మీ కందం – పారిజాతాపహరణములోని యొకకందము

తెలుగుపద్యాలలో కందానికి ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. కవి అనిపించుకోవాలనుకొనే వాడు పాఠకులకు కందకందాయాలు తప్పక అర్పించుకోవలసిందే. క్రొత్తగా కవితలు, పద్యాలు అల్లేవారిని కాస్తోకూస్తో బెంబేలెత్తించేటట్టు కనబడే లక్షణాలు కందానికి ఉన్నాయి. ఆ భయాన్ని వీడి ముందుకు సాగితే కందాల్ని సులభంగా అల్లుకుపోవచ్చు. అంచేత ఏ కావ్యాన్ని తీసుకున్నా పదిపద్యాల కొకమాఱు కందము తగలకపోదు. చతుర్మాత్రగణ ప్రభావము వల్లనో, నిషిధ్ధ జగణము వల్లనో, పాదాంత్య స-లగలు చెలఁగుట వల్లనో కందం నడకకి అందం చేకూరింది. అలాంటి కందపద్యాలలో నచ్చినది ఒక్కటి ఏరి చూపడమంటే కష్టమే. అందుకే ఈ మధ్యకాలంలో చదివిన కావ్యంలోంచి గుర్తున్న కందాన్ని ఉటంకించాలని నిర్ణయించుకున్నాను.

పారిజాతాపహరణము ప్రసిధ్ధకావ్యం. మన తెలుగువారికే తెలిసిన సత్యభామ తొల్దొలుత ఈ కావ్యంలోనే రూపుదాల్చిందేమో. తెలుగింటి సత్యభామలో పతిభక్తికన్నా పతిని కను సన్నల త్రిప్పుకొనగలగే చక్కదనమున్నదని నిక్కూ, మిగతా రాణులకన్నా భర్త తనపట్ల అధికానురక్తుడై ఉన్నాడని తెలిసిన టెక్కూ ఎక్కవగా కనిపిస్తాయి. నే చెప్పబోయే పద్యం తిమ్మన గారు సత్యభామ చేత చెప్పించినది.

ఇక పద్యం విషయానికి వస్తే, నారదుడు పారజాత పుష్పాన్ని కృష్ణునికి ఇచ్చాడు. అటుపై కలహాశనుడనే పేరు నిలబెట్టుకోడానికా అన్నట్టు, ఆ పూవును కృష్ణునిచేత రుక్మిణికి ఇప్పించాడు. రుక్మిణికి ఆ పుష్పప్రాసశ్త్యాన్ని వివరించి చివరలో, ’ఇదిగో తానేదో అందఱికన్నా ఎక్కువదాననని నిక్కుతున్నదే ఆ సాత్రాజితి, ఆమె కూడా ఇక నీ ముందు బలాదూర్ చూసుకో’ అని చేటుల చాటచెవుల బడేలా ఊది వెళ్ళాడు. ఈ సంఘటనల నుండి కృష్ణుడు తేరుకొని సత్యభామ సదనానికి చేరుకొనే లోపుగా ఒక పరిచారిక ఆగమేఘాల మీద పితూరీ మోసేస్తుంది. జరగవలసినదంతా జరిగిపోతుంది. ఈ ఘట్టాలన్నిటిలోనూ నువ్వా నేనా అనే విధంగా ఉంటాయి పద్యాలు.

మచ్చుతునక నారదుడు రుక్మిణికి చెప్పిన ఈ కందము.
క.

అలరుంబోఁడుల లోపల,

నలరుం బోఁడుములు నీకు నగ్గలమగుచున్

దలపూ వాడక యుండుము,

తలపూవు ధరించి వికచతామరసాక్షీ.

ఇక నే చెప్పదలచుకున్న కందిమిదిగో.
క.

ధనమిచ్చి పుచ్చుకొన్నను,

మనమున నోర్వంగ వచ్చు మగఁ డింతులకున్

జనవిచ్చి పుచ్చుకొన్నను,

మన వచ్చునె యింక నేటిమాటలు చెలియా

(అంటే, ధనమిచ్చి తిరిగి తీసుకుంటే ఓర్చుకోవచ్చు కానీ, అనురాగము చూపినవారు ఎదురు తిరిగితే ఓర్వగలమా)

చనువిచ్చిన తరువాత ఆ చనువును ఆసరాగా తీసుకొన్నవారు ఏదైనా తప్పుచేస్తే బాధకలగడం సహజం. ఎవరిపరంగా చూసినా ఇది నిజమే. సత్యభామకూడా అలానే అనుకుంది. తన ప్రేమను కృష్ణుడు కించపఱచినాడని ఆమె భావన. అలాంటప్పుడు ఈ పద్యంలో ప్రత్యేకత ఏమిటి? నాకు తట్టిన విషయాలు వివరిస్తాను. సత్యభామ వాక్కులో సహజస్వాభావికం కాని దైన్యము ఈ పద్యంలో కనిపిస్తుంది. భర్త తనను తక్కువ చేసాడని అనుమానము కలిగితే సవతులలాగ ఊరుకొనే స్వభావం కాదు సత్యభామది. మరి అలాంటప్పుడు ఈ దైన్యత ఎక్కడిది? తెలియాలంటే పితూరీ మోసిన చెలికత్తె సత్యభామని కలిసిన క్షణము నుంచి చెప్పుకు రావాలి.

చేటి మాటలు వినగానే మన కథానాయకి త్రాచుపాములా బుసకొట్టింది, భగ్గున మండే అగ్గిలాగ దిగ్గునలేచి నిలుచుంది, వేడివిషం లాంటి తనబాధను వెళ్ళగ్రక్కింది.
ముందు నారదుణ్ణి తూలనాడింది. అమరపురినుండి పువ్వు తెచ్చాడు సరే, కృష్ణునికి ఇచ్చాడు సరే, సమయానికి రుక్మిణి పక్కనుండటం చేత తప్పని పరిస్థితులలో కృష్ణుడు ఆ పువ్వును రుక్మిణికి ఇచ్చాడు సరే, రుక్మిణి కూడా తానే తగినదాన్ని అన్నట్టు తీసుకుంది సరే.. మరి మాటల్లోకి అనవసరంగా నన్ను లాగడమెందుకు, అని కోపగించుకుంది.

అవునులే, కలహభోక్తకదా, అంతకన్నా ఇంకేమి చేయగలడూ అంది. కాసేపు నారదుని మీద విఱుచుకుపడ్డాక, ఇక ధోరణి కృష్ణుని వైపు మళ్ళింది. మనబంగారము మంచిది కానప్పుడు కంసాలిననుకొని ఏమిలాభము అన్నట్లు, నారదుడిని రుక్మిణినీ అనుకోవడం దేనికి, కంసారి ననాలి కానీ అని తేల్చేసింది. నారదుడు నా ప్రస్తావన తెచ్చినప్పుడు ఊరకనిలుచున్న ధూర్తగోపాలుణ్ణి అనాలంది. అచలచిత్తుడై – కలకాలం పూసలో దారంలా మెలగే – మగడు దొరకడం దుర్లభమని తెలిసిందంది. కాసేపు కృష్ణుడు తనపట్ల చూపిన ప్రేమానురాగాలను తలచుకొంది. ఇలా దుఃఖాతిరేకం అవుతున్నకొద్దీ ఆమె మాటలలో దైన్యం చోటుచేసుకొంది. ఆ సంధర్భంలో చివరన చెప్పే పద్యమే ఈ ‘చనువు కందం’.

తత్క్షణమే కోపగృహంలోకి విసవిసా నడచివెళ్ళింది.

ఆ దైన్యం ఎంతసేపో నిలువదని తెలిసినా, పద్యం చదవగానే అయ్యో పాపం అనిపించక మానదు. సత్యభామ విషయంలో అలాంటి సందర్భాలు అరుదు. అందుకే నాకీ పద్యం ప్రత్యేకంగా తోచింది.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

2 Responses to మీ కందం – పారిజాతాపహరణములోని యొకకందము

  1. very good selection

Comments are closed.