వసంతసుమశేఖరము – 4

రవి:  దాదాపుగా అందరూ వచ్చేశారు కాబట్టి రెండవ విడత సభ ఆరంభం చేద్దాం.
రవి:  శ్రీకారంతో సభకు పునఃస్వాగతం -చింతా వారి మరొకపద్యం.

ఉ ||

శ్రీ ధవు నాశ్రయించి, వరసిద్ధి గణాధిపునిన్ భజించి, వా
ఙ్నాధు నుమాపతిన్ గొలిచి, నన్నయ , తిక్కన, యెఱ్ఱనాదులన్
సాధు సుపూజ్య సత్ కవుల, సద్గుణ గణ్యులనెల్ల కొల్చి, స
ద్బోధను గొల్పి యీ సభను పూర్ణ మనంబునఁ బ్రోవఁ గోరెదన్.

గన్నవరపు నరసింహమూర్తి:  మనోహరముగా ఉంది
వసంత్ కిషోర్:  చక్కగా వుంది !
కామేశ్వరరావు:  చాలా బాగుంది. మధ్యలో వినాయకుడు వచ్చినా, పురుషోత్తమ, అంబుజభవ, శ్రీకంధరుల వరస మారలేదు!
రవి:  వాఙ్నాధు నుమాపతిన్ – ఎంత అవలీలగా ప్రాస కూర్చారని ఆశ్చర్యంగా ఉంది
కామేశ్వరరావు:  అదే వరసలో నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱనలు కూడా వచ్చారు
విశ్వామిత్ర:  వాగ్దేవి లీల
గన్నవరపు నరసింహమూర్తి:  వాజ్ఞాధు బాగుంది, సద్బోధ యింకా బాగుంది
గిరి:  సభారంభము చేస్తే ఇలాంటి ప్రార్థనాపద్యంతోనే చేయాలి
గిరి:  కామేశ్వరరావుగారు, మీ వ్యాఖ్యానం బావుంది
వసంత్ కిషోర్:  మిస్సన్నమహాశయులకు స్వాగతం
కామేశ్వరరావు:  మిస్సన్నగారు కూడా వచ్చేసారు. స్వాగతం
మిస్సన్న:  కవి మిత్రులందరికీ నమస్కారాలు.
గన్నవరపు నరసింహమూర్తి:  మిస్సన్నగారూ నమస్కారములు సుసంధ్యా సమయం
రవి:  ఇక సమస్యల కెళ్దామంటారా? ఈ సారి రాఘవ గారిని వదిలేది లేదు.
కామేశ్వరరావు:  అలాగే మొదలుపెడదాం.
రవి:  అశ్వధాటి వృత్తంలో “హత్యా ప్రయత్నమున స్తుత్యుం డయెన్ దురితు డత్యుత్తముం డనఁబడెన్” సమస్యకు రాఘవ గారి పూరణను విందాం.
రవి:  రాఘవార్యా! ఒకటవసారి..
కామేశ్వరరావు:  రాఘవమౌనవ్రతానికి కారణమేమి?
గన్నవరపు నరసింహమూర్తి:  అశ్వధాటిలో ప్రాస యతి కావడము వలన చాలా ప్రాసలు కావాలి
కామేశ్వరరావు:  అవును. అది మామూలు అక్షరమైతే ఫరవాలేదు. ఇలాంటి సంయుక్తాక్షరాలైతే కష్టమే!
కామేశ్వరరావు:  మూడు నాలుగులు పన్నెండు ప్రాసలు!
గిరి:  గన్నవరపు గారు,  ప్రాసనియమము లేకపోవడం వల్ల అన్ని పాదాల్లో అదే అక్షరము ఉండవలసిన అవసరము లేదు
వసంత్ కిషోర్:  నేను వినిపించేదా
కామేశ్వరరావు:  తప్పకుండా కిశోర్జీ
వసంత్ కిషోర్:  “ఆత్మ హత్య మహా పాపం ” అని గదా నార్యోక్తి ! సత్యాగ్రహ మంటే ఆత్మ హత్యా ప్రయత్నమే గద !
వసంత్ కిషోర్:  మరి అటువంటి పాపం చేసిన వారిని ” దురితుడ “న వచ్చును గద ! అనగూడ దనిన నన్ను క్షమింతురు గాక !కాబట్టి , ఆ దురితము చేసిన  “మహాత్మా గాంధీ “గారి నుద్దేశించి ఈ ప్రయోగం  !చందంలో సరిగ్గాబంధించానో లేదో నని నా భావా న్నిక్కడ పొందు పరుస్తున్నా !
గన్నవరపు నరసింహమూర్తి:  ఓహో అలాగా అయితే వచ్చే సారి ప్రయత్నిస్తా
వసంత్ కిషోర్:  భావము :సత్యమును నిత్యమూ నిష్టముగా నాచరించి సఫలీకృతు డాయెను !నిత్యాగ్నిహోత్ర సమానమైన సత్యాగ్రహమనే ఆయుధమును ప్రపంచమున కందించెను !సత్యాగ్రహం చేసే సమయాల్లో, మృత్యువుకు చేరువైనా ,జన హితమును విడువకుండా వారికి సేవలు చేసెను !అనగా స్వాతంత్ర్యం సంపాదించి పెట్టెను !
వసంత్ కిషోర్:

అశ్వధాటి వృత్తము:

సత్యాభివాదమును నిత్యంబునిష్టముగ  కృత్యుండుచేతగొనెనే !
సత్యాగ్రహంబనెడు నిత్యాగ్నిహోత్రమును  నత్యంత ప్రీతి నిడెనే !
మృత్యోన్ముఖుండయిన పథ్యంబునే  విడక భృత్యుండుగా  మనెనులే !
హత్యాప్రయత్నమున స్తుత్యుండయెన్‌, దురితుడత్యుత్తముండనబడెన్ !

వసంత్ కిషోర్:  పథ్యము = (జన )హితము; హత్య = ఆత్మ హత్య

రవి:  కిషోర్జీ, మంచి ప్రయత్నం
మిస్సన్న:  వసన్త మహోదయా అభినన్దనలు
గిరి:  కిశోర్ గారు, మంచి ప్రయత్నమండీ
గన్నవరపు నరసింహమూర్తి:  కిశోర్ జీ బాగుంది, యీ మధ్య చేస్తున్న సత్యాగ్రహాల మాటేమిటి ?
వసంత్ కిషోర్:  మిత్రులకు ధన్యవాదములు !
శ్రీపతి:  రాఘవగారు ఒక్క పది నిముషాల్లో ఉంటానని అన్నారు.. ఆల్సయానికి మన్నించాలన్నారు. ఒకట్రెండు ఆశువులు చెప్పమని అడిగి మన్నించేయమని అధ్యక్షులవారికి సిఫార్సులు.

కామేశ్వరరావు:  గిరిగారు, దీనికి ప్రాస నియమం ఉందికదా?
గిరి:  కామేశ్వరరావుగారు, లేదని చదివినట్లు గుర్తు
రవి:  ప్రాసయతి నియతమని చింతావారు అన్నట్టు గుర్తండి
గిరి:  అలా భావించే నేను పూరణ ప్రయత్నించాను
రవి:  సారీ, ప్రాసనియమమన్నారా?
కామేశ్వరరావు:  ఒహో. చూడాలైతే.
వసంత్ కిషోర్:  ఔను ప్రాసయతే !అది పన్నెండు చోట్ల ఉంటేనే అందం
రవి:  చింతావారి బ్లాగులోనూ, రాఘవగారి పూరణలోనూ ప్రాస కుదిర్చారు
శ్రీపతి:  ప్రాసయతి నియమమని చింతావారు చెప్పారు, కాకపోతే ప్రాసలేదన్నది తెలియదు…
గిరి:  అది నిజమే, ప్రాసకుదిరితే అంద మినుమడిస్తుంది
కామేశ్వరరావు:  గిరిగారి పూరణ విందామా?
రవి:  గిరిగారి పూరణ విందాం
గిరి:  తెలుగు వృత్తాలలో ప్రాసనియమము తప్పని సరిగా ఉంటుంది కనుక నా అనుకోలు సరైనది కాకపోవచ్చును
రవి:  ప్రాసనియమం ఉందనుకుంటానండి. చింతావారు ఏ పద్యంలోనూ ప్రాసనియమం తప్పలేదు.
రవి:  సంస్కృతంలో ఎలానూ లేదు. తెలుగులో అశ్వధాటి ప్రయోగాలు ఏ కవులు చేశారో తెలియదు.
గిరి:  అట్టైతే నా పూరణ నియమబధ్ధము కాదు
వసంత్ కిషోర్:  దీనికి లేదనే చెప్పారు కాని ఉంటేనే అందం
గన్నవరపు నరసింహమూర్తి:  లక్షణాలు ఏమిటి ?
రవి:  ఆంధ్రామృతంలో రాఘవ గారుశ, స లకు ప్రాస కూరిస్తే దానిగురించి గురువుగారు గొప్ప చర్చే చేశారు
వసంత్ కిషోర్:  నియమం లేదు గనుక చెప్పొచ్చు

మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్

రవి:  సరే గిరిగారిని విడవకుండా తనతో మరో పూరణ చెప్పిద్దాం. మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్. – గిరి గారూ కానివ్వండి

గిరి:  అలాగే
గిరి:  నవోఢ వర్ణన
కం ||

తా సిగ్గు జెందుచు మగని
గ్లా సందిన క్రొత్త పెండ్లి కన్నె పెదవిపై
భాసిల్లు పాల నురుగుల
మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్

వసంత్ కిషోర్:  అద్భుతం ! కరతాళ ధ్వనులు !
రవి:  మీరేమన్నన్ – ఏమంటామండి? అద్భుతమంటాం.
చదువరి:  పాల మీసాలు – బావుంది.
మిస్సన్న:  పూరణ చాలాబాగుందండీ
గన్నవరపు నరసింహమూర్తి:  చాలా బాగుంది అంటాము
వసంత్ కిషోర్:  పాలనురుగుల మీసాలు వ్వావ్ !
కామేశ్వరరావు:  పాలనురుగుల మీసాలు, అదీ శోభనం పెళ్ళికూతురివి! అబ్బో ఆ సొగసు వర్ణించడం ఎవరి తరం!గిరిగారికి తప్ప!
మిస్సన్న:  శృంగార రసాత్మకంగా ఉంది.
రవి:  మొన్నామధ్య విలేజ్ లో వినాయకుడు అనే సినిమాలో ఓ దృశ్యం గుర్తొచ్చింది
కామేశ్వరరావు:  రవీ! మీరు మరీ అంత అన్-రొమాంటిక్ అనుకోలేదు! :-)
రవి:  కామేష్ గారూ, ఇంకా నేననుకున్న సీన్ చెప్పందే? :)
గిరి:  రవిగారు, చెప్పండి మరి
విశ్వామిత్ర:  నరసింహ మూర్తి గారూ ఇది పాల గ్లాసే
గన్నవరపు నరసింహమూర్తి:  ఏముందో లోపల ఎవరికి తెలుసు ?
రవి:  ఆ సినిమాలో హీరోవిను గ్లాసులో పాలుత్రాగితే ఆ పాలతో మీసాలొస్తాయి.అది చూసి హీరో గారు తన నాలుకతో పెదవులు తుడుచుకుంటారు. (హీరోవినును కూడా అలానే తుడిచేసుకొమ్మని సూచిస్తూ)ఆమె,హీరో గారు మరో ఉద్దేశ్యంతో అలా అంటున్నారని భావించి సిగ్గులమొగ్గవుతుంది.
కామేశ్వరరావు:  అదా, ఆ తర్వాత సీననుకున్నా :)
గిరి:  అవునా, నేను చూడలేదండీ
విశ్వామిత్ర:  :) గిరిగారే చెప్పాలి ఏ ముందో లోపల
గన్నవరపు నరసింహమూర్తి:  అమ్మాయి పాలు తాగుతే మనకి మత్తొచ్చిందే
కామేశ్వరరావు:  మూర్తిగారు, అదే కదా గమ్మత్తు!

