వసంతసుమశేఖరము – 2

“ప్రసవింతురు బావగారు పదిదినములలోన్”

రవి :  “ప్రసవింతురు బావగారు పదిదినములలోన్” – ఎలానో రాఘవ గారు చెబుతారు

విశ్వామిత్ర :  వారు సరే; రాఘవగారున్నారా ఇక్కడ?

రవి :  మరుగేల, రా, ఓ రాఘవా!

మిస్సన్న :  దండకారణ్యంలో ఉన్నారేమో

కామేశ్వరరావు :  అతనింకా పురిటినొప్పులు పడుతున్నట్టున్నారు 🙂

వసంత్ కిషోర్ : అంతఃపురంలో ఉన్నట్టుంది !

శ్రీపతిరాఘవగారికి కొంత సమయం పడుతుందిత… ఈలోపు కానివ్వమంటున్నారు

విశ్వామిత్రరాఘవ గారు – పదిదినముల ముందే  busyగా ఉన్నట్టున్నారు  ఈ లోపు మిగతావారివి వింటామండి – మీ అనుమతి ఐతే రవిగారూ

రవి :  సరే, ఈ లోపు శిరీష్ గారు, ప్రసవింపజేయడం మీ వంతు

చదువరి :  అవధరించండి..

 

కం ||

బుసకొట్టే డెడ్లైనట

వెసపెట్టిరి డెలివరింప వినుమిది యన్నా!

పసిబిడ్డౌ ప్రాజెక్టును

ప్రసవింతురు బావగారు – పది దినముల లోన్

 

రవి :  పాపం :))

కామేశ్వరరావు :  హహహ… “డెలివరింప” ప్రయోగం భలే ఉంది!

వసంత్ కిషోర్ : వ్వావ్!

విశ్వామిత్ర :  ముందు వరించటం , అక్కడినుంచి డెలివరించటం – పదాల డెలివరీ లో మీరు సిద్దహస్తులు

గన్నవరపు నరసింహమూర్తి :   చాలా బాగుంది

రవి :  ఎలాగైనా బావగారికి గర్భస్రావం జరుగకుండా చూసేబాధ్యత శిరీష్ గారిదే!

చదువరి :  🙂

శ్రీపతి :  గర్భ స్రావం కాదులెండి గానీ పసిబిడ్డౌ ప్రాజెక్టు – “నెలతక్కువ వెధవా’ అనిపించుకునే అవకాశం ఉందేమో…

నచకి :  పూరణకి మంచి ఆలోచన

కామేశ్వరరావు :  నా అనుభవంలో ప్రాజెక్టులు ఎప్పుడు “నెల తప్పుతాయి” కాని “నెల తక్కువ” కావు.

గన్నవరపు నరసింహమూర్తి :  సాఫ్ట్ వేరు కష్టాలు !

విశ్వామిత్ర :  నెలతక్కువ ప్రాజెక్టులను – సాకుతుంటే ( maintain) ఉంటాయి తిప్పలు

రాఘవ :  పెద్దలందరూ నన్ను మన్నింతురుగాక… ప్రస్తుతానికి కొంచెం హడావుడిలో ఉన్నాను.

చదువరి :  “నెల తప్పుతాయి” కాని “నెల తక్కువ” కావు. — అదరహో!

నచకి :  కామేశ్ జీ! 🙂

రవికామేశ్వరరావు గారూ, పుట్టిన తర్వాత – ఉపయోగించేవాడికి “నెలతక్కువ” విషయం అవుపిస్తుందేమోనండి.

శ్రీపతి :  అదే కదా ఆర్కిటెక్టు మహాశయులకూ ఐ.టీ.మేనేజరుకూ తేడా… తొమ్మిది నెలలు పట్టే గర్భాన్ని కూడా తొమ్మిది మంది చేత సాయం పట్టించేసి నెలరోజుల్లో చేసేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తాం, వీలైతే ఒకట్రెండు ప్రయత్నాలు కూడా చేసేసి.

కామేశ్వరరావుశ్రీపతిగారు 🙂

విశ్వామిత్ర :  ఇది అందరినీ ఆకట్టుకున్న సమస్య అనుకుంటా – వివిధములైన పూరణలు వచ్చినట్టున్నాయి

నచకి :  నేనెంత ప్రయత్నించినా మా బావగారు ప్రసవించలేదు, విశ్వామిత్రా!  🙁

రవివిశ్వామిత్ర గారూ, అలా అన్నిపిస్తుంది కానీ నిజానికి కాదండి.

కామేశ్వరరావు :  అధ్యక్షులవారు ఇంకెవరి చేతనయినా ప్రసవింప జేస్తారా?

