విజయంలో ఒక్కోమెట్టూ .. మొదటి భాగం

ప్రముఖ నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షకులు యండమూరి వీరేంద్రనాథ్ గారితో పొద్దు జరిపిన ముఖాముఖి మొదటి భాగం

 

‘సౌందర్యం క్షణికమైనా, క్షణం అసత్యం కాదన్న’ నమ్మకంతో శరత్కాల తృణ పత్రాలు రాల్చిన విషాదాక్షితల్ని చూసి మనసు తడి చేసుకున్న భావుకుడు..
తొలికలల తెల్లచీరకు కాటుకచీకటి వంటి నల్లంచుని కలనేసిన స్వాప్నికుడు…

గోదారి ఒడ్డున దగ్గుతో గడిపిన ఒంటరి రాత్రుల ప్రేరణతో సోమయాజినీ, ఊహించకుండా వచ్చిపడ్ద అపనిందల ఉపద్రవం నుంచి ’లేడిస్ హాస్టల్’ నీ కల్పించి ఎదురుదెబ్బల్ని ఎదుగుదలకు నాందిగా వాడుకున్న కార్యశూరుడు…

మనిషి మనుగడకు ముఖ్యావసరమైన డబ్బుకి సాహిత్యంలో స్థానం కల్పించినవాడు…

విజయ శిఖరాల్ని అధిరోహించడానికి ఒక్కోమెట్టునీ అక్షరబద్ధం చేస్తూ వ్యక్తిత్వాన్ని  వికసింపజేసుకొమ్మని రెండుతరాల్ని మెత్తగా మందలించినవాడు..
వేలమందిచేత లక్షల తెలుగు పుస్తకాలు కొనిపించి చదివించినా, అయాన్ రాండ్ నీ, అబ్సర్డ్ కథనాన్నీ సామాన్య పాఠకుల స్థాయికి చేర్చినా, తనదైన శైలితో ఏదో సాధించాలన్న కసిని ఎందరిలోనో రగిల్చినా… ఆయనకే చెల్లిన విషయాలవి.

ఎన్ని చెప్పుకున్నా, ఎంతగా మనం అనుకున్నా… ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని నిర్వచించటానికి కొన్ని పేలవమైన ఉపమానాలు, ఉదాహరణలు మాత్రమే…
మరి తనగురించి తాను ఏమంటారో… ఆ వీరేంద్రజాలికుని మాటల్లోనే…

 

నమస్తే! యండమూరి వీరేంద్రనాథ్ అనగానే నేను ఒక ప్రసిద్ధ రచయిత, ప్రముఖ దర్శకుడు, సినిమా రంగం లో కృషి చేసిన వ్యక్తి అనుకుంటాను..
అవన్నీ ఎచీవ్ చేసినవి. మీరు అంటున్నది క్వాలిటీస్…

 

పోనీ ఒక రచయితగా మిమ్మల్ని మీరెలా నిర్వచించుకుంటారు?
రచయితగానా? అలా చెప్పాలంటే నాకు లోతైన నాలెడ్జ్ ఏమీ లేదండీ. ఎక్కువగా సేకరించిన సమాచారమే. నాకు పెద్ద కన్విక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఇజాలు కూడా ఏమీ లేవు. శ్రీశ్రీకి కవిత్వముంది, కృష్ష్ణశాస్త్రికి భావుకత్వముంది. కొడవటిగంటి కుటుంబరావుకి సమాజంపట్ల అవగాహన – ఒక ప్రపంచ యుద్ధాన్ని చూసిన వ్యక్తి ఆయన. అలా ప్రతి రచయితకీ/కవికి ఒక బేస్ ఉంటుంది. నేను పాపులర్ రచయిత అవ్వడానిక్కారణం బహుశా ఏ బేసు, ఇజమూ లేకుండా ఈ షేప్ లో కావాలో అందులోకి మారే మనస్తత్వం ఉండటం కావచ్చు. నాకు తెలుగు సరిగ్గా రాదు. వ్యాకరణం, సంధులు, సమాసాలు తెలీవు. ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ గా రాదు. పదోక్లాస్ వరకూ తెలుగు మీడియమ్, తర్వాత హిందీ మీడియమ్ లో చదువుకున్నాను. తర్వాత్తర్వాత కొంచం కొంచం చదివాను తెలుగు పుస్తకాలు. బహుశా అదే ఏ కన్విక్షనూ లేకపోవటానికి కారణం.

