మధు గీతం

బీరయ్య మందు తాగి చచ్చి పోయాడు. మందంటే – ఎండ్రినో, టిక్-20 యో కాదు – గవర్నమెంట్ వారి మందు! రాష్ట్ర ఆదాయంలో సింహభాగం ఆర్జన చేస్తున్న మందు!!


రాష్ట్ర సంక్షేమం కోసం బీరయ్య శక్తి వంచన లేకుండా పాటు పడ్డాడు. మందు నిండుగా తాగాడు, లివరు మొండికేసింది. అంతే – చచ్చి పోయాడు.

సెల్ ఫోన్లు మ్రోగాయి. క్షణాల్లో వార్త ప్రసారమై పోయింది.


ఏడుపు ప్రవాహం అప్పుడప్పుడు ఆగుతోంది –అలసటతో. విడతలుగా వస్తున్న అమ్మలక్కలు కొత్త రాగాలతో వురవడి పెంచుతూన్నారు. బిక్కుబిక్కు మంటూన్న బీరయ్య పిల్లల్ని వాటేసుకుని, సానుభూతి దుప్పట్లు కప్పుతున్నారు.


బీరయ్య భార్యకు ఏడ్చి ఏడ్చి గొంతు తడారి పోయింది. గుండె బండబారి పోయింది. బీరయ్య బ్రతికి నన్నాళ్ళూ ఆమెకు ఏడుపే – చచ్చి ఇప్పుడు ఏడుపు  – ఇంకిదే ఆఖరి ఏడుపు.


బ్రతికి నన్నాళ్ళూ, ‘వీడికి చావెప్పుడో’ – అన్న వాళ్ళే, ఇప్పుడు ‘మంచి వాళ్ళు భూమి మీద ఎక్కువ కాలం బతకరు’ అన్నారు.

“ఎంత యేడిస్తే మాత్రం చచ్చినోడు బతుకుతాడా ? ఏడుపు ఆపి బతికున్నోల్ల సంగతి చూడండి” అన్నారు కార్యదక్షులు.


డప్పులొచ్చాయి – కుండ వచ్చింది – కొత్త బట్టలొచ్చాయి – పూలొచ్చాయి – పాడె కట్టెలొచ్చాయి – మంది వచ్చారు – మందు కూడా వచ్చింది !

బీరయ్యకి స్నానం అయ్యింది. పాడెపై పడుకో బెట్టారు. కొత్త బట్టలు కప్పారు. పూలదండ లేశారు. అగరొత్తులు వెలిగించారు. పన్నీరు చల్లారు.

మందు విషాదం పై మసకేసింది. మందిని యాంత్రికంగా మార్చేసింది.


పాడె లేసింది. కట్టెల్లో కట్టెయిన బీరయ్య, తాగలేదు కానీ తూలుతున్నాడు. ముందు సాగే కావిడి తూలుతూంది. బీరయ్యపై గురి పెట్టిన పూలు, పేలాలు తూలి ఎక్కడో పడుతూన్నాయి. డప్పులు తూలుతున్నాయి. నేలపైనున్న పది రూపాయల నోటు నోటితో అందుకునే విన్యాసం తూలి నేల దొర్లుతూంది.


దారి సాగటం లేదు. దారిని సాగదీస్తున్నారు. కొంతమంది మధ్యలోనే నిష్క్ర మిస్తున్నారు. మరి కొందరు మధ్యలో కలుస్తున్నారు.

శ్మశానం రానే వచ్చింది. పేర్చిన కాష్టం చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్లుంది. ఆలస్యం లేకుండా బీరయ్య శయ్యపై చేరాడు.


ఆధునిక యుగంలో దేశాలన్నీ తమ పౌరుల జీవిత కాలాన్ని పెంచడానికి మందులు కనిపెడుతూంటే, మన ప్రభుత్వం మాత్రం ఆదాయమే పరమావధిగా ప్రజలకు  అర్ధాంతర చావుకు ‘మందు’ నిస్తూంది. బడి లేదు గుడి లేదు – అన్నిటా మందు షాపులే – అంతటా బెల్టు షాపులే!


అంతవరకూ తోడొచ్చిన ఆప్తులందరూ ఇంక శెలవంటూ గొల్లుమన్నారు. ఆ  శోకం  వర్షమై  శ్మశాన ప్రాంగణమంతా  వరదయ్యింది.

బీరయ్య కొడుకుతో చితికి నిప్పెట్టించారు.

చితి రగులుకోలేదు!

కిరసనాయిలు చల్లారు – రగులుకోలేదు !!

పెట్రోలు పోశారు – అయినా రగులుకోలేధు !!!
 

మందిలో వున్న మరో బీరయ్య, తన జేబు లోని బాటిల్ విప్పి మధువును ధారగా బోశాడు –

అంతే – చితి కణకణమంటూ రగులుకొంది!

——————

About జి.వి రమణారెడ్డి

జి.వి.రమణారెడ్డి గారు హెచ్.ఎ.ఎల్. ఫ్యాక్టరీలో 39 సంవత్సరాలు పని చేసి వుద్యోగ విరమణ చేశారు. వీరికి చిన్నతనం నుండీ సాహిత్య అభిలాష మెండుగా ఉండేది. 1970-1984 ల మధ్య ఆకాశవాణికి కొన్ని కథలు, కవితలు మరియు నాటికలు రాశారు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా రంగస్థల సేవ చేశారు. దివంగత నటుడు నూతన్ ప్రసాద్ వీరికి గురువు, మిత్రుడు. అభ్యుదయ రచయితల సంఘం, హైదరాబాద్ శాఖకు కొంతకాలం కార్యదర్శిగా పని చేశారు. ప్రజా నాట్యమండలిలో కొంత కాలము పని చేశారు. ’కేవలం రాయటం కోసమే రాయను. మనసుకు హత్తుకునే వాస్తవ సంఘటనలే నా రచనలకు ప్రేరణ.’ అని చెబుతారు రమణారెడ్డి గారు. వీరికి బీనాదేవి, రావి శాస్త్రి గార్ల రచనలంటే ఇష్టం. ప్రస్తుతం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్ నగర్ శాఖకు అధ్యక్షుడిగా సమాజ సేవలో వున్నారు.
This entry was posted in కథ and tagged . Bookmark the permalink.