అస్తిత్వ ఉద్యమాల స్వరం అఫ్సర్ – 4

తెలుగులో దళిత ముస్లిం స్త్రీవాద తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలలో మీ పాత్ర గురించి కొంచెం చెప్పండి.

ఈ ప్రశ్నకి సమాధానం నిజానికి 1992 లో వెలువడిన నా వ్యాస సంపుటి “ఆధునికత- అత్యాధునికత” లో వుంది. అది 1992 లో రాసిన పుస్తకమే అయినా, ఈ 2010 లో కూడా నేను అదే అంటాను. అందులో నేను మొదట రాసిన వ్యాసం “మాతృ భాష వెతుక్కుంటున్న స్త్రీ వాద కవులు.” భాషలో పితృస్వామ్య భావజాలం అంతర్గతంగా ఎంతగా వుంటుందో చెబుతూ దాని నించి విముక్తం అయినప్పుడే స్త్రీవాద స్వరం వినిపిస్తుందన్నది అందులో ప్రధానమయిన వాదన. లింగ భాష గురించి ఆ  తరవాత చాలా చర్చలు జరిగాయి. ఆ వ్యాసం అనేక విమర్శ సంకలనాల్లో పునర్ముద్రణ అయింది కూడా. ఆ తరవాత దళిత, ముస్లిం వాదాలలో జరిగిన చర్చలలో నేను ఉత్సాహంగా పాల్గొన్నాను. వాటిని నేను ఇప్పటికీ నిర్ద్వంద్వంగా సమర్థిస్తాను. సాహిత్యం పోను పోనూ నిర్దిష్టం అయ్యి తీరాలని అనుకుంటాను. సాధారణీకరణ అన్నది ఎంత తగ్గితే అంత మంచిది. ఈ నిర్దిష్టత మానవ సంబంధాల గురించి కావచ్చు, స్థల కాలాల గురించి కూడా కావచ్చు. ఈ మౌలికమయిన పునాది మీదనే కొత్త సాహిత్యాన్ని అర్థం చేసుకోగలమని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు సాహిత్యం గురించి వున్న అనేక అపోహలూ, అపార్థాలూ కేవలం ఈ నిర్దిష్ట తాత్వికత అర్థం కాకపోవడం వల్లనే అనుకుంటున్నాను. అయితే, ఏది సాహిత్యం అవుతుంది ఏది కాదు అన్న సునిశిత అవగాహన రచయితలకి వుండి తీరాలి. ఉదాహరణకి తెలంగాణ సాహిత్యం తీసుకుంటే, రాజకీయాలలో కె సి యార్ చెప్పింది వేదం అయినా నష్టం లేదు కానీ, సృజనాత్మక రచయిత కూడా అదే వేదం అనుకుంటే ప్రమాదం. రచయితలు రాజకీయాలు మాట్లాడాలి కానీ, రాజకీయ ఎత్తుగడల వలలో చిక్కు పడకూడదు అనుకుంటా. రచయిత రాజకీయాలు మాట్లాడుతూనే తన స్వేచ్చని కూడా కాపాడుకోగలిగితేనే రచనా సమగ్రత నిలుస్తుంది. వట్టికోట , దాశరథి, కవిరాజమూర్తి లాంటి రచయితలు ఆ సమగ్రతని కాపాడుకోగలిగారు కాబట్టే వాళ్ళ రచనలు ఉద్యమాలు చల్లారినా వేడిగా వున్నాయి. ఈ విషయంలో నాకు ఉర్దూ అభ్యుదయ రచయితలూ కవులూ ఆదర్శంగా కనిపిస్తారు. తెలంగాణ తనకి వున్న ఉర్దూ బంధుత్వం నించి నేర్చుకోవాల్సింది ఇదే.
 

దళిత వాదం మొదలయినప్పుడు ఒక కవిగా మీరు దాన్ని ఎలా స్వీకరించారు?

“యానాం వేమన ఏమనే..” అనే కవితలో ఈ సంగతి బాగా అర్థం అవుతుంది.   చిక్కనవుతున్న పాట సంకలనం వేస్తున్నప్పుడు లక్ష్మి నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ “ ఈ సంకలనంతో నీ పని మటాష్. ఇక నువ్వు పుస్తకం వెయ్యలేవు, నీ అన్ని కవితలూ ఇందులో వేసేస్తున్నాం” అని సరదాగా అనే వాళ్ళు. వాళ్ళిద్దరూ అన్నంత పనీ చేశారు. నేను రాసిన ప్రతి ముక్కా దళిత కవిత్వమే అనే వాడు లక్ష్మి నరసయ్య. దళిత కవిత్వంలో నా పాత్ర ఏమిటో ఇప్పుడు నేను చెప్పకరలేదు. “చిక్కనవుతున్న పాట” సంకలనం తెరిచి చూస్తే, అది మీకే తెలిసిపోతుంది. అయితే, కవిత్వం రాయడమే కాకుండా ఆ సంకలనం చుట్టూ మేము పడ్డ కష్టాలు అనేకం. వూరూరా కవిత్వ సభలు పెట్టే సంప్రదాయాన్ని మళ్ళీ బతికించింది దళిత కవిత్వమే, గట్టిగా చెప్పాలంటే  ఆ సంకలనమే!
 

మీరు వొక ముస్లిం అనే భావన అప్పుడు మీకు వుందా?

ఇంతకు ముందే చెప్పినట్టు – ముస్లిం అనే భావన 1992 తరవాత పెరిగింది. కానీ, సాహిత్యం నిర్దిష్టత వైపు వెళ్ళాలి అని అంతకు ముందు నించే నేను వాదిస్తూ వున్నాను. నా వ్యాసాలు చదివితే ఈ వాదాలు అర్థమవుతాయి. నిర్దిష్టత అనేది తెలుగు సాహిత్యంలో ఎలా మొదలయ్యిందో, ఎలా కొనసాగిందో చెప్పే ప్రయత్నమే నా విమర్శ అంతా! నేను ఇప్పుడు తెలంగాణ సాహిత్య చరిత్ర గురించి చేస్తున్న పని కూడా అదే. తెలంగాణ సాహిత్య చరిత్ర మీద నేను వచ్చే జనవరి నించి వరసగా వ్యాసాలు రాయబోతున్నాను. అవి తెలంగాణ సాహిత్యాన్నే కాదు, అసలు సాహిత్యంలో స్థానికతని ఎలా చూడాలో చెబుతాయి. ఇంతకు ముందు నేను కవిరాజ మూర్తి నవల గురించి రాసిన వ్యాసం ఆ పెద్ద పనికి చిన్న ప్రారంభం మాత్రమే. ఇదే సందర్భంలో తెలుగు సాహిత్యంలో ముస్లిం భావన కి సంబంధించిన చరిత్రని కూడా విశ్లేషించడం అందులో ప్రధాన ఉద్దేశం. ముస్లిం భావనని మనం వ్యక్తిగత స్థాయిలో చూడకూడదు, చరిత్ర నిర్మాణ క్రమంలో ఈ భావన ఎలాంటి పాత్ర పోషించిందో చెప్పాలి. నాకు వ్యక్తిగతంగా  ముస్లిం అనే భావన వుందా లేదా అన్నది ఇందులో చాలా చిన్న అంశం. కానీ, అది నా అస్తిత్వ నిర్మాణంలో ముఖ్యమయిన కోణం అనే వాస్తవాన్ని నేను ఎప్పుడూ విస్మరించలేను. విస్మరిస్తే, నేను మీకు అబద్ధాలు చెప్పినట్టే అవుతుంది. వాస్తవికత గుర్తింపు అస్తిత్వ చైతన్యంలో ప్రధానమయిన పార్శ్వం. ఆ గుర్తింపు లేకపోతే మనం తప్పుడు చైతన్యంలో వున్నట్టే లెక్క.
 


దళితులూ ముస్లింలూ కలిసి అస్తిత్వ పోరాటం చెయ్యగలరా?

అది రాజకీయ అవసరం. కానీ, దళితులకీ ముస్లింలకీ ఆర్ధికంగా వొక తేడా వుంది. రాజ్యం నించి దళితులకి వున్నంత రక్షణ ముస్లింలకి లేదు. ముస్లింలకి ఉద్యోగ భద్రత కూడా లేదు. పైగా, ముస్లింలు పరాయి వాళ్ళు అనే భావనని మన రాజకీయ వ్యవస్థ పెంచి పోషిస్తోంది. దళితులకి అలాంటి సమస్య లేదు, అవసరమయితే దళితులని కలుపుకొని వెళ్లడానికి హిందూత్వ పార్టీలు ప్రయత్నిస్తాయి తప్ప – దళితుల సమస్యలు, ముస్లింల సమస్యలు వొకటి కావు. కానీ, రాజకీయ స్థాయిలో వాళ్ళ కలయిక చాలా అవసరం. అయితే, సాహిత్యానికి వచ్చే సరికి ఇంకో సమస్య వుంది. తెలుగు ముస్లిం రచయితలు ఎవరి కోసం రాయాలన్నది ఆ సమస్య. అసలు వల్ల సాహిత్యం ముస్లింల దాకా చేరుతుందా అన్నది వొక సవాలు. దళిత వుద్యమంలో అలాంటి సందిగ్ధత లేదు. దళిత ఉద్యమానికీ, సాహిత్యానికీ అందుకే సజీవ సంబంధం వుంది. అలాంటి సజీవ సంబంధం ముస్లింల విషయంలో కుదురుతుందా లేదా అన్నది నాకు సందేహమే. కానీ, ముస్లిం సాహిత్యం విస్తృతంగా రావడం వల్ల మన సమాజంలో మన పక్కనే వుంది అజ్నాతంగా బతుకుతున్న వొక బలమయిన వర్గం గురించి మనలో అవగాహన, సహనం పెరుగుతుంది. అలాంటి అవగాహనా, సహనం పెంచే ముస్లిం సాహిత్యం కోసం నేను ఎదురుచూస్తున్నా.

ఆ వర్గం నించి వచ్చిన అత్యంత శక్తివంతమయిన ఈ తరం రచయితగా, విమర్శకుడిగా మీ పాత్ర ఏమిటి?

నేను రెండు రకాల పనులు చేస్తున్నా. వొకటి: అసలు మన చుట్టూ వున్న ముస్లింలని ఎలా అర్థం చేసుకోగలమో, వాళ్ళని అర్థం చేసుకోవడానికి వున్న సాధనాలేమిటో వెతికి పెట్టే ప్రయత్నం చేస్తున్నా. నేను పీర్ల పండగ మీద రాసిన పుస్తకం ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురుచూస్తున్నా. ఇప్పటికే ఈ వ్యాసాలు వివిధ అంతర్జాతీయ పత్రికలలో అచ్చయి, కాస్తో కూస్తో పేరు తెచ్చుకొన్నాయి. సాహిత్యేతర అంశాల నించి నా అన్వేషణ మొదలయింది. తరవాత అవే సాధనాలని సాహిత్యానికి అన్వయించి చెప్పాలన్నది నేను చేయబోయే అతి ముఖ్యమయిన పని.  ఇప్పటికే నేను రాసిన కవిత్వం గురించి, సాహిత్య వ్యాసాల గురించి ఇక్కడ చెప్పదలచుకోలేదు.

ఒక కవి ఇజాల్నీ, రాజకీయాల్నీ, సిద్ధాంతాల్నీ వ్యక్తిగతంగా ఏవి అనుసరించినా కవిత్వానికొచ్చేసరికి సంకుచితత్వం లేకుండా విశాల దృక్పథం తో రాయాలని తిలక్ అభిప్రాయం. మీరెంతవరకూ ఏకీభవిస్తారు?

తిలక్ అంటే నాకూ ఇష్టమే. కానీ, తిలక్ మాట ఈ కాలానికి వర్తించదని అనుకుంటున్నా.  కవి ఇజం, రాజకీయాలూ, సిద్ధాంతాలకీ- కవిత్వానికి ఇప్పుడు ఎడం వుండక్కరలేదు. అలా చెప్పడం సంకుచితత్వమూ కాదు. ఆ మాటకొస్తే విశ్వజనీనతా, విశాల దృక్పథం అనే మాటలకి ఇప్పుడు అర్ధాలు మారిపోయాయి. ఎంత స్థానికమయితే అంత విశ్వజనీనత ఇప్పుడు – ఎంత నిర్దిష్టంగా మాట్లాడితే అంత విశాల దృక్పథం ఇప్పుడు –

సిద్ధాంత ప్రచారాలకి కవిత్వాన్ని వాడుకోవడం దురదృష్టకరమని కొందరు కవులు, విమర్శకుల అభిప్రాయం. మీరేమంటారు?

సిద్ధాంత ప్రచారం కోసం కవిత్వాన్ని వాడుకోవడం అదృష్ట కరమని నా అభిప్రాయం. కవిత్వాన్ని అలా వాడుకోకూడని చెప్పడం ఇంకో రకం రాజకీయ సిద్ధాంతమే. అది పచ్చి దగా.

భావ కవిత్వం, సమస్యల్ని పట్టించుకోని సౌందర్యదృష్టీ ఇటువంటి కవిత్వాన్ని మీరు అభిమానిస్తారా?

అస్సలు అభిమానించలేను. సౌందర్య దృష్టి గురించి అదొక అపోహ మాత్రమే. అదొక స్టీరియోటైప్ మాత్రమే. శ్రమ కన్నా సౌందర్యం లేదు. శ్రమించకుండా సౌందర్యం పుట్టదు.

అధునిక కవుల్లో చాలామంది ఇస్మాయిల్ శిష్యులుగా చెప్పుకుంటారు.. మీ పైన ఆయన ప్రభావం ఎంతవరకూ ఉంది. ఒకవేళ ఉంటే సిసలైన ఇస్మాయిలిజం అని మీరు దేన్ని భావిస్తారు?

ఇస్మాయిల్ కి నిజమయిన శిష్యులు వుండడం సాధ్యమని నేను అనుకోను. శిష్యరికాలని నిరాకరించడమే ఇస్మాయిలిజం.

ఇస్మాయిల్ మనకి వున్న మంచి కవి, కానీ ఆయన కవిత్వానికి ప్రభావ గుణం లేదు. ఆయన కంటే వజీర్ రహ్మాన్ కవిత్వానికి ప్రభావ గుణం ఎక్కువ వుంది. ఆధునిక జీవితం వజీర్ కి అర్ధం అయినంతగా ఇస్మాయిల్ కి అర్ధం కాలేదని నాకు అనిపిస్తుంది. కానీ, ఇవాళ రాజకీయ వ్యతిరేక సాహిత్యం ఇష్టపడే వాళ్ళకి ఇస్మాయిల్ వొక పని ముట్టు మాత్రమే.  వాళ్ళకి నిజంగా ఇస్మాయిల్ కవిత్వంతో పని వుందని నేను అనుకోను.

జెన్ బౌద్ధం , హైకూ కవిత్వం  — వీటితో మీ పరిచయమెందాకా?

నేను అవి కొంత చదివాను కానీ, అవి నా కవిత్వంలోకి ఒదగవు.

అధివాస్తవిక కవిత్వంలో మీరెంతవరకూ మునిగారు.. మీ కవితల్లో వాస్తవికత, అధివాస్తవికత పోటీ పడుతూ ఉంటాయి కదా?

ఆధునికుడయిన ప్రతి కవీ ఎంతో కొంత అధివాస్తవికుడు, ఎక్కువగా వాస్తవికుడు. శ్రీ శ్రీ మంచి ఉదాహరణ. శ్రీశ్రీని మనం సరిగా చదివితే, అర్ధం చేసుకుంటే చాలా విషయాలు బోధ పడతాయి. కలకీ మెలకువకీ మధ్య ప్రయాణం అంత తేలిక కాదు. దాన్ని నేను ఇంకా పూర్తిగా కవిత్వంలోకి తీసుకు రాలేకపోయాను. ఆ ప్రయత్నం ఇంకా చేస్తూనే వున్నాను. వాస్తవికతకీ, అధివాస్తవికతకీ పోటీ లేదు. ఆ రెండీటీ మధ్యనే కవి ఉనికి. ఈ స్తితి అర్ధం కావాలంటే కొంచెం ఆచార్య నాగార్జునుడి తత్వం బోధ పడాలి.

ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *