికిన బ్రెడ్‍ముక్క ఎండిపోయి పడి ఉంది.

రాత్రినుండి టేబుల్‍పైన ఫ్యాన్‍ తిరుగుతూనే ఉంది.

* * *

About ఆలూరి పార్థసారధి

పుట్టింది రాయ్‍పూర్‍లో (ప్రస్తుత ఛత్తిస్‍గఢ్‍ రాజధాని). పన్నెండేళ్ల చదువు విజయనగరంలో. ఆవూరు, పరిసరాలు, సంగీత సాహిత్య సంస్కృతీ సౌరభాల మధ్య ఎదిగే సౌభాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.

మిగిలిన రమారమి 40 సంవత్సరాలు గడిపింది గోతిలో కప్పలా రాయ్‍పూర్‍ చుట్టుపక్కలే.

మాది ఉమ్మడికుటుంబం, పెద్ద కుటుంబం కావడమే నాకు పెద్ద ప్లస్‍ పాయింటు. ఇంటి గురించి నేను పెద్దగా పట్టించుకోకపోయినా సరిపోయేది. అలా ఆడుతూపాడుతూ ఉద్యోగం చేస్తూ బి.కాం., ఎం.ఏ.(సమాజశాస్త్రం) ప్రయివేటుగా చెయ్యగలిగాను. ఆఫీసు తర్వాత ఇంట్లోనే కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం సరదాగా గడచిపోయేది. అప్పుడే రకరకాల మనుషులు, మనస్తత్వాలు, రాగద్వేషాలు, ఆదర్శాలు, అనుభవాలు, రాజకీయాలు వగైరా వగైరా మామధ్య చర్చకువచ్చేవి. ఇవన్నీ నాకు రాయటానికి ప్రోత్సాహాన్నిచ్చాయి అనుకుంటాను.

గత నాలుగు సంవత్సరాలై పదవీ విరమణ చేసి పిల్లల దగ్గర చెన్నైలో మకాం. అప్పట్నుంచే రాయటం సాధన మొదలెట్టింది. ఆర్నెల్లకో ఏడాదికో ఒకటీ అరా.

స్వంత డబ్బా : ప్రప్రధమ రచనలన్నీ ప్రచురించబడ్డాయి/బహుమతులందించాయి. తరవాతివన్నీ తిరిగొచ్చాయి! ఉదా.

2008 ‘స్వాతి’ సాధారణ కథల పోటీలో ‘మంత్రాలకు చింతకాయలు రాలునా!’కి బహుమతి
2009 ‘స్వాతి’ సరసమైన కథల పోటీలో ‘ప్రియంవదమనం’కి బహుమతి
2009 ‘స్వాతి’ అనిల్‍ అవార్డులో ప్రప్రధమ నవల ‘ఒకసుగుణం’
2010 ‘స్వప్న’ హాస్య/వ్యంగ్య కథల పోటీలో ‘బాబాయ్ బాబోయ్!!’
2010 ‘సాహితీకిరణం’ మాసపత్రిక సాయిప్రియ హోమ్స్ కథల పోటీలో ‘ఒరవడి’కి ద్వితీయ పురస్కారం
2010 ‘ఆంధ్రభూమి’ స్వర్ణోత్సవ పోటీలో ‘ఆఫీస్ గీఫీస్‍!!’ కథ
2011 ‘ఆంధ్రభూమి’ కథల పోటీలో ‘బంగారి గాజులు’ కథ
2011 ‘నవ్య’ ఉగాది కథల పోటీలో సాధారణ ప్రచురణకు ‘మా కళ్లతో చూడు!’ స్వీకృతి.
2011 ‘సాహితీకిరణం’ మాసపత్రిక కార్తికా డెవలెపర్స్ కథల పోటీలో సాధారణ ప్రచురణకి ‘జీవనమాధురి డాట్ కామ్‍’ కథ స్వీకృతి.
ఏప్రిల్‍ 2011 ‘విపుల’ ‘ఈకథ మీదే’ పోటీలో విజేత-1గా ‘నిశ్చితార్ధం’ కథకు బహుమతి.
‘విశాల భారతి’ మాసపత్రిక ఏప్రిల్‍, మే 2011 సంచికల్లో ‘ఈజన్మ నాకొద్దు!’ కథ,
ఇవికాక అడపాదడపా ‘స్వప్న’లో అరనిముషం కథలు.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

4 Responses to శివాజ్ఞ …

 1. Editorgarki,

  Thanks for giving place for “Sivagjna” in your valuable poddu.net!

  Aluri Parthasardhi.

  • పార్థసారథి గారూ! మంచి కథ వ్రాసారు. కథ ప్రారంభం, ముగింపు, తర్క సంగతమైన కథనం, మీదైన శైలి చక్కగా ఉన్నాయి.మంచి పదును ఉన్న రచన. ధన్యవాదాలు —–శ్రీధర్.ఎ

 2. kusuma siddavaram says:

  Dear saradhi uncle,
  One more fantastic story from you.The story plot is perfect and very interesting till the end.Description of the story is really tricky,good twists .Congratulations uncle.Keep going

  Kusuma

 3. srinivas says:

  Chala bagundi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *