వసంతసుమశేఖరము – 5


శ్రీపతి:  విశ్వామిత్రా మీ మేనకపై అందరూ కన్నేశారని అలిగారా?
విశ్వామిత్ర:  లేదు కన్నేశారని మేనక అలిగితే తీర్చి వస్తున్నాను
గన్నవరపు నరసింహమూర్తి:  విశ్వామిత్రా, సినిమా ఎలా వుంది
రవి:  మీ మేనక ఇక్కడుంటే ఇంకో మేనక అంటున్నారు. విశ్వామిత్రా ఎంతమంది మేనకలు?
శ్రీపతి:  ఆయన సినిమాకెళ్ళారే కానీ సిన్మానెక్కడ చూశారు?
గన్నవరపు నరసింహమూర్తి:  విశ్వామిత్రుల వలె మేనకలు కూడా చాలా మందే సినిమాలకి
 
జ్యోతి:  ఐనా తాతతో కూడా సరసాలు ఆడే మనవరాళ్లు ఉంటారు. సురక్షితం కూడా తాతలా కనిపించే అంకుల్స్ కి.. ఏమంటారు??
గన్నవరపు నరసింహమూర్తి:  ధన్యవాదాలు, మా ఆవిడకి కూడా చూపించా, కుట్ర లేదు
శ్రీపతి:  ఉన్నట్టుండి మౌనం వహించారు?
రవి:  మిస్సన్నగారూ, వసంత్ కిషోర్గారూ, నచకిగారూ క్యూలో నిలబడండి. మిస్సన్న గారూ మీ వంతు.
కామేశ్వరరావు:  శ్రీపతిగారు, లేదండి. హాయిగా మీరుకొనిచ్చిన టికెట్టుతో సినిమా చూసింది ఆయనేగా! 🙂
పుష్యం:ఎంతవారు గాని, వేదాంతులైనగాని.. పాటలా ఉంది.
రాఘవ:  ఊఁ
శ్రీపతి:  ఎంత కుట్ర…. అన్యాయం… అక్రమం…
మిస్సన్న:  ఇందాక నేను పొరబాటు బడ్డాను ఇప్పుడు చిత్తగించండి
 కం ||

"అంకుల్ సినిమా చూతము
యింకో టిక్కెట్టు తీసి యీరే మనకున్ "
పంకజ ముఖి నవ్వుచు నన
చంకల నెగరేసి మామ చప్పున కొనియెన్.

ఉ ||

"అందము చిందు ఫేసు మరి, అద్దము వోలెను నీటు డ్రస్సుతో
విందొనరించి యుందు! తన వేడ్కను దీర్చుట పాడి యౌనులే,
సుందరి తోడ చిత్రమును చూచెద నేడిక!  యెన్ని నాళ్ల కీ
విందు లభించె నాకిక"  ని వేచెను జవ్వని రాక కోసమై.

ఉ ||


"అల్లదె వచ్చుచుండినది యా ప్రియ భామిని నవ్వు రువ్వుచున్!
ఝల్లను గుండె నాకు! భళి! " ???? సన్నటి వాడెవడమ్మ ప్రక్కనన్?
మెల్లగ వచ్చి పల్కినది " మీకు శ్రమిచ్చితి తాత గారు! బై! "
చల్ల బడంగ తాత! జనె సన్నటి వానిని గూడి నాతియున్!

రాఘవ::D
నచకి:  ఏకంగా "తాతగా"రే?
రాఘవ:అంకులు కాస్తా తాతగా మారి కూలిపోయి ఉంటాడండీ.
వసంత్ కిషోర్:: చంకల నెగరేసి మామ – చాలా బావుంది !
కామేశ్వరరావు:  "చంకల నెగరేసి మామ చప్పున కొనియెన్" – హహహ…
రవి: సన్నటి వాడు – సిక్స్ పేక్ వాడాండి? వాడి మొహం మండా!
కామేశ్వరరావు:  రవీ, మీకెందుకంత ఆగ్రహం!
రవి: : నాకు ఉన్నది ఒక్క పేక్ కాబట్టండి
రాఘవ:ఫ్యామిలీ ప్యాక్ కానంతవఱకూ ఇబ్బంది లేదు.
రాఘవ::)
నచకి: )
కామేశ్వరరావు:  నాకున్నది పేకులు కాదు టైర్లు, మరి నేనేమనుకోవలి 🙂
రాఘవ:ఎమ్మారెఫ్ టైర్ ఐతే సచిన్ బ్యాటింగ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ
విశ్వామిత్ర:   ఫ్యామిలీ "Pack up"అననంతవరకూ కూడ ఇబ్బంది లేదు, నా లగా Family Pack ఐనా కూడా
రాఘవ:సరే.
జ్యోతి:  మరే.. ఆ తర్వాత తాతగారి సం"గతి" ఏమైనట్టు??
గన్నవరపు నరసింహమూర్తి:  మిస్సన్నగారూ బాగుంది, కామేశ్వర రావు గారికి చెప్పా, నా ఆఖరి తెలుగు సినిమా ఇంటింటి కాపురము. అలా జరిగాకా సినిమాలు మనేసాను
రాఘవ:ఔనండీ, దీనిపై వేఱే పూరణలున్నాయా? లేకపోతే, నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఒకటుంది… ఈ పూరణను ఎవ్వరూ ఇంకొక విధంగా పూరించవచ్చునని ఆలోచించకపోవటం.
మిస్సన్న:  జ్యొతి గారూ చల్లబడి పొయారు గా
రాఘవ:జ్యోతిగారూ, ఆ తాత తరువాత నిజంగానే తాతగా మారి తాతలలో కలిసిపోయాడు.:)
నచకి:  వేఱే విధంగా అంటే, అధ్యక్షా?
రాఘవ:వేఱే విధంగా అంటే… అధ్యక్షులవారు సెలవిస్తే విన్నవిస్తాను.
రవి: : ఊ కానివ్వండి, సభ మనందరిదీనూ
కామేశ్వరరావు:  ఇంకా ఇద్దరి అనుభవాలున్నట్టున్నాయి కదా
రాఘవ:ఈ పద్యాలు ఇప్పుడే వ్రాసాను. గుణదోషాలు చూచుకోలేదు.
 
రాఘవ:
తన కుమారునకు నెవరు తగునని
తను తలఁచెనో యామెయు సుతుఁడు గలిసి
తాను చూడ వచ్చిన చిత్రంపుచోటు కదియ చిత్రమునుఁ జూడవచ్చిరి చిత్రముగను
రాఘవ:సభికులకు నా పూరణ ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి! 🙂
ఆ.వె||

తనను చూడలేదు తనయుఁడు సరిగదా
సాయమడిగె సుతుని సఖియ వచ్చి
సినిమఁ జూడగ వలయును చీటీలు రెంటికై
తండ్రిమనసు కొనెను తనధనమున

ఆ.వె||

వాటినిఁ గొని చేతఁ బడతి సంతోషయై
సఖునికడకు వేగఁ జనుచుఁ జనుచు
థ్యాంక్యు అంకులనఁగఁ దబ్బిబ్బు పడడొకో
తండ్రి మామగారు తానె కనుక!

మిస్సన్న:  రాఘవగారూ భేష్
రవి: : రాఘవగారూ సుతుడి రోలు ఎవరండి? :))
రాఘవ:సుతుడి రుబ్బుఱోలు ఇంకా ఎవరూ లేరు 🙂
నచకి:  వావ్, సూపర్ తమ్ముడా!
కామేశ్వరరావు:  మరీ సంసారపక్షంగా ఉంది 🙂
విశ్వామిత్ర: )
వసంత్ కిషోర్:: బావుంది
రాఘవ:సంసారపక్షంగా ఉంది కనుకే మామగారు టిక్కెట్టు కొనిచ్చాడు
రాఘవ::)
గన్నవరపు నరసింహమూర్తి:  రాఘవగారూ చాలా బాగుంది
కామేశ్వరరావు:  అమ్మాయిలకి టికెట్లు కొనే అనుభవాలు కుఱ్ఱాళ్ళ కన్నా పెద్దలకే ఎక్కువ ఉన్నట్టున్నాయి 🙂
రాఘవ:అంతే కదా మఱి
రవి: : ఈ పెద్దాళ్ళున్నారే …చిచ్చీ …
గన్నవరపు నరసింహమూర్తి:  వయస్సు లేక అనుభవాలు ఎలా వస్తాయి ?
జ్యోతి:  రవినువ్వు మరీను ,, పెద్దవాళ్లంటే మడికట్టుకుని, కృష్ణారామా అనుకోవాలా??
రాఘవ:రవిగారూ, గన్నవరపువారూ, … 🙂
కామేశ్వరరావు:  మూర్తిగారు, ఇలాంటి అనుభవాలతోనే మీకు తలపండిపోయినట్టుంది
నచకి: )
గన్నవరపు నరసింహమూర్తి:  రవిగారూ ఈ సమస్య యిచ్చి మాకు కిర్రెక్కించారు.
వసంత్ కిషోర్:: సరే  ! నేను మొదలు పెట్టేదా
రవి: : సరే క్యూలో వసంత్ కిషోర్ గారు చాలా సేపు నుంచోబెట్టాం
రవి: రండి
మిస్సన్న:  ఏదో అన్నాం గదా అని మాకే టెండర్ పెడితే యెలాగండీ
 
వసంత్ కిషోర్:
ఉ ||

నిండుగ మండు వేసవిని – నేనొక లైనున నెండు చుండగా
పండుగ నాడు !  వేడె, నను – పల్కుల  తియ్యని తేనె లొల్కుచున్
గుండెలు ఝల్లనంగ, నొక – కోమలి ! రెండు టికెట్లు తీసితిన్
పండెను పండుగంచు , కడు – బాళిని ,భ్రాంతిని , మంద హాసమున్ !

ఉ ||

చిందులు వేసె నా మనము ,బహు – చెల్వగు చిన్నది చెంత నుండగా
విందులు చేసి కొందు మిక – వేడుక దీర , విరామ మందునన్ !
బంధము హెచ్చెనేని , మన – భాగ్యము పండును; నిశ్చయమ్మికన్ !
చెందెను , నా మనంబు , తన  – చిత్తము వచ్చిన రీతి నంతటన్ !

ఉ ||

తుంటరి బుద్ధి జూపి, యొక – తుందిలు తో, తను,  గూడి వచ్చినన్ !
మంటలు రేగ సాగె , మది – మాయ మయెన్ ,మరి మందహాసమే !
వెంటనె ,థాంక్సు జెప్పి , తను – వేగమె వెళ్ళిన ! నిర్వికారతన్
ఇంటికి సాగి పోతి నిక – ఇచ్ఛయె చచ్చెను ! మంద భాగ్యుడన్ !

తుందిలుడు = పెద్ద పొట్ట గలవాడు( నాకు చాలా వికారంగా కనిపించాడు )
 
జ్యోతి:  బాళి,,,, అనగా నేమి
గన్నవరపు నరసింహమూర్తి:  పద్యాలలో సరదా  ! కిశోర్ గారు సినిమా మనిషి.  చూడండి ఎంత మంచి పూరణో !
నచకి:  బంధము హెచ్చెనేని , మన – భాగ్యము పండును 😉
వసంత్ కిషోర్:: బాళి = సంతోషము
మిస్సన్న:  పాపమ్ తాతగారు
జ్యోతి:  మరి వీళ్లందరికి టికెట్ డబ్బులన్నా ఇస్తున్నారా లేదా అమ్మాయిలు..:)
గన్నవరపు నరసింహమూర్తి:  మిస్సన్నగారి విలన్ సన్నము, కిషోర్ గారి విలన్ తుందిలుడు!
కామేశ్వరరావు:  జ్యోతిగారు, మీరు మరీ అంత అమాయకుల్లా మాట్లాడకండి! 🙂
నచకి:  అధ్యక్షులవాఱు అలా యిప్పించలేదు, జ్యోతిగారూ!
జ్యోతి: )
మిస్సన్న:  అమ్మాయి డబ్బులిస్తే ఇంక థ్రిల్లేం ఉంటుందన్డీ
వసంత్ కిషోర్:: అమ్మాయిలు డబ్బులిస్తారా ప్రాణాలు తీస్తారు గాని
రవి: తుందిలుడు = పెద్ద పొట్ట గలవాడు (నాకు చాలా వికారంగా కనిపించాడు) – స్వభావోక్తి అలంకారమా? విరోధాభాసా?
మిస్సన్న:  నిజం
కామేశ్వరరావు:  కిశోర్జీ, మీకు బాగా మండినట్టుంది!:)
గన్నవరపు నరసింహమూర్తి:  విరోధ భావమే
జ్యోతి:  అబ్బాయిలైనా, అంకుల్సైనా, తాతలైనా అమ్మాయిలంతా ఇంతేనంటారు.. 🙂 వాళ్లవెంట ఉన్న అబ్బాయిలను ఎంతలా తిడుతున్నారో…:)
వసంత్ కిషోర్:: విరోధాభాసమే
గన్నవరపు నరసింహమూర్తి:  తాతలం గాని సన్యాసులం కాదుగా !
రవి: 🙂 ఆఖరున నచకి గారు మిగిలారు.
రవి: నచకిగారూ మీ టికెట్ల వ్యవహారం తెమల్చండి
 
నచకి:  సరే…
కం ||

ఎండను క్యూలో నుండగ
దండిగ యున్న జనమందు తప్పించుకు "యే
మండీ, టికెట్లు తె"మ్మని
పండంటి పడుచు యడిగెను, భళి, యేం ఛాన్సో!

కం ||

"ఏమండీ!" యని బిలచిన
భామామణి వంక జూసి బ్రాడ్ స్మైలిస్తూ
"ఏమీ ప్రాబ్లమ్ లేదులె,
ఈ మేనేజరు నెఱుగుదు, …ఈజీ!" అంటూ

కం ||

టిక్కెట్లను తెచ్చిస్తే
ప్రక్కన యువకుడికి యిచ్చి "రా, డియ"రంటూ
ఠక్కున దిఱిగి చెప్పెను
"అక్కఱలో సాయపడిరి, అంకుల్, థాంక్యూ!"

వసంత్ కిషోర్:: బ్రాడ్ స్మైలిస్తూ – భలే బావుంది !
రవి: : ఈ నాయకుడు యూత్ కెక్కువ, అంకుల్ కు తక్కువ లాగున్నాడు
విశ్వామిత్ర: )
కామేశ్వరరావు:  రవీ 🙂
రాకేశ్వరుఁడు:  "అక్కఱలో సాయపడిరి, అంకుల్, థాంక్యూ!" అని ఛందస్సులో చెబితే ఇంకా బాధగాననిపిస్తుంది.
మిస్సన్న:  సింపుల్ గా తెమిల్చేశారు.
నచకి:  "తిడితే తిట్టావు గాని తాళంలో తిట్టు" అన్నారు పెద్దలు
రవి: : రాకేశ్వరరావు గారి కన్ను ఱ మీద పడింది!
గన్నవరపు నరసింహమూర్తి:   నచకి గారు ఎక్కువ బాధ పడినట్లు లేదు
కామేశ్వరరావు:  వారికిది అలవాటేనేమో 🙂
నచకి:  ప్రక్కన భార్య లేకుండా సినిమాకి వచ్చాడంటే యూత్‌కి ఎక్కువ, అంకుల్‌కీ తక్కువ అయితే మంచిదనిపించింది. అనుభవరాహిత్యం తప్పించి మఱేమీ కాదు, అధ్యక్షా!
వసంత్ కిషోర్:: బ్రాడ్ మైండేమో
నచకి:  అబ్బే, పక్కకెళ్ళి బరువుగా బాధపడ్డాను ("ఐతే..!" సినిమా డవిలాగు)
రవి: : పోనీలెండి ఈ నాయకుడి ధైర్యం చూస్తే మరో అటెమ్ఫ్ట్ చేసేటట్టున్నాడు. దిగ్విజయీభవ అని ఆశీర్వదిద్దాం
నచకి:  ఈ పద్యాల్లో చెప్పిన ముక్కల్లో మేనేజర్ దగ్గఱికి వెళ్ళి టికెట్లు తీసుకోవటం ఒక్కటే నాకు అలవాటైన పని, కామేశ్వరరావుగారూ!
వసంత్ కిషోర్:: మొత్తం మీద అలవాటే
కామేశ్వరరావు:  ఇంతకీ నాకో అనుమానం. ఇందరినీ టిక్కెట్లడిగినది ఒకే అమ్మాయా, వేర్వేరు అమ్మాయిలా? 🙂
విశ్వామిత్ర: )
జ్యోతి:  కామేశ్వరరావుగారు, వేర్వేరు అమ్మాయిలనుకుంటానండి.
నచకి:  "నన్ను అడిగిన అమ్మాయి నన్ను మాత్రమే అడిగింది" అనుకుంటే ఒక సంతోషం. "నన్ను మాత్రమే మోసం చేసిందా?" అనుకుంటే ఒక బాధ!
జ్యోతి:  ఏ చోట చూసినా అమ్మాయిలంతా ఇంతే అని డిసైడ్ అయ్యారుగా
వసంత్ కిషోర్:: ఒకే అమ్మాయి వేర్వేరు రోజుల్లో
రవి: : ఒకే అమ్మాయి తుందిలుణ్ణి, సిక్స్ పేక్ గాణ్ణీ, యూత్ ను సెట్ చేసిందంటే ఆ అమ్మాయి మహాజాణ!
మిస్సన్న: )
నచకి:  కానీ ఒకే అమ్మాయైతే మాత్రం యిదేదో సైడ్ బిజినెస్‌లా ఉంది, బ్లఫ్ మిస్ట్రెస్స్!
గన్నవరపు నరసింహమూర్తి:  అధ్యక్షా మీరు చెప్పండి ఒక్క అమ్మాయా ఎక్కువ మందిని హైరు చేసారా  !
రవి: : అధ్యక్షులకు సమస్య ఒక్కటే తెలుసు.
వసంత్ కిషోర్:: అయ్యా సమస్యలోనే ఉంది ఒక జవ్వని అని
కామేశ్వరరావు:  సరే ఇక అమ్మాయి(ల) గోల వదిలి ముందుకు నడుద్దామా?
రవి: : సరే ఇందాకట్నుంచి కామేశ్వరరావు గారిని నారదులావహించినట్టు కనబడుతుంది.ఆయనతో ఒక పూరణ చేయిద్దాం
ధృఢసత్వంబునఁ జీమ తుమ్మెనహహా! దిగ్ధంతులల్లాడగన్.– ఎలా?
నచకి:  (ఆశువు)


ఎందఱు ఉన్నా గానీ
కొందఱికే సాధ్యమౌను కొంపలు ముంచే
చిందులు యీ పద్ధతి నే
మందురు అధ్యక్షులు, ఇపుడట్లంటేహా?

కామేశ్వరరావు: )
కామేశ్వరరావు:  "దృఢసత్త్వంబున"కి నా పూరణ
మ ||

ద్రఢిమన్ మత్తుడు కుంభకర్ణుడు మహా ద్రాఘిష్ఠ దేహుండు భూ
రి ఢమద్ధ్వానముతోడ గుఱ్ఱునిడ, దూరెన్ ఘ్రాణవల్మీకమున్
దృఢసత్వంబున చీమ, తుమ్మె నహహా! దిగ్దంతులల్లాడగన్
తృఢితంబై ఘనవృక్షముల్ దెగిపడన్ దేవారి తానంతటన్

రవి: : ఏంటి? ఘ్రాణవల్మీకమా? 🙂
వసంత్ కిషోర్:: అద్భుతం ! కరతాళ ధ్వనులు !
విశ్వామిత్ర:  ఘ్రాణవల్మీకమున్ –  🙂
కామేశ్వరరావు:  అందుకేగా చీమ దూరింది 🙂
మిస్సన్న:  అద్భుతం ! కరతాళ ధ్వనులు !
శ్రీపతి:  అద్భుతం ఈ పూరణ.
గన్నవరపు నరసింహమూర్తి:  చక్కని పూరణ ! కామేశ్వర రావు గారూ !
కామేశ్వరరావు:  కృతజ్ఞతలు
శ్రీపతి:  ఢ ప్రాస, అందునా ప్రాసాక్షరం ముందు సరళాక్షరం… అబ్బో మంచి పూరణ
రవి: రాఘవగారొచ్చారా? రాఘవగారూ మీరూ వినిపించాలి
పుష్యం:  అద్భుతం, మొదట్లో డ-ఢ కి ప్రాస కుదురుతుందను కున్నాను.. మీ పూరణ చూసేదాకా
మిస్సన్న:  సంపూర్ణ రామాయణంలో సీను గుర్తు వస్తోంది
కామేశ్వరరావు:  డ, ఢ లకి ప్రాస ఎక్కడా చూడలేదు, కాబట్టి కుదరదనే అనుకుంటాను.
నచకి:  నేను కూడా అలా కుదఱకపోయేసరికి యీ పూరణకి చేతులెత్తేసాను. 🙁
పుష్యం:  శబ్ద సారూప్యం ఉందికాబట్టి, మనం వాడడం మెదలెట్టొచ్చేమో
నచకి:   ఘ్రాణవల్మీకమున్ 🙂
రవి: ఉన్నారా? అసలున్నారా?
రవి: రాఘవగారు లేకపోతే మరో పూరణకెళ్ళిపోదారి.
విశ్వామిత్ర:  లోపల పాములన్నాయని భయపడిందేమో – జొప్పడటానికే దృఢసత్వంబు అవసరమైంది   🙂
కామేశ్వరరావు:  ఊదంగారు,  🙂
రవి: ఇందాక సినిమా జవ్వనితో కాక ఇప్పుడు భామామణి
రవి: ఫస్ట్ క్లాసున పయన మయ్యె భామా మణితోమిస్సన్న గారూ కానివ్వండి
మిస్సన్న:  
కం ||

బెస్ట్ క్లాసున యమ్ టెక్ లో,
ఫస్ట్ క్లాస్ జాబ్ ఫారి నందు, ఫాదరు కికపై
లాస్ట్ క్లేశము! మార్యేజై,
ఫస్ట్ క్లాసున పయన మయ్యె భామా మణితో.

కామేశ్వరరావు:  ఫస్ట్ క్లాసుగా ఉంది!
వసంత్ కిషోర్:: మిస్సన్నగారు ఇంగ్లీషులో  కందం వ్రాయడంలో సిద్ధహస్తులు
రవి: : లాస్ట్ క్లేశము! కానీ అతనికి క్లేశము మొదలైంది కదండి?
విశ్వామిత్ర:  ఫాదర్ కి లాస్ట్ క్లేశము, ఈతడికి ఫస్ట్ క్లేశము
రాఘవ::)
నచకి: )
వసంత్ కిషోర్:: )
రాఘవ:ఫస్ట్ క్లాసులో ప్రయాణమో ఏమో కానీ తలపండిపోయి… లాస్ట్ క్లేశం కాస్తా పలితకేశం అయ్యి కూర్చుంటుంది. 🙂
మిస్సన్న:  అలాగే కానీండి
మిస్సన్న: )
రాఘవ:మీరు అలాగే కానీండి అంటే సరిపోదండీ.
కామేశ్వరరావు:  ఇంకా ఎవరెవరు ప్రయాణమయ్యారు భామామణితో?
రవి: : సనత్ గారూ, రాఘవగారూ, నచకిగారూ ఇదే వరుసలో పూరణలను ఆలాపించండి.
రాఘవ:రామ రామ అదేం ప్రశ్నండీ కామేశ్వరరావుగారూ!!
రవి: : సనత్ గారు లేకపోతే రాఘవ గారు, నచకిగారూ
రాఘవ:దేని పూరణ అధ్యక్షా?
మిస్సన్న:  ఇది అన్యాయమండీ కొత్త గృహస్తు.
రవి: : ఫస్ట్ క్లాసున పయన మయ్యె భామా మణితో
శ్రీపతి:  నేను ఉన్నాను
కామేశ్వరరావు:  నా ఉద్దేశం ఇంకా ఎవరెవరు పూరించారనండి 🙂
రాఘవ:అలా ఐతే ఇబ్బంది లేదు 😀
శ్రీపతి:  
కం||

బెస్ట్ క్లైమేట్ ట్రిప్పునకై
ఫస్ట్ క్లాసున పయన మయ్యె భామా మణితో
జస్ట్ ! క్లైవ్ లాయెడ్ ఫ్రీగా
హోస్ట్ క్లాజును వాడుకొనుచు హుబ్లీ రైల్లో

 మిస్సన్న:  ఓకే మన్నించాలి
వసంత్ కిషోర్:: భలే బావుంది !
రవి: హుబ్లీకి హనీమూనా? ఎవరండి ఆ అరసికుఁడు?
కామేశ్వరరావు:  "హోస్ట్ క్లాజ్" అనగానేమి?
రాఘవ:హుహుహుబ్లీకి బెస్ట్ క్లైమేట్ ట్రిప్పు… సరే. క్లైమాక్స్ ఏమిటీ?
మిస్సన్న:  జస్ట్      బెస్ట్  !
నచకి:  హుబ్లీ నుంచి వస్తున్నాడేమో లెండి, అధ్యక్షా!
రాఘవ:కిరణన్నయ్యా, ఇంకా నయం. హుబ్లీ అన్నది ట్రైన్ పేరు అన్నావు కాదు! 🙂
వసంత్ కిషోర్: అంతే అయ్యుంటుంది
నచకి:  నువ్వంటావని ఆగాను, తమ్ముడా! 🙂
కామేశ్వరరావు:  శ్రీపతిగారు రైలెక్కి వెళిపోయారా ఏమిటి?
విశ్వామిత్ర:  ఆ భామామణి "Just" భామామణి  అని సారాంశం
కామేశ్వరరావు:  నచకిగారు మీ పూరణ వినిపించండి.
నచకి:  తప్పకుండా… వినుడు
కం||

"మోస్ట్ క్లామరస్ సెకండ్ క్లాస్,
బీస్ట్ క్లాసది క్యాటిలుకని బిలిచె థరూరే –
లీస్ట్ క్లాస్ నా రేంజ్‌కిదె"యని
ఫస్ట్ క్లాసున బయనమయ్యె భామామణితో!

కామేశ్వరరావు:  పాపం థరూర్ మీద పడ్డారేం? 🙂
నచకి:  మఱో పూరణా ఉంది… వినిపించమందురా?అందులో ఎవఱి మీదా పడలేదు! 😀
వసంత్ కిషోర్:: బీస్ట్ అంటే
నచకి:  బీస్ట్ అంటే క్యాటిల్ కానిది… నిజమే. కానీ, కవిసమయం అనుకోండి కిశోరా!
కామేశ్వరరావు:  అలాగే, తొందరగా.
గన్నవరపు నరసింహమూర్తి:  కనీసము ఇక్కడ కిడ్నాపింగులు మోసాలు లేవను కొంటా ! ప్రియుడు వచ్చే లోపల ట్రయిను కదిలింది
నచకి:  
కం ||

జస్ట్ క్లారిటీ కొఱకంచు
బెస్ట్ క్లాసేదని యడిగిన పీనాసికి హై
కాస్ట్ క్లాషయి ఏ.సీ. విడి
ఫస్ట్ క్లాసున పయమనయ్యె భామామణితో!

నచకి:  (రాఘవుడు వచ్చినట్టున్నాడు?)
కామేశ్వరరావు:  బాగుంది:)
నచకి:  అధ్యక్షులవాఱికి పునస్స్వాగతం
వసంత్ కిషోర్:  బావుంది !
నచకి:  అధ్యక్షులవాఱికి పునస్స్వాగతం
రవి:  క్షమించాలి. నీలితెఱలు ఛేదించుకుని వచ్చాను
కామేశ్వరరావు:  రాఘవులది ఎక్కీదిగే ప్రయాణమైపోయింది 🙂
విశ్వామిత్ర:  🙂
మిస్సన్న:  🙂
కామేశ్వరరావు:  అధ్యక్షా, తదుపరి పూరణతో వజ్రాన్ని చీల్చుదామా?
రవి:  విశ్వామిత్రగారితో ఒక్కమారు
రవి:  ప్రవరాఖ్యుని స్థానంలో శ్రీకృష్ణుడు లేదా మరో దక్షిణనాయకుడు ఉంటే, వరూధినికి "ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో…" పద్యానికి మారుగా మరే సమాధానం/సన్నివేశం లభించి ఉండేది ఊహించి వ్రాయండి.
రవి:  పై సమస్యకు విశ్వామిత్రులు దక్క ఎవరూ సాహసించలేదు
రవి:  ఆయనను వేదికమీదికి ఆహ్వానిద్దాం
కామేశ్వరరావు:  సరే, మీకా వర్ణన కడు ప్రియమైనదిలా ఉంది 🙂
రవి:  మీ వర్ణన (పెద్దన గారిది) కదండీ. 🙂
విశ్వామిత్ర:  🙂
కామేశ్వరరావు:  విశ్వామిత్రా దంచెయ్యండి
విశ్వామిత్ర:  చూడండి
రాఘవ:  అంతరాయానికి చింతిస్తున్నాను
విశ్వామిత్ర:  
శా ||

ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార పై
యంచుల్‌మోవగ కౌగిలించి యధరంబాసింప హా!సుందరీ
యంచున్‌ నాయకుడా కృశాంగిని తదీయాంసద్వయంబంటి ర
మ్మంచున్‌లాచెనమర్త్యకున్నొసఁగగాఢాలింగనామాన్యతన్

రవి:  రెండవ పద్యం లాగించండి.
విశ్వామిత్ర:  రవిగారూ ఇక్కడ ఆపుదామ్ , ఇది క్షణికం కదా
విశ్వామిత్ర:  చివరి పాదంలో మాన్యతన్ ఎందుకన్నానో పెద్దనగారు చెబుతారు
గన్నవరపు నరసింహమూర్తి:  విశ్వామిత్రుల వారి పూరణ దంచేసారు !
కామేశ్వరరావు:  నాకేదో సమస్య ఇచ్చారు విశ్వామిత్రులవారు?
రాఘవ:  చాల బాగుందండీ విశ్వామిత్రులవారూ.
వసంత్ కిషోర్:  చక్కగా వుంది !
రవి:  సృష్టికి ప్రతిసృష్టి విశ్వామిత్రుల వారి పేటెంటు
మిస్సన్న:  సుందరంగా ఉంది
నచకి:  సలక్షణంగా సాగింది పద్యం
కామేశ్వరరావు:  పద్యం అద్భుతం. ఆ ప్రహేళికేదో మీరే విప్పండి
విశ్వామిత్ర:  నాది గట్టిగా ఒక పాదమే అని మిత్రులు గుర్తించాలి  🙂
రవి:  మీ పాదంలోనే కదండి మాన్యత కల్పించినది?
శ్రీపతి:  పద్యం చాలా బాగున్నది…
విశ్వామిత్ర:  ముందు పద్యంలో వరూధిని కౌగిట గారవింతువో అంటుంది కదండీ
రాఘవ:  ఇలా గారవించాడంటారు
విశ్వామిత్ర:  🙂
కామేశ్వరరావు:  ఓహో! బాగుంది. సరసమైన సమాధానం 🙂
రవి:  ఓహో అలాగన్నమాట? ముందు వెనుకలు చూసుకోవాలి అంటారు?
శ్రీపతి:  మ్మంచున్‌లాచెనమర్త్యకున్నొసఁగగాఢాలింగనామాన్యతన్ – ప్రబంధాలను మరిపించేట్టుంది ఈ పూరణ
నచకి:  నేనింకా "మాన్య? తనూ హీరోయినే!" అనుకున్నాను.
రాఘవ:  నచకిచకిచలు! 😛
విశ్వామిత్ర:   మర్పించేటట్టు కాదు తలపించేటట్టు
కామేశ్వరరావు:  అది మాత్రమెంత కాదు!
రాఘవ:  విశ్వామిత్రులవారూ, మీ తరువాతి పద్యాలు?
రవి:  నచకిగారు సినిమా బయట టికెట్ల వద్ద ఇందాక దెబ్బతిని కూడా సినిమా హీరోయిను అంటున్నారు
విశ్వామిత్ర:  🙂
నచకి:  పొరబడ్డారు… నేను క్యూ కడ ప్రేక్షకపాత్ర మాత్రమే 😉 అందుకనే ప్రథమ పురుషలో సాగలేదు ఆ పద్యం. 🙂
రవి:  సరే విశ్వామిత్రులవారు సిగ్గుపడుతున్నారు, ఇక వజ్రసమస్యకు వెళదాం
నచకి:  ముక్కుపచ్చలారలేదు! (కర్చీఫ్ మర్చిపోయాను!!) అప్పుడె అంకుల్‌ని చేసెయ్యకండి మహాప్రభో! 😀
విశ్వామిత్ర:  రాఘవగారు – మిగతాది వెండితెర పైన  🙂
రవి:  వసంత్ కిషోర్గారిని ఆహ్వానించబోతున్నాము
రాఘవ:  ఊఁ 🙂
వసంత్ కిషోర్:  అలాగే ! అవధరించండి !
రవి:  వజ్రము చీలిపోయినది వారిజ పత్రము సోకినంతటన్ – ఇది సమస్య.
వసంత్ కిషోర్:  గరుత్మంతుని ఆహారాన్ని అలంకారముగా దాల్చిన ఈశ్వరుని స్థిర సంకల్పముతో ,నిశ్చల భక్తితో,ధ్యానించి బాలుడైనమార్కండేయుడు, ఇంద్రుడూ మొదలైన సమస్త దేవతలు  చూస్తుండగా యముని మీద విజయం సాధించెను గదా :
ఉ||

వజ్రపు తుండు ఖాదనము – పాటన దాల్చిన వాని,నీశునిన్
వజ్ర సమానమౌ సరళి – బాలుడు; నిశ్చల భక్తి బూని , యా
వజ్రి, సమస్త దేవతల – పాలున, కాలుని గెల్చెనే గదా !
వజ్రము చీలిపోయినది – వారిజ పత్రము సోకి నంతటన్ !

గన్నవరపు నరసింహమూర్తి:  కిశోర్ జీ చాలా బాగుంది !
రవి:  భళా!
కామేశ్వరరావు:  చక్కని ఊహ!
శ్రీపతి:  బహు చక్కగా ఉన్నది పూరణ
నచకి:  ఆహా!
మిస్సన్న:  కిశోర్ మహోదయా చాలా బాగున్ది.
వసంత్ కిషోర్:  మిత్రులకు ధన్యవాదములు !
రాఘవ:  వజ్రపు తుండు ఖాదనము పాటన దాల్చిన వాడు — కొంచెం వివరించండి.
వసంత్ కిషోర్:  గరుత్మంతుని ఆహారాన్ని అలంకారముగా దాల్చిన ఈశ్వరుని
రవి:  వజ్రపుతుండు – అంటే గరుత్మంతుడాండి?
వసంత్ కిషోర్:  వజ్ర తుండుడు=గరుత్మంతుడు
రాఘవ:  ఓహో వజ్రతుండుడు అనా? నాకు తట్టలేదు సుమండీ!
రవి:  బావుందండి
నచకి:  క్రొత్త విషయం తెలిసింది
గన్నవరపు నరసింహమూర్తి:  కిశొర్ గారి దగ్గఱ క్రొత్త పదాలు దొరుకుతాయి
వసంత్ కిషోర్:: మిత్రులకు ధన్యవాదములు !
రవి:  మిస్సన్నగారు రెండు విధాలుగా పూరించారు. మొదటి పూరణ చెప్పాలి
మిస్సన్న:  తప్పకుండానండీ
ఉ||

వజ్ర కరూరు నుండితడు వజ్రపు వర్తకు డంచు చెప్పగా
వజ్రపు టుంగరమ్ము  గొనె, వచ్చిన ప్రేయసి కిచ్చె, నామెయున్
వజ్రము మెచ్చి ముద్దిడగ వత్తిడి కయ్యది చిట్లి పోయె నా
వజ్రము చీలిపోయినది వారిజ పత్రము సోకినంతటన్!

వసంత్ కిషోర్:: చక్కగా వుంది !
మిస్సన్న:  అధ్యక్షా మీరడింగిది ఇదేనా
వసంత్ కిషోర్:: ముద్దులో అంత శక్తి ఉందా
గన్నవరపు నరసింహమూర్తి:  మిస్సన్నగారూ బాగుంది. ఇక తను చుంబన అంటే భయపడాలి !
కామేశ్వరరావు:  కిశోర్ గారు, 🙂
మిస్సన్న:  వజ్రంలో అంత గట్టిదనం ఉంది.
పుష్యం:ముద్దుగుమ్మ ఇవ్వ, ముద్దునందుకూడ – అంతశక్తి వచ్చు, ఆర్య వినుడి 🙂
మిస్సన్న:  మూర్తి గారూ ఇదీ బాగున్ది.
వసంత్ కిషోర్:  వజ్రం చీలింది గదా
మిస్సన్న:  ఇది  ఇంకా బాగున్ది.
రవి:  మిస్సన్నగారూ, మీ పూరణ అయిందనుకుంటాను
రవి:  అంతరాయానికి క్షమించాలి
మిస్సన్న:  అయిందండీ
రవి:  చివరిగా మరో దుష్కర ప్రాస చూద్దాం
రవి:  విస్ఫోటంబున దైవ శక్తి వెలుగున్ విద్వన్మనోజ్ఞంబుగా – నచకి గారూ, మీ వంతు
నచకి:  చిత్తం
శా ||

ఆస్ఫాలించెడుయే పదార్థమయినా ఆవర్త విశ్వంబునన్
విస్ఫుల్లింగ కణాదులే వెడలగన్ పేర్మిన్ కణాద్యావళిన్ (రియాక్షన్లలో)
విస్ఫోటంబున దైవశక్తి వెలుగున్ విద్వన్మనోజ్ఞంబుగా
విస్ఫారంబగు విశ్వవీథిని మహావిస్తార భారంబదై

వసంత్ కిషోర్:  అద్భుతం ! కరతాళ ధ్వనులు !
గన్నవరపు నరసింహమూర్తి:  దుష్కర ప్రాసలను మిత్రులంతా బాగా పూరించారు. చాలా బాగుంది
నచకి:  ప్రపంచంలోని పదార్థం (matter) అంతటికీ భారం (mass) అన్నది "హిగ్స్ ఫీల్డ్" అన్న దాని వలన వస్తుందని, ఆ ఫీల్డ్ అన్నది హిగ్స్ బోసాన్ అన్న కణం (particle) వలననీ నమ్మిక. ఆ హిగ్స్ బోసాన్ ఉందని తెలుసు, దాని ప్రభావం తెలుసు… కానీ దాన్నిప్పటి దాకా ఎవఱూ చూడలేదు. ఆ కారణం వలనేమో దాన్ని దైవకణం (God particle) అంటారు. బిగ్ బ్యాంగ్‌లో పుట్టిన ఆ దైవకణం కోసం వెదుకులాట సాగుతోంది.
మిస్సన్న:  అణువులూ  అరమాణువులూ    ఆర్బిటాళ్ళూ   ఢీకొట్టడం  బాగుంది.
రవి:  అత్యద్భుత పూరణండి
రాఘవ:ఢాం ఢాం పూరణ 🙂
కామేశ్వరరావు:  మరోమారు సైన్సు పాఠం! బాగుంది.
కామేశ్వరరావు:  "ఆస్ఫాలించెడు యే" – "ఆస్ఫాలించెడు నే" అని ఉండాలి
నచకి:  దిద్దినందుకు నెనర్లు, కామేశ్ గారూ!
 కామేశ్వరరావు:  లేదా "ఆస్ఫాలించెడి యే" అన్నా సరిపోతుంది
నచకి:  రెండోది చులాగ్గా అర్థమవుతుంది. అదే ఖాయం చేసుకుంటాను.
 
సవరించినపూరణ:
శా ||

ఆస్ఫాలించెడి యే పదార్థమయినా ఆవర్త విశ్వంబునన్
విస్ఫుల్లింగ కణాదులే వెడలగన్ పేర్మిన్ కణాద్యావళిన్ (రియాక్షన్లలో)
విస్ఫోటంబున దైవశక్తి వెలుగున్ విద్వన్మనోజ్ఞంబుగా
విస్ఫారంబగు విశ్వవీథిని మహావిస్తార భారంబదై

కామేశ్వరరావు:  సైన్సుకీ దేవుడికీ బాగానే ముడిపెట్టారు 🙂
నచకి:  ఇంత రసవత్తరంగా, రెండు విడతలుగా సాగిన సభకు సరైన ముగింపు. 🙂
పుష్యం:Sceintology?? 🙂
రవి:  సభకు తుదిగా ఆధునిక కవుల కవితాసక్తి –
రవి:  వీరణము    తోరణము     ధారణము    ప్రేరణము. మాటలలో ఉత్పల మాలలో – గన్నవరపు మూర్తి గారి ద్వారా విందాం
గన్నవరపు నరసింహమూర్తి:  
ఉ||

తాండవ మాడు శంకరుఁడు తధ్ఘిణి తంబుల వీరణమ్ములన్
మండిత వీణ రావములు మౌక్తిక సంధిత తోరణంబులౌ
చండిక ప్రేరణమ్మిడును శారద చెల్వము ధారణమ్మునున్
పాండితి ప్రజ్వరిల్లగను పద్యము లల్లరె మిత్ర పుంగవుల్ !

నచకి: చండిక ప్రేరణమ్మిడును శారద చెల్వము ధారణమ్మునున్ ->లెస్సఁ బలికితిరి!
వసంత్ కిషోర్:  శభాష్ ! మూర్తీజీ !
రవి:  పొద్దు వారి గడువు పూర్తయింది
గన్నవరపు నరసింహమూర్తి:  ఇది మా గురువులు శంకరార్యులు వారి స్ఫూర్తితో
మిస్సన్న:  మూర్తి గారూ శివుని నాట్యమ్ దిన్చేశారు
రవి:  పద్యములల్లిరి మిత్రపుంగవుల్ అనుకోవాలి! చివర్న వచ్చింది కాబట్టి
శ్రీపతి:చాలా బాగున్నది పూరణ
గన్నవరపు నరసింహమూర్తి:  ధన్యవాదములు అందఱికీ !
కామేశ్వరరావు:  అవును, ఇక్కడందరూ "పుం"గవులే ఉన్నారు 🙂
నచకి:  కామేశ్ గారూ, శ్లేష మీ భాషని మఱో సారి నిరూపించారు! 🙂
కామేశ్వరరావు:  🙂
మిస్సన్న:  వందనచందనాలు.
వసంత్ కిషోర్:   అందఱికీ ధన్యవాదములు !
రవి:  ఈ సభను ఇంత అద్భుతంగా నడిపించిన కవులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
మిస్సన్న:  వందన చందనాలు.
గన్నవరపు నరసింహమూర్తి:  రవిగారుబాగానడిపించారు.
శ్రీపతి:సభను హృద్యంగా నడిపించిన సంచాలకులవారికీ, సదస్యులకూ మా శుభాకాంక్షలు
రాఘవ:శుభం
కామేశ్వరరావు:  ఈ వేదికని కల్పించిన పొద్దువారికీ, వీవెనులకి ధన్యవాదాలు.
రవి:  సభలో ఏదేని పొఱబాట్లు దొరలి ఉంటే క్షమించాలి.
వీవెన్:  కామేశ్వరరావుగారూ, నెనరులు! 🙂
గన్నవరపు నరసింహమూర్తి:  అందరికీవందనాలు,
శ్రీపతి:వీవెనులకు విశ్వామిత్రులవారు ఆశీస్సులను పద్యమాలిక గా అందించారు
నచకి:  5 గంటల పాటు సాహితీసభలో, సత్కవిసమూహంలో ఉన్నా సమయం సాగుతున్నట్టు అసలు తెలియలేదు. అధ్యక్షుల వాఱికీ, ఉపాధ్యక్షుల వాఱికీ, సదస్యులకీ పేరుపేరునా నెనర్లు! ఎన్నో విషయాలు నేర్చాను.
కామేశ్వరరావు:  అధ్యక్షులు అనుజ్ఞ యిస్తే ఊదంగారు పంపిన పద్యంతో సభ ముగిద్దాం
రవి:  తప్పకుండా,కానివ్వండి
కామేశ్వరరావు:  
ఉ ||

భావనచేయగా తెలుగు భారతి సేవకు పద్యగోష్ఠినే
దీవుల దూరదేశముల తీరుగ యున్నకవుల్ జతౌ గతిన్
తావును గూర్చెజాలమున దంతిసహస్రసమాళికిన్ వెసన్
వీవెను నామధేయునికి వేల్పులు జేయెర మేలునిత్యమున్

రాఘవ:భలే
శ్రీపతి:భేష్.. చాలా బాగున్నది.
రాఘవ:వీవెన్… నెనర్లు.
మిస్సన్న:  శుభం భూయాత్!
వీవెన్:  🙂
నచకి:  సముచితం! ఈ సభ విషయమే గాదు, లేఖిని వలన బాగుపడిన నా లాంటి వాళ్ళెందఱో!
రవి:  వీవెన్కు,సభకు సరైన నెనర్లు
వసంత్ కిషోర్:  శుభం
కామేశ్వరరావు:  మిత్రులందరికీ మరోసారి వందనాలు. రాబోయే కొత్త ఏటికి శుభాకాంక్షలు.
నచకి:  శ్రీ ఖరనామవత్సర ఉగాది శుభాకాంక్షలు!
కామేశ్వరరావు:  మళ్ళీ దసరా పండక్కి కలుద్దాం
గన్నవరపు నరసింహమూర్తి:  ధన్యవాదములు అందఱికీ ! శుభం !
రవి:  మిత్రులందరికీ పొద్దు తరపున కృతజ్ఞతలు
రవి:  మళ్ళీ దసరాకు కొత్త ఆలోచనలతో కలుద్దాం
కామేశ్వరరావు:  ఆధ్యక్షత వహించిన రవికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు
నచకి: (ఆశువు)


వసంతవేళ సాగుతున్న పాండితీసభన్, భళీ
కసా పిసా మసా యనీ కవుల్ వాడి జూపగా
ప్రసారమున్ జేసినారు బాగుగాను ప్రొద్దులో
రసాభసల్ చేసి యున్న లైటు తీసుకోండికన్

కామేశ్వరరావు:  స్వస్తి!
వీవెన్:  అందరికీ సెలవ్!
కామేశ్వరరావు:  నచకిగారు, లైటు తీసి పడుకొనే వేళే అయ్యిందిక్కడ 🙂
వీవెన్: )
నచకి:  కామేశ్ గారూ, శుభరాత్రి! 🙂
నచకి:  వీవెన్గారికీ, రవిగారికీ, మూర్తి గారికి కూడా శుభరాత్రి! శ్యామ్ గారూ, సత్భోజనమస్తు!
కామేశ్వరరావు:  సరే మరి, సెలవ్. శుభం!
నచకి:  అస్తు!
రవి:  రాఘవగారు: మంగళాచరణం గావించాలి.
రవి:  రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం !
రవి:  స్వస్తి.
 
****

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.