కేక

-వి.బి.సౌమ్య

“ఓహ్..నో!” దిక్కులదిరేలా వినడ్డదో కేక. అది నోటినుండి వెలువడ్డట్లు లేదు. అరికాలు నుండి మస్తిష్కం దాకా శరీరం లోని ప్రత్యంగమూ గొంతుకను సృష్టించుకుని, అన్ని గొంతుకలూ మౌనాన్ని పెగుల్చుకుంటూ, తమ గొంతు చించుకుని అరిచినట్లు ఉంది. ఆవేదనా, ఆక్రోశం, నిరాశా, నిస్సహాయతా కలగలిసి ఉన్నాయా కేకలో. ఎవరి మీదా చూపించలేని ఆగ్రహానికి గొంతుక కలిగితే ఎలా ఉంటుందో అలా ఉందా కేక. ఎవరి మీదా ప్రయోగించలేని పశుబలాన్నంతా శరీరం ఆ గొంతుకి ఇచ్చినట్లుంది అనిపించింది ఆ కేక నుండి పుట్టిన శబ్దం వింటే.

నిశబ్దంపై ప్రకటించిన యుద్ధంలా ఉందా కేక.

ఆకాశం వైపుకి చూస్తోంది కేక వెలువడ్డ గొంతుక.

అతని చేతులు రెండూ బలంగా తలను పట్టేసి ఉన్నాయి. కాళ్ళు మోకాళ్ళుగా మారి రాతి నేలను తాకాయి. బయటకు వినిపిస్తున్న శబ్ద తరంగమంతా నవనాడులలోనిండి కిందినుండి పైదాకా ప్రవహిస్తూ బైటకు రావడం బహుశా ఎక్స్‌రేకి చిక్కి ఉండేదేమో. అప్పుడు ఆ తరంగాలను బట్టి ఆ కేక గాఢత అర్థమై ఉండేదేమో విన్నవారికి. పలికిన మనిషి సమస్యేమిటో తెలిసేదేమో అప్పుడు.

-ఉలిక్కిపడి లేచాడతడు. ఎక్కడున్నాను?” తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఏదో స్ఫురించింది. అటూ, ఇటూ పరికించి చూశాడు. ఏముందీ! చిక్కటి చీకటి. ఇంకా దుప్పట్లోనే ఉన్న చేతిని బయటకు తీసి, పక్కనే ఉన్న గోడను తడిమాడు. చేతికేదో తగిలింది. నొక్కాడు. బెడ్‍లైటు వెలిగింది. వెంటనే పక్కకు తిరిగి చూశాడు. కాస్త దూరంలో రూమ్మేటు, చలనం లేదు. నిద్రలో ఉన్నట్లే ఉన్నాడు. మళ్ళీ లైట్ ఆపేశాడు. చీకట్లోంచి కళ్ళుమూసుకుని మరో చీకట్లోకి ప్రవేశించడమంటే ఇష్టం అతనికి. అలా కళ్ళు మూసాడే కానీ, ఆ కేక చెవుల్లో హోరత్తుతూ ఉండటంతో కళ్ళు తెరిచాడు. ఆ ఆకారం తానేనని తనకి తెలుసు. తన కేక తనకే మళ్ళీ మళ్ళీ వినిపించడం పిచ్చెక్కేంత ఆశ్చర్యంగా ఉంది అతనికి. ఎక్కడో కలలో ఏదో కొండపై కూలబడి పెట్టిన కేకకు ప్రతిధ్వనులు ఈ చీకటి గదిలో వినబడ్డం ఏమిటి? అయినా కూడా పక్కనే ఉన్న మనిషి నిశ్చింతగా పడుకునే ఉండటం ఏమిటి? అతనికి వినబడ్డం లేదా?

అది తనను మాత్రమే వేధిస్తున్న కేక అని అర్థమవగానే అతని వెన్నులో చలి పుట్టింది. మనసులో భయం మొదలైంది. “నాకేమైంది?” అన్న ప్రశ్న మొదలైంది.

“వాడిని లేపనా?”

“వద్దొద్దు, విషయం ఎలాగూ అర్థమవదు లే”

“అదీ నిజమే, అర్థం చేసుకోలేరు ఎవరూ ఇలాంటివి – అనుభవిస్తే తప్ప”

“మరెందుకు లేపడం?”

“ఏమో..”

“తోడు కోసమా?”

“కావొచ్చు. అంతే అనుకుంటా”

– అతనిలో సంఘర్షణలా జరుగుతున్న ఈ సంభాషణ అతనికి వినిపిస్తూనే ఉంది. “ఏం జరుగుతోంది నాకు? ఆ కేక, కలలోనిది ఇప్పుడిక్కడ వినబడ్డం ఏమిటి? ఈ లోపల సంభాషించుకుంటున్నది ఎవరు? నా ప్రమేయం లేకుండా నాలోకి జొరబడి, నన్నంతా ఆక్రమించుకుని, నా గొంతుక తనదిగా, నా ప్రాణం తనదిగా, నా శరీరమంతా తనదిగా, అసలు నేనంతా తానుగా వాడుకుంటున్నదెవరు?” – ప్రశ్నించుకున్నాడు.

ఎటు చూసినా చీకటి. చీకట్నుంచి చీకట్లోకి, ఒక్కోచీకటినీ దాటుకుంటూ, దారికానక తిరుగుతూ, వెలుతురుకోసం ఎదురుచూస్తూ – ఎంతసేపిలా? అప్పుడోటీ, ఇప్పుడోటీ సన్నని వెలుగురేఖలు తగిలి ఆశగా అటువైపుకెళ్తే, లిప్తపాటులో ముందు నుంచి రయ్యిన అది దూసుకెళ్ళి మరుక్షణం మళ్ళీ అంతా గాఢాందకారమైతే?

అలాగే ఉంది అతని పరిస్థితి ఇప్పుడు. అయోమయంగా అనిపిస్తోంది అంతా. ఓ పక్క పొద్దుట్నుంచీ ఆవిరైన ఓపికంతా అలసటై విజృంభిస్తూ ఉంటే, ఈ ఆలోచనలను మాని, పడుకుందామని కళ్ళు మూశాడు అతడు. ఒక క్షణం అంతటా ప్రశాంతత. చుట్టూ చీకటే అయినా, అది చీకటిని కోరుకుంటున్న సమయమే. కావాలని కళ్ళు మూసుకునే సమయం. పైకి తెలిసేది – నిద్రిస్తున్న శరీరం, చీకటి – అంతే. నిద్ర లోపలి గుట్టు ఎవరికెరుక? నిద్ర తన కథలు చెప్పాలన్నా, మనం నిద్రపోతే ఎలా చెప్పగలదు? ఎవరికి చెప్పగలదు? మనిషి బంధనం నుండి నిద్ర పారిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు – ఉన్మాదంలో ఉన్న అలలా ముంచుకొచ్చిందొకటి – ఒక్క కుదుపుతో భళ్ళున మెలకువ – పీడకల!

***************************************

నిద్రపట్టక ల్యాప్‍టాప్ తీసి నెట్ కి కనెక్ట్ అయాడు. నయన్ ఎక్స్‍పైర్డ్ – రాఘవ్ మెసేజ్ ఉంది. ఈ వార్త మధ్యాహ్నానికే తనకి తెలిసినా, మరోసారి బాధతో నిట్టూర్చాడు. మధ్యాహ్నమంతా తనలో జరిగిన అలజడి గుర్తు వచ్చింది.

“ఈ కేకకూ ఆ మరణానికీ ఏమన్నా సంబంధం ఉందా?” తనను తానే ప్రశ్నించుకున్నాడు.

కానీ, అదెలా సాధ్యం? నయన్ ఎవరో అసలు తనకేం తెలుసని? నయన్ – రాఘవ్ స్నేహితుడు. రాఘవ్ తన స్నేహితుడు – అంతే. కనీసం తామిద్దరూ ముఖామఖి కూడా చూసుకోలేదు.

మరి ఇపుడు తాను అనుభవిస్తున్నది రాఘవ్ బాధనా? కానీ, ఇది అలా లేదే? ఎంపతీ అయితే, ఇంత ఘాటుగా ఉంటుందా? ఇంత చిత్రవధ చేస్తుందా? అసలు నయన్ మరణానికీ, ఇప్పటి తన ఆలోచనలకీ సంబంధం ఉందా? మధ్యన నయన్ మరణం ఎందుకొచ్చింది?

“కాదు, నాలోని అలజడికి కారణం నయన్ కాదు.” అనుకున్నాడు. కానీ అంతలోనే, నయన్ ఇన్నాళ్ళూ వ్యాధితో ధైర్యంగా పోరాడిన విషయం గుర్తొచ్చింది. రాఘవ అతని గురించి తనకి గొప్పగా చెప్పడం గుర్తొచ్చింది. అప్పుడోసారి ఆర్నెల్ల క్రితం నయన్ కోసం ఇంకో ఇద్దరితో కలిసి తాను రక్తం ఇవ్వడం గుర్తొచ్చింది.

“ఆ రక్త సంబంధం వల్లనా ఈ బాధ?” అనుకున్నాడు. ఆ ఆలోచనకు మళ్ళీ నవ్వుకున్నాడు.

“నాకు ముఖ పరిచయమైనా లేని మనిషి మరణం నన్నెందుకింత కదిలించాలి?” ప్రశ్నించుకున్నాడు.

తన్ను కదిలిస్తున్నది మరణమా? ఆ మనిషి మరణమా? అన్నది కూడా అర్థం కాక కాసేపు అటూ ఇటూ తిరుగుతూ, చివరికి మళ్ళీ మంచం పక్కకొచ్చి తల పట్టుకుని కూర్చున్నాడు.

“మరణం అన్న పదంలోనే ఏదో ఉంది. ఎక్కడో ఎవరో ఏదో భూకంపంలోనో, మరేదో ప్రకృతి వైపరీత్యంలోనో పోయారని చదివితేనే అయ్యో అనుకుంటాము. పరిచయంలేకున్నా మనమధ్య తిరిగిన మనిషి – కొన్నాళ్ళలో ఆ మనిషి ఉనికి ఈ లోకంలో ఉండదు అన్నది చాన్నాళ్ళుగా తెలిసిన విషయమే అయినా ..”

– అబ్బబ్బా! ఎవరు ఇదంతా మాట్లాడుతున్నది? మళ్ళీ ఎందుకు ఇప్పుడిదంతా? అంతా తెలిసిన విషయమే కదా. ఎవరు ఇదంతా చెబుతున్నది?

అతనికి గొంతు చించుకుని గట్టిగా అరవాలనిపిస్తోంది. కానీ, గొంతు పెగలడం లేదు.

ఇందాక తనంతట తానే పుట్టుకొచ్చింది కేక. ఇప్పుడు, తానే ఆ కేకను వినాలనుకుంటున్నాడు – కానీ, అది బయట పడంటోంది. అంతా దానిష్టమే.

“ఎవరిమీద ఈ కోపం? ఎవరి మీద చూపించలేకపోతున్నాను ఈ కోపాన్ని?” – ప్రశ్నించుకున్నాడు మళ్ళీ.

ఎవరిపైనో…దేనిపైనో… చెప్పలేనంత ద్వేషం కలుగుతోంది. ఎవరిపైన? మనిషిపైనా? మనసుపైనా? జీవితంపైనా? జీవించడం పైనా? మరణం పైనా? మరణించడం పైనా?

************************************************

“వీడెంత హాయిగా పడుకునున్నాడు.. నాకెందుకు నిద్ర పట్టదు? నాకెందుకు ఆ ప్రశాంతత లేదు?”

“కోపం జీవితంపై అనుకుందాం. అసలు నాకేం తక్కువైందని జీవితంపై కోపగించుకోవడానికి? ప్రపంచంలో ఎంతో మందితో పోలిస్తే నేను అదృష్టవంతుణ్ణే కదా.. నాకంటే సంతోషంగా ఉన్న కొద్ది మందిని చూసి ఇలా జీవితాన్ని ద్వేషించనా? మిగితావారితో పోల్చుకుని జీవించడాన్ని ప్రేమించనా? పుట్టాక చావడం తప్పదు కదా – ఈ మాత్రానికి జీవితాన్ని ప్రేమించడం దేనికి? ద్వేషించడం దేనికి?”

“మనిషినా? మనసునా? మరణాన్నా? – దేన్నైనా ప్రేమించడం, ద్వేషించడం దేనికి? నేనే ఎప్పుడో లేకుండా పోయేదానికి?”

“ప్రేమించకు, ద్వేషించకు – ఊరికే అనుభవించు”

“అవి రెండూ అనుభవాలు కావా ఏమిటి?”

“ఆ అనుభవాలు వేరు. ప్రేమించి ప్రేమ పొందకపోతే బాధ. ద్వేషిస్తూ ఉండటం ఒక బాధ. ప్రేమించి ప్రేమించబడటం ఇంకో బాధ. అవి లేకుండా మామూలుగా జీవితాన్ని చూస్తే….”

“అబ్బబ్బా! ఏమిటీ ఆలోచనలు!” – తల పట్టుకున్నాడు మళ్ళీ.

ఆలోచనలు తల్లో కూర్చుని అర్థంకాని రీతిలో నృత్యం చేస్తున్న అనుభూతి కలిగింది అతనికి.

“అయినా, ఇవతలేం జరుగుతోందో తెలీనప్పుడు అది నృత్యమైతే ఏమి? వట్టి కుప్పిగంతులైతే ఏమి? కుప్పిగంతులు అనుకోడంలోనే హాయి ఉంది – దాన్ని వెక్కిరించడానికి ఆస్కారం ఎక్కువుంటుంది.” – లోపలనుంచి నవ్వులు.

ఉలిక్కిపడి లేచాడు. “ఎవరివా నవ్వులు? ఎక్కడివా మాటలు? నన్నిలా చేసి, ఇప్పుడు నన్నిలా చూసి ఆనందిస్తున్నారా? ఎవరు వాళ్ళు? ఎందుకిలా చేస్తున్నారు?” – ప్రశ్నలు, ప్రశ్నలు, ప్రశ్నలు, మళ్ళీ, మళ్ళీ.

“వాట్సప్? ఏంటి ఈ టైం కి? పడుకునేస్తావ్ కదా తొమ్మిదికే…” – చాట్ విండో లో మెసేజ్ బీప్ తో ల్యాప్‌టాప్ వైపుకి తిరిగాడు మళ్ళీ.

“నథింగ్…పడుకోబొతున్నాను…బై” అనేసి మూసేసాడు. ల్యాప్‌టాప్ మూయగానే మళ్ళీ చీకటి.

చావొక్కటేనా నాలో ఈ ఆలోచనలు కలిస్తున్నది? బ్రతుకో? ఏది గొప్ప? ఏది పెద్దది? – బ్రతికినంతసేపు పట్టదు కద చావడం – బ్రతుకే పెద్దది. ఇంత బ్రతకూ బ్రతికి చివరికి చావేకదా… చావే గొప్పది.

బయటేదో కలకలం. దానితో ఆలోచనలకి అడ్డుకట్ట పడ్డది. ఏమిటో చూద్దామని బాల్కనీవైపు కి వెళ్ళాడు.

ఎదురుగా ఉండే స్లం ఏరియాలో ఏదో గొడవ.

“వీళ్ళొకళ్ళు! అస్తమానం ఎవరో ఎవర్నో కొట్టడం… చంపుకోడం…పనీపాటా లేదు…” విసుక్కున్నాడు మనసులో. ఇంతలో తలుపు చప్పుడు.

“ఈ సమయంలో తలుపు కొట్టడమేమిటో! అటుగా వచ్చిన మృత్యుదేవతే నా పని పట్టేందుక్కూడా వచ్చిందా? పోయినవాడి ఆత్మే నా ఇంట్లోకి వస్తోందా?

తను తలుపు తీయలేదు. దబదబా బాదుడు. అతను వెళ్ళి తలుపు తీయబోయాడు.

ఇంతలో సందేహం – తన రూమ్మేటు వైపుకి చూశాడు. అతనిలో చలనం లేదు. అతనెందుకు కదలడం లేదు?

“అంటే – ఆ తలుపు చప్పుడు నాకొక్కడికే వినిపిస్తోందా?” – అతనిలో మొదట అనుమానం, తరువాత భయం.

తలుపు తీసేందుకు ముందుకు వెళ్ళాడు. ఇంతలో చప్పుడు ఆగిపోయింది. అతనికేమీ అర్థం కాలేదు.

“ఏమౌతోంది నాకు? ఈ పీడకలలు, వింత అనుభవాలు – ఏమిటిదంతా? ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాను?”

మళ్ళీ బాల్కనీ దగ్గరేదో గొడవ. అతను మళ్ళీ ఇహలోకాన పడి, వాచీ చూస్కున్నాడు. పన్నెండౌతోంది. పొద్దున్నే త్వరగా వెళ్ళాలన్న విషయం గుర్తొచ్చింది. ఈఆలోచనలు కట్టిపెట్టి పడుకుందాం – అనుకుని, మంచం వైపుకి తిరుగుతూండగా, మళ్ళీ తలుపు చప్పుడు.

రూమ్మేటు కొద్దిగా కదలడం చీకట్లోనైనా తెలిసింది. దానితో ఈసారిది నిజం చప్పుడే అని నిర్థారించుకున్నాడు. కానీ, తీయాలంటే భయం. ఈసమయంలో ఎవరు? ఈరూమ్ లో తామిద్దరే. అయినా, పన్నెండింటికి ఎవరొస్తారు? పోయిన వాడి ఆత్మ – పోలీసులు – దొంగలు – దొరలు – ఎవరు? – క్షణకాలంలో అతనిలో ఎన్నో ప్రశ్నలు. తలుపు చప్పుడు పెద్దదైంది. రూమ్మేటు లేవడేం? అతనిలో కంగారు పెరిగిపోతోంది.

ఒక క్షణం…రెండు క్షణాలు…మూడు..నాలుగు…

ఇంతలో ఫోన్ రింగయింది. ఉలిక్కిపడ్డాడు. ఒక్క రింగ్ కే కట్టయింది. వెళ్ళి ఎవరు చేశారో చూడబోయేంతలో మళ్ళీ తలుపు చప్పుడు.

“వీడు లేవడేం?”

“ఒరేయ్! నీ భయం తగలెయ్యా! నువ్వు లేచి తీస్తావని ఊరుకున్నా కదరా!” -ఉన్నట్లుండి రూమ్మేటు విసుగ్గా లేచి అరిచేసరికి అదిరిపడ్డాడతడు.

“….”

“వెళ్ళి తీయరా…అయినా, ఇంత భయమేమిట్రా నీకూ….”

“భయమా… నీకేం తెల్సురా ఇక్కడ ఎంత టెన్షన్ పుట్టిందో…ఉన్నదానికి తోడు, నీడ్రామా ఒకటి…” చెమట్లు తుడుచుకుంటూ అన్నాడతడు.

“సర్లే….వెళ్ళి తలుపుతీ…నేను లేస్తాను..” అని అతను లేచి, మంచాన్ని తలుపు దగ్గర్నుంచి కొంచెం పక్కకి జరిపాడు.

దానితో, ఇతను వెళ్ళి, తలుపు గొళ్ళెం తీసాడు.

“హ్యాపీ బర్త్ డే టూ యూ సర్!” – ఒక చేతిలో బొకే, ఒక చేతిలో కేక్ తో ఎర్రచొక్కాలో ఎవరో. ఈ పీడకలలతో పుట్టినరోజు సంగతి కొద్దిక్షణాలుగా అతనికి తట్టలేదు. ఉన్నట్లుండి ఇది పంపిందెవరా? అని మొహాన పట్టిన చెమటను తుడుచుకుంటూ, అవాక్కై చూస్తున్నాడితడు. ‘ఫ్రం సంజన విత్ లవ్’ అని బొకేపై కార్డు చూడగానే ఆశ్చర్యం, ఆనందం. బొకే కుర్రాణ్ణి పంపేసి వెనక్కి తిరిగి రూమ్మేటును చూస్తే, అతను పెద్దగా నవ్వుతున్నాడు. “తను నాకు ఫోన్ చేసి చెప్పింది. నువ్వు లేచి తీసేదాకా తలుపు తీయొద్దని కూడా తనే చెప్పింది. అందుకే నేను లేచి తలుపు తీయలేదు…” – అన్నాడు నవ్వుతూనే. తన పీడకలలనూ, స్లం ఏరియా గొడవల చప్పుడునీ, తనని భయపెట్టిన అజ్ఞాత భూతాన్నీ మర్చిపోయాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. సంజన! అతను ఈసారి బాల్కనీలోకి వెళ్ళి సెటిలయ్యాడు. అప్పటికి వాతావరణం, గొడవలూ చల్లబడి ప్రశాంతంగా ఉంది బైట. ఫోన్లోంచి వచ్చే మాటలు ఆ ప్రశాంతతకి ఒక తాజాతనాన్ని ఇచ్చాయి. కొద్ది క్షణాల్లో అక్కడి దృశ్యమే మారిపోయింది. పెదాలపై చిరునవ్వులు. మనస్సులో ఉల్లాసోత్సాహాలు, బోలెడన్ని కబుర్లతోనూ నిండిపోయాడతడు. అతని మనసులోనూ ఇప్పుడు తన పుట్టినరోజన్న విషయం ప్రథమస్థానాన్ని ఆక్రమించింది. ప్రేయసిచ్చిన సర్ ప్రైజ్ -అతనిలోని అలజళ్ళను జయించింది. అతని కేక ఇప్పుడు ఏదో మూలలో నక్కింది. తనని తాను మూగతనానికి అర్పించుకుంది. బహుశా మళ్ళీ ఇలాంటి అవకాశం దొరికడం కోసం పొంచిఉందేమో…

—————–

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కామ్ లో ప్రచురితమయ్యాయి. పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో సౌమ్య ఒకరు.

About వి.బి.సౌమ్య

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

2 Responses to కేక

  1. తన పుట్టినరోజుకి సంకేతమైన ‘కేక’ని అంటే పుట్టగానే ఏడ్చే ఏడ్పుని, మానసికంగా విశ్లేషణ చేసి, బాగా వ్రాసారు. ధన్నవాదాలు.

  2. Sowmya V.B. says:

    @Sridhar: అంత సింబాలిజం నేనసలు ఆలోచించనేలేదండీ! 🙂

Comments are closed.