తోలుబొమ్మలు

— స్వాతీ శ్రీపాద

“ఎవరు? ”

“………”

“ఎవరది?”

కళ్ళు బాగానే కనిపిస్తాయంటుంది కాని కనిపించడం లేదని అర్ధమవుతూనేవుంది. గొంతువిని గుర్తు పడుతుంది. లేదూ చాలా దగ్గరగావుంటే చూడగలదనుకుంటా..

“అమ్మా! బ్రేక్ ఫాస్ట్ తిన్నావా ?”

“నువ్వా? ఇప్పుడా అడిగేది? అన్నాలవేళ కూడా అయినట్టుంది ”

“ఏం చెయ్యను చెప్పు ? నీకు తెలీనిదేఁవుంది … ఆయనకు కావలసినవన్నీ అమర్చితే కాని బయట పడలేను.. సరే, కారియర్ వచ్చిందా?”

మేమందరం మాట్లాడుకుని, ఇంటి పక్కనేవున్న మెస్ నించి ఈ ఏర్పాటు చేసాం.

ఉదయం ఎనిమిదిలోపు రెండు ఇడ్లీలు , మధ్యాహ్నం భోజనం కారియర్ మళ్ళీ రాత్రి ఎనిమిదిలోపు ఏదో ఒక లైట్ మీల్. అయితే ఇడ్లీలు లేదా ఒక దోసె.

ఫాషన్స్ మారిపోయాయి.

ఎన్ని కొత్తరకాల చీరలొచ్చాయని.

నేనైతే చాలా మటుకు డ్రెస్‌లే వాడతాను.

ఇప్పుడివన్నీ ఏం చెయ్యాలి?

రోజంతా చూసేందుకు ఏర్పాటు చేసిన అమ్మాయి పాలు కాచి ఇవ్వడం, మిగతా అవసరాలూ చూస్తూంటుంది. కాని ఇప్పుడు ఆ ఏర్పాటుకూ అందరూ సుముఖంగా లేరు.

“తలో మూడు నెలలు ఉంచుకుందాం. ఎన్నాళ్ళని ఇలా, దీన్ని బిల్డర్ కి అప్పగిస్తే కనీసం మనకు ఒక్కొక్కళ్ళకు రెండు మూడు కొత్త అపార్ట్మెంట్స్ వస్తాయి. వాటిని అద్దె కిచ్చుకున్నా వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా కాస్త ఆసరాగావుంటాయి. అక్కడేవుంటావు కాబట్టి ఆ ఇల్లు ఖాళీ చేసి అమ్మను బయటకు తెచ్చేబాధ్యతనీదే.” ఇదీ నా తోడబుట్టినవాళ్లంటున్న మాట.

నిజమే ఆ పెద్ద ఇంట్లో అమ్మ ఒక్కతే వుండటం ఇబ్బందికరమే.

స్టోర్ రూమ్ నిండా ఒకదాని మీద ఒకటి పేర్చిపెట్టిన చెక్కపెట్టెలు. చెదలు పట్టి చిల్లులు పడి…

నిన్ననే అమ్మకు చెప్పాను ఇల్లు సర్దాలని. గదిలోకి అడుగుపెడుతూనే ఓ రకమైనపాత వాసన. మొహం చిట్లించుకుని ముక్కెగబీల్చి సర్దుకున్నాను. నిజానికి ఆగదిలో సంవత్సరాల కొద్దీ భద్రపరచిన ఆ వస్తువులన్నీ మాకు చెత్తగానే కనిపిస్తాయి..కాని అవే ఆమె సిరి సంపదలు. ఆమె తాలూకు గతజీవితపు సజీవ స్మృతులు. తన కుటుంబపు డాక్యుమెంటరీలు.

ఒక పెట్టెలో బాగా చిలుము పట్టిన ఇత్తడి సామాను. అరవై డెబ్బై ఏళ్ళక్రిందటి మరచెంబు… ఆకుపచ్చరంగుకి తిరిగింది. నాలుగ్గిన్నెల ఇత్తడి కారేజీ… అమ్మ ఎన్ని సార్లు చెప్పిందో పెళ్ళయాక అత్తారింటికి వచ్చేటప్పుడు పుట్టింటినించి తెచ్చుకున్న సామానదని. ఆ క్యారేజిలో పెరుగన్నం పెట్టి ఇవ్వడం పెళ్ళిలో ఆనవాయితీ. ఆ మరచెంబులో పాలు… ఇత్తడి కాఫీ ఫిల్టర్… పూజ సామాగ్రి… కుందులు, గంట , కర్పూరం వెలిగించుకునే హారతి పళ్ళెం…

మూతలు తియ్యకపోయినా, ఎందులో ఏమున్నాయో నాకు బాగా తెలుసు. ఆ మూల మూత విరిగిన ఆకుపచ్చ పెట్టెలో పాత ఫొటోలు — కొన్ని కార్డ్ బోర్డ్ మీద అతికించినవి, మరికొన్ని ఫ్రేమ్ కట్టినవి. బ్లాక్ అండ్ వైట్ పోటోలరంగు మారి పసుపు రంగుకు రావడమే కాదు, ముట్టుకుంటే విరిగిపోయే దశలో మిగిలాయి.

చిన్నప్పుడు మేమంతా ఆ స్టోర్‌రూమ్‌లో ఆడుకోవడం నిన్నగాకమొన్న జరిగినట్టుంది.

మా నలుగురికీ వయసు తేడా ఒక్కొక్క ఏడాదే. నిజానికి పెద్దక్కకీ రెండో అక్కకీ తేడా సరిగ్గా పదకొండు నెలలు. ఇద్దరు పుట్టినదీ ఒకే సంవత్సరంలోనే. చిన్నప్పుడు విన్న కథలన్నీ మేం వేసవిసెలవుల్లో నాటకాలు వేసేవాళ్ళం. మధ్యాహ్నం మాకు నిద్దరొచ్చేదికాదు. అమ్మ కాస్త కునుకుతియ్యగానే చడీచప్పుడూ లేకుండా పెట్టెలు తెరిచి అందులోని పంచెలూ చీరలూ కట్టుకుని నాటకాలాడే వాళ్ళం. జీవితమే ఒక నాటకమని తెలీని వయసది. చీరలు కట్టుకుందుకు ఎంత పోటీ పడేవాళ్ళమని… నేనంటే నేనని! చివరకు ఒకరిద్దరు పంచెలు కట్టుకోక తప్పేది కాదు. ఆ ఒకరిద్దరిలో నేను ఎప్పుడూ వుండేదాన్ని. చిన్నదాన్నని నన్ను నోరు మెదప నిచ్చేవారుకాదు. మంచి మంచి జరీ చీరలు మాత్రం వాళ్ళు సింగారించుకునేవారు. అచ్చు రాణీగారిలాగ పెద్దకొంగుతో తలమీద పిన్నులతో టక్ చేసుకుని, నేలంతా జీరాడుతూ మిలమిల మెరిసిపోయేది మూడో అక్క.

దొరికిన పౌడర్ మొహాలకు బూడిదలా అద్దుకోవడమే కాకుండా అమ్మ సింధూరంలో నీళ్ళు కలిపి పెదవులకు పట్టించుకునే వాళ్ళం.

ఎప్పుడన్నా అమ్మకంట్లో పడితే మాత్రం మా వీపులు విమానం మోతలు చేసేవి, చీరలన్నీ నాశనం చేస్తున్నామని.

ఇప్పటికీ ఎన్ని పెట్టెల్లో అమ్మ చీరలున్నాయో చెప్పలేను.

అందరం అమ్మాయిలం మాకు ఇచ్చేస్తుందని ఎంతో అనుకున్నాం. కాని అమ్మ ఒక్క చీరైనా ఎవరికీ ఇవ్వలేదు.

“అవి చీరలు కాదు నా గతం తాలూకు చిత్ర పటాలు. నేనున్నన్నాళ్ళూ అవి ఉండాల్సిందే.” తెగేసి చెప్పింది అమ్మ ఏళ్ళక్రితమే.

ఇహ ఇప్పుడైతే ఎవ్వరూ వాటికి ఆశ పడట్లేదు కూడా. ఫాషన్స్ మారిపోయాయి.

ఎన్ని కొత్తరకాల చీరలొచ్చాయని.

నేనైతే చాలా మటుకు డ్రెస్‌లే వాడతాను.

ఇప్పుడివన్నీ ఏం చెయ్యాలి? అమ్మను ఎవరింటిలో వుంచుకున్నా ఆవిడకో గది ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది ఇవన్నీ ఎక్కడ పెట్టుకోగలం. ఇప్పుడు అమ్మ మా ప్రపోజల్ తిరస్కరించే స్థితిలో లేదు.

ఇదివరలో ఎన్నిసార్లు ఎవరు పిలిచినా, “నన్నిలా నా ఇంట్లో ప్రశాంతంగా వుండనివ్వండి. నేను సంతోషంగావుండాటం కావాలా, మీతో వుండటం కావాలా మీరే తేల్చుకోండి” అంటూ మానోళ్ళు కట్టేసింది..

ఈ సారి మాత్రం అమ్మ ఇష్టాఇష్టాలడగ లేదు నేను. చేసేది చెప్పాను.

“మాకూ ఇల్లూ వాకిలీ మొగుడూ పిల్లలూ ఉన్నారు. ప్రతిక్షణం నీగురించి టెన్షన్ పడి తట్టుకోలేం. అందుకే ఇలా… పైగా ఇల్లు పాతది ఎప్పుడు ఏమౌతుందో చెప్పలేం… అందుకే ఖాళీ చేసి…”

చెప్పేశాను. అమ్మ ఈసారి ఎదురు చెప్పలేదు.

కానీ ఇప్పుడు ఈ సామాను తీస్తుంటే అమ్మ గదిలోకి వచ్చింది

“నన్ను ఒక్కొక్కళ్ళు మూడు నెల్లుంచుకుంటారా?”

అమ్మ ఆమాట అడగ్గానే మనసు చివుక్కుమంది.

ఈ మారు నిశ్శబ్దం నావంతైంది.

*****************

పాతికేళ్ళ క్రితం నాన్న పోయాక ఈ ఇల్లూ ఈ వస్తువులే అమ్మ నేస్తాలు. ఎవరితోనూ పెద్దగా పరిచయాలు పెంచుకునేది కాదు.

నేనా గదిలోకి వచ్చినప్పుడల్లా అమ్మ నిద్రకూడా మానుకుని నా వెనకే వస్తోంది.

పారేసే ప్రతి వస్తువుకీ ఓ కధ. ఓ గతం. ఓ చరిత్ర.

చిత్రం! ఇదివరలో అమ్మకు కళ్ళు సరిగ్గా కనిపించవనుకునేదాన్ని. ఈ గదిలో మాత్రం ఏ వస్తువు తీసినా ఆవిడకు తెలిసిపోతోంది.

“అదిలా ఇవ్వు” అమ్మ స్వరం.

తలెత్తి చూశాను. నా చేతిలోని చెక్కపెట్టెనే చూస్తోంది..

అది బొట్టుపెట్టె. ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ చేయించాక అది సామాను గదిలోకి తరలిపోయి కూడా పాతికేళ్ళు దాటింది.

“అది మాఅమ్మది. ఆవిడ జ్ఞాపకంగా తెచ్చుకున్నాను.” అని క్షణం ఆగి “దీన్ని చూస్తే అమ్మను చూసినట్టే వుంటుంది”

“అమ్మ బ్రతికింది గట్టిగా చూస్తే ముప్పై ఏళ్ళు కూడా కాదు. పెళ్ళి జరిగిన ఏడాదికి కాపరానికి వచ్చిందట. అది మొదలు ఎప్పుడు చూసినా అయితే బాలింత కాదంటే చూలింత. ప్రతిసారీ నరకం అనుభవించి పురిటినొప్పులు పడి బిడ్డను కనడం, ఆ బిడ్డ పురిట్లోనే పోవడం. ఆసుపత్రికి వెళ్ళడం అప్పట్లో ఆనవాయతీ లేదట. పెళ్ళయిన పదహారేళ్ళలో కన్న పదిమందిలో మిగిలినది నేను నా చిన్న చెల్లి మాత్రమే.” అమ్మ ఆగింది.

“అమ్మా పడుకోరాదూ ”

ఆ గదిలోంచి బయటకు వచ్చినా అమ్మ తన గతం నించి బయట పడలేదు.

“చివరకు కనలేకనే అమ్మ చచ్చిపోయింది.” అమ్మ కళ్ళనించి నీళ్ళు.

సవతి తల్లి చేతుల్లో నానా బాధలూ పడ్డారని వాళ్ళూ వీళ్ళూ చెప్పుకోగా విన్నాం కాని… అమ్మ తన తల్లిని గుర్తు చేసుకోడం నాకు తెలిసి ఇదే తొలిసారి.

“నేనూ మా అమ్మ లాగే చచ్చి పోతాననుకున్నాను… మీ నాన్న కొడుకు కావాలని పట్టుబట్టినప్పుడు. కడుపుతో వున్న తొమ్మిదినెలలూ అమ్మే ప్రతిక్షణం కళ్ళల్లో మెదిలేది. నా పిల్లలూ మా లాగే తల్లి లేని వాళ్ళయి అగచాట్ల పాలవుతారనిపించేది. మీ నాన్నకు మాత్రం తలకొరివి పెట్టడానికి కొడుకు కావాలని కోరిక.” అమ్మ మా ఎవ్వరితోనూ ఇంత ఫ్రీగా ఎప్పుడూ మాట్లాడలేదు.

ఇప్పుడు ఓ కూతురిగా నాతో మాట్లాడుతున్నట్టు లేదు. ఏదో ట్రాన్స్ లో వున్నట్టు… ఎవరో మిత్రురాలి తో మాట్లాడుతున్నట్టు…

“పురిటి నొప్పులు పడితేగదా బాధ తెలిసేది? చచ్చి బ్రతికే ప్రక్రియలో అది కూతురైనా కొడుకయినా ఒక్కటే కదా… ఉహు… ఇంకోసారి… ఇంకోసారి… అది వాళ్ళ ప్రాణమయితేగా…”

“……”

“అందుకే చివరికి సిజేరియన్ తప్పదని చెప్పి, డాక్టర్‌ని ఒప్పించి ఆపరేషన్ చేయించుకున్నాను. అది మీ నాన్నకు బ్రతికుండగా చెప్పలేదు.” అమ్మ ఏడుస్తోంది..

ఏం మాట్లాడాలో ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు.

కాస్సేపటికి తనను తాను సంభాళించుకుని… ఆ వైపుకి తిరిగి గోడవైపు మొహం పెట్టుకుని పడుకుంది అమ్మ.

“అయినా … ఏ తరమయినా …. ఎన్ని మార్పులు వచ్చినా… ప్రతి వాళ్ళూ తోలు బొమ్మలే … కళ్ళాలు మరెవరిచేతుల్లోనో వుంటాయి… తెరమీదమాత్రం మనం ఆడినట్టే అనిపిస్తుంది… ”

నా మొహాన చాచి కొట్టినట్టనిపించింది. ఆ రాత్రంతా నా కంటిమీదకు కునుకు చేరితే ఒట్టు.

అవును. అమ్మకు ఆ ఇల్లే జీవితం. అదే గతం, వర్తమానం , భవిష్యత్తు కూడా.

అప్పట్లో నాన్న పోయాక ఒక్కళ్ళంటే ఒక్కళ్ళమూ ఆవిడను వచ్చి వుండమని అడగలేదు.

“అమ్మో… ఆవిడనెవరు భరించగలరు… ముప్పొద్దులా వేడి వేడిగా వండి వడ్డించాలి. ప్రపంచంలో పరిశుభ్రత అంతా ఆవిడదే అయినట్టు పది సార్లు కడిగినదే కడుగుతుంది. అంతేనా! ఎంత తోస్తే అంత అల్లుళ్ళనైనా చూడకుండా అనేస్తుంది. ఆవిడను తెచ్చుకోడం కొరివితో తలగోక్కోడమే.” ఇది మేమందరం అనుకున్న మాటే.

అమ్మ ఎంత స్పష్టంగా చెప్పింది!

జరిగేది తనకు నచ్చటంలేదని. ‘మీ చేతుల్లో నేను తోలుబొమ్మన’ని.

మహా అంటే అయిదారేళ్ళు బ్రతికే అమ్మను ఇప్పుడు పీడించి ఈ ఇల్లు లాక్కోకపోతే మేం బ్రతకలేమా?

పెద్దగా సవ్వడి చెయ్యకుండా బయటపెట్టిన సామాను తీసి సామాన్ల గదిలో పెట్టి తాళం వేశాను.

అమ్మను సుఖపెట్ట లేకపోయినా బాధపెట్టే అధికారం మాకు లేదు.

అది నాకు తెలిసి వచ్చింది.

అందుకే అమ్మను తోలు బొమ్మను కానివ్వను.

———————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.
This entry was posted in కథ. Bookmark the permalink.

12 Responses to తోలుబొమ్మలు

  1. parimalam says:

    కధ హృదయానికి హత్తుకొనేలా ఉందండీ ! నిజమే అమ్మను సుఖపెట్టకపోయినా ఫర్వాలేదు కంట తడి పెట్టకుండా చూసుకోగలిగితే చాలు !జ్ఞాపకాలనిధిని నిక్షిప్తం చేసుకున్న ఘనులువారు! వినే ఓపికా ..తీరికా …మనకు , మనపిల్లలకూ ఉంటే పంచివ్వడానికి ఉబలాటపడతారు.చిన్నపలకరింపుకీ ,చేతిస్పర్శకీ మురిసిపోయే అల్పసంతోషులు!

  2. ఈ కథ చదివాక 88 యెళ్ళ మా అమ్మ” ఫొను చెస్తూ వుండండి ..నాకు బాగుంటుంది .”…అన్న చిన్న విషయనికి మే ము యెంతబద్దకిస్తాము అని బాదేసింది ..ఆమెకు యేమిచెయ్యకపొయినా చిన్న సంతోషాలను ఇవ్వాలి అనిపించింది…రచయిత్రికి నా జోహర్లు
    లక్ష్మి రాఘవ

  3. ramnarsimha says:

    SWATHI SRIPADA Garu,

    “PRATHI VALLU..THOLU BOMMALE

    KALLALU..MAREVARI CHETULLONE UNTAYI..

    Ane vakyam..lo Entho Tatvikatha daagi undi..

    Mugimpu..Hrudayanni kadilinchindi..

  4. ఉష says:

    ఉదయపు పఠనాలు అరుదుగా వెంటాడతాయి. నాకు నిజంగా కథలు చదవటం రాదు [ఏదీ చదవటం రాదేమో] ఒక్కోసారి ఆ పాత్రల్లో నేను జీవించేసో, లేదా ఆ తాలూకు సన్నివేశాన్ని నిజమనుకుని మనసు ఉసూరుమనేంతగా ఏడ్వటం – ఇలా నా బలహీనతలు తెలుసు కనుక కొన్నిసార్లు ఎందుకు చదువుతున్నాను అని కూడా నన్ను నేను విసుక్కుంటాను. ఆ పాత్రలు నన్ను దీర్ఘకాలం వదలవు. ఇప్పుడు నన్ను మళ్ళీ ఓ దృశాన్ని గట్టి జ్ఞాపకానికి బదిలీ చేస్తూ, నా అస్తిత్వాన్ని/భావిని సవాలు చేసే మూలకి నెట్టింది ఇందులోని “అమ్మ” అనే తోలుబొమ్మ. బాగా రాసారు అనను, వస్తువు, శైలీ తలకి పట్టించారు. నా వస్తువులు ఆవిడవి కలిసికట్టుగా తిరుగుతున్నట్లు..
    * * * * *
    సీతాదేవికి పెరుగున్నం, కరివేపాకు ఇవ్వలేదనే అడవులపాలై, భర్తకు దూరమై ఇలా వెతల పాలైందట. ఇది ఎంతవరకు బలమున్న కారణమో తెలియదు. ప్రతిదానికీ ఎందుకు అని విసిగిమ్చే నాకు ఎవరో ఒకరు ఇచ్చే సమాధానాలు బాగా గుర్తు. అలా అలా ఆ ఇత్తడి మనకి స్టీల్ కాన్స్ గా మరి తర్వాత వెండి డబ్బాలవుతాయేమో!

  5. sahiti says:

    mother is working always her childrans .mom is god.

  6. కథ బావుంది. హృద్యంగా ఉంది.అభినందనలు

  7. kanneellu tappa samaadhaanam cheppalenu..

  8. తెలుగు కథల్లో చాలాసార్లు నలిగిన కథాంశమే. కానీ గుండె చెమర్చేలా రాశారు.

  9. స్వాతి శ్రీపాద says:

    అమ్మ గురించిఎంత రాసుకున్నా తరగదు. ఎంత చేసినా ఇంకా ఏమైనా చెయ్యలేకపోయానేమోననే అనిపిస్తుంది. అమ్మ మీద చాలానే కధలు రాసినా ఇంకా రాయాలనే అనిపిస్తుంది. సృష్టికి ఆద్యం అమ్మే కద!చదివి సహ అనుభూతిని పొందిన మిత్రులకు కృతజ్ఞతలు

  10. Ramnarsimha says:

    ప్రతి ఒక్కరు తోలుబొమ్మలే – కళ్ళాలు మరెవరి చేతుల్లోనో ఉంటాయి!!

    అనే వాక్యంలో ఎంతో తాత్వికత దాగి ఉంది..

    ధన్యవాదాలు..

  11. రాణి says:

    heart touching story 🙂

  12. radhika says:

    చాలా బావుందండి.ఆలోచింపచేసేలా వుంది.

Comments are closed.