‘మతిచెడిన’ మేధావులు

మన సంప్రదాయంలో లేదుగాని పాశ్చాత్య సంస్కృతిలో ఒకప్పుడు చంద్రుడి కళలకూ, మనుషుల చిత్త చాంచల్యానికీ సంబంధం ఉన్నట్టుగా భావించేవారు. పౌర్ణమి రోజున పిచ్చి బాగా ముదురుతుందని నమ్మే ధోరణి అప్పట్లో ఉండేది. పద్ధెనిమిదో శతాబ్దంలో ఇంగ్లండ్‌లో కొందరు మేధావులు తమ సహజ హాస్యవైఖరితో తమ బృందాన్ని పిచ్చివాళ్ళుగా అభివర్ణించుకునే ప్రయత్నం చేశారు. ఎటొచ్చీ వారు సామాన్యస్థాయికి చెందినవారు మాత్రం కారు. దీనికి కొంత నేపథ్యముంది.

ఏ యుగంలోనైనా మనుషులు తమకున్న జ్ఞానసంపదను వేరువేరువిషయాలుగా విభజించుకుని, వాటన్నిటినీ ఒకదానితో ఒకటి సంబంధంలేనివిగా పరిగణిస్తూవచ్చారు. మనుషులు పోగుచేసుకున్న జ్ఞానమంతా ఈనాడు వృక్షశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం మొదలైనవీ, ఆర్థికశాస్త్రం, చరిత్ర వగైరాలూ, మరొకవంక కవిత్వం, నాటకం, అలాగే రాజనీతిశాస్త్రం, ధర్మశాస్త్రాలూ, న్యాయచట్టాలూ ఈ పద్ధతిలో వేరువేరు సముదాయాలుగా కనిపిస్తుంది. ఇందుకు భిన్నంగా క్రీ.శ. పదోశతాబ్దంలో అనేకమంది ఇస్లాం తత్వవేత్తలు హకీమ్‌లుగా పేరుపొంది, తమ బహుముఖప్రజ్ఞద్వారా భాషాశాస్త్రం, వ్యాకరణం, రాజనీతి, విజ్ఞానవిశేషాలు ఇలా పరస్పరం సంబంధంలేవనిపించే విషయాలలో గొప్ప కృషి చేశారు.

ఇటువంటి ధోరణి మళ్ళీ 1770 ప్రాంతాల ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హం పరిసరాల్లో పొడచూపింది.

ఆ రోజుల్లో కొందరు మేధావులు కలిసి లూనార్ సొసైటీ (చంద్రసమాజం) అనేదాన్ని స్థాపించి, నెల కొకసారి పౌర్ణమి రాత్రిళ్ళు సమావేశం అయేవారట. వారు తమను తాము ‘మతిచెడినవారు’ (లూనటిక్స్) గా అభివర్ణించుకున్నారు. వీరిలో ఆవిరియంత్రం కనిపెట్టిన జేమ్స్ వాట్, ఆక్సిజన్ ఒక మూలకమని కనిపెట్టిన జె.బి.ప్రీస్ట్‌లీ, ప్రసిద్ధ అమెరికన్ రాజనీతిజ్ఞుడుగా, విద్యుత్తు గురించిన పరిశోధనలు చేసినవాడుగా పేరుపొందిన బెంజమిన్ ఫ్రాంక్లిన్, జీవపరిణామవాదాన్ని ప్రతిపాదించిన డార్విన్ తాతగారు ఇరాజ్మస్ డార్విన్ (వైద్యుడు, కవికూడా), పారిశ్రామికవేత్త బోల్టన్ తదితరు లుండేవారు (పటం). లేతవయసులోనే పరిశ్రమలో పనిచెయ్యనారంభించిన బోల్టన్‌కు అప్పట్లో అధునాతనమైన విద్యుత్తు, లోహాల లక్షణాలు వగైరాలపట్ల వైజ్ఞానిక కుతూహలం ఉండేది.

ఈ ‘మతిచెడిన’ మేధావులు గుర్రపుబగ్గీలలో ప్రయాణించేవారు కనక వెన్నెలరాత్రులు గుర్రాలకు దారి కనబడేది. అంతా కలిసి రాత్రి భోజనం చేశాక (మద్యం ముట్టని) ఈ చింతకులు అనేక విషయాలను చర్చించుకునేవారు. చర్చకు వచ్చే విషయాలమీద పరిధులూ, ఆంక్షలూ ఉండేవికావు. ప్రతిదాన్నీ స్వేచ్ఛగా విశ్లేషించి నిశితంగా ప్రతిపాదనలు చేసేవారు. అందరూ ప్రవీణులే కనక ఒకరి తెలివితేటలవల్ల మరొకరికి లాభం చేకూరుతూఉండేది. అంతేకాక ఏ విషయానికైనా సంబంధించనివారి సూచనలూ, అభిప్రాయాలూ అందులో నిష్ణాతులైనవారి బుద్ధికి పదునుపెడుతూఉండేవి. జేమ్స్ వాట్ బ్రిటిష్ రాజువద్ద ఖగోళవేత్తగా పనిచేసే విలియం హర్షల్ తదితరులతో రాజకీయాలూ, కవిత్వం గురించి చర్చించేవాడు. ఇతరులు ప్రీస్ట్‌లీతో వాయువుల మిశ్రమాలను రసాయనికంగా ఎలా వేరుచెయ్యవచ్చో మాట్లాడేవారు. ఇంజనీరింగ్ పరిశ్రమల వివరాలూ, సాహిత్యవిశేషాలూ, రాజకీయాలూ ఏవీ చర్చకు అనర్హం అనిపించుకునేవికావు. ఈ మేధావుల చింతనా ధోరణివల్లనే తరవాతికాలంలో ఇంగ్లండ్‌లో పారిశ్రామికవిప్లవం సాధ్యమైందని అంటారు.

అంతకుమునుపు ప్రతి విషయాన్నీ ప్రత్యేకమైనవిగా భావించి, చట్రాల్లో బిగించే ఆనవాయితీ ఉండేది. అలాకాకుండా వివిధవిషయాల్లో నిష్ణాతులైనవారందరూ ఒకేచోట కూర్చుని చర్చించుకోవడం ఆలోచనాత్మకపరిధిలో పెనుమార్పులు కలగడానికి దోహదం చేసింది. ఆ రోజుల్లో బ్రిటన్ రాజకీయంగా, సామాజికంగా మార్పులకు లోనయింది. జేమ్‌స్ కుక్ ఆస్ట్రేలియాను వశపరుచుకునే ప్రయత్నాలు చేశాడు. అమెరికాలోని బోస్టన్ రేవులో తేయాకుమీద బ్రిటిష్ ప్రభుత్వం విధించిన సుంకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన మొదలయింది. 1776లో అమెరికా స్వతంత్రదేశంగా వేరుపడడానికి ఇది ప్రేరణ నిచ్చింది. మరి కొద్దికాలానికే స్వయంగా పెనువిప్లవానికి లోనయిన ఫ్రాన్స్ కొత్తదేశంతో సంఘీభావం ప్రకటించింది. అదే ఏడాది జేమ్‌స్ వాట్ ఆవిరియంత్రం పనిచెయ్యసాగింది.

చంద్రసమాజం సుమారు 50 ఏళ్ళపాటు నడిచింది. ఇందులోని సభ్యులు స్వయంగా ప్రతిభావంతులూ, ఇతర ప్రముఖులకు శిక్షణనిచ్చినవారూకూడా. ఉదాహరణకు వైద్యవిజ్ఞానశాస్త్ర అధ్యాపకుడైన విలియం స్మాల్ అమెరికాకు తొలి ఉపాధ్యక్షుడైన ఠామస్ జెఫర్సన్‌కు గురువు. సభ్యులలో వృక్షశాస్త్రవేత్తలూ, తుపాకుల తయారీదారులూ ఇలా రకరకాల రంగాల్లో కృషి చేసినవా రుండేవారు. వీరిమధ్య సంపర్కం ఏర్పడడం అనేక కొత్త ఆవిష్కరణలకు కారణమయింది.

బోల్టన్ నడిపే పరిశ్రమకు దగ్గరలో ఉన్న సెలయేటి నీటిప్రవాహం సహాయపడేది. అయితే సెలయేరు ఎండినప్పుడూ, అందులో నీరు తగ్గినప్పుడూ యంత్రాలు తిరిగేవికావు. అప్పుడాయన చంద్రసమాజం సహసభ్యుడైన వాట్‌ను సంప్రదించి అతని ఆవిరియంత్రం గురించి వాకబుచేశాడు. ఈ సందర్భంలోనే వాట్ కార్బన్ డయాక్సైడ్ వాయువును కనిపెట్టిన జోసెఫ్ బ్లాక్‌నుకూడా సంప్రదించి గుప్తోష్ణం గురించిన వివరాలు తెలుసుకున్నాడు. గుప్తోష్ణం (లేటెంట్ హీట్) గురించిన సమాచారం ద్వారా త్వరలోనే ఆవిరిపంప్ తయారీ సాధ్యపడి బోల్టన్ పరిశ్రమకూ, ఇంకా ఎన్నో పెద్ద పరిశ్రమలు నడవడానికీ దోహదపడింది.

గుప్తోష్ణం అనేది ఏదైనా పదార్థం ఘనద్రవవాయురూపాల్లోకి పరివర్తనం చెందుతున్నప్పుడు ఉష్ణోగ్రత మారని పరిస్థితికి సంబంధించినది. ఉదాహరణకు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న మంచు అదే స్థితిలో నీరుగా కరుగుతున్నప్పుడు గ్రాముకు 80 కేలరీల ఉష్ణం విడుదల అవుతుంది. లేదా నీరు గడ్డకట్టినప్పుడు అంతే ఉష్ణం పీల్చబడుతుంది. అలాగే నీరు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆవిరౌ తున్నప్పుడు 540 కేలరీలు అవసరమౌతాయి. ఇదంతా బృహదణువులకు అందే శక్తి కనక పైకి కనబడని గుప్తోష్ణంగా పరిగణించబడుతుంది.

ఈ వివరాలు తెలిశాక జేమ్‌స్ వాట్ అతికొద్ది మోతాదులోని నీరు ఎక్కువ మొత్తంలో ఆవిరిగా మారుతుందని అర్థంచేసుకున్నాడు. అంతేకాక కొద్దిపాటి ఆవిరిలో ఉండే గుప్తోష్ణంద్వారా ఎక్కువ మొత్తంలో నీటిని వేడెక్కించవచ్చని తెలుసుకున్నాడు. ఆ తరవాత అతను నిర్మించిన ఆవిరి యంత్రంలో ఈ విశేషాలన్నీ ఉపయోగపడ్డాయి. వేడిమిని కోల్పోకుండా ఉండేందుకు అతను చెక్కతో కవచాలను తయారుచేసుకున్నాడు. యంత్రంలో ఉత్పత్తి అయిన వేడిమిని పొదుపుగా, తెలివిగా ఉపయోగించుకోవడంతో వాట్ నిర్మించిన ఆవిరియంత్రం విప్లవాత్మకమైన మార్పులు కలగజేసింది. రైలుబళ్ళూ, నేతమిల్లులూ ఇలా ఇంగ్లండ్ యావత్తూ ఒక్కపెట్టున పెద్ద పారిశ్రామికదేశంగా మారగలిగింది. ఇది యూరప్ చరిత్రనే మార్చేసిన పరిణామం. అంతేకాక చవకలో వినియోగానికి అనేక వస్తువులు తయారవడంతో భూస్వామ్యసంస్కృతి అంతరించిపోయింది. ఇదంతా కొందరు మేధావులు తరుచుగా కలుసుకుని ముచ్చటించడంవల్లనే సాధ్యపడిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.

ఈ రోజుల్లో విజ్ఞానసాంకేతికరంగాలు పూర్తిగా భిన్నమైన పద్ధతిలో నడుస్తాయి. ప్రతిదానికీ ధనం సమకూర్చడం, వాటిద్వారా తయారైన వస్తువుల విక్రయంవల్ల కలిగే లాభాలూ అన్నిటినీ సక్రమంగా, ప్రణాళికాబద్ధంగా చేపడతారు. శాస్త్రవేత్తలమధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు తరుచుగా ప్రపంచమంతటా సమావేశాలూ, వారి పరిశోధనల గురించిన వివరాలను ప్రచురించి, పంపిణీ చేసేందుకు ఎన్నో పత్రికలూ ఉంటాయి. ఇంటర్నెట్ వచ్చాక ఈ సమాచారవినిమయం మరింత విస్తృతంగా, ఎక్కువగా జరుగుతోంది. ఇదంతా జరుగుతున్నప్పతికీ పదునైన బుద్ధిగలవారు పరస్పరం జరుపుకునే పిచ్చాపాటిలో ఎన్నో కొత్త ఊహలు మెరుపుల్లా మెరుస్తాయనే విషయంలో మటుకు సందేహంలేదు. ఇవి ఎన్నో సందర్భాల్లో ఉన్నతమైన ప్రగతికి దారితీశాయి.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

3 Responses to ‘మతిచెడిన’ మేధావులు

  1. b j vidyadhar says:

    Thanks

  2. Mahesh says:

    rohini prasad garu meeru echina samacharam valla teliyani chaala kottha viseshalu telusu kunnanu. Mee posts ni ika paina regular ga follow avvali ani fix ayyanu :)

  3. Rohiniprasad says:

    ఏ విషయం గురించైనా సరే ఈ రోజుల్లో అంతులేని సమాచారం లభిస్తుంది. సైన్స్ గురించి ఎన్నో మంచి పుస్తకాలనుంచీ, ఇంటర్నెట్‌నుంచీ కూడా చాలా తెలుసుకోవచ్చు. నేను చేస్తున్నదల్లా అందులో మన పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయనిపించే సంగతులను సులభశైలిలో వివరించడమే. ఈనాటి కాల్పనిక సాహిత్యం అంత కన్విన్సింగ్‌గా ఉండటంలేదు కనక వైజ్ఞానిక దృక్పథం పెంపొందించడమే ముఖ్యమని నేననుకుంటున్నాను. ఈ ప్రయత్నం ఎవరికి నచ్చినా నాకు సంతోషమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *