గుప్పెడు మిణుగురులు

-మూలా సుబ్రహ్మణ్యం

అడుగుజాడలు

ఆ తీరంలో
ఎంతటి మహాత్ముడి
అడుగుజాడలైనా
చెరిగిపోక తప్పదు

నీకు నువ్వే
ఓ దారి వెతుక్కోవాలి

జీవితమూ
సముద్రమే!

* * *

కలలెక్కడో అంతమవ్వాలి
మళ్ళీ పుష్కరాల వేళకి
ఈ నది ఉంటుందో లేదో

ఒక్క క్షణమైనా
నిన్ను విడిచిపెట్టి
నదిలోకి..
నదిని నీలోకి..

కాలం
ఎంత అర్ధరహితం!
* * *

మట్టి రోడ్డు పక్కన
దుమ్ములో తడుస్తూ నవ్వుతున్న
గాజుపూలు,  గన్నేరు పూలు
ఏవెక్కువ అందమైనవి?

తూనికలు, కొలతలులేని
ఒకే ఒక్క చూపు

సానుభూతి అంచుల్లో సంతోషం
అభినందనల అడుగున అసూయ

ఏ రంగూ లేని
ఒక్క కన్నీటిబొట్టు

నీకూ ప్రపంచానికీ మధ్య
గీతల్ని చెరిపేస్తూ…

* * *

సముద్రమో, నదో అక్కరలేదు
చిన్ని నీటి చెలమ
కన్నుల్లో…

సూర్యుడో, చంద్రుడో అక్కరలేదు
గుప్పెడు మిణుగురులు
గుండెల్లో..

చాలు!

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

28 Responses to గుప్పెడు మిణుగురులు

  1. ఆనంద్ says:

    ఒక్క ముక్క అర్థం అయితే, ఎవరయినా నన్ను చెప్పట్టుక్కొట్టొచ్చు. దీనర్థం ఈ కవిత గొప్పది కాదనీ, ఇందులో కవిత్వం లేదనీ కాదు. నాకు ఏమాత్రమూ అర్థం కాలేదంతే. ఏవేవో గుంభనమైన అర్థాలు వున్నాయి ఇందులో. తెలివిగల వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి. ఒక మామూలు పాఠకుడినైన నాకు ఎంత మాత్రమూ అర్థం కాలేదు విషయం. అర్థం అయ్యేక కదా, విషయం నచ్చిందీ, లేనిదీ? కవిత్వం అనేది తెలివి గల వాళ్ళకి మాత్రమే ఎందుకు పరిమిత మవ్వాలి? కవిత్వం చదివి అర్థం చేసుకునే అర్హతని నాలాంటి మామూలు పాఠకుల నించి ఎందుకు తీసెయ్యాలి? పండితులెవ్వరూ ఈ కవితకి అర్థం చెప్పనక్కర్లేదు. ఈ కవితని అర్థం చేసుకుని, ఇష్టపడి, మెచ్చుకునే వాళ్ళ సంగతి కూడా కాదు ఇక్కడ. నిజంగా అర్థం కాని నా లాంటి వాళ్ళెవరన్నా వున్నారా అన్నది ప్రశ్న. ఒకవేళ వుంటే, వారందరూ ఏం చేస్తే ఇటువంటి కవితలు అర్థం చేసుకునే శక్తి వస్తుందీ అన్నది ఇంకో ప్రశ్న. ఈ ప్రశ్నలు ఈ కవిత గురించి మాత్రమే కావు. ఈ రోజుల్లో అనేక పత్రికల్లో ఇటువంటి గుంభనమైన కవితలు చాలా వస్తున్నాయి. వాటికి ఏవేవో గొప్ప అర్థాలు వుండే వుంటాయి. అవి అర్థం కావట్లేదన్నదే నా ఘోష. ఈ సమస్యకి పరిష్కారం లేదా?
    అప్పుడప్పుడు నాకో అనుమానం కలుగుతూ వుంటుంది. పత్రికలు ఇలాంటి కవితలు ప్రచురిస్తున్నాయంటే, దానర్థం ఆ పత్రిక వాళ్ళకి అవి అర్థం అయ్యాయనే కదా? కొంతమంది వాటిని మెచ్చుకున్నారంటే, వాళ్లకీ అర్థం అయ్యాయనే కదా? అయితే ఈ శాతం ఎంత? ఒక వ్యాసం గానీ, ఒక కధ గానీ చదివితే, అర్థం కాకపోవడం అనేది సాధారణంగా వుండదు, మరీ ఆ రచయిత ఏవేవో బొత్తిగా పొంతన లేకుండా రాస్తే తప్ప. అర్థం అయ్యాక, నచ్చక పోవచ్చు ఆ విషయాలు. కవిత్వం సంగతి తీసుకుంటే, అర్థం అవడమే ఒక ప్రళయం అయిపోయింది. అర్థం కాలేదంటే తెలివి తక్కువ వాడినని నవ్వుతారనే భయంతో, “అర్థం అయింది. బాగానే వుంది” అని అబద్ధాలు చెప్పిన సంఘటనలు ఎన్నో వున్నాయి. ఎంత కాలం అయినా తెలివి పెరగక పోయేసరికి, నా ఘోష అందరితోనూ వెళ్ళబుచ్చుకోవాలని ఇది రాస్తున్నాను. ఈ కవి తప్పుగా అర్థం చేసుకోరని నా ఆశ.

    సంస్కృతంలో ఒక శ్లోకం రాసి ఎవరన్నా ప్రచురిస్తే ఏం అర్థం అవుతుందీ? భాష విషయమే కాదు, భావం విషయం కూడా. దాని తాత్పర్యం ఇచ్చినా సరే, బోలెడు శ్లోకాలు అర్థం కావు. ఉదాహరణకి, భగవద్గీత తీసుకుని, ఏదో అధ్యాయంలో ఒక శ్లోక తాత్పర్యం చదివి చూడండి. ఎక్కువ మందికి విషయం అర్థం కాదు. దీనర్థం దానికి అర్థం లేదని కాదు కదా? అవి మామూలు మనుషులకు అర్థం కావు అన్న నిర్ణయానికి, ఎక్కువ మంది ఎప్పుడో వచ్చేశారు. భక్తి కొద్దీ శ్లోకం మాత్రం సంస్కృతంలో చదువుకుని సంతృప్తి పడిపోతున్నారు ఎక్కువ మంది. ఇటువంటి పరిస్థితి తెలుగులో రాసే కవితలకి కూడా మొదలవ్వాలా?

    ఏదన్నా విషయం కవితలో రాస్తే, అది అందంగా, చక్కటి పదాలతో, చక్కటి ఉపమానాలతో, స్పష్టంగా, డైరెక్టుగా ఎందుకు చెప్పకూడదు? అలా చెబితే, నాలాంటి తెలివి తక్కువ పాఠకులకి కూడా అర్థం అయిపోతుందని భయమా? లేక ఈ కవితలు జ్ఞానమున్న పెద్ద వాళ్లకి మాత్రమే అన్న భావనా?

    ఈ ఘోష చదివాక చాలా మందికి కోపం వస్తుందనీ, ఈ రాత మీద అసహనం కలుగుందనీ కూడా అనిపిస్తోంది. అంటే వారందరూ పండితులన్న మాట. వారికి నాలాంటి పామరుల మీద ఆగ్రహమూ, అసహనమూ కలగటం చాలా సహజం. దానికి సిద్ధపడే రాస్తున్నాను ఈ విషయం. నాలాంటి పామరులు ఇంకా ఎవరన్నా వుంటే, వారికన్నా నా ఘోష అర్థం అవుతుందేమోనన్న ఆశతో మాత్రమే రాస్తున్నాను. నాలాంటి పామరులని ఇటువంటి కవితలు అంటరాని వారిగా బహిష్కరించకూడదనే నా ఆక్రోశం. ఎవరన్నా అర్థం చేసుకోగలరా నా బాధ?

  2. కామేశ్వర రావు says:

    ఆనంద్ గారూ,
    మీ బాధ, ఆక్రోశమూ సమంజసమైనవే. తెలుసుకో లేకపోతున్నాననే తపనలోంచే కదా కొత్తవి తెలుసుకొనే అవకాశం దొరుకుతుంది!
    వచ్చిన చిక్కల్లా ఒకటే,
    “ఈ కవితని అర్థం చేసుకుని, ఇష్టపడి, మెచ్చుకునే వాళ్ళ సంగతి కూడా కాదు ఇక్కడ. నిజంగా అర్థం కాని నా లాంటి వాళ్ళెవరన్నా వున్నారా అన్నది ప్రశ్న. ఒకవేళ వుంటే, వారందరూ ఏం చేస్తే ఇటువంటి కవితలు అర్థం చేసుకునే శక్తి వస్తుందీ అన్నది ఇంకో ప్రశ్న.”
    అని అన్నారు. మీ ప్రశ్న చదవగానే నాకు పోతనగారి పద్యం గుర్తుకువచ్చింది. “కాననివాని నూతగొని కాననివాడు విచిత్ర వస్తువుల్ కానని భంగి” అన్నది. “చూడలేనివాడు వస్తువులని చూడ్డం కోసం లేదా అవి చూడ్డానికి ఎలా ఉంటాయో తెలుసుకోడం కోసం మరొక చూడలేనివాడి సహాయం తీసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా”. అలాగే మీలాగా ఈ కవిత అర్థంకాని వాళ్ళని “ఏం చేస్తే ఇలాంటి కవితలు అర్థం చేసుకొనే శక్తి వస్తుంది” అని అడిగితే ఏంటి ఉపయోగం? అర్థం చేసుకొని ఇష్టపడేవాళ్ళని అడిగి వాళ్ళు చెప్పగలిస్తే, అది మీకు అర్థమైతే ఏదైనా ప్రయోజనం. ఏమంటారు?
    “మీరు కవిత్వాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారా, కవిత్వం మీకు అర్థమయ్యేట్టు ఉండాలనుకుంటున్నారా?” అన్నది అసలు ప్రశ్న.
    నేనూ మీలాంటి పామరుడినే కాబట్టి నాకు మీమీద ఎలాంటి ఆగ్రహమూ, అసహనమూ కలగలేదు.

  3. chavakiran says:

    ఆనంద్,

    మీకు మొదటి భాగం కూడా అర్థం కాలేదా? నాకు తెలిసినంత వరకు అది నేరుగానే చెపుతుంది కదా చెప్పాల్సిన విషయం.

    లోకో భిన్న రుచి. కవిత బాగుంది. కానీ మూలా కవితకు నేను ఇలా చెపితే ముంజేతి కంకణానికి అద్దం చూపినట్టవుతుంది అని గమ్మునున్నాను. 🙂

  4. ఋషి says:

    నిజమే! అన్ని సినిమాలూ అందరికీ అర్ధం కావు. అన్ని కవితలూ, కథలూ కూడా.
    ఎంత సులభమైనదైనా అర్ధం కాని వాళ్ళు, ఎంత లోతైనదైనా అర్ధం చేసుకోగలవాళ్ళూ ఉంటారు. కాబట్టి కవి వీళ్లలో ఎవర్నీ ప్రామాణికంగా తీసుకుని రాయలేడు, తనకి అర్ధమయ్యే స్థాయిలో మాత్రం రాయగలడు. ఆ స్థాయిలో ఉన్నవాళ్లకి అది అర్ధవంతం గానూ, పై స్థాయిలో వాళ్లకి మరీ సింపుల్ గానూ, కొంచం కింద ఉన్నవాళ్లకి శేషప్రశ్నలానూ ఉండొచ్చు.

    సమస్య – ఒక పాఠకుడికో/ ఒక వర్గానికో ఒక కవిత అర్ధం కాకపోవడం. ఆ అర్ధం కాకపోవడం పట్ల ఆ వ్యక్తి బాధ పడటం.
    పరిష్కారం – ప్రతి మనిషికీ ప్రపంచం లోని ప్రతి విషయమూ అర్ధమవ్వాలనే నియమమేం లేదు అనుకుని వదిలెయ్యడం.
    లేదా తప్పక ఇది నేను అర్ధం చేసుకుని తీరవవలసిన విషయమే అంటే ఆ దిశగా సాధన చెయ్యాలి. ఇటువంటి కవితలు అర్ధం కావాలి అంటే కొన్ని రకాల కవితలు చదివిన అనుభవం ఉండాలి.

    ఇప్పటివరకూ మనం చదివిన రచనల్ని, రచయితల్నీ బట్టీ, వాటిని మనం చదివి అర్ధం చేసుకున్న దాన్ని బట్టి ఇతర రచనల్ని మనం అర్ధం చేసుకోగల దృష్టి మారుతూ ఉంటుంది.

    రోజూ చదవకుండా ఎప్పుడో ఒకసారి చూస్తే సరళమైన న్యూస్ పేపర్ వార్తలే అర్ధం కావు. కవిత్వంతో అనుబంధమూ,విస్తృతంగా చదివిన అనుభవమూ లేకుండా లోతైన కవితలు అర్ధమవ్వడం కష్టమే.

  5. Ravi Kumar says:

    The first and last parts are readily understandable. The middle lines are to be read careflly to understand, but can be enjoyed – even without understanding completely.

    Tripur is the story writer, whom I fail to understand – though I myself could write few stories, including prize-winning and appreciated.

    I feel, a writer / poet cannot ensure that everything is understandable, before penning something. (To some extent) Editors cannot feel the pulse of reader (completely).

    Best example is DEVADASU by Sarath had been rejected for 17 years, and once it came came to light, it is still alive even after 100 years, and continue to inspire many – including cini-industry.

  6. Rachana says:

    Hi,

    I would like to hear the meaning from one of the PODDU team members!
    would really love to see their version of this poem ..

  7. ఆనంద్ says:

    ఇది సరదా కోసం మాత్రమే రాస్తున్నాను. అన్యధా భావించకండి. అభ్యంతరకరంగా వుంటే, సంపాదకులు తొలగించ వచ్చును ఈ వాఖ్యని. రచన గారి కామెంటు చదివాక ఇది రాయాలని అనిపించింది. క్షమించండి.

    ఈ కవిత రాసిన కవి గారితో కలిపి, ఈ కవితని అర్థం చేసుకుని ఇష్టం పడిన పాఠకులు ఓ పది మందిని తీసుకుని, దీనికి అర్థం రాయమని అభ్యర్థిస్తే (ఒకరికి తెలియకుండా ఇంకొకరు), ఆ పది వివరణలూ చదివితే, అందులో ఎన్ని వేరియేషన్సు వుంటాయో అర్థం అవుతుంది. గూఢార్థాలతోనూ, గాఢత తోనూ, లోతుగా అర్థం చేసుకోవల్సిన అవసరం తోనూ వుండే వాటిని ఎవరికి తోచినట్టు వారు అర్థం చేసుకుంటారు. కొన్ని చోట్ల ఏకీభవిస్తారు, కొన్ని చోట్ల విభేదిస్తారు. కొన్ని చోట్ల పూర్తిగా వేరేగా అర్థం చేసుకుంటారు. ఈ రోజుల్లో కవిత్వం అర్థం చేసుకోవడం పాండిత్యానికీ, జ్ఞానానికీ చిహ్నం అయింది. అయినా సరే పామరుడిగా వుండటానికే ఇష్టం కలుగుతోంది.

  8. అన్వేషి says:

    అయ్యా ఆనంద్ గారు!
    మీరు వ్రాసిన అభిప్రాయం ఆసాంతం చదివాను నాకు ఇసుమంతకూడాఅర్ధంకాలేదు, అలాగని మీరువ్రాయడం పొరపాటందామా? అలాగే ఆకవిగారు వ్రాశారు. అర్ధమైనవాళ్ళు ఆనందిస్తారు, కాకపోతే ఒదిలేద్దాం మనకేంనష్టం.
    పదిమందిదాకా అఖ్ఖర్లేదు, ఒక్కరికే ఒకసారి చదివినప్పుడు స్పురించే అర్ధానికి మరోసారి చదివినాక స్పురించే అర్ధానికి ఎంతో తేడాఉంటుంది. అదే నిజమైన కవితాలక్షణంకూడా. కాదంటారా?

  9. ఆనంద్ says:

    అన్వేషి గారూ,
    మీరు చెప్పిన పాయింటు అర్థం అయింది. ఇక ఈ విషయం మీరు చెప్పినట్టుగానే వదిలేస్తున్నాను, చివరగా ఒక ముక్క అంటూ.
    “ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం,
    నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం”
    పై కవిత ఎన్ని సార్లు చదివినా, ఎంత మంది చదివినా ఒక్కలాగే అర్థం అవుతోంది ఎంతో కాలం నించీ.
    మీరు చెప్పిన కవితా లక్షణంతో విభేధిస్తూ,

    శలవు,
    ఆనంద్

  10. afsar says:

    చాలా సూటిగా, స్పష్టంగా, స్వచ్చంగా వున్నాయి ఈ మిణుగురులు.

    జీవితంలోని లోతుని చెప్పడానికి మాటలు చాలవని చాలా సార్లు కవులు భాష అసమర్ధతని దూషిస్తూ వుంటారు.

    కాని, తేలిక పదాల్లో, తేలికగా అనిపించే బరువైన భావాల్ని పలికించవచ్చని సుబ్రహ్మణ్యం గారు నిరూపించారు.

    వ్యాఖ్యానాలు అక్కరలేని కవిత్వం ఇది. అనుభవమే దీనికి వ్యాఖ్యానం.

    అఫ్సర్

  11. naresh Nunna says:

    @Mr. Anand:

    It seems, u have very dogmatic opinion about poetry. I personally find no humility in ur above comments. If u r really serious and humble reader of poetry, go to it and read without prejudices.
    By the way,
    “ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం,
    నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం”
    what is poetry in this statement, Dear Anand.

  12. రవి says:

    మనసులో తొంగి చూసి రాసినంత అందంగా ఉన్నాయి కవితలు. నిజంగా మిణుగురులే ఇవి.

  13. మూలాగారు, పద్యం బాగుంది.

    ఆనంద్ గారు, కవిత్వాన్ని ఆస్వాదించడం కొంచెం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసిందే. మీకు నిజంగా ఆసక్తి ఉంటే, నేర్చుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి.

  14. చదువరానివాడు says:

    తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంచెమైనా దారి చూపించడం లోక రీతి. అందుకు విరుద్ధంగా నీదారి నువ్వు కనుక్కోమనడం కవిత్వంలో పరిపాటి అయింది.
    కవిత్వం చదవడమెలాగో ఎవరూ నేర్పించకపోతే ఉన్న కొద్దిపాటి పాఠకులూ విసుగెత్తి తప్పుకుంటారు. ఇంగ్లీషులో కవిత్వం చదవడానికి తోడ్పడే పుస్తకాలు కనిపిస్తూనే ఉంటాయి, సంప్రదాయ కవిత్వానికి టీకాలూ, ప్రతిపదార్థాలూ, వ్యాఖ్యానాలూ దొరుకుతాయి. ఆధునిక తెలుగు కవిత్వానికొచ్చిన తెగులేమిటో అర్థం కాదు. ప్రతి పదార్థం అక్కర్లేదు – ఆహా ఓహో అన్నప్పుడు కనీసం అది ఏ సందర్భానికి చెందిందో, అంత గొప్పదనమేమిటో చెప్పలేకపోవడం ఆశ్చర్య్కరమూ, విచారకరమూ.
    ఇదీ నా విన్నపం- అర్థం చేసుకున్న మహానుభావులారా (ఎగతాళి కాదు) ! నా యందు దయ ఉంచి దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారో చెప్పండి. సాధన చేయాలి, అనుభవమే వ్యాఖ్యానం లాంటి సలహాలు నాకు పనికి రావు. సంజాయిషీలూ, నంగిరి మాటలూ వద్దు. అర్థం – దీనికి మీ అర్థం-అదీ తోటి పాఠకుడికి మీరు ఇవ్వగలిగిందీ, నేను అడుగుతున్నదీ. అది మాత్రమే ప్రస్తుతానికి.

  15. naresh Nunna says:

    @చదువరానివాడు:
    Dear చదువరానివాడు garu,
    It seems, u have great respect for Modern Poetry, particularly of Telugu. Then, the greatest contribution from u to the modern Telugu poetry is to keep away from it.
    Don’t waste ur precious time to dissect and ‘understand’ it.
    ‘ఆధునిక తెలుగు కవిత్వానికొచ్చిన తెగులేమిటో అర్థం కాదు’- Ur ignorance is ur bliss. Be blissful, why to invite unnecessary headaches? Leave Modern Telugu Poetry to its fate.
    regards,
    naresh nunna

  16. Rachana says:

    It’s really surprising that NOBODY has come yet to explain the meaning.

    @ Naresh, “chaduvaranivadu” has already mentioned that he does not need your free advise.

    Lean back and relax if you have nothing to add here. We are interested in poetry and trying to understand the inner meaning of this so called brilliant poetry!

  17. చదువరానివాడు says:

    ఈ కవితమేమో కానీ నా వ్యాఖ్య కూడా అర్థం కావడం లేదనుకుంటాను. మీ పని తేలిక చేస్తాను. (ఈ కవితకు అర్థం లేదని గానీ, చెత్తదనిగానీ నేననుకోవడం లేదు. మూలా గారి మరికొన్ని కవితలు ఇంతకుముందు చదివి ఆనందించినవాడినే. చిన్నచూపు ఉంటే గింటే అర్థం చేసుకోలేని వారికి సాయపడకపోవడమటుంచి అనవసరపు సలహాలిచ్చేవారిపైన మాత్రమే.)
    దయచేసి ఈ క్రింది ప్రశనలకు ప్రత్యుత్తరమీయగలరా?
    1. ఈ కవిత నాకు బాగుగా అర్థమయినది
    అ) అవును
    ఆ) కాదు
    2. ఈ కవిత మీకు అర్థమయిన తీరు వివరింపుము
    అ) తీరిక లేదు
    ఆ) మాటల్లో చెప్పడం కష్టం
    ఇ) ఇవిగో ఈ పుస్తకాలు చదువుకురా – ఇ1) ఇ2) ఇ3)
    ఈ) నీ అనుభవం చాలదు
    ఉ) చెప్పినా నీ కర్థం కాదు
    ఊ) నువ్వు వెధవ్వి/మూర్ఖుడివి/అజ్ఞానివి
    ఎ) పూలూ, తాంబూలమూ తెచ్చి నాకు పాదపూజ చేసుకో చెప్తా!
    ఏ) నాకర్థమయిందిదీ –

  18. చదువురానివాడుగారూ,

    ఆననంద్ గారి మొదటి వ్యాఖ్య చదివినప్పుడు అందులో నిజాయితీ ఉందనే అనుకున్నాను. అందుకే వారి ఆక్రోశం సమంజసమైనదే అన్నాను. కాని వారి తరవాతి వ్యాఖ్యలు చూస్తే నాకా నమ్మకం పోయింది. ఎందుకంటే నేను వేసిన ప్రశ్నకి వారు సమాధానం చెప్పలేదు, నేను చెప్పిన విషయానికి స్పందించనూ లేదు. “ఈ రోజుల్లో కవిత్వం అర్థం చేసుకోవడం పాండిత్యానికీ, జ్ఞానానికీ చిహ్నం అయింది. అయినా సరే పామరుడిగా వుండటానికే ఇష్టం కలుగుతోంది.” అనేసారు. ఈ కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి “పాండిత్యం” (అంటే వారి ఉద్దేశంలో ఏమిటో తెలియదు) అవసరమని ఎవరూ అనలేదు. అతనెందుకలా ఊహించుకున్నారో బోధపడదు. తెలియని విషయాన్ని తెలుసుకోవాలనే నిజాయితీ నాకా వ్యాఖ్యలో ఏమాత్రం కనిపించలేదు.

    మీ వ్యాఖ్యల్లో కొంత నిజాయితీ కనిపించినా, మీరు కూడా అవతలవాళ్ళు చెప్పేది అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తారా లేదా అని ఇంకా అనుమానంగానే ఉంది. ఎందుకంటే, “సాధన చేయాలి, అనుభవమే వ్యాఖ్యానం లాంటి సలహాలు నాకు పనికి రావు” అన్నారు. ఏం కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి సాధన అవసరం అయితే దాన్ని చెయ్యడానికి మీరు సిద్ధంగా లేరా?

    ఈ కవితని నేను అర్థం చేసుకున్న విధానాన్ని వివరించే ప్రయత్నం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాని నిజాయితీ (అంటే అర్థం కాని కవిత్వం గురించి మనసులో prejudice లేకుండా, అర్థం చేసుకోవాలనే బలమైన కోరిక ఉండి, అవతలవాళ్ళు చెప్పేది వినే స్థితి ఉండడం) లేని వాళ్ళ కోసం నా కాలాన్ని శ్రమని వృధా చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. మీకు నేను చెప్పిన నిజాయితీ ఉందో లేదో ఆలోచించుకొని, ఉందనుకుంటే నాకు ఈమైలు పంపండి. మాట్లాడుకుందాం. నా మైల్ ఐడీ నా బ్లాగు ప్రొఫైల్లో ఉంది.
    Just one more point. I didn’t say nor meant that this is a “brilliant” poem. I am not here to “judge” or “rate” poetry. But yes, I do believe that this is poetry.

  19. bhushan says:

    ఆఖరికి ఎవరూ కవితకి అర్థం చెప్పలేకపోయారు కానీ కవితని మాత్రం పొగుడుతున్నారు. ఎవరైనా పండితులు అర్థం చెపితే దాన్ని చదివి నేను కూడా అర్థం చేసుకుంటాననే నా ఆశ అడియాశే అయింది. కొంచెం అర్థం వివరించండయ్యా బాబులూ అంటే “నీకు కవితలు చదివి అనుభవం లేద”ని దురభిప్రాయాలు లేకుండా ఇంకోసారి చదవమనీ చెపితే ఎలాగబ్బా! పామరులకి కూడా అర్థమయ్యేట్టు రాస్తే కవిత మర్యాదకి భంగం కలుగుతుందా? అలా రాస్తే అటు పండితులకీ, ఇటు నాలాంటి ఆనంద్ గారిలాంటి పామరులకీ అర్థమవుతుంది కదా! – భూషణ్

  20. @ఆనంద్, రచన, భూషణ్:
    నేనీ మీకోవకి చెందినవాణ్ణే కాబట్టి, మీబాధ నాకర్ధమయ్యింది. వ్యక్తి అనుభవాన్ని బట్టే అనుభూతి కలుగుతుంది. లేదా హత్తుకునే విధంగా వ్యాఖానం చెయ్యగలిగే వారైనా ఉండాలి, ఉషశ్రీగారిలా. కవితలకి కూడావ్యాఖ్యానం చెప్పొచ్చేమో. అయితే, అప్పుడది నవలని ఆధారంగా నిర్మితమైన సినిమాని చూసినట్టువుతుందేగానీ, నవల చదివినట్టు అవ్వదుకదా.

    ఒక కవితని నేను ఇలా చదవడనికి ప్రయత్నిస్తాను: కవిత చిట్టూ ఒక కాల్పనిక ప్రపంచాన్ని అల్లుకోవడం, కవితలోని ఒక వస్తువులోకి పరకాయప్రవేశం చేసి, కవితని అన్వయించుకోవడం, తద్వార అనుభూతి పొందడం. ఇది అంతో, ఇంతో తర్కసహిత కవిత్వానికి ఉపయోగపడుతుంది. అలాకాకుండా, మోడర్న్ ఆర్ట్ లాగ ఒక తెల్లకాగితంమీద చుక్క పెట్టి, విశ్వానికి కేంద్రం అనొచ్చు, లేదా, రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ బొడ్డు అనొచ్చు :). అందుకే అలాంటి కవితలకి ఈ పద్ధతి ఉపయోగపడకపోవచ్చు. అటువంటి కవితలజోలికి నేను పోను.

    ఈ “…మిణుగురులు” ఛమక్కుమనేవేగాని, మిణుకు మిణుకు మంటున్నవాటిలా అయితే కనిపించడంలేదులెండి 🙂

  21. r.damayanthi says:

    ee kavitvam lo tatvam vinipistundi. mukhyamgaa chivari panktullo vishadam dhwanistoondi..
    saativaani kastaanni, kaneetini choosi chalinche manishitanam manishilo karuvai poyindi. gundelo chinna chelama kaadu kadaaaa..choodddaamannaa kallallo chiru neeTi terainaa kanpinchadu.
    saDi leni gundelu
    tadi leni kallu
    verasi manishulu- nadustunna endu baavulu.
    ayina manishi meeda manishiki aasa Chaavadu kadaa.prati aasaa jeevi gundello-
    ee minugurule suryudanta velugulavaalani
    aasa paDadochchu.
    R.Damayanthi

  22. చదువరానివాడు says:

    కామేశ్వరరావు గారూ!
    మీరు ముందుకొచ్చినందుకూ, శ్రమ తీసుకుని జవాబిచ్చినందుకూ కృతజ్ఞతలు. నా బాధ నా ఒక్కడి గురించీ కాదు. అర్థం కాని అందరి గురించీ, మెచ్చిన వారందరూ వాళ్లకు తెలిసిందేదో చెప్పడానికి ప్రయత్నించకపోగా పనికిరాని సలహాలు ఇవ్వడమూ. “సాధన చేస్తే అర్థమవుతుంది, వెతుక్కుంటే దొరుకుతుంది” లాంటి సలహాలు ఎవరికైనా ఎంత ఉపకరిస్తాయో చెప్పండి! మీరు పద్యాన్ని వోపిగ్గా వివరిస్తున్నది ఎవరో ఒకరు చదివి ఆనందిస్తున్నారనే గదా! ఆధునిక కవిత్వం చేసుకున్న పాపమేమిటి? అర్థ క్లిష్టత తీర్చడానికి నిఘంటువులయినా తోడ్పడతాయి, భావ క్లిష్టతకి సూచనలయినా దొరక్కపోతే పాథకుడికి దారేది?

    సరే, ఇది నా వివరణ నా కర్థమయిన తీరులో –

    ఇవి నాలుగు ఖండికలున్న కవిత. ఒక దానితో మరొక దానికి సంబంధం లేదు.
    1. సముద్రపుటొడ్డున ఏ బాటా ఏర్పడకుండానే పాదముద్రలన్నీ చెరిగిపోతాయి. జీవితంలోనూ అంతే. మహాత్ముల అడుగుజాడలూ నిలవ్వు. మనం బతికే తీరూ తెన్నూ మనమే వెతుక్కోవాలి.
    2. అస్పష్టం – నదిలో/ ప్రకృతిలో కలిసి తాదాత్మ్యం చెందమనా? నది ఎండే లోపు, మనం చనిపోయే లోపు.
    3. మొదటికీ మధ్యకీ చివరికీ లంకె సరిగ్గా దొరకలేదు. మట్టిలో కలిశాక అన్నీ ఒకటే అని మొదలెట్టి మధ్యలో మానవ సహజ బలహీనతల ప్రస్తావన. చివరికి ప్రపంచం కోసం నిష్కల్మషమైన కన్నీరు కార్చమని.
    4. గొప్పవేమీ అక్కర్లేదు, చిన్నవి చాలు. భౌతికమైనవేమీ అక్కర్లేదు, మనసులోపలివి చాలు.

    మరెవరయినా మరొకరకంగా అర్థం చేసుకుంటే తోటి పాఠకులతో పంచుకోండి.

  23. చదువరానివాడు గారూ,

    మిగతావాళ్ళ సంగతి నాకు తెలీదుకాని, నేను వివరించే ప్రయత్నం చెయ్యకపోడానికి కారణం మాత్రం – అది నిష్ప్రయోజనమని భావించడమే. ఇంతకు ముందు నేననట్టు, వ్యాఖ్యల్లోని “టోనే” అలా అనుకోడానికి కారణం. సరే అసలు విషయానికి వస్తే, నేనీ కవితని అర్థం చేసుకున్న విధానం ఇది:

    ఇందులోని ఖండికలన్నిటినీ కలిపి “గుప్పెడు మిణుగురులు” అనే శీర్షికతో ఉన్న ఒకే కవితగా నేను భావించాను. కాబట్టి వీటి మధ్య ఏదో ఒక అంతస్సూత్రం ఉంటుంది.

    మొదటి ఖండిక సులువుగా బోధపడుతున్నదే. పెద్దగా వివరణ అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వుగా అనుభవించు అనేది సారం. జీవితానికి సముద్రంతో పోలిక మన మనసులో ముద్రపడాల్సిన విషయం. అయితే, నేనైతే ఆ వాక్యాన్ని వ్రాసేవాడిని కాదు.

    రెండో ఖండిక. ఇందులో ఉన్నవి కలలు, నదీ, కాలం. ఈ ఖండికలోని మీరన్న “భావక్లిష్టతకి” కారణం బహుశా ఇందులో సముద్రం-జీవితం పోలికంత స్పష్టంగా నది దేనికి ప్రతీకో లేకపోవడం. నదిలోకి దూకడానికి పుష్కరాల కోసం ఎదురుచూడొద్దు అంటున్నాడు కవి. నిన్ను విడిచిపెట్టి నదితో ఐక్యమైపో అంటున్నాడు. ఈ కవితల్లో “నువ్వు”, “నీకు”, “నిన్ను” – ఇవన్ని కవి తనకి తాను చెప్పుకుంటున్నవి. ఇక్కడ నది అనేది ఏదైనా కావచ్చు. సముద్రంలోకి (జీవితంలోకి) ప్రవహించేది ఏదైనా. తనని తాను మఱచి తన్మయాన్ని పొందే ఒకానొక స్థితి. అది ఒక అనుభూతి కావచ్చు. జీవితంలో ఏ అనుభవమైనా తత్క్షణం అనుభవించాల్సిందే. ఒక అనుభూతిని పరిపూర్ణంగా అనుభవిస్తే, అది ఎంత కాలం అన్నది అర్థం లేని ప్రశ్న అయిపోతుంది. కలలు అంతమైపోతాయని, వాటిని కనడం మానేస్తామా! కల కనేటప్పుడు అయ్యో అది అంతమైపోతుందనే స్పృహ ఉండదు కదా.

    మూడవ ఖండిక. జీవితాన్ని నువ్వుగా అనుభవించు. ఆ అనుభూతి ఎంత కాలం అన్న ప్రశ్న అర్థరహితం. అది ఎంత పరిపూర్ణం అన్నది ప్రధానం అని మొదటి రెండు ఖండికల్లో ఉంది కదా. ఆ అనుభూతి ఎలా ఉండాలన్నది మూడవ ఖండికలో ఉంది. కవికి రోడ్డు పక్కన గాజుపూలు, గన్నేరుపూలు కనిపించాయి. అవి దుమ్ములో తడుస్తున్నా నవ్వుతూనే ఉన్నాయి. అదొక అరుదైన గొప్ప అనుభూతి. అయితే వెంటనే కవి బుద్ధికి రెండిటిలోనూ ఏవి ఎక్కువ అందమైనవి అనే ప్రశ్న తలెత్తింది. అలాంటి ప్రశ్న చిక్కని అనుభూతికి భంగకరం (“రసపట్టులో తర్కం కూడదు” – ఎంత గొప్ప డయిలాగది!). కవికి తన ప్రశ్న మీద తనకే కోపం వచ్చింది. ఏమిటీ చూపు? “తూనికలు, కొలతలులేని
    ఒకే ఒక్క చూపు” కావాలి. ఏ చూపైనా మనఃపూర్వకంగా ఉండాలి. మనిషి చూపులు ఎంత కలుషితమైపోయాయి! “సానుభూతి అంచుల్లో సంతోషం”, “అభినందనల అడుగున అసూయ”! మనసు స్వచ్ఛంగా ఉంటేనే చూపు అకల్మషమవుతుంది. స్వచ్ఛమైన మనసే జీవితాన్ని అచ్చంగా అనుభవించ గలదు. “ఏ రంగూ లేని ఒక్క కన్నీటిబొట్టు” కార్చ గలగడం ఆ మనసు స్వచ్ఛతకి నిదర్శనం. అప్పుడే తనకీ ప్రపంచానికీ మధ్యనున్న అడ్డు గీతలు చెరిగిపోతాయి. అలాంటి చూపు, అలాంటి మనసు కోసం కవి తపిస్తున్నాడు.

    నాల్గవ ఖండిక. స్వచ్ఛమైన అనుభూతి స్వంతమైనప్పుడు, అది ఎంత సేపనే కాదు, అది ఎంత పెద్దదనే ప్రశ్నకూడా అర్థరహితం! సముద్రమంత (జీవతమంత) అనుభూతి అవసరం లేదు. తన కన్నుల్లో ఒక్క చిన్న నీటి చెలమ చాలు, అది తనలో ఉండడం అన్నదే ముఖ్యం. ఎక్కడో దూరంగా వెలిగే సూర్యుడూ చంద్రుడూ అవసరం లేదు. తనలో, తన గుండెల్లో క్షణ క్షణం వెలిగే గుప్పెడు మిణుగురులు చాలు. వాటికి సూర్యచంద్రులంత కాంతి లేకపోవచ్చు, వాటంత సేపు వెలగకపోవచ్చు. అయినా ప్రతిక్షణం (పగలూ, రాత్రీ) అవి తన “లోపల” వెలుగుతాయి. ఆ “లోపల” వెలుతురు ముఖ్యం.
    ఈ కవితకి ఇక్కడ నేనిచ్చిన ఈ పొడుగాటి వివరణ ఏ చంద్రకాంతి లాంటిదో, మహా అయితే సూర్యకాంతి లాంటిదో కావచ్చు. అది నీ లోపల వెలుగు కాలేదు. ఇది కవితని పై పైనే చూపిస్తుంది ఎవరికైనా. కవితలోపల చూడగలగాలంటే, పాఠకుడి గుండెల్లో గుప్పెడు అనుభూతుల మిణుగురులు వెలిగితే చాలు. అవి ఎలా వెలుగుతాయి? స్వచ్ఛమైన చూపు అలవడితే అవి వెలుగుతాయి. కవిత్వం కూడా ఒక రకంగా మిణుగురుల వెలుగు లాంటిదే!

    ఇదీ నేనీ కవితని అర్థం చేసుకున్న విధానం. సరిగ్గా అందరికీ ఇలానే అర్థమవ్వాలని లేదు. కవిత్వం క్రాస్వర్డ్ పజిల్ కాదు. ఏవో కొన్ని క్లూలకి ఒకటో రెండో సరైన సమాధానాలుండడానికి. ఒక దృశ్యాన్ని చూసినప్పుడు కవి మనసులో ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలగవచ్చు, రకరకాల ఆలోచనలు మూగవచ్చు. వాటిని జాగ్రత్తగా అక్షర రూపంలో పెట్టడానికి విఫల ప్రయత్నం (అవును “విఫల” ప్రయత్నమే) చేస్తాడు కవి! ఆ ప్రయత్నంలో ఏదో కొంత సంతృప్తి కవికి కలిగితే అది కవితగా నిలుస్తుంది. నేనిక్కడ చెప్పింది ప్రతి కవి వ్రాసే కవిత్వానికీ వర్తించకపోవచ్చు. దాని గురించి నేనిక్కడ చర్చించదలచుకోలేదు. “ఏ దేశ చరిత్ర…” కవితకీ, ఈ కవితకీ మౌలికమైన కొన్ని తేడాలున్నాయి. రెండూ కవితలేనా, ఏది గొప్ప కవిత్వం అన్నది అప్రస్తుతం. రెంటికీ మౌలిక భేదం ఉన్నదని గుర్తించడం ముఖ్యం. “ఏ దేశ చరిత్ర…” కవితలో కవికి ఒకే ఒక ఆలోచన ఉంది. దాన్ని ఎంత బలంగా మాటల్లో వ్యక్తం చెయ్యగలం అనేదే అక్కడ కవికి ముఖ్యం. అది పాఠకుణ్ణి ఆకర్షించాలి, అతని మనసులో స్థిరంగా నాటుకుపోవాలి. దాని కోసమే ఛందస్సు (అవును అందులో ఛందస్సు ఉంది), యతిప్రాసలు (మొదటి వాక్యంలో ప్రాస, రెండవ దాన్లో ప్రాసయతి) వాడడం! పాఠకునికి తెలిసిన విషయాన్ని గట్టిగా చెప్పడమే అక్కడ ధ్యేయం, కొత్త ఆలోచనలని కాని అనుభూతులని కాని కలిగించడం కాదు. ఈ కవితలో – కవికి కలిగిన అనేక అనుభూతులని, ఆలోచనలని అక్షరీకరించడం ప్రధానం. అది పాఠకునిలోనూ రకరకాల ఆలోచనలని, అనుభూతులనీ ప్రేరేపించ వచ్చు. అంత మాత్రం చేత అది కవిత్వం కాదనుకోవడం సంకుచితదృష్టి. ప్రాచీన పద్యకవిత్వంలో – పద్యాలకి ప్రతిపదార్థాలు తెలిస్తే అందులోని కవిత్వం అర్థమయిపోతుందని, లేదా అదే కవిత్వమనీ అనుకోవడం వట్టి భ్రమ. పద్యాలకి అర్థం తెలిసినంత మాత్రాన అందులోని కవిత్వం తెలిసిపోదు. దానిక్కూడా అంతకు మించి సాధన అవసరమే! కవిత్వాన్ని ఆస్వాదించగలగాలంటే, కవితో సహానుభూతి అవసరం. దానికి రకరకాల సాధన అవసరం కావచ్చు. ఆ కవి కవిత్వాన్ని ఎక్కువగా చదవడం ఒక రకమైన సాధన. అలాంటి కవిత్వాన్ని ఎక్కువ చదివి, దాన్ని అనుభవించిన వాళ్ళ విమర్శని చదవడం మరొక రకమైన సాధన. కవితలోని సాంఘిక/రాజకీయ వాతావరణం పట్ల అవగాహన పెంచుకోవడం ఇంకొక రకమైన సాధన. కవిత్వాన్ని లోతుగా తవ్వుతూ పోవడం వేరొక రకమైన సాధన. ఇలా రకరకాల సందర్భాలలో రకరకాలైన సాధన అవసరం అవుతుంది. కవిత్వాన్ని ఆస్వాదించాలనుకున్నవాళ్ళు దానికి తగిన సాధన చెయ్యాలి. అక్కర లేదనుకుంటే గప్ చుప్పని కూర్చోవచ్చు, అది తనకి కానీ కవికి కానీ ఏ మాత్రం నష్టం కలిగించదు.

  24. రవి says:

    నాకొకటి అనిపిస్తుంది. కవిత అర్థం చేసుకోవాలంటే, కొంతవరకూ చదువరిలోనూ కవితా హృదయం తప్పనిసరి. అర్థం చేసుకోవడం – అంటే చదివి రంజింపగలగటం. ఇందులో మొదటి కవిత గమనిస్తే

    సముద్రతీరంలో అలలు కాళ్ళకు అలవోకగా తగులుతుంటే, తీరం వెంబడి ఓ అందమైన సాయంత్రం అస్తమిస్తున్న రవి తోడుగా నడుచుకుంటూ వెళుతూ, “జీవితం కూడా ఇంతే కదా” అన్న ఓ మానసిక అవస్థలోకి వెళ్ళే భావంలాగా –

    కవి కవిత నాకర్థం అయింది.

    పై వాక్యంలో quotes లో ఉన్న విషయం కవి సూచిస్తే, మిగిలినదంతా ఒకానొక చదువరి మనసులోంచి వచ్చినది. సరిగ్గా ఇలానే కాకపోయినా సౌందర్యభావన అన్నది హృదయంలో రాగలిగేతేనే కవిత మనసుకు పడుతుందని నా అనుకోలు.

  25. Purnima says:

    @కామేశ్వర రావు gaaru: Take a bow, Sir!

  26. చదువరానివాడు says:

    కామేశ్వరరావు గారూ,
    మీ వ్యాఖ్యానం బావుంది. నలుగురికీ ఉపయోగపడుతుందనీ, మీ శ్రమ వృథా పోదనీ నమ్ముతాను. ఇది రాయడంలో ఈ కవితపై మీ ఆలోచనా తేటపడే ఉండాలి.
    మరింత సాగదీయడం కాదు గానీ –
    పద్యంలో ప్రతి పదార్థం తెలిస్తే తాత్పర్యమన్నా తెలుస్తుంది కదా, దాని వెనక కవిత్వమూ, కవి హృదయమూ పూర్తిగా అవగతం కాకున్నా! కనీసం ఆ వెసులుబాటు లేని కవితలు చికాకు కలిగించవా? అర్థం కాని ఆ అక్కసే ఇటువంటి కవితలపై కొంతమందికి చిన్నచూపు కలగజేస్తున్నాయేమో! సమస్య సాధన అక్కర్లేదనుకోవడం కాదనుకుంటాను. ఆ సాధన ఏమిటో ఎలా చేయాలో తెలియక కావచ్చు గదా? మీరు చివరలో ఉదహరించిన సాధన మార్గాలు మీకు కొన్ని కవితలు అర్థం చేసుకోవడానికి ఎలా తోడ్పడ్డాయో తీరిగ్గా ఒక వ్యాసం రాయగలిగితే కొత్త పాఠకులకు ప్రయోజనకారి అవుతుంది.
    elitism బారినపడి మంచి కవిత్వం మామూలు పాఠకుడికి అందకుండా పోరాదనే నా కోరిక.

  27. @రవి, నేను నా వ్యాఖ్యానంలో చెప్పలేకపోయిన దాన్ని మీరు చెప్పి దాన్ని పరిపూర్ణం చేసారు!
    @పూర్ణిమగారూ, Thank you.
    @చదువరానివాడుగారూ,
    “elitism బారినపడి మంచి కవిత్వం మామూలు పాఠకుడికి అందకుండా పోరాదనే నా కోరిక.”
    ఇక్కడ “elitism”, “మామూలు పాఠకుడు” అంటే ఏమిటో కొంచెం వివరిస్తారా?

  28. హెచ్చార్కె says:

    చదువు రాని వాడు గారూ, ‘ఒక్క క్షణమైనా నిన్ను విడిచిపెట్టి నదిలోకి.. నదిని నీలోకి.. (లేక పోతే, నిజంగా) కాలం ఎంత అర్ధరహితం!’?

Comments are closed.