నవనందనవాసంతము 1

పొద్దు పాఠకులందరికీ నందన ఉగాది శుభాకాంక్షలు. అంతర్జాల కవి కర్షకుల సేద్యంగా, రస రమ్యమైన పద్య సుమాలతో శోభిల్లిన ‘ నవనందనవాసంతము ‘ నుండి మీకై ఏర్చి కూర్చిన పూగుత్తులను అందుకోండి. ఆనందించండి.

ముందుగా ఎవరెవరు ఎలా ప్రార్థన చేశారో, ఏమి ఆకాంక్షించారో చూద్దాం.

 

సనత్ శ్రీపతి

ముందుగ నీకె మ్రొక్కెదను మోదక హస్త ముదమ్మునంది మ

న్మందిర మందు నీదు మృదు మంజుల పాదయుగమ్ముతో సుధా

స్యందమరందబిందువుల సందడినందరికందజేసి శ్రీ

నందన నామ వత్సరమునందు పసందగుపద్యమందుమా !!

 

దువ్వూరి సుబ్బారావు

నందన నామ వత్సరపు నవ్య మధూదయ చంద్రికా ద్యుతిన్

వందన మాచరించెదము  పల్కుల తల్లికి పద్యవాక్సుధల్

కుందన జాల పాత్ర నిడి కూర్మి నివేదన జేసి సాహితీ

స్యందన మందు తెన్గు పుర యాత్రకు నేగెడు వేళ ప్రీతితో.

 

వసంత్ కిశోర్

వందిత దేవతా , నరుల – వందన మందెడు గుజ్జు వేలుపా

నందన నామ వత్సరము – నాట్యము సేయగ పద్య సంపదల్

చందన గంధమందు మిదె – చల్లని చూపుల  బొజ్జ దేవరా

ముందుగ వందనం బిడుదు – మూషిక వాహన !  మమ్ము గావుమా !

 

లంక గిరిధర్

శ్రీగిరిదేవనందన కుచిద్దమనా సితపద్మలోచనా

శ్రీగణనాథ సిద్ధియుత శ్రీకరరూప వియచ్చరన్నుతా

శ్రీగురుతుల్యశాంతిమయ శ్రీధరసేవ్య జగద్ధరప్రియా

శ్రీగజమూర్ధ వీతభయ శ్రీశుభదాయక విఘ్ననిర్భయా

అని గణనాథుని నుతించి

 

సిరిపతిపుత్రజాయ విదుషీ మృదుభాషిణి వాక్ప్రభా ఝరీ

గురుతరపూజ్యభాజన అకుంఠితపండితసత్వకారణా

సురనరవంద్యనామ ప్రియసూక్త వినిర్మలభాతి భారతీ

సరసిజగర్భ హృత్సరసిజస్థిత సారమతీ సరస్వతీ

అని చదువులతల్లి పాదములకు మోకరిల్లి

 

అనుసరణీయ పద్ధతుల నాచరణీయము చేయు లఘ్వులై

అనుకరణీయ పండితుల నాదరమొప్పగ కొల్చు గుర్వులై

జనతతిమెచ్చు గోష్ఠులకు జాలకవీంద్రులనన్ గణంబులై

జను చినచేపలైన మము చల్లనిచూపుల గావు మొజ్జలై

అని వేడుకొని,  నవనందనవాసంతగోష్ఠి లోనికి ప్రవేశించిరి జాలకవులు.

 

కామేశ్వరరావు

కవికోకిలలు గళమ్ములు

సవరింపగ సరసపద్య సమ్మోహనమై

నవనందనవాసంతము

భువనానందమ్ము గూర్చు పొద్దుపొడిచెగా!

 

ఫణి

వందనమెల్ల కవులకు ప

సందగు పద్యరచనావిశారదులకు శ్రీ

నందన మందున వీనుల

విందును చేయంగ వచ్చు విద్వత్తతికిన్

 

 

 

అలా ప్రార్థించుకుని అడుగిడగానే వారికిచ్చిన  కవనక్షేత్రమును, మా ప్రశ్నపత్రమును  పరికించండి

************************************************************************

*సమస్యాపూరణము*

 1. కాలము జేసినన్ గలుగు సౌభాగ్యంబశేషమ్ముగా
 2. అర్జునునికి వణుకు పుట్టె నశనిపాత భీతిచే
 3. భార్యకు మ్రొక్కిన శుభమగు పతిదేవునకున్
 4. తిరుగుచు నుండు(గాని యొక తీరము( జేరడు జీవు(డెన్నడున్
 5. రాష్ట్రమునేల(గా నొక విరాధు(డు రావలె రక్త పాయియై
 6. జాలములో లేనిదేది జగమున లేదే !
 7. పంచాస్యంబును వెంటనంటి తఱిమెన్ శ్వానమ్ము చిత్రమ్ముగన్
 8. వాక్స్వాతంత్ర్యములేని దేశముననే వర్థిల్లు సారస్వతుల్
 9. కాడు పిలిచె నిన్ను గదలవేమి ?
 10. పాపము లేనిచో జగము పాడయి పోవును నిశ్చయంబుగన్
 11. తెలుగు ప్రాచీనభాషగాదిలను జూడ !

 

*దత్తపదులు*

 

 1. వై, దిస్, కొలవెరి, డి —- వరూధిని తో ప్రవరుడన్న మాటలు
 2. పిలక, నలక, కలక, మలక —ప్రకృతి వర్ణన
 3. అప్పడాలు, వడియాలు, ధనియాలు, మిరియాలు  — యువతకి సందేశం
 4. ధర్మ, అర్థ, కామ, మోక్ష — నేటి భారతీయ జీవన విధానం
 5. పుటుక్కు, జరజర, డుబుక్కు, మే —- గంగావతరణ
 6. కారు, టైరు, గేరు, లివరు —- పర్యావరణ సంరక్షణ

 

*పద్యాలతో రణం*.

 

ఈ శీర్షిక క్రింద మేమిచ్చే అంశం ఆవకాయ vs గోంగూర. ఈ రెంటిలో ఏది గొప్పది అన్నది తేల్చాలి! J రెండిటిలో ఖచ్చితంగా ఏదో ఒక పక్షాననే ఉండాలి. రెండూ బాగుంటాయి అని చెప్పినవి పరిగణించబడవు!! రెండిట్లో బాగా యిష్టమైన ఒకదాన్ని మాత్రమే సమర్థించాలి. ఒకటి రెండు పద్యాలలో వాదించాలి.

 

*వర్ణనలు*

 1. సీతను రాముడు పరిత్యజించాడన్న వార్త విన్న జనకుని హృదయాన్ని ఆవిష్కరించండి.
 2. నేటి సినిమాల పై విసుర్లు —- ఒకటే మకుటంతో ఐదు పద్యాలు
 3. చిత్ర వర్ణన – 1

http://www.crafts-gifts.com/paintings/indian-bow-arrow.jpg

 1.  చిత్ర వర్ణన  – 2

http://picsoff.com/files/funzug/imgs/paintings/indian_paintings_20.jpg

*కొత్త ఛందస్సు*

వసంత ఋతువర్ణన —- *నవనందిని* అనే వృత్తం లో. దాని లక్షణాలు స-జ-స-న-గగ. 4వ గణం మొదటి అక్షరం యతి.  ప్రాస నియమం ఉంది.

 

*అనువాదం*

 1. I find no peace ———– Sir Thomas Wyatt the Elder

 

I find no peace and all my war is done,

I fear and hope, I burn and freeze like ice,

I fly above the wind, yet can I not arise,

And naught I have and all the world I seize on;

That looseth nor locketh holdeth me in prison,

And holdeth me not; yet can I ’scape nowise;

Nor letteth me live nor die at my devise

And yet of death it giveth none occasion.

Without eyen I see; and without tongue I plain;

I desire to perish, and yet I ask health;

I love another, and thus I hate myself;

I feed me in sorrow, and laugh in all my pain.

Likewise displeaseth me both death and life,

And my delight is causer of this strife.

 

 

 1. After death ————– Christina Rossetti

 

The curtains were half drawn; the floor was swept

And strewn with rushes; rosemary and may

Lay thick upon the bed on which I lay,

Where, through the lattice, ivy-shadows crept.

He leaned above me, thinking that I slept

And could not hear him; but I heard him say,

‘Poor child, poor child’; and as he turned away

Came a deep silence, and I knew he wept.

He did not touch the shroud, or raise the fold

That hid my face, or take my hand in his,

Or ruffle the smooth pillows for my head.

He did not love my living; but once dead

He pitied me; and very sweet it is

To know he still is warm though I am cold.

