అఫ్సర్ అంతరంగం – 3


 

వృత్తిపరంగా, చదువు పరంగా మీ ఆలోచనలు కొన్ని చెప్పండి.

ఈ ప్రశ్నకి సమాధానం ఇంకో ప్రశ్నలో వుంది. ఒక రచయిత వాక్యం మనల్ని ఎంత దూరం లాక్కెళ్తుంది? దాని శక్తి ఎంత?   నేను ఇంటర్ లో వున్నప్పుడు  ప్రసిద్ధ కథా రచయిత చాసో తరచూ ఖమ్మం వచ్చే వారు, వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చే వారు. రాగానే ఆయన ముందు "ఏరా, ఈ సారి బొటనీలో  ఎన్ని మార్కులు ఎడ్చావ్?" అని-  నేను కథల గురించి మాట్లాడడం, ఆయన తన కబుర్లన్నీ బాటనీ కెమిస్ట్రీ వైపు మళ్ళించడం అప్పుడు వొక ఆట గా వుండేది. "నువ్వు ముందు ఈ ఇంటర్ సరిగా ఏడ్చి, ఆ తరవాత కథలూ కాకరకాయలూ మాట్లాడు" అని నిర్మొహమాటంగా, దాదాపూ తిట్టినట్టుగా అనే వారు. ఇంటర్ లో నేను బైపీసీ చెయ్యాలన్నది మా అమ్మానాన్నల కోరిక. డాక్టర్ కావాలని ఇంట్లో వొత్తిడి. బొటనీకి, సాహిత్యానికీ కెమిస్ట్రీ కుదిరేది కాదు, చాలా కష్టంగా వుండేది. అదే సమయంలో శ్రీ శ్రీ ఖమ్మం వచ్చినప్పుడు మా నాన్నగారి సమక్షంలోనే ఈ చర్చ వచ్చింది. అప్పుడు (ఇప్పుడు కూడా) శ్రీ శ్రీ అంటే దేవుడు నాకు. శ్రీ శ్రీ చెపితేనయినా వింటానేమో అని తండ్రి బాధ.  అప్పుడు శ్రీ శ్రీ " డాక్టర్ కాకపోతే కలెక్టరు. మా అమ్మాయిని నేను కలెక్టరు చేద్దామనుకుంటున్నా." అన్నారు.  ఆ తరవాత నేను చాలా కాలం రచయితల్ని కలవడం మానేశాను. అప్పుడు  ఎంత వినయంగా వుండే వాణ్ణో, అంత పొగరుగా కూడా వుండే వాణ్ని.  ఈ  వృత్తి వృత్తం లోంచి బయట పడాలి. సాహిత్యం నా దారి. పాఠాలు చెప్పడం వొక్కటే నాకు సరయిన వృత్తి అనుకోవడం మొదలెట్టాను. ఆ వైపు నన్ను నేను ట్రైన్ చేసుకోవడానికి వొక బడిలో పార్ట్-టైమ్ టీచర్ గా చేరాను.


కానీ, అమ్మ నాన్న వొత్తిడి మీద ఎంట్రన్స్ రాశాను. మంచి రాంకు వచ్చింది కూడా.  మెడిసిన్ లో సీటు వచ్చి వదులుకున్న వాణ్ని మీరేమంటారు? పిచ్చివాడు అంటారు. నేను మెడిసిన్ వదులుకొని బీయ్యే ఇంగ్లిష్ లో  చేరినప్పుడు నన్ను అందరూ అలా పిచ్చివాణ్ణి చూసినట్టు చూశారు. అదే సమయంలో నాకు రెండు విదేశీ అవకాశాలు వచ్చాయి. నా అకడెమిక్ రెకార్డ్ చూసి, హైద్రాబాద్ లోని వొక మైనారిటీ సంస్థ నా పేరుని సిఫార్సు చెయ్యడంతో ఇరాన్ ప్రభుత్వం అక్కడ మెడిసిన్ కోర్సులో చేరితే, అంతా ఉచితం అని ఆహ్వానించింది. మా కుటుంబ నేపధ్యం వల్ల కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు నా పేరు మాస్కోలోని మెడికల్ కాలేజీకి సిఫార్సు చేశారు. ఇవేవీ నేను వొప్పుకోలేకపోయాను.  వొకే వొక్క పిచ్చి కారణం:  వొక చలం  వాక్యం!  "డాక్టర్లూ, యాక్టర్లూ, లాయర్లూ చచ్చాకనే ప్రజా సేవ చేస్తారు" అని – ఆ వొక్క వాక్యం మంత్రవాక్యం అయ్యి, నాకూ మా కుటుంబానికి చాలా దూరం పెంచింది. చదువు గురించీ, వృత్తి గురించీ నా ఆలోచనల్ని మార్చింది.  ఇంగ్లీషు బీయ్యేలో చేరినప్పుడు కుటుంబం నించి నాకు ఆర్ధిక మద్దతు తెగిపోయింది. అయినా, పెద్ద బాధ పడలేదు. చాలా పొగరుగా,  చిన్నా చితకా పనులు చేసుకుంటూ బీయ్యే ఇంగ్లీషు పూర్తి చేశాను. బియ్యే ఇంగ్లీషులో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ కాస్త వూపిరి పీల్చుకున్నారు. కానీ, ఆ ఆనందం ఎంతో కాలం మిగలలేదు. ఇంటి ఆర్ధిక పరిస్తితులు ఇంకా దిగజారి పోయి, ఇక నేను చదువు ఆపేశాను. ఏదో వొక చిన్న వుద్యోగంలో చేరక తప్ప లేదు.  వృత్తి పరంగా ఆంధ్రజ్యోతిలో చేరిపోయాను. ఆ తరవాత నా వృత్తి దారి నా చేతుల్లో లేకుండా పోయింది. బతకడమే ముఖ్యం కాబట్టి పెద్ద సాహసాలూ చేయలేదు వృత్తి మార్చుకోవడానికి.

కుటుంబ పరంగా తేడాలు?

మా నాన్న గారు మిత వాద కమ్యూనిస్టు, నేను మొదటి నించీ అతివాద కమ్యూనిస్టుని. మా ఇద్దరి మధ్యా ఆ తేడాలు శాశ్వతంగా వుండిపోయాయి. ఆయనకి సాహిత్య పరంగా సాహిత్య సౌందర్యం మీద కొంత మొగ్గు వుంది. నాకు సాహిత్య సౌందర్యం ద్వితీయం. రాజకీయ సాహిత్యం వొక్కటే నిజమయిన సాహిత్యం అనుకునే వాణ్ని. ఇప్పటికీ అనుకుంటాను.

అమ్మ కుటుంబం  కమ్యూనిస్టు నేపధ్యం నించి వచ్చినా, ఆమెకి మత విశ్వాసాలు ఎక్కువే. కొన్ని సార్లు విసుక్కునేది, "ఎప్పుడూ ఈ గడ్డం రైటర్ల (చలమూ, మార్క్సూ)  పుస్తకాలేనా? పొద్దున్నే ఇంట్లో ఆ మొహాలు చూడ లేక చస్తున్నాం. కాస్త ఖురాన్ చదువుకో" అనేది. కానీ, తన కమ్యూనిస్టు కుటుంబ నేపధ్యం వెనక ఈ గడ్డం రైటరే (మార్క్స్) వున్నాడన్న విషయం ఆమెకి తెలీదు, నేను చెప్పే దాకా — అమ్మ తరఫు వాళ్ళు ఆచరణలో కమ్యూనిస్టులు తప్ప, పుస్తకాలు చదివి కమ్యూనిస్టులు అయిన వాళ్ళు కాదు! వాళ్ళకి కమ్యూనిజం అంటే సుందరయ్య గారే! మార్క్సిజమూ మతమూ వొక అస్తిత్వంలో ఎలా వొదుగుతాయన్న సిద్ధాంత చర్చకి అక్కడ తావు లేదు.

డాక్టర్ కాలేదే అనుకున్నారా ఎప్పుడయినా?

ఎప్పుడూ లేదు. తప్పులయినా, వొప్పులయినా అన్నిటికీ నాదే బాధ్యత. పశ్చాత్తాప పడే తప్పులు చేయకూడదని ప్రయత్నిస్తా ఎప్పుడూ.

ఏ వృత్తిలో వున్నా, కవిత్వం నా అస్తిత్వం. చదువు నా ప్రాణ వాయువు.  సత్కాలక్షేపం నా దారిభత్యం. అవి తోడున్నంత కాలం వృత్తి, డబ్బూ నాకు అంత ముఖ్యం కాదు.

పత్రికారంగంలో మీరు పనిచేసిన తొలినాళ్లకూ ఇప్పటికీ మీరు ప్రధానంగా గమనించిన మార్పులేమిటి?

నిజాయితీగా చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఎడిటర్లు లేరు. అప్పుడు ఎడిటర్ అంటే గొప్ప పదవి. అది పెద్ద మార్పు.  వాళ్ళకి జీతాలు పెరిగాయి కానీ, స్వేచ్చ తగ్గింది. ఎంత స్వేచ్చని కత్తిరించుకుంటే అంత పెద్ద జీతం ఇప్పుడు!  ఇది మొదటి విషాదం.   ఇప్పుడు నా సన్నిహిత మిత్రుడు శ్రీనివాస్ ఎడిటర్ అయిన ఆనందం వున్నప్పటికీ, నేను పని చేసిన ఆంధ్ర జ్యోతి ఇదేనా అనిపిస్తుంది కొన్ని సార్లు! ఆ పత్రిక భాషని ఆ శ్రీనివాసుడు కూడా మార్చలేకపోతున్నాడా అని బాధేస్తుంది.

నిస్సందేహంగా బేలతనం, బానిసతనం నా లక్షణాలు కావు. అవి రెండూ నా నించి ఆశించే వాళ్ళకి ఎప్పుడూ నిరాశే! జీవితంలో నేను చూడని చీకటి కోణం లేదనే అనిపిస్తుంది కొన్ని సార్లు. కానీ, నేను నా అదృష్టాలని మాత్రమే లెక్క పెట్టుకుంటాను ప్రతి సారీ!

రెండో విషాదం:  మరీ ఇంత బాహాటంగా, నిస్సిగ్గుగా పత్రికలు  రాజకీయాల తోక గా మారడం.

మూడో విషాదం : తెలుగు పత్రికల్లో భాష, సాహిత్యం  గురించి తెలిసిన వాళ్ళూ, ఆ భాషని చక్కగా వుపయోగించుకునే వాళ్ళూ లేరు. పేజీలు నింపడమే పరమ ప్రయోజనం అయ్యింది. ఆ పేజీలని దేనితో నింపుతున్నామన్న స్పృహ లోపించింది.

నాలుగో విషాదం: అసలు సమాచారం కన్నా, ప్రకటనల ఇష్టా రాజ్యం మేరకి పత్రికలు నడవడం!

అన్నిటి కంటే పెద్ద విషాదం: సమాచారం అంటే సంచలనం మాత్రమే అనే అపోహ వ్యాపించడం!

ఆది యందు  పత్రిక నాకు పట్టెడన్నం పెట్టిందన్న కృతజ్నత ఇంకా మిగిలి  వుండడం వల్ల ఇంకా పెద్ద మాటలేమీ అనలేకపోతున్నా.


పత్రికా రంగం నించి బయట పడడం మీకు నచ్చిందా?

చెప్పలేను. అవన్నీ నేను అనుకోని చేసిన పనులు కాదు. వెల్చేరు నారాయణ రావు గారు నేను ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్న కాలంలోనే అంటే 1987 ప్రాంతాలలోనే నేను యూనివర్సిటీ కి వస్తే బాగుంటుందని అనే వారు. అది నేను మొదటిలో అంత సీరియస్ గా తీసుకోలేదు. కారణం, నేను పత్రికలలో వున్న హోదాలు మంచివీ , వాటి మీద నాకు వుండిన అమితమయిన  ఇష్టమూ! ఇప్పటికిలా జరిగిపోతుంది కదా అన్న నిత్య నైమిత్తిక తృప్తీ.

 

పైగా, అవి  నాకు తృప్తినిచ్చిన హోదాలు కూడా . పత్రికా రంగంలో వున్నంత కాలం ఎక్కడా అసంతృప్తి లేదు. చిన్న చిన్న తేడాలు ఎక్కడయినా వుంటాయి. కానీ, నా సృజనాత్మకత అంటూ ఏదయినా వుంటే, దాన్ని గౌరవించే, దానికి విలువ ఇచ్చే ఎడిటర్ల దగ్గిరే పని చేసే అదృష్టం దక్కడం విశేషమే. నండూరి దగ్గిర వున్నప్పుడు ఆంధ్ర జ్యోతి సాహిత్య పేజీని నిండు పేజీగా మార్చగలిగాను. దాని ప్రభావాన్ని గురించి నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పకరలేదు.  ఆదివారం అనుబంధం నా ఇష్టం వచ్చినట్టు మార్చే స్వేచ్చ కూడా ఆయన ఇచ్చారు. నేను ఆంధ్రజ్యోతి వార పత్రికలో పనిచెయ్యకపోయినా, పురాణం గారు కథలూ, కవిత్వాల ఎంపికలో ఎప్పుడూ నన్ను అడిగే వారు. అప్పటికి పురాణం గారికి ఇస్మాయిల్ కవిత్వం మీద చిన్న చూపు వుండేది. ఇస్మాయిల్ కవిత్వం ఆయనకి చదివి వినిపించి , ఆ చిన్న చూపు అన్యాయమని వాదించే వాణ్ని. "అయినా, కవిత్వం జోలికి నేను వెళ్లనులే. అదేదో నువ్వే చూసి కంపోసింగ్ కి ఇవ్వు" అనే వారు.   ఆంధ్రభూమిలో "అక్షరం" , ఆదివారం రెండూ చేశాను. రెండు చోట్లా సంపాదకీయాలు కూడా రాసేవాణ్ని.  ఆంధ్రభూమి రాయలసీమ ఎడిషన్ ఇంచార్జ్ గా పంపిస్తున్నప్పుడు ఎం‌వి‌ఆర్ శాస్త్రి గారు అన్న మాట నాకు ఎప్పుడూ గుర్తు వుంటుంది. "అది దూరం కదా అనుకోవద్దు. ఎడారి కదా అనుకోవద్దు. ఆ వూళ్ళకి, అక్కడి మనుషులకి ఎలా దగ్గిర అవుతావో ఆలోచించు. అక్కడి నేలని ప్రేమించు. మనుషుల్ని ప్రేమించు. నీ పని మీద నీకే గౌరవం పెరుగుతుంది." ఆ మాట ఎప్పటికీ నాకు గుర్తుంటుంది.  అనంతపురంలో వున్నా, ఆస్టిన్ వచ్చినా- పత్రికా రంగాన్ని నేను ఇష్ట పడ్డాను. ఇప్పుడు మారిన పత్రికా రంగంలో ఆ ఇష్టం అలాగే వుండేదా అంటే చెప్పలేను. కానీ, నారాయణ రావు గారు, ఇతర మిత్రులూ  ఎప్పుడూ అంటారు " మీరు ఆంధ్రాలో వుంటే ఈ పాటికి ఎడిటర్ అయ్యే వారు" అని! అలాంటివి చెప్పలేం! నాకు చాలా బలమయిన ఇష్టానిష్టాలున్నాయి. నా ఇడియాలజీకి సంబంధించిన పొగరూ , విగరూ వున్నాయి. అది అందరికీ నచ్చకపోవచ్చు. పత్రికా రంగంలో అవి అస్సలు పనికి రావు. పైగా, నాకు హోదాల మీద అంత ఆకర్షణ లేదు. నా పని నాకు నచ్చాలి, నాకు తృప్తినివ్వాలి. అది లేకపోతే, గొప్ప పదవి ఇచ్చినా నేను చెయ్యను. ఈ రకంగా చూస్తే ఆస్టిన్ ప్రస్తుతానికి నా చివరి మజిలీ కావచ్చు. (అయినా, స్థావరం మీద నాకు నమ్మకం లేదనుకోండి) ఇక్కడ నాకు తృప్తీ, స్వేచ్చా అన్నీ వున్నాయి. అటు తోటి అధ్యాపకులకూ , ఇటు విద్యార్ధులకూ నేనంటే ఇష్టం! మరీ ముఖ్యంగా నా సమయం నా చేతుల్లో వుంది. మరీ మరీ ముఖ్యంగా ఈ వూరు నాకు నచ్చింది; టెక్సాస్ తెలుగు వాళ్ళు నాకు మరీ నచ్చారు.
 

నిస్సందేహంగా బేలతనం, బానిసతనం  నా లక్షణాలు కావు. అవి రెండూ నా నించి  ఆశించే వాళ్ళకి ఎప్పుడూ నిరాశే!  జీవితంలో నేను చూడని చీకటి కోణం లేదనే అనిపిస్తుంది కొన్ని సార్లు. కానీ, నేను నా అదృష్టాలని మాత్రమే  లెక్క పెట్టుకుంటాను ప్రతి సారీ!  ఈ పూటకింత  అన్నమూ, తల మీద కాసింత నీడా లేని వాళ్ళు ఎక్కువగా  వున్న లోకంలో మన ఈతి బాధలు పెద్ద లెక్క కాదు. ఆకలినీ, కష్టాల్నీ రోమాంటిసైజ్ చేసుకోవడం నాకు నచ్చదు. ఆ రకంగా నేను చాలా ప్రాక్టికల్.


మరీ కుంగిపోయినప్పుడు, బేలతనంతో ఆత్మ హత్య చేసుకున్న నా మిత్రులంతా గుర్తొస్తారు. మోరియా గారి అమ్మాయి సాధన ఆత్మ హత్య చేసుకొని, ఆస్పత్రిలో వున్నప్పుడు మేము ఆమె మంచం చుట్టూ నిలబడి వున్నప్పుడు ఆమె మా నాన్నగారి చేతులు దగ్గిరకి తీసుకుని వొక మాట అంది " అంకుల్, నేను పొరపాటు చేశాను. నాకు చనిపోవాలని లేదు, నన్ను ఎలాగయినా బతికించండి..ప్లీజ్!" అని- ఆ మాట అన్న మరుక్షణం తను మొహం వేలాడేసింది. ఆమె ఆ చివరి మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తాయి. ఆమె ఆ చివరి నిస్సహాయ క్షణం నా అనేక కవితల్లో కనిపిస్తుంది. కానీ, అది కవిత్వ క్షణం కాదు, అది వొక బతుకు సందేశం.  ఇప్పుడు ఈ క్షణం ఈ వూపిరి ఇవి మాత్రమే  బతుకు కొలమానం నాకు.


నా కవిత్వం మీద విపరీతమయిన చర్చ జరిగి, నన్ను అందరూ ఏకపక్షంగా తిట్టిపోస్తున్న వొక దశలో శివారెడ్డి గారు "ఇన్ని రాళ్ళ దెబ్బలు తింటున్నావ్ అంటే నీ చెట్టు మీద కాయలే అందరికీ కావాలన్న మాట" అని! ఆ మాట ఇప్పుడు  అతిశయోక్తి అనిపించ వచ్చు, కానీ, ఆ క్షణాన నాకు ఆ మాట అమృతం. అదే నాకు కావాలి. కాయలు కాస్తామా లేదా అన్నది వేరే సంగతి, అసలు మన వేళ్ళలో తడి వుందా లేదా అన్నది నాకు ముఖ్యం! ఆ తడి వుంటే ఎడారినయినా జయించవచ్చు!
 

ఈ అనుభవాల లోంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏమిటి?

పాఠాలు మారిపోతాయి జీవితంలానే – మనం బతుకు సిలబస్ ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. కానీ, ఏ సిలబస్ కైనా కొన్ని మౌలిక సూత్రాలు వుండాలేమో!


వొకటి: జీవితం నెగటివ్ గా వున్నప్పుడు పాజిటివ్ గా, జీవితం పాజిటివ్ గా వున్నప్పుడు నెగటివ్ గా ఆలోచించే శక్తి మనిషికి చాలా అవసరం అనిపిస్తుంది. ఆ రెండీటీ మధ్య వున్నప్పుడు జీవితం వొక చిరునవ్వుతో సమానం! బాధలు గడ్డిపోచలు! పాజిటివ్ గా వుండాలి అనుకోవడం కొంత కష్టం. కానీ, "నెగటివ్ గా ఎందుకు వుండాలి" అనుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటాను.

రెండు:  ప్రాతస్మరణీయమయిన వ్యక్తులు వుండొచ్చు, వుండకపోవచ్చు. కానీ, ప్రాతస్మరణీయమయిన వచనాలు ఎప్పుడూ వుంటాయి! కాబట్టి, వ్యక్తి కంటే, అతని వచనం ముఖ్యం.

మూడు: ఈ క్షణంలో జీవించడం…ముమ్మాటికీ!
 

(అస్తిత్వ ఉద్యమాలూ, అనుభవాలూ ఈ సారి)

ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

14 Responses to అఫ్సర్ అంతరంగం – 3

 1. sarayushekhar says:

  niraadambarangaa kanipinche mee venuka entha katha undani assalunuko ledu. epuudu kanipinchinaa navuuthuu untaaru kadaa! !nenu enaallu o manishi tho maatlaada ledani ,o mahaa maniishi tho masalaanani thelusukunte abburamanipisthundi……kaani ………….mee chivari majili aastin ante baadha gaa undi .eka meetho saradaagaa gadipe rojulu raavaa?………….eemm………………guthiiiiii………………..aatapattincharaaaaa………………………….?

 2. వాసుదేవ్ says:

  అఫ్సర్‌జీ నమస్కారం. ఈ మూడోభాగం బతుకు బడి పాఠశాలలొ నేర్చుకుంటున్న ఓ పాఠం అనుకుంటున్నాను నా మటుకు నేను. ముఖ్యంగా ఈ వాక్యం “మన వేళ్ళలో తడి వుందా లేదా అన్నది నాకు ముఖ్యం! ఆ తడి వుంటే ఎడారినయినా జయించవచ్చు!” అన్నది ఎక్కడో ఆర్ద్రతతో నిండిన ఓ కాన్ఫిడెన్స్‌ని నింపింది. మళ్ళీ పొద్దువారికి ధన్యవాదాలు.

 3. రమేశ్ says:

  అఫ్సర్ గారు:

  ప్రముఖ రచయితలతో మీ అనుభవాలు మరి కొన్ని వినాలని వున్నది. మీ వీలు వెంబడి రాయగలరు.

 4. రవి కుమార్ says:

  అఫ్సర్ గారూ:

  సాహిత్యంలో రాజకీయాల పాత్రని కొంచెం ఎక్కువగా చెబుతున్నారేమో! ఇప్పుడు అసలు సాహిత్యం అంతా రాజకీయం అయిన కాలంలో ఇది కొంచెం కష్టం కావచ్చు. సాహిత్యం ప్రాధాన్యం తగ్గిపోవచ్చు కదా..

  రవి కుమార్

 5. desaraju says:

  మీ కవిత్వంలోకంటే, ఇక్కడి మీ అభిప్రాయాలు ఎమోషనల్గా వున్నాయి. ఇవి చాలామంది కవుల గుండె చప్పుళ్ళను వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *