మల్లంపల్లి సోమశేఖర శర్మ

తెలుగునాట చరిత్ర, శాసనాలు, శిల్పకళ, వాస్తు వంటివాటిపై ఎన్నదగ్గ కృషి జరిపి తన రచనల ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించిన ప్రజ్ఞాశాలి మల్లంపల్లి సోమశేఖరశర్మ గారి జయంతి (డిసెంబరు 9) సందర్భంగా ఆయన గురించినవి, రచించినవీ కొన్ని సంగతులు ఇక్కడ సమీకరిస్తున్నాం.

———-

ప్రతిభామూర్తులు అనే పుస్తకం 1991లో వెలువడింది. 130 మంది ప్రముఖ తెలుగు వ్యక్తుల రేఖామాత్ర పరిచయం దీనిలో ఉంది. ఈ పుస్తకంలో మల్లంపల్లి సోమశేఖర శర్మగారి గురించి పరిచయ వ్యాసంలో ఇలా ఉంది:

“తెలుగువాళ్ళ చరిత్ర సంస్కృతులను గూర్చి ప్రస్తావన రాగానే ముందుగా స్మరణకు వచ్చే పేరు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారిది. ఆయన ఏది వ్రాసినా అది శర్మదంగానే ఉంటుంది. తెలుగువారి చరిత్రను శాసనాల నుంచి వెలికి తీసిన మహామనీషి శ్రీ సోమశేఖరశర్మ. తెలుగు భాషా సమితి వారు ప్రచురించిన ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి సంపుటంలో ఒక్క చేతిమీదుగా ఆయన సుమారు 50 అంశాల గురించి వ్రాశారు. ఇక ప్రతి పుట ఆయన ఉపజ్ఞా శోభితంగా పరిష్కృతమని వేరుగా చెప్పాల్సిన పనిలేదు.

కొమర్రాజు లక్ష్మణ రావు పంతులు గారికి చరిత్ర, శాసన పరిశోధనలో చిన్ననాడు సహాయకుడిగా ఉండి ఆయన వారసత్వానికి నూటికి నూరుపాళ్ళు అర్హులైన వారు శర్మగారు. ఆధునిక కాలంలో ఆంధ్రుల చరిత్రకు ప్రామాణిక సామగ్రిని అందించిన వారు శర్మగారు. చరిత్ర రచనా శైలీ నిర్మాతలలో ఆయన ప్రముఖులు. ఆంధ్రదేశంలో ఎక్కడ, ఏ మూల, ఏ శాసనపు ఉనికిని గూర్చి తెలిసినా ఆయన అక్కడకు రెక్కలు కట్టుకుని వెళ్ళేవారు. శాసనపరిశోధనకే ఆయన జీవితం అంకితమైంది. లిపిశాస్త్ర పరిజ్ఞానంలో ఆధునికులలో శర్మగారి పేరు అగ్రగణ్యం. అమరావతీ స్థూపం గురించి దాని అట్టు పుట్టు ఆనవాళ్ళ గురించి తవ్వి తలకెత్తి ఆంధ్రులకు  ఎన్నో విషయాలు తెలియజేశారు.

చరిత్ర రచనలో సిద్ధ హస్తులే కాక నవలలు, నాటకాలు, శ్రవ్య రూపకాలు రచించారు శర్మగారు. రెడ్డిరాజులను గూర్చి వారు వ్రాసిన గ్రంథాలే నాటికి నేటికి కొలమానాలుగా వినుతి కెక్కాయి. ఆంధ్రుల చరిత్రను ఆదికాలం నుంచి ఆంగ్ల రాజ్య స్థాపనం వరకు వారు ఆకాశవాణి ప్రసంగాలుగా రూపొందించారు.

చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి గొప్ప జాతీయ వాది నిర్వహించిన దేశమాత పత్రికలో పనిచేయడం సోమశేఖర శర్మగారి చిన్నతనంలో గొప్ప స్ఫూర్తి నిచ్చి ఉంటుంది. అటు తర్వాత, చరిత్ర చతురానన చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రదేశ చరిత్రకు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ పనిలో ఆ విధంగా సోమశేఖర శర్మగారికి అభిరుచి పెంపొంది ఉంటుంది. ప్రాకృతం, సంస్కృతాలలో దిట్టమైన పాండిత్యం అప్పుడే ఆయనకు లభించడానికి అవకాశమున్నూ కలిగింది. శర్మగారి చరిత్ర రచనకు ఇతరుల చరిత్ర రచనకూ ఉండే ముఖ్యమైన భేదం ఏమంటే రాచవంశాల అనుక్రమ కథనం కాక ఆనాటి ప్రజాజీవన పరిణామాల అధ్యయనం ముఖ్యమన్నది ఆయన దృష్టిగా ఉండేది. అందువల్ల ఆయన కొమర్రాజు వారి నుంచి కాశీనాథుని వారి వరకు గొప్ప చరిత్ర పరిశోధకుడుగా, తత్వవేత్తగా గుర్తింపు పొందాడు. రెండువందలకు పైగా వివిధ విషయాలను గురించి ఆయన అమూల్యమైన వ్యాసాలు వ్రాసినట్లు వేత్తలు గుర్తించి ఆయన చరిత్ర పరిశోధన కృషిని తమకు దారిదివ్వెగా స్మరిస్తారు. మల్లంపల్లివారు గొప్ప శాసన పరిశోధకులేకాక చారిత్రకేతివృత్తాలతో రమ్యమైన చిన్న కథలు కూడా ఎన్నో రచించారు. వాటిలో ఆయన సృజనాత్మక ప్రతిభ వెల్లివిరుస్తూ ఉంటుంది. జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మినుమించిలిపాడు. తల్లితండ్రులు నాగమ్మ, భద్రయగారలు. సోమశేఖర శర్మ జననం 1891, కాలగతి 1963.

——————————————

 (‘బుద్ధుడు; జీవితం-అవగాహన‘ అను వ్యాస సంకలనం నుండి)

–   శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ

“మహాయానం మూలంగానే బౌద్ధంలో కళకు తావేర్పడింది. నాగార్జునాచార్య శ్రీపాదులు ఎంతటి తాత్విక విచారశీలియో, ఎంతటి లోక హితైషియో అంతటి కళాప్రియుడు. ధనకటక మహా చైత్యం చుట్టూశిల్పచిత్ర రత్నాలతో పొదిగిన మహా ప్రాకారం నిర్మించినది ఆయనే అని టిబెట్టు దేశచరిత్రలు చెపుతవి. ఈ ప్రాకరములోని ప్రతి శిల్పచిత్రమూ జీవం ఉట్టిపడుతూ నిన్ననో, మొన్ననో చెక్కినట్లు కళకళలాడుతూ ప్రాత:కాలంలో విరిసిన నవమల్లికా కుసుమంలాగ అచ్చస్వచ్ఛంగా ఉంటవి. ధనకటక మహాచైత్య ప్రాకారంలోని శిల్పచిత్రాలే కాదు, నాగార్జునుని కొండ, గుమ్మడిదుర్రు, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి ఈ మొదలైనచోట్ల ఉన్న స్తూపశిల్ప చిత్రాలు కూడా ధనకటక ప్రాకార శిల్ప చిత్రాలకు తీసిపోయేవి కావు. తెలుగుదేశంలో బౌద్ధం అవతరించి తెలుగుజాతిని కళావంతము చేసింది; తెలుగు శిల్పికృతులలో అమృతం చిలికింది. అందువల్లనే అంతకు పూర్వపు బౌద్ధ క్షేత్రాలలో స్తూపశిల్ప చిత్రాలు వట్టి నీరస ప్రతిమలయితే తెలుగు మహాయానమవతరించి ఆదిమ బౌద్ధము స్వరూపస్వభావములనే పూర్తిగా మార్చివేసింది. హీనయాన బౌద్ధుడు తన నిర్వాణమునకే తన సంసార దు:ఖ విమోచనమునకే తన అర్హత పదమునకే కృషి చేసే స్వార్ధపరుడు. మహాయానవాది అట్లు కాదు. అతనికి అవలోకితేశ్వరుడు ఆదర్శము. అతడు బోధిసత్వుడు, మహాయానులలో బోధిసత్వులనేకులు ఉదయించారు. వేరు వేరు మన: పరిణితులు గల వేరువేరు వ్యక్తులు నిర్యాణం సాధించడం కోసం తోడ్పడేటందుకు వచ్చినవారు బోధిసత్వులు. నిర్వాణం పొందుటకు సిద్ధంగా ఉండికూడా లోకంలోని ప్రతి వ్యక్తీ నిర్వాణం పొందితే కాని తనకక్కరలేదని నిరాకరించి సర్వలోక హితైషియై ప్రవర్తించాడు బోధిసత్వుడు. ఇటువంటి బోధిసత్వులు జనులకు తోడ్పడుటకు సృజింపబడినవారు వందలూ వేలూనూ. అందుచేతనే మహాయానానికి బోధిసత్వయానని కూడా పేరు వచ్చింది. బౌద్ధం విశ్వవ్యాప్తి పొందింది మన తెలుగు దేశంలో కృష్ణానదీ తీరాన మహాయానం రూపొందిన తరువాతనే.  అందువల్లనే నాగార్జునాచార్య్లవారు బుద్ధుని తరువాత బుద్ధుడంతటి వాడయినాడు. మహాయానం వచ్చి బుద్ధుణ్ణి భగవంతుణ్ణి చేసి అతనికి లోకోత్తర శక్తులు ప్రసాదించింది. బుద్ధపురాణం వెలసింది.”

———

కందుకూరి వారి ఆంధ్ర కవుల చరిత్రములో ముందుమాటగా వ్రాసిన వ్యాసంలో కొన్ని భాగాలు…

కవిచరిత్ర పరిశోధన

మల్లంపల్లి సోమశేఖర శర్మ

చరిత్ర పరిశోధన అనేది – అది దేశచరిత్ర పరిశోధన కానీండి, వాఙ్మయ చరిత్ర పరిశోధన కానీండి – చాలా కష్టతరమైన కార్యం ఇప్పటికీని. వాఙ్మయ చరిత్ర వ్రాయాలంటే ముందు ఆయాకవుల, వారు రచించిన కృతుల కాలం నిర్ణయించడం అత్యంతావసరం. ఇది ముందు నిర్ణయమైతేనేకాని మన ఆంధ్ర సాహిత్య క్రమ పరిణామం తెలుసుకొనేందుకు వీలుపడదు. ఒక్క వాఙ్మయ చరిత్రకే కాదు, దేశ చరిత్రకైనా కాల నిర్ణయ ప్రణాళిక చాలా అవసరం. కాల పరిగణనలోని ముందు వెనుకలు, పూర్వోత్తరాలు నిర్ణయమైతే కాని జాతి ఏయే కాలాలలో ఎట్టెట్టి పరిణామ వికాసాలు పొందిందో, భాషా వాఙ్మయాలలోను, మతంలోను, కళలలోను ఎప్పుడెప్పుడుడెట్టి మార్పులు వచ్చినవో, ప్రజాభిరుచి ఎట్లా మారుతూ వచ్చిందో తెలియదు. కాల పరిగణన విద్య చరిత్రకు వెన్నెముక వంటిది.

కవులు గ్రంథాలైతే వ్రాశారుకాని వారు తమ జీవిత చరిత్రలు వ్రాసుకోలేదు. వారు తమ జీవిత చరిత్రలకంటెను తమ కృతులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే కృతి సప్త సంతానాలలో ఒకటి. అది పుణ్యకార్యమూ, కీర్తి దాయకమూ గనుక. కొందరు కవులు తమ కృతులను తమ యిష్టదైవముల పేర చెప్పినా చాలా మంది తమ కాశ్రయ మిచ్చినవారికి, తమ్ము పోషించినవారికి అంకితమిచ్చి కావ్య ప్రారంభంలో సువర్ణతిలకాయమానంగా ఉండేటట్టు కృతి భర్తృ వంశాన్ని అభివర్ణిస్తూ వచ్చారు. దాన్ని అనుసరించి – మనకు దేశ చరిత్ర లేకపోయినా కొందరు కృతిభర్తలైన భూపతుల చరిత్రలు తెలుస్తాయి. కొందరు కవులను గురించి, వారి పోషకులను గురించీ – నిజమో అబద్ధమో తెలియని – కొన్ని కథలూ, గాథలూ ప్రచారంలో ఉండేవికదా. వాటిని తగిన ఆధారాలతో పరిశీలించి సాధ్యమైనంతవరకు అబద్ధపు కథలూ, గాథలనూ విడదీసి నిజమయిన వాటిని స్వీకరించడం కవి చరిత్రకారుల విద్యుక్తధర్మాలలో ఒకటి. మన దేశంలో పూర్వకాలమందు – పద్దెనిమిదవ శతాబ్దం వరకూ కూడా గ్రంథాలన్నీ తాటియాకులమీద గంటంతో వ్రాయడం పరిపాటిగా ఉండేది. గ్రంథాలే కాదు అన్ని విధాలైన పత్రాలకు తాళపత్రాలే వాడకం. కారణం –  అప్పటికి ఇంకా మనదేశానికి కాగితం రాకపోవడమే. వచ్చినా అది అరుదుగా దొరికే పీచు కాగితం, ధర ఎక్కువ. తాటాకు కొమ్మలు రెండు కొట్టి తీసుకువస్తే కృతి రచించుటకు కావలసినంత ఆకు! ఇది ఎక్కడపడితే అక్కడ దొరికే వస్తువు; కానీ కర్చు లేనిది. ఎటు వచ్చీ ఆకులు చక్కగా కత్తిరించి రచన చేయుటకు తగినట్లు అందంగా వాటిని సంతరిచాలి. వ్రాయుటకనువుపడే తాళపత్ర గ్రంథనం కూడా పూర్వం ఒక కళగా రాటుదేరింది.

దక్షిణ భారతంలో పూర్వ ప్రబంధాలన్నీ తాళపత్రాలమీద వ్రాసినవే. భారత, భాగవత, రామాయణాదులకు తరువాత ప్రజాహృదయాకర్షకములైనవి ప్రబంధాలు, శతకాలున్ను. అట్టి కృతులు చదవాలని ఆశగొన్న సంపన్నులు లేఖకులకింతయని ధాన్యభృతి యిచ్చి మాతృకలకు పుత్రికలు వ్రాయించుకొని చదువుకొనేవారు. చదవాలని ఆసక్తి ఉన్నవారికే గ్రంథం దొరికేది; అదయినా చాలా కష్టం మీదే. ఈ విధంగా పూర్వకాలంలో తాటాకుల మీద గంటంతో ముద్దులు మూటగట్టేటట్టు ముచ్చటగా వ్రాయగల ముసద్దీ వ్రాయసకాండ్రకు విలేఖకత్వం ఒక వృత్తిగా ఏర్పడింది. మన దేశంలో ముద్రణ యంత్రం వచ్చిన తరువాత  ఈ కష్టం  తీరిపోయింది. అప్పటినుంచి ఒక్కొక్క గ్రంథానికి కావలసినన్ని ప్రతులు తయారయి సులభమైన మూల్యానికి దొరుకుతూ వచ్చాయి. మద్రాసులో 1772వ సంవత్సరంలో ముద్రాయంత్రం ప్తతిష్ఠితమైనా 1800ల ప్రాంతానగాని తెలుగులో పుస్తకం అచ్చవలేదు. అచ్చయినవైనా క్రైస్తవమత గ్రంథాలే. మొట్టమొదట ముద్రణ యంత్రాన్ని మనదేశానికి తీసుకువచ్చినవారు మిషనరీలే; అది క్రైస్తవ మత ప్రచారం కోసమే. తరువాత మనదేశంలో ఉన్నతోద్యోగాలు చేయవలసి వచ్చిన సివిలియన్లు తెలుగు నేర్చుకోవలసిన అవసరం కలగడం వల్ల ఆంగ్లేయులు వ్రాసిన తెలుగు వ్యాకరణాలు అచ్చవుతూ వచ్చాయి.

మరో మూడు నాల్గు దశాబ్దులకుగాని ఆంధ్రులు అచ్చు ఉపయోగం తెలుసుకోలేకపోయారు. అప్పుడయినా దాన్ని మాస, వార, పక్ష పత్రికల కెక్కువగా ఉపయోగించుకొన్నారు కాని తమ గ్రంథాల ముద్రణకు కాదు. ముందుగా అచ్చయినవి భారత, భాగవతాలే. అందువల్ల 1850 నాటికి అచ్చయిన తెలుగు కృతులు మృగ్యంగానే ఉంటూ వచ్చాయి.
ఇక తాళపత్ర గ్రంథాలు సంపాదించడమంటే బహు వ్యయప్రయాసలు. ఇప్పటివలె అప్పుడు పుస్తక భాండాగారాలు ఉండేవి కావు. తంజావూరు నాయకరాజులు స్వయంగా కవులూ, కవిజనాశ్రయాలూ అయినందువల్ల ఆంధ్రభాషాభిమానులైన వారు  స్వోపయోగం నిమిత్తం కొన్ని కొన్ని ప్రాచీనాంధ్ర కావ్యాలు, ఇతర గ్రంథాలు సేకరించీ, ప్రతులు వ్రాయించీ ఉంచారు. వారి అనంతరం తంజాపుర రాజ్యం పరిపాలించిన మహారాష్ట్ర మహీపతులు కూడ తమ రాజ్యంలో తెలుగు రాజభాష అయినందువల్లనూ, సంగీతానికనువైన
భాష అవడంవల్లనూ సంగీత, సాహిత్యాభిమానులైనవారు తెలుగునేర్చుకొని, తెలుగులో గ్రంథాదులు రచించి ప్రాచీనాంధ్ర తాళపత్ర గ్రంథాలను ఇమ్మడిగా, ముమ్మడిగా సంపాదించి, మాతృకలకు పుత్రికలు వ్రాయించి తమ సరస్వతీ మహలు పుస్తక భాండాగారంలో పదిలపరిచి సంచయాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధంగానే కల్నల్ కాలి మెకెంజీ తన సొంత సొమ్ము వ్యయపరచి దేశభాషలలో రచించిన తాళపత్ర గ్రంథాలనెన్నిటినో సేకరించాడు. అతని మరణానంతరం ఆయన భార్య వద్ద ఈ గ్రంథాలనన్నిటినీ కొని కుంపిణీ ప్రభుత్వం వారు మద్రాసు సెంటుజార్చి కోటలో జాగ్రత్త చేశారు. తరువాత చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే కుంపిణీ సివిలు ఉద్యోగి తెలుగుభాష నేర్చుకొని దాని మాధుర్యాది గుణాలకు ఉల్లసిల్లి సొంతధనం వెచ్చించి తెలుగులో ఉన్న కావ్యాలను కొన్నిటిని కొనీ, మరికొన్ని పండితులకు బత్తెకర్చు లిచ్చి పంపి వాటికి పుత్రికలు వ్రాయించి తెప్పించీ చాలా సేకరించాడు.  జీర్ణావస్తలో ఉన్న తాళపత్ర గ్రంథాలకు కొన్నిటికి ప్రతులు వ్రాయించాడు. పండితులను పెట్టి నిర్దుష్టపాఠాలు నిర్ణయించి కొన్ని కావ్యాలు పరిష్కరించాడు. ఇవన్నీ మద్రాసు తాళపత్ర లిఖిత గ్రంథ భాండాగారంలోనే ఉన్నాయి.

———-

అంకితం మల్లంపల్లి సోమశేఖర శర్మకు
విశ్వనాథ సత్యనారాయణ (ఆంధ్రప్రశస్తి)

 

నీ వనుకోనులేదు మఱి నే నిది చెప్పనులేదు కాని అ
న్నా! వినవయ్య నేఁటి కిది నా చిఱుపొత్తము నీకు నంకితం
బై వెలయింపఁజేతు హృదయంబులు నీకును నాకు మాతృ దే
శావిల దుఃఖదారితములై శ్రుతి గల్పె విషాదగీతికన్

 

‘డిగ్రీలు’ లేని పాండిత్యంబు వన్నెకు రాని యీ పాడుకాలాన బుట్టి
నీ చరిత్రజ్ఞాన నిర్మలాంభఃపూర మూషరక్షేత్ర వర్షోదక మయి
చాడీలకు ముఖప్రశంసల కీర్ష్యకు స్థానమైనట్టి లోకాన నుండి
నీ యచ్ఛతర కమనీయశీల జ్యోత్స్న అడవి గాసిన వెన్నెలగుచు జెఁలగిఁ

 

అంతె కాని గౌరీశంకరాచ్ఛశృంగ
తుంగము త్వదీయము మనస్సు పొంగి తెలుఁగు
నాఁటి పూర్వచరిత్ర కాణాచి యెల్ల
త్రవ్వి తల కెత్తలేదె యాంధ్రజనములకు

 

కొదమతుమ్మెద ఱెక్కల గుస్తరించు
మీనముల నీ ప్రసన్న గంభీర ముఖము
కన్నులంటగ గట్టినట్లున్న నిన్ను
మఱచి పోలేను జన్మజన్మములకైన

 

ఇది నీకై యిడినట్టి నా యుపది, మున్నేనాడొ ఘాసాగ్రముల్
పదనై యాంధ్రవిరోధికంఠ దళన ప్రారంభసంరంభ మే
చు దినాలన్ మఱి తోడిసైనికులమై చూఱాడు ప్రేమంబులో
నిది లేశం బని యైన జెప్పుటకు లేవే నాఁటి స్వాతంత్ర్యముల్

 

This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

3 Responses to మల్లంపల్లి సోమశేఖర శర్మ

  1. కొడవటిగంటి రోహిణీప్రసాద్ says:

    సోమశేఖరశర్మగారి తమ్ముడు ఉమామహేశ్వరరావు (“ఉమ”) చాలాకాలంపాటు ఆలిండియా రేడియో మద్రాస్ కేంద్రం తెలుగుశాఖలో పనిచేశారు. మంచి కంఠస్వరంతో అనౌన్స్‌మెంట్లూ, ప్రోగ్రాముల నిర్వహణా చేసేవారు. ఆటవిడుపు పిల్లల కార్యక్రమంలో గొంతు మార్చి రేడియో తాతయ్యగా అభినయించేవారు. ఆ గతచరిత్రంతా తలుచుకుంటే ఇప్పుడు నిట్టూర్పు వస్తుంది. శర్మగారిని నేను చూడలేదుగాని, చిన్నప్పటినుంచీ నాకు హిస్టరీ అంటే ఇష్టం కనక ఆయనంటే హీరో వర్షిప్ ఉండేది.
    రో.ప్ర.

  2. గంటి లక్ష్మీ నరసింహ మూర్తి says:

    కీ.శే.మల్లంపల్లి సోమశేఖరశర్మగారిని వారి జన్మదిన సందర్భంగా స్మరించుకోవడం ప్రతి ఆంధ్రుడూ గర్వించదగ్గ విషయం.ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము,ఆయన మాటలలోనే “1857 వరకయినా ఇంతవరకు వచ్చిన సమగ్ర ఆంద్రదేశ చరిత్ర-సంగ్రహంగానైనా ఇదే మొదటిది.ఆయన వ్రాసిన “ప్రాచీన ప్రాకృత సంస్కృత వాజ్ఞ్మయములు”అనే వ్యాసం విస్మృతాంధ్ర కవుల ఉనికిని పసిగట్టి వారి రచనలేవైనా లభ్యమౌతాయేమో అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది.భారతి మాసపత్రికలో వ్రాసిన “మాధవ వర్మ అతని సంతతి”ఒక ఆద్భుత పరిశోధనా వ్యాసం.ఇంకా ఎంతో విస్తృతమైనది ఆయన రచనా వ్యాసంగం.”ఆంధ్రత్వమాంధ్రభాషాచ నాల్పస్య తపః ఫలం” అనే అప్పయ్యదీక్షితుల వారి సూక్తికి నిలువెత్తు నిదర్శనం మల్లంపల్లివారు-గంటి లక్ష్మీనరసింహమూర్తి

  3. Gurunath says:

    శర్మ గారు ఏ కాలం నాటి తెలుగు లిపినైనా ప్రేమలేఖలు చదివినంత సులభంగా చదవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మా ఉళ్ళో దొరికిన ఒక రాగిరేకుల శాసనాన్ని 1960 లొ తెచ్చి ఇస్తే గబగభ చదివి, ఇది కళింగ రాజుల నాటిదని చెప్పారు.

Comments are closed.