ఎవరు జేసిన కర్మ …

ఇప్పుడు నడుస్తున్నది స్పెషలిస్టుల, ప్రొఫెషనలిస్టుల యుగం.

కుక్క చేసేపని కుక్క చెయ్యాల, గాడిద చేసేపని గాడిద చెయ్యాలని పాత సామెత. 

ఈ సామెత వెనకున్న కథ మనకందరికీ తెలిసిందే. తరతరాలుగా మనం వింటూ వచ్చినదే. 
 
 
బళ్లో అయ్యవారు కథ చెబుతున్నాడు…
చాకలివారికీ గాడిదజాతికీ మధ్య బంధం తెగే కాలం దాపురించింది కాబట్టో యేమో, వివరంగా చెబుతున్నాడు.
 
అనగనగా ఒక ఊరిలో ఒక కుక్కనూ ఒక గాడిదనూ పెంచుకుంటున్నాడు ఒక చాకలివాడు. కుక్క చాకలి ఇంటికి కాపలా కాసేది. గాడిద చాకిరేవుకూ ఇంటింటికీ బట్టలు మోసేది. ఒకరోజు పగలంతా బాగా పనిచేసి అలసిపోయి పొద్దుగూకగానే నిద్రపోయినాడు చాకలి. అదే అదనుగా ఒక దొంగ ఆ ఇంట్లో దూరి బట్టలు కాజెయ్యబోతున్నాడు. కడుపునిండా తిన్నదేమో కుక్క, మెదలకుండా పడి నిద్రబోతోంది. దొంగ వచ్చినట్టు తన యజమానికి తానే తెలియజెయ్యాలనుకున్నది గాడిద. క్షణమైనా నిలుకు లేకుండా గట్టిగా ఓండ్రపెట్టసాగింది. మాంచి నిద్రలోవున్న చాకలి మేలుకునేలోగా దొంగ పరారయినాడు. కుక్క మెల్లగా నిద్రలేచింది. కళ్లు నులుముకుంటూ లేచి చుట్టూ చూసిన చాకలికి అనుమానించాల్సిందేమీ అగుపడలేదు. బంగారంలాంటి తన నిద్ర చెడగొట్టిందని గాడిదమీద అతనికి విపరీతమైన కోపంవచ్చింది. దుడ్డుకర్రతో గాడిద వీపున వాతలు తేలేటట్లు కొట్టి, వెళ్లి ముసుగుతన్ని పడుకున్నాడు.
 
 
బళ్లో అయ్యవారు ఈ కథ చెప్పి, పిల్లలను తేరిపారా చూస్తూ ఇందులోని నీతి ఏమిట్రా అన్నాడు. 
 
"ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాల సార్"
"అట్లా కాకపోతే!?"
"వీపున వాతలు పడతాయి సార్"
"ఏమి పడతాయీ?"
"వాతలు పడతాయి సార్"
అయ్యవారు తృప్తిపడ్డాడు. 
 
      ******      ******      ******
 
"దెబ్బలు తింటే తిన్నదిగానీ దొంగతనం జరగకుండా ఆపిందికదా సార్?", అడిగాడొక నల్లటిపిల్లవాడు. 
 
అయ్యవారు ఆలోచనలోపడినాడు. 
 
ఒక నిమిషం గడిచింది. ఇంకో కథ చెప్తా వినండన్నాడు. 
 
అనగనగా ఒక ముంగిస. ఆ ముంగిసను తన ఇంట్లో పెంచుకుంటున్నాడు ఒక రైతు. ఒకనాడు ఆ రైతు, రైతు భార్య, యేడాది వయసున్న తమ కొడుకును ఇంట్లో ఊయలలో పెట్టి పొలానికి పోయారు. ఆ బిడ్డ వైపుగా ఒక పెద్ద పాము రావడాన్ని చూసింది ముంగిస. పాముతో హోరాహోరీ పోరాడింది. చివరికి దాన్ని ముక్కలు ముక్కలుగా కొరికిచంపి వాకిటి బయట కాపలాగా కూర్చొంది. పొలంనుండి వచ్చిన రైతుదంపతులకు రక్తసిక్తమైన నోటితోవున్న ముంగిస, వాకిట్లో రక్తపుధారలు కనిపించాయి. తమ బిడ్డను చంపేసిందనే అనుమానం రావడంతో భోరున యేడ్చింది రైతు భార్య. తన చేతిలోని దుడ్డుకర్రతో ముంగిస తలపై బలంగా ఒక్క దెబ్బవేశాడు రైతు. గుండె చిక్కబట్టుకుని ఒక్క అడుగు లోపలికి వేశాడు. హాయిగా నిద్రపోతున్న తమబిడ్డ, ముక్కలైన పాము శరీరమూ కనిపించినాయతనికి. బయటికొచ్చి చూస్తే, తలపగిలి చచ్చి పడివుంది ముంగిస.
 
 
అయ్యవారు ఈ కథ చెప్పి, నల్లటి పిల్లవానితో అన్నాడు, ఇందులోని నీతి ఏమిట్రా?
"ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాల సార్"
 
"పాముతో పోట్లాడటమూ చంపడమూ ముంగిస చేసే పనేకదా?" 
 
పిల్లవాడు ఆలోచనలో పడ్డాడు. ఒక నిమిషం గడిచింది. 
 
"కోపంలో బాధలో ఏ పనీ చెయ్యకూడదు సార్."
 
అయ్యవారు తృప్తిపడ్డాడు.

ఈ కథల్లోని కుక్క, గాడిద, ముంగిస మాత్రమేగాక చాకలి, రైతు, రైతుభార్య, పాము వంటి పాత్రలన్నీ ఏదో ఒక సందర్భంలో – ప్రయత్నపూర్వకంగానో యాదృచ్చికంగానో – అందరికీ స్వయంగా అనుభవంలోకి వచ్చేవేకదా!
 
      ******      ******      ******

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే …
 
ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాలనే పాఠం నేర్చుకున్న గాడిద ఒకటి మొన్న నాతో మాట్లాడింది.
 
ఇప్పుడు తనకు పనే దొరకడం లేదంటూ వాపోయింది పాపం!

కుక్కలా మొరగడం శ్రద్ధగా సాధన చెయ్యమనిచెప్పి సెలవు తీసుకున్నాను.

 
      ******      ******      ******
This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.