సత్యప్రభ – 1

2 వ ప్రకరణం

సత్యప్రభ మాటలు విన్న వీరసింహుడు దండతాడిత సర్పం వలె క్రుధ్ధుడై ఇఅలా అన్నాడు !

“ నేనా వివిక్త దేశ వీరుణ్ని? నాకు సేనలో సహస్రపతి  పదవిని ఇచ్చిన ఆంధ్రేశ్వరునే నీవు అధిక్షేపిస్తున్నావు ! నాకు క్రోధం కలిగిన కొన్ని క్షణాల్లో బ్రహ్మకుల పరిషత్తు అధ్యక్షుని ఎదుట నికృష్టమైన నీ జన్మని రుజువు చేసి, నిన్ను బ్రాహ్మణ జాతిలో నుండి బహిష్కరింప చేయుట మా కసాధ్యం కాదు ! బాగా ఆలోచించికో, నన్ను పెండ్లాడి నీ కుటుంబాన్ని మహోన్నత స్థితికి  తెచ్చుకొంటావా లేక అధోగతి పాలు చేసుకొంటావా,?”

వీరసింహుని  ఈ వచనోపన్యాసం ఇంత వరకు శాంతంగా ఉండిన రంగ స్థలాన్ని భయంకరంగా మార్చింది. ప్రసన్నంగా ఉండిన రంగాన్ని కల్లోల పరచింది. పిమ్మట  వారిద్దరి సంవాదంలో మార్దవం పూర్ణంగా నశించింది.

“ నా జన్మ నికృష్టమో , నన్ను కన్నవారి జన్మలు నికృష్టములో కాలమే తెలియజెప్తుంది. నన్ను కన్న తండ్రి చెప్పుల్ని మొయ్యడానికి కూడా నీకు అర్హత లేదని నేను స్పష్టంగా చెప్పగలను. ప్రాసాదంలో మిక్కిలి పలుకుబడిగల నీ తల్లి నన్ను జాతి నుండి బహిష్కరింప వచ్చు. కాని మా కుటుంబం శక్తి సామర్థ్యాల నుంచి ఒక చిన్న లవాన్ని కూడా అపహరింప జాలదు. తల్లి తండ్రుల వచన ప్రతాపం పైన , ఆధార పడిన నీ వీరత్వం వంటిది కాదు నా వీరత్వం !”

ఈ మాటలు తీవ్ర బాణాల వలె వీరసింహుని మర్మాల్ని స్పృశించాయి !

సత్యప్రభను వశపరచుకోడానికి వాడు అవలంబించిన ఆశా ప్రదర్శన నీతిన్ని, బిభీషికా నీతిన్ని వ్యర్థాలై పోయాయి. ఇక మిగిలినవి రెండే మార్గాలు  తన ప్రయత్నం నుండి విరమించుకోవాలి. లేదా ఆమెను బలాత్కరించాలి. ఆ మధోధ్ధతుడు, ప్రయత్న విరమణ తన ప్రతాపానికి న్యూనత అని తలంచాడు. మూలికాన్వేషణకి  వెళ్లిన ముని, అర్థరాత్రికి గాని తిరిగి రాడు. ఆ విషయం వీరసింహునికి బాగా తెలుసు. ఆ విధంగానే చెప్పాడు అక్షోభ్యముని. కాబట్టి ఆ వివిక్త ప్రదేశంలో ఒంటరిగా  చిక్కిన  ఆ  సుందరాంగిని బలాత్కరణ చేయడానికే వాని తత్కాల సంకల్పం ప్రేరేపించింది. ఈ దుశ్చర్యకు ప్రోత్సహించడంలో వాని కామమొక్కటే  భాధ్యత వహించ లేదు, క్రోధము కూడా అందులో భాగం కలిగి ఉంది. ఆ ఉచ్చృంఖల యువకుడు సత్యప్రభతో తుది మాటగా ఇలా అన్నాడు:

“వీరసింహుని భుజ ప్రతాపం తెలుసుకోకుండా నీవు జల్పిస్తున్నావు. మరొకమాటు నిన్ను అడుగుతున్నాను. నన్నుపెళ్లి చేసుకొని, శ్రీకాకుళ సంపన్న నారీమణులలో కెల్ల మిన్నగా జ్వలిస్తావా, లేక నా భుజబలాన్ని పరీక్షిస్తావా?”

“క్షుద్ర! ప్రాణాలు కావాలని కోరిక ఉన్నచో పారిపో. నా నుండి జవాబే కావాలన్నచో, ఈ కఠారి ఇస్తుంది.ఇది నీ బలం ఎంత ఉందో పరీక్షించ గలదు!”

ఇప్పుడు వీరసింహుని స్థితి మిక్కిలి చెడిపోయింది. సత్యప్రభ చేతి అసి పుత్రికను చూడగానే, వాణ్ని ఇంత స్థితికి తెచ్చిన కాముడు మెల్లగా జారుకొన్నాడు. చిరకాల మైత్రి కల క్రోధుడు మాత్రం తన పోషకుని, ఈ సమయంలో వదల లేదు. వాని బలాత్కరణోద్దేశం సత్యప్రభ భీషణ శస్త్రీజ్వాలలో పడి భస్మీభూతమై పోయింది.

ఇప్పుడు వాని భావి కర్తవ్యం మిక్కిలి అసహ్యమై నిలిచింది. పారిపోయిన మహావమానం; యుధ్ధం చేస్తే చంపడమో చావడమో ఒకటి జరిగి తీరాలి. చంపిన, స్త్రీ హత్యా పాతకము, చస్తే సర్వనాశనం! ఆ మదోధ్ధతుడు పారిపోలేక పోయాడు. మిగిలింది యుధ్ధమే. వాడు తన మొలలో నుండి భీకర కరవాలాన్ని తీసిన వాడయ్యాడు.

సత్యప్రభ తృటికాలమైనా వృధా చేయకుండా, సింహిక లాగు వానిపై పడి, సాయుధమైన వాని బాహువును కఠారితో తీవ్రంగా పొడిచింది. వాణ్ని చంపే ఉద్దేశం ఆమెకు లేదు, అలాంటి అభిప్రాయమే ఉంటే, ఆమె వాని హృదయం పైననే పొడిచి ఉండేది. వాని మదం భగ్నం కావాలి, వాని ప్రాణాలు పోకూడదు —ఇదే ఆమె ఉద్దేశం.

సత్యప్రభ ఆ పోటు వేగంతోనే వానిని క్రింద పడత్రోసింది.

ముందే గుప్తంగా పతితుడైనా వీరసింహుడు భూమ్యాకాశాలకు తెలిసేటట్లు సశబ్దంగా పడిపోయాడు. సత్యప్రభ, పడిపోయిన వీరసింహుని పరీక్షించింది. వాడు మూర్ఛపోయి ఉన్నాడు. ఆమె, ముందర వాని చేతిలోని ఖడ్గాన్ని లాక్కొంది. పిమ్మట వాని బాహువు నుండి నిరవధికంగా స్రవిస్తున్న రక్తాన్ని చూచింది. ఆ దృశ్యాన్ని చూడగానే ఆమెను కరుణ ఆవేశించింది. తన్ను తానే నిందించుకొంది. ‘పొడవకుండా, పారిపోయి ఉంటే ఎంత బాగుణ్ణు’ అని లోలోపల నొచ్చుకొంది. ఇంతలో ఆమెకు డొంకల సందులో నుండి కొన్ని పాటలు వినిపించాయి.

పారి పోవగ శక్తి పాదాలకుండ / మార చేయుచు వాని మద ముగ్ధ దృష్టి.

త్రోసి పోవగ శక్తి దోర్లత కుండ /గాసి పెట్టుచు ఘోర గర్జన వలన,

కాలంబు పొడిగింప ఘన వాణి యుండ / మూలంబు దాచుచు ముని వచ్చు వరకు,

సాధుత యెరుగని యోధ ముఖ్యునకు / క్రోధము కలిగించు రోధింప బడుచు,

పటు శతృ శోణిత పలల భోజనను / కటువౌ కఠారిని కాల దూతికను,

నిండు ప్రాణి భూజాన నీవు గ్రుచ్చితివి / చొచ్చెను లోతుగా చురకత్తి చూడ,

చచ్చునో బ్రతుకునో చపలాక్షి ! వాడు, / గాయపు చెట్టాకు కల్కము వేసి,

గాయము కట్టుము గతి గాన గలవు.

ఆ పాటలు ఉన్మత్త సిధ్ధ కవీశ్వరి ‘రాజకాళి’ వని  సత్యప్రభ తెలుసుకొంది. నలుప్రక్కలా చూసింది. రాజకాళి కన్పడ లేదు, కాని ఆమె చెప్పిన ‘గాయపు చెట్టు’ కనిపించింది. ఆమె ఆనందంతో వెళ్లి, ఒడినిండా ఆకులు కోసితెచ్చి, వాటి పసరును వీరసింహుని గాయంపై పిండి, ఆకుల కల్కాన్ని గాయంపై పెట్టి, వాని ఉత్తరీయాన్ని పీలిక చేసి, బాగా కట్టింది. ఇంతకు ముందు ప్రాణాలను అపహరింప చూసిన మారుతుడు ఇప్పుడు చామరగ్రాహి వలె వానిని ఉపచరించాడు. తరువాత సత్యప్రభ ఆశ్రమం లోపలికి వెళ్లి, జల కుంభాన్ని తెచ్చి, నీటిని వాని ముఖంపై జల్లింది. వాడు కండ్లు విప్పకుండానే నోటిని తెరచాడు. సత్యప్రభ పురిసెళ్లతో నీరు పోసింది. వాడు త్రాగాడు, అక్షోభ్య ముని వచ్చి, తనని ఉపచరిస్తున్నాడని వాని భ్రమ!

నీరు త్రాగగానే వానికి తెలివి వచ్చింది. కండ్లు విప్పి చూశాడు.. సత్యప్రభ ముఖం వానికి కన్పడింది. కొన్ని క్షణాల క్రితం ఆ ముఖం వానికి మహామాదకంగా ఉండింది. ఇప్పుడు అది అత్యంత భీషణంగా దర్శన మిచ్చింది.

“హా! రాక్షసీ!” అని ఆ యువకుడు కేక వేసాడు.

“రాక్షసునికి గర్వ భంగమైన పిమ్మట రాక్షసి వెళ్లి పోయింది. ఈమె నీ సుఖ జీవితాన్ని కాంక్షించు నీ చెల్లెలు. నీ కింక భయం లేదు, గాయాన్ని గాయపు చెట్టాకు కల్కము వేసి కట్టి ఉన్నాను. బుధ్ధిమంతుడివై  చిరకాలం బ్రతుకు. మహాముని వచ్చి నిన్ను ఇంటికి పంపగలడు.” అని చెప్పి సత్యప్రభ ఆ చోటును వీడి త్వరిత గమనంతో వెళ్లి పోయింది. వీరసింహుని ప్రాణాల కంటె విలువైన వాని కత్తిని ఆమె తీసుకొనే వెళ్లింది. ప్రియమైన కత్తితో పాటు ఘనమైన మానాన్ని కూడా  పోగొట్టుకొన్న ఆ ఉధ్ధత వీరుడు నిస్సారమైన ప్రాణాలతో శ్వాసిస్తున్నాడు. ఆ ప్రాణాలు కూడా తన శత్రువుచే దయతలచి ఉంచబడ్డాయని ఙ్ఞప్తికి రాగానే, వానిలో ఆవిర్భవించిన లజ్జాధూమం నిర్మల చంద్రికను కప్పి వేసింది.

వానికి దిక్కులు అంధకార మయములై పోయాయి.

[ఈ కథకు అనుబంధంగా ప్రచురించిన బొమ్మలు సత్యప్రభ నవల ఆంధ్రప్రభలో  అచ్చైన ధారావాహిక కోసం బాపు వేసినవి.]

About వాసిష్ఠ

‘వాసిష్ఠ’ అన్నది , అయ్యల సోమయాజుల మహాదేవ శాస్త్రిగారి కలం పేరు. వీరు ‘ నాయన గారి’ కుమారులు. ఆయన రచనలో రమణీయత, మృదుమనోహరమైన భావాలు కనిపిస్తాయి. ఆయన గద్యరచనలోనే కాక, పద్య రచనలో కూడా సిధ్ధహస్తులు. ‘గణపతి స్తవము’, ’భక్త కుచేలుడు’, ’ప్రహ్లాద చరితము’, ’తోటక మాలా దశకం’, ’పార్థ సారధి శతకం’, ’పంచ చామర పంచ రత్నములు’, ’బాల ద్విపద రామాయణము’, ఇత్యాది పద్య రచనలే కాక, చాలా కథానికలు వ్రాసారు.

ఆయన కథానికలలో ప్రముఖమయినవి, ‘వృషాకపి’, ’జనస్థానం’, ’రాచప్పడు’, ’ఆంభ్రుణి’, ’కాత్యాయని’ మొదలయినవి ఆంధ్రప్రభ లోనూ, ‘ఉచ్చిష్ట సోమరసం’ అనే కథ ‘చుక్కాని’ లోనూ ప్రచురించ బడ్డాయి. ’గణపతి,’ ’ఇంద్రుడు’ , ’అగ్ని’, ’సంభాషణము’, ’మృదు కళ’ మొదలయినవి ఆయన వ్రాసిన వ్యాసములు. వీటన్నిటిలో ముద్రింప బడిన వాటి కన్న అముద్రితాలే ఎక్కువగా ఉన్నాయి.

ఈయన తంజావూరు సరస్వతీ మహలు గ్రంధాలయంలో తెలుగు రీసెర్చి పండితునిగా పనిచేసి, ’విప్రనారాయణ చరిత్ర’, ’మైరావణ చరిత్ర’, ’తాళ దశప్రాణ దీపిక’, ఇత్యాది గ్రంధాలను ‘ఎడిట్’ చేసి ముద్రింప చేసారు. ఈయన జననం ఫిబ్రవరి ’1901లో, నిర్యాణం మార్చి 1966 లో.

’సత్యప్రభ’ చారిత్రిక నవలలో మొదటి ముప్ఫై ప్రకరణాలను ’పూర్ణ’ పేరుతో గణపతి ముని రచించగా, తరువాతి ముప్ఫై ప్రకరణాలను వాసిష్ఠ రచించారు.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

6 Responses to సత్యప్రభ – 1

  1. venkat.b.rao says:

    వీరు కలంపేరును ‘వాసిష్ట’ గానే పెట్టుకున్నారా? లేక, ‘వాసిష్ఠ’ గా ఉన్నది పొద్దులో పొరపాటున ‘వాసిష్ట’ గా అచ్చు అయిందా?

    వెంకట్.బి.రావు

    • ఇది టైపు పొరపాటేనండి. ‘మీరు సూచించినట్లు ,‘ వాసిష్ఠ ’ అనేదే సరైనది !
      ఇంకొక పొరపాటు కూడా జరిగింది. — ఆమె ముతకగా ఉన్నా నిర్మలంగా ఉంది. రవిక కూడా — అన్న వాక్యంలో ఆమె ధరించిన చీర ముతకగా ఉన్నా నిర్మలంగా ఉంది — అని ఉండాలి. పొరపాటు జరిగినందుకు చింతిస్తున్నాను– పొద్దు సంపాదకులని జరిగిన తప్పు సరిదిద్దమని అభ్యర్థిస్తున్నాను– శ్రీధర్.ఎ

  2. svirinchi says:

    Is this a real historical story or a fiction based on history or pure fiction?

    • గంటి లక్ష్మీ నరసింహ మూర్తి says:

      This is not a pur fition.Kavyakantha vsiashta muni was a great Indologist.He studied history of Andhra also.He lamented elswhere that he was unable to get sufficient books on Andhra History as he was out of Andhra main land for most of the time.However he new about Srikakulandhra Mahavishnu,for whom a temple is there in Srikakulam(Krishna District).He developed his own story keeping in view the main political and historical events in the ancient society-Murthy

  3. venkat.b.rao says:

    “ఉజ్జ్వలమైన దీపం ఆమె ముఖాన్ని వానికి చక్కగా ప్రదర్శిస్తూంది”

    “…మణిమాల అందరికంటె చక్కనిదని నేను రూపచంద్రునితో వాదించడం కలదు”

    “…గాయాన్ని గాయపు చెట్టాకు కల్కము వేసి కట్టి ఉన్నాను”

    ఎంత హృద్యంగా వున్నాయనిపించినప్పటికీ, ఇలాంటి వాక్య ప్రయోగాలు తెలుగులో సాధారణంగా కనపడవు. సంస్కృత సాహిత్యంలో ఎక్కువగా కనబడతాయి. సంస్కృతంలోనూ నిత్య వ్యవహారంలో ఈ తరహా వాక్యనిర్మాణాన్ని ఊహించలేం, సాహిత్యంలోనే ఇది సాధ్యమవుతుందనుకుంటాను. అందువలన, తెలుగులో ఈ తరహా వాక్య నిర్మాణం, భావాన్ని ముందుగా సంస్కృతంలో ఊహించుకుని, తెలుగులో వ్రాస్తే తయారయిన వాక్యాలన్న భ్రమను కలిగిస్తాయి.

    “నేను (ఫలానా పనిని) చేసి ఉన్నాను”

    “నేను (ఫలానా మాట) చెప్పి ఉన్నాను” లాంటి ప్రయోగాలు తెలుగులో నిత్యవ్యవహారంలోనూ, సాహిత్యంలోనూ కూడా ఇప్పుడు ఊహించలేం.

    1930ల లోనూ, ఇంకా ఆపై ఒకటి రెండు దశకాల దాకానూ, తెలుగు సాహిత్యంలో భాష, వాక్య నిర్మాణాలపై సంస్కృత సాహిత్య ప్రభావం ఏంతగా ఉండిందో తెలుసుకోవడానికి, ఆ కాలంనాటి సాహిత్య భాషను ఆనందించడానికీ ‘సత్యప్రభ’ లాంటి రచనలు కొంత ఉపకరిస్తాయి.

    venkat.b.rao

Comments are closed.