శాపగ్రస్త మండూకము – పేదరాశి పద్యము కథ

సంక్షిప్త కథ

సకలైశ్వర్య వైభవాలతో తులతూగుతున్న ఒక రాజునకు సంతానలేమి అనబడే తీరని లోటు. రాజోద్యానవనంలో ఒకనాడు అతడికి మనుష్యుల పగిది మాట్లాడగలిగే కప్పతో పరిచయము. పెళ్ళీడుకి వచ్చిన పిదప పాపని యొక కప్పకే ఈయవలెనని నుడివి కప్ప అతనికి పసిపాపని యొసగుట. రా జందులకు సమ్మతించుట. పిల్లని అల్లారుముద్దుగా పెంచిన రాజు కప్పకు చేసిన ప్రతిన మరచుట. తిరస్కృత మండూకము అదను చూచి రాకుమారితో పరిచయము పెంచుకొనుట. వారి స్నేహము గాఢానుబంధమగుట. రాకుమారి ఇతర రాకుమారుల యెడ ఉత్సాహము చూపకపోవుట వలన స్వయంవరములు చెడుట, రాజునకు మిక్కిలి ఆతురుత కలుగుట. తుదకు రాజునకు వింత స్నేహము గూర్చి తెలియుట. ఇరువురిని విడదీయు ప్రయత్నమూని రాజు ఉద్యానవనిలో ముళ్ళపొదలు నాటించుట. కప్పందు చిక్కుకొన రాకుమారికి యెడబాటు కలుగుట. దుస్సాధ్యమౌ యెడబాటుకు రాకుమారి బాధపడి ఉద్యానవని కరుగుట. ప్రాణాపాయ స్థితి బడి యున్న కప్పను రక్షించి సాకుట. కప్ప రాకుమార్తెను వివాహమాడుమని కొరుట. రాకుమార్తె సమ్మతించుట. వివాహమాడిన మరుక్షణమే కప్పకు శాపవిమోచనమగుట. ఇరువురును సుఖముగ వర్థిల్లుటయే కథాసారాంశము.

******************************************

1. క.

శ్రీమన్మంగళ నామా,
శ్రీమన్మనోబ్జ విలసిత శ్రేయోధామా,
శ్రీమధ్ధశరథరామా,
మా మానసవీథిని నిలుమా రఘురామా!

2. వ.
ఆని యిలువేలుపును మదిఁ దలచి, నేను చెప్పఁదలఁచుకున్న కథ యేమిటంటేని…
3. తే.

భరత వాఙ్మయ వాహినీ ప్రథిత బాల
నీతికథలు పలుదిశల జాతి-దేశ
భేద మారయక పెరసి పేర్మిఁ బడసె
ఫెయిరి గాథల కైవడిఁ బేరుకెక్కె.

4. క.

వెళ్ళగ వెళ్ళగ వేఱ్వే
రూళ్ళకు నోళ్ళం బడన్ దొలుత నా కథలం
దూళ్ళును మాఱెన్, బాత్రల
పేళ్ళును మాఱెన్ బదపడి పెంపును హెచ్చెన్.

5. ఆ.

అవ్వికల్ప కథల నాశ్చర్యజనకంబు
శాపగ్రస్తుడయ్యు కూపమండు
కమ్ము రూపుఁ దాల్చి కలఁత డెందము కుందు
రాకుమారు గాథ రండు వినుఁడు.

6. చ.

అనగఁ యనంగ రాజొకఁడు, హార్ధము మీఱగ భృత్యులన్ విధే
య నగరి వాసులన్ సతతమాప్తుల భంగిఁ దలంచి న్యాయపా
లన భువినేలుచుండ , సకలైశ్వరికంబులు భోగభాగ్యముల్
ధనకనకంబు లేఁపుగ పృథగ్విధిఁ గల్గె నపత్యవర్జముల్.


7. మ.

ఒకనాఁడా ధరణీశుఁడేఁగెడు విహారోద్యాన మార్గానఁ దా
బెకబెక్కాడెడు మండుకం బొకటి గాన్పింపన్నటన్నిల్చి తా
బెకబెక్కాడెఁ బరాచకమ్మెనిచి, పృథ్వీనాథ ! సంతాన సి
ద్ధి కొఱయ్యెన్నని కుందకోయి యని నుడ్వెన్ గప్ప నిస్సంతుతోన్.

8. క.

అటునిటుఁ జూచె చకితుఁడయి
యెటుదీ యశరీరవాణి ? యిటదని మదిలోఁ
దుటతుట వడుచు తటాకము
తటి కేఁగె తుదకు తెలియక తారణవిధమున్.


9. తే.

అంత నొక మండుకము రాజు చెంత గెంతి
బెకబెకా యని మాట్లాడితి కనుక నిను
తుష్టుఁ జేయు నిమిత్తము తొందఱిల్లి
మర్త్యభాషణ జేసితి మనుజవర్య.

10. వ.
అది విని రా జమితాశ్చర్యమునకు లోనయ్యు దానిఁ గప్పిపుచ్చి, తన సంతానరాహిత్యము మండూకమున కెటులఁ దెలిసినదో తెలియక యదియే ప్రశ్నము నడుగగా-

11. ఆ.

భాష నేర్వఁగల్గువాఁడను మనుజుల
సంగతుల తెలిసికొనంగలేనె ?
గొడ్డువోయె గృహము బిడ్డపాపలలేమిఁ
దల్లడిల్లునీకు తపనఁ దీర్తు.

12. వ.
అది విని యా భూపాలుడు..  

13. శా.

మర్మంబున్నది, తెల్పు తెల్లముగ నీ మాయోపదేశంబు నే
ధర్మాత్మంబని యెట్లునమ్మగలనే ? తథ్యంబుగా నెద్దియో
తీర్మానించుక వచ్చినావిట కనెన్, ధీయుక్త యేమంటివో ?
కూర్మిం జూపుట నేఱమో ? యుపకృతుల్ ఘోరాపరాధంబులో ?

14. క.

అని పల్కి మఱల నెమ్మది
నెనరున వివరించి కప్ప నెమ్మిన్ దెలిపెన్
మనుజునకున్ నిజతర్షము
ననునయ మొప్పం దన పను లనుకూలింపన్.

15.ఆ.

ఒక ముని కరుణింపఁ జికచిక చక్కని
పాపను వరకృపగఁ బడసినాను
దాని నీకొసగెదఁ గానిఁ బెండ్లికి దానిఁ
దోయసూచకమున కీయవలయు.

16.తే.

అనుచు కొంత దవుకు గెంతి యచట పొత్తి
ళులఁ బరుండిన పసిపాఁప నెలమిఁ జూపె
చూడ ముచ్చటౌ చక్కని చుక్కఁ బాఁపఁ
జూసి రాజు వాగ్దానము జేసె నచటె.

17.క.

ఎప్పటి పెండ్లి విశేషమొ ?
యెప్పటి కీ పట్టి యట్టి ఈడుది యగునో ?
యిప్పటి ప్రతినలు గుఱుతిడి
క ప్పప్పటికున్నఁ జూతు కర్తవ్యంబున్.

18.వ. అని మది నెంచి వాగ్దాత మిక్కిలి సంతుష్టుఁడై పొత్తిళ్ళలోని పాఁపను దన సౌధమునకు తీసికొనిపోయి, లేకలేక యింట వెలిఁగిన దీపము గాన నామె నల్లారుముద్దుగాఁ బెంపసాఁగెను. చిరకాలమున కా రాకుమారి యుక్తవయస్కురాలయినది.   

19.క.

కొలది వసంతముల కడ మ
ఱల భూపాలు డల వనిఁ దరలె వాహ్యాళిన్
దలఁ ద్రిప్పడు మండూకపు
కొలనిన్ గనఁడే నిలువఁడె కొంతయు నచటన్.

20.వ. రాజు తన ప్రతిన మఱచినాడని యూహించి వర్షసూచకము బాధపడి-

21. ఆ.

మనసువడ్డఁ బలు ప్రమాణములుఁ గుదుర్చు
మనసు తీఱిన మఱుక్షణమె మఱచుఁ
బ్రతినఁ బూని పిదపఁ బ్రతినివర్తితుఁడౌట
క్రొత్త గాదు మర్త్యు చిత్తవృత్తి.

22.ఆ.

తానొకటిఁ దలఁచిన దైవ మొం డొనఱించుఁ
వింత గాదిది విధి విలసనంబు
భీరు విడుములందు బేలవడి వగవ
ధీరబుద్ధి నిలచు ధిక్కరించి.

23.వ. అని తలఁచి, మనసు దిటవు చేసికొన్న కొలఁది దినములకు…

24.మత్త.

రాకుమార్తెకు ప్రీతిపాత్రపు రత్నహారము మాయమై
శోకమున్ గలిగింప, సుందరి శోభ తగ్గెను, తండ్రి యు
ద్రేకి యయ్యెను, సేవకుల్ పలుదిక్కులన్ బడి రెంతకున్
గాకపోయిరి సిద్ధులంతట హారమే కఱిపూసయై.

25.ఉ.