 

ఒక సాధారణ వ్యక్తికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలంటే ఒక దర్శకునిగా, ఒక రచయితగా ఎలా…?
నన్ను నేనెవరికీ పరిచయం చేసుకోను. ప్రస్తుతం ఆ దశలో లేను. ప్రపంచమే వచ్చి నన్ను పరిచయం చేసుకుంటుంది. నేనెక్కడికీ బయటికి వెళ్ళను. సినిమాలకీ, పార్టీలకిపార్కులకీ. కొత్తవాళ్ళెవర్నీ కలవను. ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను

 

ముఖ్యంగా రచనా వ్యాసంగం మీదే…
చదువుకుంటూ, రాసుకుంటూ, సంగీతం వింటూ, ఇంటర్నెట్, టివీ చూస్తూ ఉంటాను… రైళ్ళలో వగైరా ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా పలకరిస్తే చార్టెడ్ ఎకౌంటంట్ ని అని చెబుతాను. రచయితనో, దర్శకుడినో అని చెబితే ప్రమాదం. ఏం రాశారు, ఏం పబ్లిష్ చేశారు అని పొడిగిస్తారు. నాకు రైళ్లలో మాటాడ్డం ఇష్టం ఉండదు.

 

దేశిరాజు హనుమంతరావు గారితో మీ అనుబంధం, ఆయనను గురించిన మీ సంగతులు చెప్పండి.
ఐదు నాటకాలు, ఎనిమిది నాటికలు రాశాన్నేను. అవన్నీ తొంభైశాతం ఆయనవే అని చెప్పాలి. నేను కేవలం ఒక స్కెలిటన్ రాస్తే ఆయనే దాన్ని పూర్తిచేసి డైరెక్ట్ చేసేవాడు. నాటకాల్లో నేనేదైనా డబ్బులు సంపాదించినా ఆయనవల్లే అని చెప్పుకోవాలి. రఘుపతి రాఘవ రాజారాం అనే నాటకం ఒక్కటి జే.ఎల్ నరసింహారావు గారు రాయించారు, మిగతావన్ని హనుమంతరావు గారు రాసినవే.

 

ఛైర్స్ అనే నాటకం ప్రభావంతో మీరు చేసిన ప్రయోగం… ‘నిశ్సబ్దం నీకూ నాకూ మధ్య’ అనే నాటక రచన. ఆ ప్రయోగం విజయవంతమయిందంటారు. ఆ అనుభవాలు, ఆ సంగతులు మీకిప్పటికీ ఆనందం కలిగించేవేనా?
చెయిర్స్ అనే అయినెస్కో నాటకాన్ని కొద్దిగా మార్చి ఇది రాశాము. అది అనుకున్నంత హిట్ కాలేదు. పరిషత్తుల్లో వేసేంత డ్రామా లేదందులో… అది ఒక అబ్సర్డ్ డ్రామా మెటాఫిజికల్ ఎంప్టీనెస్ గురించి. కొన్ని పరిషత్తుల్లో ప్రదర్శించినా ప్రైజ్ రాలేదు.

 

దానివల్ల నిరాశ చెందారా మీరు?
ఇక పరిషత్తుల్లో వేసే డ్రామా రాయలేననిపించి నాటకాలు మానేశాను. అంటే గొప్పగా ఎదిగానని కాదు, దాన్లోంచి బయటకు వచ్చేశానంతే. అదే ఆఖరు నాటకం.

 

సాంఘికనాటకానికి (పందొమ్మిదివందల) అరవయ్య డెబ్బైయ్యవ దశాబ్దాలలోని వైభవం మళ్లీ ఇటీవలే వస్తోందని మీ సహచరులు సంజీవరాయశర్మగారి అభిప్రాయం. ఏకీభవిస్తారా?
ఆయన ఆశావాది, యదార్ధవాది కాదు. టీవీలుండగా జనం సాంఘిక నాటకానికెళ్ళి చూస్తారనుకోను. పౌరాణిక నాటకాలైతే టీవీలో రావు కాబట్టి చూడొచ్చు.

 

మొన్నామధ్య రవీంద్రభారతిలో నాటకాలేవో వేసారు కదండీ…
అవును, రెండ్రోజులు. మొత్తం నా నాటకాలే!

 

దానిగురించేమైనా చెబుతారా?
ఒక రెండొందల మంది వచ్చారు. చూస్తుంటే బాగానే అనిపించింది. ‘కుక్క’ అని ఒక నాటిక అద్భుతంగా వేశారు యూనివర్సిటీ వాళ్ళు, మిగతావి సాగతీసినట్టున్నాయి.

 

ఆడియెన్స్ స్పందన ఎలా ఉందండీ?
స్పందన అంటే చప్పట్లు బాగానే వచ్చాయి కానీ డబ్బులిచ్చి చూడాలంటే ఎందరు చూస్తారు? చప్పట్లు రావడమే గొప్ప రెస్పాన్స్ అనుకోకూడదు.

 

నాటకాలతో మొదలుపెట్టి, ‘నా వల్లెందుకు కాదు?’ అని నవల్లు రాసి, చాలెంజిగ్ గా చిన్న కథలూ రాసింతర్వాత… ఈ ప్రక్రియలన్నిట్లోకి మీలోని రచయితకి పూర్తి తృప్తినీ, ఉత్సాహాన్నీ ఇచ్చినదేది అనిపిస్తుంది?(“నాటకాలు రాసినంత తేలిక కాదు నవల” అని ఎవరో అన్నమాటకు సమాధానంగా తన ఇరవయ్యో పుట్టిన్రోజున మొదటి నవల “ఋషి” ని మొదలెట్టారు.)
చాలా మంది అడుగుతూ ఉంటారీ ప్రశ్న. చాలా అసంబద్ధమైన ప్రశ్న. జీవితంలో పెళ్ళి, కొడుకు పుట్టడం మనవడు పుట్టడం అన్నీ తృప్తినిచ్చాయి. అలాగే అన్ని దశల్లోనూ తృప్తి ఉంటుంది; బాల్యం, యవ్వనం ప్రతిదీ నాకు తృప్తినిచ్చిందే. నేను గర్వంగా చెప్పుకునే విషయమేంటంటే ఏపనైనా తృప్తిలేకుండా చెయ్యను. ఏరంగమైనా తృప్తినివ్వడం మానేస్తే బయటికొచ్చేస్తాను. నేను మార్చినన్ని ఫీల్డ్స్ బహుశా ఎవరూ మార్చి ఉండరేమో! సీయేగా, నాటక రచయితగా, సినిమాల్లోనూ, వ్యక్తిత్వ వికాసం క్లాసులూ ఎప్పటికప్పుడు రంగాలు మారుతూ ఉన్నాను. అన్నిటికన్నా తక్కువ తృప్తినిచ్చింది బాంక్‌లో ఉద్యోగం. మిగతావన్నీ బాగా తృప్తినిచ్చినవే. ఒకవేళ వడ్రంగి పని చెయ్యడం నచ్చితే అదే చేస్తాను. అందుకే రెండు సినిమాలు తీసి మానేశాను. చేతకాక అనుకుంటారు కొందరు. సినిమాల్లో ఇప్పటికీ అవకాశమున్నా సమయం కేటాయించడం ఇష్టం లేక వదులుకుంటున్నాను. ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతుడు, ధనవంతుడు ఎవరంటే తన సమయం తన చేతిలో ఉన్నవాడు.

 

అంటే టైమ్ మేనేజ్మెంట్… కంట్రోల్…
కాదు. నేనేం చెయ్యాలంటే అది చెయ్యగలను. టైమ్ ఎట్ డిస్పోజల్. ఈ వీలు ఎవరికీ ఉండదు. దేనిమీదా కోరిక, యావా లేకపోవడం, కీర్తికాంక్ష లేకపోవడం అదృష్టం. కొన్ని సందర్భాల్లో కోరిక లేకపోవడం నెగెటివ్ గా పని చేస్తుంది.

 

నెగెటివ్ ఎలా?
నాకు డబ్బొద్దు కీర్తి వద్దు. ఎక్కడికీ వెళ్లను ఏం చెయ్యను అనేవాడు పెద్దగా ఏమీ చెయ్యలేడు కదా. అలా అది నెగెటివ్ కదా.

 

మెటీరియలిజం వైపు మొగ్గుచూపిస్తారా?
ప్రపంచంలో మెటీరియల్ కానిదేముంది. భగవద్గీత అంతా అదే కదా. నీ పని నువ్వుచెయ్యి  అనడం, ఎవరు చచ్చినా ఫర్లేదు యుద్ధం చెయ్యి అనడం. అసలు మెటీరియలిజం కి వ్యతిరేకం ఏమిటి? సెంటిమెంటలిజమా? అంటే అమ్మలేదని ఏడవడమా?

 

అంటే అనుబంధాలూ, అనురాగాలు..
వాటికి వ్యతిరేకం మెటీరియలిజమా? కాదే! మెటీరియలిస్ట్ తనవాళ్లందరినీ బాగా చూసుకుంటాడు, అన్ని సౌకర్యాలు సమకూరుస్తాడు.

 

అంటే ఆర్ద్రత లేకపోవడమా?
అది మీరే చెప్పాలి. అదేదో నేనెప్పుడూ వాడలేదు. మేమందరం చెట్టు కొట్టేసినా బాధపడతాం కదా? గుండెకింద తడిలేకపోవడం ఎక్కడుంది మరి?

 

అంటే మీ ధోరణి అదని కాదు..
ప్రపంచంలో ఉన్న ఒకేఒక్క విషయం మెటీరియలిజం. దానికి ఆపోజిట్ ఏదీ లేదు. మీరు పక్కింటి కుర్రాణ్ణి చదివించినా ఒక తృప్తికోసం చేస్తాం. అది మన సొంతమనే భావంతో కాదు. అది తప్పుకాదు, స్వార్ధం తప్పు. ఎవరెలా పోయినా నేను బావుండాలి అనుకోవడం ప్రమాదం. నేనూ బావుండాలి, నాతో ఉన్నవాళ్ళు బావుండాలి అనుకోవడం మెటీరియలిజం.

 

వాస్తవిక కోణం లోంచి చూసినప్పుడు కాల్పనిక సాహిత్యం వల్ల కనపడే ప్రయోజనమేమిటి. ఫిక్షన్ నుంచి పల్ప్ ఫిక్షన్ ని విడదియ్యటమెలా?

ఫిక్షనూ, పల్పూ అని ఇన్ని రకాలేం లేవండీ, ఆ పదం సష్టించిందెవరో కానీ నా ఉద్దేశం, పల్ప్ ఫిక్షనంటే మరీ అసంబద్ధమైన విషయాలు—ఇరవైరెండేళ్లకే సొంతంగా కారు, ద్రాక్షతోటలూ సంపాదించుకోవడం వంటి కథలనుకుంటాను. మంచి ఫిక్షనంటే రామాయణం లాగా వాస్తవానికి దూరం కాకుండా ఉండే కథలయ్యుండొచ్చు. వాస్తవానికి దూరంగా ఉండే తులసి దళం, హారీ పాటర్ లాంటివి పల్ప్ ఫిక్షన్ అని కాసేపనుకుందాం. కాల్పనిక సాహిత్యం వల్ల లాభమేమిటో చెప్పలేను. నేను కాల్పనిక సాహిత్యంలో కూడా వ్యక్తిత్వ వికాసాన్ని జోడిస్తాను. జీరో స్థాయినుంచి మళ్ళీ ఎదగొచ్చు, మేడ మీదనుంచి పడి వెన్నెముక విరిగినా మళ్ళీ లక్షాధికారి కావచ్చని రాశాను. పాఠకుడు జీవితంలో నిరాశ చెందకుండా ఎలా ఎదగాలి అని రాశాను. ప్రయోజనం లేకుండా ఎప్పుడూ రాయను. కాల్పనిక సాహిత్యం పాఠకుడికిచ్చే ధైర్యం అది.

 

ఖరహరప్రియ, కళ్యాణీ వగైరా… మీ రచనల్లో అక్కడక్కడా సంగీతం కనపడుతూ ఉంటుంది. సంగీతంలో మీకున్న ప్రవేశం, అభిరుచి?
సంగీతం నాకు చాలా ఇంటెరెస్టండీ. కాకపోతే పెద్దగా పరిజ్ఞానం లేదు. చెప్పానుగా ఏదో మిడిమిడజ్ఞానం. కళ్యాణీ, యమన్ కళ్యాణీ, పహాడీ, శివరంజని, మలయమారుతం, భూపాలం ఇవన్నీ బాగా ఇష్టం. నవల రాసేప్పుడు ఈ రచయితకి అన్ని విషయాలు బాగా తెలుసు అనే ఫాల్స్ ఇమేజి పాఠకుడిలో సృష్టించడానికి కొంత రీసెర్చ్ చేసి రాస్తూ ఉంటాను. కొన్నిటిని అప్పటికప్పుడు వదిలేస్తాను. ఇప్పుడు రాస్తున్న ‘డేగ రెక్కల చప్పుడు’ కోసం తాలిబాన్ల గురించి ఒక వంద పేజీల పుస్తకం చదివి నోట్స్ రాస్తున్నాను. కానీ I don’t belong to that, నేను చరిత్ర టీచర్ ని కాదు. కాకపోతే కొన్ని ఉంటాయి సంగీతం, క్రికెట్ వంటివి. అవి నిజంగా ఫీలయే రాస్తాను.

 

నేను చదువుకునే రోజుల్లో తులసిదళం సీరియల్లో రాండమ్ యాక్సెస్ మెమొరీ గురించి చదివాను. తర్వాత దాదాపు పదేళ్లకి ఆ పదం జనం లోకి వచ్చింది. మీర్రాసినప్పటికి దాదాపు చాలా మందికి తెలీదు.
అవును. అదే ఎడ్వాంటేజ్, ఏమీ తెలీకపోవడం వల్ల.

 

సాహిత్యం కాకుండా ఇతర రంగాల్లో మీరు అభిమానించే ఆదర్శ వ్యక్తులు?
చాలామంది ఉన్నారు; ఐన్‍స్టీన్,థామస్ అల్వా ఎడిసను, రూజ్వెల్ట్, గౌతమ బుద్ధుడు, సచిన్ టెండుల్కర్, అమితాబ్ బచ్చన్, ఈ వయసులో ఆరోగ్యం బాగోకున్నా ఆయన రంగం లో కృషి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రెండొందలమంది ఉంటారు.

 

ఆనందో బ్రహ్మలో ఒక సన్నివేశం – యాజీ మందాకిని స్పూర్తితో నత్తిని వదిలించుకున్నాక ఒక ఆశుపద్యం చెప్తాడు “రక్షాదక్ష కటాక్ష వీక్షణ…” ఈ పద్యం వెనకున్న కథ గురించి తెలుసుకోవాలనుంది.
నేను తిరుపతి వుమెన్స్ కాలేజ్లో ఒక సభకి వెళ్ళినప్పుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చీఫ్ గెస్ట్. ఆయన కాళ్లకి దణ్ణం పెట్టాను. నేను సాధారణం గా ఎవరికీ పెట్టను ఇద్దరు ముగ్గురికి తప్ప, విశ్వనాథ, దేవులపల్లి, పాపయ్య శాస్త్రి వంటివారికి తప్ప. ఆ సభలో ఆయన పక్కన కూర్చుని ‘గురువు గారూ! నేనొక నవల రాస్తున్నాను. అందులో నత్తివాడికి నత్తి తగ్గిపోయి కష్టమైన అక్షరాలతో ఉన్న పద్యమొకటి చెబుతాడు. అది మీరు రాసివ్వగలరా నా ఉపన్యాసం అయ్యేలోపు?” అనడిగాను. అప్పుడే పక్కనే ఎవరిదో సిగరెట్ పెట్టెలో కాగితం తీసుకుని దాని వెనకవైపున రాసిచ్చేశారు.

 

ఇదే నవలలో మీరు 2000 తర్వాత భారతదేశాన్ని ఊహించారు. రాత్రిపూట కాంతి, క్రెడిట్ కార్డులు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా… వగైరా. మీ ఊహలోని క్రెడిట్ కార్డులను ఇప్పుడు చూస్తున్నాం. మిగిలిన ఊహలు నిజమవుతాయని మీరనుకుంటున్నారా?
దాదాపు అలానే ఉంది కదా పరిస్థితి. వాటర్ కోసం కొట్టుకోవడం ఇలాటివి చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా రావచ్చనే అనిపిస్తుంది.

 

రాజకీయాల పట్ల మీకేమైనా ఆసక్తి ఉందా?
అస్సల్లేదు. రాజకీయనాయకులంటే కూడా లేదు.

 

నాకే ఇజమూ లేదని మీరిప్పటికే చెప్పారు. ఇజాలు, సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ వచ్చే సాహిత్యం పై మీ అభిప్రాయం.
ఎవరికి నచ్చిన ఇజాలు, సిద్ధాంతాలు వాళ్ళు రాస్తూ ఉంటారు. ఉదాహరణకి నాకు రాజకీయాలు, రాజకీయనాయకులంటే సదభిప్రాయం లేదు. అలానే కొందరికి కమ్యూనిజమూ, కాపిటలిజమూ, ఫ్యూడలిజమూ వంటివి నచ్చొచ్చు. కానీ ఏ ఇజమూ సాహిత్యం ద్వారా మనుషుల్ని మారుస్తుందంటే నమ్మను. అది మనిషిలోంచి బర్న్ అయి రావాలి. కాకపోతే సాహిత్యం మనసుని వికసింపజేస్తుంది. ఉదాహరణకి నేను రక్తసింధూరం అనే నవల్లో తర్వాత రోజు ఉరిశిక్ష ఉన్న ఖైదీ ఒక పోలీస్ ని ఆఖరి కోరిక కోరతాడు, వెట్టి చాకిరిలో ఉన్న ఒక పిల్లాణ్ణి తన అధికారం, డబ్బు ఉపయోగించకుండా విడిపించమని. ఆ పనిని సాధించే క్రమంలో పోలీస్ ఒక భూస్వామిని చంపేస్తాడు. అప్పుడు నక్సలైట్ ‘నేను చేసింది కూడా ఇదే కదా’ అంటాడు. ఇది చదివితే నక్సలిజం ఎందుకు వస్తుంది అని ఒక అవగాహన వస్తుంది. అంతేకానీ తుపాకీ పట్టుకుని అడవుల్లోకి వెళ్ళలేరు. అలా వెళ్ళాలంటే వాడికి నిజంగా సమస్య ఉండాలి, ఆకలి ఉండాలి. సాహిత్యం కేవలం అగ్గిపుల్ల లాంటిది. అది మండాలంటే కిరసనాయిలు, కాగితం ఉండాలి.

 

సాహితీకారుడు తన రచనలు, నిజజీవితం లోని విలువల మధ్య సాధించవలసిన సమన్వయం ఎటువంటిది? ఏవైనా ఉదాహరణలు?
నేను రాసే ప్రతిది అనుభవించే రాస్తాను, రాసినవి సమన్వయపరుస్తాను; సిగిరెట్ తాగొద్దని, మందు కొట్టొద్దనీ ఎక్కడా చెప్పలేదు. టైమ్ మానేజ్మెంట్, ప్రామిస్ మానేజ్మెంటు ఉండాలని రాస్తాను. నేను టీచర్ ని కాదు ప్రీచర్‌ని… నాకున్న దురలవాట్లని చెయ్యొద్దని ఎక్కడా రాయను. చుట్టు మొక్కలు పెంచుకుంటూ మొక్కలంటే ఇష్టమని రాస్తాను. కనీసం గత పదిహేను ఇరవై సంవత్సరాలనుంచీ ఇలానే. అంతకుముందు ఏమైనా వేరేగా రాసుంటాను.

 

ఒక రచయితగా మీరేమిటో అందరికీ తెలుసు. కానీ ఒక పాఠకుడిగా మీ ప్రాధాన్యతలు, అభిరుచులు ఏమిటో తెలుసుకోవాలనుంది?
నేను అవసరమైతే తప్ప ఏదీ చదవనండీ. ఇతరుల రచనలు కూడా పెద్ద చదవను. ఇంగ్లీష్ లో కొన్ని చదువుతూ ఉంటాను. ఎక్కువగా రీసెర్చ్ పుస్తకాలు ఉదాహరణకి ఆఫ్గనిస్తాను, ఆకలి… ఇతను ఎంతో రీ్సెర్చ్ చేసి రాశాడు. ఏదైనా చదివితే వరూధిని, ప్రవరాఖ్యుడు ఇలాటివి.

 

అంటే సాంప్రదాయ సాహిత్యమా?

అదీ పెద్ద సమయం ఉండదు. ఐనా ఇప్పుడెవర్రాస్తున్నారు నవల్లు. మీ వాళ్లంతా కూడా చిన్న కథలూ, కవితలు రాస్తుంటారు కదా, వాటిల్లో కొన్ని బావుంటాయి.

 

తెలుగులో మీ అభిమాన రచయితలెవరు, ఎందుకు?
ఇప్పుడెవరూ లేరు. పాత వాళ్లలో ఉన్నారు. అభిమాన రచయితలు, గొప్ప రచయితలు వేరే. వయసు పెరిగే కొద్దీ అభిమానం రూపం మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు నాన్నొక విమానం బొమ్మ తెస్తే చాలా ఆనందపడతాం. అదే ఇప్పుడు తెస్తే ‘అక్కడ పెట్టు నాన్న’ అంటాం. అంటే అభిమానం లేదని కాదు, వయసుని, అనుభవాన్ని బట్టి మారుతూ ఉంటాం. నాకన్నా పెద్ద వయసున్న వాళ్ళు ప్రస్తుతం చాలా మందిలేరు. చిన్నవాళ్లని మెచ్చుకోగలను కానీ అభిమాన రచయితలని చెప్పలేను.

 

కొమ్మూరి వేణుగోపాల్రావు గారి ‘పెంకుటిల్లు”, విశ్వనాథ సత్యన్నారాయణ గారి పద్యాలు, కృష్ణ శాస్త్రి భావకవిత్వం … వీటితో మీ అనుబంధం?
నేను చదివిన మొదటి నవల కొమ్మూరి వేణుగోపాల రావు గారిదే. అందుకే అవంటే నాకు ఒక విధమైన ప్రేమ ఆప్యాయత. బాగారాసారు, రచనలు ఇలా ఉంటాయా అని నాకు అనిపించింది అది చదివాక. విశ్వనాథ వారి పద్యాలు నాకు అంతగా తెలియదు. నేను చదివిందల్లా అల్లసాని పెద్దన, పోతనల పద్యాలే. కృష్ణశాస్త్రి భావకవిత్వం నాకు చాలా ఇష్టం.

 

అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు
తీరా దయచేసినాక నీ రూపు తోచదయ్యయ్యో ఎలాగో రామా…

ఇలాంటివే నాకు ఇన్స్పిరేషన్.

 

మీరు కాళ్ళకు దండం పెట్టినది ఇద్దరికే – కృష్ణశాస్త్రి, విశ్వనాథ. కృష్ణశాస్త్రితో మీ అనుబంధం గురించి చెప్పండి.
నేను ఆయన్ను ఒక్కసారే కలిసాను. ఆయన కాకినాడ వచ్చినపుడు కర్టూనిస్టు శంకు (ఎస్.పి.శంకర్ కుమార్, నాతో కలిసి చదువుకున్నాడు) నన్ను ఆయన వద్దకు తీసుకువెళ్ళాడు. అప్పటికే ఆయనకు గొంతు పోయింది.

 

తెలుగు పుస్తకాలను ఎలా అమ్మించాలి? ప్రస్తుతమున్న మార్కెటింగు పై మీరు సంతృప్తిగా ఉన్నారా? విజయానికి మెట్ల గురించి చెప్పారు. పుస్తక విజయాలకోసం ఏమైనా చెబుతారా?
తెలుగు పుస్తకాలు అమ్ముడుపోవాలంటే బాగా రాయాలండి. ఒక రచయిత బాగా ఎందుకు రాస్తాడు? డబ్బుకోసం లేదా కీర్తి కోసం. ఏ రచయితైనా, నన్నయ లాగానో, పోతన లాగానో, రామదాసు లాగానో డబ్బులు లేకుండా కేవలం ఆత్మ సంతృప్తి కోసం రాయడు కదా, ఈ రోజుల్లో. అయితే డబ్బుల కోసం లేదా చాలా తక్కువ శాతం కీర్తి కోసం రాస్తారు. అంత డబ్బులు వచ్చేలాగా రాసే తెలివితేటలు ఉన్నవాడు, నవల్లెందుకు రాస్తాడు, సినిమాల్లోకి వెళ్తాడుగాని? అక్కడ ఒక సినిమా చేస్తే పది లక్షలు వస్తుంది. ఇక్కడ ఒక నవల మీద పది లక్షలు రావాలంటే చావాలి. తెలివితేటలు ఉన్నవాడు, రాసే కెపాసిటీ ఉన్నవాడు నవల్లు రాయడు, సినిమాల్లోకి పోతాడు. అందుకే ఇప్పుడు నవలా ప్రపంచం ఇలా ఉంది.

