వసంతసుమశేఖరము – 2

“కుక్కలు నక్క లేనుఁగులు కోఁతులు పందులు కొండమ్రుచ్చులున్”

రవి :  సరే, ఇక తరువాత సమస్యకు వెళ్దాం. సభలోకి జంతువులను ప్రవేశపెట్టే సమయం వచ్చింది.

రవి :  కుక్కలు నక్క లేనుఁగులు కోఁతులు పందులు కొండమ్రుచ్చులున్ – వీటి గురించి నచకి గారేమంటారో విందాము.

నచకి :  తప్పకుండా… అవధరించుడీ

 

ఉ ||

“ఒక్కరు గూడ నా రచన నొప్పరు, మెచ్చరు లాభమే”మనొ

క్కొక్కటిగా పఠించి చితినుంచుచునుండగనా గుణాఢ్యుడే

ప్రక్కన జేఱినాయి విన ప్రాకృతమందు బృహత్కథాంశముల్

కుక్కలు నక్కలేనుగులు కోతులు పందులు కొండమ్రుచ్చులున్

 

వసంత్ కిషోర్ : కరతాళ ధ్వనులు

రవి :  అంతరార్థం కూడా మీరే వివరించాలి.

 

నచకిమా గుణాఢ్యుడు మొదట విష్ణుశర్మగా అవతరించాడు… పెద్దల సాయంతో హాలుడిగా మాఱబోయి మొత్తానికి స్వస్వరూపం సాధించుకున్నాడు. బృహత్కథను రచించిన గుణాఢ్యుడు దానికి రాజామోదం లభించని నిరాశతో అడవికి వెళ్ళి తాను వ్రాసిన గ్రంథంలో నుంచి ఒక్కొక్క తాళపత్రమూ చదివి మంటలో వేస్తున్నాడట. అడవిలో ఉన్న జంతువులన్నీ ఆయన పేర్చిన ఆ చితి చుట్టూ చేఱి ఆ కథలను వింటున్నాయి. వేటకి అడవికి వచ్చిన రాజుగారికి జంతువులు కనుపించకపోయేసరికి భటులని పంపించి విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడని, తక్కినది చరిత్ర అనీ అంటారు.

 

చదువరి :  చక్కటి ఊహ!

కామేశ్వరరావు :  ఆ దృశ్యాన్ని తలచుకుంటే చాలా బాధగా ఉంటుంది.

శంకరయ్య :  అద్భుతంగా ఉంది పూరణ.

రవి :  చాలా ఔచిత్యవంతమైన ఊహ. బృహత్కథాంశముల్ –  చక్కని పదబంధం కుదిర్చారు.

రాకేశ్వరుఁడు : ఇచ్చిన సమస్యకు చాలా మంచి ఊహను జేర్చారు.

వసంత్ కిషోర్ : చాలా బావుంది !

చదువరి :  గుణాఢ్యుడు మంటల్లో వేస్తే వేసాడు.. అగ్ని ఆ గ్రంథాలను హరించి, హరాయించుకోడానికి అదేమైనా ఖాండవ వనమా అని అడుగుతారు గరికిపాటి నరసింహారావు గారు, సాగరఘోషలో.

కామేశ్వరరావు :  మధునాపంతులవారు ఆంధ్రపురాణంలో దీనిపై ఒక పద్య ఖండిక రచించారు, అద్భుతంగా!

మిస్సన్న :  నిజమండీ

నచకి :  నిజానికి యీ సందర్భంలోనే మఱో పద్యం అధ్యక్షుల వాఱు అనుమతిస్తే…

రవి :  చెప్పండి నచకి గారూ

నచకి :  మా అమ్మగారు “వినుము సచ్చరిత్ర! విశ్వమిత్ర!” అన్న మకుటంతో పద్యాలు వ్రాయటం మొదలుపెట్టారు, శతకంగా వ్రాద్దామని. కానీ, ఉమ్మడి కుటుంబపు బాధ్యతల మధ్యన సరైన ప్రోత్సాహం దొరకలేదు

నచకి :  ఆ సందర్భంలో వ్రాసిన ఒక పద్యం గుర్తొచ్చింది కామేశ్వరరావు గారి వ్యాఖ్య చూసి

 

ఆ.వె||

చేదు తీపెఱుగని కుక్షి జేఱు మధువు

సారమెఱుగు జిహ్వ జాఱవిడువ

రసికులేలని కావ్యపు వ్రాత యిదియు

వినుము సచ్చరిత్ర! విశ్వమిత్ర!

 

రవి :  మకుటం, పద్యమూ రెండూ అందంగా ఉన్నై

కామేశ్వరరావు :  చాలా బాగుంది ఊహ!

నచకి :  ఈ పద్యాన్ని తలచుకున్నప్పుడల్లా బాధ కలుగుతుంది నాకు. 🙁 నేనిందుకే కాస్త చిన్న వయసు నుంచే తప్పులు తడకలతోనైనా వ్రాయటం మొదలుపెట్టాను. మీ వంటి యెందఱో (ర)సహృద్యయులతో పరిచయాల వలన ఆ బాధ నాకు దక్కదని నమ్మకంగా ఉంది.

 

శ్రీపతి :  పద్యం చాలా హృద్యంగా ఉంది, మనసుకు హత్తుకున్నట్టుంది.

వసంత్ కిషోర్ : చాలా చక్కగా యున్నది !

రవి :  గన్నవరపు మూర్తి గారు ఈ సమస్యను ఎలా పూరిస్తారో చూద్దాం

రవి :  మూర్తి గారు, ఇక మీ వంతు.

కామేశ్వరరావు :  తప్పకుండా

నచకి :  టంకించండి, మూర్తి గారూ!

గన్నవరపు నరసింహమూర్తి :  ఇది రాజ కీయ నాయకులను ఉద్దేశించి –

 

ఉ ||

ఎక్కడ వాడవోయి గతి యిట్టులఁ దప్పుచు వచ్చినాడవో

సొక్కుచు సౌఖ్యముల్ పడసి చుట్టపు చూపుగ  చేరి ముచ్చటన్

దక్కువ సేయు  టొప్పగునె దర్పిత సభ్యుల రాజ్యగేహమున్

కుక్కలు నక్క లేనుగులు కోతులు పందులు కొండ ముచ్చులున్ !

 

వసంత్ కిషోర్ : బహు చక్కగా యున్నది !

రవి :  దర్పిత సభ్యుల – బావుందండి. సనత్ గారూ మీ పూరణతో సిద్ధంగా ఉండండి

నచకి :  అదే అడగబోయాను

కామేశ్వరరావు :  అవునండీ చాలామంది నాయకులు చట్టసభకి చుట్టపు చూపుగానే వస్తారు. ప్రజల దగ్గరికి అదీ రారు!

కామేశ్వరరావు :  కాని అలాంటి వాళ్ళని తమతో పోల్చారని ఆ జంతువులు బాధపడతాయేమో! 🙂

రాకేశ్వరుఁడు :  🙂

రవికామేశ్వరరావు గారు :))

వసంత్ కిషోర్ : నిజమే !

శ్రీపతి :  ఆ జంతువులు ఇంకా ఏమని బాధపడుతున్నాయో నేను చెబుతా వినండి.

కామేశ్వరరావు :  చెప్పండి

 

ఉ ||

కుక్కిరి బోనులందు! మది కోరదె స్వేచ్చ? అరణ్య భూములన్

చక్కగనాడు మమ్ములను జంతు ప్రదర్శన శాలనుంచుటే

ఒక్కటి తప్పు ! వింత గని! ఊరక యుంట అదొక్కతప్పనెన్

కుక్కలు నక్క లేనుఁగులు కోఁతులు పందులు కొండమ్రుచ్చులున్

 

నచకి :   వింత గని! ఊరక యుంట అదొక్కతప్పనెన్ – నిజమే!

వసంత్ కిషోర్ : భళా భళీ !

కామేశ్వరరావు :  చాలా బాగున్నాయ్. ఒకే సమస్యకి ఎన్ని రాకాల పూరణలు! “ఊహకొలంది పద్యములు…” అని అందుకే అన్నారు.

శంకరయ్య :  నరసింహ మూర్తి, సనత్ కుమార్ గారల పూరణలు చాలా బాగున్నాయి.

గన్నవరపు నరసింహమూర్తి :  ధన్యవాదములు గురువుగారూ

శ్రీపతి :  వీలైతే ఏమాత్రం మానవత్వం లేని మనుష్యులను బోనులలో పెట్టి వింత చూసినట్టు చూడాలని అనుకుంటూంటాయి జంతువులు…

కామేశ్వరరావుశ్రీపతి గారు, జంతువులకి అలాంటి దురూహలుండవేమో లేండి

రాకేశ్వరుఁడు :  అలాంటి పాపపు ఆలోచనలు మూగజంతువులకు అంటగట్టడమెందుకులెండి.

శ్రీపతి :  అయ్యో మనం అడగలేదు కదండీ.. అడగందే ఆవైనా చెప్పదంటారు.

శ్రీపతి :  డాక్టర్ డూ లిటిల్ సినిమాల్లో అత్యధ్భుతంగా ఉంటుంది వాటి ఆవేదన. అదే స్ఫూర్తితో రాశా…

రాకేశ్వరుఁడు :  ఏసు ప్రభువులాగ, తెలియక చేస్తున్నారు పురజనులు వారిని మన్నించండి అంటాయోమో

రాకేశ్వరుఁడు :  యేమో

కామేశ్వరరావు :  అప్పుడు మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది 🙂

రాకేశ్వరుఁడు :  కామేశ్వర రావు గారు, మడిసిని గొడ్డూ గొడ్డుని మడిసీ చేసారనమట

రవి :  ఒక్కొక్కరి జంతువులు ఒక్కొక్క రకంగా ఏడుస్తున్నాయి.

రవినచకి వారివి బాధతో, మూర్తి గారివి కోపంతో, శ్రీపతి గారివి నిస్సహాయంగా ఏడుస్తున్నవి.

నచకి :  ఏడుపు మాత్రం కామన్ అంటారు!

గన్నవరపు నరసింహమూర్తి :  రాజకీయ నాయకులతో పోల్చానని శ్రీపతి గారి జంతువు లేడుస్తున్నాయి

శ్రీపతి :  గిరిగారి జంతువులేమంటున్నాయో…

నచకి :  ఏరీ గిరి గారు?

రవి :  గిరి గారు లేరు ఆయన బహు అందంగా పూరించారు.

రవి :  ఆయన తరపున నేను టంకిస్తున్నాను.

 

ఉ ||

చక్కెరపోత పోయ బుడిజంతుచయం బమరెన్ ఖగంబులున్

గ్రక్కున మ్రింగు బాలకుల కన్నులపండువ గొల్పుచందమున్

కుక్కలు నక్క లేనుఁగులు కోఁతులు పందులు కొండమ్రుచ్చులున్

కుక్కుట చక్రవాక పిక కోకిల టిట్టిభ వాయసాదులున్

 

వసంత్ కిషోర్ : అబ్బ ! నోరూరు తోంది !

రవి :  పూర్ణం లా ఉంది పూరణం

మురళీమోహన్ :  సంక్రాంతికి రావలసిన చక్కెర అచ్చులు ఉగాదికే అందిస్తున్నారన్నమాట గిరిగారు.

శంకరయ్య :  చక్కగా ఉంది.

మిస్సన్న :  నోరూరుతోంది. చక్కెర అని ఆలోచిస్తున్నాను.

నచకి :  మా చిన్నప్పుడు చక్కెరచ్చులు అనేవాళ్ళం… భలే ఉండేవి! కాకపోతే ఇన్ని జంతువుల్లేవు… చిలుకలెక్కువ.

గన్నవరపు నరసింహమూర్తి :  అంద మైన పూరణ, వాళ్ళ అమ్మాయి పుట్టిన దినములో బొమ్మలు

కామేశ్వరరావు :  ఇన్ని రకాల చక్కెర బొమ్మలు నేనెప్పుడూ చూళ్ళేదు 🙂 అతనిది సింగపూర్ కదా, చైనావారి ప్రభావమేమో! 🙂

నచకి :  అవునవును, వాళ్ళమ్మాయి జన్మదినం అన్నారు ఇవాళ! ఆ చిరంజీవికి దీర్ఘాయురస్తు!

నచకికామేశ్వరరావు గారూ 🙂

మిస్సన్న :  ఆయుష్యమస్తు!

రవి :  బహుశా వాళ్ళమ్మాయి కోసమనేమో అన్ని చక్కెరచ్చులు చేశాడాయన.

గన్నవరపు నరసింహమూర్తి :  మాకు చిలకలే తెలుసు. అవి కోళ్ళ లాగ వుండేవి

కామేశ్వరరావు :  “చక్రవాక పిక కోకిల” బదులు “చక్రవాక శుక కోకిల” అంటే బాగుంటుంది. పునరుక్తి ఉండదు, చిలకలు కూడా వచ్చేస్తాయి.

(సవరించిన పద్యం)

ఉ ||

చక్కెరపోత పోయ బుడిజంతుచయం బమరెన్ ఖగంబులున్

గ్రక్కున మ్రింగు బాలకుల కన్నులపండువ గొల్పుచందమున్

కుక్కలు నక్క లేనుఁగులు కోఁతులు పందులు కొండమ్రుచ్చులున్

కుక్కుట చక్రవాక శుక కోకిల టిట్టిభ వాయసాదులున్

మురళీమోహన్ :  మొత్తం మీద సదస్యుల ‘తలసరి సాంస్కృతిక దిగుబడి’ చాలా బాగుంది 🙂

కామేశ్వరరావు :  మురళిమోహన్ గారు 🙂

విశ్వామిత్ర :  మురళి గారూ  రాసి మాత్రమే కాదు వాసి చూడండి, ఇది ఇంకా చాలా రెట్లు పెరిగింది

మిస్సన్న :  అవును నిజం..

శ్రీపతి :  ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు !

వసంత్ కిషోర్ : అయ్యా గోఘోషలో చిన్ని పద్యం చెప్పమంటారా ?దీన్ని ఘంటసాల వారి కంఠంలో వినాలి మరి !

రవి :  చెప్పండి

 

తే,గీ ||

బుద్ధు డుదయించినట్టి యీ – భూమి   లోన

కలిగి నారలు మీకేల  –  కరుణ లేదు ?

ఆ మహాత్ముడు నడచిన – అడుగు  జాడ

మాసి పోలేదు చూడుడీ – మహిని మీరు

 

కామేశ్వరరావు :  బాగుందండి. గోఘోష ఎవరిది? కరుణశ్రీ పుష్పవిలాపాన్ని తలపిస్తోంది

నచకి :  బుద్ధదేవుని భూమిలో పుట్టినావు

నచకి :  సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి?

నచకి :  నాకూ అదే గుర్తొచ్చింది

వసంత్ కిషోర్ : రచన : సుబ్బారావు

రవి :  నండూరి సుబ్బారావు గారా?

కామేశ్వరరావు :  కాదేమో!

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.