శారదా విజయోల్లాసము – 1

సరస్వతి - పొద్దు పత్రిక

శారద

రాఘవ  :  నమస్సర్వేభ్యః

కామేశ్వర రావు :  రాఘవులకి స్వాగతం

రాఘవ  :  వేదిక ఇదేనాండీ, లేక ప్రచ్ఛన్నంగా ఏమైనా నడుస్తోందా 🙂

చదువరి  : రాఘవ.. వేదిక ఇదేనండి.

రవి :  రాఘవ గారికి స్వాగతం

రాఘవ  :  కామేశ్వరరావుగారూ,రవిగారూ: నమాంసి

కామేశ్వర రావు :  @రాఘవ, అవును మీరు మాంసి అని మాకు తెలుసు 🙂

రాఘవ  :  ఇప్పుడు నేను అమాంసినా నమాంసినా అని ఆలోచించాలి 🙂

రవి :  ఇంకా అమెరికాలో పొద్దు పొడిచినట్లు లేదు

కామేశ్వర రావు :  పొద్దు కాస్త గట్టిగా పొడవాల్సిందా? 🙂

గన్నవరపు వారు : నేను కొద్ది సేపు మాత్రమే పాల్గోగలను. మిత్రులు బహుచక్కని పూరణలు చేసారు. గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి, శ్రీ పండిత నేమాని వారికి నమస్కారాలు.

కామేశ్వర రావు :  అదుగో మూర్తిగారు వచ్చేసారు కాబట్టి అమెరికాలో పొద్దు పొడిచినట్టే! నమస్కారం మూర్తిగారు.

గన్నవరపు వారు : నమస్కారములు కామేశ్వర రావు గారూ

గన్నవరపు వారు : ఈ ఉదయము ముఖ్య కాలాతిక్రమణము లేకుండా సంధ్య వార్చడము జరిగింది !

గన్నవరపు వారు : ఆదిత్య గారూ చక్కని పద్యాలు వ్రాసారు. అభినందనలు !

చదువరి : ఔను అదిత్య గారి పద్యాలు బహు బాగా ఉన్నాయి.

కామేశ్వర రావు :  అధ్యక్షులవారు హఠాత్తుగా కొత్తవారిని సభ్యులని చేసి మాకు పరిచయమే చెయ్యలేదు! 🙂

ఆదిత్య  : ధన్యవాదాలు! అన్నన్నా!  🙂

చదువరి  : 🙂 అధ్యక్షా.. ఉన్నారా?

కామేశ్వర రావు :  అధ్యక్షులవారు ఎక్కడి వెళతారు. ఇదిరవి అస్తమించని పొద్దు సామ్రాజ్యం!

రవి :  ఈశ్వరులకూ, ఆదిత్యులకూ పరిచయం ఇదివరకే ఉంటుందని

చదువరి  : 🙂

 

గన్నవరపు వారు :గిరిగారూ ఈ సారి మీదే ఊపు. దంచేసారు !

గిరి : అవును, ఆదిత్య గారు చిట్టచివరగా వచ్చి చిచ్చుబుడ్లు వెలిగించారు

గన్నవరపు వారు : ఆదిత్య గారూ మిమ్మలను మేరే పరిచయము చేసు కొనండి. నేను వృత్తి రీత్యా వైద్యుడిని. నరసింహ మూర్తి నా పేరు.

గిరి : ఇంతకీ ఆదిత్యగారి పరిచయం?

రవి :  ఆదిత్య పరిచయం రవి గారి బదులు ఆదిత్య గారినే చేసుకోమని కోరుతున్నాను

ఆదిత్య  : పేరు విజయాదిత్య. కామేశ్వరరావుగారి తమ్ముణ్ణి. ఇంతకంటే ఇక్కడ పరిచయం అవసరంలేదనుకుంటా. 🙂

గిరి : మూర్తి గారు,రవిగారు కాస్త కరుణించి ప్రశ్నా పత్రం సులువుగా కూర్చా రీ మాటు

గిరి : ఆదిత్య గారు, మీ చిఱునామలో ఇంటిపేరు లేకపోవడం వల్ల కనిపెట్టలేక పోయాము

గన్నవరపు వారు : నేను సరిగ్గానే ఊహించాను. పెళ్ళి యెప్పుడు చేసు కొంటున్నారు ?

కామేశ్వర రావు :  మూర్తిగారూ 🙂 🙂

ఆదిత్య  : ఖళ్ళ్ ఖళ్ళ్ ఖళ్

కామేశ్వర రావు :  గిరిగారు, మీరిప్పుడున్నది సింగపు ఊరేనా?

గిరి : కామేశ్వరరావుగారు, సింగపూరేనండీ

గన్నవరపు వారు : మిత్రు లెవరైనా మా దిశలో వస్తే మా ఆతిధ్యము స్వీకరించమని విన్నపము. మేము డాలసులో ఉంటాము.

కామేశ్వర రావు :  మూర్తిగారి ఆతిథ్యం అసమానం, దానికి నేను సాక్ష్యం.

గిరి : అయితే, అమెరికా వెళితే పనికల్పించుకుని మరీ వస్తామండీ

గిరి : కామేశ్వరరావు గారు, మీరు విమానాశ్రయంలో కూర్చుని తిన్న దిబ్బరొట్టె మూర్తి గారి వంటింట్లోదేనా

గన్నవరపు వారు : తప్పకుండా! రండి.

ఆదిత్య  : అమెరికా వాళ్ళు ఇండియా గుట్టంతా ఎలా లాగుతున్నారో ఇప్పుడర్థమయ్యింది.:)

గిరి : కామేశ్వరరావు గారు, మీ ఇంట్లో ఇంకా పద్యాలల్లే వాళ్ళెంతమంది ఉన్నారో బయటపెట్టేయండి బాబు

గన్నవరపు వారు : మీకు కూడా దిబ్బరొట్టె పెడతాముగిరిగారూ! ఎవరికైనా తప్పకుండా, రండి !

గిరి : రొట్టె విషయం తెలియకముందే నిర్థారించుకున్నాను, ఈ సారి అమెరికా వస్తే తప్పకుండాను

కామేశ్వర రావు :  గిరిగారు, మా తల్లి చెట్టుకు కాసిన పళ్ళమే మేము!

గిరి : కామేశ్వరరావుగారు, కాస్త వివరిస్తారా..మీ పద్యఫలపరిమళాలు జాలజగద్విదితమే…కాకపోతే ఎన్ని పళ్ళున్నాయన్నది నా ప్రశ్న

కామేశ్వర రావు :  గిరిగారు, చెట్టు ఒకటి. పళ్ళు రెండు 🙂

కామేశ్వర రావు :  మూర్తిగారి మీద నా కంప్లయింటు ఒకటే. వారు ఆతిథ్యము ఇస్తారే కాని స్వీకరించరు 🙂

 

రవి :  మూర్తి గారూ, మీకు నేమాని వారు తెలుసనుకుంటాను

గన్నవరపు వారు :  మీ సింగపురు నుండి భారతదేశము మూడు గంటలలో చేరుతారు. అమెరికా నుండి వెళ్ళాలంటే దిబ్బరొట్టి తప్పక సహకరిస్తుంది. విమానము వాళ్ళ తిండి తినడము కష్టము.

గన్నవరపు వారు : శ్రీ నేమాని వారిని 1975 లో చూసాను. మరలరవి గారి సాయము వలన కొద్ది నెలల క్రితము మళ్ళీ పరిచయము కలిగింది. నా అదృష్టము

గన్నవరపు వారు :రవి గారూ మీరే కదా ఆయనకు నా చిరునామా యిచ్చినది, ధన్యవాదములు

 

గిరి :రవిగారు, సభ చిక్కిపోయి ఉంది ఈ సారి

రవి :  అవును గిరిగారు

శంకరయ్య  : అవునా?

కామేశ్వర రావు :  శంకరయ్యగారికి నమస్కారములు

శంకరయ్య  : నమస్కారం …

గన్నవరపు వారు : నాకు మొహమాటము లేదు కామేశ్వర రావు గారూ మీ ఊరు వస్తే తప్పక వస్తాను.మిత్రులను కలవడము నాకు చాలా యిష్టము

శంకరయ్య  : చింతా వారికి నమస్కారం

రవి :  కామేశ్వరరావు గారి ఆతిథ్యం బావుంటుంది. నాదీ పూచీకత్తు. 🙂

గిరి : శంకరయ్యగారు, నమస్కారం

శంకరయ్య  : నమస్కారమండీ!

శంకరయ్య  : ఇంకా గోష్ఠి ప్రారంభం కాలేదా?

గన్నవరపు వారు : నమస్కారములు గురువు గారూ, రామకృష్ణా రావు గారూ !

రవి :  సరేనండి. ఇక సభ మొదలు పెడదామంటారా?

గిరి : మొదలుపెడదామండీ

కామేశ్వర రావు :  అలాగే

శంకరయ్య  : కానీండి …

శంకరయ్య  :గన్నవరపు వారు వారూ, నమస్కారం!

ప్రార్థన

రవి :  యథావిధిగా శ్రీగణేశ ప్రార్థనతో సభ ఆరంభిద్దాం. చింతావారి కృతి.

శ్రీ గణనాధ! మా మది వసించుమ! విఘ్న వినాశ కారివై,

రాగిలఁ జేసి మా మదులు రమ్య సుచిత్ర కవిత్వ ధారలన్

వేగమె పారఁ జేయుమయ విశ్వ జనీనత పొంగ జేయుచున్.

సాగిలి నీకు మ్రొక్కెదము సర్వ శుభంకర సద్వశంకరా!

చింతా వారు : ఆర్యులందరికీ నమస్కారం.

రవి :  మీ పద్యం టంకించగానే వచ్చేశారు.

కామేశ్వర రావు :  రామకృష్ణారావుగారు, నమస్కారం.

చింతా వారు : ఇప్పటికి మా అమ్మాయి సహకారంతో ప్రవేశించ గలిగాను.

గిరి : విఘ్నేశ్వర స్తుతికదూ, విఘ్నాలు మాయమయిపోయాయి

రవి :  వైష్ణవి మాయ! :))

శంకరయ్య  : (ఆశువు)

సత్కవీంద్ర గణము సాహితీ యజ్ఞమ్ము

చింతా వారు :

చేయుచుంటిమయ్య చిత్ర సుగతి

చేయబూనినారు; చేరి యిటను

విఘ్నములు తొలంగ వేడెద గణనాథ!

పొద్దు పొడిచె నిపుడు ముద్దుగాను.

కామేశ్వర రావు :  పద్యసమ్మేళనం “గణ”నాథుని ప్రార్థనతో మొదలుపెట్టడం ఎంతో ఔచితీమంతం.

ఆదిత్య  : అయితే పూర్తి జనగణమనతో చేద్దాం 🙂

శంకరయ్య  :

ఆరంభింతము సద్గొష్ఠి నిపుడు …..?

చింతా వారు : ప్రీతిగ నటులే.

రవి :  రమ్య సు”చిత్ర” ధారలన్ అన్నారు. అందులో వారి అభినివేశాన్ని, ఈ సభలో ప్రవేశపెట్టిన కొత్త అంశాన్ని ప్రస్తావించడం బావుంది

కామేశ్వర రావు :  భేషుగ! పద్యాల్ సంతత మధుధారలగా

రవి :  శంకరయ్య గారి పద్యం “స” లక్షణంగా ఉంది.

గన్నవరపు వారు : చక్కని స్తుతి. మంచి పద్యము

చింతా వారు : ఎంతైనా శంకరులే

శంకరయ్య  : సంతోషము గలిగించును ….

చింతా వారు :

సంతసమున పలుక నటులె జరుగుటతగదే!

శంకరయ్య  : ధన్యవాదాలు చింతా వారూ …

కామేశ్వర రావు :  చింతా శంకరుల జంటకవిత్వం ఈ సభ ప్రత్యేకం!

గిరి : జుంటకవిత్వం

శంకరయ్య  :కామేశ్వర రావు గారిని ‘ఫాలో’ కాలేదు. మన్నించాలి.

కామేశ్వర రావు :  అయ్యో! మీరు గురువులు. మేమే మిమ్మల్ని అనుసరించాలి

రవి :  మరో పద్యానికి సాగుదాం. చింతా వారిదే శారదాంబ ప్రార్థన

చింతా వారు :

భజియింతుం నిను భావనా జనిత సద్భాగ్యంబువై  శారదా

విజయోల్లాసము గొల్పుమా! సకల సద్విజ్ఞాన సంధాత్రివై

సుజనాభాసిత జాల మేళనమునన్ శోభిల్లుమా! శారదా

విజయోల్లాసము చిద్విలాసమగు నీవే మమ్ము దీవించినన్.

గిరి : అస్తు

చింతా వారు : ఆ శారదాంబ మనలను కటాక్షించును గాక.

కామేశ్వర రావు :  విజయోల్లాసాన్ని యీ పద్యంతో ద్విగుణీకృతం చేసారు!

గిరి : విఘ్ననాయకుని ప్రార్థన, సరస్వతీ దేవి స్తుతి మహిమ వల్ల మరికొంతమంది కవులు ప్రత్యక్షం కావాలి

శంకరయ్య  : భజియింతుం నిను …  ఇక్కడ అనుస్వారం రాకూడదనుకుంటా. ‘భజియింతున్ నిను’ …. లేదా ‘భజియింతున్ వరభావనా జనిత…’ అంటే బాగుంటుందేమో?

చింతా వారు : భజియింతున్నిను

గిరి : శంకరయ్యగారు, నాదీ అదే అనుమానము – అయితే భజియింతున్ అనే చదువుకున్నాను

శంకరయ్య  : అక్కడ టైపాటనుకుంటా.

చదువరి  : టైపాటేమో

గన్నవరపు వారు : శారదాంబ ప్రార్ధన చాలా బాగుంది

శంకరయ్య  : అనుమానం లేదు… అది ‘టైపాటే’!

 

సవరించిన పద్యం:

భజియింతున్నిను భావనా జనిత సద్భాగ్యంబువై  శారదా

విజయోల్లాసము గొల్పుమా! సకల సద్విజ్ఞాన సంధాత్రివై

సుజనాభాసిత జాల మేళనమునన్ శోభిల్లుమా! శారదా

విజయోల్లాసము చిద్విలాసమగు నీవే మమ్ము దీవించినన్.

రవి : గిరిగారు కూడా శారద ప్రార్థన వినిపించాలి

గిరి : చిత్తం

అమ్మా నిన్ను స్మరించి నవ్యరచనావ్యాసక్తి నర్థించు మా

కిమ్మిమ్మైన కవిత్వవాక్సరణి బ్రాహ్మీ దివ్య భావార్థసా

రమ్ముల్ సంకలితాత్మమై పదములన్ రమ్యమ్ముగా పద్యహా

రమ్ముల్ కూర్పు పటుత్వమిమ్ము విజయోల్లాసమ్మునన్ శారదా

చింతా వారు : చక్కని మత్తేభ గమనంతో సాగింది మీ శారదా ప్రార్థన.

చదువరి  : “మాకిమ్ము ఇమ్మైన” -అంతే కదా?

గన్నవరపు వారు :గిరిగారూ మనోజ్ఞముగా ఉంది

గిరి : చదువరి గారు, అంతేనండీ

శంకరయ్య  : అద్భుతమైన ధార! రవి గారు,గిరిగారు చేసిన శారదా ప్రార్థనలు బాగున్నాయి.

రవి :  “అక్షరాణామకారోస్మి” – అని గీతాకారుడు. అకారంతో మంగళకరంగా ఉందండి.

కామేశ్వర రావు :  ఇమ్ము ఇమ్మైన – ఇది లాటానుప్రాసా?

గిరి : lot of ప్రాస అనిపించింది, లాటాను కూడానేమో మీరే చెప్పాలి

కామేశ్వర రావు :  🙂

చదువరి  : పద్యం బాగుందండి.

ఆదిత్య  : రమ్ము రమ్ము మాత్రం ” లోటా ” ను ప్రాస

రవి :  🙂

రవి :  ఇమ్మైన – అంటే అర్థం ఏమిటండి?

గిరి : రవిగారు – ఇంపైన అని

శంకరయ్య  : అనుకూలము, మనోహరము అనే అర్థాలున్నాయి.

శంకరయ్య  : ఇమ్ము శబ్దానికి ..

 

కొత్తపాళి : అందరికీ నమస్కారం

చదువరి  : నమస్కారం కొత్తపాళీ గారూ.

రవి :  కొత్తపాళి గారికి స్వాగతం. కాసేపటి ముందే సభ మొదలయింది. “ఇమ్ము” శబ్దం అర్థం చెబుతున్నారు శంకరయ్య గారు

గిరి, చింతా వారు, కామేశ్వరరావు గారు,గన్నవరపు వారు వారు : నమస్కారం కొత్తపాళీగారు, స్వాగతం.

రవి :  సరేనండి. కొత్తపాళి గారు వచ్చిన వేళ – “కొత్త” అంశం చేబడుతూ-

రవి :  శ్రీచక్రబంధ కందం – చింతా వారి తరపున నేను టంకిస్తున్నాను.

గిరి : ఉటంకించండి

శ్రీ శారదాంబ  శ్రీ  కవి

పోష. యిరవు గొలుపు.  శ్రీ సుబోధన్సుశ్రీ

ధ్యాస నిడును. శ్రీన్ శుభకర!

శ్రీ శారద ధ్యాస యిమ్ము! శ్రీకరసుశ్రీ!

చింతా వారు : ధన్యవారాలు రవీ!

గన్నవరపు వారు : పద్యాలను యిమ్ముగా యిస్తున్నారు కవివర్యులు !

రవి :  ఈ పద్యం తాలూకు చిత్రం ఇక్కడ –

శ్రీచక్ర బంధ పద్యం - పొద్దు

శ్రీచక్ర బంధ పద్యం

గిరి : చింతావారు సునాయాసంగా ఇలాంటి చిత్రకవితలు వ్రాస్తూ ఉంటే ఆశ్చరం వేస్తుంది

కొత్తపాళి : ఆసక్తికరంగా ఉన్నది. శ్రీచక్రబంధము అంటే శ్రీచక్ర ఆకృతిలో ఉంటుందేమో ననుకున్నాను

రవి :  కొత్తపాళి గారు, ఈ చిత్రకవితలకు లక్షణాలు కూడా ఉన్నాయండి. పుస్తకం తిరగెయ్యాలి.

చింతా వారు : నిజమే

శంకరయ్య  :

ఎందులకీ యాలస్యము?

సందేహము వీడి గోష్థి సాగించుడు మీ,

కందరకు నేను చేసెద,

వందనశతములను పద్యవర్షము గురియన్.

శంకరయ్య  : బంధ, గర్భ కవితా విశారదులు వారు.

కామేశ్వర రావు :  అయితే శ, ష, స లకి ప్రాస కుదురుతుందన్న మాట.

చింతా వారు : ఊష్మవిశ్రాంతి

చింతా వారు : కాదు కాదు

చింతా వారు : ష స

గిరి : నాదొక చిన్న అనుమానము మూడవ పాదంలో శ్రీన్ ఉన్నది, చక్రములో కూర్చేటప్పుడు శ్రీకారాన్ని ద్రుతప్రకృతిని విడగొట్టవచ్చా

రవి :  నాకూ ఈ అనుమానం వచ్చియున్నది

చింతా వారు : చతురంగ బంధంలో పొల్లక్షరానికి ఒక గడి

చింతా వారు : అలాగే శ్రీచక్ర బంధంలో కందానికింతకంటే మార్గం కనబడలఏదండి.

రవి :  కందం – లిమిటేషను అనుకుంటాను. గీతికి సరిగ్గా సరిపోతుంది.

చింతా వారు : ఔనండి.

గిరి : అదే అనుకున్నాను, ఎలాగైతేనే చక్రాన్ని ముందుకు లాగేసారు చింతావారు

గిరి : రామకృష్ణులు కదా, చక్రం త్రిప్పడం వారికేమంత కష్టమైన పని కాదు

చదువరి  : గిరి.. 🙂

చింతా వారు : మాకు కరంటు కష్టాలు మొదలయ్యాయి.

శంకరయ్య  : నాదీ అదే సమస్య …

రవి :  నాకూనూ 🙂

కామేశ్వర రావు :  ఆంధ్రదేశంలో కరెంటు సమస్య ఎప్పుడూ “కరెంటే” 🙂

చింతా వారు : మాకు పోయింది. యూపీయస్ ఆగిపోతోంది.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.