శారదా విజయోల్లాసము – 2

సరస్వతి - పొద్దు పత్రిక

శారద

రవి : రాఘవ గారూ రసపట్టులో వచ్చారు. స్వాగతం

నచకి : స్వాగతం, రాఘవా!

గిరి: మరుగేలరా ఓ రాఘవా

రవి : బాపు బొమ్మకు పద్యాలు చెబుతున్నారు. ఇప్పుడుగిరిగారు చెప్పబోతున్నారు.

గిరి: ఆలకించండి

గిరి:

ద్వి.

ప్రియమైన లచ్చిని ప్రేమతో తలచి| ప్రియసఖుడు పనుపు విరజాజి లేఖ,

నీ చేతి స్పర్శము నెఱనోచుకొన్న|దేచేతనో గదా ఈ కాగితమ్ము

నే కట్టుకోని పున్నెములమూట యిది| దాకొనిపెట్టి సదా చూడు సుమ్ము

తొలిసారి కలిసిన తోడుదొంగలని| తెలిసి, చెలిమి సమ్మతి తెలిపి, గొడవ

చేసిన కన్నులు, చెలునికై యెదురు|చూసి పాప మలసిసొలసిన వేమొ,

చల్లనికాటుక చక్కగాదిద్ది |చల్లగాకాపాడు చారెడుకండ్లు,

నల్లనినలుపైన నచ్చవచ్చునని| నల్లనికీల్జడ నాగుపాముజడ

నిమిరి తెలుసుకొని, నీకుంతలాల|కు ముఖమునద్దినా, కుఱ్ఱచేష్టలకు

నవ్వు చిందించిన నవ్యారుణ రుచి| పువ్వించు వాతెఱపూమొగ్గలేవి?

కుంకు మద్దిన మల్లి గోరింటిరేఖ| పొంకపడిన కరపుష్పములట్లు

తెల్లకలువ కెంపు దినకరురేఖ| పల్లవించిన కాలిపారాణులట్లు

చలువబింబాస్యము చంద్రునియట్లు| వెలుగులీనును కదా వెన్నెలయట్లు,

ఆషాఢమాసము లాలుమగలన|పాషాణకాఠిన్యవైఖరి చూపు,

అడ్డుగోడలవలె నాలుమగలను| తెడ్డుకోతీరుగా తెగలాగినిలుపు

మనవాళ్ళు వైశాఖమాసాన కాక| మనపెళ్ళి శ్రావణమాసాన చేసి

యుందురా కష్టములుండునా నేను|నిన్ దూరముగ నుండనిత్తునా నేడు.

నచకి : చాలా సులభశైలిలో నడిచింది ద్విపద.

శంకరయ్య : బాగుంది… ఎవరూ ముట్టని ఛందంలో మనోహరంగా వ్రాసారు.

రవి : లేఖకు ద్విపద ఎంచుకోవడం ఎత్తుగడ అనుకుంటాను, అద్భుతంగా ఉంది

శంకరయ్య : శ్రావణంలో పెళ్లి అయితే మళ్లీ ఆషాఢం వచ్చె సరికి మోజు తీరిని పురుషుడికి నెల రోజుల స్వాతంత్ర్నం దొరుకుతుందనా?

నచకి : అవును, చక్కని యెత్తుగడ

కామేశ్వర రావు : “గొడవ చేసిన కన్నులు, చెలునికై యెదురు చూసి పాప మలసిసొలసిన వేమొ,” – ఈ భావం చాలా బాగుంది!

రాఘవ : బాగుందండీ గిరిగారూ. నాకు ద్విపద అనగానే శ్రీరామభూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా… అన్న పంక్తులే తొలిగా గుర్తొస్తాయి. పాడుకోవటానికి తేలిక ఛందస్సు.

సనత్ : నవ్వు చిందించిన నవ్యారుణ రుచి| పువ్వించు వాతెఱపూమొగ్గలేవి? చాలా బాగున్నది

గిరి: శంకరయ్యగారు, మీరు చెప్పనట్టుగా ఊహిస్తే ఇంకో బాపుబొమ్మవుతుంది :-)

కామేశ్వర రావు : కాని గిరిగారి ద్విపద పాడుకోడానికి కన్న విరజాజి లేఖలా చదువ్కోడానికే బాగుంది :)

నచకి : :)

గిరి: ఈ మధ్యనే పప్పునాగరాజు గారు వారి తాతగారు వ్రాసుకున్న ద్విపద రామాయణాన్ని జాలంలో పెట్టారు – వీలుంటే చదవండి, అమోఘంగా ఉన్నది

రాఘవ : తొలిసారి చదువుకుంటారండీ, తరువాత పాడుకుంటారు :)

రవి : కామేశ్వరరావు గారు :ఇతరుల లెటర్లు చదవడం మంచిది కాదండి.

రాఘవ : అన్నట్టు, గిరిగారూ, మీరు కాటుక గుఱించి చెప్పి బొట్టు సంగతి ఎత్తకపోవటం…

శంకరయ్య : ‘శ్రీరామ భూపాలుడూ …’ అది ద్విపద కాదండీ …

కామేశ్వర రావు : రాఘవా మీరెంతైనా పాటగాళ్ళు కదా, దేన్నయినా పాడుకోగలరు :)

శంకరయ్య : ‘శ్రీలక్ష్మి నీ మహిమలూ … వంటి గేయం. పద్యం కాదు …

రాఘవ : శంకరయ్యగారూ, నేను ద్విపద అనగానే శ్రీరామభూపాలుడు గుర్తొస్తుందన్నానండీ. అది ద్విపద అనలేదు.

రాఘవ : ఎందుకో బుఱ్ఱలో అలా నిక్షిప్తమైపోయింది :)

శంకరయ్య : మంచిది..

కామేశ్వర రావు : గిరిగారు తన లేఖని ఇలా బయట పెడితే చదవకుండా ఉంటామా?

గిరి: రాఘవా, బొట్టు, వెనక కృష్ణుడి పటం గురించి వ్రాయలేదని నేను కించిత్ నిరాశ కలిగింది కానీ – అప్పటికే పదహారు పంక్తులలోకి వెళ్ళడంతో ఇక ముగించాను

రవి : పాడుకొమ్మన్నారు. చదువుకోరాదు. అంతే :)

గిరి: అందుకే, ఆదిత్య వ్రాసిన నిలువుబొట్టు పాదం నాకు అంతగా నచ్చింది

రాఘవ : గిరిగారు బహిరంగలేఖ వ్రాసారు… మన ఆడుపడుచుకు సిఫారసు చేయడం మన పని కూడా అని గూఢార్థం.

గిరి: కానీ కృష్ణుడి పటాన్ని గూర్చి ఎవఱూ వ్రాయలేదు

నచకి : ఆదిత్య గారి పద్యం కూడా హృద్యంగా ఉంది.

కామేశ్వర రావు : ప్రేమలేఖ అనగానే నాకు శ్రీనాథుని “శ్రీమదసత్య మధ్యకును” పద్యమే గుర్తుకువస్తుంది!

రవి : ఏమా ఉదంతం? చెప్పండి

కామేశ్వర రావు :

శ్రీమదసత్య మధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్

సామజ యానకున్, మిగుల చక్కని ఇంతికి మేలు గావలెన్!

మేమిట క్షేమమీవరకు; మీ శుభ వార్తలు వ్రాసి పంపుమీ!

నా మది నీదు మోహము క్షణంబును తీరదు స్నేహ బాంధవీ!

రాఘవ : చిన్నివయారికి …

గిరి: ఆ హా – శ్రీనాథునిదా, విచిత్రమే

రవి : అసత్య మధ్య! గగనకుసుమంలా ఏం ప్రయోగమండీ?

చదువరి : అసత్య మధ్యా అది..!

రాఘవ : అందులో చిన్ని పదం భలే అమరిందండీ. అలతి అలతి పదాలు ఎంచుకున్నాడు ఆయన.

చదువరి : భలే!

నచకి : ఆహా, ఎంత సింపుల్‌గా వ్రాసేసాడు మహానుభావుడు!

కామేశ్వర రావు : ఉత్తరంలో సగం పైగా ఆమె వర్ణనలే చేస్తే ఆ చిన్నివయారి పొంగిపోదూ!

గిరి: ఏ కావ్యంలోనిది – లేక చాటువా

నచకి : అసత్యమధ్య అన్న ప్రయోగము, చిన్ని వయారి అన్న ప్రయోగము సరసభరితంగా ఉన్నాయి.

కామేశ్వర రావు : చాటువు

రాఘవ : అలాగే, శ్రీనాథులవారిదే, శ్రీరస్తు భవదంఘ్రిచికురంబులకు అన్న చాటుపద్యం కూడా భలే ఉంటుంది చదవటానికి.

చదువరి : చక్కటి మాట! మనం అవర్ గ్లాస్ అని అనువదించుకున్నాం

గిరి: రాఘవా, వినిపించవోయీ

రాఘవ :

సీ ||

శ్రీరస్తు భవదంఘ్రి చికురంబులకు మహా
భూర్యబ్దములు సితాంభోజనయన

వర కాంతి రస్తు తావక నఖ ముఖముల
కాచంద్ర తారకం బబ్జవదన

మహిమాస్తు నీ కటి మధ్యంబులకు మన్ను
మిన్ను గలన్నాళ్ళు మించుబోడి

విజయోస్తు నీ గానవీక్షల కానీల
కంఠ హరిస్థాయిగా లతాంగి

గీ||

కుశలమస్తు లస చ్ఛాతకుంభ కుంభ
జంభవి త్కుంభి కుంభా విజృంభమాణ

భూరి భవదీయ వక్షోజములకు మేరు

మందరము లుండు పర్యంత మిందువదన

రాఘవ : గమనించండి…. నఖముఖములు అన్నవెంటనే చంద్రుణ్ణి తీసుకువచ్చారీయన. కటి, మధ్యము – మన్ను, మిన్ను.భూమి ఎంత తిరిగినా తరగదు, మిన్నేమో శూన్యమాయె.

కామేశ్వర రావు : నఖముఖములు – తారకలు, చంద్రుడు

నచకి : సితాంభోజనయన -> సితాంబోజనయన కదాండీ?

రాఘవ : అంభస్ అన్నది శబ్దం.

కామేశ్వర రావు : అంబుజ అన్నప్పుడు వత్తుండదు, అంభోజ అన్నప్పుడు ఉంటుంది

రాఘవ : అంబు, అంభస్ రెండూ నీటికే పేర్లు.

నచకి : అదే అడగబోయాను కామేశ్వరరావు గారూ, నెనర్లు! నెనర్లు, రాఘవా!

రాఘవ : వక్షోజములన్నాడు – మేరుమందరాల ప్రస్తావన వచ్చేసింది వెంటనే :)

రాఘవ : ఎంతైనా చిలిపి శ్రీనాథుడూ అనిపించాడు

శంకరయ్య : ఎత్తుగీతి అద్భుతంగా ఉంది.

రాఘవ : పైగా ప్రత్యేకంగా ఎత్తుగీతిలో చెప్పాడు వక్షోజముల గుఱించి!

కామేశ్వర రావు : అదీ ఊపిరి సలపనివ్వకుండా! :)

రాఘవ : ఆఁ :)

శంకరయ్య : రాగవల్లరి చూపించె రాఘవయ్య.

రాఘవ : నిజమేనండోయ్… నాకు ఇంతవఱకూ ఆ ఊహే రాలేదు.

రవి : కాలాతీతమవుతున్నది. ముందుకు వెళదామండి.

రాఘవ : అస్తు

రవి : శృంగారం నుండి హాస్యానికి వద్దాం

రవి : టీవీ సీరియల్ మధ్యలో కరెంటు పోవుట – పురాణకథాకాలక్షేపం సనత్ గారు చేస్తారు

చదువరి : శృంగారాన్ని దూరంగా పెట్టి హాస్యాన్ని దగ్గరగా ఉంచుకున్నారు రవి గారు!

రవి : ఊపిరాడట్లేదని రాఘవ గారే అన్నారుగా..

సనత్ : :-)

రాఘవ : మధ్యలో నన్నెందుకు లాగుతారూ, నాకు ఇంకా ఏ అసత్యమధ్యలూ లేరుగా

గిరి : రవిగారు, ఊపిరాడనిది కామేశ్వరరావు గారికి :-)

సనత్ :

వ ||
ఒకనాడు జాలారణ్యమున సనత్ మహామునిని కొత్తపాళీ మొదలుగా గల సత్కవులందరకూ అభీష్టసిద్ధి భగవంతుని కధనీవిధముగా      చెప్పదొడంగె..కలియుగమున భారతదేశమున ఆంధ్రదేశమున ఒకానొక భాద్రపద బహుళ నవమినాడు ఒక సాధ్వీమణికి నడిబజారునందు కలిగిన దివ్యానుభవమ్మును వివరించెద ఆలకింపుడు
శా||

టైమొక్కింతయులేదు సీరియలు యాడ్లైపోవునో ఏమొకో

ఆమాత్రానికి పర్వులెట్టుటలు ఆయాసమ్ములింకేటికో

స్వామీ నా మదిగోర్కె తీర్చగదె నాస్వాదింప నా సీరియల్

ఈ ‘మార్గమ్మున’ నెట్లొ జూపగదె నిన్నే వేడెదన్ భక్తితో !

అని పరి పరి విధముల నా సాధ్వీమణి ప్రస్తుతింపగా, కరుణించినవాడై భగవంతుడిరీతి లీలజూపగా నచ్చట సర్వాలంకార శొభితమైన ఒక టివీ షోరూం ఏర్పడె. టీవీలలో ఆ మగువ మనసుబడ్డ సీరియల్ రాదొడంగె. కోరికదీరినట్టి సమయమున సాధ్వీమణి భక్తి తనపైననా? సీరియల్ పైననా కనుగొనగోరి భగవంతుడొక చిన్న పరీక్షయుబెట్టి కరెంటు తీసివైచె.

టీవీ సీరియల్ మధ్యమున కరెంటు పోగా ఆ గృహిణులు పొందిన వేదన ఎట్లున్నదినిన..

ఉ ||

నేనొక టీవి షాపు కడ నిల్చి, భలే యని తల్చి, సీరియల్
మానక జూచువేళ ! నిటు మత్సరమొంది కరెంటుతీయగా
మానస మెట్టు లొచ్చె? చెపు మా, హృది కర్కశమైన దైవమా!
దీనులకున్ కరెంటనెడి దీవెనలీయగ రాదు రా ! దొరా !

కం||

ఒకపరి ముసిముసి నగవుల
నొకపరి క్రౌర్యమున మెలగు నుభయము తానై
దికమకపెట్టే పాత్రల
నికపై వీక్షించు రాత నిడెనో లేదో

అని పరి పరి యోచన జేసి తుట్ట తుదకు –

ఎవ్వడు చూపునిచ్చె? మరి యెవ్వడు ఇష్టములన్ సృజించె? నే
డెవ్వడు టివి నిచ్చె? గన నెవ్వడు తీసెను సీరియళ్ళనున్
ఎవ్వడు స్త్రీ మనస్సులను ఇవ్విధి నాడె కరెంటు తీసి నే
డవ్విభు గొల్తు నివ్వమని ఆదరమొప్ప పునః ప్రసారమున్ !!

అన్నిటా ఉన్నది వాసుదేవుడే యని తలచి, వానిని అర్ధిస్తూ చూచుట, చూచేవాడు, చూడబడునది అన్నీ తానే అనుచు గురుతించి నుతించిన ఆ సీరియల్ భక్తురాలిని గరుణించి అభీష్ఠవరమొసగె నా భగవంతుడు.

ఈ కథను చదివిన వారికీ విన్నవారికీ, చదివించినవారికీ, వినిపించినవారికీ అష్టైశ్వర్యములు కలుగుతాయని స్కాంధ పురాణం రేవాఖండంలో ఉన్నట్టుగా భావించమనిసనత్ మహాముని తెల్పగా సంతసించినవారై సత్కవులు సంతుష్టులైరి.

సనత్కుమారులు చెప్పిన కథను చదివిన వారు సీరియల్ చూస్తున్నప్పుడు కరెంటు పోదనీ పొయినా తద్వ్రుత్తాంతాన్ని ఒకసారి మనసులొ ధ్యానించితే ఫలశ్రుతి తెలిపారు ఆ కథను ప్రవచనం చేసిన హనుమత్ శాస్త్రులు

ఓం తత్సత్..

రాఘవ : స్కాందమన్నారు, భాగవతచ్ఛాయ కరుణశ్రీ స్థాయిలో తీసుకువచ్చారు!

సనత్ : శ్రీ హనుమత్ శాస్త్రుల వారు

రవి : “ఒకపరి ముసిముసి నగవుల..” – కళ్ళకు కట్టినట్టు వర్ణించారండి

చదువరి : దీన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యాల్సి ఉంది మన రాష్ట్రంలో.

సనత్ : కలియుగం లో కాపీ యజ్ఞం బాగా ప్రబలుతుందని చెప్పారు కదా..

కామేశ్వర రావు : చదువరిగారు, మగజాతిపై మీకంత పగ ఎందుకండీ? :)

చదువరి : :)

సనత్ : అందుకే ఇప్పుడు ఏ పరిక్ష చూసినా, సీరియల్ చూసినా

రవి : చదువరి గారూ, లాభం లేదండి. దీన్నీ టీవీ సీరియల్ లా చూపిస్తే తప్ప ఎవరూ చూడరు

కామేశ్వర రావు : అందులోనూ ఆ ఫలశ్రుతి వింటేనే గుండె గుభేలుమంటోంది నాకు!

గిరి : కానీ ఆ సీరియల్ చూస్తున్నప్పుడు కరెంటు పుటుక్కుమంటే కథ మళ్ళీ మొదటికే

సనత్ : నావంటి కాపీ కొట్టేవారికి కొదవేలేదు భువనవిజేతలీ కవులు ‘కాపీ కళలో’ అని మా భావన.

సనత్ : వెంటనే కరెంటు వస్తుందని ఫలశ్రుతి.*

కామేశ్వర రావు : దీన్ని కాపీ అనరండీ, పేరడీ అంటారు. అది కూడా గొప్ప కళే.

రాఘవ : దీనికి రుక్మిణే సాక్షి!

రాఘవ : :)

కామేశ్వర రావు : కావలిస్తే H2O కనిపెట్టిన వాళ్ళ వంశంవాని మీద ఒట్టు :)

నచకి : నవ్యంగా ఉంది, సనత్ గారూ!

చదువరి : కామేశ్వరరావు గారూ.. :)

ఆదిత్య : బాగుంది గానీ ..ముసి ముసి నగవులా..?? ఎక్కడ ? నాకెప్పుడూ వికటాట్టహాసాలే దర్శనమిస్తాయే !

కామేశ్వర రావు : తంబీ, నువ్వు సుమనుని సినిమా సీరియళ్ళు చూడలేదు :)

రవి : నచకి గారూ నవ్యకవితాసనత్ – అనే బిరుదిచ్చేద్దామా

నచకి : బిరుదులకేం, బ్రహ్మాండంగా యివ్వచ్చు, అధ్యక్షా!

గిరి: చూస్తూంటే కామేశ్వరరావుగారు సుమనుడి వల్ల చాల బాధపడినట్టు తెలుస్తోంది

చదువరి : సుమను పీడితులు ఎల్లెడెలా కన్పింతురు గిరివర్యా!

ఆదిత్య : ఇప్పుడే టిఫిన్ తిన్నాను దయచేసి టాపిక్ మార్చండి

చదువరి : :)

గిరి: చదవరి గారు, నేను తప్పించుకున్నానండీ – మొన్న కామేశ్వరరావుగారు పంపిన దృశ్యకము చూడడమే మొదటి (ఆఖరి) విడత

కామేశ్వర రావు : గిరిగారు, కేవలం ఇది యాడ్ లు చూస్తే కలిగిన వణుకేనండీ! అసలువెప్పుడూ చూసే సాహసం చెయ్యలేదు!

గిరి: ఆదిత్యా – హా హా

చదువరి : గిరీ, ఒకటి చూసారు కదా.. అది చాలు!

రాఘవ : ఏదో మారీచుడికి రా అని వినబడితే రాముడేనేమో అని భయం వేసినట్టుగా, సు అనగానే ఆంధ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. కాకపోతే అక్కడ రాక్షసుడు దేవుడికి భయపడ్డాడు.

చదువరి : :)

కామేశ్వర రావు : :)

గిరి: రాఘవా – భలే

కామేశ్వర రావు : సరే ఇక ముందుకు సాగడం ఉత్తమం.

రవి : సరేనండి..

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

2 Responses to శారదా విజయోల్లాసము – 2

  1. సూర్యుడు says:

    చర్చ బాగుంది, పద్యాలు కూడా.

    ~సూర్యుడు

  2. padmarpita says:

    :)భలేగుందండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *