థ్రిల్

“ఏరా మామా! యూనివర్సిటీ బంద్, మెస్ లో యేదో తిన్నాము. ఇప్పటిదాకా తిరిగాము. హాస్టల్ కు వెళ్ళబుద్ధి కావడము లేదు. వాతావరణలు హాయిగా, చల్లగా ఉంది. గొడవలు, ఉద్యమాలు పుణ్యమా అని చదువూ సంధ్యా లేదు. ఇంకేమి.. అలా సెంటరుకు వెళ్ళి యే సినిమా హీరో నైనా బ్రతికిద్దామ” అన్నాడు ఉత్సాహంగా రఘు.

“పన్నెండు అవుతోంది. ఆకలి కూడా అవుతోంది. ఏమైనా తిని వెళ్దాము”, కడుపు పట్టుకుని అన్నాడు రాబర్ట్.

“నెలాఖరు, ఇంటి నుండి వచ్చిన డబ్బులు, ఇటు స్కాలర్ షిప్ డబ్బులు అయిపోయాయి. నాకు తెలిసినంతవరకు ఈడ్చి తన్నినా మన దగ్గర నాలుగు పైసలు లేవు. తిరిగింది చాలు, మెస్ కు వెళ్ళి సాంబారు తిని, నాలుగు పేజీలు తిరగేస్తూ రూమ్ లో పడుకుందాము”, అన్నాడు సీరియస్ గా సుకుమార్.

“వీడెప్పుడు ఇంతేరా, ఉత్త బోర్ గాడు.. ఎప్పుడూ నీతులు చెబుతూంటాడు. అరేయి! వినండిరా, మన యూత్ ఎప్పుడూ సరదాగా ఎంజాయి చేయాలి.అడ్వెంచర్స్ చేయాలి. కాస్త థ్రిల్ అనుభవించాలి. అప్పుడే లైఫ్ లో మజా ఉంటుంది”, అన్నాడు ఈజీ గోయింగ్ దామోదర్.

“మీ మాటలు, డిస్కషన్స్ మీకేనా? నాకు ఆలి వేస్తోంది, తిండి సంగతి చూడండి”, అన్నాడు రాబర్ట్.

“ఐడియా! మనం ఎన్నో సినిమాల్లో చూసాము, ఎన్నోసార్లు ప్రయత్నించి విజయము సాధించాము. ఆ ప్లాన్ అమలు చేద్దాము. అందులో ఎంతో థ్రిల్ కూడా ఉంటుంది”, అన్నాడు దామోదర్.

“యేం ఐడియారా, నాకు అర్థం కావడం లేదు”, అన్నాడు అహ్మద్.

“యేముంది, ఏదైనా ఫంక్షన్ హాల్లో దూరడము, ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళలా ఫోజు కొడుతూ, తెలిసిన వాళ్ళలా అందరినీ పలకరిస్తూ తృప్తిగా భోంచేసి రావడము” అన్నాడు దామోదర్.

“ఈ లేకితనము, దిక్కుమాలిన వేషాలు బయటపడితే చీవాట్లు లేదా చెంపదెబ్బలూ తిని, దేభ్యం మొహం వేసుకుని బయటికి రావడము! ఇదేగా నీవు చెప్పేది” అయిష్టంగా మొహం పెడుతూ, కటువుగా అన్నాడు రవికుమార్.

“పోరా, ఇందులో ఎంత థ్రిల్ ఉంటుందో నీకేమి తెలుసు. ముక్కూ మొహం తెలియని వాళ్ళ మధ్యకు వెళ్ళి, గంటసేపు ఉండి, హాయిగా భోంచేసి హుందాగా బయటికి రావడము ఆషామాషీ వ్యవహారం కాదు.దీనికి ఎంతో నైపుణ్యం, గుండెధైర్యం కావాలి. అన్నిటికంటే థ్రిల్ పొందలన్న కోరిక ఉండాలి”, అన్నాడు దామోదర్.

“చూడు దామూ, నీవూ మన స్నేహితులూ చాలాసార్లు రకరకాల ఫంక్షన్లకు వెళ్ళి పీకల దాకా మెక్కి వచ్చారు. ఒకసారి పట్టుబడి నానా అవమానాల పాలు అయ్యారు. ఇవ్వాళ, రేపు ఫంక్షన్స్ చేయడము, భోజనాలు పెట్టడము అంటే లక్షల్లో వ్యవహారం. ఉన్నవాడి సంగతి వదిలేయండి. అఫ్కోర్స్, బాగా డబ్బున్నవాళ్ళ అరిస్టోక్రటిక్ ఫంక్షన్స్ దరిదాపులోకి కూడా మనలాంటివాళ్లను రానీయరు. వెళ్తే మధ్యతరగతి జీవుల బడ్జెట్ ఫంక్షన్స్ కే వెళ్ళాలి. పాపం వాళ్ళు పైసాపైసా కూడబెట్టుకుని, ప్రతీది బడ్జెట్ వేసుకుని ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెడుతూ ఫంక్షన్స్ చేస్తారు. అటువంటి ఫంక్షన్స్ కి మనలాంటి పిలవని పేరంటాలు వెళ్ళి కడుపునిండా మెక్కి ఘనకార్యం చేసామని బయటపడుతూంటాం. కానీ ఆ పెళ్ళిపెద్ద చేయించిన భోజనభాజనాలు వచ్చిన అతిథులకు సరిపోక ఎంత ఇబ్బంది పడతాడో మనం ఆలోచించం” అన్నాడు సుకుమార్.

“భలే చెప్పొచ్చావులే.. సుమతీశతకం. ఇవ్వాళ రేపు యే పెళ్ళినైనా చూడు డబ్బు మంచినీళ్ళలా ఖర్చుపెడుతున్నారు. మనం పదిమందిమి తింటే చేసేవాడికి యేమి తగ్గుతుందిరా? అయినా పెళ్ళిళ్ళలో, విందుల్లో తినేదాని కంటే పారేసేదే ఎక్కువ. పదిమంది ఎక్కువగా వస్తే పెట్టలేనివాడు పెళ్ళిళ్ళు, విందులూ చెయ్యడం ఎందుకురా? అయినా నీతో మాకేంటి. పదండిరా అదుగో మాటల్లోనే శంకర్ ఫంక్షన్ హాలుకు వచ్చాం. అక్కడ యేదో పెళ్ళి జరుగుతోంది. పదండి సుష్టుగా భోచేద్దాం”, అంటూ మిత్రులను ఉత్సాహపరచాడు దామోదర్.

“చూడు దామూ, మనం యూనివర్సిటీ వేదికలపై పేదరికము, ఆకలి, నిరుద్యోగం వంటి గంభీరమైన అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసాలిస్తాము. సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత, చైతన్యము వంటి విషయాలను యువత అలరచుకోవాల్సిందేనని నొక్కివక్కాణిస్తాము. తీవ్రమైన విషయాలపై ఉద్యమాలు చేస్తాము. కానీ కొన్ని చిన్నచిన్న విషయాలలో సంఘ మర్యాదలు, సాంఘిక బాధ్యతలు మరచిపోయి లేకిగా, చవకగా ప్రవర్తిస్తాము. ఇలాంటి చిన్నచిన్న విషయాలు కూడా సమాజ హితంలో భాగమేనని గుర్తించము. పెద్దపెద్ద ఆదర్శాలు వల్లించడం కన్నా చిన్నచిన్న మంచి పనులు చెయ్యడం మన వ్యక్తిత్వాన్ని మరింత ప్రకాశింపజేస్తుందని భావించము”, అన్నాడు సుకుమార్.

“వద్దురా బాబూ, మమ్మల్ని చావ బాదకు. ఉన్న మూడ్ పాడుచేయకు. వస్తే రా, చస్తే చావు. అంతేగానీ, లెక్చర్లు దంచకు”, అంటూ ముందుకు కదిలాడు దామోదర్. మిత్రులు అతడిని అనుసరించారు. మూర్ఖులతో మాట్లాడి ప్రయోజనం లేదని మౌనంగా సుకుమార్ వారిని అనుసరించాడు.

ఫంక్షన్ హాల్. అప్పుడే పెళ్ళి తంతు ముగిసినట్టుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వివాహం. అటు అట్టహాసంగానూ లేదు, ఇటు సాదాసీదాగానూ లేదు. మిత్రసమూహం పెళ్ళిహాలు లోకి అడుగుపెట్టారు. వీరు హాలులోకి అడుగు పెడుతూండగా ఈ మిత్రబృందం తాలూకు స్నేహితుడు అయిన రవి వీరిని చూసి నవ్వుతూ ఎదురుగా వచ్చాడు. మిత్రబృందము కొంచెం ఖంగుతిన్నారు. కానీ సిగ్గు లేకుండా, దిగజారుడుతనాన్ని బయటపడనీయకుండా విష్ చేసారు. రవికి వీరి సంగతి తెలుసు. ఎందుకు వచ్చారో అర్థమైంది. మనస్సులోనే నవ్వుకుంటూ వారిని ఆహ్వానించాడు. “ఇక్కడ జరగింది మా కజిన్ పెళ్ళి. పెళ్ళి కూతురి తండ్రి మా బాబాయి అవుతాడు. రండి, పరిచయం చేస్తాను. మా చెల్లెలికి విషెస్ చెప్పండి.”, అంటూ మిత్రబృందాన్ని తీసుకువెళ్ళాడు. పరిచయాలు, విషెస్ తరువాత డైనింగ్ హాలుకు తీసుకువెళ్ళి, “సిగ్గుపడకుండా భోంచేయండి. నాకు కాస్త పనుంది” అంటూ మరొక వైపుకు వెళ్ళాడు.

అంతే, ఉప్పెన ఊరిమీద విరుచుకు పడినట్లు, ఆకలితో ఉన్న సింహం ఏనుగు కుంభస్థలానికి ఎగసినట్లుగా, రిలీఫ్ క్యాంప్ లో శరణార్థులు ఆహార పొట్లాల వైపు పరుగెత్తినట్లు మిత్రబృందము ఆబగా ప్లేట్లపై విరుచుకు పడ్డారు. ఒక్కొక్కళ్ళు ముగ్గురు తిన్నంత తిన్నారు. తృప్తిగా త్రేన్చారు. సుకుమార్ మాత్రం ఒక స్వీట్ తిని మౌనంగా ఒక ప్రక్కన కూర్చున్నాడు. భోజన కార్యక్రమము అవ్వడంతో పెళ్ళి వారికి వీడ్కోలు చెప్పి, బయలుదేరారు.
—————

“సుష్టుగా తిన్న భోజనము తాలూకు ఎఫెక్ట్ అంతా దిగిపోయింది. ఈ హీరో, డైరెక్టర్ కలిసి మనను రెండున్నర గంటలు బాది పారేసారు. తలనొప్పిగా ఉంది.”, సినిమాహాలు నుండి బయటికి వస్తూ అన్నాడు రఘు. “ఔను, తలంతా వాచిపోయింది. అర్జెంటుగా చెంబెడు కాఫీయో టీయో పడాలి”, అన్నాడు రాబర్ట్.

“ఇరానీ హోటలుకు వెళ్ళి టీ తాగుదాము”, అన్నాడు సుకుమార్.

“అరే పాగల్! హోటల్ ఎందుకురా, పొద్దున పోయిన ఫంక్షన్ హాలుకు మళ్ళీ పోదాము. ఎట్లాగూ రవిగాడు ఉన్నాడుగా. ఈపాటికి ఎక్కడివారు అక్కడికి పోయి ఉంటారు. అప్పగింతలు అవుతూంటాయి. పిల్లను పిల్లగాడింటికి పంపుతూ పెళ్ళివారికి ఇంత చాయ్ పొయ్యరా, ఇంత టిఫిన్ పెట్టరా? అదే టైమ్ లో మనము వెళితే మనకు పెట్టరా, పొయ్యరా.. అక్కడికే పోదాము”, అన్నాడు దామోదర్.

“ఆలోచన బాగానే ఉంది”, అన్నారు మిత్రబృందము.

“మళ్ళీ వెళ్ళడమా? అట్లా వెళ్ళడము తప్పు. నేను రాను”, అన్నాడు సుకుమార్.

“అక్కడ నీవు ఏమీ తినవద్దు, తాగవద్దు. స్నేహధర్మముతో మాతో పాటు రా”, అన్నాడు రఘ. అనుసరిచాడు సుకుమార్.

మిత్రబృందము పెళ్ళిహాలులో ప్రవేశించింది. ఎక్కువమంది లేరు. కుర్చీలు సర్దేసారు. ఇప్పుడే పెళ్ళి అయిన ప్రదేశంలా లేదు. కళతప్పిట్లుగా ఉంది. అక్కడ ఉన్నవారిలో పెళ్ళి ఉత్సాహము లేకపోగా, గాంభీర్యము కానవస్తున్నది. సుకుమార్ కు ఏదో సందేహము వచ్చింది. ఇంతలో రవి వచ్చాడు.. ’మళ్ళీ ఎందుకు వచ్చార్రా’ అన్నట్టుగా చూస్తూ. ఆ విషయాన్ని బయటపెట్టక, సైలెంట్ గా విష్ చేసాడు.

“యేరా రవీ, పెండ్లి అంతా పీస్ ఫుల్ గా జరిగిందా?”, అడిగాడు సుకుమార్.

“పెండ్లి బాగా జరిగింది. భోజనాల దగ్గరే ప్రాబ్లమ్ వచ్చింది”

“యేం ప్రాబ్లమ్?” ఆసక్తిగా అడిగాడు రఘు.

“మా బాబాయి సెక్రెటేరియట్ లో గుమాస్తా. మధ్యతరగతి మనిషి. అయినా తాహతుకు మించి ఘనంగా వివాహాన్ని ప్లాన్ చేసాడు. ఇరువైపు వారూ కలిసి రెండు వందల మందిని పిలుచుకున్నారు. మా బాబాయి ఎందుకైనా మంచిదని మూడువందల మందికి సరిపడా భోజనము చేయాలని వంటవాళ్ళకు చెప్పాడు. భోజనాల సమయానికి అందరినీ భోజనానికి ఆహ్వానించాము. మీరు మొదట్లోనే తినివెళ్ళారు కదా. ఆ తరువాత పావుగంటలో, చేసిన పదార్థాలన్నీ అయిపోయాయి. నిజానికి తిననివారు ఇంకా దాదాపు వందమంది దాకా ఉన్నారు. వంటవాళ్ళు మూడువందల మందికి సరిపడా వంట చేసామన్నారు. కావలిస్తే ఎంగిలిప్లేట్ల లెక్క చూసుకోండి అన్నారు. మేమంతా పెళ్ళి హడావుడిలో పడిపోయి ఏం పెడుతున్నారు, ఎవరు వచ్చి తినిపోతున్నారు అన్న విషయాలను గమనించలేదు. అయిందేదో అయింది, మళ్ళీ వండమన్నాము. వాళ్ళు మా దగ్గర సరుకుల్లేవు, కూరగాయలు అయిపోయాయి అన్నారు. మేమంతా తలోదారిన వెళ్ళి అప్పటికప్పుడు అరగంటలో సరుకులు కూరగాయలూ తెచ్చాము. బజారు నుండి స్వీట్, హాట్ కొనుక్కుని వచ్చాము. ఇలా మేము ఈ హడావుడిలో ఉండగా పెళ్ళి కుమారుడి బంధువులు కొందరు అప్పుడే భోజనానికి వచ్చారు. అక్కడ పెట్టడానికి ఏమీ లేదు.

మా పిన్నీ, బాబాయిలు ఒక్క అరగంట అగండి ఏర్పాటు చేస్తున్నాము అనే లోగానే ’బాగానే పెళ్ళి చేసాడు భోజనాలిఉ లేకుండా’ అంటూ అక్కడినుండి ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు. ఇంతలో పెళ్ళికొడుకు తాలూకు ఆఫీసు స్టాఫ్ వచ్చారు. వాళ్ళు అక్కడి పరిస్థితి చూసి, మాకు టైమ్ అవుతోంది, భోజనాలదేముంది అంటూ వెళ్ళిపోయారు. కొందరు ఏమీ తినకుండా వెళ్ళారు. అది నేనూ చూసాను. పెళ్ళికొడుకు వాళ్ళ అక్కయ్య, మరొక ఇద్దరు పెళ్ళికొడుకుతో ఏమన్నారో తెలియదు.. పెళ్ళికొడుకు, “భోజనాలు చెయ్యకుండా వెళ్ళిన ఆ పదిమంది నాకు చాలా ముఖ్యులు. నా బంధువుల్లో నాకు చాలా అవమానము జరిగింది. పెండ్లి ఇలా చేస్తారని ఊహించలేదు”, అంటూ ఊగిపోయాడు. మేమంతా పెండ్లికొడుకు తల్లిదండ్రులకు, పెద్దలకూ క్షమాపణలు చెప్పాము. మా బాబాయి, పిన్నీ పెండ్లికొడుకు తల్లదండ్రులకు సాష్టాంగ నమస్కారాలు చేసారు. అయినప్పటికీ వాళ్ళు పెండ్లికొడుకుతో పాటు వెళ్ళిపోయారు. మా పిన్ని, బాబాయి, మావైపు పెద్దలూ వాళ్ళింటికి వెళ్ళారు. మా చెల్లి పచ్చని పందిట్లో ఏడ్చి ఏడ్చి స్పృహతప్పి పడిపోయి, ఇప్పుడిప్పుడే స్పృహ లోకి వచ్చింది”, ఎంతో బాధతో చెప్పుకొచ్చాడు రవి. మిత్రబృందము అంతా స్తబ్దులై వినసాగారు. వారి నోటమాట రాలేదు.

“ఒక్క పదిమందికి సమయానికి భోజనము సరిపోకపోవడంతో ఇదంతా జరిగింది. పదిమందికి భోజనము సరిపోయుంటే, ఒకవేళ భోజనము అయిపోయినా ఎలాగో చేయించేవారిమి కాబట్టి, ఈ సమస్య రాకపోయేదేమో. అయినా పెళ్ళిలో ఇలాంటివి మామూలే. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే.. ఊహించని విధంగా కొందరు వస్తూంటారు. దానితో అంచనాలు తారుమారు అవుతూంటాయి. ఏం చేస్తాం? పాపం మా చెల్లెల్ని జీవితాంతము వాళ్ళ అత్తగారింటి వాళ్ళు దెప్పుతూంటారు కాబోలు. ఆ.. అన్నట్లు ఎలాగూ వచ్చారు, టీ ,స్నాక్స్ రెడీగా ఉన్నాయి. తీసుకుని వెళ్ళండిరా”, అన్నాడు రవి మిత్రబృందముతో.

అనవసరంగా వచ్చిన తాము పదిమందిమి కూడా ఈ పెండ్లి ఇలా రసాభాసగా ముగిడానికి ఒక కారణము అని అర్థము అవ్వగానే మిత్రబృందము ముఖము మాడిపోయి, మనసులు పశ్చాత్తాపముతో రగిలి పోసాగాయి.

“లేదురా, పిక్చర్ కు వెళ్ళాము. పోతూపోతూ దారిలోనే కదా అని నిన్ను కలిసి పోదామని వచ్చాము. టీ, కాఫీలు వద్దు. మేము బయట త్రాగి వచ్చాము. వి యార్ వెరీ సారీ! అలా జరిగి ఉండాల్సింది కాదు.” అంటూ కళ్లలో నీళ్ళతో అన్నాడు సుకుమార్.

రవి దగ్గర సెలవు తీసుకుని పెండ్లి హాలు బయటికి వచ్చారు అందరూ. మిత్రబృందము మొహాలు వేలాడదీసుకుని చేదు తిన్నవారిలా ఉన్నారు.

“యేరా దామోదర్, ఈ థ్రిల్ ఎలా ఉంది?”, అన్నాడు సుకుమార్.

దామోదర్ మౌనంగా, సిగ్గుతో తవంచుకున్నాడు.

About kunthi

నా పేరు కుంతీపురం కౌండిన్య తిలక్. కలం పేరు కుంతి.

కేంద్రపభుత్వ ఉపాధ్యాయుడిని.విరివిగా సాహిత్యము చదవదము,కొద్దిగా వ్రాయడము నా అభిరుచి. పద్య ,గేయ కవితలు ,వేమన పై ,శతక సాహిత్యముపై విమర్శనాత్మక వ్యాసాలు, కధలు,కధానికలు వివిధ పత్రికలలో పచురితము. రేడియోలో ప్రసారితము.

ఇటీవలే శ్రీ చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారి చేతులమీదుగా ”యాదగిరి లక్ష్మీనృసింహ ముక్తావళి”, ’ప్రణతి వట్టెమ్ వేంకటపతి” అను నా కావ్యాలు ఆవిష్కృతము.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

One Response to థ్రిల్

  1. Anonymous says:

    ఎనభైల్లో బొమ్మరిల్లు పత్రికలో వచ్చిన కథలా ఉంది నాకైతే. కాకపోతే, కాస్త వివరంగా రాసినట్లుంది.

Comments are closed.