మృతజీవులు – 32

-కొడవటిగంటి కుటుంబరావు

“నజ్ ద్ర్యోవా! నిజంగా?”

“ఏం, అతని బుద్ధే అంత. తన తండ్రిని అమ్మటానికి చూశాడు తెలుసా, మరీ అన్యాయం పేకాటలో పణం పెట్టాడు.”

“ఎంతచిత్రమైన విషయాలు చెబుతావమ్మా! నజ్ ద్ర్యోవ్ కు ఈ వ్యవహారంలో జోక్యం ఉంటుందని నేను చచ్చినా ఊహించి ఉండను.”

“నేను మటుకు మొదటి నుంచీ అనుకుంటూనే ఉన్నాను.”

“నిజంగా, ఈప్రపంచంలో ఎలాటివి జరుగుతాయో! చిచీకవ్ మొదట ఇక్కడికి వచ్చినప్పుడు, నీకు జ్ఞాపకం ఉందేమో, ఇంత రభస చేస్తాడని ఎవరనుకున్నారు? అయ్యొ, అన్నాగ్రిగోర్యెవ్న, నేనెంత కంగారులో ఉన్నానో నీకు తెలిస్తేనా! నీ స్నేహమూ, ఆపేక్షా ఉండబట్టి సరిపోయిందిగాని…నేను దిగులుపడి పోయేపనే! మన సంగతి ఎలావచ్చిందో! నేను చచ్చేట్టు పాలిపోవటం చూచి మా మాష్క, ‘అమ్మగారూ, మీరు చచ్చేట్టు పాలిపోయారు,’ అన్నది. ‘మాష్క, ఆ సంగతి ఇప్పుడు జ్ఞాపకం చెయ్యకు ‘, అన్నాను. “ఎంతపని జరిగిందీ! అయితే నజ్ ద్ర్యోవ్ కూడా ఇందులో ఉన్నాడూ! ఇంకేమనాలి!”

ఈ లేచిపోవటం గురించిన వివరాలు, ఎన్ని గంటలకు లేచిపోదామనుకున్నదీ మొదలుగాగల విషయాలు, తెలుసుకోవాలని ఒయ్యారిభామకు ఎంతో ఆశకలిగింది. కాని ఒప్పులకుప్ప తన కాసంగతులేవీ తెలియవన్నది. ఆవిడకు అబద్ధం చెప్పటం చాతకాదు. తాను వాస్తవం ఊహించాననుకోవటం దారివేరు, అప్పుడుకూడా ఆ ఊహ మనోవిశ్వాసం పైన ఆధారపడాలి. ఆమె మనసులో విశ్వాసం ఏర్పడితేచాలు, తన అభిప్రాయాన్ని ఎంతబలంగానైనా సమర్ధించుకో గలదు. ఇతరుల అభిప్రాయాలను మార్చటంలో ప్రజ్ఞగల ఎంతో గొప్ప లాయరు తన ప్రజ్ఞను ఆమెమీద ప్రయోగించినట్టయితే మనో విశ్వాసమంటే ఏమిటో ఆయనకు తెలిసివస్తుంది.

ఈ స్త్రీలిద్దరూ మొట్టమొదట అనుకోటాలుగా ప్రారంభించిన విషయాలను చివరకు వాస్తవంగా పరిగణించారంటే అందులో విడ్డూరమేమీ లేదు. విద్యాధికులమనుకునే మనమే అలా ప్రవర్తిస్తాం, ఇందుకు సాక్ష్యం మన సిద్ధాంతాలే.

… పురుష ప్రకృతి నిరుపయోగమైనది. వాళ్లు ఇళ్ళు దిద్దుకోలేరు, ఒకమాట మీద ఉండలేరు, దేన్నీ గట్టిగా నమ్మలేరు, వాళ్ళకు అన్నీ అనుమానాలే. వాళ్లు ఇదంతా అర్థంలేని సంగతి అన్నారు, గవర్నరు కూతుర్ని లేవదీసుకుపోవటం అశ్విక సైనికాధికారులు చేసేపని అనీ సివిలు ఉద్యోగులు చేసేపని కాదనీ, చిచీకవ్ అలాటి పనిచెయ్యడనీ, ఆడవాళ్లు అర్థంలేని మాటలు మాట్లాడతారనీ …

