మనిషిలోపలే…

హిందీ మూలం: రాజీవ్ పత్థరియా

తెలుగు అనువాదం: కొల్లూరి సోమ శంకర్

రోజూలానే ఈ రోజు కూడా రాకేష్ నిద్ర లేవడం ఆలస్యమైంది. ఆఫీసుకు వెళ్ళడానికి త్వరగా సిద్ధం అవుతుండగా అతని మొబైల్ మోగింది.

“హలో సార్, నేను కులూ నుంచి మాట్లాడుతున్నాను. రాత్రి కురిసిన కుంభవృష్టికి హైడల్ ప్రాజెక్ట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చాల మంది కార్మికులు నీళ్ళల్లో కొట్టుకుపోయారు. నష్టం తీవ్రంగా ఉంది” అంటూ సమాచారమిచ్చాడు స్ట్రింగర్ నారాయణ సింగ్.

పొద్దున్నే ఇలాంటి వార్త వినాల్సివచ్చినందుకు విసుక్కుంటూ, “సోదంతా ఎందుకు? ఎంతమంది పోయారో చెప్పు.నేనక్కడికి రావడం అవసరమా, లేదంటే నువ్వు రిపోర్ట్ చేసి పంపించగలవా?” అని అలవాటుగా అనేసాడు రాకేష్.

మీడియా మ్యాడ్నెస్

“క్లౌడ్ బరస్ట్ అయిన చోట నాలుగు నుంచి ఐదు డజన్ల మంది కూలీల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరూ మిగల్లేదు. సహాయకార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటిదాక ఎనిమిదో పదో శవాలు దొరికాయి. మీరు ఫోటోగ్రాఫర్‌ని తీసుకుని రండి. ఈ లోపల నేను స్పాట్‌కి వెడతాను”

“సరే నారాయణ, నువ్వెళ్ళు. నాకు రావడానికి రెండు గంటలు పడుతుంది. నేను ఫోటోగ్రాఫర్‌ని తీసుకుని వస్తాను…”అంటూ సంభాషణ ముగించాడు.

తర్వాత ఫోటోగ్రాఫర్‌కి ఫోన్ చేసి, జంక్షన్ వద్ద సిద్ధంగా ఉండమని చెప్పాడు. జరిగినది ఘోరమైన ప్రమాదం, టాక్సీ తీసుకుని అక్కడి దాక వెళ్ళాలంటే ఎడిటర్ గారి అనుమతి అవసరం. పైగా కవరేజ్ సందర్భంగా ఆయన సలహాలు తీసుకోవాలి. రాకేష్ ఎడిటర్‌కి ఫోన్ చేసాడు.

“సార్, లఖీంపూర్ ప్రాజెక్ట్ దగ్గర కుంభవృష్టి వలన వందలాది కూలీలు  నీటిలో కొట్టుకుపోయారట… నేనక్కడికి బయల్దేరుతున్నాను.. ” అన్నాడు.

“దారుణమైన ప్రమాదం.  ఈ వార్త అన్ని ఎడిషన్లలలోనూ రావాలి. అంతే కాదు సైడ్ స్టోరీ, ప్రాజెక్ట్ మానేజ్‌మెంట్ తీసుకున్న కార్మికుల రక్షణ చర్యల గుట్టు విప్పే కథనం, అధికారుల, ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి ఇంకో కథనం కావాలి.ఆ, ఫొటోలు కూడా చక్కగా ఉండాలి. కుదిరితే మానవీయ కోణంలోంచి ఓ స్టోరీ డెవలప్ చెయ్. నువ్వు బయల్దేరు, నేను నీతో మొబైల్ ద్వారా టచ్‌లో ఉంటాను. నువ్వు తిరిగి రాగానే,  హెడ్‌లైన్స్ కోసం మేటర్ ఫైల్ చెయ్యి…..” అన్నాడు ఎడిటర్.

ఆయన సూచనలు వింటూ, “అలాగే సార్, మీరు చెప్పినట్లే చెస్తారు సార్… యస్ సార్” అంటూ తలాడించాడు రాకేష్.అతని దృష్టికోణం నుంచి చూస్తే, ఈ వార్త చాలా ముఖ్యమైనది. వందలాది మంది మృతికి సంబంధించినది.

టాక్సీ మాట్లాడుకుని, ఫోటోగ్రాఫర్ అనిల్‍ని ఎక్కించుకుని, లఖీంపూర్ ప్రాజెక్టు ప్రాంతానికి తొందరగా తీసుకువెళ్ళమని డ్రైవర్‌కి చెప్పాడు.

“సార్, టివి చానెళ్లలో ఈ వార్త స్ర్కోలింగ్ వస్తోంది. 48 మంది చచ్చిపోయారని ఒక చానెల్ చెబుతుంటే, మరో దాంట్లో 150  మంది చనిపోయారని వస్తోంది. ఒకరి అంకెలు మరొకరితో సరిపోవడం లేదు. ఓ ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం నా కెరీర్‌లో ఇదే మొదటి సారి….” అన్నాడు అనిల్.

“మిత్రమా, ఇంతమంది చనిపోతే పేపర్లో మెయిన్ న్యూస్ అదే అవుతుంది. స్పేస్ కూడా చక్కనిది దొరుకుతుంది.నువ్వు తీసే ఫోటోలు ఎలా ఉండాలంటే, అన్ని ఎడిషన్లలోనూ నీవే కనీసం మూడు ఫోటోలుండాలి. ఆరు నుంచి ఎనిమిది ఫోటోలు రీజినల్ ఎడిషన్‌లో రావాలి. ” అన్నాడు రాకేష్.

“సార్, మెయిన్ ఎడిషన్‌లో వచ్చే ఫోటోల క్రింద నా పేరు తప్పకుండా వేయించండి”

“అలాగే బ్రదర్, ఎడిటర్ గారితో చెప్తాను. నువ్వు కష్టపడి మంచి ఫోటోలు తీయ్యాలి…” అని చెప్పి తను ఆలోచనల్లో నిమగ్నమయ్యాడు రాకేష్. ఆ దుర్ఘటన వార్తని ఎంత అద్భుతంగా ప్రెజంట్ చెయ్యాలో ఆలోచించుకుంటున్నాడు.

చిన్నప్పుడు శవాలని చూస్తేనే భయపడే రాకేష్ ఇప్పుడు ప్రతీ వార్తని చనిపోయిన వారి సంఖ్యతో కొలుస్తున్నాడు. బహుశా, కాలక్రమంలో రొటీన్‌గా పని చేయడం అతనిలో మానవీయ సంవేదనల్ని అణచివేసిందేమో? పత్రికల యుగంలో తీవ్రంగా నెలకొని ఉన్న పోటీ వలన రాకేష్ బుర్రలో ఎప్పుడూ ఎక్స్‌క్లూజివ్ న్యూస్ గురించిన ఆలోచనలే పరిభ్రమిస్తుంటాయి. నిన్న రాత్రి కూడా అతను  అలాంటి ఆలోచనలే చేస్తున్నాడు – ఏ రాజకీయ నాయకుడిదైనా లేదా ఏ ప్రభుత్వాధికారిదైనా గుట్టు రట్టు చేయాలని ! ప్రతీ రోజూ ఎదో ఒక రహస్యాన్ని బయటపెడుతూ, అతను విసిగిపోయాడు. కానీ ప్రభుత్వం చెవులకి అవేం ఎక్కడం లేదు. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం లేదా అధికారులు ఓ విచారణా సంఘం వేస్తారు, కొంత కాలానికి అందరూ దాని గురించి మర్చిపోతారు. వార్తా ప్రపంచంలో ఇప్పుడు అతను కూడా సామాజిక ప్రయోజనాలు విస్మరిస్తూ, ఏదో వార్తల సేకరణకే ప్రాముఖ్యత నిస్తున్నాడు. తన వార్త సమాజానికి మేలు చేస్తుందా, చేటు చేస్తుందా అనేది అతనికి అనవసరమై పోయింది. పత్రికా రంగంలో ప్రవేశించిన కొత్తలో ఏదైనా దుర్ఘటన లేదా ప్రమాదం గురించి వార్త రాయాల్సివస్తే, అతను ఆసుపత్రికి వెళ్ళేవాడే కాదు. తన సహోద్యోగులని పంపేవాడు. ఒక వేళ ఆసుపత్రికి వెళ్ళాల్సివచ్చినా, అతను డాక్టరు గారి గదిలో కూర్చునేవాడు, అతని మిత్రులు గాయపడిన వారిని పరామర్శించేవారు….అతనికి వార్త దొరికేది.

ఈ రోజు చాలా దూరం ప్రయాణించాల్సి రావడంతో రాకేష్‌ బుర్రలో ఎన్నో ఆలోచనలు ముసురుకుంటున్నాయి.హఠాత్తుగా అతని మనసులో ఓ ప్రశ్న మెదిలింది – “నేను మొదట విలేఖరినా? మనిషినా? నాకూ సమాజానికి ఉన్న సంబంధం విలేఖరి లేదా పత్రిక సంబంధమేనా? నేను కేవలం సంచలనాలను వెల్లడించడానికే పుట్టానా?”

ఇటువంటి ప్రశ్నలు అతని మనసులో ఉదయించడం ఇదే మొదటిసారి.

ఇంతలో టాక్సీ లఖీంపూర్ చేరుకుంది. అక్కడి నుంచి లింక్ రోడ్డు మీదుగా ప్రాజెక్ట్ సైట్ దగ్గరికి వెళ్ళాలి. “సార్, ఇదే లఖీంపూర్, మనం ఎటువైపు వెళ్ళాలి?” అడిగాడు డ్రైవరు. కొంచెం ముందుకు పోనివ్వమన్నాడు అనిల్. వాళ్లు కొంచెం ముందుకు వెళ్ళేసరికి సహాయక చర్యల కోసం వచ్చిన ఓ వ్యాన్ కనపడింది. మరో వైపు రోడ్డు మీద ఆహారం కోసం వంట చేస్తున్నారు. తుంపరగా కురుస్తున్న వర్షంలో వణుకుతూన్న జనాల ముఖాలపై దుఃఖం చిహ్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రిలీఫ్ కాంప్ దగ్గర ఆగి ప్రమాదం ఎక్కడ జరిగింది, దాని తీవ్రత ఎంత.. మొదలైన వివరాలను సేకరించాడు రాకేష్. విరిగిన వంతెనని దాటుకుంటూ, టన్నెల్ వైపు ప్రయాణం సాగించాడు. అనిల్ కూడా ఫోటోలు తీసుకుంటూ రాకేష్‌ని అనుసరించాడు. మిగిలి ఉన్న సామాన్లను పట్టుకొని, శోకాలు తీస్తున్న బాధితులెందరో దారిలో ఎదురయ్యారు. మానవత్వాన్ని గుర్తు చేసే హెచ్చరిక అయినప్పటికీ, అతను దాన్ని పట్టించుకోలేదు. అతనో విలేఖరి.జనాల దుఃఖంతో పనిలేదతనికి, కావల్సిందల్లా వార్త మాత్రమే.

ఇంతలో కాశ్మీరు నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న పనివాళ్ళ బృందం ఒకటి రోదిస్తూ అతనికి ఎదురయ్యింది. కాశ్మీరు లోని తీవ్రవాదం, ఈ ప్రమాదం రెండిటినీ జోడిస్తూ ఓ ఆర్టికల్ రాస్తే బాగుంటుందని రాకేష్‌కి అనిపించింది. ఆ గుంపులో ఉన్న ఓ మధ్య వయస్కుడిని ఆపి ప్రశ్నించసాగాడు.అతని పేరు మీర్ భక్ష్.  ఎవరి దిష్టో తగిలి కాశ్మీరం అల్లకల్లోలంగా ఉంటోందట.  పొట్టపోసుకోడానికి, నాలుగు రాళ్లు సంపాదించుకోడానికి, కుటుంబాన్ని విడిచి ఇక్కడికి వచ్చాడట. కానీ దురదృష్టం నీడలా వెంటాడిందట. కూతురి పెళ్ళి కోసం నాలుగు నెలలుగా కష్టపడి దాచుకున్న డబ్బంతా వరదలో కొట్టుకుపోయిందట. అంతే కాదు వాళ్ళ ఆత్మీయుడుషకీల్ భాయ్ కూడా జలసమాధి అయ్యాడట…. ఏడుస్తూ చెప్పాడతను. మీర్ భక్ష్ వెక్కిళ్ళు పెడుతూంటే, అతనితో పాటు తడిసిన దుస్తులతో ఉన్న మిగతా కాశ్మీరీలందరూ కూడా రోదించసాగారు. కానీ రాకేష్‌కి ఇదంతా చిరాకుగా ఉంది. కాని అతనికి వార్త కావాలి, కాబట్టి తప్పనిసరై వాళ్ళ గోడుని వింటున్నాడు.

ఇంతలో మీర్ భక్ష్ పక్కనే నిలబడి ఉన్న తన్వీర్ అహమ్మద్ అందుకున్నాడు – “మేమంతా సర్వనాశనమైపోయాం సార్. మాది, షకీల్ భాయ్‌ది ఒకే ఊరు. అతనికి పదేళ్ళ వయసున్న కొడుకున్నాడు. వాడి గుండెలో ఏదో చిల్లుందట. ఆ కొడుకు వైద్యం కోసమే ఇంత దూరం పనికి వచ్చాడు. పైగా షకీల్ భాయ్‌కి ఇంకో సంతానం కూడా కలగబోతోంది. కానీ ఈ కాళరాత్రి  మా వాడిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో చోట్ల వెదికాను, కానీ దొరకలేదు. ఇప్పుడే కంపెనీ వాళ్ళు చెప్పారు,షకీల్ భాయ్ శవం కింద దొరికిందట… మేమందరం క్యాంప్‌లోకి వెడుతున్నాం….”

వర్షం ఆగేట్టు లేదు. కానీ ఓ మంచి కథనం రాయడానికి అవసరమైన సమాచారం రాకేష్‌కి ఇంకా దొరకలేదు.ముందుకు వెడితే దొరుకుతుందనే ఆశతో ముందుకు వెళ్ళాడు.

ఓ రాయి దగ్గర మధ్యవయస్కుడైన నేపాలి పురుషుడు, ఓ స్త్రీ కూర్చుని కనపడ్డారు. బహుశా, దుఃఖం వలన వారికి చలి తెలియడం లేదేమో.

“కిందకి వెళ్ళి, దుప్పట్లు వగైరా తీసుకోవచ్చుగా. తినడానికి కూడా ఇస్తున్నారు, ” అంటూ రాకేష్ వాళ్ళని పలకరించాడు.

నేపాలీ ఏడుస్తూ… “సాబ్, మేమెలా వెళ్ళగలం సాబ్, మా కొడుకు ఆ రాళ్లకింద ఇరుక్కుపోయాడు. వాడిని బయటకు తీయించండి సార్.. దేవుడు మీకు మేలు చేస్తాడు…” అంటూ చెప్పాడు. రాకేష్ కొంచెం ముందుకు వెళ్ళి చూసాడు. ఒక పెద్ద రాతిబండ కింద సగం శరీరం చిక్కుకుపోయి నిస్సహాయంగా పడి ఉన్న ఓ యువకుడు కనిపించాడు. అతని కాళ్ళు మాత్రమే బయటకి కనబడుతున్నాయి. తన్నుకొస్తున్న ప్రవాహంలో అతని కాళ్ళకి వేలాడుతున్న పాంటు కూడా కొట్టుకుపోయింది. ఇంతటి దారుణమైన చావుని చూసాక ఎవరైనా సరే, ఇకముందు ఇలాంటి పనులు చేయమని ఒట్టేసుకుంటారు, దేవుడిని తిట్టుకుంటారు. కానీ రాకేష్ ఇవేమీ చేయలేదు. ఆ నేపాలీ బయోడేటా సేకరించడం మొదలుపెట్టాడు. ఇంతలో రగ్గులు పంచుతూ ఒక ప్రభుత్వోద్యోగి కనబడ్డాడు. చలికి వణికిపోతున్న ఈ ఇద్దరు నేపాలీలకి రగ్గులివ్వమని చెప్పాడు రాకేష్. నగ్నంగా ఉన్న శవంపై కప్పడానికి ఇంకో రగ్గుని తీసుకున్నాడు.  ఇంతలో అనిల్ అన్నాడు – “సార్, టైం నాలుగు గంటలవుతోంది, మనం హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళాలి”.  రాకేష్ లోపల ఉన్న మనిషి కొద్దికొద్దిగా బయటపడుతుండేసరికి అతనిలోని విలేఖరి గద్దించాడు. తను తీసుకున్న రగ్గుని నేపాలీ చేతిలో పెడుతూ, “మీవాడిపై కప్పండి” అన్నాడు.

“సాబ్, నా కొడుకుని రాళ్ళకింద నుంచీ బయటకి తీయించండి సాబ్…” అంటూ నేపాలీ కాళ్ళావేళ్ళాపడ్డాడు. అతని వెంటే ఉన్న స్త్రీ కూడా ” మా బిడ్డని బయటకి తీయించడయ్యా” అంటూ ప్రాధేయపడసాగింది.  “నేను కిందకి వెళ్ళి,యంత్రాలని, కొంతమంది మనుషులని పంపిస్తాను” అని చెబుతూ రాకేష్ అక్కడి నుంచి కదిలాడు.

రాకేష్, అనిల్ వేగంగా రోడ్ వైపు నడవసాగారు. ఈ శవాలతో రాకేష్‌కి ఎటువంటి సంబంధమూ లేదు, అన్నీ పోగొట్టుకుని జీవచ్ఛవాలలా మిగిలిన, వారి రోదనలతోనూ సంబంధం లేదు. అతని మనసంతా కవరేజ్ ప్లాన్ తయారీలో నిండి ఉంది. ఇంతలో అతని దృష్టి శిధిలాల కింద చిక్కుకుపోయి మరణించిన వారి శవాలను జె.సి.బి మెషిన్ ద్వారా ఏరుతున్న సహాయక సిబ్బందిపై పడింది. ఓ శవాన్ని బయటకి తీస్తుంటే, దాని కాలు వేలాడసాగింది. ఆ దృశ్యాన్ని చూసిన రాకేష్‌లోని విలేఖరి చటుక్కున మేల్కొన్నాడు. అనిల్‌ని పిలిచి దాన్ని ఫొటో తీసుకోమన్నాడు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో శవాలని వెలికితీయడానికి అంతకంటే మెరుగైన పద్దతి ఇంకోటుండదని రాకేష్‌కి తెలియనిది కాదు,అయినా పాలకులకి వ్యతిరేకంగా రాయడానికి ఏదో ఒకటి కావాలి. అంతే. అతనికి కావల్సిన మసాలా దొరికింది. రిలీఫ్ క్యాంప్‌లో ఉన్న శవాల సంఖ్య రెట్టింపయ్యింది. కంపెనీ గెస్ట్ హౌజ్ లోనే రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేసారు. దాని ముందే తెల్లటి గుడ్డలు కప్పిన శవాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం జిల్లా మేజిస్ట్రేటు, పోలీసు అధికారులు మాత్రమే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి రాకేష్ వెనుదిరిగాడు. మొబైల్ సిగ్నల్స్ అందే చోటుకి వచ్చేసరికి ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. “ఎడిటర్ గారు నీ గురించి అడుగుతున్నారు, ఆయనకి ఫోన్ చేయి” ఇదీ ఆ కబురు. “ఇప్పుడే చేస్తాను”అంటూ రాకేష్ ఫోన్ పెట్టేసాడు. ఎడిటర్‌కి చేయబోతుండగానే, ఆయనే చేసారు.

“రాకేష్ ఎక్కడున్నావు? చాలా సేపటి నుంచి నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ వార్త అన్ని ఎడిషన్లలోనూ రావాలని నీకు తెలుసుకదా, త్వరగా పంపించు”

పొద్దున్నుంచి ఏమీ తినకుండా, తాగకుండా పనిచేస్తున్న రాకేష్‌కి బాస్ మాటలు కాస్త బాధ కలిగించాయి. కానీ వినయంగా మాట్లాడుతూ, “సార్, కవరేజ్ కోసం నేను ఎంత దూరం వచ్చానో మీకు తెలుసు. ప్రమాదం జరిగిన చోటు ప్రాజెక్ట్ ఏరియా నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి మేము కాలినడకన వెళ్ళాల్సివచ్చింది.  ఇంకో రెండు గంటల్లో ఆఫీసుకి వచ్చి మీకు మెయిన్ న్యూస్ పంపిస్తాను, దాంతో పాటు ఫొటోలు కూడా. ఆ తర్వాత లోకల్ పేజీల కోసం స్టోరీలు తయారు చేస్తాను…” అన్నాడు.

“సరే, చేసేదెదో త్వరగా చెయ్యి. నేను ఎక్కువ సేపు వెయిట్ చేయలేను…” అంటూ ఫోన్ కట్ చేసారు ఎడిటర్. విలేఖరి అయిన కారణంగా మానవత్వానికి మైళ్ళ దూరంలో ఉండిపోయిన రాకేష్‌ తన ఉద్యోగాన్ని తిట్టుకుంటూ, “ఏ ఆఫీసులోనైనా గుమాస్తాగా పనిచేసినా బాగుండేది. ఇంత కష్టపడ్డా కూడా ఒక్క ఫోన్ కాల్ మొత్తం మూడంతా పాడు చేసింది” అని అనుకున్నాడు. ఇంతలో అతనికి స్ట్రింగర్ నారాయణ సింగ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆసుపత్రిలో చేరిన కార్మికుల జాబితా సంపాదించాడట. జిల్లా అధికారులు తయారు చేసిన జాబితా కూడా సాధించగలిగాడట.

“సరే, రెండు లిస్ట్‌లలో పేర్లు, అడ్రసులు సరిచూసుకో. అన్నీ సక్రమంగా ఉండాలి. సహాయ కార్యక్రమాల వివరాలు ఉండాలి… వాటిని ఫాక్స్ చేయ్…” అంటూ ఆదేశించాడు రాకేష్.

చివరికి ఆఫీసు చేరి వార్తలందించాడు రాకేష్. పనయ్యాక, ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి అతనికి నిద్ర రావడానికి బదులుగా, శవాల గుట్టలు, లేదంటే హృదయ విదారకంగా రోదిస్తున్న జనాల వదనాలే కనబడ్డాయి. ముఖ్యంగా బండరాళ్ళ కింద చిక్కుకుని మరణించిన ఆ నేపాలీ యువకుడి శవం మాటిమాటికి గుర్తొస్తోంది. “నన్ను బయటకి లాగకపోతే పోనీ, కానీ నీలోని మానవత్వం కూడా బండరాళ్ళకింద అణిగిపోతోంది. దాన్నితప్పకుండా పైకిలాగు” అని ఆ శవం చెబుతున్నట్లు భ్రమ పడ్డాడు రాకేష్. ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రించలేకపోయాడు.

పొద్దున్న లేస్తూనే పేపరు పట్టుకుని కూర్చున్నాడు. ఆ రోజు పత్రికలోని వార్తలన్నీ రాకేష్ పేరు మీదే. మెయిన్ ఎడిషన్ లోని లీడ్ న్యూస్ దగ్గర నుంచి, లోకల్ ఎడిషన్‌లో పేజీల లీడ్, బాటమ్ స్టోరీస్.. వరకూ అన్నీ రాకేష్ సేకరించిన వార్తలే.ప్రమాదం యొక్క భయంకరమైన ఫొటోలను సైతం ముద్రించారు. కొంత సేపయ్యాక, కవరేజ్ చక్కగా చేసినందుకు మిత్రుల దగ్గర నుంచి, పై అధికారుల దగ్గర నుంచి ఫోన్లలో అభినందనలు రాసాగాయి. కానీ రాకేష్ ఆత్మ మాత్రం ఆ నేపాలీ యువకుడి చుట్టూ తిరగసాగింది. విలేఖరిని కాకుండా ఉంటే కష్టాల్లో ఉన్న వాళ్లకి ఎంతో కొంత సాయం చేసేవాడిని కదా అనుకుంటూ బాధపడ్డాడు. “కనీసం అంతిమ సంస్కారాల కోసం కొడుకు శవాన్ని ఆ తల్లిదండ్రులకి అప్పగించైనా ఉండేవాడిని” అని అనుకున్నాడు. కానీ హెడ్‌లైన్స్‌కి బందీ అయినతను ఇంతకంటే ఏమీ చేయలేకపోయాడు.  మనిషై ఉండి కూడా మానవత్వాన్ని ప్రదర్శించడంలో లోభత్వం కనపరిచినందుకు అతనికి దుఃఖం తన్నుకువచ్చింది.

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

One Response to మనిషిలోపలే…

  1. అనువాదం బాగుంది. తెలుగులోరాఅసినట్టుగానే. కధ మనసును తదిమి హెచ్చరించేలావుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *