సత్యప్రభ – 3

5 ప్రకరణం.

సత్యప్రభ 3 - పొద్దు

కడపటి మాటలు మహామంత్రికి పోయిన ప్రాణానికి జీవం పోసినట్లు అయింది. కాని ఉత్తర విషయాల పట్ల చర్చ ఎట్లు ముగుస్తుందో అని అతడు ఆందోళన చెందాడు.

గజవీరుని జాబు విన్నప్పుడు  సుచంద్రుని  అంతఃకరణలో  తాను  రాజకార్యాలలో  తగినంత శ్రధ్ధ  తీసుకొనక పోవడం నిజమే అని తోచింది.. మహామంత్రి చర్యను  గురించి కూడ అనుమానం కలిగింది. అతడు లంచగొండియే కానప్పుడు , అతనికి అంత గొప్ప సంపద పట్టడానికి  హేతువేమిటని  మహారాజు మనసులో శంక పుట్టింది. శివంకర సంఘం వారు మహామంత్రి  విరోధులే గాని రాజ విరోధులు కారని  అతనికి  స్ఫురించింది. మహామంత్రి  రాష్ట్రీయులు  తండ్రి  కొడుకు లిద్దరున్నూ చేరి  పట్టుబట్టి  శివంకర సంఘాన్ని  విప్లవ సంఘంగా  ప్రకటింప చేసినది  అన్యాయమేనేమో  అని ఆ ప్రభువు తటపటాయించాడు .శాంతిసేన  జాబు  ప్రభువును  మరింత కల్లోల పరచింది. చంద్రప్రభ  మోసమే చేసినట్లయితే  వీరేశ్వరుని పదభ్రష్టుని  చేసి, శాంతిసేనకు సింహాసనాన్ని ఇచ్చి  వేయాలని  అతనికి తత్కాలం ఒక భావం పుట్టింది.

పార్థివుని  ముఖచ్ఛాయలో నుండి  సచివుడు  లోపలి  భావాన్ని పసి గట్టాడు. సుమారు  ఇరవై రెండు సంవత్సరాలు  నిరంకుశంగా రాజకులంలో  విజృంభిస్తున్న  మహామంత్రి  పతాకను  ఆ దినం దింపి వేయ వచ్చునని  అతడు  ఆశించాడు.  రాజుగారి  ముఖం  తనకి అనుకూలంగా  లేదని  మహామంత్రి కనిపెట్టక పోలేదు. మంత్రాలోచనకు  మరి  రెండు రోజులు  వాయిదా  వేయాలను కొన్నాడు. వాయిదా  పడితే  అంతః పురం  లోని  తన  సమ్మోహనాస్త్రం  రాజాంతః కరణాన్ని మార్చి వేయ గలదని  అతని  ఆశ !

సచివుడు  లేఖా  పఠనాన్ని ముగించి, ఆసనంపై  కూర్చొన్నాడు. కొన్ని క్షణాలు  ఆ రంగ స్థలం నిశ్శబ్దంగా ఉండింది. మహారాజే ప్రసంగ ద్వారాన్ని తెరచాడు.

“చిన్న మామయ్యా ! నిశంభు నాగుని  జాబుకు  ప్రత్యుత్తరం  ఏ విధంగా  ఇవ్వాలి ?”

“ఈ విషయాన్ని సంపూర్ణ  మంత్రి సదస్సులో చర్చిస్తే  బాగుంతుందని నా  మతం. మనం  విప్లవ సంఘాన్ని సులభంగా అణచి వేయగలమా లేదా, అన్న విషయంలో  రాష్ట్రియునితోనూ, సేనాపతి తోనూ చర్చింప వలసి ఉంది. నిశంభునికి  పర రాజుల  మద్దత్తు  కలదేమో  అనే సంగతిని  ఆలోచించడానికి  దూతసామంతుని  సహాయం అవసరం. అలాగే పన్నులు  తగ్గించడానికి అవకాశం  కలదా అనే సమస్య  మహాసమాహర్త  తేల్చవలసి ఉంది.” అన్నాడు మహామంత్రి.

“ విప్లవ సంఘాన్ని  ఆణచడానికి  మనలో  సామర్థ్యం  ఉన్నప్పుడు నిశంభునితో  సంధి చేసుకోకూదదనేనా మీ భావం ?” అని ప్రశ్నించాడు మహారాజు.

“మహాప్రభో ! అది  రాజనీతి ! సాధ్య శతృవుతో  సంధి  అకార  లేదని నీతివేత్తలు అంటారు. నిశంభుడు  ధర్మాన్ని అనుసరించి  చిత్రకూట రాజ్యాన్ని తనకి ఈయమని కోరలేదు.వాడు కోరేది న్యాయం కాదు. తన  క్రౌర్యంచే  రాష్ట్రాన్ని  గాసిపెట్టి, భయాన్ని  పుట్టించి ఇప్పుడు వాడు తన  క్రూర చర్యలని ఆపడానికి  ప్రతిఫలంగా రెండు ప్రాంతాల్ని కోరుతున్నాడు ! వాని క్రూర చర్యలని  ఆపడానికి మనకి  శక్తి  ఉన్నప్పుడు  వానికి మనం ఎందుకు లొంగాలి ?”

“వాని క్రూర చర్యలని ఆపే  శక్తి మనకి ఉందా, లేదా  మీ  అభిప్రాయం ఏమిటి ?”

“ఉందనే నా అభిప్రాయం ! అయినా రాష్ట్రీయ, సేనాపతులని కూడా  ఈ విషయంలో  సంప్రదించడం  బాగుంటుందని నా మతం.”

అన్ని విషయాలపై చర్చ వాయిదా వేయించేందుకే  మహామంత్రి  ఇలాంటీ ధోరణీ అవలంబించినాడు. ప్రథమ విషయం తక్షణమే ఆలోచించడంలో అతని కెలాంటి ప్రతిబంధకం లేదు. కాని మొదటి దానికి వాయిదా పడితేనే గాని తక్కిన రెండు విషయాలు వాయిదా వేయించడానికి హేతువు దొరకదు. ఊ గుట్టు మహారాజు కనిపెట్టక పోయినా సచివుడు తెలుసుకొన్నాడు.ఆ సమయం తప్పితే రాజుగారి వేడిని చతురు రాలైన రాణి చల్లార్చి వేస్తుందని  సచివుడు తలంచాడు. ఆ పుణ్య కాలాన్ని వృథాగా పోనివ్వ కూడదని  కూడా తలంచాడు. మాట్లాడడానికి తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు.

ఇంతలో రాజు సచివుని ముఖాన్ని చూసాడు. ఆ చూపు ‘నీవు మాట్లాడు అన్నట్లు  సూటిగా కనిపించింది. పిమ్మట  సచివుడు , మహమంత్రి  సూచనని  నిర్మొహమాటంగా ఈ విధంగా ఖండించాడు.’

“మహాప్రభో ! నా శాఖలో ఇతరుల జోక్యాన్ని నేను సహింప జాలను.మన రక్షిదళం శక్తి  లేనిదని చెప్పడానికి రాష్ట్రియినికి అధికారం లేదు. చోరులను పట్టడాం అతని పని గాని, చేతకాదని  చెప్పడం అతని పని కాదు.అతనికి చేత కానప్పుడు మర్యాదగా పనిని విడిచి  పెట్టాలి. రాష్ట్రియుడింకా పనిలో ఉన్నందున తన రక్షక దళం విప్లవ సంఘాన్ని అణచి వేయగలదని నమ్మకమున్నట్లే అని మనం  ఎంచ వచ్చును. సేనాపతి కూడా రాజాఙ్ఞని అనుసరించి పోరవలసిన  వాడే గాని, నాకు చేత కాదని యుధ్ధాన్ని తప్పించుకొను అధికారం అతనికిలేదు. దూత సామంతునికి , పర రాజుల మద్దత్తు నిశణ్భునికి ఉందని తెలిసి ఉంటే అతను ఇదివరలోనే  శ్రీవారి ఎదుట మనవి చేసి ఉండేవాడు. ఇప్పుడు క్రొత్తగా అతని అడగ వలసిన  ప్రమేయం లేదు. సంధిమ్ అవసావసరాలని చర్చించే అధికారం ఇద్దరికే  ఉంది. పర రాజులతో సంధి  సూత్రాలని ఆలచించాల్సి ఉన్నప్పుడు దూత సామంతుడును , దేశీయ విప్లవకారులతో సంధి సూత్రాలని ఆలోచించ వలసి ఉన్నప్పుడు  సచివుడున్నూ  రాజకులంలో  అధికారులై  ఉన్నారు. దీనిలో మహాసమాహర్త గాని మరి ఏ ఇతర శాఖా మంత్రి గాని,జోక్యం చేసుకోవడం రాజకుల సాంప్రదాయానికి విరుధ్ధం. ఇప్పటి  ఆలోచనలో  శాఖాంతర  సంబధ్ధ విషయాలు  అంగభూతంగా  చర్చకు వచ్చేటప్పుడు  సర్వ శాఖాధికారి  మహామంత్రి ఉండనే  ఉన్నారు. కాబట్టి ఈ విషయం ఈ రాజకులం లోనే  చర్చింపబడ వలెను.పూర్ణమంత్రి సదస్సు కూర్చనవసరం లేదు.

“ఇంత  గొప్ప సమస్యని మనం ఇద్దరం  మాత్రమే  భాద్యత వహించి చర్చించుట  అంత మంచిది కాదు.” అని

చెప్పాడు మహామంత్రి..

రాజుగారికి  ఇంకా  తన మహమంత్రి  తత్త్వం  బోధపడ  లేదు. వాస్తవంగా క్లిష్ట సమస్య కాబట్టి  మహామంత్రి పూర్ణమంత్రి  సదస్సును సూచిస్తున్నాడని తలంచాడు.  సచివుని వాదం కూడ  అతనికి యుక్తి యుక్తంగా తోచింది. కాబట్టి ఇద్దరినీ గౌరవిస్తూ  నరపతి ఇలా అన్నాడు !

“యథావిధిగా  ఈ చర్చ జరిగి పోనీండి. కొసకి మన తీర్మానం అమల్లో  పెట్టే సమయంలో  నా  కేమైనా సంశయం  కలిగినప్పుడు, నా అసాధారణ  అధికారాన్ని  ఉపయోగించి  పునరాలోచనకి సంపూర్ణ  మంత్రి సదస్సుని  సమావేశం చేస్తాను.”

ఈ సూచన మహామంత్రికి ప్రియంగా ఉంటుందని  మహారాజు  తలంచాడు. మహామంత్రి  రాజుగారి  సూచనకు బదులేమిన్నీ  చెప్పలేక  పోయాడు. తాను  పరాజితుని వలె  మానసికంగా క్రుంగి  పోయాడు.సచివుడు సంతోషించాడు. ఆలోచనా  కండ ఆరంభ మయింది. శాఖామంత్రి  ముందుగా మాట్లాడాడు.

“మహాప్రభో ! అట్లే కానీయండి. నిశంభు నాగుడు  పంపిన  మూడు షరతులలో  ఒకటి కూడా మనకు ఆచరణ సాధ్యం కాదు. చిత్రకూట రాష్ట్రాన్ని  మీ నాన్నగారు బాబయ్య గారికి  ఇచ్చారు. వారి వారసుడు  ఇప్పుడు దానిని అనుభవిస్తున్నాడు. అతని వారసత్వం సరైనదేనా , వంచనా లబ్ఢమా  అనే విషయం ఈ సమస్యలో  ముఖ్యమయినది  కానేరదు. ఎట్లయినా  మేఘస్వామి భట్టారకుల వారి  వారసులు  అనుభవించ  వలసినదే , ఆ రాష్ట్రం ! దానిని  ఇంకొకరికి ఇచ్చివేయటం దత్తాపహార మవుతుంది. పార్వతీయ  ప్రాంతం  శ్రీవారి జయచిహ్నం. అనేకాంధ్ర వీరుల రక్తానికి ప్రతిఫలంగా  వచ్చింది ఆ ప్రాంతం. నిశంభుని  మాటపై పన్నులు  తగ్గించడం  మనకి  కీర్తికరం  కాదు. ఆ క్రూరుడైన  దొంగ  మహారాజ  సుచంద్రుల  వారి ప్రభుత్వంచే  బాధపడే  ప్రజలను  ఉధ్ధరించానని తాను డాబులు  కొట్టుకొనడాని కిన్నీ,  మన ప్రభుత్వ కోశాన్ని దుర్బలం చేయడాని కిన్నీ  వేసిన ఎత్తుగడ  ఇది !”

మహామంత్రికి కూడా నిశంభునితో  సంధి ఇష్టం లేదు. తాను రూపచంద్రుని సమర్థించిన , అంతటితో  ఆ  విషయం  ముగిసి, ఇతర  విషయాల  చర్చకి  తావిస్తుంది ! అది అతనికి ఇష్టం లేదు. ప్రథమ విషయ  విచారణలో కాలాన్ని పొడిగించి  చాల రాత్రి  అయిందను  మిషచే అనంతర  విచారణకు వాయిదా  వేయించాలని  అతడు మరొక  ఉపాయాన్ని  ఆలోచించి  సచివుని సూచనకు అడ్డుపెట్టి  ఇలా అన్నాడు.!

“నిశంభుడు పంపిన షరతులు మనకు అంగీకారం కాకపోవచ్చును.అయినప్పటి కిన్నీ,వారి సంధి సూచనలను మనం పూర్తిగా  తిరస్కరించడం  మంచిది కాదు. వేరు సంధి  షరతుల్ని  మనము వానికి  పంపాలి. అవి ఏ విధంగా ఉండాలో  మనం  ఇప్పుడు  ఆలోచించాలి.”

“సుమారు కోటి కార్షాపణములు (రూపాయలు) తక్కువ  లేకుండా  సర్కారు వారి సొత్తుని నిశంభుడు అపహరించాడు. వాడు అపహరించిన  ప్రజల సొమ్ము దానికి ద్విగుణంగా ఉంటుంది. నూరు మందికి తక్కువ లేకుండా మన రక్షక భటులు  వాని అనుచరుల చేత చంపబడ్డారు. సామాన్య ప్రజలలో కూడ ఎన్నో హత్యలు  వానిచే  కావింపబడ్డాయి. ఈ తప్పులకి వాడు, వాని అనుచరులు  దారుణమైన రాజదండనం  పొందతగి  ఉన్నారు. తాను ఇక మీద తన దుశ్చర్యలకి  స్వస్తి చెప్తానని  వాడు అంగీకరించి నప్పుడు అతని సంఘాన్ని క్షమించడమే మనం వానికి సూచించే సంధి షరతుగా ఉండాలి.”

“ఈ సూచన అయ్యా, నీతో మాకు సంధి పొసగదు అని చెప్పడానికి పర్యాయ  పదం !” అని నవ్వాడు మహామంత్రి.

“అయితే  మీ ఉద్దేశమేమి ?” అని ప్రశ్నించాడు మహారాజు.

“మన రాజ్యంలో నాగుల సంఖ్య మిక్కుటంగా ఉంది. వారికి ఇంకా కాకుల, మంథనాధ వంశాలపై  భక్తి అంతరించ లేదు.”

“నేను అడిగితే మీరు సూచించే సంధి షరతు,” అని చటుక్కున మహామంత్రి కాల విలంబన సూత్రానికి అడ్డుకర్ర వేసాడు మహారాజు.

దొరికి పోయిన దొంగవలె  మహామంత్రి  ఇలా అన్నాడు.

“ఏదైనా ఒక సంస్థానాన్ని సృష్టించి నిశంభునికిచ్చి, వానిని సామంతునిగా స్థాపించిన మనకంత నష్టం ఉండదను కొంటాను.”

“ఇద్దరొక సంస్థానంతో తృప్తిని ఎట్లు పొందగలరు ?” ఎదురు ప్రశ్న వేసాడు రూపచంద్రుడు.

“వారిద్దరూ భార్యాభర్తలై ఉంటారని నా ఊహ !”

“రాష్ట్ర మధ్యంలో వారికి సంస్థానాన్ని ఇవ్వడం చాలా అపాయకరం. అక్కడ నాగుల సంఖ్య అధికంగా ఉంది. అతడు సమయం చూసుకొని పునర్విప్లవాన్ని లేవతీయడానికి  అవకాశాలుంటాయి. పార్వతీయ ప్రాంతాన్ని ఒక మహా మండలంగా ఏర్పరిచి వారికి సామంత రాజ్యంగా ఇచ్చిన  బాగుంటుంది. ఇదే నా అభిమతమైన సూచన. పార్వతీయ ప్రాంతంలో నాగుల సంఖ్య చాలా స్వల్పం.” అని చెప్పాడు సచివుడు.

“పార్వతీయ  ప్రాంతంలో భర్తృదారిక  రథినీ కుమారిని  మహామండలేశ్వరిగా  అభిషేకించిన  బాగుండునని  మేము  ఇది వరలో తలంచుతున్నాము. వివాహానంతరం ఆమె ఒక  మహామండలేశ్వరిగా ఉండడం వాంఛనీయం,” అన్నాడు  మహామంత్రి.

“ఆ అడవులకి కుమారిని  పంపడం నాకిష్టం లేదు,” అన్నాడు రాజు.

“సర్కారు వారి  జయచిహ్నమైన  పార్వతీయ  ప్రాంతాన్ని ఇతరులకి  స్వాధీన పరచడం యుక్తం కాదని  ముందు చెప్పిన సచివ  మహాశయుడు  ఇప్పుడు దానిని విడిచి  పెట్ట  వచ్చునని చెప్పడం అబ్బురంగ ఉంది,” అన్నాడు మహామంత్రి.

“స్వతంత్రంగా  ఇవ్వకూడదనే నే నన్నాను. సామంత రాజ్యంగా ఇచ్చినప్పుడు మన అధికారం ఉండనే ఉంటుంది.”

“సచివుడు చెప్పిన  సూచన బాగానే ఉంది. ఇరావతీ నిశంభు లిద్దరూ సంధికి అంగికరించే పక్షంలో  వారికి సామంత  రాజ్యంగా  పార్వతీయ మహా మండలాన్ని  ఇచ్చివేయ వచ్చును. దంపతులై కలిసి  రాజ్యం చేసుకోవడమో , లేక  రెండు మండలాలుగా  విభజించు కొనడమో  వారి ఇష్టం ! ” అని మహమంత్రిని చూసి, “ ఈ సంగతిని  రేపు ప్రాతఃకాలమందు యోగీశ్వరి  ధవళాక్షికి  ప్రభుత్వ పరంగా  మీరు తెలియ  పరచండి.దీనికి పునరాలోచన  అవసరం లేదు,” అని ప్రథమ  విషయ ఆలోచన  ఘట్టానికి  పరిసమాప్తి  చేసాడు మహారాజు.

“ఆఙ్ఞ ప్రకారం అలాగే  చేస్తాను” అని  హీన స్వరంతో  చెప్పాడు  మహామంత్రి.

“కౄరుడైన  నిశంభునితో  సంధి  నాకు ఇష్టం లేనప్పటికీ  జటాముని  సంధిని ఆశించుట వల్లనూ, చిన్న  మామయ్య కొసకి  సంధికి  సలహా  ఇచ్చినందు వల్లనూ  నే నొక  విధమైన సంధి మార్గానికి వచ్చాను.”

కడపటి మాటలు మహామంత్రికి  పోయిన  ప్రాణానికి జీవం పోసినట్లు  అయింది. కాని ఉత్తర  విషయాల  పట్ల చర్చ  ఎట్లు  ముగుస్తుందో  అని అతడు ఆందోళన చెందాడు.

====================

6 ప్రకరణం.

మంతనపు ద్వితీయ ఘట్టం ప్రారంభ మయింది. కొన్ని క్షణాల వరకు  రాజకులం  నిశ్శబ్దాన్ని వహించింది. అనంతరం  మహారాజు  నిశాత  దృష్టితో  మహామంత్రిని  చూసి ఇలా  అన్నాడు.

“చిన్న మామయ్యా ! శివంకర  సంఘ నాయకుని  జాబుని  గమనించారా ?”

“గమనించాను, నన్ను  దూషించడమే  ఆ జాబు  ముఖ్యోద్దేశమని తెలుస్తోంది.”

“దానికి  మనం ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలో విచారించండి. శివంకర  సంఘం  ముఖ్యోద్దేశాలేవో కనుక్కోవడం  చాల అవసరం. నేను వారి ప్రతినిథితో మాట్లాడవచ్చునా, కూడదా ? మీ అభిప్రాయం చెప్పండి.”

రెండు మూడు క్షణాలు ఆలోచించి మహామంత్రి  ఇలా అన్నాడు.

“ఒక షరతుని  వారంగీకరించిన, శ్రీవారు వారి ప్రతినిధితో మాట్లాడ వచ్చును.”

“ఆ షరతేది ?” అని ప్రశ్నించాడు రాజు.

“గజవీరుడు తన సంఘంతో బయటపడి వచ్చి అందరిని క్షమాబిక్ష కోరినచో వారి ప్రతినిథితో శ్రీవారు  మాట్లాడ వచ్చును.”

సుచంద్రుడు రూపచంద్రుని చూచాడు. వెంటనే  రూపచంద్రుడు ఇలాగు మాట్లాడాడు.

“శివంకర సంఘం నుండి ఎలాంటి వాఙ్ఞూలాన్ని పుచ్చుకోకుండానే రాజకులం ఆ వీర యువకుల సంఘాన్ని విప్లవ సంఘంగా  ప్రకటించింది.”

“అర్థోక్తిలో  సునందుడు అడ్డుపడి , “రాజకుల చర్యల్ని విమర్శించడానికి సచివునకు అధికారం లేదు.” అని ఖండించాడు.

“సచివునకు  వ్యక్తిగతంగా  అధికారం లేదు. ఇప్పుడు సచివుడు  రాజకులంలో కూర్చొన్నాడు. అతడు చేయు విమర్శనము రాజకులంచేసినట్లే ఎంచ వలెను. ఒక రాజకులం చేసిన  నిర్ణయాన్ని మరొక రాజకులం  సందర్బానుసారంగా  విమర్శించ వచ్చునన్న  నిబంధన అభ్యనుఙ్ఞను ఇస్తుంది.”

“ఔను తప్పు లేదు, మీ వాదన సాగనివ్వండి” అన్నాడు మహారాజు.

మహామంత్రి తన స్థితి చెడిపోయిందను కొన్నాడు. తన మాట యిదివరలో రాజకులంలో ఎన్నడూ ఖండింప బడలేదు. ఈ రాత్రి సచివునిచే అది (తన మాట) తెలకపిండి ముక్క కంటె అన్యాయంగా విరిచి వేయబడింది. ‘ఈ భట్టు వానికి కండ్లు నెత్తి మీదికి వచ్చాయి. వీణ్ని నేనే ఉద్యోగంలో వేయించాను. ఛీ! రాజుల్ని నమ్మకూడదు. అనేక సంవత్సరాలు తమ్మాడించన వారిని కూడ పాములు కరవడం కద్దు. రాజులు కూడ అలాంటివారే !’ అని  లోలోపల ఆ మహామంత్రి  విలపించాడు.

“మహాప్రభో! శివంకర సంఘం వాస్తవంగా సక్రమాందోళన సంఘమే కాని విప్లవ సంఘం కాదేమో! దాని స్వరూపాన్ని తెలుసుకోడానికి భట్టారకుల వారు ఏల ప్రయత్నించ రాదు ! తమ నిజస్థితిని వెల్లడించుకోడానికి వారికొక అవకాశం ఏల ఇవ్వకూడదు ? మన ఆంధ్ర దేశంలో వేడి రక్తం గల వేలకొలది యువకులు శివంకర సంఘంలో సభ్యులుగా ఉన్నారని వినికిడి. అపరాధాన్ని న్యాయస్థానంలో నిర్థారించక ముందే ఒక రాజకుల ప్రకటనని ఆధారం చేసుకొని వారి నందరినీ  నిష్కారణముగా వధించ వలసినదేనా? గజవీరుడు వ్రాసినట్లు  వారు దేశానికి, మన కుండినుల ప్రభుత్వానికి భక్తులనే నా తలంపు. శ్రీరామచంద్రుడు ప్రజలు తన కృత్యాన్ని విమర్శించినంత మాత్రాన వారిని విప్లవ కారులుగా ప్రకటించెనా? ప్రత్యుత వారి విమర్శని పాటించి తన ప్రియకాంతను అడవుల పాలు చేసాడు. ప్రభుత్వ విమర్శనం కాని, రాజచర్యా విమర్శనం కాని  రాజద్రోహం కాదని  నా మతం. రాజుని వధించడానికో, లేక పదభ్రష్టుని చేయడానికో యత్నించడమే రాజద్రోహమవుతుంది.”

సచివుని ఉపన్యాసాన్ని విని మహారాజు మహామంత్రిని చూచి ఇలా  అన్నాడు, “సచివుని వాదం నాకు నచ్చింది. ఏకాదశీ స్థిరవారం నాడు, సాయంకాల కృత్యాలు తీర్చుకొన్న తరువాత, శివంకర సంఘ ప్రతినిధి మాతో, ఈ విమానం షష్ట భూమికలో – సాధారణంగా  విదేశ దూతలతో మాట్లాడు గదిలో – కలిసి మాట్లాడవచ్చునని, రేపు కాణ్వ శుకనాసునికి తెలియ పరచండి.”

“ఆఙ్ఞా ప్రకారం లాగే చేస్తాను.” అని సన్నగిల్లిన స్వరంతో మహామంత్రి చెప్పాడు.

ఆ సన్నని స్వరం  సునందుని మనః కష్టాన్ని ఉచ్చస్వరంతో  చాటినట్లయింది. ఆ గదిలో  ఇరవై రెండు సంవత్సరాలు విజృంభించిన రాజకుల  కేసరి  ఈ రాత్రి  ఘోర పరాజయాన్ని  పొంది, పిల్లివలె  ఆసనంలో  క్రుంగి పోయింది.

అనేక  వర్షాలనుండి, సమయానికి వేచి ఉండిన  సచివుడు, ఈ రాత్రి గొయ్యి తీసి పాతి పెట్టేయాలని నిర్ణయించుకొన్నాడు. ఇప్పటికి అందులో సగం  పని పూర్తి  అయింది.

===============

About వాసిష్ఠ

‘వాసిష్ఠ’ అన్నది , అయ్యల సోమయాజుల మహాదేవ శాస్త్రిగారి కలం పేరు. వీరు ‘ నాయన గారి’ కుమారులు. ఆయన రచనలో రమణీయత, మృదుమనోహరమైన భావాలు కనిపిస్తాయి. ఆయన గద్యరచనలోనే కాక, పద్య రచనలో కూడా సిధ్ధహస్తులు. ‘గణపతి స్తవము’, ’భక్త కుచేలుడు’, ’ప్రహ్లాద చరితము’, ’తోటక మాలా దశకం’, ’పార్థ సారధి శతకం’, ’పంచ చామర పంచ రత్నములు’, ’బాల ద్విపద రామాయణము’, ఇత్యాది పద్య రచనలే కాక, చాలా కథానికలు వ్రాసారు.

ఆయన కథానికలలో ప్రముఖమయినవి, ‘వృషాకపి’, ’జనస్థానం’, ’రాచప్పడు’, ’ఆంభ్రుణి’, ’కాత్యాయని’ మొదలయినవి ఆంధ్రప్రభ లోనూ, ‘ఉచ్చిష్ట సోమరసం’ అనే కథ ‘చుక్కాని’ లోనూ ప్రచురించ బడ్డాయి. ’గణపతి,’ ’ఇంద్రుడు’ , ’అగ్ని’, ’సంభాషణము’, ’మృదు కళ’ మొదలయినవి ఆయన వ్రాసిన వ్యాసములు. వీటన్నిటిలో ముద్రింప బడిన వాటి కన్న అముద్రితాలే ఎక్కువగా ఉన్నాయి.

ఈయన తంజావూరు సరస్వతీ మహలు గ్రంధాలయంలో తెలుగు రీసెర్చి పండితునిగా పనిచేసి, ’విప్రనారాయణ చరిత్ర’, ’మైరావణ చరిత్ర’, ’తాళ దశప్రాణ దీపిక’, ఇత్యాది గ్రంధాలను ‘ఎడిట్’ చేసి ముద్రింప చేసారు. ఈయన జననం ఫిబ్రవరి ’1901లో, నిర్యాణం మార్చి 1966 లో.

’సత్యప్రభ’ చారిత్రిక నవలలో మొదటి ముప్ఫై ప్రకరణాలను ’పూర్ణ’ పేరుతో గణపతి ముని రచించగా, తరువాతి ముప్ఫై ప్రకరణాలను వాసిష్ఠ రచించారు.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.