దూరమునుండి యా గొడవ తోయనివాసి కన్పట్టి నిక్కఁమౌ
గూఱిమి జూపనిద్దె యనుకూలితమైన నెపమ్ముగాఁ గనెన్
జేఱెను రాకుమారి కడఁ జేతును నీకు సహాయ మమ్మి, నీ
కోరిక తీర్చు కార్యము నకుంఠిత దీక్షఁ దలంతు నే ననెన్

26.సీ.

కప్ప మాట్లాడెనా ? కలగంటినా ? యని చిగురుబోడిఁ దన ముంజేయి గిల్లు
కొనె, గిల్లిఁ నటునిటుఁ గని తెలతెలబోయె, తెల్లబోయి మఱల తేఱిపాఱఁ
జూచి, నాకేలఁ జే సూచెదవు చిఱుగప్పా మర్త్యుల పగిది భాషలాట
నేర్పరివై నీవు నేర్పుగ సాయంబనిం దలచి వెఱఁగు వొందుచుండె.

27.తే.

కన్నులింతవి చేసిన కన్నెనటనె
నిల్వ వదిలి గెంతుచుఁ బోయె నెటకొ నబ్బె
కబెకము తిరిగి వచ్చెను కఱచి తెచ్చె
నోట,రాకొమరి కడకు నేవళమును.

28.మ.

క్షణకాలంబున చెప్పె నప్పడతి – దుస్సాధ్యంబుగా నెంచి మా
పనివారల్ కొఱగానివారయిన సద్భావంబుతో వచ్చి యం
తనె జింతన్ దగ రూపుమాపు నుపకృత్యం బెన్ను రీతిన్ ఘటిం
చిన మండూకమ, చెప్పుమే విధిని నీ స్నేహంబు దీర్పందగున్

29.క.

విని మండూకము, స్నేహితుఁ
డని నను నీవరసినఁ దగు ననెను నెనరుతో
ననుదినమును నిజగృహమున
ననుమతి నిచ్చినఁ దగుననె నతి వినయముతోన్.

30.వ. పడతి కా మాట లమితముగా నచ్చినవి. ఆ దినము నుండి రూపవతియైన రాకుమారియు మండుకమును స్నేహితులయినారు. వారి నెయ్యము కొలఁది దినములకే ప్రగాఢస్నేహముగా మారినది.   

31.ఆ.

రాజు వాక్కు నిష్ప్రయోజనమైనను
రాకుమార్తె కాదరాభిమాన
పాత్రమైతిఁ జాలుఁ బ్రతిన యూనెన్ దండ్రి
దీర్చునేమొ పట్టి తెలియకుండ

32.వ. కప్ప యానందమున కవధులే లేవు. రాకుమారి మందిరమునకు వచ్చి విచిత్ర కథలు గాథలు ననుదినము కొంగ్రొత్త రీతులలో నాశ్చర్యాతిరేకమును గలిగించుచుఁ జెప్పుచుండ.

33.క.

ఈ కప్ప కింత జ్ఞానం
బే కతమున నబ్బె ననుచు వివేకించుకొనన్
భేక మసాధారణమని
యా కొమ్మకుఁ గొన్నినాళ్ళ కవగతమయ్యెన్.

34.వ. ఇన్ని వింతలును విశేషాలును ఏలాగు తెలిసితివని యబ్బురపడి-  
35.క.

ఎక్కడ నేర్చితి కూర్చితి
వెక్కడి చిత్రాతి చిత్ర హేలాకథలో
దిక్కుల తెరువరివై యే
దృక్కులఁ జూచితి తెలుపుమ తెప్పునఁ దెలియన్.

36.క.

యడిగినను బదులిడక పద
పడి మఱియొక కథనము వడి వడి నుడువంగన్
కడ కిఁక జతనము వృథ యని
విడచెను పడచుది విడుచుటె విధి యనిపించన్.

37.ఉ.

అంతట రాకుమారికి స్వయంవర వేడుక చేయఁబూనె, శ్రీ
మంతుల ధీరకార్య సుసమర్థుల మాన్యుల వీరశూర సా
మంతుల కీర్తిశాలిధృతిమంతులఁ బల్వురఁ జేఱఁబిల్చె, భూ
కాంతుడు, శ్రేష్ఠునెంచి వరకాంతకుఁ దోడుగఁ గట్టఁబెట్టఁగన్.

38.ఉ.

వచ్చిరి దాఁపువారు మఱి వచ్చిరి దవ్వుల రాజరాజులున్
వచ్చిరి దారుదారె జనవంద్యులు వచ్చిరి పెండ్లియాడ వా
ర్వచ్చిన దారిఁ బోవలసి వచ్చెను వచ్చిన వారినెవ్వఱిన్
మెచ్చదు నచ్చదెవ్వఱిని మేల్పడి వచ్చిన మేదినీశులన్.

39.వ.

స్వయంవర వేడుక ముగిసినది కాని వివాహమహోత్సవము మాత్రము జఱుగలేదు. ఈలాగు రెండు స్వయంవరాలు ముగిసిన పిమ్మట రాజున కనుమాన మేర్పడినది.  

40.శా.

పేరాశల్ మదిఁ గూర్చి భూవిభుల సత్ప్రీతిన్ స్వతంత్రించి నే
రారమ్మంటి, మహత్త్వ ధీయుతలు విభ్రాజుల్ ఘనుల్ వచ్చినా
రీ రాజ్యమ్ము స్వయంవరోన్ముఖుల వర్జించెన్ వరింపన్ గటా
నారీశ్రేష్ఠ నిరాకరించె కడకున్నాకెంత గో డయ్యెనో !

41.క.

కనుగొనవలె నెందులకీ
వినుతాంగిఁ బలువుఱ నిట్లు వెడలించెనొ యీ
యనుమానము దీఱ ముదిత
యనుఁగుఁ జెలిగత్తెల నడుగ ననునయమబ్బున్.

42.వ. పిదపఁ జెలికత్తెల ద్వారమున మండూక స్నేహితమును గూర్చి రాజు తెలుసుకొని-

43.చ.

ప్లవమును బ్రత్యహంబుఁ దన ప్రక్కకుఁ గూర్మిని జేఱఁదీయు న
న్వివరముఁ గన్నరాజు కడు విహ్వలుఁడై ప్రతిచర్యగాఁ బ్లవం
గ వనిని ముళ్ళకంచెల విఘాతము లేర్పఱిచెన్, గృతార్థుడ
య్యె వెతలు దెచ్చి యెడమేర్పడఁ గుందిరి మిత్రులిర్వుఱున్

44.సీ.

వఱువాత మేల్కొని వచ్చెనా నుడువుల ప్రావృషిజమ్మని పాఱఁ జూచు
తరువాత మధ్యాహ్న మరుదెంచు లెమ్మని యనునయించుకొనును దనను దానె
సాయంత్రమా మాట సాయంబు రాదేమె చేఱరమ్మని నీవె చెప్పుమనును
రేరాజు వచ్చెలే మారాము జేయకే శాలూరమా ! యిఁక చాలు ననును

45.ఆ.

ఎదురు సూచి చూచి కుదురులేని మనసు
కొలఁది దినము లిటుల గుందుచుండి
వెతికి చూడ నెంచె వెడలి యుద్యానము
స్నేహితున్ మఱలను సేకరింప

46.వ. వెడలిన రాకుమారి కుద్యానవనములోఁ గొలని ప్రక్కన ముళ్ళపొదలోఁ జిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో నున్న కప్ప కనఁబడినది. తనలోఁ దాను మాటలాడుకొనుచు బాధపడుచున్న కప్పను జూచి రాకుమారి హృదయము ద్రవించిపోయినది.     

47.క.

కప్పనుఁ గానే విధివశు
కప్పగఁ బ్రతికితిఁ దుదకిఁకఁ గానలఁ  బడి నే
కప్పగ చత్తునొ కద నా
క ప్పరమేష్ఠి విధి వ్రాయు కారణమేమో !

48.వ. మాటలాడు స్థితిలో లేని మిత్రుని రాకుమారి యరచేతఁ దీసికొని నెమ్మదిగాఁ దన మందిరమునకుఁ గొంపోయినది.    

49.శా.

అయ్యయ్యో ! ప్రియమిత్రమా ! యెటుల నీవా తుప్పలన్ జిక్కితో ?
కుయ్యాలింపను లేకపోతిని గదే, కూళాత్ము రాలైతినే,
అయ్యా ! బాధను మాన్పలేని యసహాయన్ నన్ను మన్నింపుమా,
నెయ్యంబుబ్బ సపర్యఁ జేతు సఖుడా ! నిన్ సాఁకి కాఁపాడెదన్

50.ఆ.

నీ యవస్థఁ జూచి నిల్వలేకున్నాను
దూట్లు వడ్డ మేని పా ట్లడంచి
స్వస్థత బడయింతు బల్మి చేకూఱుతు
చెల్లఁబోకు నీవు చెలిమికాఁడ !

51.వ. కాని-  
52.తే.

వే సపర్యలు జేసియున్ వీసమంత
గుణము ఛాయ లేవియు పొడఁగొనవు తనకుఁ
గప్ప నివ్విధి చూడలేక తెగబడని
శోకసంతప్తు రాలయ్యె సుందరాంగి.

53.వ. కోలుకొని మఱల గెంతుచుఁ దిరుగాడు కప్పను జూచు యాశ నిరాశ యని వగచినది.
54.క.

నచ్చిన బండము నెద్దియొ
తెచ్చిన సంతోషము గొనుఁ దెఱపియుఁ గలుగున్
దెచ్చెద నీకేది వలయుఁ
జెచ్చెరఁ జెప్పుమని వేఁడెఁ జేడియ ప్లవమున్

55.వ. దాఁచుకున్న బాధలును, చెప్పకున్నఁ  గోర్కెలును, ఆప్తుల వద్ద దాఁగునా ? రాకుమార్తె యట్లు గ్రుచ్చిగ్రుచ్చి యడుగఁగాఁ , దుదకుఁ గప్ప-  

56.క.

ఉన్నది నాకొక కోరిక, యిన్నాళ్ళుగఁ దీఱని దది, యెటు లది తీఱున్
దెన్నెఱుఁగక నేఁ దెలుపను,
చిన్నది కాదది, సులువుగఁ జెప్పఁగ లేనే.

57.వ. చిన్నదో, దొడ్డదో నీ మది నున్నది యున్నట్లు తెల్పుమనెను రాకుమారి. నా ప్రియసఖుఁడవు నీవు, నీ కోరిక తీర్చెదనని ప్రమాణము చేసినది.  

58.ఆ.

ఇన్నినాళ్ళు దాఁగి యున్న నా కోరిక
చెప్పెద విను మనసు విప్పెద విను
మేవగించుకోక, యిందువదన, ప్రేమ
తోడ నన్నుఁ బెండ్లి యాడఁగలవె?

59.వ. ఈ వింతకోరిక విని రాకుమారి అవాక్కయ్యినది. కొలది సేఁపటికి తేఱుకొని యాలోచించినది.

60.ఉ.

పాయగ లేని బంధనము, ప్రత్యుపకారపు వాంఛలేని స
ద్వ్యాయతమైన స్నేహితము, వాచెలిమై మదిఁ నిల్చె నిత్యమే
మాయలు మర్మముండని యమాయక చిత్తము ప్రాణపాత్రమున్
వే యననేల ? గాయముల వెక్కు సహాయు నుపేక్ష సేతునా?

61.వ. రోయక బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో, చిన్ని పూదండ చిన్నిమెడకు వేసి.

62.ఉ.

భళ్ళున కప్పయున్ సురిగె, బమ్మెరవోయితి నేమొ యంచుఁ దా
పుల్లవడన్ లతాంగి, తలపోయని వింతగ కండ్ల ముంగిటన్
జల్లని చూపులున్ మిసిమి ఛాయ లతాంతశరాస్త్రు రూపముం
జెల్లుచు నిల్చె సుందరుఁడు చెంగటఁ బ్రాణముగొన్న ప్రేమయై

63.వ. దగ్గఱకు వచ్చి 

64.తే.

కోపవశమునఁ దెప్పున శాపవశుని
చేసి, వెండియు శాంతిల్లి సిధ్ధుడొకఁడు
శాపము తొలఁగుఁ దెన్నుగఁ బాఁపవైన
నిన్ను నాకిచ్చె నమ్మవే నీరజాక్షి !

65.తే.

నిండు మనసుతోఁ గరుణించి నీవు పెండ్లి
యాడ వీడెను గ్రహణమై నాఁడు మ్రింగి
నా బ్రతుకుఁ జీఁకటి సేసినట్టి దుష్ట
రాహువంటి శాపము నేఁడు రాకుమారి !  

66.వ. అది విననంతనే ఆశ్చర్యములో మునిగియున్నది. సరిక్రొత్తగా సిగ్గులో మునిఁగిపోయినది రాకుమారి. ఆ సమయమునకే అక్కడకు వచ్చి చేఱిన రాజు వారిని జూచి, వివరము కన్గొని యమితానంద భరితుడయ్యి, నేఱక చేసిన పాపములకు తనను క్షమింపుమని రాకుమారుని అడిగెను. రాకుమారుఁడు దొడ్డ మనసుతో రాజుని క్షమించినంతనే, రాజు వారిర్వుఱికి శాస్త్రోక్తముగా వైభవోపేతముగా వివాహము జఱిపించినాఁడు.

రాకుమారియు, రాకుమారుడును కలకాలము సుఖముగా జీవించినారు.

శుభమస్తు. 

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.