విలక్షణ కథా రచయిత – త్రిపుర

 

సెయింట్‌వో, భక్తుడివో, భగవంతానివో ఆ కళ్ళు,

ఏర్పోర్ట్ లాంజ్‌లలో, ఓడరేవుల వీడ్కోలులో

ఎడతెగకుండా కలుసుకునే  ఎదురుచూపులు.

గుడ్డిదీపం వెలుగులో, పేరు తెలీని స్టేషన్‌ లో

అర్ధాంతరంగా జీవితపు అంతిమ నిష్క్రమణ.

అలోచనలు ఆగిపోదగ్గచోటు..

అన్వేషణ ఆగి మరింత వేగంతో కదిలే హాల్టు … త్రిపుర

 

– స్వాతికుమారి బండ్లమూడి

 

 


త్రిపుర అసలు పేరు: రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (RVTK Rao). 2-9-1928 న గంజాం జిల్లా పురుషోత్తమపురంలో (ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది) జన్మించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీషు లిటరేచర్ చదువుకున్నారు. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా మదనపల్లి, జాజ్ పూర్, బర్మా ఇంకా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాల్లో పని చేసారు. రిటైరై గత ఇరవైయేళ్ళుగా విశాఖపట్నంలో ఉంటున్నారు.

“త్రిపుర కథలు” అనే కథా సంకలనం, “బాధలు – సందర్భాలు”, “త్రిపురకాఫ్కా కవితలు” కవితా సంకలనాలు, segments అని ఆంగ్ల కవితలు (వీటిని వేగుంట మోహనప్రసాద్ తెలుగులోకి అనువదించారు) పుస్తకాలుగా వచ్చాయి. అనితర సాధ్యమైన రీతిలో మనిషి అంతరంగపు లోతుల్ని చిత్రించి కేవలం పదిహేను కథలతో తెలుగు కథకి ఒక కొత్త Dimension తెచ్చిన కథకుడు త్రిపుర. కథలో autobiographical elements తో పాటు ఒకరకమైన confession ఉండాలని బలంగా నమ్ముతారు. తను రాసిన కథల్లో “భగవంతం కోసం”, “జర్కన్” తనకి ఇష్టమైనవట. మదనపల్లిలో ఉండగా త్రిపుర జిడ్డు కృష్ణమూర్తికి శిష్యుడు కూడా!

——————–

లైట్ హౌస్

                                          -మూలా సుబ్రహ్మణ్యం

ఆకాశాన్ని అందుకోలేక

చతికిలపడే అలల మధ్య

అగాధమంత నిశ్శబ్దం

మసక చీకట్లో

ఇసక రేణువుల

దాహం తీరదు

* * *

దూరంగా

ధ్యానముద్రలోకి

డాల్పిన్ నోస్

కాంతి వలయాలు

విరజిమ్ముతూ

లైట్ హౌస్

తడుముకునే పడవలు

సంకేతాన్నందుకుని

బింకంగా ముందుకు..

* * * *

తీరమెంత

దూరమైతేనేం?

ఇన్నాళ్ళకి నాక్కూడా

లైట్ హౌస్ దొరికింది

త్రిపుర గారూ..

కలుద్దాం మళ్ళీ!

(త్రిపుర గారిని మొదటి సారి కలిసిన సందర్భంగా…)
——————————————-

సెప్టెంబరు 2 న విలక్షణ కథారచయిత త్రిపుర గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన కథ జర్కన్‌ ను పొద్దు పాఠకులకు సమమర్పిస్తున్నాం. అనుమతించిన త్రిపుర గారికి కృతజ్ఞతలు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.