అంటే, పుస్తకాలను అమ్మించాలంటే క్వాలిటీ పుస్తకాలు రావాలి. క్వాలిటీ పుస్తకాలు రావాలంటే క్వాలిటీ పుస్తకాలు రాసేంతటి శ్రమ రచయిత పడాలి. ఆ శ్రమ ఈ ఫీల్డులో కాకుండా ఇంకో ఫీల్డులో పడితే ఇంకా బాగా డబ్బులు వస్తాయి. చేనేత కార్మికుడు ఉన్నాడండి.. అద్భుతంగా చేనేత చేస్తాడు, కానీ అంతకన్న మంచి ప్రాడక్టు మిషన్లలో వస్తున్నపుడు చేనేత ఎవడు కొంటాడు? వీడు ఎంత ఏడ్చినా లాభం లేదు. ఎవడో నాలాంటి వాడు రాస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నేనేదైనా సినిమా చేసాననుకోండి.. ఆయనెప్పుడో ఐదింటికి నన్ను రమ్మంటాడు, నాకేమో బోరు, నాకు ఇంట్లో ఉండాలని ఉంటుంది. ఇంట్లో ఉండాలంటే సినిమా ఫీల్డు కన్నా నాకు ఈ ప్రవృత్తే నయం. ఇది నాకు ఎప్పుడొచ్చిందీ..కోటి రూపాయలు సంపాదించాక వచ్చింది. అంతకుముందు నేనూ వెళ్ళేవాణ్ణిగా. పోతే, కొంత మంది సినిమాల్లో రాస్తూనే ఉంటారు… ఎందుకంటే వాళ్ళు ఆపని తప్ప ఇంకోటి చెయ్యలేరు కాబట్టి. పోతే అది గ్లామరస్ ఫీల్డు, సాయంత్రం అవగానే పార్టీలు, వగైరాలు, అందులోంచి బయటపడ్డం కష్టం. నాకు ఇంట్లో ఉండటమే బెటరనిపిస్తుంది.

సో, తెలుగు నవలా రంగానికి సాంఘిక నాటకానికీ భవిష్యత్తు లేదు. హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్. నా అభిప్రాయం అదీ. దీనికన్నా ముఖ్యంగా తెలుగు వచ్చినవాళ్ళు తగ్గిపోతున్నారు. మీ పిల్లలు ఇంగ్లీషు మీడియమేగా…! వాళ్ళకు తెలుగు చదవడమే రాదు.

 

ఇది సహజమైన మార్పేనంటారా?
ఇది సహజమైన మార్పు, అనివార్యమైన మార్పు. ఆ మార్పు వల్ల వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. ఇంగ్లీషులో రాసుకుంటారు. జనరేషన్ గ్యాప్ వచ్చినపుడల్లా కొంత వాక్యూమ్ వస్తుంది. ఒక ఇరవై యేళ్ళ తరవాత ఇంగ్లీషులో రాస్తారు. హైదరాబాద్ నుంచి రైటర్స్ ఇంగ్లీషులో మంచి మంచి ఫిక్షన్ నవల్లు రాస్తారు. ప్రపంచమంతా చదువుతుంది.

 

ఈ రకంగా చూస్తే… క్రమేణా తెలుగు కనుమరుగవుతుందంటారా?
అది కాకుండా ఇంకొకటేముంది అసలు? మాట్టాడుకోటానికి ఉంటుంది, లిపి ఉండదు. ఇంకో యాభై సంత్సరాల దాకా మాట్టాడుకుంటాం. తరవాత అది కూడా పోతుంది.

 

ఒక భాష కనుమరుగైపోతుందంటే బాధగా ఉంటుంది కదా…
నాకేం లేదండి. నాకు భవబంధాలే లేవు భగవద్గీతలో అదే కదా చెప్పింది. అంతకు ముందు చాలా భాషలుండేవి కదా, అవన్నీ కనుమరుగై పోలా.

 

కానీ కనుమరుగయ్యేది మన భాష కదా, మనకు కొంత బాధ ఉంటుంది కదా…!
(చెతురుగా) మీరుంటారండి. తెలుగుభాష కనుమరుగయ్యేవరకు మీరుంటారు. (నవ్వులు)

 

మీదగ్గరికి రాబోయే ముందు ప్రశ్నలన్నీ ఒకసారి చదూకున్నాను…
ఇలాగే సమాధానం చెబుతానని అనుకున్నారా?

 

ఈ ప్రశ్నకి మీరు ఇటువంటి సమాధానం చెబుతారని అనుకున్నాను.
మీరు మీ పిల్లల్ని ఇంగ్లీషు మీడియమ్ లో ఎందుకు చేర్పించారు?

 

వేరే అవకాశం లేక చేర్పించాం…
అదే, నేనూ చెప్పేది.

 

మనం ఇంట్లో తెలుగు నేర్పుకోవచ్చుగదండి…
ఒకవేళ ఇంట్లో నేర్పించినా మాట్టాడటం వరకు వస్తుంది, రాయడం రాదు. మరీ ఎక్కువగా నేర్పిస్తే… వాళ్ళ బ్రెయిన్లో సగం, తెలుగు నేర్పి మీరు తినేస్తే మిగతా మార్కులు తగ్గిపోతాయి. వాళ్ళు లెక్కలు చెయ్యాలి, భూగోళం చదవాలి, ఇంజనీరింగు చదవాలి, మెడిసిన్ చదవాలి… కదా! టెంత్ క్లాసయ్యాక వాడే వద్దంటాడు – ఎందుకమ్మా ఇదంతా, పరీక్షలో అడగరు కదా అని.

 

తెలుగు రచనల ఎడిటింగు గురించి: తెలుగు పుస్తకాలకు సంబంధించి పబ్లిషర్లు ఎడిటింగు ఏమైనా చేస్తారా? లేక ఇచ్చింది ఇచ్చినట్టు వేసేస్తారా?
పబ్లిషరు ఒక రచయితను నమ్మి పుస్తకం వేసాడూ అంటే ఒక్క అక్షరం కూడా మార్చకుండా లేనంత గౌరవం ఉంటేనే వేసేందుకు సిద్ధమౌతాడు. అసలందుకే నాకు డబ్బులిస్తున్నాడు. రచయితే సొంత డబ్బులు పెట్టుకుని పుస్తకం వేస్తే ఇక రచయిత ఇష్టం. నాకు మీ రచన ఇవ్వండి సార్ అని పబ్లిషర్లు రిక్వెస్టు చేస్తున్నారు కాబట్టి, ఎవరు మంచి పబ్లిషరో చూచి నేను నా పుస్తకం ఇస్తాను. అంతేగాని, పబ్లిషరు పుస్తకాన్ని వేస్తాను అని అంటే ’సరే సార్, థ్యాంక్యూ సార్’ అనే రచయితలు గాని, రచయిత్రులు గానీ ఎవరూ లేరండి – విశ్వనాథ సత్యనారాయణ దగ్గర్నుండి సూర్యదేవర రామ్మోహనరావు వరకూ ఎవరూ అలా లేరు. రచన చదివి, ’ఇదిగో ఇది మార్చాలి, ఇలా ఉంటే బావుంటుంది’ అనేంతటి తెలివితేటలు ఉన్న, అంత సాహిత్యం తెలిసి పబ్లిషర్లూ ఎవరూ లేరండి. వాళ్ళు కేవలం డబ్బులు పెట్టుకుంటారంతే!

అయితే, ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది… ‘ఇదిగోండి వంద రూపాయలకు పన్నెండు పేజీలు తగ్గింది, మరో పన్నెండు పేజీలు రాయగలరా అనో, లేదా ఒక పన్నెండు పేజీలు తగ్గించగలరా’ అనో అడుగుతూ ఉంటారు. అప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప కంటెంటు మార్పులకు సంబంధించి జరగదు.

 

సీరియళ్ళ విషయంలో అలాంటి సూచనలు వస్తూ ఉంటాయా?

సాధారణంగా రావు గానీ, మేమే అడుగుతూ ఉంటాం… ఈ కారెక్టరు ఎలా ఉంది, దీన్ని ఇంకొంచెం పెంచవచ్చా, ఈ ట్రాక్ బావుందా అని అడుగుతూ ఉంటాం. అలా ఫీడుబ్యాకు తీసుకుని మాకు నచ్చితే ఆ లైన్లో వెళ్తూంటాం. వెన్నెల్లో ఆడపిల్ల అలాగే జరిగింది… చాలా చిన్న స్టోరీ అది. ఫోర్ వీక్స్ లో ఆపేద్దామని మొదట అనుకున్నప్పటికీ, థర్డ్ వీక్ అయ్యేసరికి బావుంది బావుంది అనడంతో దాన్ని పదహారు పదిహేడు వారాలకు పొడిగించాం. తులసిదళం యాక్చువల్ గా ముప్పై వారాలు అనుకున్నాం మొదట. అస్సలు రెస్పాన్స్ లేకపోవడంతో, ఫోర్త్ వీక్ క్లోజ్ చేద్దామని అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి చేతబడి చెయ్యడం మొదలుపెట్టాక రెస్పాన్స్ స్టార్టై 104 వారాలకు ఎక్స్టెండ్ చేసాం.

 

(వీరేంద్రజాలికునితో మరిన్ని ముచ్చట్లు తరువాయి భాగంలో)

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *