మృతజీవులు – 34

అతనికి అడుగడుగునా ఆకర్షణలు ఎదురై, నోరూరుతున్నదన్నమాట! కాని అతను వేచి ఉండాలి. కనక అతని స్థితి ఆలోచించుకోండి, ఒక వేపు పుచ్చకాయా, సామన్‌ చేపా, ఇంకోవేపు “రేపు” అనే తాపమూ అన్నమాట. ’తరవాత వాళ్ళేమైనా చెయ్యనీ, నేను కమిటీకి వెళ్ళి, అధికారులందర్నీ ఒక కొలిక్కి తెస్తాను. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటాను’, అనుకున్నాడు.

వాడు నిజంగా వివేకహీనుడే, బుర్రలో జ్ఞానం లేదు గాని వల్లమాలిన సాహసం ఉంది, తెలిసింది కాదూ? ఇంకేం కమిటీ వద్దకు వెళ్ళాడు. ‘ఏం మళ్ళీ వచ్చావు? అదివరకే చెప్పాంగా? ‘  అన్నారు. ‘ఇక నాకు జరగదు. నాకు కట్లెట్లు కావాలి, ఫ్రెంచి ద్రాక్ష సారాయి కావాలి. నేను థియేటరుకు పోయి వినోదం చూడాలి – తెలిసింది కాదూ…’ అన్నాడు. ‘అందుకేమీ చేసేది లేదు; నువు ఓర్పు వహించాలనమాట. ప్రస్తుతానికి గడవటానికి కొంత ఇచ్చాం. ఉత్తరువులు వచ్చాక, నీకు తగిన పింఛను రాకపోదు. మన రష్యాలో అర్హుడైనవాడికి పరిగణన లేకుండా పోవడమనేది జరగదు.  కాని, నువు కట్లెట్లలోనూ, థియేటర్లలోనూ ఓలలాడదలిస్తే నన్ను క్షమించాలి. దానికయే ఖర్చు నువే సంపాదించుకోవాలి’ అన్నాడు డైరెక్టరు.

కాని మన కపేయ్కిన్‌ కు ఈగ కుట్టినట్టుకూడా లేదు. వాడు పెద్ద గలాటా చేసి అందరికీ బాగా అందించాడు. సెక్రటరీలను, గుమస్తాలనూ అందరినీ పడతిట్టేశాడు. ’మీరు అలాటివాళ్ళు, ఇలాటివాళ్ళు, మీ బాధ్యత మీకు తెలీదు’ అంటూ అందరినీ కడిగివదిలిపెట్టాడు. ఇంకో డిపార్టుమెంటునుంచి ఒక జనరలు చక్కా వచ్చాడు. ’అయ్యా, వీడు ఆయనను కూడా తగిలాడు. అల్లరి అల్లరి చేసేశాడు. అలాటి ముష్టి వెధవను ఏం చేసేట్టూ?’ గట్టి చర్యలు తీసుకోవలసి ఉంటుందని డైరెక్టరు గ్రహించాడన్నమాట. ‘సరే, మేమిచ్చినది నీకు చాలలేదు గనక, నీ కేసు తీర్మానమయేదాకా మర్యాదగా ఆగగదలచలేదు గనక నీ బస మార్చేస్తాను. ఎవడురా అక్కడ? వీణ్ణి తీసుకుపోయి బొక్కలో నెట్టండి’ అన్నాడు.

మనిషి వాకిలి దగ్గర హాజరులోనేఉన్నాడు, తెలిసింది కాదూ? ఏడడుగుల మనిషి, ఇంతలావు పిడికిలి, కేవలం దంత వైద్యుడనుకోండీ.. ఇంకేం మన దాసరినీ, ఆ భటుణ్ణీ ఒక బండిలో ఎక్కించారు; ‘పోనీ, బండి ఖర్చు తప్పింది; అదే శానా’ అనుకున్నాడు కపేయ్కిన్‌. వాడు బండిలో పోతూ ‘ఇంకేం, నా ఖర్చు నన్నే చూసుకోమన్నారు గాదూ? అలాగే చూసుకుంటాను! ‘ అనుకున్నాడు. వాణ్ణి ఎలా తీసుకుపోయారో, ఎక్కడికి తీసుకుపోయారో నరమానవుడికి తెలీదు. కాప్టెన్ కపేయ్కిన్‌ జాడలు కాలగర్భంలో కలిసిపోయాయి. తెలిసింది కాదూ? కవులు చెప్పినట్టు వాడు అవ్యక్తంలో లీనమైపోయాడు; అయ్యా ఒక్క విషయం మనవి చెయ్యనివ్వండి, ఈ కథ యొక్క అసలు కీలకమేమంటే కపేయ్కిన్‌ మాయమైన రెండు నెలలకు ర్యజాన్‌ అడవుల్లో ఒక బందిపోటు ముఠా వెలిసింది. ఏమిటనుకున్నారో అయ్యా.. ఆ దొంగలముఠా నాయకుడు మరెవ్వరో కాదు……”

పోలీసు అధిపతి చప్పున అడ్డుతగిలి, “క్షమించాలి, ఇవాన్‌ అంద్రేయివిచ్, కాప్టెం కపేయ్కిన్‌కు ఒక చెయ్యీ, కాలూ లేవని మీరే అన్నారుగదా. మరి చిచీకవ్‌కు….” అన్నాడు.

పోస్టుమేస్టరు గట్టిగా అరిచి, నుదుటిమీద కొట్టుకుని, అందరు వింటుండగా బహిరంగంగా తాను గొర్రెనని ఒప్పుకున్నాడు. కథాప్రారంభంలోనే తనకీ సంగతి యెందుకు తట్టలేదో తెలియకుండా ఉందనీ, రష్యనులకు అంతాఅయాక జ్ఞానోదయ మవుతుందన్న సామెత అక్షరాలా నిజమనీ ఆయన అన్నాడు. అయితే మరొక నిముషం గడిచాక ఆయన తెలివిగా తప్పించుకోజూస్తూ, ఇంగ్లండులో కృత్రిమ అంగాలు అద్భుతంగా తయారు చేస్తున్నారనీ, ఎవరో కృత్రిమమైన కాళ్ళు కనిపెట్టినట్టు పేపర్లో వచ్చిందనీ, ఒక్క రహస్యపు మీట నొక్కితే చాలు, అవి మనుషులను ఎటో తీసుకుపోయి మాయం చేసేస్తాయనీ అన్నాడు.

కాని చిచీకవ్‌ కాప్టెన్‌ కపేయ్కిన్‌ అయిఉంటాడన్న విషయం అందరికీ అనుమానంగానే తోచింది. పోస్టుమాస్టరు కొంచం పప్పులో కాలువేశాడని వారు అనుకున్నారు. అయితే తగ్గిపోవడం ఏమాత్రమూ ఇష్టంలేక పోస్టుమాస్టరు చేసిన సూచనతో ఉత్సాహం పొందినవాళ్ళై, అంతకంటే కూడా అసంగతమైన సూచనలు చేశారు. వారు చెసిన ప్రజ్ఞాన్వితమైన సూచనలలో అతివిచిత్రమైనది ఒకటి ఏమిటంటే, చిచీకవ్‌ మారువేషంలో ఉన్న నెపోలియన్‌ అయిఉంటాడని! రష్యా యొక్క ఘనతా, విస్తృతీ చూసి ఎంతోకాలంగా ఇంగ్లీషువాళ్లకి కన్నెర్ర ఉందట – ఎన్నోసార్లు వ్యంగ్య చిత్రాలలో ఒక ఇంగ్లీషువాడు రష్యావాడితో సంభాషిస్తున్నట్టు చిత్రించారు; ఇంగ్లీషువాడు చేతిలో పట్టుకున్న తాడుకు ఒక కుక్క ఉన్నది. ఆ కుక్క నెపోలియనుట: “చూసుకో, నాకు గనక కోపం వచ్చిందంటే, ఈ కుక్కను ఉసిగొల్పుతాను! ” అంటాడు ఇంగ్లీషువాడు. ఒకవేళ ఇప్పుడు ఇంగ్లీషు వాళ్ళు నెపోలియనును సెంట్‌ హెలీనా ద్వీపం (ఖైదు) నుంచి విడిచిపెడితే అతను నిజంగా చిచీకవ్‌ కాకుండానే, చిచీకవ్‌లాగా వేషం వేసుకుని రష్యా అంతా తిరుగుతున్నాడేమో.

అధికారులు ఇదంతా పూర్తిగా విశ్వసించలేదనుకోండి; అయినా వారు ఆలోచనా నిమగ్నులై, ఎవరిమటుకు వారు వితర్కించుకుని, చిచీకవ్‌ను పక్కకుతిప్పి చూస్తే చాలావరకు నెపోలియన్ చిత్తరువులాగానే ఉంటాడని నిశ్చయించుకున్నారు. 1812 లో యుద్ధంలో పాల్గొని, నెపోలియనును స్వయంగా చూసిన పోలీసు అధిపతి, నెపోలియన్‌ చిచీకవ్‌ కన్న ఎత్తుండడనీ, ఆకారంలో నెపోలియన్ లావుగా ఉంటాడనడానికి వీలులేదుగాని, సన్నటివాడుమాత్రం కాదని ఒప్పుకుతీరవలసి వచ్చింది. బహుశా, పాఠకులలో కొందరు ఇది అసంభావ్యం అనగలరు; అత్యంత అసంభావ్యమని రచయిత వారితో ఏకీభవించడానికి సిద్ధంగా ఉన్నాడు; కాని దురదృష్టవశాత్తూ ఇదంతా ఇలాగే జరిగింది. చిత్రమేమిటంటే ఈ నగరం ఎక్కడో అడవుల మధ్య ఉన్నది కూడా కాదు, రెండు రాజధానులకూ దగ్గరిలో వున్నదే కూడానూ. అయితే ఇదంతా జరిగే నాటికి ఫ్రెంచి వాళ్లను తరిమికొట్టి ఎంతోకాలం కాలేదు. ఆరోజుల్లోమా భూస్వాములూ, అధికారులూ, వర్తకులూ, దుకాణదారులూ, అక్షరాస్యులూ, చివరకు నిరక్షరులైన రైతులూ కూడా ఎనిమిదేళ్లపాటు ఫక్తు రాజకీయవేత్తలై పోయారు. “మాస్కో వార్త”, “మాతృదేశరవి” పత్రికలను కసిగా చదివేవారు, అవి ఆఖరు పాఠకుడి చేతికి వచ్చేసరికి పీలికలు, వాలికలూ అయి ఉండేవి, ఇంకెందుకూ పనికి వచ్చేవి కావు; “ఓట్ ధాన్యం ఎలా అమ్ముతున్నారో?” , “నిన్న పడ్డ మంచులో ఏమైనా కాలక్షేపం చేశారా? “, “పత్రికలో వార్తలేమిటి? “, “నెపోలియనును ద్వీపంనుంచి మళ్ళీ వదిలెయ్యాలా?” అని ప్రశ్నించేవారు.

వర్తకులకు ఈ విషయం చెడ్డభయంగా ఉండేది. ఎందుకంటే మూడేళ్ళుగా ఖైదులో ఉన్న దైవజ్ఞుడొకడు చెప్పిన జోస్యాన్ని వారు పూర్తిగా నమ్మారు. ఈ దైవజ్ఞుడు ఎక్కడనుంచి వచ్చాడో ఎవరికి తెలియదు; ఆయన అట్టచెప్పులూ, గొర్రెతోలు దుస్తులూ, ముక్కి చేపల కంపుతో సహా ఊడిపడి నెపోలియన్‌ క్రీస్తు శత్రువనీ, సప్తసముద్రాల అవతల షష్టప్రాకారాల లోపల రాతికి గొలుసుకట్టి అతన్ని కట్టి ఉంచారనీ, కాని అతను కాలక్రమాన ఆ గొలుసు తెంచుకుని వచ్చి లోకమంతా జయిస్తాడనీ చెప్పాడు. ఇటువంటి జోస్యం చెప్పినందుకు అతన్ని తగినవిధంగా ఖైదులో పెట్టారు కాని అతను చేయవలసినంతా చేసి, వర్తకులను మభ్యపెట్టేశాడు. తరవాత ఎంతో కాలానికి వ్యాపారం లాభసాటిగా ఉన్నప్పుడు కూడా, వర్తకులు టీ తాగటానికి హోటలుకు వెళ్ళినప్పుడు క్రీస్తు శత్రువుగురించి మాట్లాడుకునేవారు. అధికారులలోనూ, పెద్ద తరగతి వారిలోనూ చాలామంది ఈ సంగతి మరచిపోలేకపోయారు. ఆ రోజులలో ఫాషనులో ఉన్న మిస్టిసిజం వలలో దగులుకుని వారు నెపోలియను నామాక్షరాలలో కూడా వారు గూడార్ధాలు, మాంత్రిక సంఖ్యలు కనిపెట్టారు. అందుచేత అధికారులు అదే ధోరణిలో ఆలోచించారంటే అందులో ఆశ్చర్యం లేదు; అయితే వారు త్వరలోనే కళ్ళు తెరిచి, తాము పెడతోవను పోతున్నామని గ్రహించి, ఇదంతా అర్ధంలేనిదని తెలుసుకున్నారు. వారు ఆలోచించి ఆలోచించి, చర్చించి చర్చించి, చిట్టచివరకు నజ్‌ద్రోవ్య్ నే మళ్ళీ సమగ్రంగా ప్రశ్నించటం వల్ల నష్టం ఉండదని నిర్ధారణ చేసుకున్నారు. చచ్చిపోయిన వాళ్లను గురించిన ప్రసక్తి మొదట తెచ్చినవాడు నజ్‌ద్రోవ్య్. అతనికీ, చిచీకవ్‌కూ మంచి స్నేహమని కూడా చెప్పుకున్నారు, అందుచేత నజ్‌ద్రోవ్య్‌కు అతని జీవిత వివరాలు కొంతవరకైనా తప్పక తెలిసి ఉండాలి, అందుచేత నజ్‌ద్రోవ్య్‌ ఏమి చెబుతాడో తెలుసుకోవాలని నిర్ణయం జరిగింది.

అధికారులైన ఈ పెద్దమనుషులు వింతవ్యక్తులు, ఆమాటకు వస్తే, ఇంకే వృత్తిలో ఉన్న పెద్దమనుషులైనా అంతే. నజ్‌ద్ర్యోవ్ అబద్ధాలకోరని వారికి స్పష్టంగా తెలుసు, అతను ఎంత అల్పవిషయం గురించి ఏది చెప్పినా నమ్మటానికి లేదు; అయినా వీళ్ళు అతన్ని ఆశ్రయించారు ! చాతనయితే మనిషితత్వం వివరించండి ! మనిషి భగవంతు డున్నాడని నమ్మడుగాని, తన ముక్కు గోక్కుంటే చచ్చిపోతానని నమ్ముతాడు; స్వచ్ఛంగా, నిర్మలంగా, అరటిపండు వలిచినట్టున్న కవిత్వాన్ని తోసిపారేస్తాడు, వాస్తవాన్ని కెలికి, వికృతం చేసి, కశ్మలం చేసిన ధూర్తుడి రచనలమీదికి ఎగబడి, ఆనంద పారవశ్యంతో, “ఆహా, ఇదే నిజమైన కవిత్వం, హృదయమర్మాలను ఆకళించుకున్న రచన !” అని కేకలేస్తాడు. బతికున్నన్నాళ్ళు డాక్టర్లను తృణీకరించి చివరకు ఉమ్మిరాచి మంత్రంవేసే అలగా స్త్రీ వద్దకుపోయి చికిత్సపొందుతాడు. ఇంకానయం, తన చికిత్సకు అడ్డమైన దినుసులన్నిటితోనూ ఔషధం తయారుచేసి అదే తనకు సరియయిన మందనుకుంటాడు, ఎందుకో దేవుడికే తెలియాలి.
అధికారులకు కొంత సమర్ధన లేకపోలేదు. నిజానికి, వారు ఇరుకునపడిపోయారు. నీటిలో మునిగేవాడు గడ్డిపోచనైనా పట్టుకుంటాడంటారు; గడ్డిపోచ ఒక ఈగనుకూడా రక్షించలేదని గ్రహించే అవకాశం వాడికి ఉండదు, తాను నూటయాభై, నూటఅరవై పౌనుల బరువుండికూడా గడ్డిపోచను పట్టుకుంటాడు. అలాగే మన మిత్రులు నజ్‌ద్ర్యోవ్‌ను పట్టుకున్నారు. వెంటనే పోలీసు అధిపతి అతన్ని సాయంకాలం పార్టీకిరమ్మని ఆహ్వానిస్తూ ఒక చీటీరాశాడు. పెద్దబూట్లూ, ముచ్చటగొలిపే ఎర్రని బుగ్గలూగల ఒక పోలీసువాడు తక్షణమే కత్తిమీద చెయ్యిపెట్టుకుని నజ్‌ద్ర్యోవ్ బసకు పరుగెత్తివెళ్ళాడు. నజ్‌ద్ర్యోవ్ అతి ముఖ్యమైన పనిమీద ఉన్నాడు. అతను గది దాటివచ్చి నాలుగు రోజులయింది, లోపలికి ఎవరినీ రానివ్వటంలేదు, కిటికీ ద్వారా భోజనం లోపలికి తీసుకుంటున్నాడు; అతను చిక్కి, పాలిపోయాడుకూడానూ. అతను చేస్తూ ఉన్నపని అత్యంతదీక్ష అవసరమైనటువంటిది; అనేకవందల పేకముక్కలలోనుంచి సులువుగా గుర్తించగల రంగును, మిత్రుడులాగా ఆదుకునేదాన్ని, తయారుచేయటం. కనీసం ఇంకొక రెండు వారాలదాకా అతనికీ పనిఉంటుంది. ఇంతకాలమూ తర్ఫీరి ఒక మాస్టిఫ్‌జాతి కుక్కపిల్లను ఒక ప్రత్యేకమైన బ్రష్‌తో దువ్వుతూ, రోజుకు మూడుసార్ల చొప్పున సబ్బుతో నీళ్ళు పోస్తున్నాడు.
తన ఏకాంతం భంగమయేసరికి నజ్‌ద్ర్యోవ్ మండిపడి, మొదట్లో పోలీసువాణ్ణి వెళ్ళి ఏట్లో పడమన్నాడు, కానీ చీటీ చదువుకున్నాక, పేకాడటానికి అనుభవం లేనివాడొకడున్నాడనీ, తాను డబ్బు గుంజవచ్చుననీ తెలిసి, అతను గది తలుపు తాళంపెట్టి, ఏదోవిధంగా దుస్తులు వేసుకుని బయలుదేరాడు. నజ్‌ద్ర్యోవ్ చెప్పిన విషయాలూ, ఊహలూ అధికారు లనుకునందానికి పూర్తిగా విరుధ్ధంగా ఉండటంచేత వారనుకున్నదంతా తారుమారయింది. అతనికి అష్పష్టత అన్నది పనికిరాదు, వాళ్ళ ఊహలు ఎంత అస్పష్టంగానూ, పిరికిగానూ ఉన్నాయో అతనివి అంత రూఢిగాను, ఖండితంగానూ ఉన్నాయి. ప్రతి ప్రశ్నకూ అతను తడువుకోకుండా సమాధానం చెప్పాడు; అనేకవేల రూబుళ్ళు ధారపోసి చిచీకన్ చచ్చిన మనుషులనుకొన్నట్టు అతను బల్లగుద్దిచెప్పాడు, అమ్మితే ఏమన్న ఉద్దేశంతో తాను అమ్మానన్నాడు. అతను గూఢచారా, ఏమైనా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడా అన్న ప్రశ్నకు నజ్‌ద్ర్యోవ్ అతను గూఢచారేనన్నాడు; తనతో బడిలో చదువుకునేటప్పుడు కూడా, అతన్ని చాడీఖోరని పిలిచేవాళ్ళనీ, తానూ ఇతర బడిపిల్లలూ మెత్తగా తన్నేసరికి అతని కణతలకు రెండువందల నలభై జలగలను పట్టించవలసి వచ్చిందన్నాడు. అంటే, అతను నలభయ్యే అందామనుకుంటే అదికాస్తా ఎలాగో రెండు వందల నలభై అయి ఊరుకుంది. అతను దొంగనోట్లు తయారుచేసే మనిషా అన్న ప్రశ్నకు నజ్‌ద్ర్యోవ్ అవునని సమాధానం చెప్పి, చిచీకన్ సమర్థతకు ఒక నిదర్శనం కూడా చెప్పాడు; అతని ఇంట్లో ఇరవైలక్షల రూబుళ్ళ దొంగనోట్లున్నట్టు తెలిసి ఇంటికి సీలువేసి, ఇద్దరేసి సిపాయిలను ఒక్కొక్క వాకిలి దగ్గరా కాపలా పెట్టారట, తెల్లవారేలోపల అన్ని నోట్లూ మార్చేశార్ట. మర్నాడు సీళ్ళుతీసి చూసేసరికి నోట్లు మంచివిగా మారి ఉన్నాయట … చిచీకన్ గవర్నరు కుమార్తెను లేవదీసుకుపోయే ఉద్దేశంలో ఉన్నాడా, అతనికి తాను ఈ విషయంలో సహాయపడుతున్నమాట నిజమేనా అన్న ప్రశ్నకు నజ్‌ద్ర్యోవ్ తాను సహాయపడుతున్న మాట నిజమేనన్నాడు, తన సహాయం లేకుండా ఏమీ జరిగిఉండేది కాదన్నాడు. ఈ మాట అన్నాక అతనికి తాను అనవసరమైన అబద్ధం ఆడాననీ, ఇందువల్ల తనకే అపాయం కలగవచ్చుననీ అనిపించింది, అయితే తన నోటికి కళ్ళెం వేసుకోలేక దాని చిత్తం వచ్చినట్టు పోనిచ్చాడు.అతను నోటిని అదుపుచేసుకోలేకపోవటానికి కారణమేమంటే అతని ఊహకు ఎన్నో చిత్రమైన వివరాలు స్ఫురించాయి, వాటిని వృథాచేయటం అతనికి సాధ్యం కాకపోయింది. ఉదాహరణకు, వివాహపు ఏర్పాట్లుజరిగిన చర్చిగల గ్రామంపేరు త్రుఖ్మచేప్క, పురోహితుడి పేరు ఫాదర్ సిదోర్; ఆయన పెళ్ళి చేసినందుకు డెభ్భైఅయిదు రూబుళ్ళు తీసుకుంటాడు, ఇంకా ఎక్కువ కావాలనేసరికి నజ్‌ద్ర్యోవ్ భయపెట్టాడు. మిఖాయిల్ అనే ధాన్యపు వర్తకుడికీ, ఇంకో పిల్లకూ చట్టవిరుద్ధంగా పెళ్ళిచేసినసంగతి పొలీసులకు రిపోర్టిస్తానన్నాడు; వధూవరులకు తన బండి వాగ్దానం చేసి మజిలీలలో గుర్రాల మార్పిడి కి కూడా ఏర్పాటు చేశాడు.
This entry was posted in కథ and tagged . Bookmark the permalink.