అశ్వమేధం

“ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది.”

లేప్‌టాప్ స్క్రీన్ మీద ఆ వాక్యాలని అరగంటనుంచి చూస్తున్నాడు నితిన్. అతని మస్తిష్కంలో మేలుజాతి జవనాశ్వాలు పరుగులు తీస్తున్నాయి. వాటికి ఱెక్కలు తొడిగి ఎగిరించాలని అతని ప్రయత్నం. అవి ముందుకూ వెనక్కూ పరిగెడుతున్నాయి. గుండ్రంగా తిరుగుతున్నాయి. చదరంగంలోని గుఱ్ఱపు దాట్లు కూడా వేస్తున్నాయి. కాని ఎంత ప్రయత్నించినా ఎగరడం లేదు!

ఆఫీసులో వారానికయిదు రోజులు నిప్పుతో చెలగాటం (దీన్నే ఇంగ్లీషులో ముద్దుగా firefighting అంటారు!). శరీరం, మనసు రెండూ అలసిసొలసి పోతాయి. అయిదురోజుల ఆ అలసటని రెండు రోజుల్లో తీర్చేసుకోవాలనే ఆరాటం. దాని కెన్నెన్నో మార్గాలు. సిమిమాలు, షికార్లు, పబ్బులు, పార్టీలు. ఆ లిస్టులో నితిన్ చేర్చుకున్న మరో ఐటం – సాహిత్యం. అతనికి కథలు చదవడం రాయడం ఒక మంచి మత్తు. అది మందు మత్తుతో కలిస్తే మరింత గమ్మత్తు.

పొద్దున సగం తిని వదిలేసిన సాండ్విచ్ టేబిల్ మీద ఎండిపోతూ పడుంది. పక్కనే సగం తాగిన బీర్ బాటిల్. తన గుఱ్ఱాలకి మరో గుక్కెడు కుడితి పట్టించాడు. కాస్త జోరుగా పరిగెట్టడం మొదలుపెట్టాయవి. స్క్రీన్ మీద వాక్యల వెంట అతడి కళ్ళు మరోసారి పరిగెత్తాయి. ఓ ఇంటర్నెట్ పత్రికవాళ్ళొక కథలపోటీ పెట్టారు. ఇచ్చిన సన్నివేశంతో మొదలుపెట్టి కథ రాయాలి. దానికోసం మంచి కథ రాసి పంపించాలని నితిన్ ప్రయత్నం. పరిగెడుతున్న గుఱ్ఱం ఒకటి ఒక్కసారిగా ఆగి, ముందు కాళ్ళు ఎగరేసి సకిలించింది. ఇలాంటి ఓపెనింగ్‌తో మాంచి సస్పెన్స్ థ్రిల్లర్ అల్లేయ వచ్చు!

ఆ యింట్లో ఒక హత్య జరుగుతుంది. ఒక ఒంటరి వ్యక్తి హత్య. యిరుగుపొరుగుల వాళ్ళకి రెండ్రోజులకి కాని తెలియదు. తెలియదని పోలిసులతో చెపుతారు. వాళ్ళందరూ నిజమే చెపుతున్నారా? ఇంతకీ హత్య జరిగిన వ్యక్తి ఎవరు? ఎవరా హత్య చేసింది? రెండో రోజు పాలపేకెట్లు వేసేటప్పుడు అక్కడ పడున్న ముందురోజు పేకట్లు చూసికూడా పాల అబ్బాయికి ఏ అనుమానం రాలేదా?

పాలంటే గుర్తుకొచ్చింది! పొద్దున్న పాలపేకట్ తీసుకోనే లేదు. పాలబ్బాయి పడేసిన పేకట్ అలానే ఉండిపోయుంటుంది! రాత్రి యింటికి వచ్చి పడుకొనేసరికి రెండు దాటిపోయింది. దానితో మధ్యాన్నమయ్యే దాక పక్క దిగలేదు. ఇప్పుడింక తీసి లాభం లేదు. పాలు పాడయిపోయుంటాయి. నితిన్ తన ఆలోచనలను మళ్ళీ కథ వైపుకి తిప్పాడు. చివరివరకూ సస్పెన్స్ ఉండేందుకు కథని ఎలా నడపాలో ఆలోచిస్తున్నాడు. అంతలో…

హల్లో గడియారంలోంచి బయటికొచ్చిన పిట్ట ఏడుసార్లు కూసి మళ్ళీ లోపలకి దూరింది. “అబ్బో! ఏడయిపోయిందే” అనుకున్నాడు. ఇప్పుడిక వంటచేసుకొనే ఆసక్తి లేదు. బయటకి కూడా వెళ్ళాలని అనిపించడం లేదు. పిజ్జాహట్‌కి ఫోన్ చేస్తే సరి. ఇంటికి తెచ్చిస్తారు. సెల్‌ఫోను తీసి నంబరు కలిపాడు. మీడియం సైజ్ ఆర్డర్ చేసాడు, మరునాడు బ్రేక్‌ఫాస్టు‌కి కూడా సరిపోతుందని. మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యాడు. హత్య గురించిన ఆలోచనలే అతని బుఱ్ఱ నిండా తిరుగుతున్నాయి. ఎనిమిదవుతూ ఉండగా డోర్ బెల్ మోగింది. పిజ్జా వాడే అయ్యుంటాడనుకొని తలుపు తెరిచాడు. చూస్తే ఎదురుగా పక్కింటాయన. ఈ టైములో తలుపుకొట్టాడేమిటి చెప్మా అని అనుమానంగా చూస్తూ ఉంటే, చిన్నగా నవ్వుతూ, “ఏం లేదు మీరు వీకెండ్ సాధారణంగా పూనే వెళుతూ ఉంటారు కదా. మీ యింట్లో లైట్ వెలుగుతూ ఉంటే ఏమిటా అని తలుపుకొట్టాను. అంతే!” అన్నాడతను. ‘అబ్బో! ఈ కాలంలో పక్కింటి వాళ్ళ గురించి యింతగా పట్టించుకొనే వాళ్ళున్నారా!’ అని మనసులోనే ఆశ్చర్యపోయాడు నితిన్. తనూ చిన్నగా నవ్వి, “లేదండీ, ఈ వీకెండ్ వెళ్ళ లేదు” అని క్లుప్తంగా జవాబిచ్చాడు. పక్కింటతను తన దారిని తాను వెళ్ళిపోయాడు. అతని చూపులో ఏదో అనుమానం ఉన్నట్టనిపింది. తలుపు వెయ్యబోతూ ఉండగా పిజ్జా మనిషి వచ్చేసాడు. అతడికి డబ్బు లిచ్చి పంపించేసి, లోపలకొచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఆలోచనలు కథ వైపుకి మళ్ళాయి. తను సస్పెన్స్ థ్రిల్లర్ అనుకున్నాడు కాని అందరూ అలాంటివే రాస్తారేమో, అని నితిన్‌కి అనుమానం వచ్చింది. అవును, ఆ ప్రారంభం చదవగానే ఎవరికైనా తట్టేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ప్లాటే. అబ్బే! అయితే యిది లాభం లేదు. అందరిలాగా తనూ రాస్తే తన కథకి ప్రత్యేకతేముంటుంది? అప్పుడు బహుమతి యెలా వస్తుంది? ఏదైనా వేరే విషయం ఆలోచించాలి, అనుకున్నాడు. అతని బుఱ్ఱలో గుఱ్ఱాలు మళ్ళా దౌడు తీయడం మొదలుపెట్టాయి.

పిజ్జా తినడం పూర్తయ్యింది. రెండో బీరు సీసా ఖాళీ అయింది. ఈసారి నితిన్ ఆలోచనలు సమాజం మీదకి మళ్ళాయి. ఏదైనా సామాజిక సమస్య నేపథ్యంలో కథ రాస్తే అందరికీ సులువుగా ఎక్కుతుంది. పాఠకులనుంచి మంచి ప్రతిస్పందన వస్తుంది. సామాజిక సమస్య అనగానే నితిన్‌కి గుర్తుకొచ్చింది ట్రాఫిక్ సమస్య. లక్షలు ఖర్చుపెట్టి కారు కొనుక్కొని ఏం సుఖం? పెట్రోలు కన్నా దాని ధరే యెక్కువగా మండిపోతోంది. పోనీ ప్రయాణమైనా సాఫీగా సాగుతుందా అంటే అదీ లేదు. భయంకరమైన ట్రాఫిక్, దానికి తోడు దరిద్రగొట్టు రోడ్లు. రోజూ ఆఫీసుకి పదిహేను కిలోమీటర్లు ఆ ట్రాఫిక్‌లో ప్రయాణం చెయ్యడమంటే వైతరణి దాటడమే! రోజుకు రెండుసార్లు దాటాల్సి వస్తోంది. లేన్లూ పాడూ ఉండవ్. ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా దూసుకుపోడమే. టూవీలర్ల వాళ్ళతో మరీ చిరాకు. ఇష్టమొచ్చినట్టు కార్లకడ్డంగా వచ్చేస్తారు, బొత్తిగా ట్రాఫిక్ సెన్సంటూ ఉండదు. మన ప్రభుత్వాలకి యీ సమస్య ఏమాత్రం పట్టదు, ఏం ఖర్మో! నితిన్‌లో ఆవేశం పెరుగుతోంది. మరో అర సీసాడు బీరు అతని ఆవేశానికి ఆజ్యమయ్యింది. నిద్రపోయే ప్రభుత్వమ్మీదా, రోడ్డంతా తమదే అనుకొనే బస్సువాళ్ళ మీదా, పక్కవాళ్ళని పట్టించుకోని ఆటోవాళ్ళ మీదా, రోడ్డు మీద ఇష్టమొచ్చినట్టు తుపుక్కు తుపుక్కని ఉమ్మేసే సెన్స్‌లెస్ జనాల మీదా – ఒకటేమిటి మొత్తం సమాజమ్మీదనే కోపం పొంగుకొస్తోందతనికి. ఈ ఇండియా తన జన్మలో బాగుపడదు. ఏదో పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి కుదరడం లేదు కాని, లేదంటే ఎప్పుడో అమెరికాలో సెటిలైపోయేవాడు తను. మూడేళ్ళక్కడ ఉండి కూడా తిరిగి వచ్చేసాడు. అయినా ఇంకెంత, మరొక్క ఏడాది. ఆ తర్వాత ఎలాగైనా తిరిగి అమెరికాకి శాశ్వతంగా వెళ్ళిపోడమే. అంతదాకా ఎలాగో అలా యీ ఇండియాని భరించక తప్పదు… తన గుఱ్ఱాలు దారి తప్పుతున్నాయని గ్రహించాడు నితిన్. మళ్ళీ కథవైపుకి ఆలోచనలని మళ్ళించడానికి ప్రయత్నించాడు. అయితే, ఇచ్చిన ప్రారంభంతో తను ఆలోచిస్తున్న సమస్యల్ని ఎలా ముడిపెట్టాలో తెలియలేదు. ఆ ప్రారంభ సన్నివేశం కథకి ముఖ్యమైనదై ఉండాలి కదా. ఎలా? ఏదో పెద్ద గోడొకటి అడ్డంగా ఎదురైనట్లు గుఱ్ఱాలన్నీ ఆగిపోయాయి. లాభం లేదు వేరే దారి వెతకాలి, అనుకున్నాడు నితిన్.

ముచ్చటగా మూడు సీసాలు ఖాళీ అయ్యాయి. గుఱ్ఱాలు మళ్ళీ తమ పరుగు మొదలుపెట్టాయి. మరింత వేగం పుంజుకున్నాయి. మనసు వెరయిటీ కోసం తపిస్తోంది. వాట్ ఎబౌట్ సైన్స్ ఫిక్షన్? మరో గుఱ్ఱపు సకిలింత. యెస్! మంచి ఆలోచన. గొప్ప వెరయిటీ. ఆ గుఱ్ఱపు కళ్ళేన్ని గట్టిగా బిగించి దాన్ని జోరుగా పరుగెత్తించాడు.

ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది.

ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడతడు. సరిగ్గా గడియారం ఏడు గంటలు కొడుతోంది. నాలుగువారాలై జరుగుతోందిది! ప్రతి ఆదివారం సరిగ్గా యిదే కల. ఇదే సమయానికి! ఏంటీ విచిత్రం? ఎందుకిలా జరుగుతోంది? ఏవరో ఎక్కడనుంచో తనకిలా స్వప్న సందేశం పంపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎవరై ఉంటారు? తనకే ఎందుకు పంపిస్తున్నారు? ఇలా పంపడం సాధ్యమేనా? ఈ విషయం తన గైడుతో మాట్లాడాలి. తాము చేస్తున్న టైం ట్రావెల్ ప్రయోగాలకీ వీటికీ సంబంధమేమైనా ఉందేమో! తాము ఊహిస్తున్నట్టుగా సమాంతర ప్రపంచాలు కనక ఉండి, కలలో మనకి కనిపించేవి వేరే యేదో సమాంతర ప్రపంచంలోని దృశ్యాలయితే, ఇదీ అలాంటిదే అయ్యుండవచ్చు. కాలంలో ప్రయాణం వేరే సమాంతర ప్రపంచంలోకి మాత్రమే సాధ్యం కాబట్టి, ఎలాగయినా అందులోకి వెళ్ళగలిస్తే?!

ఇప్పుడెక్కిన గుఱ్ఱం పంచకల్యాణిలా పరుగు తీయడం నితిన్‌కి మంచి హుషారుగా ఉంది. కాని ఆ హుషారుని బేజారు చేస్తూ ఓ ఆలోచన అడ్డంగా వచ్చి పడింది. ఇంత సైన్స్ ఫిక్షన్ని మన సగటు తెలుగు పాఠకులు తట్టుకోగలరా? అంతే! పరిగెత్తే గుఱ్ఱం ఒక్కసారిగా చతికిలపడింది. అబ్బే! తెలుగు పాఠకుల మీద అంత నమ్మకం పెట్టుకోడం కుక్కతోక పట్టుకొని గోదా రీదాలనుకోడమే. సామాజిక స్పృహా, ఉద్యమం, వాదం, మట్టీ మశానం.. వీటి చుట్టూనే తిరుగుతాయి కథలన్నీ. ఏ డయాస్పోరానో అయితే ఇహ ఇండియా గురించి నాస్టాల్జియాతో నిండిపోతుంది. ఈ మధ్య, చిన్ననాటి జీవితం గురించి పక్కా మాండలికంలో కథలు కథలుగా హోరెత్తించేయడం కొత్త ఫేషన్! ఎంతసేపూ ఏదో ఒక ఏమోషను గుండెల్ని పిండెయ్యాలనే అనుకుంటారు కాని, తమ ఆలోచనల్ని విశాలం చేస్తూ కొత్త కొత్త ఊహలకి ప్రాణంపోసే కథలని తెలుగు పాఠకులు ఎందుక్కోరుకోరు? నితిన్ మనసులో కసికి మరో సీసా ఖతం. ఛత్… అథోజగత్తులో ఉన్న పాఠకలోకం ఎప్పుడెదుగుతుందో! పోనీ ఎడిటర్లయినా మహా గొప్పగా ఉండేడిశారా అంటే అదీ లేదు! ఒకవేళ పొరపాటున ఎవరైనా ఏ కాస్తో ఇంగ్లీషు సైన్స్ ఫిక్షన్ చదివినవారైతే – “ఆఁ… యిదేదో ఇంగ్లీషు కథకి కాపీయే” అని కొట్టిపారేసే ప్రమాదం కూడా ఉంది! కాబట్టి యిది చాలా రిస్కుతో కూడిన వ్యవహారమని నిశ్చయించుకున్నాడు నితిన్. అక్కడితో ఆ గుఱ్ఱపు పరుగు ఆగిపోయింది.

లోపలికెళ్ళిన ద్రవం మెల్లిగా ఉపద్రవం మొదలుపెట్టింది. కళ్ళేల పట్ట్లు తప్పిన గుఱ్ఱాలు కల్లు తాగిన కోతులవుతున్నాయి. నాన్సెన్స్! ఓ చిన్న కథ రాయడానికింత సేపాలోచించాలా! అక్కర్లేదు. కాని మాంచి పవర్ఫుల్ స్టోరీ కావాలనుకుంటున్నాడు తను. అందికే యింత తాపత్రయం. ఒక రచయితగా అది తన బాధ్యత! లేప్‌టాప్ ముందు కూర్చుంటే పని జరిగేలా లేదు. ఆరుబయట పిల్లగాలికి మనసు కాస్త చల్లబడి కొత్త ఊహలు ఊపిరిపోసుకోవచ్చు. మెల్లగా లేచి బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు, చేతిలో బాటిల్‌తో. ఎదురుగా బెంగుళూరు నగరం విశాలంగా పరుచుకుని ఉంది… ఈ నగరం శనివారం రాత్రి నిద్రపోదు! చీకటితో చెలిమిచేస్తూ చుట్టూ పరుచుకున్న నియాన్ లైట్ల కాంతి ఒక గమ్మత్తైన నిషానిస్తోంది… రాతిరనే విటునికోసం అలంకరించుకున్న వేశ్యలాగా కనిపిస్తోందీ నగరం… ఎన్నెన్ని చాటుమాటు కలాపాలని చీకటి ముసుగుతో కప్పేస్తోందో! నిజానికి పై-క్లాసు, లో-క్లాసుల వాళ్ళకి ముసుగు లవసరం పెద్దగా ఉండదు. చాటుమాటు వ్యవహారాలన్నీ మిడిల్-క్లాసు వాళ్ళవే… విలువల వలువలు, మొహమాటపు ముసుగులు, సంస్కారపు మాస్కులూ – అన్నీ ఎటుకీ కాని మధ్యవాళ్ళకే… బ్లడీ మిడిల్ క్లాస్… నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోలేని పిరికివాళ్ళు… హిపోక్రెట్స్… వీళ్ళనీ వీళ్ళ పనికిమాలిన విలువలని కడిగేస్తూ ఓ ఘాటయిన కథ రాసిపారెయ్యాలి… యెస్… అదీ చైతన్యస్రవంతి ధోరణిలో అయితే మరింత రంజుగా ఉంటుంది…

ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది. టేబిల్ మీద ఒక బకాడీ బాటిల్, పక్కనే గ్లాసు. రెండూ ఖాళీగానే ఉన్నాయి. ఆ పక్కగా ఒక తెరిచి ఉన్న డైరీ. ఫ్యాన్ గాలికి పేజీలు రెపరెపలాడుతున్నాయి. టేబుల్ మీదకి పూర్తిగా ఒరిగిపోయి పడుకొని ఉందామె. కనురెప్పల మూసి ఉన్నా, వాటి వెనక మత్తు బరువు తెలుస్తోంది. ఆమె యిప్పుడు పూర్తిగా మరో ప్రపంచంలో విహరిస్తోంది. ఈ లోకంలోంచి ఆ లోకంలోకి వేసిన ఆలోచనల వంతెనలు, ఆ డైరీ అంతా పరచుకొని ఉన్నాయి. అవి చదివితే ఆమె ఎవరో తెలుస్తుంది. కానీ చదివేవారెవరు?

ఆమె ఎవరై ఉండవచ్చు? ఎందుకీ లోకమంటే ఆమెకంత కసి? ఏ సంకెళ్ళను తెంచుకొనే ప్రయత్నమది? ఏ స్వేచ్ఛా మైదానాల వైపు ప్రయాణమది? మైదానం… చలం… రాజేశ్వరి… సగటు మధ్యతరగతి మగువ… ఆమె రాజేశ్వరి కాదు కదా? అదెప్పటి రాజేశ్వరి! కాదు కాదు… ప్రతి తరంలోనూ ఎందరో రాజేశ్వరులు… ఎన్నెన్నో కథలు… ఈ రాజేశ్వరి కథేమై ఉంటుంది? ఇప్పటి పరుగుల జీవితంలో ఆమె ఒక ఉద్యోగిని… పరువైన ఉద్యోగం… బరువైన ఉద్యోగం… తనకన్నా ఎక్కువ సంపాదించే మొగుడు… అన్నీ ఉన్నాయి… అయినా… ఏదో దాహం… తీరని దాహం… ప్రేమ కోసం… తన భర్తకి తనపై ప్రేమ లేదూ? ఏమో… అసలు కలిసుంటేగా తెలిసేది… అతనో చోట తనో చోట ఉద్యోగం… ఎప్పుడో నెలకోసారి రెండ్రోజుల హడావిడి కలయిక… దూరమైన ప్రేమని మరిచిపోడానికి ఎన్ని ప్రయత్నాలు… ప్రేమలేని క్షణాలని నిర్దాక్షిణ్యంగా చంపెయ్యడానికి… రకరకాల నిషాలు… కొత్తగా ఈ మధ్యనే పరిచయమైన అమీర్… కానీ అతనిచ్చేది మామూలు మత్తు కాదు… ప్రేమ మత్తు… తనకి దూరమైన ప్రేమసుధలో తనని ముంచెత్తే మత్తు… కానీ… మధ్యతరగతి విలువలు… ప్రపంచం… భర్త… ఆఖరికి తన మనసూ… అన్నీ అడ్డంకులే… విలాసాల జీవితాలకి విలువలేమిటి? నాన్‌సెన్స్!

ఒక్కసారి షాక్ కొట్టినట్టై తల విదించాడు నితిన్. ఏమిటిది? తన ఆలోచనలిలా సాగుతున్నాయేమిటి? పూనేలో పని చేస్తున్న భార్య గుర్తుకొచ్చింది. ప్రాజెక్ట్ పనుందని తన నీ వీకెండ్ రావద్దని చెప్పింది. ఈ సమయంలో తనెందుకు గుర్తుకొచ్చింది?! ఆమెకీ ఈ కథకీ సంబంధమేమిటి? అంతా కన్‍ఫ్యూజింగా ఉంది! బుఱ్ఱంతా గిఱ్ఱున తిరుగుతోంది. లోపలంతా అల్లకల్లోలమై గుఱ్ఱాలన్నీ పరుగులాపి భయంతో సకిలిస్తున్నాయి. సుడిగాలిలో చిక్కుకున్నట్టు అతలాకుతలమైపోతున్నాయి. ఒకటే తలపోటు. ఇక లాభం లేదు. కథ ముందుకి సాగదు. తూగుతూ గదిలోకి వెళ్ళి అమాంతం మంచమ్మీద పడిపోయాడు నితిన్.

సూర్యుడు నిద్రలేచినా నితిన్ ఇంకా మంచమ్మీద అలాగే పడుకొని ఉన్నాడు. ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. ఆ అరుపుకి ఉలిక్కిపడి లేచాడు నితిన్. తలంతా దిమ్ముగా ఉంది. మెల్లిగా లేచి ఫ్రెషప్ అయ్యాడు. ముందురోజు సంగతులన్నీ ఒక్కటొక్కటే జ్ఞాపకమొస్తున్నాయి. మళ్ళీ కథ చుట్టూ ఆలోచనలు ముసురుకోడం మొదలుపెట్టాయి. ఎలాగైనా రాయాలన్న పట్టుదల పెరిగింది. కాని గుఱ్ఱాలన్నీ మన్నుతిన్న పాముల్లా పడున్నాయి. అన్ని గుఱ్ఱాలనీ ఒకసారి పరిశీలనగా చుసాడు. ఇందులో తన పందెం గుఱ్ఱమేది? బాగ ఆలోచించిన మీదట, ఏదైనా సామాజికసమస్యే అన్నిటికన్నా సేఫ్ బెట్ అనిపించింది చివరికి. లేప్‌టాప్ తెరిచి మళ్ళీ కథ మొదటి సన్నివేశం చదివాడు. గుఱ్ఱం పరుగందుకొంది. సామాజికసమస్య బలంగా చూపించాలంటే ట్రాజెడీ అవసరం. ఆ యింట్లో ఏదో ట్రాజడీ జరిగింది. హత్య అయితే క్రైం స్టోరీ అవుతుంది. అదే ఆత్మహత్యయితే?! యెస్. ఆత్మహత్య… ఒక యువకుడి ఆత్మహత్య! కారణం? నిరుద్యోగమే అవ్వాలి! ఈ కాలంలోకూడా నిరుద్యోగసమస్య ఉందా? అనుమానం వచ్చింది నితిన్‌కి. ఆఁ ఉండకేం చేస్తుంది. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూ..ఊ..ఊ..ఊ… ఉన్న దేశమేగా! తనకి తానే భరోసా యిచ్చుకున్నాడు. ఈ మధ్య చదివిన పేపర్లో వార్తలన్నీ ఒకసారి మననం చేసుకున్నాడు. సెజ్ పేరిట భూముల దురాక్రమణ, పంటలు పండక పొలాలని అమ్ముకొని కూలీలుగా మారుతున్న రైతన్నలు, అమెరికాలో రిసెషన్. అన్నీ వరసపెట్టి తలపుకొచ్చాయి. ఇంకేముంది, బ్రహ్మాండమైన కథ తయారైపోయింది! కొడుకుని ఇంజనీరింగ్ చదివించడం కోసం నానా అగచాట్లు పడే రైతు. చివరికి డబ్బుకోసం పొలాన్ని అమ్మేసి పట్నం వచ్చి కూలిపని చేసుకోడం మొదలు పెడతాడు. ఆఖరికా పొలంలో ఒక సాఫ్టువేర్ కంపెనీ వెలుస్తుంది. ఇంజినీరింగ్ పాసైన కొడుకు అదే కంపెనీలో సాఫ్టువేర్ ట్రైనీగా చేరతాడు. ఈలోపు రిసెషన్ దెబ్బతో ఆ కంపెనీలో లే ఔట్స్. ఆ యువకుడి ఉద్యోగం ఊడిపోతుంది. మరెక్కడా ఉద్యోగం దొరకదు. డిప్రషన్‌కి లోనై ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటాడు. యువకుడి ఆత్మహత్యతో కథ మొదలవుతుంది.

బాగుంది! సామాజికతతో పాటు సమకాలీనత కూడా ఉన్న కథ. నితిన్‌కి సంతృప్తి కలిగింది. ఈ కథని ఎవరు చెపితే బాగుంటుంది? యువకుడు, ఉత్తరంలో తనే చెప్పుకున్నట్టు రాస్తే? ఉఁహుఁ… అప్పుడు వర్ణనలకి పెద్దగా అవకాశముండదు. రసం పండదు! రచయితే చెప్పాలి. కానీ అందులో వెరయిటీ ఎముంటుంది? ఆఁ… రచయితకూడా కథలో పాత్రయితే? బాగుంటుంది. రచయిత, ఆత్మహత్య చేసుకున్న యువకుడి స్నేహితుడైతే చక్కగా కుదురుతుంది. కథ చివరన ఆ యింట్లోంచి – “నా చావుని నీ పేరుకోసం కథగా మారుస్తావా!” అనే అరుపు రచయితకి వినిపిస్తే? సూపర్! మాంచి పంచున్న ముగింపవుతుంది. కథకి ఒక కొత్త డైమెన్షన్ వస్తుంది! కచ్చితంగా బహుమతి కొట్టేసే కథ అవుతుంది. నితిన్‌కి ఉత్సాహం పుట్టుకొచ్చింది. అదే ఊపులో కథ మొత్తం రాసేయాలని నిశ్చయిచుకున్నాడు. చకచకా లేప్‌టాప్‌లో డాక్యుమెంట్ ఓపెన్ చేసి కథ ప్రారంభం టైప్ చెయ్యడం మొదలుపెట్టాడు…

“ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది.”

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

One Response to అశ్వమేధం

  1. Rajani says:

    కథ చాలా బాగుంది. ఇచ్చిన వాక్యాలు చివరలో ఒక్కసారి రావాలని అంటే మూడు సార్లు వచ్చేలా రాశారు. రచయితకు అభినందనలు.

Comments are closed.