తడి


ఇప్పుడేదో అంతా
ఎడారి పరుచుకున్నట్లు
పాదాలు ఎర్రని ఎండలో
కూరుకుపోతున్నట్లు
అరచేతులలో తడి
ఆరినతనం..
 

దేనిని తాకినా
ఏదో రబ్బరు తొడుగు
దేహమంతా
కప్పబడినట్లు
స్పర్శ కోల్పోయినతనం..


కనుల లోయలో
పరచుకున్న
ఎండమావులు….
గాజు కళ్ళుగా
మారిపోయాయన్నట్టు
ఏదీ ఇంకనితనం..


అంతా రంగు రుచి లేని
కషాయంలా గొంతులో
ఏదో విషం దిగుతున్నా
బాధ తెలియని
శిలాజంలా…


ఒంటరితనంవైపు
మొగ్గుతూ బాహ్యాంతరాలలో
ఏదో నిషేధ ఘోష


చుట్టూరా కమ్ముకున్న
ఈ సమ్మె వాతావరణంలో
నాలుక పిడచకట్టి
గొంతెండిన వేసవితనం
వెంటాడుతోంది…


ఎక్కడో దాగిన కాసింత
కన్నీటి ఊట
నన్నింకా ఇలా
మనిషిలా(?)
నీముందు…

About కెక్యూబ్ వర్మ

కె.కె.కుమార వర్మ గారు విజయనగరం జిల్లా, పార్వతీపురం పట్టణంలో వుంటున్నారు. అది కళింగాంధ్ర ప్రాంతం. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖలో గ్రామాభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నారు. విరసం సంస్థలో 12 ఏళ్ళుగా సభ్యుడిగా వుంటున్నారు. శివారెడ్డి, ఆశారాజుల కవిత్వమంటే బాగా ఇష్టం. ప్రస్తుతం బ్లాగుల్లో వివిధ అంశాల పట్ల తన స్పందనను రాస్తున్నారు
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.