ఈ సిద్ధాంతాలను మొట్టమొదటగా మనపండితులు భయభక్తులతో సమీపిస్తారు; పిరికిగా, నమ్రతగా, జాగ్రత్తగా, “దీనికి వ్యుత్పత్తి ఇదే అయి ఉండకూడదూ? ఫలానికి దేశానికి ఆ పేరు ఫలాన్ని స్థలాన్ని బట్టి వచ్చి ఉండవచ్చుగదా?” లేకపోతే, “ఈ పత్రానికీ దీనితరువాతి దానికీ సంబంధంఉన్నట్టు స్ఫురించటం లేదా? లేకపోతే, “ఈ పేరుగల జాతికి చెందినవారు ఆ యీ జాతుల వారేనని మనము ఊహించటానికి అవకాశ మున్నదిగదా?’ అంటూ ప్రారంభిస్తారు. తరవాత తమ ఊహలను సమర్థించటానికి ఆ ప్రాచీన రచయితనూ, ఈ ప్రాచీన రచయితనూ ఉదహరిస్తారు. తమ ఊహకు ఆధారం కాస్త దొరికితేచాలు, దొరికినట్టు కనిపిస్తేనే చాలు, దైర్య విశ్వాసాలతో ప్రాచీన రచయితలను పరామర్శిస్తూ, వారిని ప్రశ్నించి తామే సమాధానాలు చెబుతూ, తాను పిరికిగా ఒక ఊహతో బయలుదేరానన్నది మరచిపోతారు. తాము నిజం గ్రహించామనీ, అంతా స్పష్టమయిందనీ అనుకుని తమవాదనను ఈ విధంగా పూర్తి చేస్తారు: “ఇది ఇలాగూ; ఈ పేరుగల మనుషులు వీరే! మనం ఈ విషయాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి!” ఈ విధంగా సిద్ధాంతం వేదికపైనుంచి వెలువడి, ప్రపంచం చుట్టిరావటానికి బయలుదేరి, శిష్యులనూ, అనుయాయులనూ సంపాదించుకుంటుంది.

ఈ యువతీద్వయం ఈ క్లిష్టమైన వ్యవహారాన్ని ఎంతో తెలివిగానూ, విజయవంతంగానూ అంతు తేల్చే సమయంలో, చెక్క మొహమూ, దట్టమైన కనుబొమ్మలూ, చిట్లించే కళ్లూ వేసుకొని పబ్లిక్ ప్రాసిక్యూటరు గదిలోకి చక్కా వచ్చాడు, సంగతంతా ఆయనకు విశదీకరించటానికి ఒకరితో ఒకరు పోటీపడుతూ ఆ స్త్రీలు, చచ్చిన మనుషుల కొనుగోలు విషయమూ, గవర్నరు కూతుర్ని లేవదీసుకుపోయే ప్రయత్నం విషయమూ చెప్పి, ఆయనను ఎంత అయోమయంలో పడేశారంటే, ఆయన వాళ్లు చెప్పేదానికి తలా తోకా తెలియక అలాగే నిలబడిపోయి, ఎడమకన్ను చిట్లిస్తూ, తన గడ్డంలో పడిన నస్యాన్ని చేతిరుమాలతో దులుపుకున్నాడు. అందుకని ఆ స్త్రీలు ఆయనను అక్కడే ఉండనిచ్చి చెరొక దారినా నగరమంతా వెతకటానికి బయలుదేరారు. ఈపనివారు సాధించటానికి అరగంటకు కొంచెం జాస్తి కాలం పట్టింది. నగరమంతా కెలుకుడుపడిన మాటకూడా నిజమే; అంతా గందరగోళమై పోయింది. ఏమనుకోవాలో ఏవరికీ తోచలేదు. ఈ స్త్రీలు ప్రతిమనిషికీ ఎలాటి దిగ్భ్రమ కలిగించారంటే, అందరూ, ముఖ్యంగా అధికారులు, ఉక్కిరి బిక్కిరి అయారు. నిద్రపోయే కుర్రాడిముక్కులో తోడివాళ్ళు నస్యం పెడితే ఏమవుతుందో మొదట్లో వారిగతి అదే అయింది; నిద్రలో దీర్ఘంగా గాలిపీల్చేసరికి నస్యంలోపలికి వెళ్ళి వాడు కాస్తా తుళ్ళిపడిలేస్తాడు, తాను ఎక్కడున్నది కూడా తెలియక, వెర్రి వాడిలాగా కళ్లు వెళ్ళుకొస్తూ కలయజూస్తాడు, తనకేమయినదీ తెలుసుకోలేకపోతాడు, ఆ తరవాత వాడికి పరిచితమైన గోడలమీద ఏటవాలుగా పడే సూర్యకిరణాలు కనిపిస్తాయి, మారుమూలల దాగియున్న మిత్రుల కేరింతలు వినిపిస్తాయి, కిటకిలోనుంచి చూస్తే బయట ఉదయపుకాంతితో నిద్రమేలుకుంటున్న అడవిపక్షుల కలకలాలూ, అక్కడక్కడా తుంగలచాటున మాయమవుతూ మెరిసే నదీ, ఒకరినొకరు స్నానానికి రమ్మని పిలుచుకునే మొండిమొల కుర్రాళ్ళూ చూస్తాడు-తన ముక్కులో ఏం పెట్టారో వాడికి చిట్టచివరకు తెలుస్తుంది.