రవి :  సరే రాఘవ గారు వచ్చేలోపు నా పూరణ కూడా పనిలోపనిగా కానిస్తాను

 

కం ||

పసజూపెను భోజనమున

నసలే పెనుగొప్ప బొజ్జ, యటపై నతిగా

పసిగొన్న వాఁడు! ఇకనేం!

ప్రసవింతురు బావగారు పదిదినములలోన్.

 

కామేశ్వరరావు :  మరోమారు మా భుజాలు… సారీ, బొజ్జలు తడుముకొంటిమి!

గన్నవరపు నరసింహమూర్తి :  తిండి తగ్గించ మంటున్నారు. ఈ సమస్య భారతములో కూడా వచ్చింది !

నచకి :  నా భోజనమిప్పుడే అయింది… కనుక అదేదో నన్నే అన్నట్టుగా ఉంది. 😀 (కాకపోతే నాకు పెనుగొప్ప బొజ్జ కాదు కదా, చిరుబొజ్జయినా లేదు ప్రస్తుతం!)

శ్రీపతి :  నచకి !! అన్నట్టుగా కాదు కన్నట్టుగా !!

కామేశ్వరరావు :  నా భోజనమింకా కాలేదు, అయినా నన్నే అన్నట్టుగా ఉంది!

నచకి :  సనత్ గారూ 🙂

కామేశ్వరరావు :  మూర్తిగారు, మీకిలాంటి సమస్యలు లేవని నాకు తెలుసులెండి 🙂

శంకరయ్య :  అలా వెళ్ళి ఇలా వచ్చాను. ఈలోగా రెండు పూరణలు …. చదువరి గారి పూరణ ప్రశంసనీయం. రవి గారి పూరణ హాస్యస్ఫోరకంగా ఉంది.

పుష్యం :  రవి గారూ , మనం భోజనాలనుండి లేవాలేమో?

రవి :  అవును తప్పదు.

రవి :  ఓ మారు అలా వర్ణనల వరకు వెళ్ళొద్దాం.

నచకి :  అవశ్యం

 

రవి: కింది బొమ్మను వర్ణించేపని సనత్ గారిది (ఈ బొమ్మను http://www.ravivarma.org/plog-content/images/raja-ravi-varma-paintings/peoples-and-portraits/raja_ravi_varma_24.jpg వద్దనుండి సంగ్రహించాం)

 
రవి :  “ఎదురు చూపుల పడతి” – అనుకోండి.

శ్రీపతి :  అవశ్యం… అవధరించండి.

 

ఉ ||

నల్లని ఆకసంబుపయి నాట్యమొనర్చెడి మేఘమాలికా

వల్లరి యందు గ్రుంకులిడు వారిజ మిత్రుడు నీవటంచు నా

ఉల్లము నందెవో చిలిపి ఊహలు రేగెను సాంధ్య రాగమై

చల్లని గాలిలో హృదయచక్షులు నీకయి వేచి జూడగా !!

 

కం||

మనసున మనసై మనమే

మనెదమ్మని మాటనిచ్చి మరచితివేమో

మనుజేంద్రా మునికాంతను

మనువాడుట నీదుధర్మ మరయగ లేవా?

 

శా||

నీవే నాథుడవంచు నిన్ను మదిలోనే నిల్పి, నీ తోడిదే

జీవమ్మంచు తలంచి నీకొరకు నే చింతించితిన్ ! నమ్మితిన్

నీవాగ్దానమునోయి ! నీ వలన నే నీళ్ళాడితిన్నింతకున్

నీవంశాంకురమందు ప్రేమ గొనలేవో ! నీకు మోమాటమో !!

 

కం ||

హేమంతపు శుభ వేళల

సీమంతము జేతురంట శీఘ్రము గా నీ

సామంతుల తో రాగదె !

ధీమంతా ! శ్రేష్ఠ గుణనిధీ ! దుష్యంతా !!

 

శ్రీపతి :  చిత్ర కవిత్వం అన్నారు కనుక ఇందులో ప్రత్యేకతను కనిపెట్టగలరు (ఖడ్గబంధం చిత్రం చూడండి పొద్దు)

 

పుష్యం :  చిన్నప్పుడు టూరింగు టాకీసులో రాయి మీద కూర్చుని సినిమాలు చూసేవాళ్ళం. మీ ప్రారంభం చూసి, ఈవిడది ఆ సీనేమో అనుకున్నాను 🙂

గన్నవరపు నరసింహమూర్తి :  వర్ణన చాలా బాగుంది,

నచకి :  సీమంతానికి సామంతులను ఆహ్వానించి రాజపత్ని అనిపించుకుంది! 🙂

వసంత్ కిషోర్ : చాలా బావుంది !

శ్రీపతి :  🙂

నచకి :  ఒక ప్రత్యేకత నేను గ్రహించాను: ఈవిడ ఖాళీగా కూర్చోవటమెందుకని మొదట సినిమాకెళ్ళింది. 😀

శ్రీపతి :  హ హ్హహ్హా

కామేశ్వరరావు :  రాజపత్ని కాబట్టి కత్తితో కబురంపినట్టుంది!?

చదువరి :  పెళ్ళాన్ని మర్చిపోవడం శ్రేష్ఠ గుణమని గ్రహించాను.

పుష్యం :  ‘కత్తి’ లాంటి పద్యం 🙂

కామేశ్వరరావు :  చదువరిగారు, 🙂 మీ ఆవిడ పక్కన లేరా?

శ్రీపతి :  చదువరిగారూ…. 🙂

చదువరి :  🙂

నచకి :  చదువరి గారు కూడా శ్రేష్ఠగుణనిధి అయిపోయారేమో అప్పుడే! 😀

శ్రీపతి :  కబురెట్టలేదు , ఖబడ్దారంది… కడుపుచేయటానికి లేని మొహమాటం, భార్యనని ఒప్పుకోడానికా అంది.. 😉

శ్రీపతి :  ఖాన్ తో గేమ్స్ ఆడితే శాల్తీల్లేచిపోతాయంది… కత్తిలా

నచకి :  కత్తిలా కాదు లెండి, కత్తితో!

కామేశ్వరరావు :  అవును సభక్తికంగా కాక “విభక్తికంగా” చెప్పింది!

పుష్యం :  knifeల గురించి మాని మనం wifeల గోష్టిలో పడ్డట్టున్నాము 🙂

నచకి :  మన గోష్ఠిలో ప్రసవం తఱువాత సీమంతం జఱిగిందండోయ్!

గన్నవరపు నరసింహమూర్తి :  వివాహము తర్వాత

శ్రీపతి :  అంటే అది లీగలూ, ఇది ఇల్లీగలూను.

కామేశ్వరరావు :  ప్రసవం మగవారికి, సీమంతం ఆడవరికీ జరిగింది 🙂

రాకేశ్వరుఁడు : ముందు మొగుడు నా పెండ్లాము పిల్లవాఁడూను అని ఒప్పుకుంటేగా తరువాత అత్తవారు శ్రీమంతం చేసేది. ఇది బెదిరింపా లేదా ఓ అబల కనే కలా?

శ్రీపతి :  అదేదో చిత్రం భళారే విచిత్రం సినిమాలో లాగ

కామేశ్వరరావు :  శకుంతల అబలేమిటీ సబలే

గన్నవరపు నరసింహమూర్తి :  జన్యు నిర్ధారణ ఉందిగా ! దుష్యంతా !

శ్రీపతి :  మెడకాయ మీద తలకాయున్నోడెవడైనా ‘కత్తి’ మీద సాము చేస్తాడుటండీ…

రాకేశ్వరుఁడు : క్షమించాలి సీమంతమఁట బ్రౌణ్యం ప్రకారమ్

నచకి :  రాకేశ్వరా, నేనూ చాలా కాలమిలాగే వైష్ణవప్రిల్లిని మ్ర్యావ్ మ్ర్యావ్‌మనిపించాను

కామేశ్వరరావు :  వసంత కిశోర్ గారు, దీనికి మీ పూరణ వినిపించండి. ఇది అధ్యక్షులవారి ఆదేశమే, నా చెవిలో ఊదారు.

వసంత్ కిషోర్ : తప్పకుండా !

పని జూసు కొస్తానని పట్న మెళ్ళిన బావ,కాబోయే భర్త కబురంపాడు గాదని , రోజూ ఊరి చివర చెరువు గట్టున ఎదురు చూస్తూ కనబడిన వాళ్ళందరినీ మా బావ ఎక్కడైనా కనుపించాడా ? అని అడుగుతూ

 

నన్ను మరచె నేమొ – నా రాజు , నాబావ

చూడ చక్కని వాడు – చూచి మూడు నెలలు

ఏడ బోయెనొ నేడు !  – ఎరుగ నైతి !

నిముస మైన విడచి – నిలువ జాలని వాడు !

తోడు నీడయు వాడె – జోడు  వాడె  !

చిన్న తనము నుండి – చెలిమి జేసిన వాడు !

ఏడ బోయెనొ వాడు !  – ఎరుక లేదు ! !

ఏడ నుండె బావ – ఎదురు చూపులు జూచి !

కళ్ళు కాయ గాచె – కాన రయ్య !

మరువ కండి స్వామి – మల్లి నా పేరండి !

మరచి బోకు డయ్య – మల్లి మాట !

పట్న మెళ్ళెను వాడు  – పని కోసమై నాడు !

గర్వ మసలు లేదు ! – కరుణ మెండు !

కాల మయ్యె బరువు ! – క్షణ మొక యుగమాయె !

ఏమి చేయుదు నేను ! – ఏది దారి !

భయము గలుగు చుండు ! – బాధ హెచ్చుచు నుండు !

బావ ఎక్కడ నున్న – భద్ర ముండు !

తోచ దేమియు నాకు –  తోడెవ్వరును రారు !

ఏమి చేయుదు నేను ! – ఏది దారి !

భార మాయె, బ్రతుకు – బావ లేకున్నను

గోడు వినగ నెవరు – తోడు లేరు !

బావ తోడ , బ్రతుకు ! – బావ తోనే చితికి !

జాలి చూపి బావ  – జాడ గనరె !

మరచి పోవుద మంటె – మరువ లేకున్నాను !

నిద్ర నైనను గాని – నిజము నైన !

గుర్తు వచ్చిన చాలు – గుండె నీరౌతాది !

ఏడ బోయెనొ నేడు !  – ఎరుగ నైతి !

మరిగి పోవుచు  నుండె – మల్లి గుండెలు నేడు !

బావ లేనిది నేను – బ్రతుక జాల !

బిక్క మొగము తోడ – బేజారు పడుతున్న !

ఏడ బోయెనొ వాడు !  – ఎరుక లేదు !

బావ లేక పోతె – బ్రతికి ఫల మదేమి !

నీరు ముట్ట లేను – నిదుర పోను !

బావ రాక యున్న – బావియే బావౌను !

జాలి చూపి బావ  – జాడ గనరె !

 

నచకి :  బావ రాక యున్న – బావియే బావౌను !

నచకి :  వాహ్! అసలు మొత్తం వర్ణన గేయరీతిలో అలతి పదాలో అందంగా సాగింది

కామేశ్వరరావు :  బాగుందండి. మల్లేశ్వరి, ఎంకి ఒక్కసారే కనపడ్డారు నాకు!

శ్రీపతి :  కిశోర్ గారూ…. 🙂

వసంత్ కిషోర్ : మల్లీశ్వరిని దృష్టిలో పెట్టుకొని వ్రాసినదే !

మిస్సన్న :  అయ్యో వర్ణనల కెళ్ళిన ప్పటినుంచీ నేను    గెంటి  వేయ  బడ్డాను

నచకిమిస్సన్న గారూ, పునఃస్వాగతం!

చదువరి :  చాల బాగుంది.

నచకి :  మీరు మల్లీశ్వరి అంటే కత్రినా గుర్తొచ్చింది! హతవిధీ!

కామేశ్వరరావు :  “బావ తోనే చితికి” – ఈ మాటలో మొత్తం ఈ వర్ణన ప్రాణమంతా దాగుంది!

వసంత్ కిషోర్ : ధన్యవాదములు !

మిస్సన్న :  కిశోర మహోదయా మనోహరమైన బావా మరదళ్ల అనురాగం.

కామేశ్వరరావు :  చాలా కాలంనుంచి నాకు సందేహం. “మల్లేశ్వరి”, “మల్లీశ్వరి” – రెంటిలో ఏది సరి?

వసంత్ కిషోర్ : అయ్యా ఇది భానుమతి మల్లీశ్వరి !

కామేశ్వరరావు :  పాత సినిమాలో మల్లేశ్వరి అని వేసినట్టు గుర్తు.

నచకి :  మల్ల_ఈశ్వరి కాదు కదండీ, మల్లి_ఈశ్వరి అనుకుంటాను యిక్కడ. కనుక సవర్ణదీర్ఘమే.

రవి :  నచకి: :))

గన్నవరపు నరసింహమూర్తి :  మరదలి అనురాగము, బావేమీ మాట్లాడడము లేదు. చాల బాగుంది

మిస్సన్న :  మల్ల యోధురాలైన ఈశ్వరి మల్లేశ్వరి అయిఉంటుంది.

రవి :  మల్ల ఈశ్వరి = గుణం కాదంటారు!

చదువరి :  అయితే దుర్గామల్లేశ్వర స్వామి కాదన్నమాట – దుర్గా మల్లీశ్వరస్వామియే!

శ్రీపతి :  ఆవిడకి నిజంగా మల్ల యుధ్ధం లో ప్రవేశమే ఉండి ఉంటే అట్లా కూర్చుని ఉంటుందా “నే తొడగొట్టి బిల్చెదను” అంటూ ఒక పద్యం వేస్కుని ఉండదూ !!

నచకి :  మల్ల or మల్లె malla. (from మల్లము.) n. A shallow earthen vessel. (Brown)

శంకరయ్య :  సనత్ కుమార్, వసంత్ కిశోర్ గారల వర్ణనలు మనోహరంగా ఉన్నాయి. ఇద్దరికీ అభినందనలు.

శ్రీపతి :  ధన్యవాదాలు

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.