ఒక ఓదార్పు ఒక నిట్టూర్పు

కూకట్ పల్లి బస్టాండులో నిల్చున్నాం, నేనూ నా పెద్దకొడుకు వెంకట్. నా మనవరాలి పెళ్ళికి వచ్చాను. వారం దాటింది వచ్చి. పెళ్ళై నాలుగు రోజులైనా పెద్దాడి మనసు ఇంకా ఆ పెళ్ళిని అంగీకరించలేకపోతోంది. చాలాసేపట్నుంచి ఇద్దరం మౌనంగానే ఉన్నాం. వాడు అటుగా నుంచుని బాధపడుతున్నాడు. వాడి భుజం మీద చెయ్యివేసి, "ఎందుకురా ఇంకా బాధ పడతావు. జరిగింది మనమంచికే అని అనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదుగా. అయినా ఈ రోజుల్లో పిల్లల్ని కనడం వరకే మన బాధ్యత, పెళ్ళి చేసుకోవడం వాళ్ళిష్టంగా మారిపోయింది. అది ఎక్కడున్నా దాని సుఖం కోరుకోవడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం?" అంటూ కొంచెం ఓదార్పుగా మాట్లాడాను. వాడి కన్నప్రేమ ముందు నా ఓదార్పు మాట పెద్ద లెక్క కాదని తెలుసు. కానీ నా కన్నప్రేమ చూస్తూ ఊరుకోలేదుగా..

"దానిది పెళ్ళి చేసుకునే వయసా నాన్నా? అంతా కలిపి పందొమ్మిది దాటలేదు. ఈ కాలంలో లోకం గురించి, సంసారం గురించీ తెలుసుకోవడానికి ఆ వయస్సు ఏ రకంగానైనా సరిపోతుందా, ఈ వెధవ ప్రేమ వాళ్ళ లేత మనసుల్ని ఈ లోకంలో బ్రతికించేస్తుందా? కనీసం డిగ్రీ కూడా పూర్తి కాలేదు. ప్రేమ, పెళ్ళి -ఇవి రెండేనా వాళ్ళకి జీవితం? పెళ్ళి జరిగినంతసేపూ దాని ముఖం చూడాలంటేనే అసహ్యం వేసింది. పెట్టగలిగినవాటి కంటే ఎక్కువగానే పెట్టుపోతలు పెట్టాను. దాని చదువు కోసం బ్యాంకులో దాచిన డబ్బంతా తీసి దానికి ఇచ్చేసాను. ఇంక దానికీ నాకూ ఏ సంబంధమూ లేదు" అంటూ ఒక్కసారిగా ఏడ్చేసాడు.

వాడు ఒక వయస్సుకొచ్చాక నేను కొట్టినా ఏడ్చేవాడు కాదు. కానీ ఈ రోజు ఇలా..! అవునులే, నేను కొట్టిన దెబ్బలు వాడి శరీరాన్ని తాకాయి. కానీ వాడి కూతురు కొట్టిన దెబ్బ వాడి మనస్సును తాకింది. అందుకే ఇలా. నాకూ గుండెల్లో బాధగానే ఉంది. కానీ, నేనూ వాడిలా ఉంటే ఎలా..!

"పెద్దాడా, బాధ పడకురా, కొన్ని రోజులైతే అంతా సర్దుకుంటుంది. నువ్వు బాధపడి, కోడల్ని బాధపెట్టకు. తొందరగా తేరుకుని మామూలు మనిషివి కావడానికి ప్రయత్నించు. సరేనా" అంటూ ఓదార్చాను. "విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది" అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచాను. ఇంతలో బస్సు వచ్చింది. వాడికి జాగ్రత్త చెప్పి బస్సు ఎక్కాను. లోపలికి వెళ్ళి కిటికీ పక్కగా కూర్చున్నాను. కిటికీ పక్కనే వాడున్నాడు. "పెద్దాడా, వీలు చూసుకుని ఒక వారం రోజులు ఉండటానికి మన ఊరు రా. కాస్త మనస్సు తేలిక పడుతుంది. ఇక్కడి పనులు  ఎప్పుడూ ఉండేవేగా." అన్నాను. వాడు సరేనన్నట్లు తలూపాడు. బస్సు బయలుదేరింది. "జాగర్తగా ఉండు. కోడలిని అడిగానని చెప్పు. వీలు చూసుకుని తప్పకుండా రండి" అంటూండగానే బస్సు వాడి నుంచి నన్ను దూరంగా తీసుకుపోయింది.

కొంచెం దూరం వెళ్ళాక చినుకులు చినుకులుగా వర్షం మొదలైంది. ఆ చినుకులు బస్సు అద్దాల మీద పడి ధారలు కడుతున్నాయి. ఆ ధారల్ని చూస్తూంటే పెద్దాడి కన్నీళ్ళే గుర్తుకు వస్తున్నాయి. మనసులో ఆందోళనగా ఉంది. ఒక గంట తర్వాత ట్రాఫిక్ ను ఛేదించుకుంటూ సిటీ బయటకు వచ్చింది బస్సు. వర్షాకాలం, పెద్దగా పండుగలు కూడా లేని రోజులు కావడంతో బస్సు పూర్తిగా నిండలేదు. దాదాపు పది సీట్లపైనే మిగిలిపోయాయి. వర్షం ఇంకా పడుతూనే ఉంది. సమయం పది దాటింది. అందరూ నిద్రలోకి జారుకుంటున్నారు. క్షణక్షణానికీ వర్షం ఎక్కువవుతూ ఉంది.

ఆ వర్షంలోనే బస్సు ఒకచోట ఆగింది. ఒక అమ్మాయి చీరకొంగును తలమీదుగా వేసుకుని లోలికి వచ్చింది. బస్సు బయలుదేరింది. నా పక్క సీటు ఖాళీగా ఉండటంతో వచ్చి కూర్చుంది. పూర్తిగా తడిసిపోయింది. బాగా తడవడం వల్ల వణుకుతోంది. ఆ వణుకులోనే ఆమె చేతిలోని ఫైల్ జారి నా కాళ్ళమీద పడింది. తీసి ఆమెకిచ్చాను. "థ్యాంక్యూ బాబాయ్ గారు" అంటూ ఫైల్ అందుకుంది. తన వంటి మీది తడిని తడిసిన చీర కొంగుతోనే తుడుచుకుంటోంది. నా బ్యాగులోని టవల్ తీసి ఆమె చేతిలో పెట్టాను. "వద్దులెండి" అంటూ వెనక్కివ్వబోయింది. "ఫరవాలేదు, తుడుచుకో" మన్నాను. ఇంకేమీ మాట్లాడలేదు. తుడుచుకుని ఆ టవల్ ని అలాగే చేతుల్లో ఉంచుకుంది. తుడుచుకున్నా ఒంట్లో వణుకు తగ్గలేదు. దాంతో నా శాలువా తీసి తనకివ్వబోయాను. "ఫరవాలేదండీ" అంటూ తిరస్కరించబోయింది. నేనూ అదే మాట అని టవల్ తీసుకుని శాలువా చేతిలో పెట్టాను.శాలువా మెడచుట్టూ వేసుకుని రెండు చేతులతో గట్టిగా అదిమి పట్టుకుంది. కాసేపటికి కొంచెం కుదుటపడింది. బస్సు వెళ్తూనే ఉంది. వర్షం పడుతూనే ఉంది.

కాసేపటికి వెనక్కి జారబడి నిద్రపోయింది, ఆ అమ్మాయి. నేనూ నా మనవరాలి గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. ఆ ఆలోచనల్లోనే ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. "బాబాయ్ గారు, బాబాయ్ గారూ" అన్న పిలుపు విని నిద్ర లేచాను. నావైపే చూస్తూ మొహమాటంగా, "మీరు ఈ సీట్లోకి వస్తారా, నేను కిటికీ పక్కన కూర్చుంటాను" అని అభ్యర్ధనగా అడిగింది.
"సరే"నని పైకి లేచాను. ఇద్దరం సీట్లు మారాం.
"బాబాయ్ గారూ, మీకు చలిగా ఉందా" అని అడిగింది.
"లేద"న్నాను.
"అయితే విండో తెరవనా"
సరేనన్నట్లు తలూపాను. అద్దం పక్కకి లాగింది. బయట వర్షం లేదు. పొడిగాలి హుషారుగా ముఖాన్ని తాకింది. తను శాలువా తీసి పక్కన పెట్టి, ఆ గాలిలో సేదదీరుతూ బయటికి చూస్తోంది. చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయిది.

భోజనాల కోసం బస్సును ఒక ధాబా దగ్గర ఆపారు. అందరూ కిందికి దిగారు. నేనూ వెళ్తూ ఆ అమ్మాయిని పిలిచాను. ఆకలిగా లేదంది. సరే అంటూ కిందికి దిగాను. కుర్చీలో కూర్చుని టిఫినుకు ఆర్డరిచ్చాను. బస్సువైపు చూసాను. బయట ఉన్నవారందరినీ బెరుకుగా చూస్తూ కూర్చుంది ఆ అమ్మాయి.

ఆ చూపులో ఎన్నో అనుమానాలు, భయాలు కనిపిస్తున్నాయి. ఇంతలో టిఫిన్ వచ్చింది. టిఫిన్ చేస్తూ ఆ అమ్మాయిని గమనించాను. ఏదో విషయంలో బాధ పడుతున్నట్లుంది ఆమె ముఖం. కాసేపటికి ఆ అమ్మాయి కిందికి దిగి నా దగ్గరగా వచ్చింది. నడకలో భయం లేకున్నా ముఖంలో భయపు ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నా ఎదురు కుర్చీలో కూర్చుంటూండగా "టిఫిన్ చేస్తావామ్మా" అని అడిగాను. వద్దంటూ తలూపింది. బలవంతపెట్ట దలచుకోలేదు నేను. "పోనీ టీ అయినా తాగు" అంటూ సమాధానం కోసం వేచి చూడకుండా వెనక్కి తిరిగి రెండు టీ అన్నట్లు సైగ చేసాను.

"మీదే వూరమ్మా" అని అడిగాను.
"హైదరాబాద్.. ఛ విజయవాడండి" అంటూ తడబడుతూ చెప్పింది. నా పేరు, ఊరు అడిగింది. నా వివరాలు చెప్పాను. ఇంతలో ఒక కుర్రాడు రెండు టీ తెచ్చి మాకెదురుగా పెట్టి వెళ్ళిపోయాడు.
ఇద్దరం టీ తీసుకుని తాగుతూండగా "ఇంతకీ నీ పేరేమిటమ్మా" అని అడిగాను, ముఖ్యమైన విషయం మరచిపోయినవాడిలా.
"దివ్య"
పేరుకు తగిన ముఖం అని అనుకున్నాను. "సెలవులకి ఇంటికి వెళ్తున్నావా" అని అడిగాను.
"నేను చదవట్లేదండి" అంది.
"పోనీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నావా"
"కాదండి" అంది.
"మరి హైదరాబాదు ఎందుకొచ్చావు. ఎవరినైనా కలవడానికొచ్చావా" అంటూ సందేహంగా అడిగాను.
ఆమె తటపటాయిస్తూ "కోర్టులో హాజరవడానికి" అంటూ తలదించుకుంది.
"ఎందుకు" షాకై అడగాలనిపించింది. కానీ అది సందర్భం కాదనిపించిందెందుకో. మౌనంగా ఉండిపోయాను. బస్సు బయలుదేరింది.

దివ్య మునుపటిలానే కిటికీ పక్కన కూర్చుంది. ఆమె ముఖంలో ఏదో అపరాధభావం కనిపించింది. నాకేమీ మాట్లాడాలనిపించలేదు. ఆమె బయటకు చూస్తూ ఉంది. నేను పడుకోబోతూండగా "బాబాయ్ గారు, ఇంతకీ మీరు హైదరాబాదు ఎందుకొచ్చారు?" అంది.

ఆమె నన్ను అడిగిన ప్రశ్న కేవలం నా వివరాల కోసం కాదనిపించింది. తను నాకేదో చెప్పాలనుకుంటోంది అని అర్థమయింది. నేను నా ఆలోచనలో ఉండగానే మళ్ళీ అడిగింది. నా మనవరాలి పెళ్ళి గురించి, మా పెద్దాడి బాధ గురించి, నా అభిప్రాయం గురించి ఒకదాని వెంట మరొకటి చెప్పాలనిపించింది. చెప్పేసాను. ఇంతకుముందు ఎందుకో కొంచెం బాధగా ఉండేది ఎక్కడో. ఇప్పుడది చాలావరకు తగ్గినట్లనిపించింది. నేను చెప్పింది మొత్తం సావధానంగా విని తనలో తను చిన్నగా నవ్వుకుంది. మళ్ళీ బయటకు చూస్తూ కూర్చుంది. తను ఎందుకు నవ్విందో నాకర్థం కాలేదు. కాసేపు మౌనం మమ్మల్ని ఆవరించింది.

"మీ మనవరాలు తప్పు చేసింది బాబాయ్ గారు" అంది అలాగే  బయటికి చూస్తూ. ఏంటన్నట్లుగా చూసాను తనవైపు. నావైపు తీక్ష్ణంగా చూస్తూ "వయసు కాని వయసులో చెయ్యకూడని తప్పు చేసింది" అంది నిశ్చయంగా. తను చెప్పింది నా కర్థమైనా ఎందుకు చెబుతోందో అర్థం కాలేదు., నా మౌనం తనకు అర్థం అయింది ఒక ప్రశ్నలా. గుండెల నిండా గాలి పీల్చుకుని ఏదో చెప్పడానికి సమాయత్తం అయింది. ఇంతలో ఒక లారీ మా పక్కగా పెద్దగా హారన్ వేసకుంటూ వెళ్ళింది. ఆ శబ్దానికి ఒక్కసారిగా నా గుండె అదిరింది. కానీ దివ్య కొంచెం కూడా జంకలేదు. తను నావైపు చూస్తూనే ఉంది.

"రెండు సంవతసరాల క్రితం మీ మనవరాలు చేసిన తప్పే నేనూ చేసాను" అంది. ఏమిటన్నట్లు చూసాను. నా చూపు తనకి అర్థం అయింది. "ప్రేమపెళ్ళి చేసుకున్నాను" అంది ఒకింత బాధగా.

మరొక లారీ మా పక్కగా వెళ్ళింది. ఈసారి నా గుండె అదరలేదు. తనవైపే చూస్తూ ఉన్నాను. తను సీటుకు జారబడి కళ్ళు మూసుకుంది. రెండు కన్నీటి చుక్కలు ఆమె కళ్ళ నుంచి చెంపల మీదికి జారాయి.

"ఇంతకు ముందు నేను హైదరాబాదులో ఉండేదాన్ని, అమ్మ, నాన్న, చెల్లెలితో కలిసి. మా నాన్నగారికి నామీద చెప్పలేనంత నమ్మకం ఉండేది. ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అందుకే వీలైనంతవరకూ సొంత నిర్ణయాలు తీసుకునేలా పెంచారు. కానీ ఒక నిర్ణయం నా జీవితానికి నా తండ్రిని దూరం చేసింది. అదే.. ప్రేమ!"

"డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూండగా ఒకరోజు మా సీనియర్ వచ్చి నన్ను ప్రేమిస్తున్నానన్నాడు. నాకూ అతని మీద సదభిప్రాయం ఉండడంతో ఒప్పుకున్నాను. ఆ క్షణం మరోలా ఆలోచించి ఉంటే నా జీవితం ఇలా అయ్యేది కాదేమో! కానీ అలా ఆలోచించలేకపోయాను. ఆరునెలలు హైదరాబాదు మొత్తం తిరిగాం. ఇంట్లో చెప్పకుండా కాలేజీ మానేసి సినిమాలు షికార్లు అంటూ తిరిగేదాన్ని. ఏరోజూ అది తప్పుగా అనిపించలేదు. ప్రేమ మత్తులో పరీక్షల్లో ఫెయిలయ్యాను. అమ్మ బాగా తిట్టింది. చెల్లెలు వెక్కిరించింది. కానీ, నాన్న మాత్రం నా ప్రాబ్లమ్ ఏంటని అడిగారు. ఏం చెప్పాలో తెలియక సబ్జెక్ట్స్ అర్థం కాలేదని చెప్పాను. ట్యూషన్ పెట్టించారు. నెలరోజులు తనకి దూరంగా ఉండి చదివి, పాసయ్యాను. అమ్మా నాన్నా ఎంతో సంతోషించారు. ఆ తర్వాత మళ్ళీ తనని కలిసాను. పార్టీ అడిగాడు. ఏం కావాలన్నాను. ఎక్కడికైనా దూరంగా వెళ్దామన్నాడు. సరేనన్నాను.

ఫ్రెండ్ పెళ్ళని చెప్పి వైజాగ్ వెళ్ళాను. తనూ వచ్చాడు. మూడు రోజులు ఇద్దరం కలిసి వైజాగ్, అరకు అంతా తిరిగాం. చాలా సంతోషంగా గడిచిపోయాయి ఆ మూడు రోజులూ. తను నా పక్కన ఉంటే ఇంకేమీ అవసరం లేదనిపించింది. తన మీద చెప్పలేనంత ప్రేమ కలిగింది. తనూ నామీద అంత ప్రేమగా ఉండేవాడు. హైదరాబాదు వచ్చాం. ఇంట్లో నిజం తెలిసింది. అమ్మ నెత్తీ నోరూ కొట్టుకుంటూ ఏడ్చింది. నన్నూ కొట్టింది. నాకు ఏడుపు రాలేదు, కోపం వచ్చింది. ’మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్ళి చెయ్య’మని అడిగాను. నాన్న ఎంతగానో నచ్చజెప్ప జూసారు. నేను వినలేదు. ఇంకా మొండికేసాను. దాంతో ఆయనకు చెప్పలేనంత కోపం వచ్చింది నామీద. కానీ నేను భయపడలేదు. ఇంక చేసేదేమీ లేక ఒప్పుకున్నారు. నేను తనకు విషయం చెప్పాను. తను తటపటాయిస్తూనే పెళ్ళికి ఒప్పుకున్నాడు.

కొన్ని రోజులకే మా పెళ్ళి జరిగింది. మా నాన్న నాకు సంబంధించినవన్నీ నా చేతిలో పెట్టి "దయచేసి ఇంకెప్పుడూ నా ఇంటికి రాకు. మేమందరం చచ్చిపోయామనుకో, ఎక్కడా ఫలానావాడి కూతురునని చెప్పకు. ఎందుకంటే నేను నాకు మిగిలిన కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్ళి చేయాలి" అంటూ ఆ కుటుంబంతో నాకేమీ సంబంధం లేనట్టు మాట్లాడారు. నాకు చాలా బాధేసింది. నా భర్త నన్ను ఓదార్చాడు. కాపురానికి విజయవాడ వెళ్ళిపోయాం. నాన్న ఇచ్చిన డబ్బుతో వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో బాగానే ఉండేవాడు. తర్వాత తాగుడుకు అలవాటు పడ్డాడు. ఇంటికి వచ్చి కట్నం కావాలని గొడవ చేసేవాడు. కొన్ని రోజులకు తను వ్యాపారం చేయట్లేదని తెలిసింది.

నాన్నగారు ఇచ్చిన డబ్బు మొత్తం జల్సాలకు, తాగుడుకీ ఖర్చుపెట్టేసాడని తెలిసింది. నిలదీసాను, గొడవపెట్టుకున్నాను. కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు. ఒకరోజు సడెన్ గా వచ్చి విడాకులిమ్మని గొడవ పెట్టుకున్నాడు. నేను ఇవ్వనన్నాను. ఇష్టం వచ్చినట్టు కొట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. కొన్ని రోజులకు విడాకుల నోటీసు పంపించాడు. అదే సమయంలో నేను గర్భవతినని తెలిసింది. అదే విషయం చెప్పి తన మనసు మారుద్దామని అతడి దగ్గరికి వెళ్ళాను. తనకూ నాకూ ఏ సంబంధమూ లేనట్లు మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. నాన్నగారి మాట వినకుండా తప్పు చేసినందుకు చచ్చిపోవాలనిపించింది.  కానీ నాకు నేను ధైర్యం చెప్పుకుని బతుకుతున్నాను. పూట గడవడం కోసం చిన్న ఉద్యోగం చేసుకుంటూ సంవత్సరం నుంచీ ఇలా కోర్టు చుట్టూ తిరుగుతున్నాను." అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది.

తనని నేను ఆపలేదు. ఏడవనిచ్చాను. తన కంట్లో నీరు ఇంకిపోయేవరకూ మనసులో బాధ తీరేవరకూ ఏడవనిచ్చాను. నా మనసులో ఉన్న బాధ ఆమెకు చెప్పగానే తీరింది. అలాగే తన మనసులో బాధ నాకు చెప్పుకుని ఏడిస్తేనే తగ్గుతుందనిపించింది. అందుకే అలాగే చాలాసేపు ఏడవనిచ్చాను. కాసేపు అలాగే ఏడ్చి కళ్ళు తుడుచుకుంది. అప్పుడు నా సందేహాన్ని బైటపెట్టాను..

"దివ్యా, మరి నీ బిడ్డ.."

"గుండెలో ఉండలేని మనోధైర్యం నా బిడ్డని కూడా తోడు తీసుకుని వెళ్ళిపోయింది", అంటూ మళ్ళీ రెండు కన్నీటి బొట్లు రాల్చింది. ఆమెలో కన్నీరు ఇంకిపోయింది క్కాబోలు. తన వైపు నుండి చూపు మరల్చాను. కాసేపు ప్రయాణం కొనసాగింది. ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. నా కళ్ళు చెమ్మగిల్లాయి, గుండె బరువెక్కింది. అది దివ్యకు జరిగిన అన్యాయం వల్లనో, లేక నా మనవరాలికీ అలాగే జరుగుతుందన్న భయంతోనో నాకు అర్థం కాలేదు. నాలుగు కన్నీటి బొట్లు కిందికి జారాయి. మరి కాసేపు మా ప్రయాణం మౌనంగా సాగింది.

సెల్ లో విజయవాడ సిగ్నల్ వచ్చింది. దూరంగా అమ్మవారి గుడి విద్యుద్దీపాల వెలుగులో మిరుమిట్లు గొలుపుతోంది. అంతా మంచే జరగాలని మనసులోనే వేడుకున్నాను. బస్సు బస్టాండులోకి చేరింది. దివ్య దిగడానికి సిద్ధమయింది. "వెళ్ళొస్తాను బాబాయ్ గారు" అంటూ మెట్ల దాకా వెళ్ళింది.

తనకేదో చెప్పాలనిపించింది నాకు. "దివ్యా, నేనూ వస్తున్నా ఉండు" అంటూ లేచి కిందికి దిగాను. ఎదురుగా టీపాయింట్ కనిపించింది. "టీ తాగుదాం పద" అంటూ అటు నడిచాను. తను నన్ను అనుసరించింది. రెండు టీ తీసుకుని తనకొకటి అందించాను.

"ఇంతకీ ఈ విషయాలన్నీ మీ నాన్నగారికి తెలుసా" అని అడిగాను. లేదన్నట్లు తలూపింది. "ఒకసారి ఆయన్ని కలిసి జరిగింది చెబితే ఆయన నీకు అండగా నిలబడారు కదా" అన్నాను.

"ఆయన్ని ఎలా కలవమంటారు. కలిసినా ఏ మొహం పెట్టుకుని జరిగినదంతా చెప్పమంటారు. ఒకవేళ చెప్పినా ఆయన నన్ను క్షమిస్తారని నాకు నమ్మకం లేదు. అందుకే నా ఖర్మకి నేనే శిక్ష అనుభవించాలను కుంటున్నాను" అంటూ బాధపడింది.

ఈసారి నాకు ఆమె మీద జాలి కలగలేదు, కోపం వచ్చింది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు తన బిడ్డకి ఏ క్షణంలోనైనా కష్టం కలిగిందని తెలిస్తే అండగా నిలబడరా అనిపించింది. తననీ అదే అడిగాను. తన నుంచి సమాధానం లేదు. అది నేను ఆశించలేదు. ఎందుకంటే నేను ఆలోచించింది, నేను అడిగిందీ సత్యం కనుక. అది అందరికీ తెలిసిన నిజం కనుక.

"కనీసం మీ నాన్నగారిని కలవడానికైనా ప్రయత్నించావా?" అని కొంచెం పెద్ద స్వరంతోనే అడిగాను. నా స్వరంలో మార్పు గమనించింది. తల కిందికి దించుకుంది. అది తప్పు చేసానన్న భావన కాకపోవచ్చు. నా ఊహ నిజమైంది. కారణం తన గొంతు పెగిలింది.

"నిన్న సాయంత్రం వస్తూ వస్తూ కలవడానికి వెళ్ళాను. కానీ…" అంటూ ఆగింది.
ఏమైందన్నాను.
"కలవలేకపోయాను", అంది బాధగా.
"ఏం, ఇంట్లో ఎవరూ లేరా" అన్నాను అనుమానంగా.
"వాళ్లకు ఎదురుపడే ధైర్యం లేదు. సంవత్సరంగా కోర్టుకు తిరగడానికి వచ్చిన ధైర్యం, కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయినా తట్టుకోగలిగిన ధైర్యం, నా కుటుంబానికి ఎదురవడానికి మాత్రం లేకపోయింది. అందుకే వెనక్కి వచ్చేసాను" అంటూ కళ్ళు తుడుచుకుంది.

"తప్పు చేసావు దివ్యా" అన్నాను నిర్లిప్తంగా. తలెత్తి నావైపు చూసింది. "ఏది ఏమైనా మీ నాన్నగారిని కలిసి ఉండాల్సింది. నువ్వు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించిన ఆయన, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోరేమోనన్న నీ అనుమానం పూర్తిగా  నీ ఆలోచనల్లోనే ఉన్న నీ అమాయకత్వాన్ని తెలియజేస్తోంది. చూడమ్మా.. ఈపరిస్థితుల్లో నీకు అండగా నిలబడగలిగిన ఒకేఒక వ్యక్తి నీ తండ్రి మాత్రమే! అని ధైర్యం చెప్పాను. తన మనసులో ఏదో నిర్ణయం తీసుకుంది. అది తన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్లాట్ ఫామ్ మీద నుంచి బస్సు బయలుదేరుతోంది. కండక్టర్ రమ్మన్నట్టుగా సైగ చేసాడు.

"బస్సు బయలుదేరుతోంది. నేను వెళ్ళి వస్తాను. నువ్వు మాత్రం వీలైనంత త్వరగా మీ నాన్నగారిని కలవడానికి వెళ్ళు" అంటూ నా సెల్ నంబరు, అడ్రస్సు ఒక కాగితం మీద రాసి తనకిచ్చాను. కలవగానే ఏమైందో నాకు ఫోన్ చెయ్యాలని మాట తీసుకుని బస్సెక్కాను, తను ప్లాట్ ఫామ్ మీద నిల్చుని ఉంది. బయటికి చూస్తూ,

"కలుస్తావుగా" అన్నాను నవ్వుతూ. కలుస్తానన్నట్లు తలూపింది. "మళ్ళీ వెనుదిరిగి రావద్దు" అన్నాను.

"రాను, తప్పకుండా కలుస్తాను. కలిసాక మొదట మీకే చెప్తాను.", అంటూ చిన్న చిరునవ్వు నవ్వింది.

బస్సు ప్లాట్ ఫామ్ ని దాటింది. తను అక్కడే నిల్చుని నావైపు చూస్తోంది. తన కళ్ళలోనుంచి నీరు ధారలుగా వచ్చింది. ఇన్ని రోజులకు ఒక ఓదార్పు దొరకిందన్న భావనతో ఒక నిట్టూర్పు విడిచి వెనుదిరిగింది.

బస్సు బస్టాండ్ బయటకు వచ్చింది. దూరంగా అమ్మవారి గుడి. కళ్ళు మూసుకున్నాను. "నా మనవరాలిని మరో దివ్యలా మార్చకు తల్లీ" అంటూ మనస్సులోనే నమస్కరించుకున్నాను. వెనక్కు తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. నా ప్రయాణం కొనసాగింది.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.