మొట్టమొదట నగరవాసులస్థితీ, అధికార్లస్థితీ అచ్చు ఇలాగే వుండింది, ప్రతివాడూ గొర్రెలాగా గుడ్లు వెళ్ళబెట్టి అలా నిలబడి పోయాడు. చచ్చిన కమతగాళ్ళతోనూ, గవర్నరు కూతురితోనూ, చిచీకవ్ తోనూ వాళ్ల బుర్రలు కలవరపడిపోయాయి. కొంతకాలం గడిచాక, వాళ్ళు కాస్త తెప్పరిల్లుకున్న మీదట వాళ్ళు వీటిని దేనికదిగా వేరుచేయగలిగి, అప్పటి వ్యవహారం అంతుచిక్కగపోగా ప్రశ్నలడగటమూ, విసుక్కోవటమూ చేశారు. “దీనికి సరి అయిన అర్థమేమిటి? ఈ చచ్చిన మనుషుల మాటేమిటి, చచ్చిన మనుషులంటే అర్థమేమిటి, వాళ్ళని ఎలా కొనటం? వాళ్లను తీసుకునేటంత బుద్ధిహీనుడెవడుంటాడు? వాళ్ళకోసం డబ్బివ్వటంకూడానా? దీంతో గవర్నరు కూతురు కేమిటి సంబంధం? దాన్ని లేవదీసుకుపోదలచిన వాడైతే చచ్చినవాళ్ళను కొనడం దేనికీ? వాళ్ళనేమన్నా కానుక పెడతాడా ఏమిటి? ఈ ఊళ్ళో ఎంత అర్థంలేని కబుర్లు ప్రచారమవుతాయో! రానురాను ఇలా అయిందేం? ఇలా తిరిగేసరికల్లా నీమీద ఏదో అభాండం వేస్తారాయె, దానికి తలాతోకా ఉండదాయె…అయినా అందరూ చెప్పుకుంటున్నా రాయిరి, అందుకేదో కారణం ఉండే ఉంటుందీ? బొత్తిగా ఏ కారణమూ లేదు. అంతా బొల్లికబుర్లు, శుద్ధాబద్ధం, వట్టిసొళ్ళు, సింగినాదం జీలకర్ర! పనిలేకపోతే సరి!…” ఇంతకూ ఎక్కడబట్టినా ఇదే చర్చ, అందరూ చచ్చిపోయిన వాళ్లను గురించీ, గవర్నరు కూతుర్ని గురించీ, చిచీకవ్ గురించీ మాట్లాడుకునేవాళ్ళే, పెద్దరభస సాగింది. అంతవరకూ నిద్రావస్థలో ఉండిన నగరం కాస్తా సుడిగుండంలా అయిపోయింది. అదివరదాకా డ్రెసింగ్ గౌన్లు వేసుకుని ఏళ్ళతరబడి ఇంట్లోనేపడి ఏడుస్తూ, బూట్లు బిగువైనాయని బూట్లు కుట్టేవాణ్ణో, దర్జీ వాణ్ణో, తాగివచ్చి బండితోలేవాణ్ణో తిట్టుతూ ఉండిన జడ్డుగాళ్లూ, సోమరిపోతులూ తమ కలుగుల్లోనుంచి బయటికివచ్చారు; ఎన్నో ఏళ్లుగా తమ మిత్రులను చూడటం మానేసి నిద్రాదేవతను వరించి పిల్లులను పోట్లాటకు పెట్టేవాళ్లూ (అంటే గురకపెట్టి నిద్ర పోయేవాళ్ళూ) విందుకు వెళ్లితే అయిదువందల రూబుళ్ల ఖరీదు చేసే చేపల సూప్ రుచిచూడ వచ్చుననీ, ఆరడుగుల స్టర్జిన్ చేప తినవచ్చుననీ, నోట్లో వేసుకుంటే కరిగిపోయే వంటకాలుంటాయనీ అన్నప్పటికీ కదలనివాళ్ళూ ఇప్పుడు కదిలారు. ఇంతెందుకు? నగరం ఎంతో సందడిగానూ, ప్రాముఖ్యం గలదిగానూ, జనసమర్థంకలదిగానూ ఉన్నట్టు కనబడింది. ఎవరూ ఎన్నడూ వినివుండని ఒక సీసోయ్ పఫ్నూతివిచ్ అనేవాడూ, మక్టోనల్డ్ కర్లోవిచ్ అనేవాడూ అకస్మాత్తుగా నలుగురిమధ్యా కనిపించారు. చేతిని కట్టులో దూర్చుకుని ఒక అతిపొడుగైన సన్నటివాడు-అంత కన్న పొడుగైనవాణ్ణి ఎవరూ చూసివుండరు-డ్రాయింగ్ రూముల్లో ప్రత్యేకంగా కనబడసాగాడు. కిటికీలు మూసిన బళ్లూ, కొత్తరకం వాహనాలూ వీథుల్లో చప్పుడుచేస్తూ తిరగసాగాయి-అంతా కల్లోలమయింది. ఇదే మరొకప్పుడయినా పరిస్థితులు మరోరకంగా వుండినా ఇలాటిపుకార్లు, ఇంత సంచలనం కలిగించేవి కావేమోగాని, ఈ నగరంలో ఎటువంటి వార్తగాని పొక్కి చాలాకాలమయింది, మూడు నెలలుగా ఈ నగరానికి ఎలాటి వార్తలూ రాలేదు, నగరాలకు సరకు రవాణాలు ఎంత అవసరమో ఇవీ అంత అవసరమే. నగరంలో సాగే చర్చలలో రెండుదృక్పథాలు ఏర్పడినట్టు స్పష్టమయింది. మగవాళ్లూ, ఆడవాళ్లూ రెండుపార్టీలయారు. హేతువాదం అవలంబించని పురుషులు చచ్చిపోయిన కమతగాళ్ళమీద పట్టించారు, ఆడవాళ్ళు కేవలం గవర్నరు కూతురిని లేవదీసుకుపోవటంలో నిమగ్నమైపోయారు.

నిజానికి క్రమశిక్షణా, జాగరూకతా ఆడవారిలోనే హెచ్చుగా కనబడ్డాయి, అందుకు వారిని అభినందించాలి. వాళ్ళకి విషయమంతా అచ్చుగుద్దినట్టు స్పష్టంగా గోచరించింది. కళ్ళకు కట్టినట్టున్నది, అంతా అర్థమైపోయింది. చిచీకవ్ ఎన్నో మాసాలుగా ప్రేమతో ఉన్నాట్ట, వాళ్ళు తోటలో వెన్నెట్లో కలుసుకునే వారుట, చిచీకవ్ కు కట్టుకుపోయినంత ఉండటాన గవర్నరుగారు అతనితో సంబంధానికి ఇష్టపడ్డాట, అయితే అతను వొదిలేసిన పెళ్ళాం అవాంతరమై కూచుందిట (చిచీకవ్ కు పెళ్ళి అయిందని ఎలా తెలుసుకున్నదీ ఒక్కరూ ఎరగరు), భర్త అంటే పడిచచ్చే ఆ భార్య గుండె బద్దలై గవర్నరుకు ఎంతో జాలిగా ఉత్తరం రాసిందట, ఆ భార్యా భర్తలు ఒప్పుకోరని రూఢి చేసుకుని చిచీకవ్ లేవదీసుకుపోవటానికి నిశ్చయించాట్ట. కొన్ని ఇళ్ళలో ఇదేకథను కొంచెంమార్చి చెప్పుకున్నారు:అసలు చిచీకవ్ కు పెళ్లామే లేదుట, కాని నేర్పరికావటంచేత తగు జాగ్రత్త తీసుకుని, కూతుర్ని సంపాదించుకోగలందులకై ముందుగా తల్లికి గాలం వేశాట్ట, వారిద్దరి మధ్యా రహస్య ప్రణయం నడిచిందట, తరవాత కూతుర్ని చేసుకుంటానన్నాట్ట, తల్లి ఇటువంటి దుర్మార్గంచూసి గుండె అవిసిపోయి, పశ్చాత్తాపం చెందినదై, ఈపెళ్ళి సుతరామూవీల్లేదన్నదిట, అందుకే చిచీకవ్ లేవదీసుకుపోయే ఆలోచన చేశాట్ట, పుకార్లు నగరం మూలమూలకూ పాకినకొద్దీ వీటికి చిలవలూ, పలవలూ ఏర్పడ్డాయి. రష్యాలో తక్కువ వర్గాలవారికి తమ పైవర్గాలవారిని గురించిన అపవాదులను చర్చించటం చాలా ఇష్టం. అందుచేత ఈ విషయం చిన్న చిన్న కొంపల్లో, చిచీకవ్ ను ఎన్నడూ చూడని, వినని వాళ్ళుండే చోటకూడా చర్చించ బడింది. అనేక కొత్తకొత్త అసందర్భాలూ, వాటికి తగిన సమర్థనలూ సృష్టించబడ్డాయి. అంతకంతకూ కథ రసవత్తరంగా తయారై ఒక రూపానికి వచ్చింది. ఈ రూపంలో ఈ కథ గవర్నరు భార్య చెవినపడింది. ఒక కుటుంబానికి తల్లి, నగరంలోని ప్రధాన స్త్రీ, ఇలాంటి సంగతులేవీ శంకించని మనిషి, ఈ కల్లబొల్లి కల్పనలు వినేసరికి ఆమెకు మండిపోయింది, అందులో ఆమెతప్పు ఏమీ లేదుకూడానూ. పాపం, పదహారేళ్ళపిల్ల తన యీడువాళ్లెవరూ ఎదుర్కోని బాధాకరమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రశ్నలూ, విచారణలూ, చీవాట్లూ, తిట్లూ, బెదిరింపులూ, హెచ్చరికలూ ఉప్పెనగావచ్చి మీదపడేసరికి ఆమెకు ఒక్కటీ అర్థంగాక బావురుమని ఏడ్చేసింది. ఎటువంటి పరిస్థితులలోకూడా, ఎలాటి సాకుతో నైనప్పటికీ, చిచీకవ్ ను లోపలికి రానివ్వవద్దని ద్వార రక్షకుడికి హెచ్చరిక ఇచ్చారు.

గవర్నరు భార్య పట్ల తమ కర్తవ్యం నెరవేర్చి ఆడవాళ్ళు మగవాళ్ళ మీద పట్టించి, వారిని తమ పక్షం చేసుకోవటానికి యత్నిస్తూ, చచ్చినవాళ్ళను కొనటమనేది కేవలం మిషయేననీ, లేవదీసుకుపోవటం మరింత విజయవంతంగా సాగటానికది తెర అనీ వాదించారు. చాలా మంది పురుషులు తమ ఉద్దేశం మార్చుకుని ఆడవాళ్ళ పక్షమైపోయారు, అయితే మిగిలిన పురుషులు బయట పెట్టి అవహేళనచేసి, అవ్వలనీ, గాజులు తొడిగించుకున్న వాళ్ళనీ అన్నారు-అలాటి మాటలు పడటం కంటె పౌరుషహీనం మరి ఉండదు.

మగవాళ్ళు ఎంతగా ప్రజ్ఞకు పెనుగులాడినా ఆడవారిలో ఉన్న కట్టు వారిలో లేకపోయింది. వారి పద్ధతులు మొరటుగా, నాగరికత లేనివిగా, ఐక్యతాహీనంగా, నైపుణ్యరహితంగా, చచ్చుగా ఉండి, అనైక్యతకూ, అరాచకానికీ, అయోమయానికీ దారితీశాయి. క్రియకు తేలినదేమంటే, పురుష ప్రకృతి నిరుపయోగమైనది. వాళ్లు ఇళ్ళు దిద్దుకోలేరు, ఒకమాట మీద ఉండలేరు, దేన్నీ గట్టిగా నమ్మలేరు, వాళ్ళకు అన్నీ అనుమానాలే. వాళ్లు ఇదంతా అర్థంలేని సంగతి అన్నారు, గవర్నరు కూతుర్ని లేవదీసుకుపోవటం అశ్విక సైనికాధికారులు చేసేపని అనీ సివిలు ఉద్యోగులు చేసేపని కాదనీ, చిచీకవ్ అలాటి పనిచెయ్యడనీ, ఆడవాళ్లు అర్థంలేని మాటలు మాట్లాడతారనీ, వాళ్లు సంచుల్లాగా లోపలఏదివేసినా వేయించుకుంటారనీ; ముఖ్యంగా గమనించవలసిన అంశం చచ్చిపోయిన వాళ్లను కొనటమనీ, అందువల్ల ఉపయోగమేమిటో ఎవడూ చెప్పలేడనీ, అయినా అందులో ఏదో ఛడాలం ఉన్నదనీ అన్నారు. అందులో ఏదో ఛడాలం ఉన్నదని పురుషులు ఎందుకు భావించారో మనం ఇప్పుడే తెలుసుకుంటాం. ఈ రాష్ట్రానికి కొత్త గవర్నరుజనరలు నియమించబడ్డాడు. అలాటిది జరిగినప్పుడల్లా స్థానికాధికారులలో సంచలనం కలుగుతుందన్నది తెలిసిన విషయమేగదా. దానివెంటనే బర్తరఫులూ, మందలింపులూ, శిక్షలూ, పెద్ద అధికారులు తమకిందివారికి అందించే మామూలు వాయినాలన్నీ ముట్టటం జరుగుతున్నది, “ఇంకేముందీ?నగరంలో ఉన్న పుకార్లు కాస్తా ఆయన చెవిని పడ్డాయంటే పీకల మీదికి వచ్చేస్తుంది!” అనుకున్నారు స్థానికాధికార్లు. మెడికల్ బోర్డు ఇనస్పెక్టరు కాస్తాపాలిపోయాడు. అమధ్య అంటుజ్వరాలు వచ్చి ఆస్పత్రులలోనూ, వైద్యశాలల్లోనూ హెచ్చు సంఖ్యలో రోగులు చచ్చారు, ఆజ్వరాలను అరికట్టటానికి తగు చర్యలు జరగలేదు. “చచ్చిన మనుషులు” అనే మాట వినగానే ఈ పెద్ద మనిషికి ఎందుకోగాని ఆ రోగులేనని అనిపించింది. రహస్యంగా వివరాలు సేకరించడానికి గవర్నర్ జనరల్ చిచీకవ్ ను పంపివుంటాడని కూడా ఆయన అనుకున్నాడు, ఈ సంగతి ఆయన న్యాయస్థానాధ్యక్షుడితో అనగా ఆ పెద్దమనిషి అది అర్థంలేనిమాట అన్నాడు. కాని అంతలోనే ఆయన పాలిపోయాడు. ఒకవేళ చిచీకవ్ కొన్న మనుషులు నిజంగా చచ్చినవాళ్ళేనేమోననీ, తాను క్రయపత్రం రాయించడమేగాక ప్యూష్కిన్ తరుపున వ్యవహరించానే అనీ ఇది గవర్నరు జనరలుకు తెలిస్తే ఏమవుతుందోననీ ఆయన భయపడ్డాడు. ఈ సంగతి ఆయన ఒకరిద్దరితో అనటమేమిటి వాళ్ళు కాస్తతెల్ల మొహాలు వేశారు. భయం ప్లేగుకన్న గూడా ఎక్కువైన అంటువ్యాధి. అది సోకటానికి క్షణంచాలు. అందరూ తమలో లేని పాపాలుకూడా చూసుకున్నారు. చచ్చిన మనుషులు అనేమాట ఎంత బహుళసూచకంగా ఉన్నదంటే, కొంతకాలం క్రిందట రెండు దుస్సంఘటనల ఫలితంగా చచ్చి, అతితొందరలో పూడ్చబడిన శవాలుకూడా స్ఫురించాయి. మొదటి సంఘటన ఏమంటే, సంతకు ఇంకో జిల్లానుంచి కొందరు వర్తకులు వచ్చారు. తమ సరుకుకూడా అమ్ముడయాక వాళ్ళు ఇతర వర్తకులకు రష్యను దర్జాతో, జర్మను సారాలతో విందుచేశారు. ఆనవాయితీ ప్రకారం విందు కాస్తా కొట్లాటగా పరిణమించింది. విందు చేసినవాళ్ళు తమ అతిధులను చంపేసి తాముకూడా చచ్చినవాళ్ల భుజబలం రుచి చూసి, డొక్కల్లోనూ, పొట్టల్లోనూ, ఇతర శరీరం మీదా గట్టిదెబ్బలే తిన్నారు. గెలిచిన ఒకడి ముక్కు చితికిపోయి, అరవేలి ప్రమాణంలో మాత్రమే దక్కింది. విచారణలో వర్తకులు తమ నేరం ఒప్పుకుని తాము చుక్క వేసుకున్నామన్నారు. విచారణ జరిగే కాలంలో వారు న్యాయమూర్తులకు ఒక్కొక్కరికీ నాలుగేసి పెద్దనోట్లు ఇస్తామన్నట్టు ఒక పుకారు పుట్టింది. అయితే కేసు చాలా అస్పష్టంగా ఉండిపోయింది. విచారణజరిపి తయారుచేసిన రిపోర్టులో చావుకు కారణం బొగ్గు పొగమూలంగా ఊపిరాడక పోవటమని స్పష్టమయింది. అందుచేత ఆ చచ్చిన వారిని అలాగే పాతేయించారు. రెండవ సంఘటన జరిగి ఎంతోకాలం కాలేదు. దానివైనం ఎలాగంటే: ఫ్షివాయ – స్ప్యెస్ గ్రామానికి చెందిన రైతులూ, బరోన్క గ్రామ కాపురస్తులైన రైతులూ ఏకమై ద్రబ్యాష్కిన్ అనే పన్నులు వసూలు చేసే పోలీసు ఆఫీసరును కాస్తా మాయం చేసినట్టు ఫిర్యాదు తేబడింది. వాడు గ్రామానికి మహాతరచుగా రాసాగాడుట, పోలీసు వాళ్ళకు సాధారణంగా ఆడవాళ్ళంటే వ్యసనం ఉండి పల్లెల్లో ఉండే పిల్లలవెంటా, స్త్రీల వెంటా పడుతుండటమే వాడి రాకకు కారణమట. అయితే ఈ సంగతి అంత ఖండితంగా రుజువు కాలేదుగాని, సాక్ష్యం చెప్పిన రైతులు వాడు వట్టి యావమనిషి అనీ, ఒకసారి మాటువేసి వాణ్ణి ఒక గుడిసెలో నగ్నంగా పట్టుకుని మెత్తగా తన్నామనీ చెప్పారు. ఆడవాళ్లను వేటాడినందుకు పోలీసులను శిక్షించవలసినమాట నిజమేగాని, రైతులు న్యాయ నిర్ణయం తామే చెయ్యటంకూడా తప్పే-వాళ్లు హత్య చేసిన మాట నిజమే అయితే, కాని అదీ స్పష్టం కాలేదు. రోడ్డుపైన చచ్చిపడి ఉన్న మనిషి ఒంటిన ఉన్న దుస్తులు కేవలం వాలికలు, వాడి మొహంకూడా గుర్తించరాకుండా ఉన్నది.

ఈ కేసు చిన్న కోర్టులనుంచి హైకోర్టుకు వచ్చింది. ఇక్కడ లోపాయికారిగా అనుకున్నదేమంటే: నేరంలో పాల్గొన్న వ్యక్తులెవరో తెలియదాయె; రైతులు ఎంతోమంది ఉన్నారాయె; ద్రబ్యాష్కిన్ చచ్చేపోయాడాయె; వాడు ఒకవేళ కేసు గెలుచుకున్నా బావుకునే దేమీలేదాయె: రైతులు చూడబోతే బతికి వున్నారాయె.కేసు వారి పక్షం కావటం వల్ల వారికి ఏమో ఒరుగుతుందాయె; అందుచేత రైతులను పీడించుకుతిని ద్రబ్యాష్కిన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడనీ, వాడు తన చక్రాలులేని బండిలోపోతూ తెరవచ్చి చచ్చాడనీ నిర్ణయం జరిగింది. కేసు మహాచక్కగా పరిష్కారమై పోయింది, అయితే అధికారులిప్పుడు “చచ్చిన మనుషులు” అంటే వీళ్ళేనని ఎందుకో అనుమానించ సాగారు.

అసలే అధికారులు ఈ చిక్కులో ఇరుక్కుని వుంటే గవర్నరుకు ఒకసారిగా రెండు హెచ్చరికలు అందాయి. దొంగనోట్లు అచ్చువేసే వాడొకడు రకరకాల పేర్లతో వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలోనే తిరుగుతున్నట్లు సాక్ష్యమూ, రిపోర్టులూ లభించాయనీ, వెంటనే వాడి ఆచూకీ తీయవలసిందని మొదటి హెచ్చరిక. రెండవ హెచ్చరిక పక్క రాష్ట్రపు గవర్నరు పంపినది: ఒక బందిపోటు దొంగ తప్పించుకు పారిపోయాడట.ఈ రాష్ట్రంలో పాసుపోర్టు లేనటువంటిగాని, తమ పూర్వాపరాలు స్పష్టం చేయలేనటువంటిగాని అనుమానాస్పదులు కనిపిస్తే వారిని తక్షణం అరెస్టు చెయ్యమని. ఈ రెండు హెచ్చరికలమూలాన అందరూ కలతపడిపోయారు. వారదివరకు చేసుకున్నఊహలన్నీ ఒక్క సారిగా తారుమారయాయి. ఈ హెచ్చరికలలో చిచీకవ్ ప్రస్తావన వున్నదని కాదు; కాని ఎవరిమానాన వారు ఆలోచించిచూసుకోగా, తమకు చిచీకవ్ ఏ రకం మనిషి అయినదీ తెలియలేదనీ, అతను తనను గురించి స్పష్టంగా చెప్పుకోలేదనీ, మీదుమిక్కిలి తాను అన్యాయానికి గురి అయినట్టు చెప్పుకున్నాడనీ, అయితే దాన్ని బట్టి నిర్ధారణగా ఏమనుకునేటందుకూ లేదనీ, దీనికితోడు అతను తనకు ఎంతో మంది శత్రువులున్నరనికూడా అన్నాడనీ జ్ఞాపకం వచ్చి ఆశ్చర్యం కలిగింది.అతని ప్రాణానికి అపాయం ఉందన్నమాట. అంటే అతన్ని ఎవరో వేటాడుతున్నా రన్నమాట; అయితే మరి అతను ఏదో చేసిఉండాలి…ఇంతకూఅతను నిజంగా ఎవరు? అతను దొంగనోట్లు అచ్చువేశాడనిగాని, బందిపోటు దొంగ అనుకోవటానికిగాని ఏమాత్రమూ వీలులేదు- మనిషి మహా మర్యాదస్తుడుగా కనిపిస్తాడు; అయినప్పటికీ అతను ఎలాటి మనిషి అయి ఉంటాడు? అధికారులు మన కావ్యం తాలూకు మొదటి ప్రకరణంలోనే తమను తాము వేసుకుని ఉండవలసిన ప్రశ్న ఇప్పుడు వేసుకున్నారు. అసలు ఈ చచ్చినవాళ్ళ కొనుగోలు వైనం ఏమిటో తేలగలందులకు ఆ అమ్మినవాళ్ళను ప్రశ్నించటానికి నిర్ణయం జరిగింది; చచ్చిన మనుషులన్న దాని అంతరార్థం ఏమిటో, తన అసలు ఉద్దేశమేమిటో యాధాలాపంగా ఎవరితోనైనా అతను అని ఉండవచ్చు, తాను నిజంగా ఎవరయినదీ ఎవరితోనన్నా అతను ఒకవేళ చెప్పాడేమో. మొదటగా వారు కరబోచ్క సతి వద్దకు వెళ్ళారు, కాని ఆమెనుంచి ఆట్టే తెలియలేదు; అతను వాళ్ళను పదిహేను రూబుళ్లిచ్చి కొన్నాడనీ, ఈకలుకూడా తీసుకుంటా నన్నాడనీ, సర్కారు కంట్రాక్టు క్రింద పందిమాంసం తీసుకుంటా నన్నాడనీ, ఇంకా ఎన్నో కొంటా నన్నాడనీ, అతను తప్పక మోసగాడేననీ, అదివరకు ఒకడిలాగే ఈకలూ, పందిమాంసమూ సర్కారు తరపునకొని, అందరినీ మోసపుచ్చి, పెద్ద ఫ్రీస్టు భార్యకు నూరు రూబుళ్ళు నష్టం కలిగించాడనీ ఆమె చెప్పేది. ఆవిడ చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెప్పింది, ఆమె వట్టి మతిమాలిన ముసలిదని మాత్రమే అధికారులు తెలుసుకోగలిగారు. పావెల్ ఇవానవిచ్ కి తాను జవాబుదారీ వుండగలనన్నాడు మానిలవ్; అతని గొప్పతనంలో తనకు శతాంశం లభించేపక్షంలో తన సర్వస్వమూ ధారపోయగలనన్నాడు, అతన్ని తెగ మెచ్చుకుంటూ స్నేహం గురించి ఘనంగా చెప్పాడు, మాట్లాడుతున్నంతసేపూ కళ్ళు దాదాపు మూసుకొనే మాట్లాడాడు. ఆయన ఆడిన మాటలవల్ల ఆయన హృదయంలోని ఆర్ద్రత వ్యక్తమయిందేగాని, అసలు విషయం గురించి కొత్త అంశాలేమీ బయటికి రాలేదు. సబాకివిచ్ తన ఉద్దేశంలో చిచీకవ్ మంచివాడే అయివుండాలన్నాడు, ఇంకొకచోటికి తీసుకుపోయేటందుకు కమతగాళ్ళను అమ్మానన్నాడు, వారు అన్ని విధాలా సజీవులేనన్నాడు, అయితే భవిష్యత్తులో ఏం జరగబోయేదీ తనకు తెలియదన్నాడు, ప్రయాణశ్రమవల్ల దారిలో వాళ్ళు చచ్చిపోయేపక్షంలో ఆ తప్పు తనదికాదన్నాడు, దేవుడి తప్పన్నాడు, ఎన్నో రకాల జ్వరాలూ, ప్రమాదకర వ్యాధులూ ఉన్నాయన్నాడు, ఊళ్ళకు ఊళ్ళే చస్తున్నాయన్నాడు. అధికారులు అనుమానాస్పదమైన మార్గంకూడా ఒకటి అనుసరించారు, అయినా అప్పుడప్పుడూ అలాటి పద్ధతులు అమలు చేస్తూనేవుంటారు- చిచీకవ్ నౌకర్లను అతని గతజీవితం గురించీ, పరిస్థితులను గురించీ వాళ్ల స్నేహితులైన నౌకర్ల ద్వారా అడిగించాడు; అయితే అందునా ఆట్టే ప్రయోజనం లేకపోయింది. పెత్రూష్క నుంచి ముక్కిపోయిన గది వాసన మాత్రమే లభించింది. తన యజమాని రాచోద్యోగి అనీ, అంతకుముందు రివెన్యూ ఇలాకాన పని చేశాడనీ మాత్రం సేలిఫాన్ బయటపెట్టాడు. ఈ తరగతి మనుషుల కొక విచిత్రమైన అలవాటున్నది. నేరుగా ఏదైనా ప్రశ్నవేస్తే వారికి ఏదీ జ్ఞాపకం ఉండదు; తమ ఆలోచనలను కూడగట్టుకోలేరు, తమకు తెలియదనికూడా చెబుతారు? కాని ఇంకేదైనా అడిగినప్పుడు, అడిగిన దానికి అక్కర్లేనివి ఏవేవో జోడించి చెబుతారు. అధికారులు జరిపిన ఆచూకీ ఫలితంగా తేలినదేమంటే, తమకు చిచీకవ్ గురించి ఏమీ తెలియదనీ, కాని చిచీకవ్ ఏదో ఒకటి అయివుండాలనీనూ. అందుకని వారు ఈ విషయం పూర్తిగా ఆరాతీయాలనీ, కనీసం ఏమి చెయ్యాలో నిర్ణయించుకోవాలనీ, ఎలాటి చర్యలు తీసుకోవాలో, ఎలా ఉపక్రమించాలో,అతను ఎటువంటి మనిషో, అతన్ని అనుమానాస్పదమైన మనిషిగా పరిగణించి నిర్బంధించాలో, లేక అతనే తమ నందరినీ అనుమానాస్పదులుగా ఎంచి నిర్బంధంలో ఉంచగలిగిన మనిషో తేల్చుకోవాలనీ నిశ్చయించుకున్నారు. ఇదంతా చర్చించటానికి పోలీసు అధిపతి ఇంట సమావేశం కాదలిచారు; ఆయన ఈ నగరానికి తండ్రిలాటివాడనీ, మహోపకారి అనీ పాఠకులకు ఇదివరకే తెలుసు.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

4 Responses to మృతజీవులు – 32

  1. Sowmya V.B. says:

    మొత్తం ఒక ఫీడీఎఫ్ లాగా దొరకదా? 🙁

  2. ramnarsimha putluri says:

    Eee..tharagathy..

    Manushulaku oka vichithramaina

    Alavatu unnadi.. (10 line from below)

    Clarification is needed on these lines..

    RPUTLURI@YAHOO.COM

  3. Rohiniprasad says:

    గోగొల్ నవల రాసేనాటికి రష్యాలో కులీనవర్గాలూ, బస్తీల్లో నివసించే భూస్వామ్యవర్గాలూ, నగరాల్లో నివసించే మధ్యతరగతివారూ, వారికి పనులు చేసిపెట్టే నౌకర్లూ ఇలా అనేక రకాల వ్యక్తులుండేవారు కనక ఒక్కొక్కరికీ ప్రత్యేకమనిపించే సామాజిక, సాంస్కృతిక లక్షణాలుండేవి. ఉదాహరణకు మనలో విద్యాధికులు ఇంగ్లీష్ మాట్లాడినట్టే అక్కడివారిలో కొందరు ఫ్రెంచ్ మాట్లాడేవారు. ఈ స్వభావాల తేడాలను రచయితగా గోగొల్ గుర్తించి కామెంట్ చేశాడు.

  4. ఉష says:

    ధన్యవాదాలు పొద్దువారికి/రోహిణీప్రసాద్ గారికీను రచన పూర్తి చేసినందుకు. అడగాలా వద్దా అన్న సందిగ్ధలో పడి వేచాను/ఆగాను.

Comments are closed.