రాఘవ:  సభ్యులారా ఆలస్యానికి మన్నించాలి
మిస్సన్న:  మూర్తిగారూ మందు మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్…………….
రాఘవ:  అశ్వధాటి గుఱించి… ప్రాసయతి కచ్చితంగా ఉండి తీరాలి. ప్రాసయతి ఉందంటే ప్రత్యేకంగా ప్రాస ఉండాలి అని చెప్పనక్కఱలేదు.
రవి:  ఒక్కో పాదంలో ఒక్కొక్క ప్రాసయతి ఉండారాదాండి?
శ్రీపతి:  ప్రాస యతి ఏ పాదానికి ఆపాదం చెల్లించవచ్చా? అంటే సీసం లో పాదం పాదానికీ అనుప్రాస వేరే చెల్లిస్తూంటారు కదా అలా చేయవచ్చా?
కామేశ్వరరావు:  ఇంకా గిరిగారి పూరణ మత్తు నాకు దిగలేదు. ఈ యతిల గోల నాకు పట్టడం లేదు. :-)
వసంత్ కిషోర్:  ప్రాసయతి ఉన్నచోటల్లా ప్రాస అఖ్ఖరలేదు గదా
రాఘవ:  ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క ప్రాసయతి అంటున్నారంటే, ప్రాస ఉండటం అత్యవసరమా అని అడుగుతున్నారు. అంతేనా?
రవి:  అవును
గిరి:  ప్రాసయతి, ప్రాస వేఱ్వేఱు
రాఘవ:  ఆఁ … కవికులగురువైన కాళిదాసు కూడా పద్యం పద్యం మొత్తానికి ప్రాసయతి చెల్లించారు, అది కూడా ప్రాస యతులు తెలుగులో మనం పట్టించుకున్నట్టుగా పట్టించుకోని సంస్కృతంలో.
గిరి:  కాకపోతే, అశ్వధాటిని తెలుగు వృత్తముగా పరిగణిస్తే ప్రాసనియమము ఉండవలసినదే
రాఘవ:  దానిని బట్టి తేలేదేమిటంటే,కాళిదాసంతటివాడే సంస్కృతంలోనే పద్యం మొత్తానికీ ఒకే ప్రాసయతి వాడగా లేనిది, తెలుగులో మనం వాడకుండా ఉండగలమా? :)
గిరి:  రాఘవగారు, నేను ఒప్పుకుంటున్నాను – అందుకే నా పూరణని వెనుదీసుకున్నాను
రవి:  హ్మ్. అవును మీరన్నది ఔచిత్యంగానే ఉంది. అబ్జెక్షన్స్ అనీ కేన్సిల్డ్.
రాఘవ:  సంస్కృతంలో కూడా అశ్వధాటిని ప్రత్యేక వృత్తంగా చెప్పినట్టున్నారు, ఒకసారి చూడాలి.
రాఘవ:  గిరిగారూ, మీ పూరణ వెనుకకు తీసుకోకండి.
రాఘవ:  నడక తెలిసి, తరువాత తరువాత నలుగురు వ్రాయటానికి పనికివస్తుంది.
కామేశ్వరరావు:  రాఘవా, పైన గిరిగారి పద్యం ఒక్కసారి చదవండి. యతులు గితులు పక్కనపెట్టి వెంటనే ఒక చక్కనిచుక్కకు తాళిగట్టేస్తారు! :-)
రాఘవ:  ఆ పాలనురుగుల పద్యమేనా? 😀
గన్నవరపు నరసింహమూర్తి:  గిరిగారూ చెప్పండి నష్టము లేదు. మళ్ళీ సవరిద్దురు గాని
రవి:  రాఘవగారు కూడా ఏమంటారో వినాలని ఉంది.
రవి:  మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్. – మీరేమంటారు రాఘవా?
విశ్వామిత్ర:  వారు ఆ ప్రయత్నం లోనే సభకు ఆలస్యంగా వచ్చారని భోగట్టా
గిరి:  చూస్తే అశ్వధాటిని లయగ్రాహి, లయవిభాతుల ప్రక్కన పెట్టవచ్చు – కవులని ప్రాసాక్షర వేటలో పంపే పద్యాల కోవలో
రాఘవ:  గిరిగారూ, నిజం. దాదాపుగా అంతే.
కామేశ్వరరావు:  విశ్వామిత్రులవారు దివ్యదృష్టితో చెపుతున్నారా? :-)
రవి:  గిరిగారూ, కాలాతీతమవుతున్నది
గిరి:  అయ్యో రవిగారు, ముందుకు సాగండి
విశ్వామిత్ర:  సవ్యదృష్టితో  :)
రాఘవ:  రవిగారూ, నాకు గిరి గారిలాగానో కామేశ్వరరావు గారిలాగానో అనుభవం లేదు కాబట్టి, ప్రస్తుతానికి నేను ఇలా పూరించాను ఈ మీసాల పద్యాన్ని…
రాఘవ:
కం ||

ఈ సంసారమునఁ దనరుఁ
బ్రాసయతులు పద్యమునకు,బాలున కాటల్,
హాసము మొగమున,మగనికి
మీసాలే,స్త్రీకి సొబగు,మీరేమన్నన్

రాఘవ:  తనరుట వీటికి అన్నిఁటికీ అన్వయించుకోవాలి.
విశ్వామిత్ర:  చూశారా వారప్పుడే బాలునకాటల్ అంటున్నారు
గిరి:  పాదాల్ని విరిచి మరీ అప్పగించారు
గన్నవరపు నరసింహమూర్తి:   చాలా బాగుంది
కామేశ్వరరావు:  రాఘవమంచి బాలుడు. ప్రాసయతులతో మాత్రమే ఆడుకుంటాడు :-)
వసంత్ కిషోర్:  చప్పట్లు !
గిరి:  కామేశ్వరరావుగారు, నిజమే
రాఘవ:  బాలునకాటలు అనటంలో అభ్యంతరమేమిటి విశ్వమిత్రులవారూ?
శ్రీపతి:  ప్రస్తుతానికి  మాత్రమే .. 😉
మిస్సన్న:  సందర్భోచితమైన అందమైన పూరణ
గన్నవరపు నరసింహమూర్తి:  విశ్వామిత్రుల వారు సవ్యదృష్టితో చెప్పారు
రవి:  కామేష్ గారు, మగనికి మీసాలని కూడా రాఘవ అన్నారు
రవి:  చివరగా స్త్రీకి సొబగు తనరు అని కూడా అన్నారు.
గన్నవరపు నరసింహమూర్తి:  రాఘవగారు బాలునితో ఆడుకొంటారని వారి భావము
శ్రీపతి:  అందుకే అన్నా… రాఘవ మంచి బాలుడు. ప్రాసయతులతో మాత్రమే ఆడుకుంటాడు, ప్రస్తుతానికి  .. 😉
కామేశ్వరరావు:  అదంతా అనుభవం లేని శ్రుతపాండిత్యమే అని తెలియడంలా :-)
మురళీమోహన్:  గిరిగారు ఇంకా తొలిరేయిలోనే ఉంటే రాఘవగారు సంసారం దాకా వెళ్ళారు.
విశ్వామిత్ర:  వారేమో నన్ను బాలు(డి)ని చేసి ఆడుకుంటున్నారు :)
రవి:  మురళి గారు :))
గిరి:  మురళిమోహన్ గారు, నిజజీవితంలో అది తారుమారు
రాఘవ:  మీరు “బాలుడు > మీసాలు > స్త్రీసొబగు” క్రమంలో అపార్థం చేసికొంటే నేనేం చేయలేను. అది అనుకోకుండా వచ్చింది.
రవి:  అనుకోకుండా వచ్చింది కాబట్టి మరింత అనుమానాస్పదం
రవి:  సరేనండి రాఘవ గారికి ఈ శిక్ష చాలించి ముచ్చటగా మూడవ పూరణకెళదాం
శ్రీపతి:  అవును మరి బ్రహ్మచారి గారు మట్టలారేసుకోబోయి మనసు పారేసుకున్నారు అందుకే అందరూ ఆడెసుకుంటున్నారు..
రవి:  మూడును మూడు మూడు మఱి మూడును మూడును మూడు మూడుగన్ – ఈ సమస్యకు అత్యధికమైన, విలక్షణమైన పూరణలు వచ్చాయి.
రవి:  సదస్యులారా? పదండి ముందుకు, పదండి తోసుకు.సనత్ గారూ మీ సైన్సు పాఠం చెప్పండి ఆ పూరణకు
రాఘవ:  అమ్మాయేమిటండీ? ఆవిడెవరు? ప్రస్తుతానికి ఏ విశేషమూ లేదు. విశేషమేమైనా ఉంటే మీ అందరికీ తప్పకుండా చెప్పిన తరువాతే ముందడుగు వేస్తాను. :)

శ్రీపతి:
ఉ||

చూడుడు నేటి పాఠమున జూపెద! భౌతిక శాస్త్ర సూత్రమున్
వేడుక మీర” యంచు గురువే లిఖియింపదొడంగెను ! “శాస్త్ర భీతినిన్
వీడుడటంచు” ! నీ అణువు విఛ్ఛితి నొందెడి రీతి ! బోర్డుపై
మూఁడును మూఁడు మూఁడు మఱి మూఁడును మూఁడును మూఁడు మూఁడుగన్

 

రవి:  అణువిచ్ఛిత్తి (న్యూక్లియర్ ఫిషన్) అన్నమాట!
వసంత్ కిషోర్:  చక్కగా వుంది !
శ్రీపతి:  న్యూక్లియర్ ఫిషన్ లో అణువు ఒకటి మూడుగా ఆ మూడు తొమ్మిదిగా ఆ తొమ్మిది ఇరవైయ్యేడుగా ఇల్లా …విఛ్ఛిన్నం అవుతూంటుంది అని సోదాహరణంగా అధ్యాపకుడు పిల్లలకు బోర్డుపై గీసి చూపుతున్నాడు.
రవి:  ఇలా పాఠం చెప్పి ఉంటే నూటికి మున్నూరు మార్కులు వచ్చి ఉండేవేమో!
శ్రీపతి:  :-)
గిరి:  బావుంది
గన్నవరపు నరసింహమూర్తి:   సనత్ గారూ బాగుంది
రాఘవ:  సనత్ గారూ, నిజం చెప్పండి. మీరు ఈ పూరణ జపాన్ ఉదంతానికి ముందు వ్రాసారా తరువాత వ్రాసారా?
శ్రీపతి:  ముందే రాశానండీ…
రవి:  సనత్ శ్రీపతి గారు త్రికాలజ్ఞులు
శ్రీపతి:  అయినా భగవంతుడి దయవల్ల జపాన్ లో ఈ మూఁడును మూఁడు జేరలేదుగద…
మిస్సన్న:  శ్రీపతిగారూ అభినందనలు
రాఘవ:  ఐతే, పూరణ బాగున్నందుకు మూడూ ముందే వ్రాసినందుకు మఱో మూడూ కలిపి నవనవోన్మేషంగా సాగిందని నా అభిప్రాయం వెలిబుచ్చుతున్నాను. అభినందనలు.
కామేశ్వరరావు:  బాగుందండి. ఇది అసలు సిసలైన చిత్రకవిత్వం. చిత్రం లేకుండా అర్థమవ్వదు :)
రాఘవ:  కామేశ్వరరావుగారూ, మఱేఁ! నిజమేనండోయ్.
రవి:  కవిత్వచిత్రం కూడానండి
రాఘవ:  ముఖ్యంగా అణుశాస్త్రం చదువుకోనివారికి చిత్రం లేకుండా అర్థమవ్వటం కష్టం.
రవి:  వసంత్ కిషోర్ గారూ ఇక మీ వంతు
శ్రీపతి:  త్రికాలజ్ఞులమా??? అవును ఆమాట నిజమే సాప్ట్వేర్ ప్రాజెక్టుమేనజరులైతే త్రికాలాల్లోనూ సంధ్యవార్చకపోయినా పని మాత్రం మూడు షిఫ్టుల్లో చేస్తూనే ఉంటాం…
వసంత్ కిషోర్:  అలాగే ! అవధరించండి !
ఉ ||

కూడగ వచ్చునయ్య మఱి – కూర్మిని మూడును, మూడు మూడులన్
మూడును, మూడు మూడులను – మొత్తము కింకొక మూడు గల్పగన్
ఏడును దాని పక్క నొక – ఏనును; ఏకము డెబ్బ దైదగున్ !
మూడును మూడు మూడు మఱి – మూడును మూడును మూడు మూడుగన్!

రాఘవ:  భలే.
గన్నవరపు నరసింహమూర్తి:  కిశో ర్ జీ చాలా బాగుంది మీ లెక్కల పాఠం
రవి:  కిషోర్ గారు, మీ పద్య పాఠాన్ని సమీకరణ రూపంలో తెల్పండి! (ఐదు మార్కులు).
మిస్సన్న:  కిశోర్ మహోదయా చాలా అద్భుతమైన పూరణ
రాఘవ:  మీ ఆలోచన చాలా బాగుందండీ. దీనిని మీకు లెక్కలు చెప్పిన ఒజ్జగారికి కూడా చూపించండి. చాలా చాలా సంతోషిస్తారు.
వసంత్ కిషోర్:  33+3+33+3=75
రవి:  ఇది సమీకరణకవిత్వం అని విన్నవించుకుంటున్నాను(చంద్రబాబు స్వరంలో)
వసంత్ కిషోర్:  మిత్రులకు ధన్యవాదములు !
రాఘవ:  సమీకరణకవిత్వమా… అలా చెప్పండి. ఎక్కణ్ణించి వీస్తోందా ఈ గాలి అని చూస్తున్నా! :)
మిస్సన్న:  గణిత కవిత్వమ్ కూడా
కామేశ్వరరావు:  అది చిత్రకవిత్వమైతే ఇది విచిత్రకవిత్వం :-) చాలా బాగుంది.
శ్రీపతి:  అబ్జెక్షన్ అధ్యక్షా 75 రాలేదు… 😉 సమీకరణంలో తప్పున్నదోచ్
రాఘవ:  సమీరుడి ధాటికి మఱొక అంకె ఎగిరిపోయిందండీ.
శ్రీపతి:  ఒకమూడెక్కడో జారిపోయింది..
కామేశ్వరరావు:  సమీకరణం చివరిలో ఒక మూడు మిస్సయ్యిందండి. పద్యపు లెక్క మాత్రం పర్ఫెక్టు!
శ్రీపతి:  అవును మరి అన్ని మూళ్ళుంటే లెక్కసరిపోయేనా.. 😉
వసంత్ కిషోర్:  3+33+3+33+3=75
కామేశ్వరరావు:  ఇలా సమస్యాపూరణలతో ఫిసిక్సు, లెక్కలు బోధించవచ్చని ఇంతవరకూ ఎవరూ ఊహించుండరు!
రవి:  వసంత్ కిషోర్గారు ఆర్ట్స్ – అని ఆయన పేరు సూచిస్తున్నది. ఆయనను సనత్ గారు మేథ్స్ లోకి లాగారు.
శ్రీపతి:  పాద భ్రమకము, పద్య భ్రమకము అంటారు కదా, అలా ఇది సమీకరణ భ్రమకము కూడా…  3+33+3+33+3
రాఘవ:  కామేశ్వరరావుగారూ, నేనైతే ఈ రెండు పూరణలూ చూచి చాలా అబ్బురపడ్డాను, సంతోషించాను.
శ్రీపతి:  ఎట్నుంచి లెక్కపెట్టినా ఒకలానే ఉంటుంది… :)
రాఘవ:  :)
రవి:  ఇప్పుడు రాఘవ గారోచ్! రాఘవ గారూ మీ పూరణ మొదలెట్టండి
గన్నవరపు నరసింహమూర్తి:  ఆయనది లెక్కలే, ఇంజినీరు ఆయన
రవి:  మూర్తి గారు, సరదాకండి, తూచ్! :)
రాఘవ:నేను మూఁడు అన్న శబ్దానికి ఉన్న మూడు అర్థాలలోనూ వాడాను. మూఁడు అనే సంఖ్య, మూఁడటమంటే ముగియటం, మూఁడటమంటే కలగటం.
ఉ||

మూఁడును కాలముల్ త్రిగుణముల్ ప్రలయంబున సర్వసృష్టియున్
మూఁడును మూఁడులోకములు మూఁడును నిద్ర విధాతకుం దుదిన్
మూఁడినపిమ్మటన్ మరల మూఁడుగ సర్వము మాఱుఁ జూడగన్
మూఁడును మూఁడు మూఁడు మఱి మూఁడును మూఁడును మూఁడు మూఁడుగన్

వసంత్ కిషోర్:: చాలా బావుంది !
గిరి:  చక్కటి పద్యము
గన్నవరపు నరసింహమూర్తి:  అద్భుతంగా ఉంది
కామేశ్వరరావు:  ఫిజిక్సు లెక్కలు కాదని ఏకంగా తత్త్వంలోకి వెళ్ళిపోయారు రాఘవ!
మిస్సన్న: రాఘవ గారూ, సృష్టి క్రమాన్ని చక్కగా వివరించారు.
వసంత్ కిషోర్:  సృష్టి మూడడం మరలా కూడడం
రాఘవ:  ఔనండీ.
కామేశ్వరరావు:  “మూడును కాలముల్” అని చదివగానే “కాలాలు మూడు” అని అర్థం చేసుకున్నాను నేను
రాఘవ:  :)
మురళీమోహన్:  కామేశ్వరరావుగారూ, నేనైతే ఈ ‘మూడు’ పూరణలూ చూచి చాలా అబ్బురపడ్డాను, సంతోషించాను.
కామేశ్వరరావు:  మొత్తానికి అందరికీ మూడు బాగా కుదిరింది :-)
రాఘవ:  కామేశ్వరరావుగారూ, :)
రాఘవ:  మురళీమోహన్గారూ, బొత్తిగా వ్యాఖ్యనే ఇలా కాపీ చేసారేమిటి? 😉
కామేశ్వరరావు:  అధ్యక్షా ముందుకి సాగుదామా?
మిస్సన్న:  నిజంగా మూడింటికి మూడూ వైవిధ్య భరితమైన అద్భుతమైనవి
రవి:  మురళి గారూ, మరొకటి కూడా చూద్దాం. మిస్సన్న గారూ, మీ కీ బోర్డు ఝళిపించండి
రవి:  మిస్సన్నగారి పూరణ ఇక!
మిస్సన్న:  సంతోషంగానండీ

ఉ ||

మూడు దశల్ మనుష్యునకు, మూడగు వేళలు, మూడు కాలముల్
మూడు ముడుల్ వివాహమున, మూడు గుణంబులు, మూడు లోకముల్,
మూడడుగుల్ భరించె బలి,  మూడగు మూర్తుల జూడ కున్నచో-
మూడును!  మూడు మూడు మఱి మూడును మూడును మూడు మూడుగన్

గన్నవరపు నరసింహమూర్తి:  మిస్సన్నగారి పూరణ చాలా బాగుంది
రాఘవ:  మూడు ముడుల్ వేసిన తరువాత మూడు (mood) మూడును (ముగియును) అని మీరు ఇంత స్పష్టంగా చెప్పటం నాకు చాలా నచ్చిందండీ 😀
వసంత్ కిషోర్:  చక్కగా వుంది !
రాఘవ:  చప్పట్లు కొట్టండి, కొట్టి ముందుకు సాగండి.
మిస్సన్న:  ధన్యవాదాలండీ
రవి:  మూడు వేళలు మాకు నచ్చియున్నది. (మూడుపూటల భోజనము ఉండును కావున)
వసంత్ కిషోర్:  కరతాళ ధ్వనులు !
కామేశ్వరరావు:  “త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం” గుర్తుకు వచ్చింది!
రాఘవ:  ఏకబిల్వం ఖరార్పణం
రవి:  రాఘవా :)
రాఘవ:  కాదు కాదు, ఏతత్పద్యం ఖరార్పణమ్
కామేశ్వరరావు:  :)
రాఘవ:  :)
రవి:  ఖరకరార్పణం
మురళీమోహన్:   మిస్సన్నగారిపద్యం లెస్సగా ఉంది.
రాఘవ:  తరువాతి అంశమేమిటి? ఖరకర! రవి! తెలుపవలయుఁ గవులందరికిన్.
మిస్సన్న:  ధన్యవాదాలు మురళిగారూ
రవి:  గిరిగారికి కాస్త పనిపెడదాం
రవి:  ఓ దత్తపది: గోలకొండ, పూలదండ, కందిగుండ, కొత్తకుండ –  రామాయణార్థంలో
రాఘవ:  గిరిగిరిగిరిగిరి
రాఘవ:  గిరియని అరిచి పిలచి తెలిసికొనెద నతఁడేమనునో!
రవి:  ఒక్క గిరే కదండి? గోల”కొండ”
గిరి:  పూలదండ చూడంగనె వాలి సుగ్రీవులు మనసులో మెదిలారు
రాఘవ:  పూలదండ చూచి మీకు పెళ్లి కూతురు కదా గుర్తు రావలసినది?
గిరి:  :-)
గిరి:  అవధరించండి
శా||

హా! తారా! పెనుగోల కొండ లడ రాయత్తంబు చేనేర్చె ని
స్సీ తమ్ముండొగి పూలదండ మెడదాల్చెన్ దైవసాయుజ్యమె
ట్లో తోడై తన కంది, గుండబలె నిష్ఠ్యూతాంత్య నిర్భాగ్యునిన్
పాతాళంబున కొత్తకుండ విడువన్ వానిన్ ఘనోగ్రోద్గతిన్

గన్నవరపు నరసింహమూర్తి:  ఈ దత్తపది ఇంకా ఎవరూ పూరించలేదని చూస్తుంటే గిరి గారు మంచి పూరణ చేసారు
మిస్సన్న:  అపురూపమైన పూరణ
శ్రీపతి:  నిష్ఠ్యూతాంత్య నిర్భాగ్యునిన్ – చప్పట్లు
వసంత్ కిషోర్:  అద్భుతం ! కరతాళ ధ్వనులు !
రవి:  కేక పెట్టించారు
గన్నవరపు నరసింహమూర్తి:  కందిగుండని భలే అమర్చారు
కామేశ్వరరావు:  చాలాబాగుంది.
గిరి:  ధన్యవాదాలందరికీ
రవి:  పుష్యంగారికి పునఃస్వాగతం
రాఘవ:  :)
రాఘవ:  సరిగా గమనించారా? గిరిగారు వసనుఁ గలిపిరి కృతపద్యములో!
పుష్యం:శుభోదయం
మురళీమోహన్:    పాతాళంబున కొత్త్తకుండ విడువన్  :) పాతకుండను ఎందుకు విడువలేదో?
మిస్సన్న:   శుభోదయం  సార్.
రాఘవ:  గిరిగారూ, మంచి పూరణ. కొత్తకుండను ఒత్తకుండన్ గా మార్చటం భలే.
కామేశ్వరరావు:  “హా! తారా!” అన్న ఎత్తిగడతోనే సగం మార్కులు కొట్టేసారు!
రవి:  ఓహో అదా అంతరార్థం ..కుండ బద్దలు కొట్టారు
రాఘవ:  నాకు మీరు హా తారా అని మొదలు పెడితే నిరుడు వచ్చిన సీతా రామునకిట్లొనర్చితివె యిస్సీ ద్రోహమిల్లాలివై సమస్య, దానికి తాడేపల్లివారిది అనుకుంటాను పూరణ రెండూ గుర్తొచ్చాయి
రాఘవ:  అధ్యక్షా, మీరు కొత్తకుండ అనటం వలన ఒక మంచి పూరణ వచ్చింది. మీరు క్రొత్త కుండ అని ఇచ్చి ఉంటే ఈ పూరణ వచ్చేదా? కాబట్టి మీ తప్పును ప్రస్తుతానికి క్షమించేస్తున్నాం 😉 😛
గిరి:  రాఘవా, నాకూ ఆ పూరణ మదిలో మెదిలింది
గిరి:  నిజమే, క్రొత్తకుండ అని ఉంటే కందిగుండతో పడ్డ కష్టాలు పడవలసి వచ్చేది
రాఘవ:  గిరిగారూ, మీరు హా తారా అనగానే నాకు ఆ పూరణే గుర్తొచ్చింది. అది చాలదన్నట్టు మీరు ఇస్సీ తమ్ముండొగి అని సీతనూ చొప్పించేసారు.
రవి:  ఇక ముందుకు వెళుతున్నాను.
కామేశ్వరరావు:  అలాగే
గిరి:  కవివర్యులారా, ఇక నేను సెలవు తీసుకుంటాను
రవి:  గిరిగారూ ధన్యవాదాలు
గిరి:  అందరికీ ధన్యవాదాలు, మళ్ళీ త్వరలోనే కలుసుకుందాము
కామేశ్వరరావు:  అయ్యో మీ ఫస్ట్ క్లాసైన మీ పూరణలింకా విందామనుకున్నానే :-)
రాఘవ:  గిరిగారూ, శుభం. మీ కుమార్తెకు మళ్లీ శుభాశీస్సులు తెలియజేయండి. సెలవు.

రవి:  రామాయణం నుంచి జనజీవన స్రవంతి లోకి..
ఒక నడివయస్కుడు సినిమా టిక్కెట్ల క్యూలో నించుని ఉండగా ఒక నిండు జవ్వని రెండు టిక్కెట్లు కావాలని అడిగింది. ఆయన తబ్బిబ్బు పడి తన డబ్బుతోనే కొనిపెట్టాడు. చివరికి ఆ పిల్ల “థేంక్యూ అంకుల్” అని తన బాయ్ ఫ్రెండుతో లోపలికెళ్ళిపోయింది.

పుష్యం:నిన్న శ్రీపతిగారు ఆ అమ్మాయికి రెండు టిక్కెట్లు కొనేసారు గదా :-) సినిమా నచ్చినంట్లుంది, రెండవసారి చూస్తోందా?
రవి:  పై కథాశ్రవణంబు శ్రీపతుల వారి కీబోర్డు ద్వారా విందాం
శ్రీపతి:  అయ్యయ్యొ… మళ్ళీ నేనేనా …సరే అయితే
ఉ ||

వీనులకింపు కంఠమున వేడెను నన్నొక జాణ ! గోముగా !
మేనక వంటి రూపవతి! “మీరొక రెండు టికెట్లు తీసినన్
నేనును మీదయన్ గనెద ! నిక్కమనెన్” ! మది రెక్క విప్పగా
లైనున దూకితిన్నహహ ! లక్కది నక్కను తొక్కెనట్లయెన్!

సీ ||

అమ్మాయి జూడగా నపరంజి బొమ్మరా ! అరుదైన అవకాశమబ్బె నాకు !
హాల్లోన చిలిపిగా అరచేయి తాకించి గాల్లోన తేలనా కాంక్ష మీర !
కూల్డ్రింకు తాగుతూ కోరుండి బాటిళ్ళు మార్తునా అధరాల మధువు దెలియ !
ఐస్క్రీము చెరిసగం అని కొంటె సైగతో సరసాలు పోదునా సాహసముగ !

ఆ.వె ||

అనుచు పలు రకాల ఆలోచనలు జేసి
ఇంతి కొరకు జూస్తి నింతలోన
ప్రియుని గూడి వచ్చి ప్రియమార “థాంక్సంకు”
లనుచు పడతి వెడలె హాలులోకి !

ఉ ||

నేనతికష్టమోర్చితిని ! నిక్క”మలా మొదలైంది” టైపులో
ప్లానుల నూహచేసితిని ! పాటలు పాడి రొమాన్సు చేసితిన్
కాని అదంతయున్ కరిగి కా’లవ’లయ్యె క్షణాలలోన లవ్ !
ఫో ! నను మోసగించెనిటు ! ఫూలును జేసెను ! కోమలాంగిరో  !!

వసంత్ కిషోర్:  భళి భళీ !
రవి:  విశ్వామిత్రా! విశ్వామిత్రా! మీ మేనకకు ఇక్కడ ఎసరు పెడుతున్నారు!
కామేశ్వరరావు:  శ్రీపతిగారు, మీరింట్లోనే ఉన్నారు కాబట్టి మీ శ్రీమతిగారిని ఒక్కసారి వచ్చి వారికిది చూపించమని మనవి :-)
రాఘవ:  ఊఁ
పుష్యం:మంచి ధార ఉందండీ!! చాల బాగుంది.
గన్నవరపు నరసింహమూర్తి:   శనత్ మీరు టిక్కట్లడుగుతే యింకా చాలా డబ్బులు వృధా చేసారు. కధ రంజుగా ఉంది.
శ్రీపతి:  అయ్యా.. కామేశ్వరరావు గారూ, పూర్వాశ్రమంలో నారదులని మీకేమైనా పేరా ?
రవి:  కామేశ్వరుల వారూ, మీకు నారదులావహించారాండి?
గన్నవరపు నరసింహమూర్తి:  శ్రీధర్ కి చూపిస్తా
కామేశ్వరరావు:  ఏదో లోకకల్యాణార్థం అలా :-)
రవి:  లోకకల్యాణం – ఇంట కల్యాణభంగం!
శ్రీపతి:  లోక కళ్యాణమా? ఇక్కడ తిరుపతి కళ్యాణమౌతూంటే…
శ్రీపతి:  డబ్బు వృధా చేసేసుకుందామనే ఆత్రమే గానీ అవకాశం ఏది???
వసంత్ కిషోర్:  మూర్తిగారూ సినిమా చూస్తారా ఏమిటి ?
పుష్యం:శ్రీపతిగారి స్వానుభవమని అనుమానం..
మిస్సన్న:  పెద్దాయన సంగతేమో గానీ అమ్మాయి మాత్రం నక్కను తొక్కి వచ్చింది.
కామేశ్వరరావు:  మిస్సన్నగారు :-)
గన్నవరపు నరసింహమూర్తి:  సినిమాలు చూసి చాలా యేళ్ళు అయ్యాయి కిశొర్ జీ
కామేశ్వరరావు:  పైగా “మేనకవంటి రూపవతి”, అంటే మేనక ఎలా ఉంటుందో ఈయనకి తెలుసన్న మాట!
రవి:  :)
మిస్సన్న:  వామ్మోవ్!
కామేశ్వరరావు:  మీ ఇంటికి ఆహ్వానించారు కదా, వచ్చినప్పుడు మరిచిపోకుండా ఈ పద్యం ప్రింటు చేసి పట్టుకువస్తా :-)
రవి:  శ్రీపతికి వాళ్ళావిడతో ఈ రోజే డైవోర్సు ఇప్పించేటట్టున్నారు
మిస్సన్న:  అమంగళమ్ శాంతించు గాక
రవి:  వసంతసుమశేఖరం – నా పాలిట ఖరమయిందని శ్రీపతి గారు వాపోగలరు.
గన్నవరపు నరసింహమూర్తి:  ఆ వచ్చి తీసుకువెళ్ళింది విశ్వామిత్రులే
కామేశ్వరరావు:  మూర్తిగారు :-)
కామేశ్వరరావు:  ఏదైనా ఈ వర్ణన చాలామందిని ఊహల్లోకి లాక్కెళ్ళింది!
రవి:  ఒక్కరినీ వదిలేది లేదు. మూర్తి గారూ మీ వంతు
కామేశ్వరరావు:  నాలాంటి బుద్ధిమంతులని దక్క :-)
గన్నవరపు నరసింహమూర్తి:  అలాగే
గన్నవరపు నరసింహమూర్తి:

ఉ ||

చక్కని చిత్ర రాజమట    చందముఁ గన్గొన    పోయి నిల్వగా
వెక్కస మయ్యె పంక్తి    వెను వెన్కను నిల్చిన   సుందరాంగియున్
ఒక్కతె నన్ను జేరి   కను లూపుచుఁ     గోరెను   జూడ ముచ్చటౌ
చక్కని నవ్వు చింద     ముఖ చంద్రుని బింబము    రెండు టిక్కటుల్

కం ||

చూచితిని    మిమ్ము  నెక్కడొ
వేచితి    నే నిన్ని   నాళ్ళు , వేడెద నిపుడున్
యాచించెద    టిక్కట్లను
ఈ చిత్రము   గాంచ  నిపుడు   నీప్సిత మయ్యెన్

ఉ ||

చిత్రము చిత్ర మంచు   గడు చిత్రము   గాంచితి   నేడు నిచ్చటన్
చిత్రము గాదె యిప్పుడును    చెన్నుగ  నిల్చిన   పంకజాస్యయున్
మిత్రుడిగా  తలంచి    నను మెల్లగ చేరగ      ప్రేమ భావమున్
శత్రువు     పుష్పధన్వి    తన   చాపము నెక్కెనె    కర్కశంబునున్ !

|| టిక్కట్లను కొని,    పెక్కు మధుర  ఊహలలో   విహరిస్తుండగా

ఉ ||

చెంగున దూకినాడొకడు     చింపిఱి జుట్టుల సోకుగాడు  దా
వెంగలి నవ్వు నవ్వి    తన ప్రేయసి గైకొనె ,   రెండు టిక్కటుల్  !
ఖంగు దినంగ     నేను     కల్మష ముంచక   చిత్తమందుటన్
భంగము జెంది  సాగితిని    బంగరు బొమ్మలె  ప్రౌఢులందుటన్ !

కామేశ్వరరావు:  మూర్తిగారు మీరుకూడా ఏమీ తక్కువ తినలేదు! ఆ ప్రియుడి మీద కసినంతా భలే చూపించారు పద్యంలో!
జ్యోతి:  అందరికి నమస్కారం..
వసంత్ కిషోర్:  భళీ ! మూర్తీజీ !
కామేశ్వరరావు:  జ్యోతిగారు నమస్కారం. స్వాగతం. సభ మంచి రసకందాయంలో ఉండి మిమ్మల్ని వెంటనే స్వాగతించలేదు.
నచకి:  అందఱికీ నమస్కారం! చివఱి అరగంటకైనా అందుకున్నాను..
రవి:  జ్యోతిగారికి, నచకిగారికీ స్వాగతం
మిస్సన్న:  చింపిఱి జుట్టుల సోకుగాడు, వెంగలి నవ్వు  చాలా బాగున్ది మూర్తి మిత్రమా
పుష్యం:చూచితి మిమ్మునెక్కడనొ’ human psycology బాగా పట్టారు
కామేశ్వరరావు:  నచకిగారు, నా మాట మన్నించి మళ్ళి వచ్చినండుకు కృతజ్ఞ్తలు. పునస్స్వాగతం
రవి:  జ్యోతిగారూ సినిమాటికెట్ల వ్యవహారం నడుస్తూంది.
నచకి:  నెనర్లు, కామేశ్వరరావుగారూ!
రవి:  టికెట్ కొనిస్తే అంకుల్ థాంక్స్ అందట. అందరూ తమ తమ అనుభవాలు చెబుతున్నారు. :)
జ్యోతి:  హాహా.. మంచి రసపట్టులో ఉన్నట్టుంది ఐతే.. కానివ్వండి..
గన్నవరపు నరసింహమూర్తి:  నడి వయస్కుడు అంటే మేమూ పరిగణలోనికి వస్తామని తలచాము
రవి:  మూర్తి గారూ, ఎంత కుట్ర?
జ్యోతి:  అందమైన అమ్మాయి అంకుల్ అంటే ఉక్రోషమా?? :)
జ్యోతి:  పాపం…
శ్రీపతి:  పడే వాడికి తెలుస్తుందండీ ఆ బాధ ఏమిటో…
కామేశ్వరరావు:  అదీను తాత వయసువాళ్ళకి :-)
గన్నవరపు నరసింహమూర్తి:  అంకుల్ అంటే ఫర్వా లేదండీ, తాత అనక పోతే చాలు
కామేశ్వరరావు:  “పాత వలపు తలచి తలచి తాత ఊగెను కైపులో”
జ్యోతి:  కదా బాగా చెప్పారు.
నచకి:  :)

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *