కథా కథనం – 5

కథ  – వస్తువు ఎంపిక

కథకి విషయం ఎరిగిన జీవితం నుండే, అర్థమైన జీవితపరిధి నుండే తీసుకోవాలంటే ముందుగా కనిపించేవి –

పెళ్ళిచూపులు. సంతలో పశువులా ఆడపిల్లని పరిశీలించడం. కట్నకానుకల విషయంలో మగపెళ్ళివారి ఏనుగు దాహాలు. సకాలానికి కట్నం సొమ్ము సమకూడక పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోవడాలు. కాపరానికొచ్చిన కోడళ్ళని ఇంకాతే, అనే వేధింపులు. పిల్ల తండ్రి అత్తవారిని కాళ్ళూ, గడ్డం పట్టి బతిమాలడాలు. కథ చివర ఒకటో, రెండో ఆత్మహత్యలు. ఈ మధ్య ఇందులో కొత్తదనం – ఇంటిల్లిపాదీ కలిసి నోరులేని కోడల్ని కిరసనాయిలు పోసి కాల్చీడం.

లేదా –

నిరుద్యోగుల నిస్సహాయత. ఇంటర్వ్యూల కోసం గాజూ, పూసా తాకట్లు. ఆ ఉద్యోగాల్ని ఆదికి ముందే ఎవరో కొనేసుకోడం. ఉత్తరాయణం, దక్షిణాయణం మహిమలు. చేతికొచ్చిన ఉద్యోగాలు ఏ ఫోన్‌కాల్ దెబ్బకో ఎగిరిపోడం.

అదీ కాకపోతే –

రోడ్‌సైడ్ రోమియోల అల్లర్లు. మెత్తని చెప్పుతోనో, నిజం చెప్పుతోనో జవాబులు.  చీకట్లో వేధించింది ఎవరినో కాదు సొంత చెల్లెమ్మనే.

ఇంకోరకంగా –

బిచ్చమెత్తుకునే దైన్యం. ఎంగిలి విస్తళ్ళకెగబడే  ఆకలి కడుపులు. గత్యంతరం లేక కడుపులు నింపేందుకు పడుపు వృత్తి. రెక్కలమ్ముకున్న నేరానికి పక్కలోకి లాగే కామందులు. పసందైన పిల్ల పరువాల కోసం పరవళ్ళు  తొక్కే ఇంటి యజమానులు. పారేసుకున్న వస్తువులకోసం పనిపిల్ల మీద నేరాలు మోపే యజమానురాళ్ళు.

ఇంక ప్రేమల  విషయానికొస్తే –

ప్రేమకోసం పవిత్రమైన ప్రేమలు. ఆస్తికోసం, అంతస్థుల కోసం అపవిత్రమైన ప్రేమలు. ఆడపిల్ల అనుభవం కోసం సాగే టక్కరి ప్రేమలు. కాల్జారిన ఆడపిల్ల కెదురయ్యే కష్టాలు. కడుపొచ్చిన అమ్మాయిలు కార్చే కన్నీళ్ళు. ప్రేయసి పెళ్ళామయ్యాక ప్రేమలో వచ్చే మార్పులు.

ఇవీ, ఇలాంటివే ముందుగా ప్రతీ కొత్త రచయితకీ కనిపిస్తాయి.

ఇవన్నీ రాయదగ్గ విషయాలే.   అందుకు సందేహం ఏం లేదు. అయితే వీటి ఒక్కొక్కదాని మీదా కొన్ని వందల కథలు ఆ మాటకొస్తే కొన్ని వేల కథలు ఇంతకుముందే ఎవరెవరో ఎప్పుడెప్పుడో రాసేశారు. ఇప్పుడు మళ్ళా మనం రాస్తే పత్రికలవాళ్ళు వేసుకోరు. అధవా – కథలు కరువయ్యో, కథ చెప్పే తీరు బాగుందనో, ఏ పత్రికైనా వేస్తే కథ వేసిన వాణ్ణీ రాసినవాణ్ణీ కూడా తిట్టుకుంటారు – చదువుకునే పాఠకులు.

చాలామంది రచయితలు తమ కథలు తప్పిస్తే యితరులు రాసినవి చదవరు. అందువల్ల – ఒకరు రాసిందాన్ని మళ్ళా మనమూ రాయడం, ఆ రాయడంలోనైనా కొత్తదనం కరువవడం, తరచూ జరుగుతుంది. విషయం పాతదే అయినా చెప్పే పద్ధతీ కథ నడిపిన తీరూ కొత్తగా ఉంటే – కొంతలో కొంత చదువుతారు. ఇతరులు రాసింది చదివుంటే దానికి భిన్నంగా రాసే ప్రయత్నం చేయొచ్చు. ఆ పని చేయకపోడం వల్ల పాతకథే పాత పద్ధతిలోనే చెప్పి కథ తిరిగొస్తే ఆశ్చర్యపోడం, కథ కాపీ కథలా ఉందంటే బాధపడడం జరుగుతుంది.

పసిబిడ్డలవంటి వాళ్ళు నిన్న చెప్పిన కథ ఇవాళ చెపితే వినరు. పాత పాటలే అయినా ఎన్నోసార్లు ఎందరినోటో విన్నవే అయినా, ఓ కొత్త గొంతు కొత్త కొత్తగా ఆలపిస్తే వినగలుగుతాం.

అందుకని కథలు రాయదలుచుకున్న వాళ్ళు, కనీసం తొలిదశలోనైనా, తక్కినవాళ్ళు రాసే కథలు విధిగా చదవాలి. ఇతరులు రాయని కథలు వారెవరూ రాయని పద్ధతిలో రాయాలి.

జీవితాన్ని గమనించడంలోనూ, కథా వస్తువుని ఎన్నుకోవడంలోనూ, విషయాలను పరిశీలిలంచి విశేషాన్ని గ్రహించడంలోనూ, లోక పరిపాటిగా కొట్టుకుపోకుండా మీ పద్ధతొకటి మీరు ఏర్పరచుకోవాలి.

సమస్యలంటే మన సమస్యలు మాత్రమే సమస్యలు కావు. ఉద్యోగావకాశాల కోసం చదువుకున్నవాళ్ళు ఏడాదికో, ఆర్నెల్లకో ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌కి వెళ్తారు. సంవత్సరంలో రెండుసార్లో, మూడుసార్లో ఇంటర్వ్యూల కెళ్తారు. ప్రతి రోజూ ఏరోజు కారోజే మేస్త్రీల చూట్టూ, కాంట్రాక్టర్ల చుట్టూ పనికోసం తిరుగుతూ, ‘రేపురా, మాపు కనబడు’ అని వాళ్ళచేత తిప్పించుకొనే రోజువారీ కూలీలను, లేబర్‌కాలనీలలోనూ పనులు జరిగే కొన్ని కొన్ని కూడళ్ళలోనూ ఏ రోజయినా కొన్నివేల మందిని మనం చూడొచ్చు. షాపుల్లోనూ, హోటళ్ళలోనూ చిన్న చిన్న కార్ఖానాలలోనూ రకరకాల పనులుచేసే వాళ్ళున్నారు. వాళ్ళూ జీతాల వాళ్ళే. వాళ్ళ సమస్యలూ సమస్యలే!

హింసలూ, కష్టాలు అన్నవి మనమూ మనవాళ్ళూ అనుభవించేవే కావు. వేధింపులూ, అవమానాలూ, అపహాస్యాలూ చదువుకునే ఆడపిల్లలకి మాత్రమే పరిమితాలు కావు. సినిమాలాళ్ళ దగ్గర, శ్రీరామనవమి వంటి సంబరాల్లో దేవాలయాల దగ్గర, దివ్యక్షేత్రాలలో, తీర్థాలు జరిగేచోట, స్నానఘట్టాలలో – అన్ని తరగతుల వాళ్ళూ అన్ని వయసుల వాళ్ళూ అల్లర్లకూ, ఆగడాలకూ గురి అవుతారు. పసిగుడ్డును వదిలి పనిలోకి వెళ్ళే సమస్య ఉద్యోగస్థులైన దంపతులకే పరిమితం కాదు. రోడ్డుపనీ, మట్టిపనీ, రాతిపనీ చేసే వేలాది కూలీ దంపతులకీ, పాచిపనీ, వంటపనీ చేసి ఇల్లు గడుపుకొనే ఎందరో పేద ఇల్లాళ్ళకీ కూడా అది హృదయశల్యమైన సమస్యే.ఇంటిపనీ, బయటి పనితో వాళ్ళూ నలిగిపోతారు.

ఆకలీ, దాని బాధకు తట్టుకోలేక ఒళ్ళమ్ముకోడం వయసులో ఉండే ఆడవాళ్ళకే పరిమితం కావు. అమ్ముకోడానికి అందాలూ, వయసులూ లేని వాళ్ళూ, ఉన్నా అందుకు మనసంగీకరించక హింసలు భరించేవారు ఇతరత్రా చాలామంది ఉన్నారు. కడుపాకలికే కాక తదితరమైన ఆకళ్ళకు – అమ్ముకోడం తప్ప మరోమార్గం లేని స్థితి ఆడవాళ్ళలోనూ, యిటీవల మగవాళ్ళలో కూడా వుంది.

చెయ్యని నేరాలకి శిక్షలనుభవించే స్థితి పాచిపనులు చేసుకునేవారికీ, ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసుకునేవారికే పరిమితం కాదు. లారీ ట్రాన్స్‌పోర్టు వంటి రవాణా సంస్థలూ,గోడౌన్లూ, వేర్‌హౌసులూ, సూపర్ బజార్లూలా ఎక్కడెక్కడైతే సొత్తుంటుందో, ఎక్కడెక్కడ పైవాడు కిందవాడూ కలిసి ఆ సొత్తుతో వ్యవహరిస్తుంటారో, అక్కడక్కడల్లా యీ స్థితి ఉంటుంది.

మనుష్యుల ఆనందాలకీ, ఆవేదనైకీ, కష్టసుఖాలకీ, కన్నీళ్లకీ, దిగుళ్ళకూ, గుండెలు పగిలిపోడాలకీ – వయసులో ఆడామగా ప్రేమలూ, వాటి గుడ్డి తనాలూ, వాటి పొరలూ, అవి విడిపోడాలూ, వాటి మైకాలూ, అవి తొలిగిపోడాలూ, వాటి నమ్మకాలూ, వాటి నమ్మకద్రోహాలు ఇవే కావు – బాల్య స్నేహాలూ, స్నేహితుల మధ్య పొరపొచ్చాలూ, భాయీభాయీగా తిరిఏవాళ్ళు చీకట్లో కత్తులు దూసుకోడాలూ, రక్తసంబంధం, పేగు సంబంధం వంటివి బలీయమైన యింకేదో సంబంధానికి వీగిపోడాలూ – ఇలాంటివి కూడా కారణాలు కాగలుగుతాయి.

వస్తువుని ఎన్నుకునేటప్పుడు – కళ్లెదుట కనిపించిందనో, ఇతరులు రాసేరు కాబట్టి మనం రాయవచ్చనో, పాత వస్తువుల్నే పట్టుకోకుండా తమ చూపును కొత్తవాటి కోసం నలుదిశలా ప్రసరిస్తే ఇలాంటివి చాలా దొరుకుతాయి.

బద్ధకం వల్లగాని లేదా తెలియమివల్ల గాని కొత్త రచయితలు తరచూ చేసే మరో తప్పు ఏమంటే – వార్తల్లో వచ్చే సంఘటనమీదా, తాజా తాజా సంఘటనలమీదా, తద్దినాల సన్నివేశాల మీదా కథలు రాయబోతారు.

ఆగస్టు పదిహేనొస్తే జండా వందనం మీదా, సెప్టెంబరు ఐదొస్తే గురు పూజ మీదా, అక్టోబర్లో దసరా మామూళ్ళ మీదా, నవంబరులో దీపావళికి దశమ గ్రహాల మీదా, సంక్రాంతికి అత్తామామగార్ల కష్టాలమీద – ఇలా సాగుతాయి కథలు. ఏళ్ళ తరబడి హాస్యం, వ్యంగ్యం రాసినవారే ఒళ్ళు దగ్గిర పెట్టుకుంటే తప్ప యిలాంటి తద్దినాల మీద కొత్తగా నాలుగు విసుర్లు విసరటం కష్టమవుతుంది. అంచేత కొత్తవాళ్ళు తద్దినాలతో కథా రచన ఆరంభించడం మంచిపని కాదు.

ఊళ్ళో ఏ సమ్మో, హర్తాళో, పెద్ద నిరసన ప్రదర్శనో జరిగితే దాన్ని ఎద్దేవా చేస్తూ రాసేయడానికి తలపడతారు కొత్తవాళ్ళు. వేలూ, లక్షల మంది ప్రయోజనాలతో ముడిపడి సాగే సంఘటనలవి. మీకు తాగడానికి కప్పు కాఫీకి ఇబ్బంది అయ్యిందనో, పీల్చడానికి ఒక సిగరెట్ దొరకలేదనో, చూడ్డానికి ఓ సినిమా లేకపోయిందనో దుగ్ధకొద్దీ అందుమీదా దానికి వ్యతిరేకంగా కథ రాయబోతారు. ఆ ఉద్యమ స్వభావమో, దానిని నడిపే శక్తుల స్వరూపమో తెలిసి రాయడం వేరు. అలాంటివి ఉంటాయనే సంగతి కూడా తెలియని వారు దాని మీద రాయబోవడం తగదు కదా!?

అలాగే వార్తల్లో వచ్చినవీ, రానివీ, పదుగురి దృష్టిని ఆకర్షించే (ఆకర్షించగల) సంఘటనమీద – విన్నదో, కన్నదో, చదివిందో ఆధారంగా కథ రాయబోతారు. అది కూడా ఏం మంచి పద్ధతి? మనబోటి వాళ్ళు తెలుగు రచయితలే కొన్ని వేల మందుంటారు. మనలాగే వాళ్ళలో ఏ కొందరు దాన్ని కథ చేయబోయినా, ఎవరు ఎవర్ని కాపీ కొట్టారో తెలియని కాపీ కథగా అనిపిస్తుంది – సంపాదకులకీ, పాఠకులకీ. కాబట్టి ఇది కూడా రచయితలు తెలుసుకొని ఉండాలి.

అంటే –

* మనకు అందుబాటులో విడిగా దొరికిన విషయం మీద చప్పున కథ రాయబోవడం అంత మంచి పనికాదు. అలా రాస్తే పాడిందే పాడినట్టో, కాపీ కొట్టి రాసినట్టో సంపాదకులూ, పాఠకులూ పొరపడే అవకాశం ఉంది. అలా జరిగితే కథ వేసుకోరు. వేసుకున్నా చదవరు.

* మన చూపుని కాస్త నాలుగు పక్కలూ మళ్ళించే అలవాటు చేసుకుంటే కొత్తవైనా కాకున్నా కొత్తవాటిలా కనిపించే వస్తువులు కోకొల్లలుగా దొరుకుతాయి.

* సీజనల్ కథలు రాసి మెప్పించడం కష్టం. ప్రతి ఏడూ ఆ విషయం మీద వచ్చిన కథలు చాలా చదివుంటారు పాఠకులు.

* తీసుకున్న విషయం కొత్తదవునా కాదా? దాన్ని ఎలా రాస్తే కొత్తగా ఉంటుంది? – ఈ విషయాలు తెలుసుకోడానికైనా ఇతరులు దేనిమీద రాసేరో, ఎలా  రాసేరో తెలియాలి తెలుసుకోవాలి… అంటే విధిగా చదవాలి.

* ఒకరు రాసిందే రాసినా ఒకరు రాసినట్టే రాసినా పాఠకులు చదవరు.

About కాళీపట్నం రామారావు

కారా మాస్టారుగా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు. ఈయన చేసిన రచనలు రాసిలో తక్కువైనా వాసికెక్కిన రచనలు చేసారు.

1966లో వీరు రాసిన ”యజ్ఞం” కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.

ఈయన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు. కథానిలయం తెలుగు కథకి నిలయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండేలా దాన్ని తీర్చిదిద్దుతున్నారు.

This entry was posted in కథ and tagged , , . Bookmark the permalink.