కలసివచ్చిన ఇల్లు

అమ్మకి ఫోన్ చెయ్యగానే అమె అడిగిన మొదటి మాట – “ఏం తేల్చుకున్నారే?” అని. ఏమని చెప్పేది? ఇంకా ఏం తేలనిదే. గత నెల రోజులుగా దాదాపు ప్రతి రోజూ నాకు ఆయనకి మధ్య ఈ విషయమై చర్చ జరుగుతూనే వుంది. అయినా ఒక నిర్ణయానికి రాలేకపోయాము. మీకు చెప్తే నవ్వుతారేమో కాని విషయం మాత్రం చిన్నదే.
 

“అమ్మా.. నువ్వు ఏదైనా పత్రికలకి కథలు వ్రాయవే.. నేను అడిగింది అర్థం చేసుకోకుండా ఏదేదో చెప్తావు..” “కథలేమిటే కథలు.. అసలు ఆ ప్రశ్న ఎందుకడిగావో చెప్పు.. సమాధానం నేను చెప్తాను..” అంది అమ్మ చిరుకోపంతో.

ఇల్లు కొందామని నిర్ణయించుకున్న తరువాత, నేను రవి ఊరంతా తిరిగి, దాదాపు ఒక ఇరవై ఇళ్ళు చూసాము. తరువాత ఆ జాబితాను రెండు ఇళ్ళకు కుదించి, ఈ రెండింటిలో ఒకటి మన ఇల్లే అనుకున్నాం. కానీ సమస్యంతా అక్కడే వచ్చింది. నాకు, రవికి చెరొక ఇల్లు నచ్చింది. నచ్చటం అంటే నిజానికి నాకు రెండు ఇళ్ళూ నచ్చాయి. కాకపోతే అందులో ఒకటి వాస్తు ప్రకారం సరిగా లేదు. అదే మాట రవితో అంటే నవ్వేశాడు.


“చదువుకున్నదానివి.. ఇంకా వాస్తు జాతకాలు అంటే ఎలాగే.. “ అన్నాడు.

“అవును చదువుకున్నదాన్ని కాబట్టే ఆ వాస్తు పుస్తకాల్లో వ్రాసింది చదివి చెప్తున్నాను.. ఆ ఇంటి వాస్తు బాగోలేదు.. అందుకే వద్దు.. అంతే..” తేల్చేశాను నేను.


“ఇల్లు కొనేటప్పుడు చూసుకోవాల్సింది ఆఫీసులకి ఎంత దూరం, పిల్లల స్కూల్ కి ఎంత దూరం అని కానీ, ఆగ్నేయాలు వాయువ్యాలు కాదు… పైగా నువ్వు చెప్పే ఇంటికి ఇంకో నాలుగు లక్షలు ఎక్కువ పెట్టాలి.. నా వల్ల కాదు..” అన్నాడు రవి మొండిగా.

“అక్కడికి ఏదో అన్ని లక్షలు నువ్వే తెస్తున్నట్లు చెప్పద్దు? ఏదైనా బ్యాంక్ లోనే కదా..” అన్నాను నేను జగమొండిగా.

“అది కాదు ప్రియంవదా.. నాలుగు లక్షలు తేవడం కష్టం కాదు, తీర్చడం కష్టంకాదు.. పైగా నీకు నచ్చిన ఇల్లు కాబట్టి నాకూ ఇష్టమే.. వాస్తు సరిగా లేదని ఒకే కారణంతో మంచి ఇల్లు వదులుకోవడం ఎందుకు అని… ఆలోచించు..” బ్రతిమిలాడాడు.

“నాకు తెలుసు బాబు.. ప్రియ అని కాకుండా ప్రియంవదా అని పూర్తి పేరు పిలిచినప్పుడే తెలుసు ఇలాంటి లాజిక్ ఏదో చెప్తావని.. సరే అయితే ఇప్పుడు వాస్తు గురించి నిన్ను నమ్మించాలి అంతేనా?”


“ఇదుగో… నేనేమి వాస్తుని నమ్మడంలేదని చెప్పానా? వాస్తు కన్నా ముఖ్యమైనవి వేరే వున్నాయిని అంటున్నాను..” రవి సర్ది చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు.

“వుండచ్చు కానీ మూడేళ్ళ క్రితం మనం ఆ రావుగారి ఇంటిలో వున్నప్పుడు మీ వుద్యోగం పోయి.. ఎంత ఇబ్బంది పడ్డాం? గుర్తులేదా?”

“ఆ వుద్యోగం పోయింది అమెరికాలో రిసెషన్ వల్ల.. ఇక్కడేక్కడో నేను వున్న ఇల్లు వాస్తు కారణంగానే అమెరికాలో రిసెషన్ వచ్చిందంటావా?”  నవ్వుతూ అడిగాడు రవి.

“నవ్వండి నవ్వండి.. ఆ తరువాత అంత అద్దె కట్టలేక ఊరి చివర చిన్న ఇంటికి వెళ్ళాం అదైనా గుర్తుందా?”

“గుర్తులేకేం ప్రియా.. అది కూడా వాస్తు బాగాలేదని సణిగావు.. కానీ ఏమైంది?”

“ఏమైంది గుర్తులేదా? మీరు బీపీవో మొదలుపెట్టి.. క్లైంట్స్ దొరక్క బిజినెస్ అవ్వక ఎంత కష్టపడాల్సి వచ్చింది..”

“అవునవును.. ఒకరి మీద, ఒక వుద్యోగం మీద ఆధారపడకుండా సొంతంగా బ్రతకడం నేర్చుకున్నాను… కొత్త కంపెనీ అంటే ఆ మాత్రం కష్టం వుంటుంది.. కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. అంతా మంచే జరిగింది కదా..”

“మీరు బుద్ధభగవానుడు కాబట్టి కొంచెమే ఇబ్బంది పడ్డారు.. మొన్న మొన్నటి దాకా కనీసం నిద్ర కూడా పట్టలేదు నాకు.. తెలుసా..” అన్నాను కటువుగా. నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది బ్రహ్మాస్త్రం. చాలాసేపటి వరకు రవి ఏం మాట్లాడలేదు.


“ఎందుకు అంత పట్టుదల నీకు.?” అడిగాడు చివరిగా.

“ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి.. నాన్న వాళ్ళు ఉన్న ఇల్లు… మీకు తెలుసుగా.. ఆ ఇంట్లో వున్నన్నాళ్ళు.. ఎలా కలిసొచ్చింది.. నాన్న ఏ వ్యాపారం చేస్తే అందులో లక్షలు సంపాదించారు.. అమ్మకి లోటంటే ఏమిటో తెలిసేది కాదు.. మేము వున్నది నలుగురమైనా ఎప్పుడూ పదికి తక్కువ కాకుండా విస్తరాకులు లేచేవి.. బంధువులు, స్నేహితులు…. ఆ వీధి పిల్లలంతా మా ఇంట్లోనే వుండేవాళ్ళు.. ఎంత సందడి..” మైమరచి చెప్తుంటే మధ్యలో ఆపేడు రవి.


“ఇదంతా ఆ ఇంటి వాస్తు వల్లే అంటావు..”

“కాకపోతే ఇంకేవిటి.. అన్నయ్య పెళ్ళి తరువాత ఇల్లు కొనుక్కోడానికి ఆ ఇల్లు అమ్మాడు కానీ, నాన్నైతే అసలు అమ్మేవాడే కాదు.. అమ్మిన తరువాత చూడు నాన్న, అమ్మ పరిస్థితి.. వ్యాపారం అంతా అన్నయ్య తీసేసుకున్నాడు… నాన్నకి షుగరు, అమ్మకి దాంతోపాటు ఇంకో నాలుగు.. ఏ పని లేకుండా నాన్న ఇంటి చూరు పట్టుకోని వుండాల్సి వచ్చింది..”

“పిచ్చిదానా.. ఏ పని లేకుండా ఇంట్లోనే వుండటం సుఖమౌతుంది కానీ.. కష్టమంటావే? పైగా ముసలితనంలో వచ్చే రోగాలు కూడా ఇంటి మహిమేనా?”

“ఇదుగో.. అనవసరమైన లాజిక్కులు చెప్పద్దు నాకు… నా మాట వినదల్చుకోక పోతే మీకు నచ్చిన ఇంటినే కొనుక్కోండి..” అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాను.

దాదాపు రెండు గంటలు గడిచాయి. ఇద్దరం మాట్లాడుకోలేదు. రవి ఆఫీసుకు తయారయ్యి, నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టిన వుప్మా మాట్లాడకుండా తినేసి, వెళ్తూ వెళ్తూ అన్నాడు –

“ఒక పని చేద్దాం ప్రియా.. సాయంత్రం త్వరగా వస్తాను.. మనిద్దరం మీ నాన్న పాతింటికి వెళ్దాం.. ఇప్పుడు ఆ ఇంట్లో వున్నవాళ్ళు కూడా మీ నాన్న లాగే సుఖంగా, సంతోషంగా వుంటే… నువ్వు చెప్పిన ఇల్లే కొందాం.. లేదంటే నేను చెప్పినట్లే వినాలి..” అలా చెప్పి ఇలా ఆఫీసుకు వెళ్ళిపోయాడు, నా సమాధానం వినకుండానే.


***


“మీరు సంతోషంగా వున్నారా అమ్మా” అడిగాను ఫోన్ లో.

“ఏమిటే ఆ ప్రశ్న… సంతోషంగా వున్నారా అంటూ..?? రోజూ మాతో మాట్లాడుతూనే వున్నావు కదా.. నీకు తెలియదా మేం సంతోషంగా వున్నామో లేదో..” ఎదురు ప్రశ్న వేసింది అమ్మ.

“అది కాదమ్మా.. ఇదివరకు మన పాతింట్లో వున్నప్పుడు వున్నంత సంతోషంగా వున్నారా అని అడుగుతున్నా..”

“అదొక రకం.. ఇదొక రకం.. అప్పుడు సంసారం మాది.. బాధ్యతలు మావి.. దేవుడి దయవల్ల అన్నీ సమకూరాయి కాబట్టి బాధ్యతలు నెరవేర్చాం.. పది మందికి సాయంచేశాం.. ఒక సంసారానికి పెద్దలుగా అప్పుడు చేయాల్సినవన్నీ చేయగలిగినందుకు సంతోషం వుండేది… ఇప్పుడు మేము పెద్దవాళ్ళమయ్యాము… ఇక బాధ్యతలు లేవు.. మేమే ఇంకొకరి బాధ్యత అయ్యాము.. వాడు, కోడలు ఆ బాధ్యత సక్రమంగానే నెరవేరుస్తున్నారు కాబట్టి.. ఇప్పుడూ సంతోషంగానే వున్నాం..” చెప్పింది అమ్మ.

“అమ్మా.. నువ్వు ఏదైనా పత్రికలకి కథలు వ్రాయవే.. నేను అడిగింది అర్థం చేసుకోకుండా ఏదేదో చెప్తావు..”

“కథలేమిటే కథలు.. అసలు ఆ ప్రశ్న ఎందుకడిగావో చెప్పు.. సమాధానం నేను చెప్తాను..” అంది అమ్మ చిరుకోపంతో.

“ఆయనా నేను.. ఈ రోజు సాయంత్రం మన పాతింటికి వెళ్తున్నాం..” చెప్పాను.

“పాతింటికా.. ఎందుకు?” అడిగింది అమ్మ ఒకింత ఆశ్చర్యంతో. నేను జరిగిన విషయం మొత్తం చెప్పాను.

“అదా విషయం.. అయితే వెళ్ళిరండి.. ఇంక నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను చెప్పాల్సిన పనిలేదు… అక్కడే దొరుకుతుంది.. వెళ్ళిరండి” అంటూ ఇప్పుడు అక్కడ వుంటున్న వారి వివరాలు, అక్కడికి వెళ్తే కలవాల్సిన వ్యక్తుల గురించి చెప్పింది అమ్మ.


***

 

“ఒక్క చెట్టేమిటే తల్లి.. మీరు పెట్టిన పాదులు, పూల చెట్లు ఒక్కటి బ్రతకనిచ్చారా? మీ గోరింటాకు చెట్టు ఆకు ఎంత బాగా పండేది గుర్తుందా? దాని ఆకు కోసం అందరూ వస్తున్నారని తెగ సణిగేది ఆ మహా ఇల్లాలు.. ఇప్పుడు ఆ చెట్టు వున్నా ఒకటే లేకపోయినా ఒకటే.. ఒక్క ఆకు లేకుండా ఎప్పుడూ ఎండిపోయి వుంటుంది…” చెప్పింది అత్తయ్య వంటింటిలోనుంచే.

పద్మనాభంగారని, నాన్న పాత ఇంటికి రెండు వీధుల అవతల వున్న రెండతస్థుల డాబాలో వుంటారు. వ్యాపారం మొదలుపెట్టక ముందు నాన్న, పద్మనాభంగారు ఒకే ఆఫీసులో పని చేసేవారు. ఇద్దరూ మంచి స్నేహితులు కావటం మూలానేమో ఒకే చోట ఇళ్ళు కొనుకున్నారు. ఇదంతా నాకు వూహ తెలియకముందు సంగతి. నాకు తెలిసేటప్పటికే నాన్న సొంతగా ట్రాన్స్ పోర్ట్ కంపెనీ మొదలుపెట్టాడు. అయినా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే వుంది. నేను, అన్నయ్య, పద్మనాభంగారి పిల్లలు ఎప్పూడూ కలిసే ఆడుకునేవాళ్ళం. అమ్మ, పద్మనాభంగారి భార్య సావిత్రత్తయ్య ఎప్పుడూ అక్కచెళ్ళెళ్ళ మాదిరిగా కలిసి తిరిగేవారు. అందుకే నేను పాత ఇంటికి వెళ్తున్నానని చెప్పగానే అమ్మ ముందు సావిత్రత్తయ్య ఇంటికే వెళ్ళమని చెప్పింది.


వాళ్ళింటికి వెళ్తూనే అత్తయ్య ఎదురొచ్చి – “ఏమ్మా ఇన్నాళ్టికి తీరిందా? మీ పెళ్ళి తరువాత ఇదే చూడటం నిన్ను.. రండి..” అంటూ నాతో మాట్లాడుతూనే.. “మొదటిసారి వచ్చారు నాయనా.. వుండండి ఏదైనా స్వీటు చేసుకొస్తాను..” అంటూ రవిని పలకరిస్తూ ద్విపాత్రాభినయం చేసేసింది.


“ఏంటత్తయ్యా హడావిడి.. అవన్నీ తరవాత చూడచ్చు ముందు కాస్సేపు కూర్చో..” అంటూ బలవంతంగా కూర్చోపెట్టాల్సి వచ్చింది. కుశలప్రశ్నలు, ఉభయకుశలోపరిలు అయ్యాక నెమ్మదిగా విషయం మొదలుపెట్టాను –

“మా ఇంట్లో ఇప్పుడు ఎవరుంటున్నారత్తయ్యా..” అడిగాను.

“ఎందుకడుగుతావే అమ్మా.. మీరు ఆ గోవిదరాజులుగారికి అమ్మారా ఆ తరువాత ఎవరో పరమేశ్వరరావుగారట ఆయన కొన్నాడు.. ఎప్పుడో పేరు వినటం, అప్పుడప్పుడు చూడటమే కానీ ఒక్కసారి కూడా ఈ వీధిలో వాళ్ళతో మాట్లాడగా చూడలేదే…” చెప్పిందావిడ.

“కొత్తగా వచ్చారు కదా.. కొన్ని రోజులాగితే వాళ్ళే కలుస్తారేమో లెండి” అన్నాడు రవి సర్దుబాటుగా. నాకు మాత్రం ఎందుకో అది నిజం కాదని అనిపించింది. అదే మాట అత్తయ్య కూడ అంది.

“లేదు బాబూ.. వాళ్ళు వచ్చి కూడా ఆరు నెలలు దాటింది.. మొదట్లో ఒకసారి కొత్తగా వచ్చారు కదా అని పలకరించడానికి వెళ్ళాం… పొడి పొడిగా మాట్లాడి ఇంక వెళ్ళమన్నట్లు చూస్తే ఏం చేస్తాం చెప్పు.. ఆ తరువాత ఎప్పుడు చూసినా తలుపులేసుకోని వుంటారు.. అదో రకం మనుషుల్లే..” అంటూ లేచింది.. “కూర్చోండి ఏదన్నా చేసుకొస్తాను..” అంటూ వంటింట్లోకి వెళ్ళింది.


నేను రవి వైపు చూశాను.

“మీ సావిత్రి అత్తయ్య ఏదో భారీ ప్రోగ్రాం పెట్టినట్లుంది.. లోపలికి వెళ్ళి వద్దని చెప్పు” అన్నాడు.

“ఆవిడకి నేనన్నా అమ్మన్నా ఆపేక్ష…” అన్నాను నవ్వుతూ.

“ఆపేక్ష అనుభవించేది మనసుతో అయితే ఎంతైనా ఫర్లేదు.. అది పొట్టమీద దాడి చేస్తే కష్టం..” అన్నాడు పొట్టమీద చేతితో రుద్దుకుంటూ. నేను నవ్వుకుంటూ లేచానో లేదో గాయత్రి, వనజ వదినా వాళ్ళ పిల్లలతో బిలబిల మంటూ వచ్చేశారు.


“ఏమ్మా ఇదేనా రావటం.. అమ్మా నాన్నని పిల్చుకు రాకపోయావా.. ఈయనేనా మీ ఆయన? ఏదన్నా విశేషమా? ఇంకా ఎప్పుడే..” ఎవరు ఏ ప్రశ్న అడుగుతున్నారో అర్థం అయ్యే లోపలే పది పదిహేను ప్రశ్నలు దూసుకొచ్చాయి. సమాధానాలతో పని లేనట్టుంది వాళ్ళకి. రవిని వాళ్ళకి, వాళ్ళని రవికి పరిచయం చేశాను.

“ఆ ఏదో ఇరుగు పొరుగు అన్నట్టు కాదు రవిగారు.. మేమంతా వీళ్ళ ఇంటిలోనే వుండేవాళ్ళం. ఒక్క రోజు రాకపోయినా మీ అత్తగారు వూరుకునేది కాదు..” చెప్పింది వనజొదిన.

“ఇద్దరు ఒక సారి రండే.. నానమ్మ చాలా రోజుల్నించి చూడాలంటోంది..” అంది గాయత్ర్రి. ఆ మాట పూర్తికాక ముందే నానమ్మ నెమ్మదిగా వంగి నడుచుకుంటూ “ఏమే పిల్లా..” అంటూ లోపలికొచ్చింది.

“నువ్వెందుకు నానమ్మా ఇంత కష్టపడి రావటం? మేమే వద్దామనుకుంటే.. “ అన్నాను నేను.

“ఏమో తల్లీ.. ఈ ముసలమ్మ నీకు గుర్తుందో లేదో.. రాకండా పోతే మళ్ళీ చూడటానికి వుంటానో లేదో అని ఆత్రపడి వచ్చాను.. నిన్ను చూస్తే మీ అమ్మని చూసినట్టుందే పిల్లా.. కాకపోతే బాగా సన్నబడ్డావు..” అంది ఆప్యాయంగా నిమురుతూ.


రవి నవ్వేశాడు.
“ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి వస్తామండి..” అన్నాడు జనాంతికంగా.

“ఎవరున్నారని వెళ్తారు.. వీళ్ళు వచ్చిన తరువాత కళే పోయింది… ఆ బాదం చెట్టు కొట్టేసిన తరువాత ఆ ఇల్లే కొత్తగా వుంది..” అంది గాయత్రి.

“అయ్యో.. చెట్టు కొట్టేశారా?” అన్నాను అప్రయత్నంగా.. ఒక్కసారిగా నా బాల్యం కోల్పోయిన  బాధ కలిగింది నాకు.

“ఒక్క చెట్టేమిటే తల్లి.. మీరు పెట్టిన పాదులు, పూల చెట్లు ఒక్కటి బ్రతకనిచ్చారా? మీ గోరింటాకు చెట్టు ఆకు ఎంత బాగా పండేది గుర్తుందా? దాని ఆకు కోసం అందరూ వస్తున్నారని తెగ సణిగేది ఆ మహా ఇల్లాలు.. ఇప్పుడు ఆ చెట్టు వున్నా ఒకటే లేకపోయినా ఒకటే.. ఒక్క ఆకు లేకుండా ఎప్పుడూ ఎండిపోయి వుంటుంది…” చెప్పింది అత్తయ్య వంటింటిలోనుంచే.

“ఫర్లేదు లెండి.. ఒకసారి వెళ్ళి వెంటనే వచ్చేస్తాం..” అన్నాడు రవి లేస్తూ.

“వెళ్ళిరండి నాయనా.. ఆ అమ్మాయి పుట్టి పెరిగిన ఇల్లు.. చూసుకోవాలని వుండదూ..” అంది నానమ్మ.

“త్వరగా వచ్చేయండి.. మీ మామయ్య వచ్చేవేళ కూడా అయ్యింది.. ఒక్కసారే రాత్రికి భోజనం కూడ చేసి వెళ్ళచ్చు..” అంది అత్తయ్య గొంతు వంటింటిలోనించి.


భోజనం మాట వినగానే మేము ఇద్దరం ఒకరినొకరం ఇబ్బందిగా చూసుకోని నవ్వుకోని బయటపడ్డాం.


***


మా పాత ఇంటి కొత్త స్వరూపం చూడగానే బాధగా అనిపించింది. సావిత్రత్తయ్య వాళ్ళు చెప్పింది నిజమే. నేను పుట్టి పెరిగిన ఇల్లు అదే అని చెప్పడానికి ఏ ఆనవాలు మిగిలినట్టు లేదు. బాదం చెట్టు లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బావి మూసేసారు. గేటు ఇంతకు ముందున్న చోటు నుంచి కొంచం దక్షిణానికి జరిపినట్టున్నారు. మేము ఎంతో ముచ్చటపడి వేయించిన లేత గులాబిరంగుకు బదులుగా మాసిపోయిన తెల్లరంగుతో ఇల్లు వెలవెలబోతోంది.


తలుపుతీసి మమ్మల్ని చూసిన పెద్దమనిషి ప్రశ్నార్థకం మినహా ఏ భావం పలకకుండా ముఖం పెట్టాడు.

“పరమేశ్వరరావుగారు..??” అడగాలా వద్దన్న సంశయం రవి గొంతులో. ఆయన సమాధానం చెప్పలేదు. చిన్నగా వూపిన తల చూస్తే అది “అవును” అన్న సమాధానమో.. “అయితే ఏంటి” అన్న తిరస్కారమో అర్థం కాలేదు.


“ఈ ఇల్లు ఒకప్పుడు మాదేనండి.. నేను పుట్టి పెరిగిన ఇల్లు.. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాము..” చెప్పాను నేను.

“రండి..” అనే మాట ఆయన గొంతులో నుంచి తప్పదన్నట్లు వచ్చింది. లోపలికి వెళ్ళి బాగా దుమ్ము పట్టి వున్న కుర్చీలలో కూర్చున్నాం.

“బాదం చెట్టు కొట్టేసినట్లున్నారు..?” అడిగాను ఏమడగాలో తెలియక.

“ఏం చెట్టో.. ఇంటినిండా ఆకులు.. చెత్త.. చెట్టు నిండా పిచుకలు, గూళ్ళు..” అసహ్యంగా ముఖం పెట్టాడు.. “కాయలు కాస్తేచాలు.. పిల్లలంతా రాళ్ళు వేయడం, గోడలు దూకటం.. అందుకే కొట్టిచ్చేశాం..” చెప్పాడు. అంతసేపటికి అన్ని మాటలు మాట్లాడినందుకు సంతోషపడాలో, ప్రతి మాట గుచ్చుకున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు నాకు. బావి గురించో, గోరింటాకు చెట్టు గురించో అడిగే ధైర్యం లేకపోయింది.


“ఈ ఇల్లు వాళ్ళ నాన్నగారికి బాగా కలిసి వచ్చిందండి… తను ఎప్పుడూ ఈ ఇంటి గురించే చెప్తుంటుంది..” అన్నాడు రవి. సూటిగా మేము అనుకున్న విషయం రాబట్టడానికే ఆ మాట అన్నాడని నాకు అర్థమైంది. ఆతృతగా పరమేశ్వరరావుగారి వంక చూశాను.

“ఏం కలిసిరావటమో.. ఒక సుఖం లేదు సంతోషం లేదు.. ఎందుకు కొనుక్కున్నామా అని అనుకోని రోజు లేదు..” చెప్పాడాయన చప్పరిస్తూ. రవి ఇంకా ఏదో అడగబోతుంటే నేను మధ్యలో అందుకున్నాను –

“చాలా ధాంక్సండి.. వస్తాము..” అంటూ లేచాను.  రవి కొంచెం ఆశ్చర్యంగా చూసి తను కూడా లేచి నాతో బయటికి అడుగేశాడు.

“గేటు కూడా మార్చినట్లునారు..” అన్నాడు బయటపడుతూ.

“వాస్తు ప్రకారం..” అన్నాడు ఆయన.


***


మేము సావిత్రి అత్తయ్య ఇంటికి వచ్చేసరికి పద్మనాభం మామయ్య కూడా వచ్చేశాడు. ఆప్యాయంగా పలకరించి అన్ని విషయాలు అడిగాడు. రవి మేము వచ్చిన కారణం వివరించాడు.


“మీ మామగారు వున్నప్పుడు పరిస్థితి వేరు.. వాడికి, వాడి భార్యకి ఎప్పుడూ పది మంది చుట్టూ వుండాలి.. వీధిలో వున్నవాళ్ళందరిని పలకరించేవాడు… ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఇద్దరూ వెనక ముందు చూడకుండా చేసేవాళ్ళు.. పదిమంది మంచి కోరుకుంటే మనకి మంచే జరుగుతుందనడానికి వాడే వుదాహరణ..” చెప్పాడాయన.


ఆ రాత్రి భోజనం చెయ్యనిదే ఒప్పుకోలేదు మామయ్య, అత్తయ్య. రాత్రి పది దాకా మమ్మల్ని చూడాలని చుట్టుపక్కలవాళ్ళంతా వచ్చారు. అతి కష్టం మీద పదిన్నరకి బయలుదేరాము.


“ఈ ఏరియాలో మీరెవరైనా ఎలక్షన్లో నిలబడ్డా గెలిచేట్టున్నారు..” అన్నాడు రవి నవ్వుతూ. నేను నవ్వేశాను.

“అంతా నాన్న, అమ్మ గుడ్ విల్” చెప్పాను.

“అది సరే.. ఇంతకీ ఏం నిర్ణయించావు?” అడిగాడు అసలు విషయానికి వస్తూ.

“చెప్తాను.. కానీ మీరు వెక్కిరించకూడదు.. ఆ రెండు ఇళ్ళల్లో..” చెప్పబోతుంటే మధ్యలోనే ఆపేశాడు రవి.

“రెండు కాదు.. మూడు ఇళ్ళలో.. మీ పాతింటిని కొనుక్కుంటే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నాను..” అన్నాడు.

నేను సమాధానం చెప్పలేదు. అప్పుడే అమ్మ ఫోన్ చేస్తే తీసుకోని చెప్పాను – “నిర్ణయించుకున్నాం అమ్మా..” అని.

***

About అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్ గారు పుట్టింది గుంటూరులో. విద్యాభ్యాసం గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్, ఆనంద్ (గుజరాత్) లలో సాగింది. 1995-99 వరకూ కొన్ని కథలు వ్రాసినా సాహితీ ప్రస్థానం మధ్యలో ఆగిపోయింది. ఆపై వుద్యోగ రీత్యా దాదాపు దేశమంతా తిరిగారు. ఎన్నో కొత్త ప్రదేశాలు, ఎంతో మంది కొత్త కొత్త వ్యక్తులు.. ఇంతమంది కలిసాక పదేళ్ళ క్రితం ఆగిపోయిన రచనా వ్యాసంగం బ్లాగుల ద్వారా రెండొవ ప్రకరణంగా ప్రారంభమైంది.

ఇప్పటికి ముప్పైకి పైగా కథలు వివిధ పత్రికలలో, అంతర్జాలంలో ప్రచురించబడ్డాయి. పలకబలపం (http://palakabalapam.blogspot.com), జోకాభిరామాయణం (http://jokabhiramayanam.blogspot.com) అనే బ్లాగులు రాస్తూంటారు. అంతర్జాలంలో బాగా పేరు తెచ్చిన ”కార్పొరేట్ కాశీ మజిలీ కథల”ను పుస్తక రూపంలో తెచ్చే ప్రయత్నంలో వున్నారు.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.