 

 1. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం నుండి

ग्रीवाभङ्गाभिरामं मुहुरनुपतति स्यन्दने बद्धदृष्टिः
पश्चार्धेन प्रविष्टः शरपतनभयाद्भूयसा पूर्वकायम्।
दर्भैरर्धावलीढैः श्रमविवृतमुखभ्रंशिभिः कीर्णवर्त्मा
पश्योदग्रप्लुतत्वाद्वियति बहुतरं स्तोकमुर्व्यां प्रयाति॥

 

గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి స్యందనే బద్ధదృష్టిః

పశ్చార్ధేన ప్రవిష్టః శరపతనభయాద్భూయసా పూర్వకాయం

దర్భైరర్ధావలీఢైః శ్రమవివృతముఖభ్రంశిభిః కీర్ణవర్త్మా

పశ్యోదగ్రప్లుతత్వాద్వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి ||

 

 1. శ్రీ హర్షుని నైషధీయచరితం నుండి

चुलुकिततमः सिन्धोर्भृङ्गैः करादिव शुभ्यते

नभसि बिसिनीबन्धोरन्ध्रच्युतैरुदबिन्दुभिः ।

शतदलमधुस्रोतःकच्छद्वयीपरिरम्भणा-

दनुपदमदःपङ्काशङ्काममी मम तन्वते ॥

 

చులుకితతమః సింధోర్భృంగైః కరాదివ శుభ్యతే

నభసి బిసినీబంధోరంధ్రచ్యుతైరుదబిందుభిః

శతదలమధుస్రోతః కచ్ఛద్వయీపరిరంభణా

దనుపదమదః పంకాశంకామమీ మమ తన్వతే ||

 

 1. . భర్తృహరి వైరాగ్య శతకం నుండి.

एको रागिषु राजते प्रियतमादेहार्धहारी हरो
नीरागेषु जनो विमुक्तललनासङ्गो न यस्मात् परः।
दुर्वारस्मरबाणपन्नगविषव्याविद्धमुग्धो जनः
शेषः कामविडम्बितान्न विषयान् भोक्तुं न मोक्तुं क्षमः

యేకో రాగిషు రాజతే ప్రియతమాదేహార్ధహారీ హరో

నీరాగేషు జనో విముక్తలలనాసంగో న యస్మాత్ పరః

దుర్వారస్మరబాణపన్నగవిషవ్యావిద్ధముగ్ధో జనః

శేషః కామవిడంబితాన్న విషయాన్ భోక్తుం న మోక్తుం క్షమః

************************************************************************

 

ముందుగా నవనందిని వృత్తంలో పద్యాలతో నందన యుగాదికి అర్చన చేద్దాం.

వసంత ఋతువర్ణన —- *నవనందిని* అనే వృత్తం లో. దాని లక్షణాలు స-జ-స-న-గగ. 4వ గణం మొదటి అక్షరం యతి.  ప్రాస నియమం ఉంది.

 

సనత్ శ్రీపతి

కవనమ్ము లెత్తు కొనునా కవిగ ళమ్ముల్

రవళించు కోకిల స్వరార్ణవము తోడన్

చివురించు గుల్మ తతి లేచిగురు మ్రొగ్గల్

అవనిన్ వసంత మనగా నదియె నమ్మీ

 

గన్నవరపు మూర్తి

తలిరించె మామిడులు నా తరువు లందున్

గళ మెత్తి కోకిలలు స్వాగతము బల్కెన్

మలిసంజ ప్రేయసుల నామనియె రాగా

నలినాల దేటియలు గానములు సల్పన్ !

 

దువ్వూరి సుబ్బారావు

కుసుమించె నింబములు, కూకుహులు పాడెన్

మెసవింపులై పికము మామిడిచివుళ్ళన్,

వసివాడి శీతలమదే పరుగు వెట్టెన్,

ప్రసవించె నామనిసుతున్ ప్రకృతి తానై!

ఆమని = వసంతము, నలినము = తామర

 

ఆదిత్య

తనుమానసంబు పులకింతల సుఖమ్మం

దెనిదేమి చిత్రము?  యుగాది రవమా? పూ

వనమా ? మనోజ శరమా ?పరువమా? ఆ

మని గ్రుమ్మరించిన సుధామధురజమ్మా?!

 

నచకి

రవళించు కోకిలల ఆరవములన్నీ

కవనమ్ములై విరిసి స్వాగతములీయన్

భువనాల నామని భలే పొలుపు నింపన్

నవనందనమ్మదియె నెన్నటికి యుండున్

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *