విజయంలో ఒక్కో మెట్టూ .. రెండవ భాగం

వీరేంద్రనాథ్ గారితో పొద్దు జరిపిన పిచ్చాపాటీ రెండవ/తుది  భాగం ఇది.

—————

మీ కాకినాడ బడి సరస్వతీ విద్యాపీఠం గురించి చెప్పండి.

పేదపిల్లలకు స్టేజి ఫియరు, సంకోచం, మాట్లాడలేకపోవడం ఉంటుంది కదా, వారు ఈ బడికి వస్తారు. వారు నాతో మాట్లాడి, పగలంతా నాతో ఉండి, రకరకాల వ్యాపకాల్లో ఎంగేజ్ అయి ఆ భయం పోగొట్టుకుంటారు.


స్కూలు మీరే నిర్వహిస్తున్నారు కదా?

నాదే. నేను వెళితేనే ఓపెన్ అవుతుంది. అక్కడ పర్మనెంట్ గా పిల్లలుండరు. నేనెళ్ళే ముందర ఫోనొస్తుంది. అప్పుడు పిల్లలను రప్పించడం జరుగుతుంది. ఒకసారి వచ్చిన బ్యాచ్ మళ్ళీ రారు. నెలకు వారం రోజులక్కడ ఉంటాను. రోజుకు నలభై మంది పిల్లలు చొప్పున ట్రైన్ అవుతారు.


ఈ ఆలోచన ఎక్కడినుంచి వచ్చింది మీకు?

కర్ణాటకలో వీరేంద్ర హెగ్గడే అన్జెప్పి ఒకాయనున్నాడండి. పద్మవిభూషణ్. ఆయన కొన్ని కోట్లు పెట్టి ఇలాంటిది చేశాడండి. ఆయన వందమందిని అక్కడే ఉంచేసుకుని మంచి యువకులుగా తీర్చిదిద్దుతాడు. పొలందున్నటం దగ్గర్నించీ, కూరగాయలమ్మటం వరకూ వాళ్ళే చేయాలి. చాలా మంచి ఆలోచన. అందుకే పద్మవిభూషణ్ వచ్చిందాయనకు. అంత చేయలేం కాబట్టి చిన్నగా ఇలా.


నేటి తరం ముఖ్యంగా పిల్లలు చదవాల్సిన పుస్తకాలు – ఒక పది – చెప్పగలరా?

చందమామ.


యువతీ యువకులకైతే?

ఫిక్షనా?


ఏదైనా పర్లేదండి. ఓ పది తెలుగు పుస్తకాలు. పోనీ, ఫిక్షన్ లో ఐదు, నాన్ ఫిక్షన్ లో ఓ ఐదు..

చాలా కష్టమండి. సైంటిఫిక్ ఫిక్షన్ వేరు, ఫిక్షన్ వేరు, వ్యక్తిత్వ వికాసం వేరు, రష్యన్ సాహిత్యం వేరు…రష్యన్ లో సెమీ ఫిక్షన్ – పెరిస్తోవా అనుకుంటాను, పుస్తకాలకు మంచి అనువాదాలున్నట్టున్నాయ్. వాళ్ళ వాళ్ళ ఇంటరెస్టు బట్టి ఉంటుందండి. ఫిక్షన్ – నేను మిగతా రచయితల పుస్తకాలు ఎక్కువగా చదవలేదు. సులోచనారాణి గారి విజేత చదివాను. బావుంది. అయితే చదువుకోడానికి తప్ప, వేరే ఉపయోగముండదు. మల్లాది వెంకట కృష్ణమూర్తి పుస్తకాలు బానే ఉంటాయి. అయితే ఇవన్నీ టైమ్ పాస్. నాన్ ఫిక్షన్ లో … చాలా ఉన్నాయండి..చెంఘిజ్ ఖాన్ ఒకటి బావుంటుంది, విజయ రహస్యాలని నేనో పుస్తకం రాశాను. అది బానే ఉంటుంది. మహాత్మా గాంధీ చరిత్ర బావుంటుంది. కాంతమ్మ వంటల పుస్తకం – వంటల మీద అభిరుచి ఉన్నవారికి బావుంటుంది. చరిత్రలో నిలిచిపోయే పదిపుస్తకాలు చెప్పడం చాలా కష్టం.


మీరు మీ నవలకోసం రీసెర్చి పరంగా తప్ప మామూలుగా పుస్తకాలు చదవరని విన్నాను

రెగ్యులర్ గా అంటే ట్రైన్ లో వెళుతున్నప్పుడు , పల్ప్ సాహిత్యం అన్నారుగా అలాంటివి చదువుతాను. జేమ్స్ హాడ్లీ చేజ్, డెస్మండ్ బ్రాగ్లీ, అంటే వచ్చాడు, మర్డర్ చేశాడు, డిటెక్టివెళ్ళి పట్టుకున్నాడు. అయిపోతుంది. ట్రైన్ దిగితే పాత్రల పేర్లు కూడా గుర్తుండవు. అలాంటివి చదువుతాను.


ఏకబిగిన చదువుతారా?

ఏకబిగినే. ట్రయిన్ లోనే. ఇక్కడెందుకలాంటి పుస్తకాలు?


రచయితలు, రచయిత్రుల్లో మీ ఫ్రెండ్సెవరైనా ఉన్నారా?

నాకసలు ఫ్రెండ్సే ఎవరూ లేరండి. పరిచయస్తులే ఉన్నారు. ఫ్రెండ్సంటే మీ ఉద్దేశ్యమేంటి?


Acquaintance?

సాయంత్రం ఓ వన్ అవరు గాసిపింగ్ అవరు – బయటకొచ్చి ఓ నలుగురం ఏవో చెప్పుకుంటాం. నేను పొద్దుట్నుండీ ఒక్కణ్ణే ఉంటా కాబట్టి సాయంత్రం ఎవరో ఒకళ్ళు వస్తూంటారు, కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. త్రీ డేస్ పర్ వీక్ ఇలా. ఇవాళ రాసుకోవలసిన పని ఉండి కలవలేదు. పొద్దున నుండి క్రికెట్ టెస్టుమేచ్ వస్తూందిగా, ఇప్పుడు రాసుకోవాలి.


క్రికెట్ బాగా ఇంటరెస్టా మీకు?

ఆ. ఒకప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు ఓ మోస్తరుగా.


టెస్టు మేచులు కూడా చూస్తారా?

మన బాటింగ్ అయితే. అంటే – మేచ్ అలా జరుగుతుంటుందండి. నా మానాన నేను రాసుకుంటూ ఉంటాను.


మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలంటే ఎలా పరిచయం చేసుకుంటారు?

చెప్పాగా. చార్టర్డ్ అకౌంటంట్ గా పరిచయం చేసుకుంటాను.


మీ గురించి అసలేమీ తెలియని, మీ పేరే వినని వారికి?

నన్నెవరు గుర్తుపడతారండి. టీవీలో వస్తా కాబట్టి గుర్తు పట్టచ్చేమో.


సినిమాల్లో పనిచేసినపుడు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సంఘటనలు, అనుభవాలు, చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా?

నా నవల్స్ సినిమాలుగా తీయవచ్చని గుర్తించిన వాడు కే. ఎస్. రామారావు. రిస్క్ పెట్టి ముత్యమంత ముద్దు అనే ఫిల్మ్ తీశాడు. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు..కొన్ని డివిడెండ్ ఇచ్చినయ్, కొన్ని ఇవ్వలేదు.


మీరు చెప్పిన మూడూ బానే ఆడాయి. (నవ్వులు)

తర్వాత రెండు చెప్పలేదుగా. (నవ్వులు) స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ – నా దర్శకత్వంలో వచ్చింది. డైరెక్టర్ కావాలంటే చాలా ఓపికుండాలండి. నాకు లేదు. ఆ తర్వాత తెలిసింది నాకా విషయం. చాలా ఓపిగ్గా, ఏభై, అరవై రోజులు తీయాలి. రవితేజ అసిస్టంట్ డైరెక్టర్ గా పని చేసే రోజుల్లో దొంగ మొగుడనే సినిమా తీసేవాళ్ళం. నల్లంచు తెల్లచీర నవల. అందులో హీరో పేరు రవితేజ. అంచేత అతను హీరో అయిన తర్వాత ఆ పేరు పెట్టుకున్నాడు. అతని అసలు పేరు ఏదో ఉంది. ఇంకా కోట శ్రీనివాసరావు గారిని సినిమా ఫీల్డ్ కు ఇంట్రొడ్యూస్ చేసింది మేమే. కుక్క అని ఓ సినిమా తీశాం. అందులో తెలంగాణా శకుంతల, కోటా శ్రీనివాస రావు ఫస్ట్ టైమ్ ఏక్ట్ చేశారు. రాజశేఖర్ కు కూడా మొదటి సినిమాయే. కాష్మోరా సినిమాలో. ఇవి సినిమా విశేషాలండి. చిరంజీవికి అభిలాష తీసే టైములో అనుకుంటాను చరణ్ తేజ పుట్టాడు.


చిరంజీవితో చాలా సినిమాలలో పని చేశారు కదా. మీ experience ఎలా ఉండేది?

Professional. మంచి రిలేషన్. ఆ తర్వాత కలవలేదు. అంచేతనే ఇందాక ఫ్రెండ్ షిప్పంటే ఏంటని అడిగింది.


సోషియల్ గా కలవరా?

నేను ఏ ఫంక్షన్స్ కెళ్ళనండి. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నానండి. జూనియర్ ఎన్టీయారు సినిమా శక్తి అని. అది కూడా అశ్వినీ దత్ నాకు బాగా తెలుసు కాబట్టి. కథ వినమన్నాడు. కథ విని రెండు మూడు పాయింట్లు చెబితే చాలా బావున్నాయని రెండ్రోజులు, తర్వాత పదిహేను రోజులు రమ్మన్నాడు. అంతే. ఆ తర్వాత క్లోజ్ చేశేసాను.


ఆ మధ్య విలేజ్ లో వినాయకుడు లో నటించారుగా.

అందుకు రీజనేంటంటే – అందులో టిపికల్ కేరక్టర్ ప్లస్ రాజోలు నేను పుట్టిన ఊరు. అక్కడ షూటింగు. సరదాగా వారం రోజులు బావుంటుందని అక్కడికెళ్ళాను. అలా వెళతాను తప్ప, ఇప్పుడు నేను గుమ్మడి గారి వేషాలవీ వేయలేను.


వంట మీద మీకు మంచి అభిరుచి ఉందనుకుంటాను? టీవీల్లో కూడా అప్పుడప్పుడు వస్తుంటారు.

వంట బాగా ఇంటరెస్టు.


చేస్తూంటారా ఇంట్లో ఎప్పుడైనా?

ఎప్పుడైనా నాకు బాగా మూడున్నప్పుడు చేస్తుంటాను.


చిన్నప్పటి నుండీ ఉందాండి ఈ అభిరుచి?

రూములో వండుకునే వాణ్ణి. నవల రాయటం కన్నా మంచి వంట వండటమే కష్టమండి, సైంటిఫిక్ గా.


ఒకసారి మీరు రీసెర్చి అంతా అయిపోయిందంటే, నవల ఒక ఫ్లో లో రాసేస్తారా?

అలా ఏమీ ఉండదండి. ఏదో అప్పుడికప్పుడు రాయడమే. ఏదో చిన్న ప్రాబ్లెం వచ్చింది, అందుకే ఆగాను పొద్దున్నుండి. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్యుపై చేసింతర్వాత నాశనమయ్యిందా? అంతకు ముందే అయ్యిందా అన్న వివరం సరిగా దొరకట్లేదు. చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స దగ్గర ఆగిపోతుందండి అప్పుడప్పుడు. ఇలాంటి నవల్సయితే.


నెట్ బాగా యూస్ చేస్తారాండి?

ఈ మధ్య. ఈ నవల కోసం. (ప్రస్తుతం రాస్తున్నది)


వికీపీడియాలో మీ గురించి ఓ పేజీ ఉందండి చూశారా?

వికీపీడియా??


వికీపీడియా అంటే ఆన్లైను ఎన్సైక్లోపీడియాలాంటిది.

ఇంగ్లీషులోనా తెలుగులోనా?


ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ఉందండి. తెలుగులో మీగురించి ఓ పేజీయే ఉందండి.

అందరి గురించి ఉంటుందిగా? స్పెషాలిటీ ఏముందందులో?


అంటే – చూశారా అసలు అని?

చూసినట్టు గుర్తండి. మీరు చెప్పేది, నేను చూసేది ఒకటో కాదో తెలియదు. ఏముందండి రాజాలా పుట్టాడు.రచనలు చేశాడు! అంతేగా!


రీసెర్చ్ కంటెంట్ బానే దొరుకుతుందండి ఇంటర్నెట్లో.

ఇలాంటి నవల్సయితే దొరుకుతుందండి. ఆఫ్ఘనిస్తాను అదీ. మామూలువాటికి దొరకవు. హ్యూమన్
రిలేషన్సూ అవీ కష్టం. వాటికి అక్కర్లేదు కూడా.


You rely more on books. ఆ సిచువేషన్లో.

హ్యూమన్ రిలేషన్స్ కీ వాటికీ పుస్తకాలేముంటాయండి? మనమేమనుకుంటే అది రాయటమే. చరిత్ర
కావలసి వచ్చినప్పుడే కావాలి.


నెట్లో తెలుగు సైట్లు చూస్తుంటారా రెగ్యులర్ గా? కౌముది?

కౌముది బుక్కు ప్రతినెలా పంపిస్తారండి. నా సీరియల్ పడిందందులో. అందుకని చూస్తాను. అసలు
తెలుగులో సైట్సున్నాయని తెలీదు నాకు, మీరు చెప్పేవరకూ. ఏముంటాయి సైట్సులో? పొద్దుంటుంది అఫ్కోర్సు.


ఈమాట, ప్రాణహిత వగైరా

ఏముంటాయందులో, కథలు కవిత్వాలు అంతేగా?


ఆన్లైన్ మాగజైన్సు…

నాకు చాలా మాగజైన్సు పోస్టులో వస్తాయి. అవి చదవడానికే సమయం లేదండి. ఈ మధ్య చిత్రం,
చినుకు…ఇలా చాలా వచ్చాయి.


బిరుదులు, అవార్డులు..వాటి గురించి మీ అభిప్రాయం?

బిరుదులు, అవార్డులు బానే ఉంటాయండి. రచయితకు ఇన్స్పిరేషనిస్తాయి. ఆ మధ్య సాహిత్య అకాడెమీ అవార్డిచ్చారు.


రఘుపతి రాఘవ రాజారాం.. వస్తే బావుండునని మీరనుకునే అవార్డేదైనా ఉందాండి?

ఏముంటాయండి? వస్తే ఓకే. రాకపోతే సరే.. గొప్ప అవార్డంటే జ్ఞానపీఠ్..నాకు జ్ఞానపీఠ్ అవార్డు రావాలంటే, కనీసం 1500 మంది ఉన్నారండి, నాకన్నా మంచాళ్ళు, గొప్పవాళ్ళు, మహానుభావులూ.


జ్ఞానపీఠ్ అంటే రచన కాదు రచయిత…

రచయితకివ్వాలి అనుకొని, అతనికి సంబంధించిన రచనకిస్తారు. బట్.. 1500 మినిమం ఉండుంటారు, నాకన్నా బాగా రాసేవాళ్ళు.:-)


ఓ సారి జాలంలో చర్చ జరిగింది. తర్వాతి జ్ఞానపీఠ్ ఎవరికి అని..వచ్చిన కొన్ని పేర్లు చూస్తే .. ముళ్ళపూడి వెంకటరమణ, సోమసుందరం, మీ పేరూ..ఇలా ఉన్నాయండి.

(కాస్త చిరాకుగా) నాకు జ్ఞానపీఠ్ ఏంటసలు?


ఎవరికి అవకాశం ఉందంటారు?

జ్ఞానపీఠ్ అవార్డు..బాగ రాసేవారెవరున్నారీ మధ్య? చనిపోయినవారికివ్వరుగా? దాశరథి రంగాచార్య గారున్నారుగా, ఆయనకివ్వచ్చేమో! దానికో కొలమానం లేదండి. ఎవరికివ్వాలి అని.ఏదో రూపంలో మనిషిని ఎంచుకుని, రచనకిస్తారండి..నాకూ అంతేగా సాహిత్య అకాడెమీ, నాకిద్దామనుకుని రఘుపతి రాఘవ రాజారాం కిచ్చారు.


మళ్ళీ అలాంటి స్థాయికి తగ్గ రచనేదైనా వచ్చే అవకాశం ఉందాండి?

నేను రాసిన ప్రతీదీ అలాంటి స్థాయేనండి. కానీ జనం గుర్తించరంతే.


దానిక్కూడా కొలమానాలేవైనా ఉంటాయండీ? సాహిత్య అకాడెమీకి?

నాటకానికిచ్చారుగా..నవలకైతే, బూతుండకూడదు, ఎక్కువగా రొమాన్సుండకూదదు, సమకాలీన పరిస్థితులు ప్రతిబింబించాలి, ఒక ఫీలింగు, చరిత్రా…ప్లస్ చాలా ఉన్నాయండి. అప్పుడేదో ఇచ్చారు కానీ ఇప్పుడెందుకిస్తారు?Because, I am a popular commercial writer. చిరంజీవికి బెస్టు ఏక్టర్ అవార్డు రావాలంటే చాలా కష్టం. అతన్నిజంగా పూనుకుని, రుద్రవీణ లాంటి సినిమా తీసినా కష్టమే రావడం.


అంటే, మీరు పాపులర్ రైటరు అవడం వల్ల జ్ఞానపీఠం వచ్చే అవకాశం తక్కువైందంటారా?

జ్ఞానపీఠ్ అవార్డు రావటానికి పది అర్హతలుంటే, నాకు ఒక్క అర్హత కూడా లేదండి. నాకు సాహిత్యం మీద పట్టులేదు. చరిత్ర తెలీదు. నేనేమీ సమసమాజ నిర్మాణం కోసం నవలలు రాయలేదు.సమకాలీన పరిస్థితులు ప్రతిబింబించే రచనలు చేయలేదు. నాకెలా వస్తుందసలు? అసలా ఊహే తప్పు ఊహ. అమితాబ్ బచ్చన్ కు బెస్టు ఫైటర్ అవార్డెందుకు రాలేదన్నట్టు ఉంటుంది.


మీది ప్రత్యేకమైన, విలక్షణమైన శైలి. ఆ శైలికోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారా?

నేను ఒక్కొక్క పేజి నాలుగైది సార్లు రాస్తానండి వర్షన్సు. అందుకే ఆ శైలి.


ఓ నవలకు కనీసం నాలుగు వర్షన్సుంటాయాండి?

ఓ పేజీ. ఓ పేజీ రాయగానే, మళ్ళీ దాన్ని తిరగ రాస్తాను. మళ్ళీ తిరగరాస్తాను. కొట్టేసి బ్రాకెట్లో రాయటం అవన్నీ కాక, అలా రాసి ఓకే అనుకుంటే – మీ టేబుల్ దాటి పక్కకెళ్ళడానికి ముందే మూణ్ణాలుగు వర్షన్సుంటాయ్. అలా మూణ్ణాలుగు ఫిల్టర్సు పడిపోతాయండి. తరువాత కూడా ఉంటాయండి. చివరకు పంపబోయే ముందు కూడా ఏరో మార్కులవీ ఉంటాయి. శైలి పర్ఫెక్టుగా ఉంటే తప్ప…"అతను అక్కడికి వెళ్ళాడు","అక్కడికతను వెళ్ళాడు" ..ఈ రెంటికీ చాలా తేడా ఉంది.


మాపాఠకుల కోసం ఓ పేజీ తాలూకు వర్షన్సు ఇవ్వగలరా?

ఇదుగోండి, అయితే ఈ పేజీ తాలూకు ఫైనలు వర్షన్ వెళ్ళిపోయింది. ఫైనల్ అయింతర్వాత కూడా మార్పులుండవచ్చు.


ఒకేసారి రెండుమూడు రాస్తున్నారనుకోండి?

రాయనండి. ఇప్పుడు అస్సలు రాయను.


ఇప్పుడు ఎన్నివారాల ప్రాజెక్టు చేస్తున్నారండి?

25వీక్స్ రాద్దామనుకున్నానండి, బావుంది, కంటిన్యూ చెయ్యమని ఎడిటరంటే. మరో పదిహేను రోజులకు చెబుతాడు. చెబితే మరో పదివారాలు పెంచుతాను. అదన్నా, నాకు తృప్తి కలిగితేనే. లేకపోతే ముగింపు.


తర్వాత ఏమి రాయాలన్న ఐడియా ఉందాండి?

లేదండి. ఇదే చాలా రోజుల తర్వాత రాశాను.


ఇంత గాపెందుకు తీసుకున్నారండసలు?

నాకు పర్సనాలిటీ డెవలెప్ మెంట్ స్టూడెంట్స్ కు చెప్పడం బావుందనిపించింది. I am more engaged with resort.టైముండాలి.


మొత్తం ఆంధ్రా అంతా తిరుగుతారా?

ఆంధ్రా, కర్ణాటకా. బళ్ళారి ఉందిగా..


బళ్ళారి అంటే గుర్తొచ్చింది. కన్నడలో మీకు ప్రవేశం…

నాకు లేదండి.


మీ రచనలు బాగా కన్నడలో అనువాదం అయాయి కదండి. మొదట్లో వచ్చిన రచనలు, మీకు క్రెడిట్ ఇవ్వకుండా…అంటే చెప్పకుండా అనువదించుకున్నారని..

ఏ విషయం చెబుతున్నారు? నాకూ సులోచనారాణికి గొడవ.. అదా? మీరు చెప్పేదేదో కానీ, ఎవరో సులోచనారాణి గారి నవల్సు నాపేరుబెట్టి ట్రాన్సులేట్ చేసి రిలీజ్ చేసారు. దానిమీద సులోచనారాణి గారు హర్టయారు. అదీ గొడవ మా ఇద్దరికీ. మా ఇద్దరికీ అంటే.. నాకు ఏం లేదు. నేనంటాను – నేనేం జెయ్యను, ఎవరో ట్రాన్సిలేటు చేసుకుని ఏదో చేసుకుంటే నేనేం చెయ్యాలి? నాకు వాళ్ళెవరో చెప్పాలంటారు ఆమె. నాకు తెలిస్తే కదా చెప్పడానికి?


కార్పోరేట్స్ కూ, కాలేజీ వాళ్ళకూ మీ ప్రోగ్రాం ఉంది కదండి?

అవును jbit కాలేజీ.


ఇది ఫుల్ డే ప్రోగ్రామ్ కదండి?

3 అవర్సే. మామూలుగా అయితే 10 to 25 అవర్స్.


అంటే వర్క్ షాపులా కండక్ట్ చేస్తారాండీ స్టూడెంట్స్ కి?

అవును. స్టూడెంట్స్ వర్క్ షాప్.


ఎన్నాళ్ళముందు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుందండి?

దేనికి?


ఏదైనా ప్రోగ్రాంకోసం కాంటాక్ట్ చేయాలంటే – కార్పోరేట్స్ కు?

డేట్స్ బట్టీ అండి. అక్కడేదైనా ఖాళీడేటుంటే ఒకరోజు ముందు చెప్పినా పర్లేదు.


పబ్లిష్ అయిన రచనల మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయా? మెయిన్ టెయిన్ చేస్తారా వీటిని మీరు?

ఉంటాయ్, ఎక్కడో ఉన్నాయండి. చూడాలి.


ఇప్పుడు కూడా మీ అభిమానులనుండీ మీకు బాగా ఉత్తరాలు అవీ వస్తుంటాయాండి?

లేవండి. ఇప్పుడసలు ఉత్తరాలు రావు.


అప్పుడు వచ్చినప్పుడు మీరు సమాధానాలు ఇచ్చేవాళ్ళాండి?

ఆహా. అన్నిటికీ ఇచ్చేవాణ్ణి.


మేన్యుస్క్రిప్ట్స్ పత్రిక్కి పంపిన తర్వాత మీకు వెనక్కి పంపేవాళ్ళాండి? వారిదగ్గర అట్టిపెట్టుకునే వాళ్ళా?

కొన్నిపత్రికలు క్లోజయిన తర్వాత వాళ్లదగ్గర ఇప్పించుకున్నానండి.


మీరు చెప్పిన మీకిష్టమైన కోట్స్? Quotable quotes of Yandamuri?

చాలా ఉన్నాయండి. "రేపు ఆనందంగా ఉంటాననే నమ్మకంతో ఈ రోజు ఆనందంగా ఉండు"
"జీవితమంటే, ఇంతకన్నా బాగా ఆనందంగా ఉంటం కోసం ఈ రోజు పని చెయ్యటం" కాకపోతే ఈ quotes అన్నీ ఆనందం గురించి.


మీ Quotes అన్నీ ఎక్కడైనా సంకలనం చేశారా?

మంచిముత్యాలు – ఇలా రెండుమూడు పుస్తకాలు వచ్చినయ్.


కొత్తకొత్తపేర్లు పెడుతుంటారు, హేమంత సంధ్య, ప్రహసిత్ ఇలాగ. మీరేమైనా రీసెర్చి లాగా చేస్తారా?

లేదు,లేదు. అప్పుడెప్పుడో నేనో పేరుబెడితే, ఎవరో వాళ్ళబ్బాయికి ఆ పేరు పెట్టారు. ఇదేదో బావుందని, కొత్తపేర్లు ప్రయత్నించడం మొదలెట్టాను.


రేవంత్ అలా వచ్చిందేనా?

రేవంత్ – అవును, అలా వచ్చింది.


ఆ పేరు నవల వచ్చిన తర్వాత చాలామంది పెట్టుకున్నట్టున్నారు.

పెట్టుకున్నారండి, actual గా ఆ పేరుకర్థం గుర్రాలు తోలే అతనని.


ఓ ప్రముఖ తెలుగుదేశం నాయకుడున్నాడండి.

రేవంత్ రెడ్డి! దానికన్నా, అనూష ఎక్కువమంది పెట్టుకున్నారు.


ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు – ముఖ్యంగా నైట్ క్లబ్బులు, జీవితాల్లో డబ్బు ప్రాముఖ్యత పెరగటం, వీటిమీద మీ అభిప్రాయాలేమిటి?
తప్పేముంది?


సంస్కృతి పట్ల..

నాకంత broad ideas లేవండి. నాదంతా వ్యక్తిత్వ వాదం. ప్రతిమనిషి ఆనందంగా ఉండాలి. సమాజం పాడైపోతోంది,  TV9 లో రోజూ చూసినవే చూపిస్తున్నారు, పేపరులో న్యూసు – ఇవాన్నీ నాకు పట్టవండి. ఒకరు జీవితంలో బావుండాలి. అంతే.


ఏదినచ్చితే అది చేయాలి అంటారా?

ఇంకొకళ్ళకు నష్టం లేకండా. మర్డరు చేసి నేనిలానే అంటే కుదరదు కదండీ. ఇందులో రెండున్నాయి. బలహీనతలు, తప్పు. బలహీనతలంటే – ఓ పని చేయటం వల్ల మీకు నష్టం కలిగించేవి. – సిగరెట్లు, తాగుడు, పేకాట, రేసులు – ఇవి నాకు సరిపడవు. తప్పు అంటే నావల్ల మీకు నష్టం కలిగించేది. – మర్డరు, చీటింగు,వగైరా. ఈ రెండూ కాకండా, ఈ రోజెంత ఆనందంగా ఉన్నామో, రేపు ఆనందంగా ఉండాలన్న ధీమా సంపాదించుకోవాలి. ఈ రోజు ఆనందంగా ఉంటం ఈజీ. కానీ రేపు ఆనందంగా ఉండాలంటే ఈ రోజు డబ్బు సంపాదించాలిగా.నా ఆలోచనలు అంతవరకే. అంతేతప్ప, సమాజం పాడైపోతోంది, యువతీయువకులు పబ్బులకెళ్ళిపోతున్నారు, నైతికవిలువలు తగ్గిపోయినై …అంత ఆలోచించనండి. ఎందుకంటే, యాభై యేళ్ళ ముందు కూడా పొడుగ్గా ఆరడుగుల ఆసామీ అంగవస్త్రం వేసుకుని సాయంత్రం ఆరింటికి సెకండ్ సెటప్పు దగ్గరికెళ్ళిపోయేవాడు. ఇంట్లో ఆవిడొక్కతే పాపం వంటచేసుకుని, పిల్లలను చూసుకుని మునగదీసుకునేది. అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయీ బాధలు. బాధలెప్పుడూ ఉంటాయి, ఏడ్చేవాళ్ళెప్పుడూ ఏడుస్తూనే ఉంటారు, ఇథియోపియా ఇథియోపియాలానే ఉంటది, సౌదీ అరేబియా, సౌదీ అరేబియాలానే.అంచేత వ్యక్తిగతంగా మనం ఎలా ఆనందంగా ఉన్నాము? ఉన్నంతలో చుట్టూ ఉన్నవాళ్ళను ఎలా ఆనందంగా ఉంచగలుగుతున్నాము. అదే వ్యక్తిత్వవికాసం.single man identity.సమాజం ఎలా ఉంది అనేదానికన్నా, నువ్వెలా ఉన్నావనేదే నా నవలల్లో చెప్పడానికి ప్రయత్నించాను.


రచనలు, సినిమాలు, క్లాసులు, సరస్వతీ పీఠం.. తర్వాతి ప్రస్థానమెటువైపు?

(నవ్వు) తెలీదండి. ప్రస్తుతానికేమీ ఆలోచనలు లేవు.


ఇంతటితో మా ప్రశ్నలు ముగిశాయండి. పొద్దు పాఠకులకు ఏమైనా చెప్పదలుచుకున్నారా?

ఏవీ లేదండి.


మీ కథేదైనా పొద్దు పాఠకులకోసం ఇవ్వగలరా?

తీసుకోండి.

(యండమూరి వీరేంద్రనాథ్ గారి కథ నిశ్చల యాత్ర పొద్దు పాఠకులకోసం త్వరలో)

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *