వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – ఐదవ భాగం

కొత్తపాళీ:: కనీసం ఇంకో రెండు అంశాల్ని రుచి చూద్దాము. వర్ణనకి ఇచ్చిన రెండో అంశం, ఒక దృశ్యం. అదిలా ఉంది. మీరొక రైల్లో వెళ్తున్నారు. ఎదురుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళీద్దరూ కనీసం పరిచయస్తులు కూడా కాదు, కానీ ఆ అబ్బాయి కళ్ళల్లో ఆ అమ్మాయి పట్ల ఆరాధన. ఫణి గారి వర్ణనా చాతుర్యం చూద్దాం

ఫణి:: చిత్తం.
చం.

అదియొక రైలు పెట్టె, మరి యందొక బాలుడు యౌవనుండు నా

ఎదురుగ నున్నవాడు కను లెత్తుచు దించుచు జూచుచుండె నో

మదనుని తోడు బుట్టువన మత్తును గొల్పెడు ముద్దరాలి నా

వదనము లోన కాననగు వద్దని జూచిన ప్రేమ భావముల్.

చం.

చదువునొ లేదొ గాని యొక చక్కని పుస్తక ముండె చేతిలో

అది తన మోము గప్పునటు లాయమ లీలగ త్రిప్పుచుండె నీ

రదతతి ఇందు బింబమును రాతిరి కప్పుచు తీయునట్లుగా

చదువుచు తీయుచుండె వనజాక్షియు వానిని రెచ్చగొట్టుచున్.

కం.

ఎచ్చటి కేగునొ యంచును

ఇచ్చికములాడి దాని మచ్చిక సేయన్

వచ్చును మదిలో జంకుచు

అచ్చటనే యుండిపోవు చచ్చర పడుచున్

చం.

హృదయము ముక్కలౌను మతి హీనుని సేయును కంటి చూపుతో

కదలిన గుండె జారు మది కమ్మును మైకము కాలి సవ్వడిన్

రొదరొద సేయు ముంగురులు రూపము జూచుచు సోలె బాలకుం

డదురుచు కూత కూయుచును హాసము సేయుచు సాగె రైలుయున్.

నరసింహారావు:: పాపయ్యశాస్త్రిగారిని జ్ఞాపకం చేసారే.

రాఘవ:: అదియొక రైలు పెట్టె అనగానే నాకు కరుణశ్రీ గురుతొచ్చారండీ. భలే సాగింది మీ వర్ణన.

రాకేశ్వరుఁడు:: టేషను వచ్చేసిందా ?

సనత్:: రైలు నడక లాగానే చుకు చుకు అన్నట్టు బాగా సాగింది నడక.. భేష్

రవి:: ఆ రైల్లో నాకూ వెళ్ళాలనుందండీ, ఇప్పుడే

కామేశ్వరరావు:: రవిగారూ, ఇందాకానేమో కట్నం ఎంతిస్తారన్నారు, ఇప్పుడేమో రైల్లో వేళ్ళాలనుందంటున్నారు… ఏంటి సంగతి? 😉

కొత్తపాళీ:: భలే భలే

రవి:: 🙂

చదువరి:: పద్యాలు బాగున్నాయి

పుష్యం::

అదిరెను మీదు వర్ణనము, ఆగక సాగె’ద’కార ప్రాసతో
పదములు సాగుచుండనిట పచ్చని చేలన రైలు బండిలా
సదరు కథందు నాయకుడు చక్కగ మీరని తోచుచుండె, పో!! 🙂

ఫణి:: ధన్యవాదాలండీ.

రాకేశ్వరుఁడు:: చంపకమాలలు బాగున్నాయి।

కామేశ్వరరావు:: “మదనుని తోడబుట్టువన” కొత్తగా ఉంది ఉపమానం! బాగుంది.

కొత్తపాళీ:: కామేశ్వర .. అవును, మన్మథుడి చెల్లెలన్న మాట

రాఘవ:: కామేశ్వరరావుగారూ, ఏదో తెలుగు పాటలో “నువు మదనుడి మఱదలివా” అని కూడ అడుగుతాడండీ ఒక కవి!

రవి:: కవి గాంచని అందాలు రవి గాంచును

సనత్:: లోగుట్టు పెరుమాళ్ళు కెరుక అనుకునానే… రవి గారికి ఎరుకేనా… ఓహో..

కొత్తపాళీ:: శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి అభిమాన వర్ణన .. చికిలీ చేసిన మన్మథ బాణం అని

కొత్తపాళీ:: ఎందుకంటే ఈ రవి కవి కూడా కాబట్టి .. రవి కాననిది కవి కాంచుతాడు

రాఘవ:: 😀

చదువరి:: 🙂

కామేశ్వరరావు:: ఈ మధ్య వేరే కృష్ణమూర్తి తత్త్వం వంటబట్టించు కుంటున్నట్టున్నారు రవి 🙂

రవి:: రు.:) మొత్తానికి ఒక సరస ఊసరవెల్లి అని తేల్చా

కొత్తపాళీ:: గిరి, ఉన్నారా? మీ రైలు బయల్దేరుతుందా? పచ్చజెండా ఊపండి మరి

గిరి:: ఉన్నాను, ఇదిగో
వర్ణించేవాడు కూడా వరించాలని చూసేస్తున్నాడిక్కడ

ఈ పద్యాలు గిరి స్వరంలో..

ఉ.

నేనొక రైలుపెట్టి కడ నిల్చి ప్రయాణిక పట్టి చూచి, ఓ

హో నను గజ్జి లాగ దవునుంచు యదృష్టము నేడు నవ్వెనే,

కానుక పంపె కోమలిని, కళ్ళెదుటే తన సీటు వేసెనే,

ఈనిన గేద పెయ్యగని ఎంతగ త్రుళ్ళునొ నేడు తెల్సెనే

వ. యని మది తలంచుచు బోగిలోనికి అడుగిడితిని

తే.గీ

కుప్పిగంతు పర్యంతము గుండెకాయ

గాలితేలు వాలకముల కాలినడక

రైలుకూతల మరిపించు ఈలపాట

పువ్వుపూత లనిపించు నవ్వుమొగము

కం.

నాదే, నాదే, నాదే

నాదే, నీ యెదుటి కుర్చి నాదే, నాదే

నీదగ్గర కూర్చొను భా

గ్యోదయ జాతకము, నాదె యోగ్యత నాదే

“అమ్మాయా? అచ్చతెలుగు, పైగా పదహారణాల పంజాబి డ్రస్సు”

“హా, వీడెవడూ??”

సీ.

అమ్మాయి ప్రక్కన ఆషాఢభూతము మాగినపండుపై ఈగలాగ

తీయని చల్లపానీయము లోనున్న పూచిక పుల్లంటి పుడకలాగ….

కుదురుగా కూర్చుంది ఎదురుగా అమ్మాయి ముళ్ళున్న వబ్బాయి ముడ్డిక్రింద

కలువపూరేకుల కన్నులమ్మాయివి మందుతాగినవాడి మైక మిచట

తే.గీ

కోతివేషాలు వేయు కండూతిగాడు

పేలవపు నడత కలదు గాలిగాడు

ఈలొకటి వీడికి, మొహమా? సాలెగూడు

వీడి కెందుకు అమ్మాయి, వేస్టు గాడు?

కం.

“ఏంటో కొందరి వాలక

మేంటో, రైలెక్కి కుదురులేదూ, అమ్మాయ్

ఉంటే లోకమ్ తెలియదు,

అంటే అన్నానని ఎదురంటారేంటో”

చదువరి:: 🙂 🙂

రవి:: 🙂

సనత్:: వహ్వా,.. వెయ్యండో రెండు వీర తాళ్ళు…

కామేశ్వరరావు:: భలే! మళ్ళీ కరుణశ్రీనే వచ్చారే రైలుపెట్టెలోకి! 🙂

పుష్యం:: “దానబ్బ, పయోజగర్భ మొగనాలికి ఇంత విలాసమేటికిన్” అంటారు 🙂

చంద్రమోహన్:: 🙂

రాఘవ:: మళ్లీ కరుణశ్రీ కనుపించాడు…. నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి తరహాలో మొదటిపద్యపు మొదటి పాదం చూచి.

కొత్తపాళీ:: ఈనిన గేద పెయ్యగని ఎంతగ త్రుళ్ళునొ నేడు తెల్సెనే – ఏమి పోలిక బాస్

రాకేశ్వరుఁడు:: వ్యావహారికపద్యోద్యమమా?

చదువరి:: భైరవభట్ల గారన్నట్టు.. మీరు వాడుకభాషా పద్య దురంధరులు

సనత్:: గిరి గారూ! మీకు గోరోజనం కూసింత ఎక్కువే…

కామేశ్వరరావు:: “రైలుకూతల మరిపించు ఈలపాట” 🙂

కొత్తపాళీ:: ఉపమా గిరిధరస్య .. అనుకోవాలి ఇక మీదట

గిరి:: ధన్యవాదాలండీ

రవి:: గిరి గారి హీరో చూడబోతే, అక్కడే ఆ విలన్ని ఛావ చితక గొట్టేట్టున్నారు

సనత్:: కుదురుగా కూర్చుంది ఎదురుగా అమ్మాయి ముళ్ళున్న వబ్బాయి ముడ్డిక్రింద … భలే!

చదువరి:: ఈ పద్యాలు చదివితే.. ఓహో పద్యం రాయడం ఇంత తేలికా అని అనేసుకుంటారు నాబోటివాళ్ళు!

కొత్తపాళీ:: పుష్యం, హబ్బ పయోజగర్భుని గుర్తు తెచ్చారూ, మన కాంపుర వాసిని గుర్తుందా?

పుష్యం:: yes 🙂

రాకేశ్వరుఁడు:: పద్యాల్లో ఆర్యా సినిమా తీద్దాం గిరిగారు ।

ఫణి:: 🙂

గిరి:: ఈనిన గేదె పోలిక – మొదటిసారి రైల్లో పరిసరాల్లో అమ్మాయి ఉందంటే, అలాంటి అనుభవానికి లోనైన వాడి ఉద్వేగం హాస్యంగా చెప్పాలంటే – నాకు అదే తట్టింది

కామేశ్వరరావు:: నిజంగా ఈ పద్యంలో ఉపమానాలు చాలా బాగున్నాయి! మనసులో కసంతా బయటపెడుతున్నాయ్!

……………………………………….

కొత్తపాళీ:: గిల్లీ, దండా, అష్టా, చెమ్మా – వసంతకాల వర్ణన – కామేశ్వర్రావుగారి ముచ్చటైన పూరణ వినిపించమని కోరుతున్నాను

కామేశ్వరరావు:: అలాగేనండి

ఈ పద్యం కామేశ్వరరావు గారి అమ్మాయి శ్రీవాణి స్వరంలో..

మ.కో

మత్తకోకిల మంజులస్వన మష్టదిక్కుల మ్రోయగా

గుత్తుగుత్తుల పూలదండల ఘుంఘుమల్ ప్రసరింపగా

హత్తుకైతల చెమ్మగిల్లి హృదంతరమ్ములు పొంగగా

క్రొత్తయేడు వసంతరాయలు కొల్వు తీరెను చూడుడీ!

రాఘవ:: ఎవఱో కనబడుటలేదూ…

కొత్తపాళీ:: ఇందులో దత్తపదులు ఎక్కడ దాగున్నాయో కనిపెట్టిన వారికో స్పెషల్ వీరతాడు 🙂

రాఘవ:: అష్ట – దండ – చెమ్మ – గిల్లి

సనత్:: కొత్త ఆవకాయ్ ఘుమఘుమ లాగా బావుందండీ మీ పద్యం..

రవి:: మినీ పీ హెచ్ డీ ఇక్కడికిక్కడే ఇవ్వచ్చు

కామేశ్వరరావు:: వసంతానికీ రాయలకీ పోలిక చూపించే ప్రయత్నం

కొత్తపాళీ:: వసంతం నిజంగా ఋతురాజే కదా

రాకేశ్వరుఁడు:: మత్తకోకిల అందం మత్తకోకిలదే గానీ దానిలో దత్తపదులెప్పుడు జారుకున్నాయబ్బా… నేను రెండు సార్లు పోల్చి చూసుకున్నాను ఈ ఏ సమస్యాయని, తెలియలేదు। !!!

ఫణి:: అధ్భుతంగా ఉంది.

చదువరి:: హాయిగా పాడుకునేట్టుగా ఉంది పద్యం

కొత్తపాళీ:: రాకేశ్వర, అదే ఈ పూరణలోని మహత్యం. పదాల్ని విరవకుండానే అంత లాఘవంగా పొదిగేశారు పద్యంలో.

రవి:: ఇది కామేశ్వరరావు గారి చమత్కారం. ఆయనకు పరీక్ష పెడితే, తిరిగి ఆయన ఇచ్చిన రిటార్టు.

గిరి:: బావుంది

రవి:: మీరే వెతుక్కోండని

రాకేశ్వరుఁడు::

మత్తకోకిల ఎత్తుకొన్నరు మత్తకోకిల తోడనే
ఉత్తపద్యము కాదులేయిది ఉత్తమం యిది పద్యమే!
మొత్తమున్ యిక వ్రాయ లేనులె ముత్తెమంటిది పద్యమున్

కామేశ్వరరావు:: విరవలేదు కలిపేసాను కూడా, “చెమ్మగిల్లి”లో 🙂

చదువరి:: 🙂

గిరి:: మత్తకోకిల నడకే నడక – మీరు నడిపించిన తీరే తీరు

కొత్తపాళీ:: గిరి, మత్తకోకిల నడవదు. కూస్తుంది. అంచేత పద్యంలో ఉండేది లయ, నడక కాదు 🙂

గిరి:: కొత్తపాళీ గారు, సరే – కూతే కూత, కూయించిన తీరే తీరు అని చదువుకోండి.

……………………………………..

కొత్తపాళీ:: కాసేపు జాలమహిమని తల్చుకుని మనందరం పరిచయం కావడానికి మూల కారణమైన తెలుగు బ్లాగుల్ని గుర్తు చేసుకుందాం. చదువరి గారూ కూడలి, హారం, జల్లెడ, పొద్దు – బ్లాగుల ప్రశస్తి గురించి సీసం

చదువరి:: ఒక్క క్షణం..

సీ.

ఈ పద్యాలు చదువరి స్వరంలో..

బహుళంగ బ్లాగంగ బ్లాగ్గంగ పొంగంగ ఒడుపుగా కూడలి ఒడిసి పట్టు

టప టపా లెన్నియో టపటపా రాలంగ టకటకా హారమ్ము టముకు వేయు

వేలాది బ్లాగుల్ల వేవేల వ్యాఖ్యల్లు! జాలాన జల్లించు జల్లెడదియె

పద్యాల పుష్పాలు పరికింప పొద్దెక్కె పొద్దువైపే జూచు పూల పగిది

తే.గీ

దిక్కు చూపించ కూడలి రెక్కమాను

తారలా లింకు హారాన తళుకు లీన

జాల జగమందు జల్లెడ జాడ జూప

పొద్దు చేరంగ వచ్చు ఏ పొద్దు నైన

కొత్తపాళీ:: బాగు బాగు

చంద్రమోహన్:: రెండు రెండు సార్లు తెచ్చారు దత్త పదులని. డబుల్ ధమాకా!

ఫణి:: భేష్!

రవి:: ఎత్తుకోవడమే చాలా అందంగా ఉంది.

కొత్తపాళీ:: ha ha ha .. two for one sale

రాఘవ:: చదువరిగారనిపించారు

రవి:: గుర్రం తోలుతున్నట్టుంది

పుష్యం:: చాలా బాగుంది.

కామేశ్వరరావు:: దత్తపదాలని ద్విగుణికృతం చేసి మరీ పూరించారే! చాలా బాగుంది!

సనత్:: బాగు బాగు.. బ్లాగు బ్లాగు

మురళి:: కూడలి రెక్కమాను వహవ్వా

గిరి:: double whammy

రాకేశ్వరుఁడు:: చదువరి గారు మీ ముంగటేటి సీసపద్యాలు కూడా ఇంతే బాగున్నాయి। వచ్చేయేఁడు కూడా మీరు సీసపద్యాలు తప్పకవ్రాయగలరు।

కొత్తపాళీ:: రవీ, మీ పద్యం

రవి:: చిత్తం

సీ.

ఈ పద్యాలు రవి స్వరంలో..

మురిపెంపు మాటల ముత్యపు కూడలి ఇంపగు హైకూల కెంపు గూడు

అచ్చమౌ కైతల పచ్చల హారము పుష్యరాగపు పస పుస్తకాలు

వివిధపు వార్తల వింతనౌ జల్లెడ కథల గోమేధిక కాణయాచి

ధాటియౌ చర్చల ధీటగు వజ్రము కొంగ్రొత్త తలపుల కొత్త పొద్దు

తే.గీ

నిడివి చిన్నదౌ ట్విట్టరు నీలమణియె

విధవిధపు ఛాయచిత్రాలు విద్రుమాలు

నేటి యుగమున వచ్చిన మేటి రవ్వ

తెలుగు బ్లాగు, జాలము నందు వెలుగు లీను

రాఘవ:: హైకూతలు కూడ కూస్తున్నారే రవికోకిలవారు!

రవి:: అయిపోయింది. మరీ ఉత్ప్త్రేక్ష్యాలంకారాలెక్కువయాయేమో తెలియదు

కొత్తపాళీ:: హ హ హ, రాఘవా

పుష్యం:: ‘పుష్యరాగపు’ — ఎవరైనా పిలిచారా నన్ను?? 🙂

రాఘవ:: ఏమండోయ్ పు.శ్యాం. గారూ, మిమ్మల్ని కాకాపడుతున్నారు.

మురళి:: భేష్!నిడివి చిన్నదౌ ట్విట్టరు నీలమణియె

రాకేశ్వరుఁడు:: అన్నమయ్య ముద్దుగారే యశోద పాట గుర్తుతెచ్చింది

కొత్తపాళీ:: ఎక్కువవడం ఏంటి, పద్యం మొత్తం ఉన్నదే ఉత్ప్రేక్షలయితే .. అదీ ఒక సొగసే

చదువరి:: ఇచ్చిన సమస్యకు సరిగ్గా సరిపోయింది పూరణ!

గిరి:: భలే పొదిగారు పద్యంలో రాళ్ళన్నీ

రవి:: 🙂

కొత్తపాళీ:: చివరిగా .. బాలకవి రాఘవ వర్ణన. రాఘవా .. మీ పొద్దు సీసం ..

రాకేశ్వరుఁడు:: బాలకవి – యుగాటాబి కిడ్డింఙ్మీ 🙂

రాఘవ:: అవధరించండి

సీ.

ఎవ ఱేమి చెప్పిన నెట కేగవలయునో వివరించు కూడలి వీధిపెద్ద

పలుకుల ముత్తెముల్ పైఁడి తీవెనుఁ గుచ్చ నచ్చంగఁ దెలుఁగింటి హార మమరు

మాటలందునఁ గొప్ప మాటలఁ జల్లించి చదివించు జల్లెడ మొదటిజల్లు

సరసోక్తి మేల్కొల్పి సారస్వతపు పెనునిద్దుర వదిలించు ప్రొద్దుపొడుపు

ఆ.వె.

అజుని సృష్టియైన నిజవసుంధర కాదు

గాధిసుతుని సృష్టి కానె కాదు

మనుజ లోకమందు మఱి యేమి టన్నచో

నాక మిద్ది బ్లాగు లోక మిద్ది

మురళి:: బహుబాగున్నది మీ సుద్ది:)

కొత్తపాళీ:: భలే భలే ..

ఫణి:: అదిరింది.

గిరి:: అద్ది

రాకేశ్వరుఁడు:: ఱ వుంది । చాలు ఈ పుటకు పులావు తిన్నట్టే.

పుష్యం:: రాకేశ్వర – ‘పలావొక్కింతయు లేదని అన్నట్టున్నారు – మీకెక్కడ దొరికింది??

రాకేశ్వరుఁడు:: ఱ చూడండి- అచ్చం పులావునిండిన ప్లేటులా లేదు 🙂

కొత్తపాళీ:: విశ్వామిత్రులు ఇప్పటికే నిష్క్రమించారు, లేకపోతే ఆయనకి కోప మొచ్చేది

కామేశ్వరరావు:: చాలా సొగసుగా సాగింది!

రాఘవ:: 🙂

రవి:: ఇందులో కూడా ఉత్ప్రేక్ష్యలున్నాయి. నాక మిద్ది 🙂

రాఘవ:: 🙂

కామేశ్వరరావు:: స్వర్గముండేది పైనే కదా 🙂

చదువరి:: బ్లాగులోకం స్వర్గమంటారైతే? 🙂

రాఘవ:: మిద్దె అంచుల్లో నాకమంటారా! 🙂

కొత్తపాళీ:: కామేశ్వర, మిద్దెక్కితే, స్వర్గమే నంటారా?

కొత్తపాళీ:: రాఘవ LOL. ha ha ha

చదువరి:: రాఘవ:: 🙂

కామేశ్వరరావు:: 🙂

రాఘవ:: 😀

రవి:: బ్లాగు లోక మిద్ది అని కూడా అన్నారు. 🙂 అంటే, బ్లాగులోకపు మిద్దె లో నాకముంటుందని భావం.

కొత్తపాళీ:: అవున్లే, అవన్నీ గగన విహారియౌ రవికి తెలుస్తాయి

రాఘవ:: పండితులు ఎన్ని అర్థాలైనా తీయగలరు.

రవి:: బ్లాగు పండితులు? 🙂

చంద్రమోహన్:: బ్లాండితులు!

రాఘవ:: చంద్రమోహనులవారూ, మీరు ఒక అడుగు ముందుకు వేశారే! 🙂

పుష్యం:: ఎన్నో అర్ధాలని పిండేవారిని ‘పిండితు’లంటారేమో ..

రాకేశ్వరుఁడు:: 🙂

రాఘవ:: హిహ్హిహ్హీ 😀

సనత్:: భలే భలే

కామేశ్వరరావు:: పుష్యంగారు- హహహ!

చదువరి:: పిండితులు – భలే! 🙂

కామేశ్వరరావు:: మొత్తానికి బ్లాగ్లోకాన్ని ఆకాశానికెత్తేసారు!

రవి:: ఉట్టి కెగిరిందండీ. స్వర్గానికి ఎగురలేదు

కొత్తపాళీ:: మిత్రులారా, మనం పెట్టుకున్న గడువు ముగిసింది. మీ అందరి సరస కవిత్వ ధారలో నాలుగ్గంటలు మునకలేసి దిక్కు తెలీకుండా కొట్టుకుపోయినాయి

మురళి:: సమయపాలనలో మనం తెలుగువారనిపించుకుంటున్నాం!

రాఘవ:: 🙂

రవి:: 🙂

కొత్తపాళీ:: ఈ సారి పూరణల్లో వందకి పైగా పద్యాలు వచ్చాయి. అన్నీ ఇక్కడ ప్రదర్శించడం అసాధ్యం

రవి:: వచ్చే యేడాది ప్రశ్నపత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు?

కొత్తపాళీ:: ఉత్సాహంగా పాల్గొని రక్తి కట్టించిన మీకందరికీ పేరు పేరునా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. పలువురు కవిమిత్రులు వారివారి పనుల వల్ల ఈ ప్రత్యక్షసభలో పాల్గొనలేక పోయారు. పొద్దులో ఈ సభా కార్యక్రమ విశేషాల్ని ప్రచురించినప్పుడు, సభలో చెప్పకుండా ఉండిపోయిన మరికొన్ని రసవత్తరమైన పద్యాల్ని కూడా ప్రస్తావిస్తాము.

ఆహూతులై వచ్చిన ప్రేక్ష అతిథులకి కూడా నమస్కారాలు తెలియ చేసుకుంటున్నాను

చదువరి:: సభను రసవత్తరంగా జరిపించిన మీకూ మా నెనరులు.

సనత్:: మాకీ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు

కామేశ్వరరావు:: ఎప్పటిలా చాలా చక్కగా నిర్వహించిన బ్లాగ్రాయల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

చంద్రమోహన్:: అద్భుతమైన కవిత్వాస్వాదనం! నెనర్లు!

కొత్తపాళీ:: రాఘవా, ఏమైనా స్వస్తి పద్యం చెబుతారా?

రాఘవ::

రక్తి కట్టెను సభ రతనాలె పద్యాలు

గనులు గాని మీరు కవులు కారు

పద్యవిద్య నేడు హృద్యమయ్యెను గాన

వందనములు మీకు వందనములు

రాఘవ::

మంగళము సభాపతికిని
మంగళమగుగాక సభకు మహినిఁ గవులకున్
మంగళము సర్వజనులకు
మంగళమయ మూర్తియైన మాధవుడిడుతన్

మఙ్గలాశాసనపరైర్మదాచార్యపురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైస్సత్కృతాయాస్తు మఙ్గలమ్

~~~~~~~~~~~~~~~~~

కవిసమ్మేళనంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని తమతమ పూరణలను సమర్పించడమే కాకుండా సాటి కవుల పూరణలను, సరస సంభాషణలనూ ఆస్వాదించి, సద్విమర్శలు చేసి, ఇతరులు చేసిన విమర్శలను సహృదయంతో స్వీకరించి సమ్మేళనాన్ని విజయవంతం చేసిన కవివరులందరికీ పొద్దు నెనరులు తెలుపుతోంది. కోరిన వెంటనే తమ పద్యాలను పాడి రికార్డు చేసి మాకు పంపించినందుకు కూడా వారికి నెనరులు తెలుపుకుంటున్నాం.

సదస్సులో ఉత్సాహంగా పాల్గొని, పద్యాల మంచిచెడులను నిశితంగా పరిశీలించిన రసహృదయులైన ప్రేక్షకులకు పొద్దు నెనరులు తెలుపుతూ, భావి సమ్మేళనాలలో తమతమ పద్యాలను వినిపించేందుకు సన్నద్ధం కావలసినదిగా కోరుతోంది.

ఈ పద్య కవి సమ్మేళనాన్ని నిర్వహించడంలో -సమస్యలను రూపొందించడం నుండి, కవులకు ప్రేక్షకులకు ఆహ్వానాలు పంపించడం, వందకు పైగా వచ్చిన పూరణలను పరిశీలించి యోగ్యతానుసారంగా సమ్మేళనంలో సమర్పించేందుకు ఎంచడం, సమ్మేళనాన్ని కడు సమర్థవంతంగా నిర్వహించడం వరకు అన్ని పనులనూ నారాయణస్వామి (కొత్తపాళీ) గారు స్వయంగా సమన్వయపరచారు. వారి ఉత్సాహ, ప్రోత్సాహాలే ఈ కవిసమ్మేళనాల విజయం వెనుక ఉన్న చోదకశక్తి. వారికి పొద్దు శతథా నెనరులు తెలుపుకుంటోంది.

…………………

నిర్వహించిన విధానం:

  • కొత్తపాళీగారు ముందుగా ఆసక్తిగల కవులకు, ప్రేక్షకులకూ ఆహ్వానాలు పంపించారు.
  • ఆ తరువాత పాల్గొనదలచిన కవులకు సమస్యలు, దత్తపదులు, అనువాదం, వర్ణనాంశాల జాబితాను పంపించారు.
  • ఈ జాబితాను పంపించాక, సుమారు రెండు వారాల గడువు ఇచ్చారు. గడువు లోపు కవులంతా తమ పూరణలను కొత్తపాళీగారికి పంపించారు.
  • గడువు తరువాత 2010, మార్చి 13 శనివారంనాడు, అంతర్జాలంలో పొద్దు ఏర్పాటు చేసిన కబుర్ల గదిలో (చాట్ రూమ్) కవులంతా కొత్తపాళీ గారి అధ్యక్షతన సమావేశమయ్యారు. అప్పటివరకు వచ్చిన పూరణల్లోంచి ఉత్తమమైన వాటిని ఎంచిపెట్టుకున్న కొత్తపాళీ గారు ఒక్కొక్క సమస్యనూ తీసుకుని ఎంపిక చేసిన పద్యాన్ని సమర్పించమని కోరుతూ ఉంటే ఆయా కవులు తమ పద్యాలను సభలో సమర్పించారు.

సదస్యులు చేసిన సరస సంభాషణలు సభ ఆహ్లాదంగా నడవడంలో దోహదపడ్డాయి. సందర్భోచితంగా కవులూ ప్రేక్షకులూ ఉటంకించిన సాహిత్య విశేషాలు సభకు వన్నె చేకూర్చాయి. సభ విశేషాలను సాధ్యమైనంతవరకు, దేన్నీ వదలకుండా ప్రచురించడానికే ప్రయత్నం చేసాం. ఈ సమ్మేళనంపై, పద్యాల బాగోగులపై రసహృదయులైన మా పాఠకుల నుండి స్పందనలను కోరుతున్నాం.

————————–

(ఇంతటితో వికృతి ఉగాది పద్యకవి సమ్మేళనం నివేదిక సంపూర్ణం)

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

6 Responses to వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – ఐదవ భాగం

  1. sUryuDu says:

    Very interesting.

    ~sUryuDu 🙂

  2. ఫణి says:

    కామేశ్వర రావు గారూ, మీ అమ్మాయి చక్కగా పాడిందండీ. చదువరి గారు కూడా రాగయుక్తంగా పాడారు. మన పాటకు జడుసు కొంటారని నేనా ప్రయత్నం చేయలేదు.
    ఫణి

  3. ఫణి says:

    రవి, గిరి గార్ల ఆడియో యెందుకో ముందు వినబడలేదు. అవీ వినసొంపుగా ఉన్నాయండి.

  4. జాన్‌హైడ్ కనుమూరి says:

    after reading these i wish to write
    i will try for next ugadi

  5. Let’s give credit where it is due. 🙂
    1. సమస్యలు దత్తపదుల ఎంపికలో కామేశ్వర్రావుగారు చాలా సహాయం చేశారు. రాకేశ్వర కూడా ఓ చెయ్యి వేశాడు. క్లిష్ట ప్రాస, అసాధారణ ఛందస్సుతో (మత్తకోకిల) ఉన్న రాణ్మహేంద్ర సమస్య రాకేశ్వరునిదే.

    2. ఈ సారి నాకు తీరిక లేక, సమస్యలు దత్తపదులు చాలా మట్టుకి గరికపాటి వారి సహస్రావధానం పుస్తకంలోంచి తీసుకున్నాను. అవి నా స్వకపోల కల్పితాలు కావు.

    3. మా తొలి ఆహ్వానం చూసి పలువురు యువకవులు తమంత తాము ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. వారికి అభినందనలు.

    4. మెచ్చదగిన పూరణలు పంపిన కోందరు కవులు ప్రత్యక్ష సభలో పాల్గొన లేక పోయారు. ఆ పూరణలన్నీ కలిపి ఆరో భాగాన్ని చివరి భాగంగా ప్రచురిస్తే బాగుంటుందని నా ప్రతిపాదన.

    5. నిర్వాహకులుగా మనం ఎంత ఉత్సాహం చూపినా, ఎన్ని ఆలోచనలు చేసినా, అంతిమంగా సభ విజయం పూర్తిగా పాల్గొన్న కవుల సృజనాత్మక శక్తిమీదనే ఆధారపడి ఉన్నది. ఏదో గణాలు కిట్టించాము అన్నట్టు కాకుండా చక్కటి భావ సిద్ధితో, బహుచక్కని భాషా పాటవంతో కవితా సృష్టి చేసిన కవులదే ఈ విజయం, నిస్సందేహంగా.

  6. వికృతి పద్యకవితా సదస్సులో ప్రేక్షకునిగా పాల్గొనే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను. సమ్మేళనం ఆద్యంతమూ నన్ను బాగా ఆకట్టుకుంది. ఇంత దిగ్విజయంగా సభను నడిపిన అధ్యక్షులవారికీ, కవిపుంగవులందరికీ నా శుభాకాంక్షలు!

Comments are closed.