“శుద్ధ సాహిత్యం” శుద్ధ అబద్ధం – 5

తొలినాళ్లలో ఇతర భాషల సాహిత్యంతో మీ పరిచయాన్ని గురించి చెప్పగలరా?


ప్రాచీన తెలుగు సాహిత్య నేపథ్యం నించి వచ్చిన వాణ్ణి కావడం వల్ల మిగిలిన భాషల్లో కూడా ప్రాచీన కావ్యాలు చదవాలన్న ఆసక్తితో నేను ఇతర భాషల వైపు మళ్ళాను. సాంప్రదాయాలు ఎలా వికసించాయో అర్ధమయితే తప్ప, ప్రయోగాల పరిణామం అర్థం కాదనుకుంటా. ఎక్కువ వచన కవిత్వమే రాసినా,  ఇప్పటికీ పద్య సాహిత్యం అంటేనే ప్రాణం.  ఛందస్సులతో ఆడుకోవడం మొదటి నించీ  సరదాగా వుండేది. కానీ, కాల క్రమేణా వేరే భాషల సాహిత్యం వైపు మళ్లడం వల్ల పద్య రచనకి వ్యవధి లేకుండా పోయింది. ఉర్దూ హిందీ కవిత్వాలు మొదటి నించి చదివే అలవాటు వుండేది.  ఇంగ్లీష్ లో పొయెట్రీ రెవ్యూ, పారిస్ రెవ్యూ,  హిందీలో “సరిత” “సారిక” సాప్తాహిక్ హిందూస్తాన్” “ధర్మయుగ్” పత్రికలు క్రమం తప్పక చదివే వాణ్ని. (ఆంధ్ర జ్యోతిలో పని చేసినప్పుడు  ఈ “పారిస్ రెవ్యూ” నమూనాలో   కొన్ని సాహిత్య శీర్షికలు చేశాను. ముఖ్యంగా అప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూలు అన్నీ పారిస్ రెవ్యూ నమూనాలో చేసినవే. మంచి వచన రచయిత కావాలన్న అభిలాష వున్న వాళ్ళు తప్పక చదవాల్సిన పత్రిక ఇది. పైగా, ఈ మధ్య ఇందులో భారతీయ రచయితలు ఎక్కువగా కనిపిస్తున్నారు కూడా.) ఇంగ్లీషు, హిందీ వచనం వైపు ఎక్కువ ఆసక్తి వుండేది. కానీ,  షెల్లీ నించి ఎలియట్ దాకా రోజుకో కవిత బట్టీ కొట్టే వాణ్ని. భర్తృహరి అంటే విపరీతమయిన ఇష్టం. కవిత్వంలో భావ తీవ్రతకీ, ఆలోచనా సాంద్రతకీ, సౌందర్య భావనకీ మధ్య  సమతౌల్యం అనేది వుండాలనుకుంటే, అది భర్తృహరి కవిత్వంలో చూడవచ్చు. ఆ ప్రభావం వల్ల సంస్కృత సాహిత్యం వైపు మళ్ళాను. దేవనాగరి బాగా అలవాటు కావడం వల్ల ఇతర సంస్కృత కావ్యాలు చదవడం తేలిక అయ్యింది. ఆ తరవాత పుల్లెల వారి పుణ్యమా అని శాస్త్ర పరిచయమూ కలిగింది.

క్లాసిక్స్ మీద ఇప్పుడు మనవాళ్ళు కొందరికి కొంత చిన్న చూపు వున్నట్టుంది కదా?!


కొంచెం కాదు, ఎక్కువే వుంది. కుందుర్తి లాంటి కవులు వచన కవిత్వాన్ని ఒక ఉద్యమం చేసే తాపత్రయంలో క్లాసిక్స్ మీద వైముఖ్యాన్ని పెంచారు. నేను ఈ యేడాది నా ఇండియన్ పొయెట్రీ కోర్సులో మహాభారతం స్త్రీ పర్వంతో పాటు కొన్ని క్లాసిక్స్ ఇంగ్లీషు అనువాదాలలో పరిచయం చేశాను. విద్యార్థులకి అవి ఎంత నచ్చాయో చెప్పలేను. స్త్రీ పర్వం అంతా అత్యాధునిక వచన కావ్యం. క్లాసిక్స్ – అవి తెలుగు కావచ్చు, ఇంగ్లీషు కావచ్చు- చదివి తీరాలి. సంస్కృతం చదవగలిగితే మరీ మంచిది. తెలుగు ఇంగ్లీషు కాక ఇంకో భారతీయ భాషలో  ప్రవేశం వుండడం వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా అస్తిత్వ చైతన్యాల గురించి మాట్లాడుతున్న రచయితలూ, కవులూ ఇతర భారతీయ భాషల్లో కొంచమయినా ప్రవేశం సంపాదిస్తే బాగుంటుంది. లేకపోతే, మనం బావిలో కప్పల్లాగా వుంటాం. ఉర్దూ, హిందీల లో సాహిత్య విమర్శలో జరుగుతున్న కృషి చూస్తూంటే, మనం ఆ స్థాయిని  ఎప్పుడయినా అందుకోగలమా అనిపిస్తుంది. మనకి పరమత సహనంతో పాటు, పర భాషా సహనం కూడా నెమ్మదిగా పోతోందన్న భయం వుంది నాకు.

ఇతర భాషా సాహిత్యాలతో , సాహితీకారులతో పరిచయాల్లో మీరు తెలుసుకున్నవి చెప్పగలరా?

నా దృష్టి ప్రధానంగా ఇంగ్లీష్ కవిత్వం మీద వుండేది. నెమ్మదిగా నేను హిందీ, ఉర్దూ వైపు మళ్ళాను. హిందీలోనూ, భారతీయ ఇంగ్లీషులోనూ కవిత్వం రాసే వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసే వాణ్ని. (ఉత్తరాలు బాగా రాసే వాణ్ణి, ఇప్పుడు “ఈ-లేఖా”యుగంలో ఉత్తరాల రచనకి దూరమయ్యాను.)   వీటన్నిటికీ మించి పసుపులేటి పూర్ణచంద్రరావుగారి వల్ల  ఖమ్మంలో ఫిల్మ్ సోసైటీ మొదలవ్వడంతో అంతర్జాతీయ కళలూ, సాహిత్యం వైపు కాస్త దృష్టి మళ్ళింది . ఆ సినిమాల వల్ల మంచి సాహిత్య అధ్యయనానికి అవకాశం దొరికింది.  మిగిలిన భాషల వచన సాహిత్యం చదివే కొద్దీ, సినిమాలు చూసే కొద్దీ మన కథల విస్తృతి తక్కువ అనిపిస్తుంది. మన అనుభవాల లోతు తక్కువ అని అర్ధమవుతుంది. మన అధ్యయనంలో పెద్ద లోపం వుందని తేలిపోతుంది. నిర్దిష్టంగా మాట్లాడడం, స్థానిక సంస్కృతుల మీద ఆసక్తి పెంచుకోవడం మిగిలిన అన్ని భాషలలో దాదాపూ జరుగుతోంది.  అట్లా అని తెలుగులో ఏమీ లేదన్న నైరాశ్యం నాకు లేదు. ప్రపంచ పటం మీద అది నిలబడదని చెప్పడమే! ఇప్పుడు వస్తున్న దళిత, ముస్లిం, తెలంగాణ, సీమ, స్థానిక సాహిత్యాల వల్ల ఆ లోపం కొంత పోవచ్చు.

మీకు చిన్నప్పటి నించీ ఇంగ్లీష్ మీద ఇష్టం ఎందుకు కలిగింది?


ఇంగ్లీషు మాత్రమే కాదు, హిందీ ఉర్దు అన్నా నాకు మహా ఇష్టమే! కానీ,  ఇంగ్లీషు మీద ఇష్టం ఇంగ్లీషుతో మొదలవ్వ లేదు.  ముందు ఐస్ క్రీముల మీద ఇష్టం! తొమ్మిదో తరగతిలో వుండగా క్రిస్టియన్ మిషనరీలో పని చేసే ఒక ఆస్ట్రేలియన్  యువతి నా దగ్గిర తెలుగు, ఉర్దూ నేర్చుకునేది. ఆమెకి కనీసం రెండేళ్ళు నేను పాఠాలు చెప్పాను.  ఆ మాటకొస్తే, ఆమె నించి నేనే ఎక్కువ నేర్చుకున్నాను. ప్రతివారం ఆమె నాకు ఇంగ్లీష్ నవలలు, కవిత్వం చదివి వినిపించేది. ఆమె కవిత్వం బాగా చదివేది. చదవడం అంటే పైకి! “కవిత్వమే కాదు, నువ్వేం రాసినా అది  పైకి చదువుకో. అది ఎడిటింగ్ లో భాగం. వొక మంచి అనుభవం” అని చెప్పేది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె ప్రతి ఆదివారం అనేక రకాల ఐస్ క్రీములు, కేకులు  తయారు చేసేది.  నాకు ఐస్ క్రీమ్ అంటే చచ్చేంత ఇష్టం, కానీ అంత ఖరీదయిన తిండి కొనే శక్తి ఆ రోజుల్లో లేదు కాబట్టి, ఆదివారం రాగానే ఆమె ఇంటికి పరుగు తీసే వాణ్ణి.  అలా ఐస్ క్రీమ్ నించి ఇంగ్లీషులోకి వచ్చానన్న మాట. ఇప్పుడు ఇంగ్లీష్ ఎంత మిగిలిందో చెప్పలేను కానీ, ఇప్పటికీ ఐస్ క్రీములు అంటే ఇష్టం మిగిలిపోయింది.

ఆమె నాతో మొదటి సారి బైబిల్ అంతా  చదివించింది. బైబిల్ చదవడం గొప్ప కనువిప్పు. (ప్రపంచ సాహిత్యం చదవాలనుకుంటే ముందు బైబిల్, ఖురాన్ చదివి తీరాలంటాను.) నా కోసం కలకత్తా నించి పొయెట్రీ వర్క్ షాపు కవిత్వం పుస్తకాలు తెప్పించింది. ఈ మధ్య కన్ను మూసిన పి.లాల్ ఆ పుస్తకాలు వేసే వారు. క్లాత్ బైండింగ్ లో చాలా అందంగా వుండేవి ఆ పుస్తకాలు. “ఇంగ్లీషు పరాయీ భాష కాదు, అది మన భాష” అన్న పి.లాల్ మాట నాకు బాగా నచ్చింది. కమలాదాస్, రామానుజన్, నిస్సిమ్ ఏజెకీల్ ఇలా చాలా మంది కవిత్వం అలా చదివాను. అదే సమయంలో నేను అనుకోకుండా వొక సారి బెజవాడ వెళ్ళడం, అక్కడ ప్రబోధ బుక్ సెంటర్ కి వెళ్ళడం జరిగాయి. గాంధీ నగర్ లో విశాలమయిన ఆవరణలో, పెద్ద పెద్ద చెట్ల మధ్య వొక అందమయిన బుక్ స్టోర్ అది (ఇప్పుడు వుందా?!) ఎనిమిదో తరగతి ఎండా కాలం సెలవుల నించి నేను ఖమ్మం నించి పని కట్టుకుని వెళ్ళి  వొక వారం పది రోజులు బెజవాడలో వుండి, రోజూ అక్కడికి వెళ్ళి చదువుకునే వాణ్ని. పుస్తకం కొనకుండా అక్కడే కూర్చొని చదువుకునే సౌకర్యం అక్కడ వుండేది. ఆ బుక్ స్టోర్  వాతావరణం కూడా  ఇంగ్లీషు సాహిత్యం మీద ఇంకా అభిరుచిని పెంచింది. ఆ తరవాత ఇంగ్లీషు సాహిత్య అధ్యయనం అనేది జీవితంలో ముఖ్య భాగం అయ్యింది.

ఇతర భాషా సాహిత్యాల నించి గమనించిన ఆసక్తికర అంశాలు, తేడాలు, పోలికలూ మీరు సాహిత్య మిత్రులతో మాట్లాడుకుంటున్నప్పుడు దొర్లినవి…


మిగిలిన భాషా సంస్కృతుల వాళ్ళు సాహిత్యాన్ని గురించి ఎట్లా మాట్లాడతారన్నది నాకు ఎప్పుడూ ఆసక్తికరమయిన ప్రశ్న. ఆ క్రిస్టియన్ నన్ ఏదయినా చదవగానే, నేను వెంటనే రక రకాల ప్రశ్నలు వేసే వాణ్ణి. ఆ అలవాటు వల్ల సంభాషణలు దీర్ఘ కాలం సాగేవి.  ఇండియాలో వుండగా కాస్త కవిగా గుర్తింపు వచ్చాక,  కేంద్ర సాహిత్య అకాడెమీ అప్పుడప్పుడూ నన్ను వివిధ సదస్సులకి ఆహ్వానించేది. ఆ సదస్సులకి వెళ్లినప్పుడు అనేక భాషల రచయితలనీ కలిసే వీలు దొరికేది. పైగా, హైదరబాద్‌లో అప్పుడు అమెరికన్ రెసెర్చ్ సెంటర్ ఎప్పుడూ సదస్సులు నిర్వహించేది. ఇలా కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసి వచ్చాయి.

ఇక అమెరికా వచ్చాక, అలాంటి అవకాశాలు కొన్ని వాటికవే వస్తే, కొన్ని అవకాశాలు నేను కల్పించుకున్నాను. మాడిసన్ లో రక రకాల రీడింగ్ గ్రూపులు నడిపాం. పొయెట్రీ మీట్స్‌కి వెళ్ళే వాణ్ణి. అమెరికన్ కవులు అంత తేలికగా మనల్ని కలుపుకోరన్నది నిజం, కానీ- స్నేహ బలం వల్ల నేను అలాంటి అవరోధాలు దాటగలిగాను. ఇప్పుడు  వాళ్ళే నన్ను పొయెట్రీ రీడింగ్స్ కి పిలుస్తున్నారు. నాకు ఢిల్లీ నించి మాడిసన్ దాకా వొక్కటే ప్రశ్న: వాళ్ళు సాహిత్యాన్ని చదివే/అర్ధం చేసుకునే పద్ధతులు భిన్నంగా వుంటాయా? వుంటే ఆ భిన్నత్వం ఎక్కడ?

మాడిసన్ లో వుండగా, మేము ఆఫ్రికన్ సాహిత్యం మీద ప్రతి ఏడాది వొక మూడు రోజుల సదస్సు నిర్వహించే వాళ్ళం. అప్పుడు గూగి తో సహా చాలా మంది ఆఫ్రికన్ రచయితలూ కవులతో కలిసి పని చేసే అవకాశం దొరికింది. గూగి రచనలు ఇంకా తెలుగులో రావాల్సిన అవసరం వుంది. అలాగే, అల్జీరియా స్త్రీవాద రచయితల రచనలు కూడా తెలుగులో రావాల్సిన అవసరం వుంది. ఆ అనువాద సాంప్రదాయం బలపడితే తప్ప మన గుడ్డి తనం మనకి తెలీదు. ఇప్పటికీ మెల్లకన్ను ప్రేయసి మీదనే పద్యాలు రాసే వాళ్ళు వుండడం మన దౌర్భాగ్యమే. ఆకుపచ్చ చెట్ల మీద రాసే వాళ్ళు, ఆ పచ్చదనం పోతోందన్న స్పృహ లేకుండా రాయడమూ ఒక సాహిత్య విషాదమే. రాజకీయ చైతన్యం  లేకపోవడం మనలో ప్రధాన లోపం. సాహిత్యం, మతం, రాజకీయాలు మూడూ వొక దానికి వొకటి ముడి పడి వున్న విషయాలు. కాకపోతే, వాటి పరిమితులు గుర్తెరిగి మనం సాహిత్య సృష్టి చెయ్యాలి.

ఇటీవలి కాలంలో నేను ఎక్కువగా ఆఫ్రికన్ సాహిత్యం చదువుతున్నా. ముస్లిం దేశాల నించి వచ్చే సాహిత్యం కాస్త పనికట్టుకొని చదువుతున్నా. మన దళిత, ముస్లిం సాహిత్యాలు, స్త్రీ వాదులు ఇతర భాషల నించి నేర్చుకోవాల్సింది చాలా వుంది. ముఖ్యంగా సాహిత్యంలో రాజకీయ అంశాల్ని ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. కానీ, మన వాళ్ళకి సాహిత్య రాజకీయాలు చెయ్యడం బాగా తెలుసు కానీ, నిజమయిన రాజకీయ సాహిత్యం రాయడం చాత కాదు. నినాదాలు రాసినంత మాత్రాన్న రాజకీయ సాహిత్యం కాదు. తెలుగులో  అతి కొద్ది మందికి మాత్రమే ఈ రాజకీయ సాహిత్యం మీద సరయిన ఆలోచన వుంది.

మిత్ర బృందం, సాహిత్య చర్చలూ?!


తొలినాళ్లలో చుట్టూ అంతా ఏకాకి నౌక చప్పుడే! ఇంటర్ దాకా కూడా నా విప్లవ రాజకీయాలలో వున్న కొద్ది మంది కూడా ఎక్కువ తెలుగు సాహిత్యం, అదీ విప్లవ సాహిత్యం చదివే వాళ్ళు.  అందులోనూ పాటలే ఎక్కువ! రాజకీయాలలో భాగంగా పాటలు రాయడం, దానికి సంబంధించిన చర్చలే ఎక్కువ. నాకు నేనొక ద్వీపంలో వుంటున్నట్టుగా వుండేది. నవల, కథ, వచన కవిత్వం గురించి మాట్లాడ్డం మొదలెడితే, “అన్నా, నువ్వు పాటలే ఎక్కువ రాయే… నీ పాటలు బాగుంటాయే…” అనే వాళ్ళు. అలా చాలా శక్తి పాటల్లోకి వెళ్లిపోయింది. అవేవీ ఇప్పుడు గుర్తు కూడా లేవు, అది వేరే సంగతి! కానీ, ఇప్పటికీ ఖమ్మం వెళ్తే, అక్కడి విప్లవ మిత్రులు ఆ పాటల పంక్తులు గుర్తు చేస్తారు. డిగ్రీలో వుండగా కొంత మంది గాయక మిత్రుల కోసం కొన్ని పాటలు రాశాను కానీ, నాకు పాటల మీద పెద్ద ఆసక్తి వుండేది కాదు.  అమెరికన్ రెసెర్చ్ సెంటర్ లో  జరిగే సమావేశాలకి, సెమినార్లకి వెళ్ళడం నాకు బాగా లాభించింది. ప్రపంచ సాహిత్యం ఎటు పోతోందో  కొంతలో కొంత అయినా అర్ధమయింది అక్కడే! అయితే, అమెరికా వచ్చాక నా మిత్ర బృందం పెరిగింది. అనేక భాషల వాళ్ళతో కలిసే అవకాశం దొరికింది. వాళ్ళ నించి నేర్చుకునే వీలు దొరికింది. టెక్సాస్ యూనివర్సిటీ లో ప్రగతి శీల ధోరణి ఎక్కువ. అనేక జాతుల కూడలి ఇది. ఆ విధంగా మాడిసన్ కంటే ఇక్కడ నేను ఎక్కువ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే వీలు దొరుకుతోంది. అలాగే, టెక్సాస్ తెలుగు వాళ్ళలో కూడా సాహిత్య సాంస్కృతిక చైతన్యం ఎక్కువ. ఇవన్నీ మంచి చర్చా బృందాలు. కొత్త విషయాలు మాట్లాడాలన్న ఆసక్తి, నేర్చుకోవాలన్న శ్రద్ధా వున్న బృందాలు.

తెలుగు కవిత్వంలో లేనివి ఇతర భాషల్లో ఉన్నవీ కొన్ని మంచి విషయాలు … అలాగే తెలుగుకవిత్వంలో వున్నవీ ఇతరభాషల్లో లేనివిషయాలు మీరేమైనా గమనించారా?


మిగిలిన భాషల్లో వచన సాహిత్యం బాగా వస్తోంది. మిగిలిన సాహిత్య ప్రక్రియల కన్నా, ఇప్పటికీ మన వచన కవిత్వం బలంగా వుంది. అందులో అనుమానం లేదు. కానీ,  వచనం బలపడనంత కాలం  మన సాహిత్యానికి వెలుగు లేదు. సాహిత్యం పరిణతి సాధించాలంటే వచన ప్రక్రియలు బాగు పడాలి. అన్నిటికీ సమాధానాలు దొరికిపోయాయన్న తృప్తీతో మనం ఆగిపోతున్నాం. “అన్నీ ప్రశ్నలే మాకు…అన్నీ ప్రశ్నలే మాకు.” అన్న అలజడి పెరగాలి. అప్పుడు వెతుకులాట మొదలవుతుంది. 50లలో , 70లలో రచయితల్లో ఆ వెతుకులాట వుండేది. ఆ కాలంలో వచ్చినంత వచనం తెలుగులో మరెప్పుడూ రాలేదు. ఇప్పుడు అంత వచనం లేదు. అనువాదాలు పెరిగితే మనం ఎక్కడున్నామో, ఎటు వెళ్ళాలో తెలుస్తుంది. అస్తిత్వ చైతన్యం గురించి మన ఆలోచనలు ఇంకా సూటిగా వుండాలి. ఇప్పటికీ శుద్ధ మానవతా వాదం, శుద్ధ కవిత్వం గురించి మాట్లాడే వాళ్ళని చూస్తే జాలేస్తోంది. ప్రపంచ సాహిత్యం ఎంతో కొంత చదివే తెలుగు వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడడం అన్యాయం.


ఇక తెలుగులో వున్నవీ, ఇతర భాషల్లో లేనివి….అంటారా? అది చెప్పడం అంత తేలిక కాదు. ఆ భాషల గురించి నాకు వున్న పరిచయం సరిపోదు. కానీ, literary activism అనేది తెలుగులో ఎక్కువ అనుకుంటాను. శతక కవులూ, గురజాడ నించీ ఇది వున్నా, ఇటీవల స్త్రీ, దళిత, ముస్లిం వాదాల వల్ల ఎక్కువ సాధ్యమయింది. సాహిత్యానికీ, బయటి జీవితానికీ, ఉద్యమాలకూ మనం ఇస్తున్న ప్రాధాన్యం మనల్ని కొంత భిన్నంగా నిలబెడుతుంది.

అమెరికా లో సెటిలయిపోయాక ఇండియా ఎలా కనపడుతోంది? అక్కడి నుంచిచూస్తే, ఇంకా అక్కడి తెలుగు వాళ్ళు రాస్తున్న నాస్టాల్జిక్ కవిత్వం సంగతులపై మీ భావనలేమిటి?


ముందు  ఒక సవరణ. అమెరికాలో నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, అవుతానో లేదో తెలియదు. నాకు ఆ సెటిల్మెంట్ అనే విషయం మీద అంత పట్టింపు లేదు. నాది జంగమ మార్గం.  అదలా వుంచితే,   ఏ విషయమయినా సరిగా అర్ధం చేసుకోవడానికి కొంత objectivity, పరిస్తితులకి కొంత ఎడంగా ఆలోచించే శక్తీ కావాలి. నా సాహిత్యం కోర్సులలో పఠనానుభవం గురించి నేను ఎప్పుడూ వొక ఉదాహరణ ఇస్తాను. చిత్రకారుడు బొమ్మ వేస్తున్నప్పుడు అప్పుడప్పుడూ వొక అడుగు వెనక్కి వేసి,  కుంచె పక్కన పడేసి, ఆ బొమ్మ వైపు సాలోచనగా చూస్తాడు. సవిమర్శగా చూస్తాడు. ఆ తరవాత మళ్ళీ కుంచె పట్టుకుని బొమ్మ వేయడంలో నిమగ్నమవుతాడు. తను పుట్టిన గడ్డకి దూరంగా వచ్చిన ప్రతి వ్యక్తీ, కొద్ది సేపు అలా సాలోచనగా, సవిమర్శగా చూసుకునే స్థితిలో వుంటాడు. మనల్ని మనం విమర్శించుకునే శక్తి రావాలంటే, మనం మన యదార్థ స్తితికి కొంత ఎడంగా వుండాలి. అలాంటి, అవసరమయిన దూరం/ఎడం నాకు అమెరికా అనుభవం వల్ల పెరిగింది.  ఒక రచయితగా ఇది నాకు చాలా అవసరం. ఇక వ్యక్తిగా అంటారా, ఈ దూరంలో చాలా వేదన వుంది. దాన్ని తట్టుకొని నిలబడడం అంత తేలిక కాదు. ఈ దూరం అంత నునుపు కూడా కాదు. ఇందులో వొక గరుకు విషాదం కూడా వుంది.  డాలర్ల సుఖంలో తెలియని/ కనిపించని  దుఖం చాలా వుంది.  అది ప్రతి అమెరికన్ తెలుగు వాడూ అనుభవిస్తున్నదే. కానీ, అది ఇంకా సాహిత్యంలోకి రాలేదు. రావాలి, వస్తే, అప్పుడు మనం డయాస్పోరా సాహిత్యం అంటున్న మాటకి కాస్త విలువ వస్తుంది. నాస్తాల్జియా వొక్కటే బతుకు కాదు. బతుకు నాస్తాల్జియా మాత్రమే కాదు. అనుక్షణం వర్తమానంతో పోరాటం. ఆ పోరాటం అక్షరబద్ధమయితే గొప్ప సాహిత్యం.

ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *