సామాన్యుడి సాహిత్య చర్చ

సాహిత్యమంటే రసప్రపంచం. మరి రసమంటే ఏమిటీ? మావిడి రసమా? అల్లం రసమా? చింతపండు రసమా? టమాటా రసమా?

ఈ పైన చెప్పినవి విడివిడిగా కాదుకానీ, ఇలాటి రసాలు అన్నీ మష్తిష్క మర్దనంతో బయటకు తీసి, కలమనే రాచిప్పలో పోసి కలగలపేసి సాహిత్యలోక సరస్వతీ దేవికి నైవేద్యంగా అర్పించిన ఈ రసమే ఆ రసము – అదే పరబ్రహ్మ స్వరూపం అంటారా.. మీరు నక్కతోక తొక్కి నాకలోకంలో పడ్డ నా తోటి జతగాళ్లు.

ఎవరో సరిగ్గా గుర్తులేదు కానీ, ఒక పెద్దాయన ఏదో వ్యాసంలో వారి కాలం నాటి సాహిత్యం, పాండిత్యం, పండితులు, సారస్వతం గురించి వ్రాస్తూ ఒక పిట్టకథ చెబుతారు

"పూర్వం ఒక పండితుడు ఓ పండితసభలో పాల్గొంటూ- ఇంతమంది పండితులు "రసము" గూర్చి తలోరీతిగా బుట్టెడు రచనలు చేసారు, మాటలు చెప్పారు. అవి అన్నీ పక్కనబెట్టెయ్యండి. సులువుగా నేను ఒకే ఒక్క పద్యంలో చెపుతాను వినండి అని "పాలు గోరెడు మార్జాల పరివృఢుండు." అని ఆ సభలోకి ఒక బిందువు విసిరాట్ట. ఇందులో రసమెక్కడుందండీ అని అడిగితే – పాలకు మించిన రసమెక్కడున్నదయ్యా అని ఆ పండితులవారి జవాబు. మరి పద్యమంటారు, పద్యానికి నాలుగు పాదాలుండాలి కదయ్యా? అని అడిగితే – పిల్లికి ఉన్నవి చాలుకదయ్యా అన్నారట సదరు పండితులవారు."

ఈ పిట్టకథ చెప్పడమైపోయాక ఒక మాట అంటారు. మా తరంలోని ఈనాటి పండితమ్మన్యులు, సమకాలికులు భావదారిద్రోపేతమైన భావుకతని పుంజీలు పుంజీలుగా వేసి చేసిన ఆ నైవేద్యం జెష్టాదేవి నెత్తిన బెట్టి మా వాణీ గృహంలో నట్టనడయాడిస్తున్నారు అని బాధ పడతారు. ఇవే మాటలు ఇప్పటి పాండిత్యానికి, పండితులకు అన్వయించి చూసుకుంటే ఆ పెద్దాయన మాట, ముందుచూపు, ఆవేదన నభూతో నభవిష్యతి.

అసలు గొడవేమిటయ్యా ? ఈ వ్యాసం ఉద్దేశమేమిటి? ఈ ఉదాహరణలేమిటి? పిట్టకథలేమిటి? అర్థం కాకుండా మొదలెట్టావు, ఏ సముద్రంలోకి విసిరేస్తావో చెప్పు బాబూ! అసలే ఈత కూడా రాదు నాకు.

అయ్యా…అక్కడికి రావాలనే ఈ ప్రయత్నం.సాహిత్య భాష వేరు, సాహిత్య రసం వేరు, దాని రుచి వేరు అని చెప్పటం ఈ వ్యాసం ఉద్దేశమండీ! వ్యాకరణం లేని వ్యవహారిక భాషా ప్రజ్ఞా పాటవాలతో పాఠకుడి చేతికి అంజనం పూసిన చందంగా పదచిత్రీకరణ చేసే ఈనాటి పండితమ్మన్యుల కోసం రాస్తున్న వ్యాసమిది! కావున మీరు కొద్దిగా ఓర్పు సహనం నేర్చుకోవాలి, అభ్యసించాలి, అనుభవించాలి.

ఓహో అలాగా! ఐతే మొదలెట్టు మరి
సాహిత్య భాషకి కొన్ని ద్రవ్యాలు అవసరమండీ! అన్నిటికన్నా ముఖ్యమైన ద్రవ్యం – చిత్తం భ్రమించిన కవి, రచయిత.

ఏమిటీ మతి చెడినవాడా కవీ, రచయిత అంటేనూ?. వేళాకోళంగా ఉందా నీకు
చిత్త భ్రమ అనగా సదరు కవీ ,రచయిత చిత్తప్రవృత్తిగా అర్థం చేసుకోవాలి తమరు.

ఓహో అలాగా! మరి తరువాతి ఔపచారిక ద్రవ్యాల సంగతో?
రెండవ ద్రవ్యం, వస్తువు అనగా చిత్తభ్రమణానికి కారణభూతమైన రసం.

ఓ పైత్య రసమన్నమాట!
పైత్యమో, పిండమో ఇప్పటికి పక్కనబెట్టి మూడవ ద్రవ్యాన్ని చూస్తే – అది ఆదిమానవ రూపంలో సంచరిస్తున్న పాఠకుడు.

ఏమిటీ పాఠకుడనేవాడు ఆదిమానవుడా?
అవునుఆదిమానవుడే. ప్రకృతి పురుషుడు. మీ సౌలభ్యం కోసం ఈ ఆదిమానవుల సమూహాన్ని మూడు తండాల్లోకి విభజించవచ్చు.

ఇందులో నా సౌలభ్యం ఏమిటీ! తమరి సమాధి.
చిత్తభ్రాంతి, చిత్తభ్రమణం గురించి మాట్లాడుకున్నప్పుడు సమాధి ప్రస్తావన చాలా ఔచిత్యంగా ఉంది. అనగా మీకు కొద్దిగా మెదడు ఉందని నా ఎఱికకు వచ్చింది.. సరే సమాధి సంగతి పక్కనబెట్టి సమూహాల్లోకి వస్తే – మొదటి తండా ఏ చిత్తభ్రమణ పైత్యరసాన్నైనా ఆనందించే సహృదయ తండా. రెండవ తండా పైత్యరసాన్ని మింగలేక కక్కలేక వాంతిభ్రాంతిలో పడికొట్టుకునే సామాన్య ప్రజానీకతండా. ఇహ మూడవ తండా పైత్య రసాన్ని ఏమాత్రమూ తట్టుకోలేక వమనం చేసే పండిత తండా.

ఓరి నీ తండాల పిండం తిండూలాలెత్తుకెళ్లా.ఇదేదో కొద్దిగా అర్థమయ్యీ అర్థమవనట్టుగా ఉందే!ఆదిమానవులంటావు, ప్రజానీక తండా, పండితుల తండా అంటావు…? పనసపండు తెచ్చి పళ్ళెంలో పెడితే తినలేని అల్లుడు దిక్కు దిక్కులు చూసాడట అలా ఉంది నా పరిస్థితి.
వస్తా …అక్కడికి తర్వాత వస్తానండీ! ముందు చిత్తభ్రమణాన్ని, చిత్తులనీ వర్ణించనివ్వండి!

ఇదేదో ఆసక్తిగా ఉండేట్టుంది. సరిగ్గా సద్దుకుని కూర్చోనీ. నీచిత్తుకాయితాల ఘోష అంతా అయిపోయాక నేను చిత్తభ్రమణమూ, పైత్యమూ గూర్చి లఘు సిద్ధాంత వ్యాసం సమర్పించుకోవచ్చునేమో!!
చిత్తులు స్థూలంగా మూడు రకాలు, వారికి కలిగే చిత్తభ్రమణాలు మటుకు కోకొల్లలు

ఏమీటేమిటీ? చిత్తులు మూడే రకాలా? భ్రమణాలు మటుకు కోకొల్లలా?
అవును. మొదటి రకం చిత్తులు – వీరు సాత్విక స్వభావ చిత్తులు. అనగా చిత్తం భ్రమించినా అది సాత్విక రూపంలో, రాళ్లూ గట్రా విసిరెయ్యక మెత్తనైన పూలు విసురుతుంది. వాడే భాష దోషరహితంగా, నాజూకైన నగలతో అనగా అలంకారాలతో ఉంటుంది. కవి గారూ అంతకు తగ్గట్టుగా సున్నిత మనస్కులై ఉంటారు. ఎంత సున్నితమంటే కంది పచ్చడి తిని కందిపోయేంత.

పెద్దన గారూ, పోతన గార్లాంటోళ్లన్నమాట.
అవునండీ.మీకు కొద్దిగా జ్ఞానముందన్న సంగతి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నాకు. సరే విషయం…విషయంలోకి వస్తూ…ఆడసింహం సంగతి తెలుసుగా, నెమ్మదిగా చక్కగా నోట్లో కరుచుకుని పిల్లలని తీసుకునిపోయినట్టు, వీళ్ల రాతలతో ఆదిమానవుణ్ణి వాళ్లెంబడి ఊయల్లో ఊగించుకుంటూ తీసుకునిపోతారన్నమాట.

ఓహో , బాగుంది.
ఇహ రెండో రకం చిత్తులు. వీరిది చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం పరిస్థితి. అనగా రాచరిక దర్పమన్నమాట.వీరు తమకున్న వ్యాకరణ వైవిధ్యంతో, ఛందోవైవిధ్యంతో ఆదిమానవులను సమ్మోహితులను చేసి లాక్కుపోతారన్నమాట. ఆ వైవిధ్యమూ,ఆ ఊపూ,ఆ రాచరికం ఆదిమానవుణ్ణి అలా పట్టేసుకోగా, రాజుగారెంబడి పడిపోతాడన్నమాట. రాజుగారెక్కడుంటే ఈ మానవుడక్కడే!ఇంకోలా చెప్పాలంటే – రక్తజఘన మర్కటం తెలుసు కదండీ. ఆ మర్కటం తన పిల్లలని సింహంలా నోట్లో కరుచుకుని తీసుకుపోదు. పిల్లలే తల్లిని కరుచుకుని తల్లితో పాటూ పోతూ ఉంటాయి…అలాగన్నమాట

అంటే శ్రీనాథుడు, మన కృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని వికటకవిగారూ, ఈ శతాబ్దంలో విశ్వనాథ, ఛందోబద్ధశ్రీశ్రీ లాంటోళ్ళా?
అవునండీ. ఉద్భటారాధ్యచరిత్రలా మధ్యలో మీ ఆర్భాటగోలారాధ్యచరిత్ర మాని చెప్పేది వినండి.

సరే చెప్పు
ఇహ మూడవ రకం చిత్తులు. వీరు మశక రకాలన్నమాట. గుడ్లు పెట్టేసి మళ్లీ కనపడకుండా పారిపోయే జాతి. వీరికున్న రక్తవే స్వాహా! రక్తవే స్వాహా! గుణంతో రక్తాన్ని పీల్చటమే కాక, తమ రచనా వైదుష్యంతో మెదడువాపు వ్యాధి విస్తృత పరిచి తమ వంతు కృషి చేస్తూ జీవిత సాఫల్యం పొందుతారు. భాష మీద పట్టు సంపాదించుకోరు, వ్యాకరణం అంటే తెలీదు.ఆ పైన వీరు వదిలి వెళ్లిన గుడ్లలో నుండి పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చిన మశకాలతో మరిన్ని తిప్పలు.

అనగా ఈనాటి రచయితలు, కవులూ అంతా మశకాలని నీ ఉద్దేశమా?
అవును మార్తాండతేజా. ముప్పాతిక శాతం మంది మశకాలే.ఏమిటీ తమరి కనుగుడ్లకేమయ్యింది. అలా పితుక్కొని బయటకొచ్చినాయి?

ఇంకొంచెంసేపు ఈ వివరణాత్మక పైత్యాన్ని వింటే మొత్తం ఊడిపోయి దొర్లుకుంటూ ఆ హిందూ మహాసముద్రంలో కలిసిపోయి సొరచేపలకు ఆహరమైపోతాయేమోనన్నంత భయంగా ఉందయ్యా!
పోనీ అలాగైనా ప్రశాంత కబోది జీవనం గడపొచ్చు మీరు. మీ జాతకంలో ఇదివరకే రాసేసి ఉండి ఉండవచ్చు.

ఆపవయ్యా! కబోది జీవనం నాకెందుకు గానీ, ఇలాటి చిత్తులను, వారి భ్రమణములను తట్టుకొను మార్గము విశదీకరించు!
చిత్తులకు బోధి వృక్షం కింద బోధ చెయ్యాలి. ముందు మనసనే సాన మీద రచనను జాగ్రత్తగా అరగదీసుకోమని. అరగదీసాక గంధమొస్తే పంచమని. దుర్గంధమొస్తే తనే , అట్టిపెట్టుకోమని.

ఎవరి కంపు వారికింపు అన్న చందమన్న మాట. మరి వారి కంపు వారికి బానే ఉంటుందిగా !
అదే వచ్చిన చిక్కు.అయితే ఉపాయమున్నది. ఒక్కటే ఒక్క పుస్తకభేది మాత్ర..జాడ్యం కొద్దీ మందు…అసామన్యమైన జాడ్యానికి మాంచి ఘాటున్న మందు కానీ పనిచెయ్యదు. అలాటిదే ఈ పుస్తకభేది మాత్ర.క్షోభపు రాతలు రాసిన కవీ, రచయితను పండిత తండాలోని ఆదిమానవులుఒక కరివేపాకు చెట్టుకు కట్టేసి, బలవంతాన తెరిచి పుస్తకభేది మాత్ర ఆయన నోట్టోనూ, కొద్దిగా ఆయన కలంలోనూ వెయ్యటమే. కుదరకపోతే, అనగా పిల్లి మెడలో గంట నే గట్టలేననుకుంటే మీరు దాన్ని వేసుగుని కూర్చోటమే! ఈ మాత్ర ఒకటి చిల్లికుండలో వేస్తే చిల్లు పూడి కారే నీళ్ళు కూడా ఠక్కున ఆగిపోయినాయని నిన్న మా మిత్రుడొకాయన చెప్పాడు.

అనగా వారి రచనలను బహిష్కరించడమన్నమాట. బాగుంది. అది సరేనయ్యా! ఒక ప్రశ్న. ఒక గజ ఈతగాడున్నాడు. ఆయన ఏ ఏటికి అడ్డంపడినా ఒకటే ఈత పద్ధతి పాటిస్తాడా?
లేదండీ ఒకసారి కుక్కలాగా ఈదొచ్చు, ఒకసారి మొసలిలాగా ఈదొచ్చు, ఆయాసమొస్తే కాళ్ళూ చేతులు ఎగేసి వెల్లకిలా కూడా ఈదొచ్చు.

మరి అలానే వ్యావహారిక భాషతో వివిధ రకాలైన ఈతలు కొట్టొచ్చుగా సాహిత్యమనే ఏట్లో?
ఎవరికి వారు ఈతరాకున్నా గజ ఈతగాడనుకోని ఏలాగున ఈదినా,ప్రాణాలు నిలబడేందుకు పీల్చే గాలిప్రధానమవునా కాదా !

అవును గాలే ప్రధానం. పైత్యానికి మందే విధానం.మరి ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ఏమి చెయ్యాలో మరి చెప్పవయ్యా

పలికెడిది భారతంబట
పలికించెడి విభుడు వ్యాసభగవానుండట

కందువ మాటలు, సామెతలు, నుడికారాలు, పలుకుబడులు పసందు వేసి మాలగా గుచ్చిన రచన, కవిత – ఆదిమానవుల మెదడు వికసించటానికి ఒక అద్భుతమైన సాధనంగా ఉపకరిస్తుందండీ. లేకుంటే మూగ చెవిటి సంవాదమే !

ఇంతకీ వేరేవాళ్లవి వికసించడానికే రచనలు చేయాలంటావు. మరి అసలు శాల్తీ వికాసమెక్కడ?
అదే చెపుతూంట ఇంతసేపు. మీరు అటు బభ్రాజమానమూ కాక, ఇటు వైశంపాయనులూ కాక మధ్యస్థంగా వున్నారు. అక్కడ వచ్చింది చిక్కు

ఓహో!ఆ మధ్య ఇలాటి రచనొకటి చదివి నేను చెవిటివాడినా, మూగవాడినా అనేది అర్థం కాలా! ఇప్పుడు కళ్లు తెరుచుకున్నాయి.మరి రసమన్నావు దాని సంగతి కూడా చెబుతావా ?అసలు ఈ రసమెట్లా పుడుతుందయ్యా?
ఆలంబన, ఉద్దీపన ఈ రెండు పదార్థాల సంయోగంతో రసం పుడుతుందండీ.

అర్థం కాలా! ఏదీ ఒక ఉదాహరణ ఇలా పడెయ్యి
ఒక హరిణం అలా వయ్యారంగా అడుగులేస్తూ అడవిలో పోతూ ఉందనుకుందాం. వేటగాడికి లేడి ఆలంబన, అడవి ఉద్దీపన. అడవి అనే పరిసరం ఈ వేటగాడికి ఉద్దీపన కలిగిస్తే, వేటాడాలనే ఉత్సాహానికి లేడి ఆలంబన.

మరి వేటాడితే లేడికి పరలోకప్రాప్తేగా?
వేటాడేంతవరకూ రసప్రాప్తి, వేట ముగియడంతో రస సమాప్తి.

ఓహో!అంటే రచయిత అనేవాడు ఆదిమానవుణ్ణి తన భావ, భాషా సామర్థ్యంతో ఎంతసేపు ఆ వేట అనే ఆటలో నిలపగలడో అంతసేపూ రసం ఊరుతూనే ఉంటుందన్నమాట. బాగుందయ్యా.
అబ్బా! భలే పట్టేసారే కిటుకు. మీకున్నపాటి జ్ఞానం ఈ కాలపు రచయితలకుంటే ఎంత బాగుండు! ఇంకొద్ది వివరణతో సాహిత్య రసానికొస్తే – ఈ రసం రెండు రకాలు. బుద్ధితో వ్రాయగా వచ్చే రసం ఒక రకం, హృదయంతో వ్రాయగా వచ్చే రసం ఒక రకం. బుద్ధితో వ్రాసేది తనకున్న పాండిత్యాన్నీ, తెలివితేటలను లోకానికి పంచే రసం. పేరు ప్రఖ్యాతులనాశించో, పట్టాల కోసమో వ్రాసే రచనలు ఈ రసాన్ని బహు పుష్టిగా కలిగుంటాయి. ఇక హృదయంతో వ్రాసే రచనలు అనుభూతులతో కూడి, సంస్కారాన్ని వృద్ధి పరచే రసాన్ని కలిగుంటాయి..మనకున్న సారస్వత చరిత్రను జాగ్రత్తగా గమనించండి. కాలపరీక్షకు నిలబడ్డవన్నీ హృదయ సంబంధమైనవే…ఐతే అలా నిలబడ్డ రచనలన్నిటికీ ఒక గుణం ఉన్నది. ఆ రచన చేసిన సాహితీ స్రష్టకు తన రచన గూర్చి స్పష్టమైన అవగాహన ఉన్నది. ఆ రచన ఒకే కక్ష్యలో స్థిరంగా తిరుగుతూ ఉంటుంది.

కక్ష్య ఏమిటి నాయనా? రచనేమన్నా గ్రహమా? ఉపగ్రహమా? మూస పోసిన మూకుడా?
ఒక ఇతివృత్తాన్ని పట్టుకున్నప్పుడు, ఆ ఇతివృత్త పరిధే కక్ష్య. పరిధి దాటితే తోకచుక్కైపోయి రాలిపోటమే.

ఐతే పరిధి గీసుకుని రసాలు ఊరించాలంటావు
ఇతివృత్తం మీద స్పష్టమైన అవగాహన, దాని పరిధి తెలుసుకుంటే చాలని మూకుడు మీద మూత వేసి చెప్పటమైనదండీ

ఓహో! బాగుంది. చాలా బాగుంది.మరి ఈనాటి రచనలు…?
ఈనాటి రచనల కక్ష్య ఏది? లక్ష్యమేది?

మరి ఏ రచనైనా నువ్వు చెప్పిన కక్ష్యలో సంచారం చెయ్యడానికి……
రచనకు వాక్యనిర్మాణం ముఖ్యం, వ్యాకరణం మరింత ముఖ్యం. ఏ భాషైనా వాక్యనిర్మాణం వల్లే వేరే భాష నుండి వేరవుతుంది.సందర్భోచితమో, వ్యావహారికమో, అలంకారికమో – ఏదైనా కానీ నిర్మాణ పాత్రను పూర్తిచేసుకునున్న వాక్యాల్ని ఏరుకుని, చక్కగా గుది గుచ్చుకోవాలి. కక్ష్య పరిధి అవగాహనకు తెచ్చుకునిరచనకు పూనుకోవాలి. ఆలాటి రచనే రచనా ప్రపంచంలో స్థిర సంచారం చేస్తుంది. శాశ్వతంగా నిలబడిపోతుంది… ఆదిమానవుడిలో స్థాయీ భావాలను ప్రేరేపించాలి, వ్యాకరణంతో దాహార్తిని చల్లార్చాలి, భాషా హొయలతో ఉద్రేక పరచాలి, ఆ ఉద్రేకంలో నుంచి ఉద్భవించిన ఆనందం అనుభవించేట్టు చెయ్యాలి.ఆ పైనఇతర వేదనలను మరిపింపచేస్తే రస భోగం అనుభవమవుతుంది. రచనకు సార్థకత్వమేర్పడుతుంది.పాత సాహిత్యం, ఆయా రచయితలు చేసిన పని అదే

ఓహో తెరచాప వేసినట్టు ఇన్ని చాపలు "పరచాలి" అన్నమాట…..గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ ! అని అంటావన్నమాట ఐతే.
ఆ మాట మీరు చెప్పాలె.

మరి ఈనాటి రచనలు ఏలాగున ఉన్నాయో కూడా ఓ మాట జెప్పు
తిక్కనను మార్క్సిస్టు దృక్పథంతోనూ, విశ్వనాథను వ్యంగ్యాత్మక దృక్పథంతోనూ చూడాలని వాదిస్తే ఎలాగుంటుంది? అలాగుంటున్నాయన్నమాట. దోసెడంత వీధిలో కృష్ణవేణమ్మను తమ పైత్యరసంతో నింపి కుళ్ళుకాలవలా దుర్గంధాలతో పరుగులెత్తిస్తున్నారు.చిత్రగుప్తుని చిట్టాలన్నీ చింపేసి ఆయనకే చిట్టి కవిత రాసిచ్చేవాడు ఈనాటి కవీ, రచయితానూ.. వ్యావహారిక భాషనుకుంటూ కట్టె కొట్టె తెచ్చె అన్న చందంగా రచనలు చెయ్యడమూ, కవితలు వ్రాయడమూ..పేలపిండిలా ఆ పదార్థాన్ని ఆదిమానవుల మీద దులపడమూ …ఇదీ మశకాలు చేస్తూన్న పని

మరి ఎలాగుండాలో కూడా చెప్పెయ్యొచ్చుగా
పూర్వ శబ్ద స్వరూపాన్ని ప్రామాణికంగా గ్రహించలేనప్పుడు, ఆ ప్రామాణికతను సమకాలీన శబ్దానికి అన్వయించి ఆ శబ్దాన్ని ప్రామాణికంగా మార్చలేనప్పుడు రచనకు పూనుకునే సాహసం చెయ్యవద్దు. వీలుచేసుకుని రచనకు పూనుకునే ముందుపాత సాహిత్యాన్ని చదవాలి..అందులోని రచనా పద్ధతులని తెలుసుకోవాలి, నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి …వ్రాసి వ్రాసి చిత్తుకాగితాలు తగలేసి నెత్తికి గండభేరుండ తైలం రాసుకోవాలి. వ్రాసిన వ్రాతల్లో ఎక్కడో ఒకచోట తనను తాను చూసుకుని నవ్వుకోటమో, ఏడవటమో చేస్తే ఆ రచన నెమ్మదిగా రాటు దేల్తుంది. లేకుంటే రచన రాచపుండై వ్రాసినోడినే కాక ఇతరుల వెన్నెముకల్ని కూడా బాధపెడుతుందన్నమాట.

మరి ఆ ప్రామాణికత ఎవరు నిర్ణయిస్తారయ్యా?
పేడతో పిడకలెలా చేస్తారండీ?


ఓ వేసావే బ్రహ్మాండమైన దెబ్బ!మరి నీ వాక్య నిర్మాణం మీద నీకు ఎంత పట్టుంది ?
అందుకే నేను రచయితనూ కాను, కవినీ కాను. ఆదిమానవుణ్ణి.

అదిగో …ఈ ఘోషలో వాగాడంబరమే తప్ప అసలు అంబరం లేదని కొందరు అంటున్నారయ్యా
ఓ వారా! వారికో కొత్త తండా ఏర్పాటు చెయ్యవలసిందే!!

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

11 Responses to సామాన్యుడి సాహిత్య చర్చ

  1. nagamurali says:

    వంశీ గారు, సవివరమైన మీ జవాబుకి ధన్యవాదాలు. మీరిచ్చిన వివరణలో ‘d’ గురించి – నేనన్నమాట మిమ్మల్ని ఉద్దేశించినది కానే కాదు.

    అన్నట్టు కిందటి కామెంటులో చెప్పడం మరిచాను. ఇంతకాలమూ మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం మాత్రమే ఎరుగుదును. ఇప్పుడు మీవల్ల ‘మశకాండ న్యాయం’ ఒకటి కొత్తగా తెలిసింది.
    అలాగే పుస్తక భేది గుళికలూ బాగున్నాయి. 🙂

  2. @అనిలు గారూ – 🙂 ….పంపించాను…..మీకు కాబట్టి రొక్ఖం వసూలీ లేదు. ఇహ వెయ్యాలనుకున్నవారి మీద మీరు పడిపోటమే మిగిలింది. ఎగతాళి కాదు కానీ అది నా వ్రాతలకైనా సరే! చిల్లులేవన్నా ఉంటే పూడ్చినవారవుతారు…. 🙂 కామెంటుకు ధన్యవాదాలు

    @ నాగమురళి – కామెంటుకు ధన్యవాదాలు

    “ఇది ఒక ‘సామాన్యుడు’ సాహిత్యం గురించి చేసిన చర్చా? లేక సామాన్యుడికోసం ఉద్దేశించబడే సాహిత్యం గురించిన చర్చా? లేక సామాన్యులు వ్రాసే అపరిపక్వపు సాహిత్యం గురించిన చర్చా?”

    a) అచ్చంగా చెప్పాలంటే మీ రెండు, మూడు సందేహ ప్రశ్నల కలగలుపు నా ఈ గోడు. సామాన్యుడికోసం ఉద్దేశించబడుతూన్న అపరిపక్వపు సాహిత్యం గురించిన నా ఘోష. సామాన్యుడు, అసలుగా చూస్తే సామాన్యుడు కాదు. చిన్న పిల్లవాడితో సమానం. చిన్నపిల్లల బుర్రని ఓ పేద్ద స్పంజితో పోల్చవచ్చు. ఆ స్పంజిమీదకు ఏది కుమ్మరిస్తే అదే ఇంకుతుంది. వికాసమనే నూనె పొయ్యమని అది వీలు కాకుంటే మంచి నీరన్నా ఆ స్పంజిమీద పొయ్యమనీ , మడ్డీ బుఱద కుమ్మరింపుల ధోరణి మార్చుకోమనీ “ఈ” సామాన్యుడు వ్రాసుకున్న చిత్తుకాయితం .

    “సామాన్యులు వ్రాసుకునే అపరిపక్వపు రాతల్ని గొప్ప సాహిత్యంగా చెలామణీ చేసే రాజకీయ (క్షమించాలి, ఈ మాటని దురర్థంలో వాడక తప్పడం లేదు) ధోరణులమీద మీకున్న ఆవేదనని వ్యక్తం చెయ్యడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం అయితే అది చక్కగా నెరవేరినట్టే. ”

    b) హమ్మయ్య – తోడు దొరికింది.

    “సామాన్యులు’ సృష్టించేది మాత్రం గొప్ప కళ కానే కాదు. ”

    c) మీ వాక్యంలోని అంతరార్ధం అర్థమయ్యింది…..ఈ వాక్యంతో నాకో చిక్కుంది. గోడమీది పిల్లి అనుకుంటారేమో కానీ, ఈ సామాన్యులు సృష్టించే “కొన్నిట్లో” అద్భుతమైన అందాలు దాగి ఉంటాయి. Raw Form Of Raja Ravi Varma లాగా… ఆ Raw Form ని ప్రకృతిలో వస్తువులతో పోల్చవచ్చు. పనికొచ్చేవాటిని ఎంత సుందరంగా మన చక్షువుల్లో, హృదయంలో నిలుపుతుందో, అంతకుమించి పనికిరానివాటిని ప్రకృతి ఏరవతల పారేస్తుందన్న విషయం మనకు తెలిసిన విషయమేగా. ఆ ప్రకృతి చేసే పనిలాటిదే ఈనాటి సాహిత్యానికి మనకున్న పండితులు చెయ్యాలని నా కోరిక. ఐతే ఈనాటి ఆ పండితులెవరు? పండితులుగా కొనియాడబడుతున్నవాళ్లా? నిజమైన పాండిత్యం ఉన్నవాళ్లా? అన్నది నాకు శేషప్రశ్నే! ఎప్పుడో ఒకప్పుడు సమాధానం దొరకకపోదా అన్న దృక్పథమున్న ఆశాజీవిని కాబట్టి… 🙂

    “‘సామాన్యత’ ని అడ్డం పెట్టుకుని నిష్ణాతుల్ని, వాళ్ళ ప్రతిభనీ తిరస్కరించడం బొత్తిగా తెలివితక్కువ అనే నేను అనుకుంటాను”

    d) ఖచ్చితంగా! అందులో సందేహానికి తావే లేదు! ఆపని నేను చెయ్యనూ లేను, చెయ్యనూ లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే సామాన్యుడై ఉండీ , అసామాన్యుడినని అహంకారంతో మురిసిపోతున్న మానవుడిని ఎండగట్టే ప్రయత్నం చేసుకున్నాను ఈ నా చిత్తు ప్రతిలో. ఒక్క జీవి ఎండినా ఈ నా వ్రాత జీవితం ధన్యం. నిష్ణాతులైనవారు సామాన్యుల క్రిందకు రారన్నది నా అభిప్రాయం. వారే మార్గదర్శకులవ్వాలన్నది నా తాపత్రయం. ప్రతిభావంతులకి చోటివ్వాలన్నదీ, అవకాశాలు మెండుగా కలిపించాలన్నదీ నా ఉద్దేశం. చేఱువలో, అందుబాటులో ఉన్న మాణిక్యాలను వెలికితీసి సాన పట్టాల్సిన పండితులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆవేశం. ఒకప్పుడు వీరిలో చాలామంది తామూ సామాన్యులమేనన్న విషయం మర్చిపోతున్నారే అన్న ఆక్రోశం. అయ్యా అదీ నా ఆంతర్యం.

    మీ ప్రశ్నలకు కొద్దిగానైనా (నాకు చేతనైనంతలో) వివరణ ఇవ్వగలిగాననుకుంటున్నాను.

    ఇహ శీర్షిక విషయానికి వస్తే అది నాది కాదు. పొద్దువారికిచ్చేసాను కాబట్టి వారినే నిర్ణయించెయ్యమన్నాను. సంపాదక వర్గం పెట్టిన పేరది. కాబట్టి రాళ్లు నా మీదకు, పూలు వారి మీదకు విసరండి. 🙂

    భవదీయుడు
    వంశీ

Comments are closed.