ఇన్‌ఫార్మర్

ఇన్‌ఫార్మర్లందరిని వెతికి పట్టుకుని చంపుతున్నారనే పుకార్లతో ఊరంతా అలజడిగా ఉంది.  గత యాభై ఏళ్ళలో లోయలో ఎప్పుడూ ఇటువంటి మరణాలు లేవు, కానీ ఇప్పుడిక్కడ రోజుకో నాలుగు లేదా అయిదు చావులు మామూలయిపోయింది.

ప్రతి ఒక్కరి ముఖంలో భయం, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. తమ నీడని కూడా నమ్మలేని పరిస్థితి. "జాబితాలో నా పేరు ఉందా? రక్షణ బలగాలతో నాకు సంబంధం ఉందని వాళ్ళు అనుమానిస్తున్నారా? లేదంటే రక్షణ సిబ్బందితో నేను మాట్లాడడం ఎవరైనా చూసారా?"  ఇలా ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు.

ఇలా తమకి తాము వేసుకున్న ఒక్కో ప్రశ్నకి వారిలో ఆందోళన మరింత పెరిగిపోతోంది. "నా రాజకీయ విధేయతల గురించి ఎవరికైనా తెలుసా?" అని ఏ వ్యక్తి అయినా అనుకుంటే అతని గుండె కలవరంతో వేగంగా కొట్టుకుంటోంది.  "ఈనాటి సంఘటనలలో ప్రమేయం ఉన్న ఎవరితోను నాకు సంబంధాలు లేవు, మరి నన్ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారు?". అతని రక్త పోటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. మరునాడు అతను స్థానిక దినపత్రికలో – తనకి ఏ రాజకీయ పార్టీతో గానీ లేదా ఏ గూఢచార వ్యవస్థతో గాని ఎటువంటి సంబంధాలు లేవని – తాటికాయంత అక్షరాలతో ఓ వివరణాత్మక ప్రకటన ఇస్తాడు.


చావు అనే ఆలోచనకి భయపడినంతగా, నిజంగా మరణానికి ఎవరు భయపడరేమో.  లోయలోని ప్రతి ఒక్కరు అనివార్యమైన మృత్యువుని ఎదుర్కోడం కోసం రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.  కొంతమంది పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పారు, మరికొందరు తమ పరిస్థితులను వివరించారు, ఇంకొందరు లోయని విడిచిపెట్టి వెళ్ళిపోయారు.

అయితే నీలకంఠ ఇటువంటి పనులేవీ చేయలేదు. తన అరవై అయిదేళ్ళ జీవితాన్ని ఇక్కడే ఈ లోయలోనే ఎంతో నిజాయితీతో, ధర్మబద్ధంగా గడిపాడు. ఇప్పుడు కూడా తన చుట్టూ ఉన్న ఉద్విగ్న వాతావరణంలో సైతం ఆయన ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు.

నీలకంఠ ఇల్లు మహరాజా ఇటుకలతో….. అంటే ఈ కాలం నాటి టైల్స్‌తో నిర్మితమైంది, ప్లాస్టరింగ్ బంకమట్టితో చేసారు. ఇంటి పైకప్పుకి పెంకులు వేసారు. ఆయన ఇల్లు జీలం నది ఒడ్డున ఉంది. ఆ నది ఎన్నో ఏళ్ళుగా రాజసంతో ప్రవహిస్తోంది.  ఆయనుండే ప్రాంతం పేరు హబ్బాకదల్. వేకువ జామున తొలి కోడి కూతకే సందడి నెలకొనే ఏకైక ప్రాంతం శ్రీనగర్‌లో ఇదొక్కటే. ఒకవైపు గుడి గంటలు మరోవైపు ముస్లింల ప్రార్థనలు వినిపిస్తుంటాయి. తోపుడు బళ్ళ మీద వస్తువులు అమ్ముకునేవారు తెల్లారకట్టే హబ్బాకదల్ వంతెనపై చేరుతారు, తమ తమ సంబారాలతో కొనుగోలుదారులని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. కూరగాయలు అమ్మేవాళ్ళు గంత్ గోబీ, తామర తూడ్లు, కాశ్మీరీ ఆకుకూరలని అమ్ముకుంటుంటే; చేపలమ్మే ఆడవాళ్ళు తమ తమ చేపలని అమ్ముకోడానికి చిన్న చిన్న నెపాలకే ఒట్లు పెట్టేసుకుంటున్నారు. మరో వైపు  బేకరి నుంచి నోరూరించే సువాసనలు; ఇంకో మూల నుంచి మిఠాయి కొట్లోంచి మరుగుతున్న పాల వాసన!  ఓ హిందువు చేపలు కొంటూ గాయత్రి మంత్రం మననం చేసుకోడం; ఓ ముస్లిం తామర తూడ్లను కొంటూ పవిత్ర ఖురాన్‌ లోని రెండవ అధ్యాయం పఠించడం గమనించవచ్చు. గుర్రపు గిట్టల చప్పుడుతోను, సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళు జనాల నుంచి తప్పుకోడం కోసం కొట్టే బెల్ శబ్దంతోను, ఆటోరిక్షాల చప్పుడుతోను ఆ రోడ్డంతా నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ శబ్దాలు అర్ధరాత్రి వరకూ కొనసాగుతాయి. అబ్బాయిలు, అమ్మాయిలు స్కూళ్ళకి, కాలేజిలకి వెళ్ళే సమయంలో ఈ రోడ్డు అత్యంత కోలాహలంగా ఉంటుంది. తెల్లటి సల్వార్ కమీజ్ దుస్తులలో సీతాకోకచిలుకల్లాంటి అందమైన అమ్మాయిలు వెడుతుంటే, కొంటె వ్యాఖ్యలు చేస్తూ కుర్రాళ్ళు వాళ్ళని అనుసరిస్తూంటారు. ఆ వ్యాఖ్యలు నచ్చితే అమ్మాయిల బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కేవి. వాళ్ళకది వినోదంగా ఉండేది.

కాని నేడంతా విభిన్నం! వాతావరణంలో హఠాత్తుగా ఏదో మార్పు! నీలకంఠ ఎందుకలా తీవ్రమైన ఆలోచనల్లో నిమగ్నమైపోయాడో దేవుడికే తెలియాలి. వృద్ధురాలైన ఆయన భార్య ఆయన హుక్కా గొట్టాన్ని శుభ్రం చేసి, దాన్లోని నీటిని మార్చింది.  ఆయన చిలుములో పొగాకు నింపి బొగ్గుతో నిప్పు చేసి దాన్ని వెలిగించి ఒక పీల్పు పీల్చాడు. గాలి బయటకు వదలగానే ఆయన నోట్లోంచి రింగులు రింగులుగా పొగ వెలువడింది. ఓ క్షణం పాటు ఏ ఆలోచన లేకుండా శూన్యంలోకి చూస్తుండిపోయాడు.  కాసేపయ్యాక చిన్నగా దగ్గి, మళ్ళీ ఆలోచనల్లో కూరుకుపోయాడు.

ఆయన తన పెళ్ళైన రోజుని గుర్తు చేసుకున్నాడు.  ఆ రోజు ఆయన అరుంధతి వాళ్ళింటికి వెళ్ళడానికి హబ్బాకదల్ వంతెన దాటాడు . ఎందుకంటే ఆవిడ ఇల్లు నదికి ఆవలి ఒడ్డున ఉండేది. తన ఇంటి కిటికిలోంచి ఆయన అరుంధతి గారి పుట్టింటిని చూసేవాడు. ఆవిడ కూడ కిటికి దగ్గరే నిలుచుని ఉండేది. వారి ఇళ్ళను విడదీసింది గంభీరమైన జీలం నదే.

రోజూవారి పనులను పూర్తి చేసుకుని అరుంధతి వచ్చి ఆయన పక్కన కూర్చుంది. సమయం ఎలా గడుస్తుందో ఎవరికీ తెలియదు. " మన పెళ్ళయి నలభై అయిదు సంవత్సరాలు గడచిపోయాయి……" అన్నాడు నీలకంఠ, అరుంధతి ముఖంలోకి చూస్తూ. ఆయనకి ఈ విషయం నమ్మశక్యంగా లేదు.

"ఏంటి హుషారుగా ఉన్నట్లున్నారు? ఇన్ని ఏళ్ళ తర్వాత మీరు పెళ్ళి రోజుని గుర్తు చేసుకున్నారు? ఏంటి సంగతి?" అంటూ ఆవిడ ఆశ్చర్యపోయింది .

"ఏం లేదు. ఊరికే.  ఈ రోజు ఏం తారీఖో తెలుసా?"

" హు‍(. ఈ వయసులో తేదీలు, సమయాలు ఎవరికి గుర్తుంటాయి? మన జీవితం – గడచిపోయిన సంవత్సరాన్ని సూచించే కాలెండర్ లాంటిది   – అన్న సంగతి మీకు తెలియదూ? దాని మీద దేవుడి బొమ్మ ఉంది కాబట్టి ఇంకా గోడ మీద ఉంది లేకపోతే ఈ పాటికి ఎప్పుడో బయట పడేసేవాళ్ళు. మనం కూడా కాలమనే దారంతో వేలాడుతూ ఉన్నాం, వాళ్ళింకా మనల్ని గౌరవిస్తున్నారు కాబట్టి మనల్ని చెత్తబుట్టలోకి తోసేయలేదు….మనం కూడా ఆ కాలెండర్ మీది దేవుళ్ళలా వాడిపోడానికి సిద్ధంగా ఉన్నాం కదూ?"

"నిజమే… మనం ఆ గోడ మీది కాలెండర్ పైన ఉన్న దేవుళ్ళలా రాలిపోడానికి సిద్ధంగా ఉన్నాం, విధివిలాసం కోసం ఎదురుచూస్తున్నాం…."

టీ కోసం నీళ్ళు మరగబెట్టడం కోసం గిన్నె హీటర్‌పై పెట్టిన సంగతి గుర్తొచ్చి "ఈ పాటికి నీళ్ళు మరిగి ఉంటాయి" అనుకుంటూ గోడని ఆసరాగా చేసుకుని లేచి నిలబడిందావిడ. అలమారలోంచి టీ కెటిల్, రెండు ఇత్తడి కప్పులు బయటకి తీసింది.  నీలకంఠ హుక్కా గొట్టాన్ని పక్కకి పెట్టి , దానిపై మూతబెట్టి మరో చెత్తో ఓ కప్పు అందుకున్నాడు. అరుంధతి వచ్చి ఆయన కప్పులో టీ పోసింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి మరో కప్పులో తనకి కూడా పోసుకుని వచ్చి ఆయన పక్కన కూర్చుంది.

"నీకు గుర్తుందా? నేను మా ఇంట్లోంచి నిన్ను గంటల సేపు చూసేవాడిని"

"ఏమైంది మీకీ రోజు? వింతగా ఉన్నారు? " అంటూ భర్త మాటలకి అడ్డుతగిలింది. ఆ తర్వాత ఆవిడ కూడా బాల్య స్మృతులలోకి జారుకుంది.  అరుంధతి నీలకంఠ కన్నా అయిదేళ్ళు చిన్నది, కాని తీవ్రమైన ఆర్థ్‌రైటిస్ వ్యాధి వలన ఆమె చేతి వేళ్ళు బిర్రబిగుసుకు పోయాయి, వాచిపోయాయి. చలికాలం ఆవిడ నొప్పులని మరింత పెంచింది. కీళ్ళ నొప్పులు ఆవిడ కాళ్ళు చేతులను కట్టేసినా మరో మార్గం లేదు….. ఇంటి పనులు చేసుకోవాల్సిందే… ఈ వృద్ధాప్యంలో సాయం చేయడానికి ఆవిడకి ఎవరూ లేరు మరి. ఆవిడకి పిల్లలు లేక కాదు, కానీ వాళ్ళిద్దరూ చెరో చోట… ఒకరు అమెరికాలో, మరొకరు ముంబయిలో తమ తమ కుటుంబాలతో ఉంటున్నారు .

"చాలా రోజుల నుంచి నా కుడి కన్ను అదురుతోంది.  ఏదో కీడు జరగబోతోంది.  ఏమవుతుందో ఆ దేవుడికే తెలియాలి" అంటూ అరుంధతి నేల మీది చాపలోంచి చిన్న ముక్కని తెంపి కొద్దిగా ఉమ్ము అంటించి కంటి వణుకుని ఆపేందుకు కంటి రెప్పపై ఉంచుకుంది.

"మన తలరాత ఎక్కడో స్వర్గంలో రాయబడింది . జరిగేది జరగక మానదు……" అన్నాడాయన.  ఆయన కంఠంలో అంత నిర్వేదం, అంత దిగులు  మునుపెప్పుడూ లేవు.

విధి గురించి భర్త ఇలా మాట్లాడడం అరుంధతికి వింతగా ఉంది. గతంలో ఎన్నడూ ఇలా మాట్లాడలేదాయన. తను వేసే ప్రశ్నలకి భర్త నుంచి జవాబులు రాకపోతే ఆవిడకి చికాకు కలుగుతోంది. నీలకంఠ గత కొన్ని రోజుల నుంచి నిద్రించే ముందు ప్రతి తలుపుని కిటికిని జాగ్రత్తగా మూయడం ఆవిడ గమనిస్తోంది. ప్రతి గొళ్ళెం, గడియ సరిగ్గా పట్టాయో లేదో పరిశీలించేవాడు. ఒక్కోరోజు హఠాత్తుగా అర్ధరాత్రి పూట నిద్ర లేచి కిటికి పరదాలను పక్కకి జరిపి బయటి చీకటిలోకి తొంగి చూసేవాడు. సైనిక వాహనాల ధ్వని, సైనికులు రాత్రిళ్ళు చేసే కవాతు చప్పుడు తప్ప మరే శబ్దాలు వినిపించేవి కావు.  భయం, ఆందోళన నిండిన వదనంతో తిరిగి మంచం మీద వాలేవాడు.

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.